గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, డిసెంబర్ 2012, బుధవారం

సాహితీ వేత్త శ్రీ పిస్కా సత్యనారాయణ గారికి సత్కృతి.

1 comments

జైశ్రీరామ్.
తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న సందర్భంగా, మన రాష్ట్రప్రభుత్వంవారు వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు తెలుగులో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. అందులో విజయులైన అభ్యర్థులకు బహుమతిప్రదానం చేస్తున్న సందర్భములో స్థానికంగా తెలుగుభాషకు సేవ చేస్తున్న కళాకారులను గుర్తించి సన్మానం చేయవలసిందిగా విద్యాశాఖాధికారులు ఆదేశాలిచ్చారు. దాని ప్రకారం  మంచిర్యాలలో సాహిత్య, సంగీత, నాట్యరంగాల్లో కృషి చేస్తున్న ముగ్గురిని ఎంపిక చేసి సత్కరించారు. సాహిత్యరంగములో శ్రీ పిస్కా సత్యనారాయణ గారిని ఎన్నుకొని సన్మానం చేశారు. ఆ సందర్భంలోని ఛాయాచిత్రము.
 సాహిత్యరంగములో శ్రీ పిస్కా సత్యనారాయణ గారికి చేస్తున్న సన్మానం.
ఈ సందర్భంగా శ్రీ పిస్కా సత్యనారాయణ గారిని మనసారా అభినందిస్తున్నాను.
జైహింద్.

25, డిసెంబర్ 2012, మంగళవారం

ప్రపంచ తెలుగు మహా సభలలో పాల్గొనే సదవకాశం.

2 comments

జైశ్రీరామ్.
సహృదయ భారాతీయ సహోదరులారా! ఆ జగన్మాత కటాఖ్శం వల్ల, మీ వంటి సన్మిర్తుల శుభాకాంక్షలవల్లా, "తిరుపతిలో జరుగుచున్న ప్రపంచ తెలుగు మహా సభలలో దిగ్దంతులవంటి తెలుగు సరస్వతీ, పుంభావ సరస్వతీ మూర్తులను చూచే భాగ్యంతో పాటు, అక్కడ వేదికపై ఉపన్యసించే సదవకాశం కూడా నాకు లభించింది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము నుండి నన్ను ఉపవేదికపై ఉపన్యసించ వలసినదిగా కోరుతూ ఆహ్వానం వచ్చింది.
ఈ సదవకాశం కలిగించిన ప్రభుత్వానికి నా ధన్యవాదములు తెలియ జేసుకొంటున్నాను. 
అక్కడికి వస్తున్న మీ అందరిమీ ప్రత్యక్షంగా చూచే అదృష్టం నాకు కలుగుతున్నందులకు ఆనందంగా ఉంది.
జయంతి తే సుకృతినో రస సిద్ధాః కవీశ్వరాః.
జైహింద్.

23, డిసెంబర్ 2012, ఆదివారం

ఉత్తరువులన్నీ తెలుగులోనే ఉండాలి.

1 comments

జైశ్రీరామ్
జైహింద్.

శ్రీరామునిచే రామలింగ ప్రతిష్ఠాపన: పండిత నేమాని

1 comments


జైశ్రీరాం
పండిత నేమాని
శ్రీమదధ్యాత్మ రామాయణమునుండి
శ్రీరామునిచే రామలింగ ప్రతిష్ఠాపన:

శ్రీరాముండు పయోధి తీరమున సుక్షేత్రమునన్ భక్తితో
శ్రీరామేశ్వరలింగమున్ నిలిపి పూజించెన్ మహాదేవునిన్
గౌరీ వల్లభు భక్తలోక వరదున్ కైవల్య యోగప్రదున్
కారుణ్యామృత సాగరున్ భువన రక్షాదక్షునిన్ ద్ర్యక్షునిన్ 

నమస్తే సోమాయ త్రిభువన శరణ్యాయచ నమో
నమస్తే రుద్రాయ త్రిదశనుత విజ్ఞాననిధయే
నమస్తే శర్వాయ ప్రమథగణ వంద్యాయచ నమో
నమస్తే తామ్రాయ శ్రిత భవభయఘ్నాయచ నమః

నమస్తే సదా లోకనాథార్చితాయ
నమస్తే గిరీశాయ నాదప్రియాయ
నమస్తే భవానీ మనస్సంస్థితాయ
నమశ్శంభవే విశ్వనాథాయ తుభ్యం
 
నమో హిరణ్యబాహవే సనాతనాయ తేనమః
నమశ్శివాయ సర్వభూత నాయకాయ తేనమః
నమో హరాయ నందివాహనాయ శూలినే నమః
నమో భవాయ నాగభూషణాయ శంభవే నమః 
పండిత నేమాని.
జైహింద్.

