గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, డిసెంబర్ 2012, సోమవారం

జగద్గిరినగర్ ZPHSchoolలోవిద్యార్థులు ప్రదర్శించిన భువన విజయం.

జైశ్రీరామ్.
విద్యార్థులకు భువనవిజయము శిక్షణ నిచ్చిన శ్రీచెన్నయ్య (దొరవేటి)మాష్టారికి సత్కారము.
భువన విజయ సన్నివేశము.
ఆర్యులారా!రంగారెడ్డి జిల్లా జగద్గిరినగర్ గ్రామమున గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఎంతటి అభినందనీయులో కదా!
మన మాతృ భాష అయిన తెలుగును అందరూ నిర్లక్ష్యం చేస్తున్న ఈ రోజుల్లో ప్రపంచ తెలుగు మహా సభలు జరుగుచున్న సందర్భముగా ఈ పాఠశాలలోని ప్రథానోపాధ్యాయిని, మరియు ఉపాధ్యాయుల అందరి సహకారంతో అక్కడ ప్రథానాంధ్రభాషా బోధకులైన శ్రీ చెన్నయ్య గారు మూడు రోజుల అతి తక్కువ వ్యవధిలో తమ పాఠశాలలో చదువుచున్న విద్యార్థినీ విద్యార్థులకు భువనవిజయము ప్రదర్శించుటయందు శిక్షణ నిచ్చి అత్యద్భుతంగా ప్రదర్శింప చేసి అందరి మన్ననలకు పాత్రులయారు. త్రికరణ శుద్ధిగా ప్రయత్నిస్తే మనమేపనైనా పూర్తి చేయటంలో విజయం సాధించ గలమనడానికి వీరి ఈ ప్రయత్నమే తార్కాణము. వారు ఈ కార్యక్రమానికి నన్నూ ఆహ్వానించారు. విద్యార్థుల నుద్దేశించి మాటాడమన్నారు.నన్ను సముచితంగా సత్కరించారు
ఈ కార్యక్రమము ఆద్యంతము విద్యార్థిలే నిర్వహించేవిధంగా శిక్షణ నిచ్చారు.
ఒక్క ఆంగ్ల పదమైనా రాకుండా అనేకమంది విద్యార్తులు పోటీపడి ప్రసంగించటం ఇక్కడ అత్యద్భుతంగా జరిగింది.
భువన విజయం ద్వారా అలనాటి కృష్ణ దేవరాయలు వారి సభా కార్యక్రమాలను కళ్ళకు కట్టించారు. ఈ ప్రదర్శనలో భాషకు తోడు ఆహార్యము కూడా ప్రశంసనీయంగా ఉంది.
ముఖ్యంగా పెద్దన తెలుగు సంస్కృత భాషలలో అలవోకగా కవిత్వమును గురించి చెప్పిన ఉత్పల మాలికను పెద్దన పాత్ర ధారి చక్కగా చదివటంతో ప్రేక్షకుల కరతాళధ్వనులకు అంతే లేదు.
ఇంతటి చక్కగా కృషి చేయించిన శ్రీ చెన్నయ్య గారు, కృషి చేసిన విద్యార్థులు అభినందనీయులు.
ఆరవ తరగతి చదువుతున్న ఒక చిన్న పాప ఒక సంగీర మేళవింపు కలిగిన పాటకు నాట్యము చేసి అందరికీ అబ్బురం కలిగించింది. ఇంతకీ ఆ అమ్మాయి ఏ గురువు వద్దా నేర్చుకో లేదట. కేవలం ఇంటిలో టీవీలో చూసి నేర్చుకున్నదట. ఆ అమ్మాయిని అభినందించనివారు లేరు.
అతి సర్వత్ర వర్జయేత్ హాస్య నాటకం కూడా అందరినీ ఆకట్టుకొంది.
అందరినీ హృదయ పూర్వకంగా అభినందిస్తున్నాను.
జైహింద్.
Print this post

2 comments:

Pandita Nemani చెప్పారు...

అయ్యా! మీరు పిల్లలచే వేయించిన భువనవిజయము గురించి వ్రాసిన వార్తను చూచి చాల ఆనందిచించేను. నిర్వహించిన వారికి మా హృదయపూర్వక అభినందనలు.

మీకు తెలియును - చురుకుగా నుండు పిల్లలకు అన్ని విద్యలు సులభముగా నేర్పవచ్చును. నేను
1985 లో మా పిల్లలను మరికొందరు విద్యార్థులను (ప్రాథమిక తరగతుల వారు - 10 సంవత్సరముల లోపు వారిని) ప్రోవు చేసి శిక్షణ నిచ్చి భువనవిజయమును కొవ్వూరులో (ప.గో.జిల్లా) అలరించేటట్టుగా ప్రదర్శింప చేసితిని.

స్వస్తి.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అసలు భువన విజయం అంటేఏమిటీ ? అని అడుగుతున్న ఈ రోజుల్లో అంత చక్కగా నిర్వహించ గలిగిన వారి కృషి అనన్యం. తెలు గును ఎవరు చదువు తారు ? తెలుగెందుకు ? అని హేళన చేస్తున్న నేటి కంప్యూటర్ యుగంలో ఇంత మంచి కార్య క్రమ ప్రదర్శన ప్రశంస నీయం. గురువులకు , విధ్యార్ధినీ విధ్యార్ధులకు ధన్య వాదములు + అభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.