గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, మే 2024, శుక్రవారం

అష్టోత్తరశత రాఘవ నామాంచితాష్టోత్తరశత ఛందముల రాఘవా శతకము రచన .. చింతా రామకృష్ణారావు.

 

ఓం శ్రీరామ.

అష్టోత్తరశత రాఘవ నామాంచితాష్టోత్తరశత ఛందముల

రాఘవా శతకము

రచన  ..  చింతా రామకృష్ణారావు. 

. ఓం శ్రీరామాయ నమః.

శార్దూలవిక్రీడితము (మ స జ స త త గ. యతి ౧౩)

శాII  శ్రీమన్మంగళ దేవదేవ! శుభదా! *శ్రీరామ!* సన్మంగళం

బౌ మాన్యంబగు నీదు మార్గచరులౌ భవ్యాత్ములౌవారికిన్,

బ్రేమన్ నీ సుచరిత్రపాఠకులకున్, శ్రీరామ భక్తాళికిన్,

నీ మంత్రాక్షర నామ పద్యములనన్ నీ తేజమే రాఘవా!

 

. ఓం శ్రీ రామభద్రాయ నమః.

అతిశక్వరి (ర-జ-ర-జ-ర యతి 9)

సౌమ్యరూప! సుస్వభావ సారమీవె చూడగా,

గమ్యమేది మాకు? చూపి కావు భద్రతప్రదా!

సామ్యమెన్న లేదునీకు సన్నుతాత్మ సంస్తుతుల్,

రమ్య సద్గుణప్రదుండ! *రామభద్ర!* రాఘవా!

 

. ఓం రామచంద్రాయ నమః.

విభూతి (ర జ గ)

*రామచంద్ర!* తాటకిన్

నేమమొప్ప కూల్చితే!

నీ మనోజ్ఞ జన్మమే

క్షేమదంబు, రాఘవా!

 

. ఓం శాశ్వతాయ నమః.

ఉత్సుకము (భ భ ర)

శ్రీకరమై భువి చెల్గు ని

క్ష్వాక కులప్రభ! *శాశ్వతా!*

నీకిల సాటిఁక నీవె, ధీ

రా! కమలాక్షుఁడ! రాఘవా!

 

. ఓం రాజీవలోచనాయ నమః.

నారాచము (త ర వ)

*రాజీవలోచనా!* హరీ!

స్త్రీజాతిఁ గావుమా భువిన్

పూజింత్రు భక్తితో నినున్,

రాజీవె కావ, రాఘవా!

 

. ఓం శ్రీమతే నమః.

కౌముది (న త త గ.  యతి ౬)

ధరణి *శ్రీమంత!* నిన్ గొల్చినన్

నిరుపమా! శాంతి కల్గున్ గదా,

శరణమన్నన్ జయప్రాప్తియౌ

వరద! రక్షింపవా రాఘవా!

 

. ఓం రాజేంద్రాయ నమః.

అంగజాస్త్రము (..పాదములకు - భ మ స గ. యతి ౬   

                  ..పాదములు - మ స జ గ.  యతి ౬)

వ్రాసిరి *రాజేంద్రా!* కవులెన్నో

భూషగ కావ్యంబుల్ తగ నీపై

ధ్యాసన్ నే శతధా రచింపగా

నాసన్ బూనితినయ్య రాఘవా!

 

. ఓం రఘుపుంగవాయ నమః.

అపరాజిత (న న ర స వ. యతి ౯)

అగణిత *రఘుపుంగవా!* యసురాంతకా!

సుగుణుల నిలఁ బ్రోచుచున్  గను దైవమా!

బ్రగణిత గుణ మీయవా, సురపూజితా!

నిగమ విదిత! పావనీ నుత రాఘవా!

 

. ఓం జానకీవల్లభాయ నమః.

నదీప్రఘోషము.

      (౧వ పాదమున (స్రగ్విణి) ర ర ర ర. యతి ౭

      ౨వ పాదమున (వంశస్థ) జ త జ ర. యతి ౮

      ౩వ పాదము (భుజంగప్రయాత) య య య య. యతి ౮

      ౪వ పాదము (ఇంద్రవంశ) త త జ ర.  యతి ౮)

*జానకీ వల్లభా!* సత్యవాక్యప్రియా!

మనంబు నీపైననె మన్ననంబునన్

మనంగా వరంబున్ రమానాథ! యిమ్మా!

జ్ఞానంబుతోఁ గొల్తు, నగణ్య! రాఘవా!

 

౧౦ . ఓం జైత్రాయ నమః.

క్షమ (క్షప) (న న త త గ.   యతి ౮)

కనితివి శబరిన్ కన్నులన్ *జైత్ర!* ని

ల్పి, నిజ మరయ నీవే కృపన్ ముక్తినే

ఘనముగనిడి, లోకాన నీవే ఘనం

బనగనిలిచినావా! హరీ! రాఘవా! 

 

౧౧ . ఓం జితామిత్రాయ నమః.           

      చారుహాసికి (ప్రవర్తిక - పరాంతిక)

      (౧వ పాదమున- / యతి .

      ౨వ పాదమున- / యతి .

      ౩వ పాదమున- / యతి .

      ౪వ పాదమున- .   యతి )

భజన చలుప నేరనయ్య నే

నిజమెన్నన్, గననిమ్ము నిన్ సదా,

సృజననిచ్చి కావుమయ్య! రా

! *జితామిత్ర!* మన్నించు రాఘవా!                

 

౧౨ . ఓం జనార్దనాయ నమః.

కదంబ మంజరీ(జ ర ర జ జ గ. యతి 9) 

*జనార్ధనా!* దురాత్ముల్ ప్రజా విరోధులు, దుష్కృతుల్

పొనర్చుచుండిరే,  యో ప్రభూ! క్షమించక వారలన్

మనంబు పెట్టి చంపన్, సమస్తమున్  శుభమౌనుగా,

ప్రణామ మీకు సంహారివై రహించుము రాఘవా!

 

౧౩ . ఓం విశ్వామిత్రప్రియాయై నమః       

హరి (న న మ ర స లగ. యతి 10)

ధరణిజ పతి! *విశ్వామిత్రప్రియా!* సుగుణాకరా!

వర మునిజన వంద్యా! దేవా! ప్రభాకరవంశజా!

