గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, మే 2024, శనివారం

సౌందర్యలహరి.. ఆంధ్రానువాదము...ఱ ర్న చింతా రామకష్ణారావు.

 

 

సౌందర్యలహరి

ఆంధ్రీకరణచింతా రామకృష్ణారావు.

ఓం శ్రీమాత్రే నమః. 


శ్లో.  భుమౌస్ఖలిత పాదానాం భూమిరేవా వలంబనం |

త్వయీ జాతాపరాధానాం త్వమేవ శరణం శివే ||

తే.గీ.  ధరణిఁ బడ్డ పాదములకు ధరణియేను

చూడనాధారమమ్మరో! శోభనాంగి!

నీదు సృష్టిలో దోషులన్ నీవె కాచి

శరణమొసగంగవలెనమ్మ! శరణు శరణు.

శ్లో.  శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం                      

చేదేవం దేవో ఖలు కుశలః స్పన్దితుమపి

అతస్త్వామారాధ్యాం హరిహరవిరిఞ్చాదిభిరపి

ప్రణన్తుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి 1

శాఅమ్మా! నీ వర శక్తిఁ గల్గుటనె చేయంగల్గు నీ సృష్టి తా

నెమ్మిన్, గల్గని నాడహో, కదలగానే లేడుగా సాంబుఁ డో

యమ్మాశంభుఁడు, బ్రహ్మయున్, హరియు నిన్నర్చించ  వెల్గొందు ని

న్నిమ్మేనన్ దగ నెట్లు గొల్చెదరిలన్ హీనంపుపుణ్యుల్, సతీ!. 1

తాత్పర్యం :   

అమ్మా! శివుడు శక్తితో (నీతో) కూడినప్పుడు జగన్నిర్మాణము 

చేయగలుగుతున్నాడు. కానిచో స్పందించుటకు కూడా అసమర్థుడు కదా

బ్రహ్మ విష్ణు మహేశ్వరాదుల చేత ఆరాధించబడు నీకు, పుణ్యసంపదలేనివాడు 

నమస్కరించుట, స్తుతించుట ఎలా చేయగలడు ?

శ్లో.  తనీయాంసుం పాంసుం తవ చరణ పంకేరుహ-భవం
విరించిః సంచిన్వన్ విరచయతి లోకా-నవికలమ్ |
వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం
హరః సంక్షుద్-యైనం భజతి భసితోద్ధూళ నవిధిమ్|| 2 ||

శా.  నీ పాదాంబుజ రేణువున్ గొని, జగన్నిర్మాణ మా పద్మజుం

డోపున్ జేయఁగ, విష్ణు వా రజమునే యొప్పార కష్టంబుతో 

దీపింపన్ దగ వేయి శీర్షములతో ధీరాత్ముఁడై మోయునే,

యాపాదాబ్జరజంబు దాల్చు శివుఁడే యత్యంత ప్రీతిన్ మెయిన్. 2

తాత్పర్యం :   

అమ్మా ! బ్రహ్మ దేవుడు నీయొక్క పాదములందు కలిగి ఉన్న అణుమాత్రము అయిన ధూళినే గ్రహించి సకల లోకములను సృష్టి చేయుచున్నాడు, సూక్ష్మ కణమునే సహస్ర శిరములతో విష్ణు మూర్తి అతి కష్టముగా మోయు చున్నాడు,శివుడు దానినే భస్మము చేయుచూ భస్మధారణము చేయుచున్నాడు కదా

శ్లో.  అవిద్యానా-మంత-స్తిమిర-మిహిర ద్వీపనగరీ
జడానాం చైతన్య-స్తబక మకరంద శ్రుతిఝరీ |
దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి|| 3 || 

సీ.  అజ్ఞాన తిమిరాననలమటించెడివారి కమిత! సూర్యోదయమయిన పురివి,

మందబుద్ధులకును మహిత చైతన్యమన్ మంచి పూవులనొల్కు మధువువీవు,

దారిద్ర్యముననున్న వారిని కరుణించు చింతామణులహార కాంతివీవు,

సంసార సాగర సంలగ్నులకు నిలన్ ధరణిఁ గాచిన కిరిదంష్ట్రవీవు.

