గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, డిసెంబర్ 2012, ఆదివారం

రామలింగేశ్వర మహిమ- - డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు

జై శ్రీరామ్.
ఆంధ్రామృత పాఠకాళికి వైకుంఠ ఏకాదశి సందర్భముగా శుభాకాంక్షలు. ఇంతటి పర్వదినాన మనము శ్రీ యల్లాప్రగడ మల్లికార్జున రావు గారు వ్రాసిన రామలింగేశ్వర మహిమను చూద్దాం.
రామలింగేశ్వర మహిమ
శివిష్ణు రూపాల అభేదాన్ని ప్రకటిస్తూ భూలోకంలో మానవాళి పాపాలను పటాపంచలు చేసేందుకు సాక్షాత్తూ శ్రీమహావిష్ణురూపుడైన శ్రీరామచంద్రుడు భూలోకంలో స్థాపించిన లింగమే రామనాథుడు లేదా రామలింగేశ్వరుడు. రామేశ్వరంలో ఈనాటికీ ఈ శివలింగం భక్తుల పాపాలను పోగొడుతూ దర్శనమిస్తుంటుంది. ఈ మహాలింగ మహిమను గురించి స్కందపురాణం బ్రహ్మఖండం నలభైమూడో అధ్యాయంలో దీనికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. రామేశ్వర దర్శనంతోనే పాపాలన్నీ నశిస్తాయి. ఏ విధంగానైనా సరే రామేశ్వరలింగాన్ని స్మరిస్తే చాలు ఇహపర లోకాలలో దుఃఖం దూరం అవుతుంది. ఆమహాలింగాన్ని కీర్తిస్తూ పూజిస్తూ ఉంటే రుద్రసారూప్యాన్ని పొందవచ్చు. రామనాథ మహాలింగాన్ని దర్శించిన వ్యక్తిని చూసినవారికి కూడా పుణ్యం లభిస్తుంది. రామనాథుడిని మధ్యాహ్న కాలంలో దర్శించినవారు సురాపాన దోషాల నుంచి విముక్తులవుతారు. సాయంకాలంలో ఆ స్వామిని భక్తితో దర్శించినవారికి తెలిసీ తెలియక చేసిన తప్పులు నశిస్తాయి. సాయంకాలంవేళ మహాస్తోత్రాలతోరామేశ్వరుడిని స్తుతిస్తే బంగారాన్ని దొంగిలించిన పాపాలు నశిస్తాయి.
కీర్తనతోనూ ముక్తి 
రామనాథ మహాలింగానికి అభిషేకం జరుగుతున్నప్పుడు గేయాలు ఆలపించటంవాద్యాలనుమోగించటంలాంటివి భక్తితో చేసినవారికి రుద్రలోకప్రాప్తి కలుగుతుంది. అలాగే ఆ స్వామికి అభిషేకం జరిగేవేళ రుద్రాధ్యాయాన్ని నమక చమకాలనుపురుషసూక్తాన్నిఆ స్వామికి సంబంధించిన ఇతర సూక్తాలను పఠించటం వల్ల నరకం దూరం అవుతుంది. ఆవుపాలుపెరుగుతోపంచగవ్యంతోనెయ్యితో రామనాథ మహాలింగానికి అభిషేకం చేయిస్తే నరకాన్ని తెచ్చిపెట్టే పాపఫలం దూరం అవుతుంది. ఆ మహాలింగానికి నెయ్యితో అభిషేకం చేయించినవారు గతంలో చాలా జన్మల నుంచి చేస్తూ వచ్చిన పాపాలను కూడా పోగొట్టుకుంటారు. ఆవుపాలతో అభిషేకం చేయించినవారు తమ కులాన్ని మొత్తాన్ని ఉద్ధరించి శివలోకాన్ని పొందుతారు. పెరుగుతో అభిషేకం చేయిస్తే పాపవిముక్తి కలిగి శివుడికి ఇష్టం అయిన విష్ణులోకంలో ఆ భక్తుడు సుఖంగా ఉండే అదృష్టం లభిస్తుంది. ఇలా రామనాథలింగ లేదా రామేశ్వరలింగ దర్శనపూజా మహిమలను గురించి ఈ కథాసందర్భం వివరిస్తోంది.
ధనుష్కోటిలో స్నానం చేస్తే పుణ్యఫలం
ధనుష్కోటిలో స్నానం చేసి రామనాథుడిని దర్శిస్తే గొప్ప పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. రామనాథ అనే శబ్దాన్ని మూడుసార్లు పలికితే చాలు పాపాలు నశిస్తాయి. రామనాథుడిని స్మరించకుండా వేరొక చోటికి ముక్తికోసమోదైవానుగ్రహం కోసమో వెళ్లడమనేది ఎదురుగా షడ్రసోపేతమైన భోజనాన్ని ఉంచుకొని ఆకలితో అలమటిస్తూ వేరొక చోట అన్నం కోసం వెదకటం లాంటిదే. ప్రాణంపోయే సమయంలో ఆ స్వామి నామాన్ని స్మరిస్తే శంకరత్వం దక్కుతుంది. రామనాథమహాదేవఓ కరుణానిధి నన్ను రక్షించు అని నిరంతరం స్మరిస్తూ ఉండేవారికి బాధలు ప్రాప్తించవు. అలాగే రామనాథజగన్నాథధూర్జటినీలలోహిత అని నిరంతరం స్మరించేవారు మాయలకు లోనుకారు. నీలకంఠమహాదేవరామేశ్వర అని స్మరించేవారికి క్రోధం వల్ల కలిగే బాధలుండవు. రామేశ్వరంలో రామలింగేశ్వరుడిని చూడటం ఓ రకమైన పుణ్యాన్ని తెచ్చిపెడితే ఆ రామలింగేశ్వర ఆలయాన్ని ఎవరికివారు తమ తమ ప్రాంతాలలో ఏర్పాటుచేసుకోవటం మరింత పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. తమ తమ ప్రాంతాలలో రామనాథ లింగం ఉన్న ఆలయాన్ని చెక్కలతో నిర్మించినవారు బ్రహ్మస్థానాన్ని చేరుకుంటారు. స్ఫటికం లాంటి విభిన్న శిలలతో రామనాథ ఆలయాన్ని నిర్మిస్తే శివలోకప్రాప్తి కలుగుతుంది. భక్తిపూర్వకంగా రామనాథ ఆలయాన్ని రాగితో నిర్మించినవారు శివసారూప్యాన్ని పొంది ఆనందిస్తారు. రామనాథ ఆలయాన్ని బంగారంతో నిర్మించినవారు శివసాయుజ్యం పొందుతారు. ధనవంతులు ఆ స్వామి ఆలయాన్ని బంగారంతో నిర్మించినప్పుడు కలిగే పుణ్యఫలితం ధనహీనుడు మట్టితో కట్టించినా పొందగలుగుతాడు. అంటే శక్తివంచన లేకుండా ఎవరికివారు తమ శక్తిననుసరించి ఆ స్వామికి ఆలయ నిర్మాణం జరపవచ్చు.
డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
ఇంతటి చక్కని విషయములను వ్రాసిన  శ్రీమల్లికార్జునరావు గారికి ధన్యవాదములు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
రామ లింగేశ్వర మహిమను గురించి శ్రీ ఎల్లా ప్రగడ వారి కలం నుంచి జాలు వారిన అమూల్యమైన విషయాలను ఏకాదశీ పర్వ దినాన మా కందించిన పూజ్య గురువులు శ్రీ పండితుల వారికి పాదాభి వందనములు
ఈ అమృతపు జల్లులు శ్రీ చింతా వారి పున్నెము .ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.