పరమ పురుష! కావన్ రావా ననున్? గణియించుచున్,

నిరుపముఁడ! పరంధామా నీవెకావుమ, రాఘవా!

 

౧౪ . ఓం దాంతాయై నమః.

ప్రమాణి (జ ర వ)

మురారి! *దాంత!* నీ కృపన్

ధరాతలంబునందునన్

చరించు సజ్జనాళికిన్

వరించు మేలు రాఘవా!

 

౧౫ . ఓం శరణత్రాణ తత్పరాయ నమః.      

రసోదత (త జ భ త ర. యతి-7)

రామా! ననుఁ గావరా, *శరణత్రాణ తత్పరా!*

కామాదులు వీడఁ గాంచుము, రక్షించు నన్నిలన్,

శ్రీమంతుఁడ! నాదు చిత్తమునందుండి ప్రోవుమా,

ప్రేమాంబుధి! భవ్య విత్తము నీవేను, రాఘవా!

 

౧౬ . ఓం వాలిప్రమథనాయ నమః.

భుజంగవిజృంభితము (......... యతి ౯.౧౯)

పాపాత్ముండౌ వాలిన్  *వాలిప్రమథన!* తునిమి శుభము

                                 వర్ధిలన్ బొనరించితే?

శ్రీ పద్మాక్షుండా! నీ వాడన్, శ్రితజన వరదుఁడ! ననుఁ

                                 జేయనీ శుభకృత్యముల్,

నీపై ప్రేమన్ భక్తిన్, సమ్మానితముగ నొసగుమ, హరి!

                               నెమ్మితో, దయఁ జూడుమా!

ప్రాపై నీవున్నంతన్ జీవింపఁగ భయమును మది విడు,

                                   భక్తి నిల్పుచు, రాఘవా!

 

౧౭ . ఓం వాఙ్మినే నమః.

నాగరము (భ ర వ)

రాముఁడ! *వాఙ్మి!* వాగ్ఝరిన్,

ప్రేమగ నాకుఁ నీయుమా,

నా మదిలోన నుండుమా

నీ మది నిల్పి, రాఘవా!

 

౧౮ . ఓం సత్యవాచేనమః

వల్లరి (ర ర)

*సత్యవాచా!* రమా

స్తుత్య సద్బాంధవా!

నిత్యమున్ గొల్తు నిన్

భృత్యఁడన్ రాఘవా!

 

౧౯ . ఓం సత్యవిక్రమాయ నమః.

ఇంద్రవంశము (త త జ ర. యతి ౮)

సత్యంబు పాలింపగ *సత్యవిక్రమా!*

నిత్యంబు నీవుంటివి నిర్మలప్రభన్,

స్తుత్యంబుగా కొల్చెద సుందరాంగ! యౌ

న్నత్యంబుతోనిల్పుమ నన్ను రాఘవా!

 

౨౦ . ఓం సత్యవ్రతాయ నమః.

మంజరి (స జ స య లగ. యతి 9)

పరమాత్ముఁడా!  కన నుపాయమున్ దెల్పుమా

నిరతంబు నిన్, మదిని నిల్ప, *సత్యవ్రతా!*

పరమంబునే గనఁగ వచ్చు, నిన్ జూచినన్,

సరిలేరునీ కిలనుసన్నుతా! రాఘవా!

 

౨౧ . ఓం వ్రతధరాయ నమః.

సుధాధామ (న త గ)

*వ్రతధరా!* కాచితే

నుతి నహల్యా సతిన్,

బ్రతుకు పండించితే

నతులు శ్రీ రాఘవా!

 

౨౨ . ఓం సదా హనుమదాశ్రితాయ నమః.

ప్రియంవద (న భ జ ర. యతి ౮)

*హనుమదాశ్రిత!* సురార్చితా! హరీ!

నిను నుతింతును వినీలదేహుఁడా!

క్షణము లోపలనె కంటికానుమా,

ఘనతరంబుగను గణ్య రాఘవా!

 

౨౩ . ఓం కౌసలేయాయ నమః.

ద్రుతవిలంబితము (న భ భ ర. యతి ౭)

ప్రణవ రూపుఁడ! భాగ్యద! *కౌసలే

!*నిను నామదినాశగ నిల్పెదన్,

కనుము నిచ్చలు కమ్మని ప్రేమతో,

వినుమ నామొర ప్రీతిని రాఘవా!

 

౨౪ . ఓం ఖరధ్వంసినే నమః.

మృత్యుంజయ (త మ లగ)

దేవా! *ఖరధ్వంసీ!* హరీ!

భావంబులో నీవుండుమా,

జీవాత్మ వీవే కాంచగా,

గోవిందుఁడా! మా రాఘవా!

 

౨౫ . ఓం విరాధవధపండితాయ నమః.

చంపకమాల (న జ భ జ జ జ ర. యతి ౧౧)

ప్రవరుఁడవౌ *విరాధ వధపండిత!*నీకు నమస్కరించెదన్,

శ్రవణ కుతూహలంబగును శ్రావ్యపు నీ చరితంబు దేవరా!

భవములు పాపువాడవని భవ్యుఁడ నమ్మితిమయ్య, నీవె మా

జవమును సత్వమున్ నిజము, సాకుము మమ్మిల రామ! రాఘవా!

 

౨౬ . ఓం విభీషణ పరిత్రాత్రే నమః.

మత్తేభము (స భ ర న మ య వ. యతి ౧౪)

కుమతిన్ రావణు సంహరించితివి, నీకున్ సాటి లేరంచనన్,

రమణుండా! ఘనుఁడా! *విభీషణ పరిత్రాతా!* జగద్రక్షకా!

రమసీతమ్మను కాచి తెచ్చితివి, నన్ రక్షించగా రావ? నే

మముతో నిన్ను నుతింతు పద్యములలో మాన్యుండ! శ్రీ రాఘవా!

 

౨౭ . ఓం హరకోదండ ఖండనాయ నమః.

ఉపమాలిని (న న త భ ర. యతి 9)

సుగుణ గణుఁడ! దీవించు నన్ను కృపాబ్ధి! నీ

డగ నిలు *హరకోదండ ఖండన!* నిత్యమున్,

నిగమ విదిత దేవా! నినున్, మదినెంచెదన్,

జగము నడుపు వాడా! జయంబిడు రాఘవా!