తే.గీ.  శంకరుని యాత్మలో వెల్గు శశివి నీవు,

రామకృష్ణుని కవితాభిరామమీవు,

పాఠకులచిత్తముల నిల్చు ప్రతిభవీవు,

నిన్ను సేవించువారిలోనున్నదీవు. 3

తాత్పర్యం

అమ్మా !నీ చరణ పద్మ రేణువు అజ్ఞానము అను చీకటితో ఉన్న వానికి సూర్యోదయము జరుగు పట్టణము వంటిది, మంద బుద్ధులకు చైతన్యము అను పుష్పముల నుండి వెలువడిన మధుర ధార వంటిది,  దరిద్రముతో ఉన్న వానికి చింతామణుల హారము వంటిదియు, సంసార సముద్రమున మునిగిన వానికి వరాహావతారము అగు విష్ణు మూర్తి యొక్క కోర వంటిది కదా !

శ్లో.  త్వదన్యః పాణిభయా-మభయవరదో దైవతగణః
త్వమేకా నైవాసి ప్రకటిత-వరభీత్యభినయా |
భయాత్ త్రాతుం దాతుం ఫలమపి వాంఛాసమధికం                                                                లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ || 4 ||

సీ.  నీకంటెనన్యులౌ నిఖిలదేవతలెన్న నభయముద్రను గల్గి యలరుదురిల,

శ్రీద! వరాభయచిహ్నముల్ ప్రకటితముద్రల నభినయము గల తల్లి

వీవేను ముఖ్యమౌ యీశ్వరీ! సృష్టిలో కారణమొకటుండె కలదు, నిజము,

కోరకముందేను కోరికలను దీర్చి నీ పాదముల్ భీతినే దహించు,

తే.గీ.  అట్టి నీ పాదములు నేను పట్టనుంటి,

శరణు కోరుచు, మాయమ్మ! శరణమిమ్మ.

రామకృష్ణుని కవితలో ప్రాణమగుచు

వెలుఁగు మాయమ్మ! నిన్ను నే విడువనమ్మ! 4

తాత్పర్యం

అమ్మా! లోకములకు దిక్కు అయిన తల్లీ! మిగిలిన దేవతలు అందరూ అభయ ముద్రలను కలిగి ఉన్నారు.  అందరు దేవతలకు ముఖ్యమయిన నీవు మాత్రము వరాభయ గుర్తులు అయిన ప్రకటిత ముద్రల అభినయము కల దానవు. అయితే కోరక ముందే నీ పాదములు కోరికలు తీర్చి, భయములు పోగొట్టును కదా

శ్లో.  హరిస్త్వామారాధ్య ప్రణత-జన-సౌభాగ్య-జననీం
పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభ మనయత్ |
స్మరోஉపి త్వాం నత్వా రతినయన-లేహ్యేన వపుషా
మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్ || 5 ||

ఉ.  నీ యభయమ్మునొంది హరి నేర్పుగస్త్రీ యవతారమెత్తి, తా

మాయను ముంచె నా శివుని, మన్మధుడున్ నిను పూజ చేయుటన్

శ్రేయము పొందె భార్య రతి ప్రేమను చూరకొనంగ గల్గె, సు

జ్ఞేయము నీ మహత్త్వముమిదె, చేసెద నీకు నమశ్శతంబులన్. 5

తాత్పర్యం :  

అమ్మా ! లోకములకు సౌభాగ్య ప్రదురాలవు అయిన నీ అభయము వలన విష్ణుమూర్తి స్త్రీ అవతారము ఎత్తి పరమ శివుని కూడా ప్రభావితము చేసెను కదా , అటులనే మన్మధుడు కూడా నిన్ను పూజించి రతీదేవికి ఇష్ట సఖుడే కాక మునుల మనస్సులు కూడా మోహ పెట్టుటకు సరి అయిన వ్యక్తి అయినాడు కదా

శ్లో.  ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచ విశిఖాః
వసంతః సామంతో మలయమరు-దాయోధన-రథః |
తథాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం
అపాంగాత్తే లబ్ధ్వా జగదిద-మనంగో విజయతే || 6 ||

సీ.  హేమాద్రి పుత్రి! నిన్నేమని పొగడుదు, నీచూపు పడెనేని నిత్య శుభము

లందగవచ్చును, మందస్మితా! నీదు కడగంటి చూపునన్ కంతుడిలను

పూలవిల్లే కల్గి, పూర్తిగా తుమ్మెదల్ నారిగా కల్గియనారతంబు

నైదు బాణములనే, యాయుధంబుగ కల్గి, జడుఁడుగా నుండియు వడివడిగను

తే.గీ.  మలయ మారుత రథముపై మసలుచుండి

సృష్టినే గెల్చుచుండె, నీ దృష్టికొఱకు

భక్తులల్లాడుచుంద్య్రు సృష్టిలోన

చూచి రక్షించు, నేనును వేచియుంటి. 6

తాత్పర్యం

అమ్మా ! హిమవత్పర్వత రాజ పుత్రీ ! పూవులతో కూడిన విల్లు, తుమ్మెదల తో చేయబడిన నారి, అయిదు బాణములు, జడత్వము కలవాడునూ,మలయ మారుతమే యుద్ధ రధముగా గల మన్మధుడు సైతము నీ కడగంటి చూపు వలన జగత్తునే జయించుచున్నాడు కదా

