గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, డిసెంబర్ 2012, గురువారం

ఆచార్య వి.యల్.యస్.భీమశంకరం గారు రచించిన శ్రీ ఆంజనేయ దండకము

జై శ్రీరామ్.
సహృదయ సోదరీ సోదరులారా!
ఆచార్య యల్.యస్.భీమశంకరం గారు బహు గ్రంథ కర్త. బహుముఖ ప్రజ్ఞాశాలి.వీరు రచించిన భీమ శతకం చూచినట్లైతే వీరిని అభినవ వేమనగా ప్రస్తుతించినను ఏమాత్రము అతిశయోక్తి కానేరదు. దక్షారామ భీమేశ్వరోదాహరణ కావ్య రచన గమనించినట్లైతే వీరి భక్తి తత్పరతతో పాటు రచనలో వీరికి గల నిపుణత వ్యక్తము కాక మానదు.. ఇక వీరు రచించిన శ్రీరామ! నీ నామమేమి రుచిర! అనే అపరాధపరిశోధక సాంఘిక పద్య కావ్యమున వీరికి గల కథా కల్పనా నైపుణి ప్రతిబింబిస్తుంది. ఈ కావ్యము నుండియే వీరు రచించిన ఆంజనేయ దండకమును మనమిప్పుడు చూద్దాము.
దండకము:-
శ్రీ ఆంజ నేయా! శితాంభోజ నేత్రా! మహాదివ్య గాత్రా! జగత్ ప్రాణ పుత్రా! మహోదగ్రవేత్రా! సురద్వేష సీమంతినీ స్తోమ మాంగళ్య తంత్రీ లవిత్రా! పవిత్రా! గిరీశాంశ జాతా! నమో రామ దూతా! సుమిత్రా సుత ప్రాణ దాతా! నమో బ్రహ్మతేజా! వివస్వంతు నంశోద్భవుండైన సుగ్రీవుకున్ మంత్రివై, నీవు శ్రీ రామ భూజానితో సఖ్యమొప్పంగ జేయించి, అవ్వానికిన్ బద్ధ శత్రుండు సాజన్ముడున్ శూరుడౌ వాలి దున్మించి, కిష్కింధలో కీశ సామ్రాజ్య పట్టాభిషేకంబు చేయించి, శ్రీ రామ రాజేంద్రు భార్యామణిన్ జానకీ దేవినిన్, దైత్యుడౌ రావణుండెంతయో మాయతో మున్ను గొంపోవ, ఆ సాధ్వి అన్వేషణార్థంబు నీవంత శ్రీరాము నాజ్ఞానుసారంబుగా దక్షిణాంభోధి లంఘించి, శ్రీలంక వే జేరి, ఆ లంకిణిన్ జంపి, ఆ దీవి గాలించి, వైదేహినిన్ గాంచి, శ్రీరామ హస్తాంగుళిన్ గుర్తుగా నామెకందించి, " నీ భర్త వైళాన వేంచేసి, దైతేయులన్ దున్మి గొంపోవు నిన్" న్నంచు ధైర్యంబు కల్పించి, లంకేశు గర్వంబు నిర్మూలముం జేయ, సీతమ్మ బందీగ నున్నట్టి, ఆరామమున్ గూల్చి, ఆతోట రక్షించు యోధాళినిన్ మొత్త, కోపించి దైత్యేంద్రు డస్తోక సైన్యంబుతో పుత్రుడౌ అక్షునిన్ బంప, దర్పించి నీవంత దోర్వీర్య మొప్పంగ, నీ ముష్టి బంధంబుతో వారి తాటించి, ఘట్టించి, మర్దించి, ఘాతించి సంహారమున్ జేయ, వాలంబు నల్గంగ బుస్సంచు వే లేచు నాగంబు బోలంగ రక్తారుణోదగ్ర నేత్రాననుండౌచు, ఘూర్ణిల్లి ఆక్రోశముల్ పల్కి, పౌలస్త్యుడా యింద్రజిత్తైన ఆత్మోద్భవున్ మేఘనాధున్ జయోత్సాహునీ పైకి బంపంగ, నీవున్ దశగ్రీవు నీక్షింపగా గోరి, స్వచ్ఛంద మార్గాన బ్రహ్మాస్త్ర బద్ధుండవై, రావణాస్థానమున్ జేరి, ఆ రాక్షసాధీశుతోడన్ "కులస్త్రీని మోహించి బంధించుటల్ పాపమే గాక, నీ ప్రాణముల్ దీయు, నీ వంశ నాశంబు తథ్యంబు శ్రీరామ బాణాగ్నిచే.  గాన భూపుత్రి యైనట్టి సీతా మహా దేవినిన్ భర్తయౌ రామ భూపాలు కర్పించి, ఆస్వామి పాదంబులం దాకి, రక్షింపగా వేడి జీవింపుమా" యంచు ధర్మంబు బోధింప, వాడల్గి నీ తోకకున్ నిప్పు పెట్టించ , నీ వంతలో శృంఖలల్ ద్రెంచి, గర్జించి, జృంభించి, నీ వాలమున్ ద్రిప్పి జ్వాలల్ రగిల్పించి, లంకాపురిన్ చైత్యముల్ , హట్టముల్, కోష్టముల్, గోపురంబుల్, నిశాంతంబులన్ కుడ్యముల్, కుట్టిమంబుల్, చతుశ్శాలలున్, ఆయుధాగారముల్, పాన శాలల్, గజాశ్వాది వాసంబులున్, రాజ హర్మ్యంబులున్, రాణి వాసంబులున్, వీతి హోత్రాహుతిన్ జేసి, సంతృప్తితో వేగ సంద్రంబునున్ దాటి, నీ మిత్రులున్, భృత్యులున్, సైనికుల్ మెచ్చ, శ్రీరామునిన్ జేరి, సీతమ్మ క్షేమంబు వాకృచ్చి, ఆ పైన నాదేవి చూడామణిన్ గుర్తుగా నిచ్చి, సాక్షాత్తు శ్రీ విష్ణువౌ రామ సర్వం సహా భర్తకున్ నీవు సంతోష భూతుండవై ప్రీతి పాత్రుండవై స్వామి దాసానుదాసుండవై, మించు నిన్నెంచి కీర్తింతు నో అంజనాదేవి పుత్రా! మహాత్మా! మదీయాత్మ సంవాస! ప్రీతిన్ నమస్కారముల్ జేసి, అర్ధించి, పూజించి, సేవించు భక్తాళినిన్ సాకి, వారిన్ చిరంజీవులం జేసి, ఆరోగ్య సౌభాగ్య భాగ్యంబులన్ గూర్చు సౌజన్య మూర్తీ! సదా బ్రహ్మచారీ! నమో రామ భక్తోపకారీ! దశగ్రీవ గర్వాపహారీ! ననుం బోలు మూఢాత్ములన్ క్షాంతి వీక్షించి, రక్షించి, కాపాడుమయ్యా ప్రభూ! దేవ దేవా! ప్రణామంబులయ్యా! మహా వీర! ఓ సుందరాకార! ఓ దుష్ట సంహార! ఓ దివ్య రూపా! నమస్తే! నమస్తే! నమస్తే! నమః! 
చూచారు కదండీ! పాదరసంలాగ ఎలా పరుగు పెట్టిందో దండకం?
మీరూ ఇలా వ్రాసేండుకు ఒక్కటంటే ఒక్కటే ప్రయత్నం ఎందుకు చేయ కూడదు? తప్పక ప్రయత్నించి ఒక్క నాలుగు వాక్యాలు వ్రాయండి చాలు. మీ మీద మీకు అపారమైన నమ్మకం కలిగి అద్భుతమైన రచనలు వ్రాయగలుగుతారు. నామాట నమ్మండి.
శుభమస్తు.
జైహిద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.