 

౨౮ . ఓం సప్తతాళప్రభేత్రే నమః.

గౌరీ (న-న-ర-ర. యతి 8) (చంచలాక్షీ, ప్రముదితవదనా, మందాకినీ, ప్రభ, ప్రభాత)        

పరమపురుష!  *సప్తతాళప్రభే

!* రమణ! కన నూత మీవే కదా,

స్థిర వర గుణ రాశి నిమ్మీవె నీ

స్మరణ విడువ శ్రీశ! మా రాఘవా!

 

౨౯ . ఓం దశగ్రీవశిరోహరాయ నమః.

చంద్రకళ (ర స త త జ జ గ. యతి 11)

శ్రీ రమా రమణా! వీరా! *దశగ్రీవశిరోహర!* రక్షకా!

నేరముల్ కనఁబోకయ్యా! మదిన్ నిన్ దలతున్, జయవర్ధనా!

కోరనేమియు నాకంచున్, హరీ! కూర్మిని గాంచర, నిత్యమున్,

చేరెదన్ నిను నాత్మజ్ఞానినై, శ్రీకర, నిత్యుఁడ! రాఘవా!

 

౩౦ . ఓం జామదగ్న్య మహాదర్పదలనాయ నమః.

దర్పనాశిని (న ర స భ స వ.  యతి ౧౦)

ధరణి *జామదగ్న్య మహాదర్పదలన!* శ్రీహరీ!

స్మరణ వీడనయ్య! మహేశా! కరుణను చూడుమా,

పరమ వీరరాఘవ! నా బంధమునిఁక పాపరా,

నిరుపమాన రాముఁడ! సాన్నిధ్యము నిడు, రాఘవా!

 

౩౧ . ఓం తాటకాంతకాయ నమః.  

మనోరమ (న ర జ గ.  యతి ౭) 

తలఁప *తాటకాంతకా!* నినున్

ఖలురు పోదురే గతించుచున్

సులలితాత్ముఁడా! శుభంబులన్

కలుగఁ జేయుమింక రాఘవా!

 

౩౨ . ఓం వేదాంతసారాయ నమః.

కుటజగతి (న జ మ త గ. యతి 9)

అహరహమున్ నినున్ దేవా! *వేదాంతసా

!* హరి! స్మరించుచో ధారాపాతంబుగా

మహిమముతోడ, ఛందోమార్గంబందునన్

బహువిధపద్యముల్, తా వచ్చున్ రాఘవా!

 

౩౩ . ఓం వేదాత్మనే నమః.

లత (ర య లగ)

శ్రీకరుండ! *వేదాత్మ!* నే

లోకమందు శోధించినన్

నాకుఁ దోచు నీ రూపమే,

లోక రక్ష! శ్రీ రాఘవా!

 

౩౪ . ఓం భవరోగస్యభేషజాయ నమః.

రథోద్ధతము (ర న ర వ. యతి ౭)

ప్రోవరావ, *భవరోగభేషజా!*

నీవె కావనలె నిర్మలాత్ముఁడా!

జీవమీవె కద, చిత్ స్వరూపుడా!

రావణాంతక విరామ! రాఘవా!

 

౩౫ . ఓం దూషణత్రిశిరోహంత్రే నమః.                                                                                 

కుంజ (త జ ర స ర. యతి ౯)    

నా దైవము నీవ, *దూషణత్రిశిరోహంత!* నా

మీదన్ దయఁ జూపి, నన్నుమేలుకొనంగన్ హరీ!

మోదంబునఁ జేయుమో సుపూజ్యుఁడ!శ్రీ రాముఁడా!

వేదాత్మవు, శ్రీశ! విశ్వవేద్యుఁడ! మా రాఘవా!                                                    

 

౩౬ . ఓం త్రిమూర్తయే నమః.

చంద్రిక (న న ర వ. యతి ౯)

అజుఁడు శివుఁడు నీవెరా! ధరన్

సుజన నుత! *త్రిమూర్తి!* సుందరా!

నిజప్రతిభను జూపు నిత్యుఁడా!

ప్రజల మదుల లోని రాఘవా!

 

౩౭ . ఓం త్రిగుణాత్మకాయ నమః.

ఉత్పలమాల (భ ర న భ భ ర వ. యతి ౧౦)

* త్రిగుణాత్మకా!* శుభమహోజ్వలతేజుఁడ! వందనంబు, మా

లో త్రిగుణంబులుండెను, విలోకన చేయుచు నిల్పు సత్వమున్,

స్తోత్రము చేసి మ్రొక్కెదను సుందరపద్యములందు నిన్ను, నా

యాత్రము నెన్ని కావుము మహాత్ముఁడ! పెన్నిధివైన రాఘవా!

 

౩౮ . ఓం త్రివిక్రమాయై నమః.

కరశయాకిశోరము ( )

కృపను గాంచు *త్రివిక్రమా!*

యపజయంబులు బాపరా,

యుపవసింతును నిత్యమున్

ప్రపవు, నీదరి రాఘవా!

 

౩౯ . ఓం త్రిలోకాత్మనే నమః.

కుసుమిత (న ర ర)

కనుమయా! *త్రిలోకాత్మ!*నన్,

వినుమయా ప్రభాపూర్ణమౌ

ఘనుఁడ! నీ ప్రభావంబునే

వినుతులందు నో రాఘవా!

 

౪౦ . ఓం పుణ్యచారిత్రకీర్తనాయ నమః.

పృథ్వి (జ స జ స య లగ. యతి 12)

మునీశ్వరులు నిన్ను గొల్చుదురు *పుణ్యచారిత్ర కీ

ర్తనా!* నిను రమేశ! నేనును  నితాంతమారాధనన్

గణించి, మదిఁ జేయుదున్, సుగుణగణ్యుఁడా! చూడవా?

మనంబునను దల్పవా? కనవ మన్ననన్? రాఘవా!

 

౪౧ . ఓం త్రిలోక రక్షకాయ నమః.          

చంపకకేసరి (స జ స స స వ. యతి ౯)

సుకవుల్ నినున్ సతము శోభిలఁ బల్కు, *త్రిలోక

క్షక!* గణ్యులా కవులు, కామితముల్ నెరవేరు వా

రికి, నీ కృపన్ సతము తృప్తిగనుందురు, కర్మలన్

సకలంబుపాపుమయ, సన్నుతు చేసెద రాఘవా!

