జైశ్రీరామ్.
జయంతి తే సుకృతినో రస సిద్ధాః కవీశ్వరాః.
ప్రపంచ తెలుగు మహా సభలు నిర్వ హించుచున్న నిర్వాహకులకు,
అందు ముఖ్య పాత్ర వహించుచున్న
బ్రహ్మశ్రీ రాళ్ళబండి కవితా ప్రసాదు గారికి నా హృదయ పూర్వకమైన నమస్కారములు.
ఆర్యులారా!
ఇంతటి మహత్తర, మహోన్నత కార్యక్రమ నిర్వహణా దక్షులై, అహర్నిశలు త్రికరణ శుద్ధితో నిర్వహిస్తున్న మీ అందరికీ నా హృదయ పూర్వక అభినందనలు.
మీరు చేపట్టిన ఈ కార్యక్రమము నిర్విఘ్నంగా అత్యద్భుతంగా తెలుగు జాతి చరిత్రలోనే మరపురాని మహా ఘట్టంగా మిగిలిపోయేలాగ, ప్రపంచ దేశాలన్నీ అబ్బుర పడేలాగా జరగాలని మనసారా ఆశిస్తున్నాను.
ఆ తిరుమలేశుని సన్నిధానంలో చేయ తలపెట్టిన ఈ కార్యక్రమం మీరనుకున్న దానికంటే కూడా ద్విగుణీ కృత మంగళ ప్రదంగా తప్పక జరిగి తీరుతుంది.
ఇక నాదొక విన్నపము. దయ చేసి వినవలసినదిగా నా మనవి.
1) ఈ నాడు మన తెలుగు భాష ప్రపంచ దేశాలలోనే ఒక గుర్తింపు పొందుతున్న భాషగా ఎదగాడినికి మూలమైన మహానుభావులను మనము మరువరాదు. ముఖ్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నితమ అహర్నిశ కృషితో మనకందించిన అనేకమంది మహానుభావులు తెరవెనుకనున్నారు. అట్టివారందరూ కూడా ఈ సమయంలో గౌరవార్హులు.
2) ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని తమ మేధస్సుకు పదును పెట్టుతూ, సామాజిక స్పృహతో, సాంఘిక సంస్కరణాభిలాషతో, సాహితీప్రియత్వంతో, అనేకమంది బ్లాగులు నిర్మించి వాటి ద్వారా ప్రత్యక్షంగాను, పరోక్షంగాను కూడా భాషకు నిరుపమానమైన సేవలు అందిస్తూ, అత్యద్భుతమైన చైతన్యాన్ని సమాజంలో తీసుకు వస్తున్నారు. మన భాషను, మన గ్రంథాలను అజరామరంగా ఆకాశ వీధిలో నిలపెట్టి ప్రపంచం మొత్తానికి అందుబాటులో ఉంచుతున్నారు. అటువంటి నిరుపమానమైన అసాధారణమైన భాషా సేవ చేస్తున్న బ్లాగరులు ఈ సమయంలో తప్పక గౌరవార్హులు.
3) ఈ నాడు అనేక మంది దేశ, విదేశాలలో, తాము ఏ వృత్తిలో జీవనం సాగిస్తున్నప్పటికీ, కేవలము తెలుగు భాషాభిమానంతో తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చిస్తూ, అత్యద్భుతమైన పద్య రచనాసక్తులై వ్రాస్తూ, అత్యద్భుతమైన చిత్ర - బంధ - గర్భ కవిత్వములు, వ్రాస్తూ, కథలు, కథానికలు, సారస్వత వ్యాసములు,వ్యంగ్యోక్తులు, పాటలు, వ్రాస్తూ, అపురూపమైన వ్యాఖ్యలు చేస్తూ, భాషకు నిత్య చేతనత్వాన్ని కొలుపుతూ, నేడు తెలుగు భాష అనంత గంగా ప్రవాహంగా తీర్చి దిద్దుతున్న మహనీయులు న్నారు. అట్టి వారు అనేకులు ఈ సందర్భంగా గౌరవార్హులు.
