గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, డిసెంబర్ 2012, ఆదివారం

జుత్తాడలో అద్భుతంగా జరిగిన అష్టావధానం.

జైశ్రీరామ్.
సాహితీ ప్రియలారా!
తే.09-12-2012.న విశాఖపట్టణం జిల్లా జుత్తాడ గ్రామంలో అవధాన చిశారద శ్రీ భద్రం వేణు గోపాలాచార్యులవారి అష్టావధానం జరిగింది.
ఈ కార్యక్రమ సంచాలకులు శ్రీ మెఱుగుమిల్లి వేంకటేశ్వరరావు.
పృచ్ఛకులు.
సమస్యాపూరణ:- శ్రీ బీ.కొండలరావు.
సమస్య:- తల్లిని పెండ్లియాడె తగు ధర్మము నిల్పగ రాముఁడిద్ధరన్.
అవధానిగారి పూరణ:-
ఉల్లము నుల్లసిల్ల మది ఊయల లూగ ప్రియమ్ము చేకురల్
చల్లని భావ భంగిమలు సాగిలి వచ్చిన దివ్య తేజమున్
మెల్లగ దండ వేసి, ఘన మేదిని జాతను సీత, మన్మధున్
తల్లిని పెండ్లియాడె తగు ధర్మము నిల్పగ రాముఁడిద్ధరన్.
దత్తపది:-
శ్రీ వల్లభవఝల శ్రీరామ చంద్ర మూర్తి
దత్తపదములు:- తులసి - మీరా - కబీరు - బీహారి.పదములె చేర్చి కృష్ణార్జునుల యుద్ధ వర్ణనము.
అవధానిగారి పూరణము:-
చేతులసితములు ధనువు చేత నలిగి 
విదితమీ రాజ శక్తియు భీకరమ్ము.
వెనుక బీరుకతలు లేవు వీరులకును. 
ఆ యదుకుల బిహారి నయమ్ము గూర్ప
కర్ణు వధియింపమనెను సంఘర్షణమున.
వర్ణనము. శ్రీమతి మంగిపూడి సుబ్బలక్ష్మి. విషయము:-పర్యావరణ పరిరక్షణావశ్యకత వర్ణన.
అవధానిగారి పూరణము:-
ఏదో రీతిని జీవితమ్ము గడుపన్ హేయంబుగా మారదే?
పాదోధల్ రసమున్ విషమ్ము గదురన్ భాగ్యంబు హీనంబగున్.
ఏదీ జాగృతి? మానవాళి కిలలో ఏ నాశముల్ కల్గునో?
కాదయ్యా నరులార! శ్రద్ధ వినరే. కావంగదే ధారుణిన్.
నిషిద్ధాక్షరి. శ్రీ వల్లభవఝల నరసింహ మూర్తి. విషయము:- హరిహరాభేదాన్ని కందంలో చెప్పండి.
నిషిద్ధములను విడిచి అవధాని గారు చేసిన పూరణము:- 
శ్రీ యుమతో వెలసెన్ శివ - మాయగ మానరు కదా ఉమా పః మ్రొక్కన్.
పాయక హరిహరు లొక్కట - సోయ్సగమై మనసు నిలిపి జుత్తాడ పురిన్.
పురాణ పఠనము:-శ్రీ జీ. రామయ్య రెడ్డి.
ప్రశ్నలు:-
౧)నల్లనివాడు, పద్మనయనమ్ములవాడు......
ఈ పద్యమూలము భావము వివరించండి.
అవద్ధాని గారు వివరించారు.
౨)చెప్పులోను రాయి  .... పద్యంలో భావం?
అవధాని వివరించారు.
ఉద్దిష్టాక్షరి. శ్రీ మల్లాది సోమ శేఖర శర్మ. ఇక్కడ వెలసిన ఉమా మల్లికార్జున స్వామికి ఆ పేరెలా వచ్చింది? 
అనుష్టుప్ లో అవధానిగారి పూరణము:-
ఉమా మహేశ వాల్లభ్యం లభతే కీర్తి రూపకం. - వందే రంమ్యం భవాంతకం భక్త రక్షణ కారణం.
ఘంటా గణనం. శ్రీ చదరం రత్నాలు. అవధానం ఆద్యంతం 12 పర్యాయములు మ్రోగింపగా అవధానిగారు చెపారు.
అప్రస్తుత ప్రసంగం.శ్రీ ప్రాత రాజ శేఖర్. అడిగిన అప్రస్తుతాంశాలన్నిటికీ అవధానిగారు సమాధానం నేర్పుతో ఓర్పుతో చమత్కారంగా చెప్పారు.
ఈ అవధానం పూర్తి కాగానే అవధాని గారికి గ్రామ పెద్దలు సముచితంగా సత్కరించారు.
ఈ అవధానం ఏర్పాటు చేసిన శ్రీ వల్లభవఝల నరసింహ మూర్తిగారిని కూడా గ్రామస్తులు సత్కరించారు.
అవధానానికి ఆ గ్రామస్తులే కాక చోడవరం గ్రామస్తుకు, పెద్దలు, విజయ భావన సాహితీ సమాఖ్య సభ్యులు ఇంకా పెక్కుమంది వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
కార్యక్రమం మంగళాంతమయింది.
జైహింద్.
Print this post

2 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

చక్కగా వివరించి చెప్పినారు. ధన్యవాదములండి.

సో మా ర్క చెప్పారు...

ఆశావాది గారి అప్రస్తుత ప్రసంగ విన్యాసాలు చాలా బాగున్నాయి.ఆయన అవధానంలో పాల్గొనే అవకాశం నాకు దక్కింది ప్రొద్దటూరులో.వారి రచనలు అన్నీ నాకు పంపించారు.మీ కంద గర్భ పద బంధాలు దర్శించాను.చాలా బాగున్నాయి.ఈ రోజుల్లో అలా వ్రాసేవారు లేరనే చెప్పాలినాకు తెలిసినంతలో.మీకు నా ప్రత్యేక అభినందనలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.