 

౪౨ . ఓం ధన్వినే నమః.  

మనోహర (ర-జ-ర-జ-గ. యతి 9)

రామ! *ధన్వి!* చూడవయ్య రాక్షసాంతకా!

ప్రేమతోడఁ గొల్తు నిన్ను విశ్వసించుచున్,

భూమిపైవేదసార పూజ్యులుండిరే,

నీమమొప్పకావుమయ్య నీవె, రాఘవా!

 

౪౩ . దండకారణ్యకర్తనాయ నమః.

కళాధర (ర ర జ ర వ. యతి 7)

*దండకారణ్యకర్తనా!* దయానిధీ! హరీ!

నిండుగా గుండెలో నినున్ వహింతు భక్తితోఁ,

బండువై యుండు లోపలన్ బ్రభాకరుండవై

యండవీవే కదా, యజాండ భాస, రాఘవా!

 

౪౪ . ఓం అహల్యాశాపశమనాయ నమః.    

కాంత (య భ న ర స లగ. యతి 11)         

*అహల్యాశాపశమన!* విమోహమున్ విడఁ జేయుమా,

మహాత్మా! శాపవశుఁడను,  రామ నామము పల్క రా

దహో! వాగ్రూపమున, ధన దాహమే విడదేలనో?

స్పృహన్నీవే గొలిపి, నను బ్రోచి నిల్పుము, రాఘవా!

 

౪౫ . ఓం పితృభక్తాయ నమః‌          

చంద్రశేఖర (న-జ-ర-జ-ర.  యతి 13)        

నుత *పితృభక్త!* రామదేవరా! ఘనుండ! ని

న్నతులితశక్తి పూర్ణ భాగ్యుడంచునందురే

క్షితి మతిమంతులున్, మహాత్ములున్, బ్రసిద్ధ!

ద్వ్రతఫలమీకృతిన్ గనంగ లేవొ? రాఘవా!

 

౪౬ . ఓం వరప్రదాయ నమః‌        

పుష్పగుచ్ఛము (జ ర జ గ. యతి 7)

*వరప్రదా!* శుభాస్పదా! నతుల్,

నిరంతరంబు నిన్నె కొల్చెదన్,

పరాత్పరుండ! దైవమీవెరా,

వరప్రదుండ! భవ్య రాఘవా!

 

౪౭ . ఓం జితేంద్రియాయ నమః‌           

భోగవిలసిత (భ స జ గ. యతి 7)

శ్రీకరుఁడ! *జితేంద్రియా!* హరీ!

శోకహరుఁడ! నీ శుచిత్వమున్

ప్రాకటముగ భూప! యిమ్మయా,

చీకటులను త్రుంచి రాఘవా!

 

౪౮ . ఓం జితక్రోధాయ నమః‌.        

వంశస్థము (జ త జ ర. యతి 8)

హరీ!*జితక్రోధ!*యహంబు బాపరా,

పరాత్పరా! భావభవా! కనంగ రా,

ధరాసుతాత్మన్ వినుతా! వసింతువే,

వరంబువై కన్బడు, భవ్య రాఘవా!

 

౪౯ . ఓం జితామిత్రాయ నమః‌.        

నిశ (న న ర ర ర ర.  యతి 9)

అనుపముఁడవయా, *జితామిత్ర!* నీ సాటి లేరెవ్వరున్,

ఘనతరమగు నీదు కల్యాణ తేజంబు చూడంగనే

మునులకునుప్రమోదమున్ గొల్పునో శ్రీహరీ! నిత్యమున్

మనమున ననుఁ గాంచుమా, రామ భూపాల! శ్రీ రాఘవా!

 

౫౦ . ఓం జగద్గురవే నమః‌

మత (న ర న ర.  యతి 7)

కరుణఁ జూడుమా ఘనుఁడ! మమ్మిలన్

వరసుభంబులే పరమ పావనా!

నిరతమొందనౌ నిజముగా *జగ

ద్గురు!* నుతింతు సద్గుణుఁడ! రాఘవా!

 

౫౧ . ఓం ఋక్షవానర సంఘాతినే నమః‌.                

మురళి (స భ ర ర ర.  యతి ౯)      

పరమాత్మా! ననుఁ జూడవా? ప్రేమగా *ఋక్షవా

నర సంఘాత!*మనోజ్ఞ! నాపై సదా ప్రేమతో

కరుణన్ జూడుము, నాయకా! నా యెదన్ నిల్వుమా,

చరణంబుల్ కొలుతున్, నిజంబయ్యరో రాఘవా!

 

౫౨ . ఓం చిత్రకూటసమాశ్రయాయ నమః‌.  

మత్తకోకిల (ర స జ జ భ ర.  యతి ౧౧)

శ్రీకరుండవు జానకీపతి! *చిత్రకూటసమాశ్రయా!*

నీకు మ్రొక్కెద నీ ప్రవృత్తిని నేర్పుగా కరుణాకరా!

నాకునొప్పుగ వచ్చునట్లు, ఘనంబుగా నొనరింపుమా,

శ్రీకవీశులుశోభఁగాంచఁగఁ జేయుమా శుభ రాఘవా!

 

౫౩ . ఓం జయంతత్రాణవరదాయ నమః‌.    

మణిమంజరి (య భ న య జ జ గ.  యతి ౧౩)

*జయంతత్రాణవరద!* జయరామా! జయంబగు నీకు, నీ

ప్రియంబౌ సీతకును, మహిత! దేవేరితో శుభ సంహతిన్

శ్రియానేకంబులను గొలుపుచున్ వాసి జాతికి గొల్పుడీ,

నయాదుల్నాకమరఁగనుమ, శ్రేయస్కరా! వర రాఘవా!

 

౫౪ . ఓం సుమిత్రాపుత్రసేవితాయ నమః‌ .          

ప్రతాపావతారం  (య య ర ల గ.  యతి ౭)

పునీతా! *సుమిత్రాపుత్రసేవితా!*

ధనాదుల్ నిజంబా? ధర్మ రక్షకా!

మనోవాంఛలేలో? మంచి చాలదా?