రామలింగేశ్వర మహిమ- - డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు

1 comments

జై శ్రీరామ్.
ఆంధ్రామృత పాఠకాళికి వైకుంఠ ఏకాదశి సందర్భముగా శుభాకాంక్షలు. ఇంతటి పర్వదినాన మనము శ్రీ యల్లాప్రగడ మల్లికార్జున రావు గారు వ్రాసిన రామలింగేశ్వర మహిమను చూద్దాం.
రామలింగేశ్వర మహిమ
శివిష్ణు రూపాల అభేదాన్ని ప్రకటిస్తూ భూలోకంలో మానవాళి పాపాలను పటాపంచలు చేసేందుకు సాక్షాత్తూ శ్రీమహావిష్ణురూపుడైన శ్రీరామచంద్రుడు భూలోకంలో స్థాపించిన లింగమే రామనాథుడు లేదా రామలింగేశ్వరుడు. రామేశ్వరంలో ఈనాటికీ ఈ శివలింగం భక్తుల పాపాలను పోగొడుతూ దర్శనమిస్తుంటుంది. ఈ మహాలింగ మహిమను గురించి స్కందపురాణం బ్రహ్మఖండం నలభైమూడో అధ్యాయంలో దీనికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. రామేశ్వర దర్శనంతోనే పాపాలన్నీ నశిస్తాయి. ఏ విధంగానైనా సరే రామేశ్వరలింగాన్ని స్మరిస్తే చాలు ఇహపర లోకాలలో దుఃఖం దూరం అవుతుంది. ఆమహాలింగాన్ని కీర్తిస్తూ పూజిస్తూ ఉంటే రుద్రసారూప్యాన్ని పొందవచ్చు. రామనాథ మహాలింగాన్ని దర్శించిన వ్యక్తిని చూసినవారికి కూడా పుణ్యం లభిస్తుంది. రామనాథుడిని మధ్యాహ్న కాలంలో దర్శించినవారు సురాపాన దోషాల నుంచి విముక్తులవుతారు. సాయంకాలంలో ఆ స్వామిని భక్తితో దర్శించినవారికి తెలిసీ తెలియక చేసిన తప్పులు నశిస్తాయి. సాయంకాలంవేళ మహాస్తోత్రాలతోరామేశ్వరుడిని స్తుతిస్తే బంగారాన్ని దొంగిలించిన పాపాలు నశిస్తాయి.
కీర్తనతోనూ ముక్తి 
రామనాథ మహాలింగానికి అభిషేకం జరుగుతున్నప్పుడు గేయాలు ఆలపించటంవాద్యాలనుమోగించటంలాంటివి భక్తితో చేసినవారికి రుద్రలోకప్రాప్తి కలుగుతుంది. అలాగే ఆ స్వామికి అభిషేకం జరిగేవేళ రుద్రాధ్యాయాన్ని నమక చమకాలనుపురుషసూక్తాన్నిఆ స్వామికి సంబంధించిన ఇతర సూక్తాలను పఠించటం వల్ల నరకం దూరం అవుతుంది. ఆవుపాలుపెరుగుతోపంచగవ్యంతోనెయ్యితో రామనాథ మహాలింగానికి అభిషేకం చేయిస్తే నరకాన్ని తెచ్చిపెట్టే పాపఫలం దూరం అవుతుంది. ఆ మహాలింగానికి నెయ్యితో అభిషేకం చేయించినవారు గతంలో చాలా జన్మల నుంచి చేస్తూ వచ్చిన పాపాలను కూడా పోగొట్టుకుంటారు. ఆవుపాలతో అభిషేకం చేయించినవారు తమ కులాన్ని మొత్తాన్ని ఉద్ధరించి శివలోకాన్ని పొందుతారు. పెరుగుతో అభిషేకం చేయిస్తే పాపవిముక్తి కలిగి శివుడికి ఇష్టం అయిన విష్ణులోకంలో ఆ భక్తుడు సుఖంగా ఉండే అదృష్టం లభిస్తుంది. ఇలా రామనాథలింగ లేదా రామేశ్వరలింగ దర్శనపూజా మహిమలను గురించి ఈ కథాసందర్భం వివరిస్తోంది.
ధనుష్కోటిలో స్నానం చేస్తే పుణ్యఫలం
ధనుష్కోటిలో స్నానం చేసి రామనాథుడిని దర్శిస్తే గొప్ప పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. రామనాథ అనే శబ్దాన్ని మూడుసార్లు పలికితే చాలు పాపాలు నశిస్తాయి. రామనాథుడిని స్మరించకుండా వేరొక చోటికి ముక్తికోసమోదైవానుగ్రహం కోసమో వెళ్లడమనేది ఎదురుగా షడ్రసోపేతమైన భోజనాన్ని ఉంచుకొని ఆకలితో అలమటిస్తూ వేరొక చోట అన్నం కోసం వెదకటం లాంటిదే. ప్రాణంపోయే సమయంలో ఆ స్వామి నామాన్ని స్మరిస్తే శంకరత్వం దక్కుతుంది. రామనాథమహాదేవఓ కరుణానిధి నన్ను రక్షించు అని నిరంతరం స్మరిస్తూ ఉండేవారికి బాధలు ప్రాప్తించవు. అలాగే రామనాథజగన్నాథధూర్జటినీలలోహిత అని నిరంతరం స్మరించేవారు మాయలకు లోనుకారు. నీలకంఠమహాదేవరామేశ్వర అని స్మరించేవారికి క్రోధం వల్ల కలిగే బాధలుండవు. రామేశ్వరంలో రామలింగేశ్వరుడిని చూడటం ఓ రకమైన పుణ్యాన్ని తెచ్చిపెడితే ఆ రామలింగేశ్వర ఆలయాన్ని ఎవరికివారు తమ తమ ప్రాంతాలలో ఏర్పాటుచేసుకోవటం మరింత పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. తమ తమ ప్రాంతాలలో రామనాథ లింగం ఉన్న ఆలయాన్ని చెక్కలతో నిర్మించినవారు బ్రహ్మస్థానాన్ని చేరుకుంటారు. స్ఫటికం లాంటి విభిన్న శిలలతో రామనాథ ఆలయాన్ని నిర్మిస్తే శివలోకప్రాప్తి కలుగుతుంది. భక్తిపూర్వకంగా రామనాథ ఆలయాన్ని రాగితో నిర్మించినవారు శివసారూప్యాన్ని పొంది ఆనందిస్తారు. రామనాథ ఆలయాన్ని బంగారంతో నిర్మించినవారు శివసాయుజ్యం పొందుతారు. ధనవంతులు ఆ స్వామి ఆలయాన్ని బంగారంతో నిర్మించినప్పుడు కలిగే పుణ్యఫలితం ధనహీనుడు మట్టితో కట్టించినా పొందగలుగుతాడు. అంటే శక్తివంచన లేకుండా ఎవరికివారు తమ శక్తిననుసరించి ఆ స్వామికి ఆలయ నిర్మాణం జరపవచ్చు.
డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
ఇంతటి చక్కని విషయములను వ్రాసిన  శ్రీమల్లికార్జునరావు గారికి ధన్యవాదములు.
జైహింద్.

20, డిసెంబర్ 2012, గురువారం

సోపాన దండకము: పండిత నేమాని.

2 comments

జైశ్రీరామ్. మిత్రులారా!
పండిత నేమాని.రామ జోగి సన్యాసిరావు కవి కృత ఉత్తరోత్తర అవరోహణ పూర్వక చతుర్వింశత్యక్షర సోపాన సంక్షేప రామాయణ దండకము.:రూపంలో ఉన్న 
(త్రిశత్యక్షర సంక్షేప రామాయణము) తిలకించండి.
రామ!
భూమీశ!
కౌసల్యజా!
సద్గుణస్తోమ!
కారుణ్యవారాశి!
ధర్మప్రభాభాసురా!
తాటక ప్రాణసంహార!
గాధేయ యజ్ఞావనోత్సాహ!
మౌనీంద్ర సంస్తుత్య వీర్యోన్నతా!
ధారుణీనందినీ మానసారామ!
దేవేంద్ర ముఖ్యామర స్తుత్య చారిత్ర!
కళ్యాణ శోభాన్వితానంద రూపోజ్వలా!
పైతృకాజ్ఞా ప్రకారాంచిత త్యక్తసామ్రాజ్య!
సోర్వీసుతా లక్ష్మణారణ్య సంవాస సంప్రీత!
ఘోరాటవీప్రాంత వాసర్షి బృందావనానందితా!
క్రూర దైత్యాంగనా దుష్ట కామార్తి విధ్వంసనోత్సాహ!
మాయామృగాకార మారీచ ఘోరాసుర ప్రాణసంహార!
ధాత్రీతనూజా వియోగాతి దుఃఖాగ్ని సంతప్త హృన్మందిరా!
అంజనాపుత్ర సంశుద్ధ వాగ్భూషాణానీక సంశోభితాత్మాబ్జ!
వాతాత్మసంజాత రంహత్సమానీత భూమీసుతా క్షేమ సందేశ!
సంగ్రామ రంగస్థ లంకాధినాథాది ఘోరాసురానీక సంహారకా! 
దేవతానీక దిక్పాల గంధర్వ యక్షోరగవ్రాత సంస్తుత్య సత్కీర్తి! 
విశ్వసర్గాది నాశాంతలీలా వినోదాభిరామా! నమస్తే నమస్తే నమః 
ఇందులోని విశేషములను చూచేరు కదా. 1 నుండి 24 అక్షరముల వరకు గల సోపానములతో నిర్మించబడినది ఈ దండకము. 
Sanyasirao.
చూచారు కదా? మీరూ ప్రయత్నించి వ్రాయండి.
జైహింద్.