4) అపురూప సాహితీ ప్రక్రియ అయిన అవధాన ప్రక్రియను, అంతర్జాల కవి సమ్మేళనములను, అంతర్జాల భువన విజయములను కూడా, అంతర్జాలములో చేస్తూ మన తెలుగు భాషకు ఎనలేని సేవలందిస్తున్న ఈనాటి సాహితీ మూర్తులందరూ,ఇంకా నామాటల కందకుండా ఉన్న అనేకులు ఈ సందర్భముగా గౌరవార్హులేనని మనవి చేస్తున్నాను.
ఈ నా సూచనలు యదార్థమే అనిపిస్తే మీ పరిధిలో న్యాయం చేయండి.
సహృదయులైన మీరు భాషాభిమానులకు, సాహిత్యాభిమానులకు, సాహితీ సంసేవనా తత్పరులకు తప్పక పెద్ద పీట వెయ్యండి. తప్పక ఆ కార్యక్రమాలలో భాగస్వాములవటానికి అవకాశం కల్పించండి.
మీరు తప్పక చేయగలిగిన మహోన్నత మనస్కులని నేను విశ్వసిస్తున్నాను.
నమస్తే.
ఇట్లు సజ్జన విధేయుఁడు,
చింతా రామ కృష్ణా రావు,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశ్రాంత తెలుగు ఉపన్యాసకుఁడు,
హైదరాబాదు.
సెల్ నెంబర్.9247238537.
email id. chinta.vijaya123@gmail.com
జైహింద్.
3 comments:
ఆర్యా! భేషైన సూచన చేశారు. మూలాలను కాపాడే ఆధారాలను విస్మరిస్తే నిర్మాణం దెబ్బతినే ప్రమాదం ఉంది.మీ విజ్ఞప్తిని పెద్దలు పరిగణనలోకి తీసుకొంటారని ఆశిస్తున్నాను.
నమస్కారములు
ఎంతో విలువైన విషయాలను అంద జేసారు. మన మాతృభాషకు అందరు తగినంత కృషి చేయ గలగడం మన అదృష్టం.ఇక్కడ ఆటా సభలకు వచ్చి నప్పుడు పాల్గొన గలిగే అదృష్టం నాకు లభించి నందుకు ధన్యు రాలను . ఎప్పటి కప్పుడు సాహిత్య విశేషాలను అంద జేస్తున్న శ్రీ చింతావారి కృషి అనన్యం. ధన్య వాదములు
Naga Gurunatha Sarma Madugula ఇలాగన్నారు.
కవితాప్రసాద్ గారైనా అంత బాగా స్పందిస్తారని నేనైతే అనుకోవటం లేదు గురువు గారూ!
ఎందుకంటే ఆయన సాంస్కృతిక శాఖ సంచాలకులే అయినా ఇప్పుడు రవీంద్రభారతిలో రమణాచారి గారి హవా నడుస్తోంది.
మొన్న ఒకరోజు నేను హాజరైన గ్రామ,మండల స్థాయి సభల గుఱించి కవితాప్రసాద్ గారిని ట్యాగ్ చేసి మరీ ఫేస్‍బుక్‍లో చెప్పాను.
ఇంతవరకూ స్పందన లేదు. పోనీ ఆన్‍లైన్‍లో లేరా అంటే గంటకో కవిత ప్రచురిస్తారు. వ్యక్తిగతంగా మఱో రెండు వేగులు పంపాను, వాటికీ స్పందన లేదు. ఇక నిన్న అనంతపురం జడ్పీ ఆఫీసుకు వెళితే సభల గుఱించి స్పందించిన తీరు చూడాలి, ఏదో పనొచ్చిపడింది,చేస్తున్నాం అన్నట్టున్నారు. ఏదేమైనా సభలలో మీరన్నట్టు అవధానులకు,కవులకు,రచయితలకు,భాషావేత్తలకు ప్రాముఖ్యత ఉంటేనే సభలు విజయవంతం.
అలా కావాలనే ఆశిస్తున్నాను.
Naga Gurunatha Sarma Madugula
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.