గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, మే 2024, మంగళవారం

అక్షర బ్రహ్మము.

జైశ్రీరామ్.

అక్షర బ్రహ్మము.

1‘అ ఇ ఉ ణ్’ (అకార, ఇకార, ఉకారాలు)

2‘ఋ లు క్’ (ఋకార అలుకారాలు)
3‘ఏ ఓం గ్’ ( ఏకార, ఓకారాలు)
4‘ ఐ ఔ చ్’ (ఐ కారము, ఔ కారము)
5‘హ య వ ర ట్’ (హకార, యకార, వకార, రకారాలు.)
6‘ల ణ్’ (లకారం)
7‘ఙ, మ, ఞ, ణ నం’ ( వర్గల యొక్క చివరి ఐదు అక్షరాలు )
8‘ఝ, భ య్’ ( ఝాకార, భకారాలు)
9‘ఘ,ఢ,ధ ష్’ ( ఘకారం, ఢ కారం, ధకారం)
10‘జ, బ, గ, డ ద శ్’ ( ఐదు అక్షరాలు )
11‘ఖ ఫ ఛ ఠ థ చ ట త వ్’ ( ఎనిమిది అక్షరాలు)
12‘క ప య్’ (క & ప )
13‘శ ష స ర్’( శకార, షకార,సకారాలు )
14‘హల్’ ( హకారం)

“ఇతి మాహేశ్వరాణి సూత్రాణి” ఈ పదునాలుగు మహేశ్వరుని సూత్రాలు. ప్రతి సూత్రం చివరఉన్న పొల్లు హల్లులు సులభంగా పలకడానికి నిర్దేశించబడినవి. అట్లే అచ్చులు, హల్లులు కూడ ప్రత్యాహార సంజ్ఞతో సులభంగ అర్థమయే రీతిలో నిర్దేశించబడినవి. అవి తొలి సూత్రములోని మొదటి అక్షరం ‘అ’ నాల్గవ సూత్రములోని చివరి హల్లు ‘చ్’ కలిపితే ‘అచ్’ సంజ్ఞ ఏర్పడి, వాటిమధ్య ఉండే అక్షరాలని ‘అచ్చులు’ అని వ్యవహరించెదరనియు, ఐదవ సూత్రములోని మొదటి అక్షరం ‘హ’ని గ్రహించి పదునాల్గవ సూత్రములోని చివర ఉన్న ‘ల్’ అనే పొల్లుతో కలిపితే ‘హల్’అనే సంజ్ఞ ఏర్పడి వాటి మధ్య ఉండే అక్షరాలని ‘హల్’ అనే పేరుతో పిలుతురని పాణిని విపులముగా వివరించెను. ఇట్టి సూత్రములతో ఎనిమిది అధ్యాయాలలో పాణినిచె రచించబడిన తొలి వ్యాకరణ గ్రంథానికి “అష్టాధ్యాయి” అని పేరు. ఈ సూత్రాలకే ‘వరరుచి’ వార్తికాలని, “పతంజలి”భాష్యాన్ని విరచించి లోకానికి ప్రసాదించిరి. భాషాశాస్త్ర వేత్తలకి ఇప్పటికీ ఇదే గొప్ప ప్రామాణిక గ్రంథము.

ఇక అక్షరాలని ఎలాపలుకుతామో ఇప్పుడు తెలుసుకొందాం. ముందుగా సంస్కృత సూత్రాలని తెలిపి, వాటిని తెలుగులో వివరిస్తాను.

“అకుహ విసర్జ నీయానాం కంఠ:” అ ఆ లు, కవర్గ, హకారమూ,విసర్గలు,అనే అక్షరాలు కంఠము నుండి వెలువడి పలుకబడతాయి.

“ఇ చు యశానాం తాలు.” ఇ ఈ లు, చవర్గ, యకారము, శకారము తాలువు అనగా నాలుకతో పలుకబడతాయి.
“ఋ టు ర షాణామ్ మూర్ధా” ఋకారము, టవర్గ, రకారము, షకారము అనే అక్షరాలూ పలికేటప్పుడు శబ్దం శిరస్సునుండి వెలువడుతుంది. మూర్ధా అంటే శిరస్సు.

“ లు తు ల సనామ్ దంతాః” అచ్చులలోని అలూ అనే అక్షరం, తవర్గ, లకారము, సకారము దంతముల సహాయముతో పలుకుబడతాయి.
“ఉ పూప పద్మానీయానాం ఓష్టౌ” ఉ,ఊలు, పవర్గ పెదవులతో పలుకబడతాయి.
“ ఙ మ ఞ ణ నానాం నాసికాచ” వర్గల యొక్క చివరి అక్షరములు ఐదు నాసిక అంటే ముక్కు. అవి ముక్కుతో పలుకబడతాయి.

“ఏ దైతో: కంఠ తాలు” ఏకారము, ఐకారము కంఠము, నాలుక సాహాయముతో పుడతాయి.
“ ఓ దౌ తో: కంఠ, ఓష్ట్యం” ఓ మరియు,ఔ అనేఅచ్చులు కంఠము, పెదవుల కలయికతో పుడతాయి.
“ వ కారస్య దంతోష్ట్యం” వకారము దంతములు, పెదవుల సాహాయముతో ఉచ్ఛరించ బడుతుంది.

అక్షరాల పుట్టుకని, వాటిని పలకడానికి ఉపయోగపడే స్థానాలని ‘పాణిని మహర్షి’
ఎంత విపులంగా వివరించాడో! ఇంకా వీటికి “స్వరాలని,వ్యంజనాలని, ప్రాణులని, మహాప్రాణులని ఇలా అక్షరాలకి రకరకాల పేర్లు పెట్టి అవి ఉచ్చారణలో ఎలా ఉపయోగ పడతాయో తెలియజెప్పిన ఋషుల గొప్పతనాన్ని తెలుసుకొని వారిని నిత్యం స్మరించుకోవడం మన విధి.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.