18, డిసెంబర్ 2012, మంగళవారం

ఆశావాది అవధాన వినోదం- సరస ప్రసంగం.5 వ భాగము

2 comments

జైశ్రీరామ్. 
సాహితీ ప్రియబాంధవులారా!
అవధానాచార్య డా. ఆశావాది ప్రకాశ రావు కవి శిరోమణిని గూర్చి తెలియనివారుండరు.
అటువంటి అవధాని గారు చేసిన అవధానాలలో  అప్రస్తుత ప్రసంగములో చేసిన సరస ప్రసంగాలు మీ ముందుంచుతున్నందుకు ఆనందంగా ఉంది. పృచ్ఛకుని ప్రశ్న దానికి అవధాని గారి చతురోక్తులు 5వ భాగము  మీ ముందుంచుతున్నాను.
ఇక చూడండి.
41. పృచ్ఛకుఁడు:-మా భోజనం ఏర్పాట్లు ఎలాగున్నాయి?
        అవధాని:-అపాత్రంగా నిష్ఫలంగా ఉనాయి.
        పృచ్ఛ:-మీరు శ్రీనాధునిలా తప్పు పడుతున్నారు.
        అవ:-అబ్బే. అదేం లేదండి. విస్తర్లలో వడ్డించి అపాత్రం చేశారు.ఒక్క పండైనా ఇవ్వకపోవటంతో 
        నిష్ఫలమైంది.
42. పృచ్ఛ:-హాస్పటల్సులో రోగి ఆరోగ్యంపై డాక్టరు ప్రభావమా? నర్స్ ప్రభావమా? 
        ఏది ఎక్కువ ఉంటుంది?
        అవ:-నర్సు వచ్చినప్పుడు మాత్రం కాస్త కళ్ళు తెరుస్తూ ఉండటం, ఆమె చూచేటప్పుడు మాత్రమే 
        ఆ బీపీ పెరగటం జరుగుతున్న దృష్ట్యా ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంటుందో 
       మీరే ఊహించుకోండి.
43. పృచ్ఛ:-కోతికి నాతికి భేదం?
        అవ:-కోతి చంచలం, నాతి చలచ్చలం.
44. పృచ్ఛ:-మా పాఠశాల ఒక పాత కట్టడం. ఆకతాయి కుర్రాడు మిద్దెపైకి వెళ్ళే మెట్లపై కూర్చొని 
        ఉంటాడు.వాళ్ళను వదిలించే ఉపాయం చెప్పండి.
        అవ:-వాళ్ళు కూర్చొను చోట మెట్లు పడును జాగ్రత్త అని ఒక బోర్డ్ పెట్టండి. 
        వాళ్ళు తప్పుకుంటారు.
        (రాయలసీమలో మెట్లు అంటే చెప్పుయ్లు అని అర్థం)
45. పృచ్ఛ:-బ్రా ఓపెన్ యూనివర్సిటీ ఎక్కడుంది?
        అవ:-స్వామీ! అది బ్రా కాదుB.R.A అంటే బీ ఆర్ అంబేత్కర్ పేరున ఉన్న 
        యూనివర్సిటీ.ఎక్కడున్నా అక్కడ జీబ్రాలకు కోబ్రాలకు ప్రవేశం ఉండదు.
46. పృచ్ఛ:-కోతిగాడంటూ తిడితూనే కొందరు కోతిని పూజిస్తారెందుకు?
        అవ:-కోతి గాడ్ అనే నమ్మకంతోనే లెండి.
47. పృచ్ఛ:-పోలీసులకు చిక్కి కోర్టులో ప్రవేశ పెట్టబడిన ఒక వేశ్య అంతా నిజమే చెపుతా అని 
        నాది లవంగాలు వ్యాపారం . ఇది నిజమంటారా?
        అవ:-సందేహం అక్కరలేది. ఆమె నిజమే చెప్పింది. అక్కడ లవంగాలు అంటే లవ్ అంగాలు. 
        కాసుకోసం చేపట్టిన వృత్తి అని కాస్త తిరకాసుప్రదర్శించింది.
48. పృచ్ఛ:-సమాజంలో సంపన్నులు ఎవరు?
        అవ:-సం పన్.(చక్కని వాక్ చమత్కారము౦చూపే మీలాంటి వాళ్ళు.సం(కొంత౦పన్ను కట్టే 
        మన ముఖ్య అతిథి లాంటి వాళ్ళు.సం ( కొన్ని మాత్రమే)పన్నులు గల 
       నేటి నిషేధాక్షరి పృచ్ఛకులులాంటివాళ్ళు.ఇలా సంపన్నులు నాలుగు రకాలు.
49. పృచ్ఛ:-ఆరోగ్యం యావత్తు పోతే ఇక దిక్కెవరు?
        అవ:-ఆరోగ్య పదం యావత్తు పోతే ఆరోగం మిగులుత్య్ంది.ఆరోగః అంటే సూర్యుడు.
        ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్ అన్నరు కాబట్టి ఆయనే దిక్కు.
50. పృచ్ఛ:-పాలు కరుచుకొని తాగితే మేలా? ఎత్తుకొని తాగితే మేలా?
        అవ:-మధురాహారంబులు గొనుట తగదొక్కనికిన్.అంటుంది భారతం. 
        కాబట్టి పంచుకొని త్రాగితే మంచిది.
        పృచ్ఛ:-ఒంటరిగా ఉన్నప్పుడు?
        అవ:-బహుశా మీకు కరుచుకొని త్రాగటం, ఎత్తుకొని త్రాగటం ఇష్టంగా ఉన్నట్టుంది. 
        కాని నందాంగనా డింభకుడైన గోపాలుడుతన పాలివారందరికి పాలు పంచినట్లు 
        భాగవతం సాక్ష్యమిస్తోంది.
       (మరో మారు కలుసుకొన్నప్పుడు మరిన్ని ముచ్చటించుకొందాము.)
        సశేషం.
        జైహింద్.

17, డిసెంబర్ 2012, సోమవారం

జగద్గిరినగర్ ZPHSchoolలోవిద్యార్థులు ప్రదర్శించిన భువన విజయం.