శ్లో.  క్వణత్కాంచీ-దామా కరి కలభ కుంభ-స్తననతా
పరిక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్ర-వదనా |
ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః
పురస్తా దాస్తాం నః పురమథితు రాహో-పురుషికా || 7 ||

సీ.  మణిమయ గజ్జలన్, మహనీయ మేఖల మిలమిల కనిపించు మెఱుపుతోడ,

గున్నయేనుగు యొక్క కుంభంబులన్ బోలు పాలిండ్ల బరువుచే వంగినదియు,

సన్నని నడుముతో శరదిందుముఖముతో,చెరకు విల్లు, పూలచెండుటమ్ము

నంకుశమ్మును గల్గి, యరచేతఁ బాశమ్ము గల్గి చూపులనహంకారమొప్పి

తే.గీ.  లోకములనేలు మాతల్లి శ్రీకరముగ

మాకునెదురుగ నిలుచుత మమ్ము గావ,

జన్మసాఫల్యమును బొంద, సన్నుతముగ

ముక్తి సామ్రాజ్యమందగాఁ బొలుపుమీర. 7

తాత్పర్యము.. 

మిల మిల మెరయుచున్న మణుల గజ్జెల మొలనూలు కలిగిన,  గున్న ఏనుగు కుంభముల వంటి కుచముల భారము వలన వంగిన నడుము ఉన్నట్లు కనపడుతున్నదియు, సన్నని నడుము కలిగి, శరత్కాల చంద్రుని వంటి ముఖము కలదియు, చెరకుగడ విల్లునూ, పూవుటమ్మును, అంకుశమును, పాశమును ధరించు చున్న అహంకార రూపు కలిగిన దేవి మా ఎదుట నిలుచు గాక

శ్లో.  సుధాసింధోర్మధ్యే సుర విటపి వాటీ పరివృతే
మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే |
శివాకారే మంచే పరమశివ-పర్యంక నిలయామ్
భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానంద-లహరీమ్ || 8 ||

సీ.  అమృత సింధువు మధ్య నమరిన రతనాల దీవియందున్నట్టి దివ్యమైన

కల్పవృక్షంబుల ఘన కదంబముల పూ తోటలోపలనున్న మేటియైన

చింతామణులనొప్పు శ్రీకరంబైనట్టి గృహములో శివునియాకృతిగనున్న

మంచంబున శివుని మంగళోరువు గొప్ప స్థానంబుగా కల జ్ఞానపూర్ణ

తే.గీ.  వరదయానంద ఝరివైన భవ్యరూప!

ధన్య జీవులు కొందరే ధరను నీకు

సేవచేయగా తగుదురు, భావమందు

నాకు నీవుండుమా జగన్మాత! కృపను. 8

తాత్పర్యము.

అమ్మా ! అమృత సముద్రము మధ్య భాగమున ఉన్న రతనాల దీవి యందు కల్ప వృక్షములు, కదంబ పూతోట లోపల చింతామణులతో నిర్మిచబడిన గృహము నందు శివుని రూపముగా గల మంచమున పరమ శివుని తొడయే స్థానముగా గల జ్ఞానానంద ప్రవాహ రూపిణియగు నిన్ను కొందరు ధన్యులు మాత్రమే సేవించు చున్నారు

శ్లో. మహీం మూలాధారేకమపి మణిపూరే హుతవహం 

స్థితం స్వాధిష్టానేహృది మరుత మాకాశ ముపరి

మనోపి భ్రూమధ్యేసకలమపి భిత్వా కులపథం

సహస్రారే పద్మేసహ రహసి పత్యా విహరసేll || 9 ||

సీ.  పూజ్య పృథ్వీతత్వముగను మూలాధారముననుండు తల్లివి ఘనతరముగ,

జలతత్త్వముగనీవుకలుగుచు మణిపూర చక్రమందుననొప్పు చక్కనమ్మ!

