గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, డిసెంబర్ 2012, గురువారం

సోపాన దండకము: పండిత నేమాని.

జైశ్రీరామ్. మిత్రులారా!
పండిత నేమాని.రామ జోగి సన్యాసిరావు కవి కృత ఉత్తరోత్తర అవరోహణ పూర్వక చతుర్వింశత్యక్షర సోపాన సంక్షేప రామాయణ దండకము.:రూపంలో ఉన్న 
(త్రిశత్యక్షర సంక్షేప రామాయణము) తిలకించండి.
రామ!
భూమీశ!
కౌసల్యజా!
సద్గుణస్తోమ!
కారుణ్యవారాశి!
ధర్మప్రభాభాసురా!
తాటక ప్రాణసంహార!
గాధేయ యజ్ఞావనోత్సాహ!
మౌనీంద్ర సంస్తుత్య వీర్యోన్నతా!
ధారుణీనందినీ మానసారామ!
దేవేంద్ర ముఖ్యామర స్తుత్య చారిత్ర!
కళ్యాణ శోభాన్వితానంద రూపోజ్వలా!
పైతృకాజ్ఞా ప్రకారాంచిత త్యక్తసామ్రాజ్య!
సోర్వీసుతా లక్ష్మణారణ్య సంవాస సంప్రీత!
ఘోరాటవీప్రాంత వాసర్షి బృందావనానందితా!
క్రూర దైత్యాంగనా దుష్ట కామార్తి విధ్వంసనోత్సాహ!
మాయామృగాకార మారీచ ఘోరాసుర ప్రాణసంహార!
ధాత్రీతనూజా వియోగాతి దుఃఖాగ్ని సంతప్త హృన్మందిరా!
అంజనాపుత్ర సంశుద్ధ వాగ్భూషాణానీక సంశోభితాత్మాబ్జ!
వాతాత్మసంజాత రంహత్సమానీత భూమీసుతా క్షేమ సందేశ!
సంగ్రామ రంగస్థ లంకాధినాథాది ఘోరాసురానీక సంహారకా! 
దేవతానీక దిక్పాల గంధర్వ యక్షోరగవ్రాత సంస్తుత్య సత్కీర్తి! 
విశ్వసర్గాది నాశాంతలీలా వినోదాభిరామా! నమస్తే నమస్తే నమః 
ఇందులోని విశేషములను చూచేరు కదా. 1 నుండి 24 అక్షరముల వరకు గల సోపానములతో నిర్మించబడినది ఈ దండకము. 
Sanyasirao.
చూచారు కదా? మీరూ ప్రయత్నించి వ్రాయండి.
జైహింద్.
Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

పాండితీ స్రష్ట శ్రీ పండితుల వారికి పాదాభి వందనం .
సోపాన దండకము చాలా బాగుంది. అసలు ఇన్ని వైవిధ్య భరిత మైన
చందో బధ రచనలు ఉంటా యన్న సంగతి ఇంత వరకు నాకు తెలియక పోవడం శొచ నీయం. ఇప్పడి కైనా తెలుసుకో గలిగి నందుకు ఈ పండితుల కావ్యాలను చదవ గలుగు తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. పండితుల లో పండితుడుగా అమృతాన్ని అందిస్తున్న శ్రీ చింతా వారు ధన్యులు

ijswamy చెప్పారు...

మొత్తము ఎన్ని "త" గణములు ఉంటాయి ?

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.