2 comments

జైశ్రీరామ్.
విద్యార్థులకు భువనవిజయము శిక్షణ నిచ్చిన శ్రీచెన్నయ్య (దొరవేటి)మాష్టారికి సత్కారము.
భువన విజయ సన్నివేశము.
ఆర్యులారా!రంగారెడ్డి జిల్లా జగద్గిరినగర్ గ్రామమున గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఎంతటి అభినందనీయులో కదా!
మన మాతృ భాష అయిన తెలుగును అందరూ నిర్లక్ష్యం చేస్తున్న ఈ రోజుల్లో ప్రపంచ తెలుగు మహా సభలు జరుగుచున్న సందర్భముగా ఈ పాఠశాలలోని ప్రథానోపాధ్యాయిని, మరియు ఉపాధ్యాయుల అందరి సహకారంతో అక్కడ ప్రథానాంధ్రభాషా బోధకులైన శ్రీ చెన్నయ్య గారు మూడు రోజుల అతి తక్కువ వ్యవధిలో తమ పాఠశాలలో చదువుచున్న విద్యార్థినీ విద్యార్థులకు భువనవిజయము ప్రదర్శించుటయందు శిక్షణ నిచ్చి అత్యద్భుతంగా ప్రదర్శింప చేసి అందరి మన్ననలకు పాత్రులయారు. త్రికరణ శుద్ధిగా ప్రయత్నిస్తే మనమేపనైనా పూర్తి చేయటంలో విజయం సాధించ గలమనడానికి వీరి ఈ ప్రయత్నమే తార్కాణము. వారు ఈ కార్యక్రమానికి నన్నూ ఆహ్వానించారు. విద్యార్థుల నుద్దేశించి మాటాడమన్నారు.నన్ను సముచితంగా సత్కరించారు
ఈ కార్యక్రమము ఆద్యంతము విద్యార్థిలే నిర్వహించేవిధంగా శిక్షణ నిచ్చారు.
ఒక్క ఆంగ్ల పదమైనా రాకుండా అనేకమంది విద్యార్తులు పోటీపడి ప్రసంగించటం ఇక్కడ అత్యద్భుతంగా జరిగింది.
భువన విజయం ద్వారా అలనాటి కృష్ణ దేవరాయలు వారి సభా కార్యక్రమాలను కళ్ళకు కట్టించారు. ఈ ప్రదర్శనలో భాషకు తోడు ఆహార్యము కూడా ప్రశంసనీయంగా ఉంది.
ముఖ్యంగా పెద్దన తెలుగు సంస్కృత భాషలలో అలవోకగా కవిత్వమును గురించి చెప్పిన ఉత్పల మాలికను పెద్దన పాత్ర ధారి చక్కగా చదివటంతో ప్రేక్షకుల కరతాళధ్వనులకు అంతే లేదు.
ఇంతటి చక్కగా కృషి చేయించిన శ్రీ చెన్నయ్య గారు, కృషి చేసిన విద్యార్థులు అభినందనీయులు.
ఆరవ తరగతి చదువుతున్న ఒక చిన్న పాప ఒక సంగీర మేళవింపు కలిగిన పాటకు నాట్యము చేసి అందరికీ అబ్బురం కలిగించింది. ఇంతకీ ఆ అమ్మాయి ఏ గురువు వద్దా నేర్చుకో లేదట. కేవలం ఇంటిలో టీవీలో చూసి నేర్చుకున్నదట. ఆ అమ్మాయిని అభినందించనివారు లేరు.
అతి సర్వత్ర వర్జయేత్ హాస్య నాటకం కూడా అందరినీ ఆకట్టుకొంది.
అందరినీ హృదయ పూర్వకంగా అభినందిస్తున్నాను.
జైహింద్.

శ్రీమాన్ వల్లభవఝల నరసింహ మూర్తి కవి కృత కుండలి నాగ బంధ చంపకము

0 comments

జైశ్రీరామ్.
సుజనులారా! శ్రీమాన్ వల్లభవఝల నరసింహ మూర్తి కవి కృత కుండలి నాగ బంధచంపకమును వీక్షించండి.
మీరూ ఇలాంటి పద్యాలు వ్రాయటానికి ప్రయత్నించి చూడండి. 
జైహింద్

16, డిసెంబర్ 2012, ఆదివారం

ఆశావాది అవధాన వినోదం- సరస ప్రసంగం.4 వ భాగము

0 comments

జైశ్రీరామ్. 
సాహితీ ప్రియబాంధవులారా!
అవధానాచార్య డా. ఆశావాది ప్రకాశ రావు కవి శిరోమణిని గూర్చి తెలియనివారుండరు.
అటువంటి అవధాని గారు చేసిన అవధానాలలో  అప్రస్తుత ప్రసంగములో చేసిన సరస ప్రసంగాలు మీ ముందుంచుతున్నందుకు ఆనందంగా ఉంది. పృచ్ఛకుని ప్రశ్న దానికి అవధాని గారి చతురోక్తులు 4వ భాగము  మీ ముందుంచుతున్నాను.
ఇక చూడండి.
31. పృచ్ఛకుఁడు:-ఒక సభలో వెండి పళ్ళెరంలో సన్మాన సంభారాలు తెచ్చి ఇచ్చాక పళ్ళెం వెనక్కు 
       తీసుకు వెళ్ళుతుంటే ‘సపాత్ర దానం చెయ్యండి’ అన్నాను. ఆయన నన్ను అదోలా చూచారు. 
       ఎందుకంటారు?
        అవధాని:-అపాత్ర దానం చేస్తున్నాము అనలేక.
32. పృచ్ఛ:-మహిళా పరపతి సంఘంలో కాని, మహిళా వినియోగదారుల సంఘంలో కాని, 
       మీ రెప్పుడైనా సభ్యులుగా ఉన్నారా?
        అవ:-ఈ సంఘంలో నేనెందు కుంటాను? ఉంటే భార్యా బాధిత సంఘంలో ఉంటాను.
33. పృచ్ఛ:-మీరు కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి నెత్తిన ఎందుకు టోపీ వేసుకో దలిచారు?
        అవ:-మరొక్కరిచే టోపీ వేయించుకోవటం ఇష్టం లేక.
34. పృచ్ఛ:-మీకు క్షేత్రం ఏమాత్రం ఉంది?
        అవ:-నేనుగా దున్న గలిగినంత.
35 పృచ్ఛ:-వలి అనే పేరు గల ముస్లిమ్ అబ్బాయిని మీకిస్తాను. హిందూ అమ్మాయిగా 
       మార్చుతారా?
       అవ:-నేను సెక్స్ లేదా మతం మార్పిడి చేసే వాడిని కాను.
       పృచ్ఛ:-క్షమించండి అబ్బాయిని వేదిక మీదికి పట్టుకొని రావటం లేదు. అతని పేరిస్తాను 
       మార్చండి.
       అవ:-సంతోషం . మేము పదాలతో ఆడుకొనే వాళ్ళమని గ్రహించినందుకు. ఆ పేరు చివరి
       అక్షరానికి ద్విత్త్వం ఇవ్వండి. వల్లి అనే    
       హిందూ బాలిక ఔతుంది.
36. పృచ్ఛ:-ముందు బల్లపై వాలి పాఠం వినే కుర్రాణ్ణి ఎలా మందలించాలి?
        అవ:-నడుంలో బలం లేకపోతే ఏ అమ్మాయి పెళ్ళి చేసుకోదు అంటే సరి. నిటారుగా 
        కూర్చోవటం నేర్చుకుంటాడు.
37. పృచ్ఛ:-పన్ను వేసే అధికారి ఎలా ఉంటాడు?
        అవ:-అచ్చం మీలానే ఉంటాడు. మీరు ఫన్ వేస్తున్నారు కదా!
38. పృచ్ఛ:-ఆశావాదికి IAS మీద చూపని కొందరంటారు. మరి మీరేమంటారు?
        అవ:-నిజమేనండి. నాకు Idli.Allamchetni,Sambarఅంటే ఇష్టం.
39. పృచ్ఛ:-ప్రేయసే పెళ్ళామైతే ఎలాగ ఉంటుంది?
        అవ:-పెళ్ళికి ముందు అయస్కాంతం, పెళ్ళి తరువాత సూర్యాకాంతంలా ఉంటుంది.
40. పృచ్ఛ:-DEO జాతియ పక్షి ఏది? అన్నాడు. క్లాసులో ఎవరూ చెప్పలేదు. చివరి బెంచీలో 
        నిద్ర పోతున్న ఒకడు ఉన్నపళాన లేచి సరైన సమాధానం చెప్పాడట.ఎలా సాధ్యం?
        అవ:-ప్రక్కవాడు వాని జుత్తు లాగి ఉంటాడు. వాడు పీకాకు(లాగ వద్దు, పికాక్= నెమలి)
        అని ఉంటాడు. 
        (మరో మారు కలుసుకొన్నప్పుడు మరిన్ని ముచ్చటించుకొందాము.)
        సశేషం.
జైహింద్.