యగ్నితత్త్వమ్ముగానమరియుంటివిగ స్వాధిష్టానచక్రాన భవ్యముగను,

వాయుతత్త్వమ్ముగా వరలియుంటివి యనాహతచక్రమందుననుతిగ జనని!

తే.గీ.  యలవి శుద్ధచక్రాన నీ వాకసముగ,

మనసువగుచు నాజ్ఞాచక్రముననునిలిచి,

మరి సహస్రారము సుషుమ్న మార్గమునను

చేరి, పతితోడ విహరించు ధీర వమ్మ! 9

తాత్పర్యము.

అమ్మా ! పృథ్వి తత్వముగా మూలాధార చక్రమున, జల తత్వముగా మణిపూర చక్రమున, అగ్ని తత్వముగా స్వాధిష్టానమున, వాయు తత్వముగా అనాహత చక్రమున, ఆకాశ తత్వముగా విశుద్ద చక్రమున,  మనస్తత్వము గా ఆజ్ఞా చక్రమున ఉండి, పైన సుషుమ్నా మార్గము గుండా సహస్రారము చేరి, పతి యగు పరమేశ్వరునితో కలసి విహరించు చున్నావు

శ్లో.  సుధాధారాసారై-శ్చరణయుగలాంత-ర్విగలితైః
ప్రపంచం సిన్ఞ్ంతీ పునరపి రసామ్నాయ-మహసః|
అవాప్య స్వాం భూమిం భుజగనిభ-మధ్యుష్ట-వలయం
స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి || 10 ||

సీ.  శ్రీపాదముల నుండి చిందుచుఁ బ్రవహించు నమృతవర్షంబుతో నలరు నీవు

నిండుగ డబ్బది రెండు వేలున్నట్టినాడీప్రపంచముందడుపుఉండి,

యమృతాతిశయమున యలరెడి చంద్రుని కాంతిని కలుగుచు, కదలుచుండి

మరలమూలాధార మహిత చక్రము చేరి, స్వస్వరూపంబగు సర్పరూప

తే.గీ.  మునను చుట్టగాచుట్టుకొనిన జననివి,

నీవె కుండలినీశక్తి, నిదురపోవు

చుందువమ్మరో మాలోననుందువీవె.

వందనమ్ములు చేసెద నిందువదన! ॥ 10

తాత్పర్యము.

అమ్మా! పాద పద్మముల నుండి ప్రవహించిన అమృత ధారా వర్షముతో డెబ్బది రెండు వేల నాడుల ప్రపంచమును తడుపుతూ తిరిగి అమ్రుతాతిశయము గల చంద్రుని కాంతి కలిగి మరల మూలాధార చక్రమును చేరి స్వస్వరూపమయిన సర్ప రూపముతో చుట్టలుగా చుట్టుకొని కుండలినీ శక్తివయి నిద్రించు చున్నావు.

శ్లో.  చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిపి
ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి మూలప్రకృతిభిః |
చతుశ్చత్వారింశద్-వసుదల-కలాశ్చ్-త్రివలయ-
త్రిరేఖభిః సార్ధం తవ శరణకోణాః పరిణతాః || 11 ||

సీ.  శ్రీచక్రమది నాల్గు శివచక్రములు, వాటి నుండియే విడివడియున్న శక్తి

చక్రములైదుతో జక్కఁగనున్నట్టి, సృష్టికి మూలమై చెలగుచున్న

తత్త్వమ్ముతోఁ గూడి తనరు నీ వాసమౌ శ్రీచక్రమందలి చెలగు కోణ

ములవష్టదళముల నలపద్మషోడశ మును మేఖలాతంత్రముగను, మూడు

తే.గీ.  భూపురములును కలిసిన మొత్తమటుల

నలుబదియునాలుగంచులు కలిగియుండె,

నమ్మ నీవాసమపురూపమైనదమ్మ!