ప్రణామంబు నీకో భవ్య రాఘవా!

 

౫౫ . ఓం సర్వదేవాధిదేవాయ నమః‌.                   

నందనము (న జ భ జ ర ర. యతి 11)

జనకజకాత్మలో నిలిచి, చక్కగాను నీ వుంటివే,

ఘనతను గాంచితే, సుజన గణ్య!*సర్వదేవాధిదే

!*నను కనంగ లేవుగద? భక్తిఁగల్గువాడన్ గదా,

ప్రణుతులు స్వీకరించు, వర పావనా హరీ! రాఘవా!

 

౫౬ . ఓం మృతవానరజీవనాయ నమః‌. 

మనోజ్ఞ (న జ జ భ ర. యతి ౧౦)

రి! *మృతవానరజీవనా!* దురితాపహా!

నరవరుఁడా! శుభసాధనా కుశలా! ప్రశ

స్తరవిసుతేజ!ప్రశాంతతన్, వరమీయుమా,

స్మరణము చేసెద నిన్ బ్రశస్తుఁడ! రాఘవా!

 

౫౭ . ఓం మాయామారీచహంత్రే.  

కాంచీ/వాచాలకాంచీ (మ ర భ య ర ర. యతి ౧౨)

*మాయామారీచహంతా!* కనఁగ లేమా నిన్ను సర్వేశ్వరా!

మాయామోహాదులే నన్ విడవె? రామా! నన్ను రక్షింపవా?

నీ యాజ్ఞన్ నే రచింపంగ కృతి ధన్వీ! సాధ్యమాయెన్, హరీ!

యే యాశల్ లేవయా నాకిలను తండ్రీ! కావుమా రాఘవా!

 

౫౮ . ఓం మహాదేవాయ నమః‌.   

       వియోగిని.

       (.. పాదములందు స స జ గ. యతి ౬.

       .. పాదములందు స భ ర వ. యతి ౭.)

సమయం బిక చాల దో రమే

! *మహాదేవ!* నిజంబుగా నినున్

ప్రముదంబునఁ బ్రార్థనన్ గనన్

రమణుండా! కృప రమ్ము, రాఘవా!

 

౫౯ . ఓం మహాభుజాయ నమః‌.       

ఉజ్జ్వల (న న భ ర.  యతి 8)

పురుష వర! *మహాభుజ!* జానకీ

వరుఁడ! మహిత భావ సుధార్ణవా!

చరణకమల దర్శన మీయరా!

కరుణఁ గనర, మంగళ రాఘవా!

 

౬౦ . ఓం సర్వదేవస్తుతాయనమః.                              

అంబురుహ (భ భ భ భ ర స లగ. యతి 13)

నిస్తుల! పోలరు నిన్నెవరున్ ధర నీరజాక్షుఁడ! *సర్వదే

వస్తుత!* వందనమందుమ చేసెద బ్రహ్మతేజ పరాత్పరా!

వస్తువులేలను భక్తినొసంగుము వాసవాది సురార్చితా!

ప్రస్తుతమంతయు నీవె యెఱుంగవె? వందనంబులు రాఘవా!

 

౬౧ . ఓం సౌమ్యాయ నమః‌.             

శ్యేని (ర జ ర లగ. యతి 7) 

జ్ఞాన రూప! భవ్య! *సౌమ్య!* రామయా!

నే నినున్ నుతింతు నిత్యశోభనా!

దీన బాంధవా! సుధీ వరాశ్రితా!

కాను శత్రువేను గాంచు రాఘవా!

 

౬౨ . ఓం బ్రహ్మణ్యాయ నమః‌. 

లలితము(గౌరీ) (న న మ ర. యతి 7)

వరదుఁడవయ, * బ్రహ్మణ్యా!* రామయా!

నిరుపముఁడవు, నిన్నే నేఁ గొల్చెదన్,

కరుణఁ గనుమ గణ్యాత్మా! శ్రీధరా!

పరమొసఁగుము ప్రఖ్యాతిగా రాఘవా!

 

౬౩ . ఓం మునిసంస్తుతాయ నమః‌.        

శుద్ధవిరాటి (మ స జ గ. యతి 6)

శాంతంబున్ *మునిసంస్తుతా!* సదా

పంతంబొప్పగ వర్ధిలన్, చెడున్,

దాంతంబౌనటు తప్పకన్ హరీ

శాంతిన్ జేయుమ, జ్ఞాన రాఘవా!

 

౬౪ . ఓం మహాయోగినే నమః‌. 

స్రగ్విణి (ర ర ర ర. యతి 7)                            

*మహాయోగి!* నీవుండుమా నా మదిన్,

బ్రేమతో నిత్యమున్, విజ్ఞతన్ గొల్పుమా,

నామదిన్ గందు నిన్ నావిభుండంచు నేన్,

క్షేమమున్ గూర్చుమా, శ్రీధరా రాఘవా!

 

౬౫ . ఓం మహోదరాయ నమః‌   

భిన్నపదము (భ భ జ గ.  యతి ౬)

భక్తుల నెన్నవ? *మహోదరా!*

భక్తిని గొల్పవ? జయప్రదా!   

ముక్తికి మార్గమును చూపరా,

శక్తివి నీవె జయ రాఘవా!  

 

౬౬ . ఓం సుగ్రీవేప్సితరాజ్యదాయ నమః‌.      

శిలీముఖోజ్జృంభితము (మ స జ న జ త గ.  యతి 13)

*సుగ్రీవేప్సితరాజ్యదా!* నుతమతి! శుభమ్ములన్ గూర్చుమా,

యగ్రాహ్యంబులు వీడఁజేయుమయ, భయదూర! సద్భక్తి

త్యగ్రస్థానమునందు మానసమున నజస్రమున్ గొల్చెదన్,

సుగ్రీవున్ దయఁ జూచినట్లు కనుము సుభద్రుఁడా! రాఘవా!

 

౬౭ . ఓం సర్వపుణ్యాధికఫలాయ నమః‌.                   

అవిరళరతికా ( .   యతి )         

వ్యాధుల డులుపు హాత్మ *సర్వపు

ణ్యాధికఫల!* సుగుణాలము నీవెరా,

బోధఁ గొలుపుమయ పూజ్యపాదుఁడా!