జుత్తాడలో అద్భుతంగా జరిగిన అష్టావధానం.

2 comments

జైశ్రీరామ్.
సాహితీ ప్రియలారా!
తే.09-12-2012.న విశాఖపట్టణం జిల్లా జుత్తాడ గ్రామంలో అవధాన చిశారద శ్రీ భద్రం వేణు గోపాలాచార్యులవారి అష్టావధానం జరిగింది.
ఈ కార్యక్రమ సంచాలకులు శ్రీ మెఱుగుమిల్లి వేంకటేశ్వరరావు.
పృచ్ఛకులు.
సమస్యాపూరణ:- శ్రీ బీ.కొండలరావు.
సమస్య:- తల్లిని పెండ్లియాడె తగు ధర్మము నిల్పగ రాముఁడిద్ధరన్.
అవధానిగారి పూరణ:-
ఉల్లము నుల్లసిల్ల మది ఊయల లూగ ప్రియమ్ము చేకురల్
చల్లని భావ భంగిమలు సాగిలి వచ్చిన దివ్య తేజమున్
మెల్లగ దండ వేసి, ఘన మేదిని జాతను సీత, మన్మధున్
తల్లిని పెండ్లియాడె తగు ధర్మము నిల్పగ రాముఁడిద్ధరన్.
దత్తపది:-
శ్రీ వల్లభవఝల శ్రీరామ చంద్ర మూర్తి
దత్తపదములు:- తులసి - మీరా - కబీరు - బీహారి.పదములె చేర్చి కృష్ణార్జునుల యుద్ధ వర్ణనము.
అవధానిగారి పూరణము:-
చేతులసితములు ధనువు చేత నలిగి 
విదితమీ రాజ శక్తియు భీకరమ్ము.
వెనుక బీరుకతలు లేవు వీరులకును. 
ఆ యదుకుల బిహారి నయమ్ము గూర్ప
కర్ణు వధియింపమనెను సంఘర్షణమున.
వర్ణనము. శ్రీమతి మంగిపూడి సుబ్బలక్ష్మి. విషయము:-పర్యావరణ పరిరక్షణావశ్యకత వర్ణన.
అవధానిగారి పూరణము:-
ఏదో రీతిని జీవితమ్ము గడుపన్ హేయంబుగా మారదే?
పాదోధల్ రసమున్ విషమ్ము గదురన్ భాగ్యంబు హీనంబగున్.
ఏదీ జాగృతి? మానవాళి కిలలో ఏ నాశముల్ కల్గునో?
కాదయ్యా నరులార! శ్రద్ధ వినరే. కావంగదే ధారుణిన్.
నిషిద్ధాక్షరి. శ్రీ వల్లభవఝల నరసింహ మూర్తి. విషయము:- హరిహరాభేదాన్ని కందంలో చెప్పండి.
నిషిద్ధములను విడిచి అవధాని గారు చేసిన పూరణము:- 
శ్రీ యుమతో వెలసెన్ శివ - మాయగ మానరు కదా ఉమా పః మ్రొక్కన్.
పాయక హరిహరు లొక్కట - సోయ్సగమై మనసు నిలిపి జుత్తాడ పురిన్.
పురాణ పఠనము:-శ్రీ జీ. రామయ్య రెడ్డి.
ప్రశ్నలు:-
౧)నల్లనివాడు, పద్మనయనమ్ములవాడు......
ఈ పద్యమూలము భావము వివరించండి.
అవద్ధాని గారు వివరించారు.
౨)చెప్పులోను రాయి  .... పద్యంలో భావం?
అవధాని వివరించారు.
ఉద్దిష్టాక్షరి. శ్రీ మల్లాది సోమ శేఖర శర్మ. ఇక్కడ వెలసిన ఉమా మల్లికార్జున స్వామికి ఆ పేరెలా వచ్చింది? 
అనుష్టుప్ లో అవధానిగారి పూరణము:-
ఉమా మహేశ వాల్లభ్యం లభతే కీర్తి రూపకం. - వందే రంమ్యం భవాంతకం భక్త రక్షణ కారణం.
ఘంటా గణనం. శ్రీ చదరం రత్నాలు. అవధానం ఆద్యంతం 12 పర్యాయములు మ్రోగింపగా అవధానిగారు చెపారు.
అప్రస్తుత ప్రసంగం.శ్రీ ప్రాత రాజ శేఖర్. అడిగిన అప్రస్తుతాంశాలన్నిటికీ అవధానిగారు సమాధానం నేర్పుతో ఓర్పుతో చమత్కారంగా చెప్పారు.
ఈ అవధానం పూర్తి కాగానే అవధాని గారికి గ్రామ పెద్దలు సముచితంగా సత్కరించారు.
ఈ అవధానం ఏర్పాటు చేసిన శ్రీ వల్లభవఝల నరసింహ మూర్తిగారిని కూడా గ్రామస్తులు సత్కరించారు.
అవధానానికి ఆ గ్రామస్తులే కాక చోడవరం గ్రామస్తుకు, పెద్దలు, విజయ భావన సాహితీ సమాఖ్య సభ్యులు ఇంకా పెక్కుమంది వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
కార్యక్రమం మంగళాంతమయింది.
జైహింద్.

14, డిసెంబర్ 2012, శుక్రవారం

తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. రచన శ్రీ n rahamthulla

1 comments

జైశ్రీరామ్.
తెలుగు భాషాభిమానులారా! మన సాహితీ బంధువు శ్రీ n rahamthulla గారు ఈ విధంగా అన్నారండి

తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రఖ్యాత హేతువాది,కవిశ్రీ ఆకురాతి గోపాలకృష్ణ గారు
"తెలుగు అధికార భాష కావాలంటే.." ,"తెలుగు దేవ భాషే" పుస్తకాలలోని నా ఆవేదనలూ, అభ్యర్ధనలూ ఈ శతకంలో 103 పద్యాలలో కూర్చారు.ఈ శతకాన్ని ప్రింటు చేయించి సభలో ఉచితంగా పంచుతాను.అన్ని పత్రికలకూ పంపుతాను.ఈ పద్యాలను తెలుగు మిత్రులంతా విస్తృతంగా వాడండి.వాడవాడలా వినిపించండి.సవరణలు సూచించండి.