నెమ్మినిన్ను నే బూకింతునమ్మ  నమ్మి. 11

తాత్పర్యముఅమ్మా ఈశ్వరీ ~ శ్రీచక్రం~ నాలుగు శివచక్రాలు, వాటినుండి విడివడిన ఐదుశక్తి చక్రాలతో ఉన్నది. ప్రపంచానికి మూలకారణమైన తత్త్వముతో కూడిన నీ నివాసమైన శ్రీచక్రంలోని కోణాలు~ అష్టదళాలు~ షోడశదళ పద్మాలు~ మేఖలాతంత్రంగా మూడు భూపురాలు కలిసి నలభైనాలుగు అంచులు కలిగివున్నాయి.‌ 

శ్లో.12.  త్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే తులయితుం
కవీంద్రాః కల్పంతే కథమపి విరించి-ప్రభృతయః |
యదాలోకౌత్సుక్యా-దమరలలనా యాంతి మనసా
తపోభిర్దుష్ప్రాపామపి గిరిశ-సాయుజ్య-పదవీమ్ || 12 ||

శా.  నీ సౌందర్యము పోల్చగా తగరు ఖ్యాతిన్ బ్రహ్మయున్ సత్ కవుల్,

నీ సౌందర్యము గాంచి యప్సరసలున్ నీన్బోలలేనందునన్

ధ్యాసన్ నిల్పి మహేశ్వరున్ మనమునన్ ధ్యానించి తాదాత్మ్యతన్

భాసింపంగన జూతురైక్యమగుచున్, భద్రేభయానా! సతీ! 12

తాత్పర్యముఓహిమవత్పర్వత రాజ తనయా ! నీ సౌందర్యమును పోల్చుటకు బ్రహ్మదేవుడు మొదలయిన కవి పుంగవులు కూడా సమర్ధులు కాకుండిరి. ఎందువలన అనగా సృష్టి లోని సౌందర్య రాశులు అయిన అప్సరసలు కూడా నీ అందమునకు ఆశ్చర్యము పొంది, తాము నీతో సరిపోలము అని మనస్సులో శివునితో ఐక్యము కోరుతున్నారుట.

శ్లో.  నరం వర్షీయాంసం నయనవిరసం నర్మసు జడం
తవాపాంగాలోకే పతిత-మనుధావంతి శతశః |
గలద్వేణీబంధాః కుచకలశ-విస్త్రిస్త-సిచయా
హటాత్ త్రుట్యత్కాఞ్యో విగలిత-దుకూలా యువతయః || 13 ||

శా.  కన్నుల్ కాంతి విహీనమై జడుఁడునై కాలంబికన్ జెల్లెనం

చెన్నంజాలిన వానిపైన బడినన్ హృద్యంపు నీ చూపహో!

కన్నెల్ చూడగ నెంచి వానిని మదిన్ గాంక్షించుచున్ బయ్యెదల్

క్రన్నన్ జారఁగ, నీవి, మేఖలలు జారన్ బర్వునన్ వత్తురే. 13

తాత్పర్యము

అమ్మా ! పురుషుడు ముదుసలి అయి శరీరము ముడుతలు పడి, కళ్ళనిండా పుసులు ఉండి మసక చూపు కలిగి, శృంగార భాషణములు కూడా చేయలేని మూఢుడయిన వాడు అయినా నీ క్రీగంటి చూపులకు పాత్రమయిన వానిని చూచుటకు వందల కొలది మదవతులు తమ జుట్టు ముడులు విడిపోవుచున్ననూ, పయ్యెదలు జారిపోవు చుండగా, బంగారు మొలనూలులు జారిపోవుచుండగా వానిని చూచుటకు పరిగెత్తుకుని వెంట పడుతున్నారు కదా.  

శ్లో.  క్షితౌ షట్పంచాశద్-ద్విసమధిక-పంచాశ-దుదకే
హుతశే ద్వాషష్టి-శ్చతురధిక-పంచాశ-దనిలే |
దివి ద్విః షట్ త్రింశన్ మనసి చతుఃషష్టిరితి యే
మయూఖా-స్తేషా-మప్యుపరి తవ పాదాంబుజ-యుగమ్ || 14 ||

సీ.  భూతత్త్వముననొప్పి పూజ్య మూలాధార ముననేబదారు కిరణములుండ,

జలతత్త్వముననున్న చక్కని మణిపూరముననేబదియురెండు ఘనతనుండ,

నగ్నితత్త్వంబుననలరి స్వాధిష్ఠానముననరువదిరెండుప్రనుతినుండ,

వాయు తత్త్వముతోడవ ననాహతమునందు నేబది నాలుగుధృతిని యుండ,

నాకాశ తత్త్వాన నలవిశుద్ధమునందు డెబ్బదిరెండుఘటిల్లియుండ,

మానస తత్త్వాన మహిత యాజ్ఞాచక్రముననరువదినాల్గువినుతినొప్ప

తే.గీ.  నట్టి వాని సహస్రారమందునున్న

బైందవ స్థాననమున నీదు పాదపంక

జంబు లొప్పి యుండును తేజసంబు తోడ,

నట్టి నింగొల్తునమ్మరో! యనుపమముగ. 14

తాత్పర్యము.

