గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, సెప్టెంబర్ 2019, గురువారం

పురాణ లక్షణాలు.

 జైశ్రీరామ్
పురాణము లక్షణములు.
ప్రతి పురాణం కుడా పురాణాల ముఖ్యమైన లక్షణాలను మొదటి సర్గలలో చెబుతుంది. కూర్మపురాణంలో చెప్పబడిన దాని ప్రకారము
శ్లో. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ
వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణమ్.
సర్గము, ప్రతి సర్గము, వంశము, మన్వంతరము, వంశాలచరిత్ర అనే పంచలక్షణాలు కలిగినదే పురాణం.
౧.సర్గము - సర్వ ప్రపంచ సృష్టిని విస్తరించేది
౨.ప్రతి సర్గము - సకల ప్రపంచము లయమయ్యే లక్షణం తెలిపేది (ప్రళయం)
౩.వంశము - పృథు, ప్రియ వ్రతాదుల వంశోత్పత్తిని వివరించుట
౪.మన్వంతరము - ఏ కల్పంలో ఏ మనువు కాలంలో ఏమి జరిగిందో తెలుపుట
౫.వంశాలచరిత్ర. అనునవి.
భాగవతంలో
సర్గోప్యశ్చ విసర్గశ్చ వృత్తి రక్షాంతరాణి చ
వంశో వంశానుచరితం సంస్థాహేతు రపాశ్రయ
దశభిర్లక్షణైర్యుక్తం పురాణం తద్విదో విదు:.
అని పురాణ లక్షణాలు పది చెప్పబడ్డాయి
అనగా సర్గము (సృష్టి), ప్రతిసర్గము (ప్రళయము), వృత్తి (వ్యాపారము), రక్షా (పరిపాలవ), అంతరము (మన్వాదుల కాలము), వంశము (వంశాదుల విషయము), వంశానుచరితము (సూర్య, చంద్ర వంశస్థుల కథనాలు), సంస్థా (స్థితి), హేతువు (కారణము), అపాశ్రయము (ఆశ్రయ విషయాలు) అనే పదీ పురాణ లక్షణాలు. కొంతమంది ఇలా పది లక్షణాలున్నవి మహాపురాణాలని, ఐదు లక్షణాలున్నవి పురాణాలని వర్గీకరిస్తున్నారు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.