సాధనమగుమయసాధ్య రాఘవా!

 

౬౮ . ఓం స్మృతసర్వాఘనాశనాయ నమః‌.            

ప్రవరవిలసితము (య మ న న త గ. యతి 10)                                     

ధనాదుల్ కోరన్ నిన్, సుఫలద! *స్మృతసర్వాఘనా

శనా!*నా మాటల్ నమ్ముమ, సుచరణ! భాస్వంతుఁడా!

మనంబందున్ నీవేను నిలుమ! శుభ సన్మార్గదా!

జనానీకంబే నిన్ గొలుచు సతతమున్, రాఘవా!

 

౬౯ . ఓం ఆదిపురుషాయ నమః‌.

కవికంఠభూషణము (స జ స స స జ గ.  యతి ౯)

సరియెవ్వ *రాదిపురుషా!* నినుఁ బోలగ నో శుభంకరా!

పరమార్థమున్ గనెడి భాగ్యము! నీ కృపచే గడింపనీ,

శరణాగతుండను, ప్రశాంతిని, ముక్తిని,పొందనిమ్ము నన్,

చరణంబులన్ గొలుతు, చక్కని వాడవటంచు రాఘవా!

 

౭౦ . ఓం పరమపురుషాయ నమః‌.  

తురగము (న న న న స జ జ గ.  యతి ౧౫)

*పరమపురుష!* దశరథ సుత! వర భాస్కరాక్షర వంశజా!

నిరుపమమగు వరదుఁడవని, ధరణిన్ నినున్ సుజనుల్ సదా

శరణము గనఁ గొలుతురు కద, గుణసాంద్ర! కోర్కెలుతీర్చవా?

మరువకుమయ, నినుఁ గొలిచెడి నుతమాన్యులన్ గను, రాఘవా!

 

౭౧ . ఓం మహాపురుషాయ నమః‌.

భూతిలకము (భ భ ర స జ జ గ. యతి ౧౨)

జానకి భార్యగ నో*మహాపురుషా!*లభించెను గొప్పగా

ధీనిధి! కీర్తిని పొందితీవు, నుతింతు నిన్, శుభ పాలకా!

నేను ధరన్ నిను గాంచఁగానగు నీ కృపేక్షణ లేనిచో,

మౌనము వీడుము, రామయాజయమంగళాకర! రాఘవా!

 

౭౨ . ఓం దయాసారాయ నమః‌.                 

ప్రముదితవదన (న న ర ర. యతి 8)

ధరణిజ సుతతో *దయాసార!* నీ

వరయు మధిప! మోహపాశాళి నే

తరుమఁ, బరము నొందగాచేయగాఁ,

రుణను గను శ్రీకరా! రాఘవా!

 

౭౩ . ఓం పుణ్యోదయాయ నమః‌.  

గరుడరుతము (న జ భ జ త గ.  యతి 10)

కనుదును నీదు రూపమె ఘనుండ! *పుణ్యోదయా!*

వినెదను నీ చరిత్రమె, విశాల ముఖాబ్జుడా!

యనెదను నీదు నామమె, హరీ! యటంచున్ సదా

వినుతులు నీకె చేయుదు, వినంగ శ్రీ రాఘవా!

 

౭౪ . ఓం పురాణపురుషోత్తమాయ నమః‌.

వసంతమంజరి (      .  యతి 13)

నెపమునెన్నక నన్నిక నిలుపు నిత్యుఁడా మహితా! *పురా

ణ పురుషోత్తమ!* నీకృపఁ గనిన నాకు ముక్తి సుసాధ్యమౌన్,

కపికుమారుని కాచిన సుజన కల్పవృక్షము నీవయా,

తపన బాపుమ, ముక్తి నొసగుమ,ధర్మ తేజమ! రాఘవా!

 

౭౫ . ఓం స్మితవక్త్రాయ నమః‌          

మధుర.

                 { (ప్రభాత)౧వ పాదమున- న జ జ ర గ. యతి ౮

                  (అపరాజిత)౨వ పాదమున- న న ర స వ. యతి ౮

                  (మాలిని)౩వ పాదమున- న న మ య య. యతి ౮

                           ౪వ పాదమున- న స జ జ  జ గ. యతి ౯ }                                                      

వరముగఁ బొందితి భద్రుడా! నినున్ నేన్

వరదుఁడ! కరుణావధీ! *స్మితవక్త్ర!* దు

ష్కరమొకొ హరి! నాశ్వాసన్ వసింపంగ నీకున్?

పరమపురుషా! నతుల్, భగవంతుఁడ!  రాఘవా!

    

౭౬ . ఓం మితభాషిణే నమః‌.             

ప్రభాకలిత (న జ జ భ ర స వ. యతి ౧౩)

సురవినుతా! *మితభాషి!* నిన్నిల సుందరా కననిమ్మురా,

నిరవధికంబుగ నీదు నామమునే బఠించగ చేయుమా,

వరగుణ! జానకి పొంగు నిన్ గని, భక్తులన్ గనువాడివం

చరయునన్నును నీవు ప్రేమగనచ్యుతా! వర రాఘవా!

       

౭౭ . ఓం పూర్వభాషిణే నమః‌.       

ఉపస్థిత (త జ జ గ. యతి 7)

ధీరా! పరమావధి వీవెరా,

శూరా! ననుఁ గాంచుచు *పూర్వభా

షీ!* రామ! మదిన్ వసియించుమా,

నా రాజ! యశోధన రాఘవా!

 

౭౮ . ఓం రాఘవాయ నమః‌.

భారతి/మృగి (ర)

ఔఘమా!

ఓఘమా!

మేఘమా!

*రాఘవా!*

 

౭౯ . ఓం అనంతగుణగంభీరాయ నమః‌

కవికాంత (భ భ ర న మ స జ గ. యతి ౧౩)

కామిత దాయివిగా, *యనంత గుణ గంభీరా!* నినునాశ్రయింతురే      

లేమిని బాధలఁ జిక్కువారు, కనలేరే యన్యము నిన్ను మాత్రమే

ప్రేమను జేరుదురయ్య నీవె కని ప్రీతిన్ గావుము వారినందరిన్,

రామయ! నిన్నునుతించెదన్, శుభద! రమ్యాకారుఁడ! భవ్య రాఘవా!