అమ్మా ! సాధకుని దేహమందు పృధ్వీ తత్వముతో ఉన్న మూలాధారమునందు ఏబది ఆరును, జల తత్వముతో ఉన్న మణిపూరము నందు ఏబది రెండునూ, అగ్నితత్వమగు స్వాదిస్ఠానమునందు అరువది రెండునూ, వాయుతత్వముతో కూడిన అనాహతమునందు ఏబది నాలుగునూ, ఆకాశతత్వమయిన విశుద్ధచక్రమునందు డెబ్బది రెండునూ, మనస్తత్వముతో కూడిన ఆజ్ఞాచక్రమందు అరువది నాలుగున్నూ కిరణములు గలవో వాని పై భాగమున ఉండు సహస్రదళ మధ్యనున్న బైందవ స్థానమున నీ యొక్క పాదముల జంట నర్తించును,  

శ్లో.  శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత-జటాజూట-మకుటాం
వర-త్రాస-త్రాణ-స్ఫటికఘుటికా-పుస్తక-కరామ్ |
సకృన్న త్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే
మధు-క్షీర-ద్రాక్షా-మధురిమ-ధురీణాః ఫణితయః || 15 ||

సీ.  శరదిందు చంద్రికల్ సరితూగనంతటి నిర్మలదేహంపు నెలతవీవు,

పిల్ల జాబిలి తోడనల్లమెలతలొందు నుతకిరీటమునొప్ప యతివవీవు,

కోరికల్ తీర్చెడి తీరైన వరముద్ర,భయమును బాపుయభయపు ముద్ర,

స్పటిక మాలను దాల్చి, సన్నుతంబుగ దివ్య పుస్తకంబును దాల్చి నిస్తులవయి

తే.గీ.  యొప్పు నీకు వందనములు గొప్పగాను

చేయు సుజ్జనులకునబ్బును శ్రీకరముగ

మధువు, గోక్షీర, ఫలరస మాధురులను

మించు వాగ్ధాటి కలుగును మేల్తరముగ. 15  

తాత్పర్యము.

అమ్మా ! శరత్కాలమునందు ఉండు వెన్నెల వలె నిర్మలమయిన శరీరము కల దానవు, పిల్ల జాబిల్లితో కూడిన జడ ముడి ఉన్న కిరీటము కల దానవు, కోరికలు తీర్చు వరముద్ర, భయమును పోగొట్టు అభయముద్ర కల దానవు, స్ఫటిక పూసల జపమాలను, పుస్తకమును చేతుల యందు ధరించిన నిన్ను ఒక్క పరి అయినా నమస్కరించు సజ్జనులకు తేనె, ఆవు పాలు, ద్రాక్ష పండ్ల యొక్క మధురములను అందించు వాక్కులు రాకుండా యెట్లు ఉండును. తప్పక వచ్చును కదా !

శ్లో.  కవీంద్రాణాం చేతః కమలవన-బాలాతప-రుచిం
భజంతే యే సంతః కతిచిదరుణామేవ భవతీమ్ |
విరించి-ప్రేయస్యా-స్తరుణతర-శ్రృంగార లహరీ-
గభీరాభి-ర్వాగ్భిః ర్విదధతి సతాం రంజనమమీ || 16 ||

చం.  కవుల మనములన్ జలజ గౌరవ సద్వన సూర్యకాంతివౌ

ప్రవర మనోజ్ఞమౌ యరుణ పావననామ! నినున్ భజించు సత్

ప్రవరులు బ్రహ్మరాణివలె భాసిలు దివ్య రసప్రథాన సు

శ్రవణ కుతూహలంబయిన చక్కని వాగ్ఝరితో రహింతురే. 16

తాత్పర్యము.

అమ్మా ! కవి శ్రేష్ఠుల చిత్తములనెడి పద్మ వనములకు బాల సూర్యుని కాంతివగు అరుణ అను నామము కల నిన్ను కొందరు సత్పురుషులు సేవించుచున్నారో వారు బ్రహ్మ ప్రియురాలు అగు సరస్వతీదేవి వలె మిక్కిలి శృంగార రస ప్రధానములతో గంభీరములు అయిన వాక్కులతో సత్పురుషుల హృదయాలను రంజింప చేయు చున్నారు కదా !