1. పాలనాధికార పగ్గాలతో, పేద
బ్రతుకు తెరవొసంగు బాటలన్ని
ఒరులకిచ్చి వారికూడిగం సేతువా?
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

2. ప్రాచ్యభాష యెదిగి ప్రాంతీయ భాషకు
ఊపిరంద నీక యుసురు తీసె
మ్రింగి వేసెగా తిమింగ్ల రూపును దాల్చి
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

3. ప్రాణ వాయు వాంగ్ల భాషకే అందిస్తె
మాతృభాష కింక మనుగడేది ?
గొప్పదైన పాము కప్పను మ్రింగదా ?
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

4. కొంప పెత్తనమ్ము ఉంపుడు గత్తెకా ?
ఎంత దారుణమ్ము ? ఎంత తెగవు ?
తల్లి సవతి యైన పిల్లల భవితేమి ?
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

5. పసి వయస్సులో పరభాష చొప్పించి
లేత మెదడు మీద వాత లిడకు
పులుల స్వారీ పగటి కలలు గావింపదా ?
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

6. అమ్మవడిని మాన్పి అతిచిన్న బిడ్డల
సవతి కప్పగించి సాకమనిన
ముప్పు . సవతి మనను చెప్పు నాకింపదా?
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ
7.మత పెంచుకొనగ మమ్మీలు, డాడీలు
కుమ్ముచుండే తల్లి రొమ్ము మీద
ముద్దు సేయ దివిటీ మూతి కాల్చిన రీతి
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

8. తమిళము మలయాళ తల్లులకీనాడు
బిడ్డలిచ్చుచున్న పెంపు చూడు
తల్లిభాష నీకు తగనిదై పోయెనా?
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

9. పరుల భాష నెంత పాండిత్యమున్ననూ
భావ వ్యక్తనమున భ్రష్టు పట్టు
అలవిగాని బండ తలకెత్తుకున్నట్లు
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

10. అట్టహాసమైన ఆంగ్ల వక్తల మధ్య
తెల్లబోయి మిగులు తెలుగు వక్త
సానిడాబుగాంచి జంకెడి భార్యలా
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

11. యెల్ల వనరులున్న తల్లి భాషీనాడు
బ్రతుకు యవని బ్రహ్మ రక్కసల్లె
కానుపించు చుండ కనికరించునెవరు?
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

12. దేశభాషలందు తెలుగు లెస్సన్నట్టి
కృష్ణదేవరాయ కీర్తి వెలుగు
న్ని దిశల చాటి వన్నె కెక్కిన భాష
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

13. చరితలోన తగిన సాహిత్య ప్రాచీన
ప్రతిభ కల్గినట్టి ప్రముఖ భాష!
కన్న తెలుగు తల్లి ఉన్నతిన్ గాపాడు
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

14. ఇంపు చేయవచ్చు కంప్యూటరందుండు
అచ్చరాల బెడద ఖచ్చితముగా
అలవికానిదంటు అన్వేషణకు లేదు
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

15. ఉన్నలోపములను తిన్నగా సవరించి
తల్లి భాష నెలమి తీర్చిదిద్ది
అప్పగింపవోయి అధికార పీఠమ్ము
తెలివి తెచ్చుకోని తెలుగు బిడ్డ

16. దేశ భాషలందు తేజరిల్లిన తెల్గు
వాసి తగ్గి ఆంగ్ల దాసి యయ్యె
కుక్క వాత పడ్డ బక్క సింహము భంగి
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

17. ఆంగ్ల సంస్కృతాల నాలింగనము గొని
సరకుగొనని తెలుగు సన్నగిల్లె
కూరుచున్న కొమ్మ కూలిపోవునిజము
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

18. అచ్చ తెలుగు వదలి ఆసంస్కృతంబునే
మంత్రములకు వాడు తంత్రమేమి ?
శ్రేష్టమైన వృత్తి చేజారుతుందనా ?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

19. తెలుగు దేశ బిడ్డ తెలుగు పండిత పోష్టు
ఆంగ్ల భాషలోన ఆర్డరేసి
అచ్చ తెనుగు వాని బిచ్చమెత్తింతురా?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

20. అన్యదేశమందు ఆంధ్రులిర్వురు కల్వ
మాత్రు భాష దాచి మసులు కొండ్రు
మనిషి దాచు కొనెడి మర్మాంగ జబ్బల్లె
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

21. ఆంధ్రభాష మనకు అధికారి యైయింత
అన్నమిచ్చుననెడి ఆశయుం
ఆంగ్లమిచట జేరి అడియాశ జేసెరా
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

22. అర్ధమవని భాష కధికార మందించ
బడుగు మూకనెల్ల పారద్రోలి
కనక పీఠమందు శునకమై వర్ధిల్లు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

23. రూకలిచ్చు భాష కాకతో నేర్చేరు
యేమి యీయకున్న నెవరు నేర్చు?
పాలు యివని పశు కబేళాల కర్పితం
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

24. మిసిమి కల్గు కవుల పసిడి పల్కుల తల్లి
సిరుల రాజసమ్ము తరిగిపోయె
తిరుమలేశుని నగరువు కేగిన రీతి
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

25. పేద తెలుగు వారు పిరియాదు లందీయ
ఆంగ్లమందు తీర్పు లదరగొట్టు
కోతి కాపరైన కొబ్బరి కాయల్లె
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

26. స్వంత భాష నున్న సౌలభ్య మెప్పుడూ
అన్యభాష చేత నంద లేము 
తల్లిప్రేమ, మారు తల్లిలో దొరకునా ?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

27. ఆంగ్ల భాష సుంత అలవడినంతనే
తెలుగు నీసడించు పులుగు లార!
యేరు దాటి తెప్ప నేల తగలేతురు ?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

28. వెర్రి తెలుగు కవికి యెర్ర పైసా కూడ
రాల్చు దిక్కు లేదు రాష్ట్ర మందు
తనదు వ్రాతె తనకు తల కొర్వి యగుచుండె
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

29. ఇంచుమించుగా ప్రపంచ వ్యాప్తంబుగా
పదునెనిమిది కోట్ల ప్రబలమైన
సంతు యుండు తల్లి కింతన్యాయమా ?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

30. అష్ట దిగ్గజాల హావభావాలతో
కృష్ణ దేవరాయ కీర్తి గాంచె
తెలుగు వైభవమ్ము తిరిగి వచ్చునెపుడొ?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

31. పొరుగు భాష తనకు భుక్తి కల్పించినా
తనదు మాతృభాష దైన్యతఁ గని
కఠిన ఆకురాయి కరిగి ఆక్రోశించె
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

32. తెలుగు ఉద్యమాన్ని తెగువతో చేపట్టి
లౌక్యమౌ పధాన రహంతుల్లా
గారు,బండి ముందు కరదీపికై నిలిచే
(బండి ముందు నడుచు బంటు తానై నిలిచే)
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

33. అంటు వ్యాధి వోలె వ్యాపించి దేశాన
ఆంగ్ల మోజు ప్రజల కంట గట్ట
కాని వెంట్లు వెలసె కడగండ్ల ప్లాంట్లుగా
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

34. తెలుగు నేల మీద తెలుగు బిడ్డే తెల్గు
ఉచ్ఛరింప, పట్టి శిక్షవేయు
బంటు పెత్తనమ్ము ఇంటి కెగ బ్రాకెనా?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

35. మిసిమి కోలు పోయి పసిడి బాల్యంబున
బండబారు చుండె భరత జాతి
కానివెంట్లు జైళ్ళు, ఖైదీలె పిల్లలై
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

36. అమ్మ యనెడి తెలుగు కమ్మని పిలుపును
మమ్మి వచ్చి చేరి మట్టు పెట్టె
మేక వన్నె పులిని సాకిన ఫలమిది.
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