 

౮౦ . ఓం ధీరోదాత్తగుణోత్తమాయ నమః‌.

అనవద్యా ( .  యతి ౧౦)

స్తిమిత మేదిర దేవర? *ధీరోదాత్తగుణోత్తమా!*

సుమ సుపేశల దేహుఁడ! శూరాగ్రేశ! నమస్కృతుల్,

సముచితంబుగ పాఠకసంస్తుత్యాళిని కావరా!

సమధికోన్నతి నిమ్మయ! సంతోషంబుగ రాఘవా!

 

౮౧ . ఓం మాయామానుషచారిత్రాయ నమః‌ 

గగనమణి ( .  యతి ౧౧)              

రాముఁడ! *మాయామానుషచారిత్ర!* మనోహరా!

నేమము తోడన్ నే తగు రీతి న్విరచించితిన్,

క్షేమము కూర్పన్ శ్రీ శతకమ్మున్ శ్రితవత్సలా!

నీ మహిమంబున్ గాంచుచు శోభాన్విత రాఘవా!

 

౮౨ . ఓం మహాదేవాదిపూజితాయ నమః‌       

గలితనాలా (జ భ య ర.  యతి ౫)     

స్తుతింతు నీశుఁడ! *మహాదేవాదిపూ

జితా!* గ్రహించి, నను కాపాడంగ రా,

సతంబు ధ్యాసను నినున్ ధ్యానింతు, జీ

వితాంత మీవె మదినొప్పన్, రాఘవా!

 

౮౩ . ఓం సేతుకృతే నమః.

కలిలా(కరిలా)శల్లకప్లుతం (స ర ల గ)

సుకృతుండన్ గనంగ*సే

తుకృతా!* నేను నీ దయన్,

ప్రకృతిన్ నీవుగా మదిన్

సకలా! కాంతు రాఘవా!

 

౮౪ . ఓం జితవారాశయే నమః‌

వనమాలి (స భ ర లగ.  యతి 7)

*జితవారాశి!* వసించుమా! మదిన్,

నుత కీర్తుండ! వినూతనంబుగా

స్తుతమౌ పద్యపు శోభగా నినున్

క్షితిఁ జూపించితి శ్రీద! రాఘవా!

 

౮౫ . ఓం సర్వతీర్థమయాయ నమః‌

రాజమరాళ (న భ ర)

సమధికోన్నత భావముల్

ప్రముదమందగ నిమ్మయా

క్షమను గొల్పుచు, *సర్వ తీ

ర్థమయ!* సుందర! రాఘవా!

 

౮౬ . ఓం హరయే నమః‌

సుకాంతి (జ గ)

*హరీ!* రమా

ధరా! పరా

త్పరుండ! వీ

వు, రాఘవా!

 

౮౭ . ఓం శ్యామాంగాయ నమః‌

పథ్య (ర య జ గ. యతి 6)

ధ్యేయ మీవె శౌరీ! గడింతు నిన్,

మాయవీడి రామా! శుభాకరా!

న్యాయ మార్గమీవయ్య! వీత మో

హా! యనంత! *శ్యామాంగ!* రాఘవా!

 

౮౮ . ఓం సుందరాయ నమః‌.

ప్రవహ్లిక (భ జ ర)

వందనము దివ్య *సుందరా!*

డెందముననుండుమెప్పుడున్,

కందు నెడబాపు ధీర! నా

కందుము సతంబు రాఘవా!

 

౮౯ . ఓం శూరాయ నమః‌.  

పంచచామరము (జ ర జ ర జ గ. యతి ౧౦)    

జయంబు నీకు సంస్తుతుండ! జానకీ మనోహరా!

ప్రియంబుతోడఁ గాంచుమా రవిప్రభాన్వితా హరీ!

నయంబుతోడ *శూర!* మాకు నవ్యదివ్య మార్గమున్

భయాపహా! కనంగఁ జేసి, భక్తినిమ్ము రాఘవా!

 

౯౦ . ఓం పీతవాససే నమః‌

భుజంగసంగత (స జ ర)

వరమీవెరా, శుభాకరా!

నిరపాయమార్గ మే సదా

కరుణించి యిమ్ము*పీతవా

!* రమేశ్వరుండ! రాఘవ!

 

౯౧ . ఓం ధనుర్థరాయ నమః‌

విదగ్ధకము (ర లగ)   

*ధనుర్ధరా!*

బాధ బాపరా!

శ్రీధరా! రమా

నాథ! రాఘవా!

 

౯౨ . ఓం సర్వయజ్ఞాధిపాయ నమః‌. 

మదన దర్పణము (భ స జ ర జ గ. యతి ౧౧)                                              

మాధవ! సురసేవితుండ! క్షేమమిచ్చు *సర్వయ

జ్ఞాధిప!* నిను నే నుతింతునే, గణించి నన్, గృపన్

బాధలువిడఁజేసి, కావుమో పరాత్పరా! హరీ!

శోధనలవి యేల? కావగా శుభాక్ష! రాఘవా!

 

౯౩ . ఓం యజ్వినే నమః‌.            

మణిభూషణము (ర న భ భ ర. యతి ౧౦)                                       

మంగళాంగుఁడవు! *యజ్వి!* సుమంగళ కార్యముల్

రంగుగానొనరఁ జేయు పరాత్పర! నిత్యమున్

బెంగలన్ డులిపి రక్షణ బ్రీతిగ గొల్పుచున్

మంగళంబులిడు రాజువు మాన్యుఁడ! రాఘవా!

 

౯౪ . ఓం జరామరణవర్జితాయ నమః‌        

హల్లకమాలిక (న న జ స స స జ గ.  యతి ౧౨)

భయము విడువ *జరామరణవర్జిత!* చేయుము, శాశ్వతంబుగన్,

నయము కదుర వసింపగ ననంతుఁడ! చేయుము, నిశ్చితంబుగన్,

ప్రియము తలర వచింపగను, విజ్ఞత నొప్పగ భాసురంబుగన్

జయద! కృపఁగని చేయర, విశాల సునేత్రుఁడ! దివ్య రాఘవా!

 

౯౫ . ఓం విభీషణప్రతిష్ఠాత్రే నమః‌

లలిత (త భ జ ర- యతి 9) 

జ్ఞానీ! *విభీషణ ప్రతిష్ఠ!* రామయా!