శ్లో.  సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగరుచిభిః
వశిన్యాద్యాభిస్త్వాం సహ జనని సంచింతయతి యః
కర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః
వచోభిర్వాగ్దేవీవదనకమలామోదమధురైః 17

ఉ.  తెల్లని చంద్రకాంత శిల తీరునవెల్గుచు, నష్టసిద్ధులన్

మల్లెలఁ బోలు యోగులననారతమొప్పుచు వెల్గుచుండు ని

న్నుల్లము పొంగ నిత్యము మహోన్నత భక్తిని గొల్తురెవ్వ రా

చల్లని సత్కవుల్ కవన సంపద శారద పూర్ణ తేజమే. 17

తాత్పర్యము.

అమ్మా ! చంద్ర కాంత మణుల శిలా కాంతి వంటి కాంతి కలిగి వసిన్యాది అష్ట శక్తులతోనూ ద్వాదశ యోగినులూ కలిగిన నిన్ను ఎవ్వడు చక్కగా ధ్యానము చేయు చున్నాడో అతడు కాళిదాస వ్యాసాదులు మొదలుగా గల మహాత్ముల రచనల వలె మనోహరములయినట్టియు సరస్వతీదేవి ముఖ కమలము యొక్క పరిమళములు గల రచనలు చేయుటకు సమర్ధులు అగుచున్నారు కదా !

శ్లో.  తనుచ్ఛాయాభిస్తే తరుణ-తరణి-శ్రీసరణిభి-
ర్దివం సర్వా-ముర్వీ-మరుణిమని మగ్నాం స్మరతి యః |
భవంత్యస్య త్రస్య-ద్వనహరిణ-శాలీన-నయనాః
సహోర్వశ్యా వశ్యాః కతి కతి గీర్వాణ-గణికాః || 18 ||

శా.  ప్రాతఃకాలరవిప్రభారుణరుచిన్ భాసిల్లు నిన్ గొల్చునా

శీతాంశుల్ కవిచంద్రులే కనగ రాశీభూత భక్తిద్యుతుల్,

నీ తత్త్వజ్ఞులు వారు, సత్య గతివౌ నిన్నాత్మలన్ నిల్పుచున్

ఖ్యాతినివెల్గెడి పుణ్యమూర్తులిల, స్త్రీవ్యామోహదూరుల్ సతీ! 18

తాత్పర్యం :

అమ్మా ! ఉదయపు సూర్యుని శోభను పోలిన శోభ కలిగిన నీ శరీరమును ఎఱ్ఱ దనముతో నిండిన ఆకాశముగా ఎవ్వరు పూజించు చున్నారో అట్టి వారు, తొట్రుపాటు పడుచూ అడవుల యందున్న లేళ్ళ కన్నుల వంటి కన్నులు కల అప్సరసలకు సైతము వశము కారు కదా

శ్లో.  ముఖం బిందుం కృత్వా కుచయుగమధ-స్తస్య తదధో
హరార్ధం ధ్యాయేద్యో హరమహిషి తే మన్మథకలామ్ |
సద్యః సంక్షోభం నయతి వనితా ఇత్యతిలఘు
త్రిలోకీమప్యాశు భ్రమయతి రవీందు-స్తనయుగామ్ || 19 ||

సీ.  శ్రీచక్రముననున్నచిన్మయ బిందువున్ నీముఖసీమగాఁ బ్రేమఁ గనుచు,

దానిక్రిందను కుచ ద్వయము నాక్రిందను శివునర్థభాగమౌభవుని సతిని,

బిందువు క్రిందను వెలుగు త్రికోణాన క్లీమ్ బీజమున్ మదిన్ లీలఁ గనుచు

నెవరుందురో వార లెవరినైననుగాని మోహంబులో ముంచి ముగ్ధులవఁగఁ

తే.గీ. జేయఁ గలుగుదురోయమ్మ! శ్రీకరమగు

దివ్యమైనట్టి యీ శక్తి భవ్యమైన

నీదు మేరువుదమ్మరో!, నిజము గనిన,

అమ్మ! నీపాదములకు నా వందనమ్ము. 19

తాత్పర్యము.

