గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, డిసెంబర్ 2012, ఆదివారం

ఆశావాది అవధాన వినోదం- సరస ప్రసంగం.4 వ భాగము

జైశ్రీరామ్. 
సాహితీ ప్రియబాంధవులారా!
అవధానాచార్య డా. ఆశావాది ప్రకాశ రావు కవి శిరోమణిని గూర్చి తెలియనివారుండరు.
అటువంటి అవధాని గారు చేసిన అవధానాలలో  అప్రస్తుత ప్రసంగములో చేసిన సరస ప్రసంగాలు మీ ముందుంచుతున్నందుకు ఆనందంగా ఉంది. పృచ్ఛకుని ప్రశ్న దానికి అవధాని గారి చతురోక్తులు 4వ భాగము  మీ ముందుంచుతున్నాను.
ఇక చూడండి.
31. పృచ్ఛకుఁడు:-ఒక సభలో వెండి పళ్ళెరంలో సన్మాన సంభారాలు తెచ్చి ఇచ్చాక పళ్ళెం వెనక్కు 
       తీసుకు వెళ్ళుతుంటే ‘సపాత్ర దానం చెయ్యండి’ అన్నాను. ఆయన నన్ను అదోలా చూచారు. 
       ఎందుకంటారు?
        అవధాని:-అపాత్ర దానం చేస్తున్నాము అనలేక.
32. పృచ్ఛ:-మహిళా పరపతి సంఘంలో కాని, మహిళా వినియోగదారుల సంఘంలో కాని, 
       మీ రెప్పుడైనా సభ్యులుగా ఉన్నారా?
        అవ:-ఈ సంఘంలో నేనెందు కుంటాను? ఉంటే భార్యా బాధిత సంఘంలో ఉంటాను.
33. పృచ్ఛ:-మీరు కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి నెత్తిన ఎందుకు టోపీ వేసుకో దలిచారు?
        అవ:-మరొక్కరిచే టోపీ వేయించుకోవటం ఇష్టం లేక.
34. పృచ్ఛ:-మీకు క్షేత్రం ఏమాత్రం ఉంది?
        అవ:-నేనుగా దున్న గలిగినంత.
35 పృచ్ఛ:-వలి అనే పేరు గల ముస్లిమ్ అబ్బాయిని మీకిస్తాను. హిందూ అమ్మాయిగా 
       మార్చుతారా?
       అవ:-నేను సెక్స్ లేదా మతం మార్పిడి చేసే వాడిని కాను.
       పృచ్ఛ:-క్షమించండి అబ్బాయిని వేదిక మీదికి పట్టుకొని రావటం లేదు. అతని పేరిస్తాను 
       మార్చండి.
       అవ:-సంతోషం . మేము పదాలతో ఆడుకొనే వాళ్ళమని గ్రహించినందుకు. ఆ పేరు చివరి
       అక్షరానికి ద్విత్త్వం ఇవ్వండి. వల్లి అనే    
       హిందూ బాలిక ఔతుంది.
36. పృచ్ఛ:-ముందు బల్లపై వాలి పాఠం వినే కుర్రాణ్ణి ఎలా మందలించాలి?
        అవ:-నడుంలో బలం లేకపోతే ఏ అమ్మాయి పెళ్ళి చేసుకోదు అంటే సరి. నిటారుగా 
        కూర్చోవటం నేర్చుకుంటాడు.
37. పృచ్ఛ:-పన్ను వేసే అధికారి ఎలా ఉంటాడు?
        అవ:-అచ్చం మీలానే ఉంటాడు. మీరు ఫన్ వేస్తున్నారు కదా!
38. పృచ్ఛ:-ఆశావాదికి IAS మీద చూపని కొందరంటారు. మరి మీరేమంటారు?
        అవ:-నిజమేనండి. నాకు Idli.Allamchetni,Sambarఅంటే ఇష్టం.
39. పృచ్ఛ:-ప్రేయసే పెళ్ళామైతే ఎలాగ ఉంటుంది?
        అవ:-పెళ్ళికి ముందు అయస్కాంతం, పెళ్ళి తరువాత సూర్యాకాంతంలా ఉంటుంది.
40. పృచ్ఛ:-DEO జాతియ పక్షి ఏది? అన్నాడు. క్లాసులో ఎవరూ చెప్పలేదు. చివరి బెంచీలో 
        నిద్ర పోతున్న ఒకడు ఉన్నపళాన లేచి సరైన సమాధానం చెప్పాడట.ఎలా సాధ్యం?
        అవ:-ప్రక్కవాడు వాని జుత్తు లాగి ఉంటాడు. వాడు పీకాకు(లాగ వద్దు, పికాక్= నెమలి)
        అని ఉంటాడు. 
        (మరో మారు కలుసుకొన్నప్పుడు మరిన్ని ముచ్చటించుకొందాము.)
        సశేషం.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.