జ్ఞానార్థి నిన్ దెలియు మార్గ మారయన్

నీ నామకీర్తనలనే నిరామయా!

మౌనంబుతో సలుపు, రామ రాఘవా!

 

౯౬ . ఓం సర్వావగుణవర్జితాయ నమః‌

మత్తహంసిని (జ త స జ గ. యతి ౭)

గుణాఢ్య! *సర్వావగుణవర్జితా!* హరీ!

ప్రణామమో శ్రీకర! నవాంబుజాక్షుఁడా!

గణింపుమా మామక కవిత్వ సంపదన్,

గుణంబులన్ మానకుమహాత్మ! రాఘవా!

 

౯౭ . ఓం పరమాత్మనే నమః‌

డిండిమ (జ-స-న-జ-ర.  యతి 11)

యంబు *పరమాత్మ!* నుత విశాల నేత్రుఁడా!

జయంబు శుభసంయుత! గుణసాంద్ర! సత్ప్రభా!

జయంబగుత నీదు సతి ప్రశస్త  సీతకున్,

జయంబు ప్రియభక్తులకును, సౌమ్య! రాఘవా!

 

౯౮ . ఓం పరస్మైబ్రహ్మణే నమః‌.

ఖచరప్లుతము (న భ భ మ స స వ.  యతి ౧౨)

పరమపావన నామ! *పరస్మైబ్రహ్మ!*శుభాకర! రామయా!

కరుణఁ జూపర, సన్నుతుఁడా! శ్రీకామిత దాయివి, నీవెగా,

స్థిరము నా మదికిన్ దయనిమ్మా, చిద్విభవా! కరుణామయా!

భరము కాదుర నీకిది, నా దేవా! దయఁ జూడర, రాఘవా!

 

౯౯ . ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః‌

తనుమధ్యమా (య-మ-య-న-ర-ర.  యతి 1. 8. 15)

అహం బీ నాలో నిల్చెరా! దేవ! వర *సచ్చిదానందవి

గ్రహా!* నన్నున్ గావంగ రా, నీవె యహమెన్నరా, త్రుంచరా

స్పృహన్ నీవే నాకున్ హరీ! కొల్పి, మదిలో చేరి పాపరా!

సహాయంబున్ జేయన్ వశంబై, నిలుము ధీవశా! రాఘవా!

 

౧౦౦ . పరస్మైజ్యోతిషే నమః‌

హరనర్తనము (ర స జ య భ ర.  యతి ౯)

దీన రక్షక! దేవ! ధాత్రి *పరస్మైజ్యోతి!* రమాపతీ!

జ్ఞానదుండవు, నీవు కాక పరంబున్ గొల్పగ లేరుగా,

ప్రాణమీవెగ? నన్నుఁ బ్రోవవ? సర్వజ్ఞా! నతులందుమా,

నేను వ్రాసిన పద్యపెన్నిధి నీవే చూడర, రాఘవా!

 

౧౦౧ . ఓం పరస్మై ధామ్నే నమః‌

దీపకమాల (భ మ జ గ.  యతి 7)

మాన్య! *పరస్మై ధామ!* సన్నుతుల్,

ధాన్యము, జ్ఞానంబున్,ధనాదులన్

ధన్యత గొల్పంగా దయాంబుధీ!

గణ్యతనిమ్మొప్పంగ, రాఘవా!

 

౧౦౨ . ఓం పరాకాశాయ నమః‌

నందిని (స జ స ర వ.  యతి ౭)   

కరుణించు నాయక! *పరాకాశ!* మాధవా!

ధరజాపతీ ముదము గాచూడు!కేశవా

పరమీయుమీవె పరమార్థంబు  నీవెరా

వరమీవె నా కపర దైవంబ! రాఘవా!

 

౧౦౩ . ఓం పరాత్పరాయ నమః‌

హరిణి (న స మ ర స వ. యతి ౧౨)

సుజనులనురక్షించంగా నెంచుచుండు *పరాత్పరా!*

నిజముగ మదిన్ భక్తుండౌధోరణిన్ ధర వెల్గినన్

బ్రజలకు సుఖంబున్ శోభాళిన్, వరంబటు గొల్పు నీ

నిజమయిన శక్తిన్ గాంచన్ నేరనే, నిల రాఘవా!

 

౧౦౪ . ఓం పరేశాయ నమః‌.  

పద్మకము (న భ జ జ జ గ. యతి ౧౧)

వర *పరేశ!* నినుఁ జూచెడి భాగ్యము కల్గునా?

పరము పొందెడి మహాద్భుత భక్తిని యిత్తువా?

చరణ సేవలను చేసెడి సద్వరమిత్తువా?

పరమ పావన! శుభాకర! వ్యుఁడ! రాఘవా!

 

౧౦౫ . ఓం పారగాయ నమః‌.  

మంజుభాషిణి (స జ స జ గ. యతి ౯) (కనకప్రభా, జయా, నందినీ,ప్రబోధితా, మనోవతీ, విలంబితా, సునందినీ, సుమంగలీ)                                              

విను *పారగా!* ధనము వెల్లువై ప్రజన్

మనునట్లుగా గనుత మంగళాంగుఁడా!

వినయంబునే గొలిపి వెల్గ జేయుమా,

నిను నేను కోరుదిదె నిత్య రాఘవా!

 

౧౦౬ . పారాయ నమః.

వ్రీళ (త గ)

*పారా!* నతుల్,

నా రక్ష నీ

వేరా సదా,

శ్రీ రాఘవా!

 

౧౦౭ . ఓం సర్వదేవాత్మకాయ నమః‌

మహాలక్ష్మి(ర ర ర)

రక్షకా! *సర్వదేవాత్మకా!*

శిక్షణన్ గొల్పుమా భక్తినే

నక్షయంబౌ విధిన్ నేర్వగన్,

అక్షరాకారుఁడా! రాఘవా!

 

౧౦౮ . ఓం పరస్మై నమః‌.

కలహంస (స లగ)

కరుణాక రా

క్షర! నీకగున్

*పర!* మంగళ

మ్ముర రాఘవా!

స్వస్తి

03 – 5 – 2024.

జైహింద్.

 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.