37. పదవి నున్న వారు పలుకరు స్కూళ్ళ, ని
ర్లక్ష్యమందు తెనుగు లైను దప్పె.
దిక్కు లేని శిశువు కుక్క పాలైనట్లు.
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

38. మొదటి తరగతందె ముదనష్ట పింగ్లీషు
తెలుగు భాష గొంతు నులుముచుండె
చంటి బిడ్డ కెపుడు చనుబాలె కావలె.
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

38. చంటిబిడ్డ త్రాగు చనుబాలురా తెల్గు
అమ్మ రొమ్ము విడచి ఆంగ్లమనెడి
ఖరము చన్ను గుడుచు ఖర్మ పట్టింపకు.
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

39. ప్రధమ విద్య మాతృ భాష యందున్నచో
గట్టి పడును బేసు మట్టమెపుడు
పై తరగతులందె పరభాషలకు చోటు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

40. తెలుగు మీడియమ్ము తెలుగు విద్యార్థికి
చదువు కొనుట మిగుల సౌఖ్యమగును.
ఇంపిత మగుదారి కంప కొట్టించిరే!
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

41. గుండెలోని బాధ దండిగా వివరింప
మాతృభాష యొకటె మహిని చెల్లు
మనసు దోచు పండు మామిడే యన్నట్లు.
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

42. తెలుగు నేల మీద తిన్నగా జన్మించి
తెలుగు పాలు త్రాగి తెలుగు తల్లి
రొమ్ము మీద గుద్దు రోమియోగాకుమీ!
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

43. మొద్దు భాష వచ్చి గద్దెపై కూర్చుండ
మాతృభాష నోట మన్ను పడును
పక్షి గూటి లోకి పాము జొచ్చినయట్లు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

44. రుల కిచ్చి పొలము వారి వద్దే కూలి
చేయబోవు టెంత హేయ కరము
ఆంగ్ల ఆధిపత్యమటువంటిదే గురూ!
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

45. ఇరుగు పొరుగు భాష కిస్తున్న మర్యాద
తెలుగు కివ్వ రేమి తెగులొ మనకు?
పేద కన్నిచోట్ల వేదనే యెదురగు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

46. విధినెఱింగి నేటి అధికార గణమంత
ఆంగ్ల భేషజాన్ని అట్టె వదిలి
తెలుగు ఉచ్చరింప తిరిగి రాదా గతం?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

47. అమెరికాకు బోవు ఆ నల్గురి కొకు
ఆంగ్ల బండ నెత్తిరందరికిని
ఉత్త సూది కొ
కు ఎత్తకు దూలాన్ని
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

48. పరుగు లెత్తి యచట పాలు ద్రావే కంటె
నిలబడింట త్రాగు నీరు మేలు
అమెరికాల కేగి యగ చాట్లు పడ నేల
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

49. చదువు చక్కనైన సంస్కార మమరిన
అందమైన తెలుగు ఆడపిల్ల
కన్ని యుండె, యిప్పు డయిదవ తన మిమ్ము.
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

50. సర్వమతము లందు సలిపెడి ప్రార్ధనల్
స్వీయ భాషలందు చేయరేల
దేవుడితరభాష తెలియని మూర్ఖుడా ?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

51. ఆంధ్రముస్లిములను అరబె ఆకర్షించె
సంస్కృతమ్ము తెలుగు జాతి నొంచె
బల్లి యొడిసి పట్టు బలహీన జీవులన్.
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

52. రక్తి చూపకుంటె ముక్తి సున్నాయంచు
భక్త తతికి త్రొక్కి పట్టి నేర్పు
మౌఢ్యమతపు భాష మర్మంబు తెలుసుకో
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

53. శాస్త్ర యుక్తమై సంస్కృతంబే మన
తెలుగు భాష మీద తిష్ట వేసి
కొలువు తీరినట్టి గోముఖ వ్యాఘ్రహం
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

54. వేల యేండ్ల నుండి విలువైన గ్రామీణ
పారిభాషికాల పట్టరైరి
ఎక్కడున్న గొంగళక్కడే నన్నట్లు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

55. మాతృభాష పల్కి మహనీయుడైనట్టి
సత్య సాయి గొప్ప చరిత చూడు
నేల విడిచి సాము మేలు కాదెఱుగుమా.
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

56. లోటు పాటులున్న, నీటుగా సవరించి
పాటు చేసి తెలుగు మీట నొక్కు
ఎలుకలున్నవంచు యిల్లు తగలేతుమా?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

57. ఏబి సీడి లప్పు డే శివాజీకొచ్చు?
ఆంధ్ర భోజుకేమి ఆంగ్లమొచ్చు?
కోడికూయకుంటె కొంప తెల్లారదా?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

58. జన్మమిచ్చినట్టి జననిగా వేనోళ్ళ
పొగడగానె తల్లి దిగులు పోదు
పూజసేయ గోవు పుష్టికి నోచునా?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

59. భక్తి మహిమ పెంచు భారత, రామాయ
ణాది కావ్యధారలందు తడి
తెలుగు నేలపైన వెలుగు లీనిన భాష
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

60. బడుగు భాష యనుచు బాణాలు సంధించి
తెనుగు తల్లి యుసురు తీయబోకు
నిందమోపి సతిని బొంద పెట్టిన రీతి
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

61. చిన్న చూపదేల చీదరింపదియేల?
తెలుగు తల్లి మీద ద్వేషమేల?
ఆంగ్లకోటు దాల్చి అధికుడ ననుకోకు.
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

62. మాతృభాష నొదిలి మరియొక భాషపై
కాలుమోపు వాడు కలత చెందు.
నాటు పడవ నొదిలి ఓటి పడవెక్కకు.
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

63. చిన్నతనము నందె కన్నతల్లిని వీడి
అన్యదేశవాస ఆంధ్రులెల్ల
తెలుగు దైన్యమునకు దిగ్బ్రాంతి చెందిరి.
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

64. అర్ధమవని భాష అధికార మందుం
అనువదించి తెల్పు అల్పులైన
మాయ మోసగాళ్ళు మనకొంప ముంచరా?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

65. పాలనాధికార పగ్గాలు చేపట్టి
సాటిభాష లన్ని సాగు చుండ
తల్లి తెలుగు భాష దాస్యమే విడదాయె.
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

66. సకలమైన యితర జాతి పదాలతో
సంకరించె నన్న శంక పడకు
యెట్టిదైన పిల్లి  యెలుకను పట్టును.
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

67. రాజపీఠమందు రంజిల్లు భాషకు
మతపు భాషలకును క్షితి లేదు
ప్రాణ హానియెపుడు ప్రాంతీయభాషకే
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

68. వట్టిమాట లంచు కొట్టిపారేయక
పట్టుతోడ బుద్ది పదును చూపి
మేలు చేయు భాష నేలిక చేసుకో
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

69. వచ్చి రాని ఆంగ్ల భాషతో కుస్తీలు
పట్టు లెక్చరర్ల బాధచూడు
నక్కలకును ద్రాక్ష నిక్కితే అందునా ?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

70. మాతృదేశ మహిమ మరువకు మరువకు
మాతృభాష ప్రతిభ ‘మబ్బువీడి
వెల్లివిరిసి నపుడె’ యిల్లు స్వర్గంబురా
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

71. దేశమేమొ తెలుగు దేశీయులును తెల్గు
అమలు చేయు వారలంత తెలుగు
ఆంగ్ల భాషకేల అధికార పీఠమ్ము?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

