జైశ్రీరామ్.
భోజరాజుసాహిత్యకళాపోషణము,వారి ఆస్థాన మహామహాకవి కాళిదాసులను గురించి వినని సాహితీరసజ్ఙులుండరు.
ఒకప్పుడు భోజరాజుకు ఒకవిచిత్రమైన ఆలోచన
కలిగి, "ఒకవేళ నేను మరణించితే నీ స్పందన ఎలా ఉంటుంది?" అని కాళిదాసును పండిత సభలో ప్రశ్నించాడట.కాళిదాసు "మహారాజా! అలాంటి ఊహను నేను భరించి, స్పందించటం
అసంభవం"అని జవాబిచ్చాడట.భోజుడు తన
ఆజ్ఞను ధిక్కరించిన కాళిదాసుపై కోపించి, దేశ బహిష్కారశిక్ష విధించగా,అతడు సభను విడచి వెళ్ళిపోయెనట.
కాళిదాసు లేని సరస్వతీకళావిహీనమగు రాజ
సభలో ఉండలేక కొంతకాలం తరువాత భోజుడు వేగులద్వారా కాళిదాసు ఉన్నప్రాంతాన్ని తెలిసి కొని మాఱువేషంలో అక్కడికి వెళ్ళి కాళిదాసును కలవగా, మాటల సందర్భములో కాళిదాసు అతనిని "అయ్యా! తమరే ప్రాంతనివాసులు? ఇక్కడకు మీ రాక కారణమేమిటి?" అని ప్రశ్నిం చాడట.మాఱు వేషంలోని రాజు తాను ధారా నగరంలో నివసించే పండితుడననీ,అచ్చోట భోజరాజు మరణించాడనీ,కళావిహీనమై ఆ నగరాన్ని వీడి దేశంలో పర్యటిస్తున్నాననీ పలికి
నాడట.
వెంటనే కాళిదాసు హృదయం అత్యంత శోక తప్తమై ఆయన వాక్కునుండి వెలువడిన శ్లోక
మిది.
"అద్యధారా నిరాధారా నిరాలంబా సరస్వతి౹
పండితాః ఖండితాస్సర్వే భోజరాజే దివంగతే౹౹"
భావము: ఈ రోజు ధారానగరము నిరాధార
మైనది.సరస్వతీదేవికి ఆలంబనము లేక దీనం గాఉన్నది.అనేకమంది పండితుల శిరస్సులు ఖండించబడినట్లుగ అయినది.భోజరాజు లేక పోవుటయే ఈ అనర్థాలన్నింటికీ కారణము.
ఈ శ్లోకశ్రవణముతో భోజరాజు హృదయము పరవశించింది.మేను పులకరించింది.వెంటనే
అతడు తన మాఱురూపమును తొలగించగా,
కాళిదాసు మహానందభరితుడై , అమంగళకర
మైన తన శ్లోకంలోని ఒక్కొక వాక్యంలో రెండు
అక్షరాలను మాత్రమే మార్చి ఇలా చెప్పాడు.
అద్య ధరా "సదా" ధారా
"సదా" లంబా సరస్వతి ౹
పండితాః "మం" డితాస్సర్వే
భోజరాజే "భు" వంగతే౹౹
భావము:ఈ రోజున ధారానాగరము సరస్వతీ దేవి నిత్యాలంబనముతో సదా శోభిల్లుచున్నది. భోజరాజు భువిపైన ఉన్నంతకాలము పండితు లందఱూ అఖండ శోభతో సంభావించబడు తూనే ఉంటారు.
ఈ శ్లోకములోని మొదటిపాదంలో నిరా ను
"సదా" గాను, రెండవ పాదంలో ఖం ను
"మం" గను, ది ను "భు" గను మాత్రమే
మార్పు చేయుటచే భావము శుభకరంగ మార్పు
చెందుట విశేషము.
భోజరాజు హర్షపులకితుడై కాళిదాసును తిరిగి
తనవెంట ధారానగరమునకు సగౌరవముగా
తోడ్కొని పోయెనట.
విపులార్థమును చిన్నవాక్యములో ఛందోబద్ధం
చేయటం సంస్కృతవాణికే సాధ్యము.ఇటువంటి
సంస్కృత శ్లోకాలు ఎన్నో ఉన్నవి.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.