72. ప్రజల నోళ్ల నుండు భాషోన్నతిన్ పొందు
ప్రజకు దూరమైన భాష చచ్చు
దివ్వె 
తైలమవగ తిన్నగా కొండెక్కు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

73. ఒరుల గొప్ప చూచి పరవశించుట మాని
స్వంత జాతి ప్రతిభ చాటనెంచు
కుంటి వాడయినను యింటి బిడ్డే మేలు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

74. ఆంగ్ల భాషయేమొ అసలు నేర్వను రాదు
తెలుగు చదవ బ్రతుకు తెరవు లేదు
సొంత కూడు పాయె బంతి కూడూ పాయె.
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

75. ఆలయాల పూజ కర్హత లేదని
తెలుగు మంత్రములకు విలువ నీరు
తెలుగు రాని వాడు దేవుడెట్లాయెనో
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

76. కామధేను వంటి కమ్మని తెలుగుండ
ఇంగిలీషు నెత్తి కెత్తుకోకు
గంగి గోవు నొదిలి గాడిద కొలుతురా?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

77. బానిసత్వమందు బ్రతికిన జాతికి
తగ్గదాయె మోజు దాస్యమందు
పోదు బిడ్డతోనె, పురిటి కంపన్నట్లు.
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

78. ఆంగ్ల భాష మీద అభిమానమున్ బెంచి
తెలుగును విడనాడు తెగువ యేల ?
ఆలి దొరకెనంచు అమ్మను చంపకు.
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

79. తేనె లొలుకు నట్టి తెలుగును విడనాడి
గొంతు దిగని ఆంగ్ల చింతయేల?
అక్షయమ్మునొదలి భిక్షెత్తు కొన్నట్లు.
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

80. లిపిని సంస్కరించి అపర వజ్రమ్ముగా
తీర్చి దిద్ది చూడు తెలుగు భాష.
రాజ పీఠమునకె తేజస్సు నందించు.
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

81. ఇంటనింగిలీషు ఇల బళ్ళ నింగ్లీషు
తల్లి భాష విలువ తరుగుచుండె.
చుప్పనాతి ప్రభుత చోద్యంబు కనుచుండె.
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

82. కంటిపాప వోలె కాపాడగల బిడ్డ
గనిన రీతి, నిద్రననుసరించ
మాతృ మూర్తి కింక మరణమే శరణము
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

83. స్వంత తల్లి నగలు, సవతికి అందించి
బాధపెట్టు సుతులు బ్రతుకనేల
మాతృభాష ద్రోహ మగు నిట్టిదే  సుమీ!
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

84. బలసినట్టి భాష, బలహీనమగు దాని
యిట్టె మింగి వేసి గుట్ట గూల్చు
తెలుగు భాష కిట్టి స్థితిని రానీయకు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

85. ఆంధ్ర ప్రభుత తెలుగు కంగీకరించినా
పెక్కు ఆఫీసర్లు లెక్క గొనరు
పారునీళ్ళ కెపుడు పాచి తెగులన్నట్లు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

86. తెగులుపట్టినట్టి తెలుగు బిడ్డల్లోని
అంతరించినపుడె ఆంగ్లతిక్క
మాతృభాష కొచ్చు మంచి రోజానాడు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

87. ఇళ్ల లోనె కాదు బళ్లలో గుళ్లలో
కోర్టులందు ప్రజల హార్టులందు
చోటు గొన్న భాష సుస్థిరమై నిల్చు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

88. ఆంగ్లముండు వారి కన్ని ఉద్యోగాలు
తెలుగు భాష కింక విలువ యేది
అద్దె వాడికిల్లు అసలు వాడికి నిల్లు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

89. లోకమార్పు తోడ పోకడ మారాలి
మారనట్టి దెల్ల మరణ మందు
తెలుగు తల్లి కట్టి స్ధితిని పట్టింపకు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

90. అన్ని చోటుల ప్రజ లెన్నో తరంబులు
కూర్చుకున్న భాష కూలెనేని
భాషతోడ జాతి భవితయు కూలదా?తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

91. ఆంధ్ర భాషకన్న ఆంగ్లమే నచ్చెనా?
చదివి నీవె అందు చతురు డగుము
ఆంగ్ల గజ్జి తెచ్చి అంటింప కెవరికీ 
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

92. తెలుగు వేషమెల్ల తెలుగు వేదికలందె
వేదికలను దాటి వెలికిరాదు
ఆంగ్లమైక మందె ఆఫీసు గణముండు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

93. అసలు చిత్త శుద్ది ఆఫీసరులకున్న
తెలుగు కూడ మంచి స్ధితి గడించు
మెత్త నయిన రౌతు నర్తించు గుర్రాలు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

94. విలువ తరిగినట్టి తెలుగు మీడి
మెంచుకున్నవాడు కించవడును.
మిటీ పరీక్ష యెన్నాళ్ళు ఈశిక్ష?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

95. అరచి పిలువగానె అక్బరు పాదుషా
చచ్చిపోయెను కదా వచ్చు టెట్లు?
అర్ధమవని భాష తర్జుమా యిట్లుండు.
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

96. పట్టిమూఢ మతము వల్లించు ప్రార్ధనల్
పాత భాషలోనే వాతలిడును
అర్ధమవని ఘోష వ్యర్ధ ప్రయాసరా!
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

97. సకల మతములందు సమభావ దృష్టితో
తెనుగు భాష యున్నతికి తపించు
రహ తుల్ల గారి తహతహ గుర్తించు!
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

98. బడుగు తెలుగు భాష పాలింప యోగ్యమా?
సాద్యమెట్టు?లనక సదయు లగుచు
నూరు భా గారి తీరు నేర్చుకో!
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

99. అరయ యూనికోడు కందరూ క్రమముగా
మారి మాతృభాష మనుగడకును
సహకరించినపుడె సంపూర్ణమగు వృద్ధి.
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

100. కన్నతల్లి కింత గంజి పోయుట మాని
సానికొంప మరిగి చంపజూచు
బిడ్డలున్న పురిటి గడ్డ కాదీ భూమి.
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

101. పూర్వరాజసాన పుట్టి పెరిగెనిది
ప్రజలు రే బవళ్ళు పలుకు భాష
కవుల గంటమందు కదము త్రొక్కిన భాష
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

102. ఆంద్రదేశ ప్రభువు లధికార పీఠాన
తెలుగు తల్లి పటిమ తీర్చి దిద్ది
నిలుప కలుగు వరకు నిద్రపోవగ రాదు.
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

103. పరుల పాలనమ్ము పనికి రాదంటి మే
వారి భాష పట్టి వదల రేమి?
ఉడిగమ్ము కింత ఉబలాటమెందుకో ?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

-- ఆకురాతి గోపాలకృష్ణ A .S. పేట ,నెల్లూరు జిల్లా -524304 ఫోను.9493513850.

చూచారు కదండీ! ఎంత సరళమైన, సరసమైన ఆట వెలదులను తెలుగు భాషామతల్లికి తన బిడ్డల కందించడం కోసం అందించారో! మీరు కూడా మీ భాషాభిమానాన్ని సూచించే చక్కని ప్రయత్నం చేయడం మాత్రం మానకండి.శుభమస్తు.
జైహింద్.