అమ్మా! పరమశివుని పత్నీ~ పార్వతీ~ శ్రీచక్రం లోని బిందువును నీ ముఖముగాను~ దానిక్రింద స్తనములు~ క్రింద శివుని శరీరం లోని సగమైన శక్తిని~ బిందువు క్రింది త్రికోణం లోక్లీంబీజాన్ని భావిస్తూ ఎవడు ధ్యానిస్తాడో అతడు త్రిలోకాలనూ మోహపెట్టగలడు కదా తల్లీఅంతటి గొప్పదనం నీ మేరు స్వరూపానిది కదా

శ్లో.  కిరంతీ-మంగేభ్యః కిరణ-నికురుంబమృతరసం
హృది త్వా మాధత్తే హిమకరశిలా-మూర్తిమివ యః |
సర్పాణాం దర్పం శమయతి శకుంతధిప ఇవ
జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారసిరయా || 20 ||

సీ.  ఆపాద మస్తకంబంతటి కిరణాలఁ బ్రసరించు నమృతమ్ము నసమరీతిఁ

గురిపించుచున్నట్టి నిరుపమ శశిశిలా మూర్తిగా భావించిస్ఫూర్తితోడ

నేసాధకుండునిన్హితముతోఁబ్రార్థించునట్టివాఁడసమానుఁడయినగొప్ప

గరుడుని యట్టుల నురగ దంష్ట్రలనుండివెల్వడు విషమునువింతగాను

తే.గీ.  బాపువాఁడగుచుండెను,జ్వరముతోడ

బాధనందువారికి సుల్ పారజేయు

కంటిచూపిచే తగ్గించఁ గలుగుచుండు

నమ్మ! నావందనములందుకొమ్మ నీవు. 20

తాత్పర్యము.

అమ్మా ! పాదముల మొదలు శరీరము అంతటి కిరణముల నుండి ప్రసరించు చున్న అమృతము ను కురిపించుచున్న చంద్రకాంత శిల్పా మూర్తిగా నిన్ను సాధకుడు ప్రార్ధించు చున్నాడో అట్టి వాడు గరుత్మంతుని వలె పాముల నుండీ వెలువడుచున్న విషమును హరింప చేయుచున్నాడు, జ్వరముతో భాధింప పడు వానిని అమృతము ధారగా కలిగిన తన నాడుల యొక్క శీతలమయిన చూపుచేత జ్వరబాధను తగ్గించి సుఖమును కలుగ చేయుచున్నాడు కదా

శ్లో.  తటిల్లేఖా-తన్వీం తపన శశి వైశ్వానర మయీం
నిష్ణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలామ్ |
మహాపద్మాతవ్యాం మృదిత-మలమాయేన మనసా
మహాంతః పశ్యంతో దధతి పరమాహ్లాద-లహరీమ్ || 21 ||

తే.గీ.  దేహమన్ తటిల్లతలోమ దీప్త

చంద్ర సూర్యగ్నులుండెడి షట్ సుచక్ర

ములకుపై సహస్రారానమెలగు నిన్ను

సుందరాత్ముఁడే గాంచి యానందమందు 21 .

తాత్పర్యము

అమ్మా! మెరపు తీగవలె సూక్ష్మముగా పొడవుగా ఉన్న, సూర్యుడు చంద్రుడు మరియు అగ్ని రూపముగా యున్న ఆజ్ఞా మొదలగు ఆరు చక్రముల పైన బిందు స్థానమయిన తామరముల అడవి ( సహస్రారము ) నందు కూర్చున్న దానివి అవిద్య అహంకారము అను మాయలను విడిచి నిన్ను చూచుచున్న మహాత్ములు పరమానందము కలిగి జీవించుచున్నారు కదా.

శ్లో.  భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం
ఇతి స్తోతుం వాఞ్ఛన్ కథయతి భవాని త్వమితి యః |
తదైవ త్వం తస్మై దిశసి నిజసాయుజ్య-పదవీం
ముకుంద-బ్రమ్హేంద్ర స్ఫుట మకుట నీరాజితపదామ్ || 22 ||

ఉ.  అమ్మ! భవాని! దాసుఁడననంటిని యిట్టుల, నోటివెంట నే

నమ్మ! భవాని! యంటినని యార్ద్రమనంబున, దేవతాళిచే

నెమ్మిని సేవలన్ గొనెడి నిత్యవసంత సుపాదపద్మ పీ

ఠమ్మునఁ జేరఁజేయుచు నెడందను నన్ గని ముక్తి నిత్తువే. 22

తాత్పర్యము :  

అమ్మా ! భవానీ నీ యొక్క దాసుడు అయిన నా మీద నీ యొక్క దయతో కూడిన చూపులు ప్రసరించుమని వేడుటకు సిద్ధపడి అమ్మా భవానీ అని రెండు పలుకులు నోటి వెంట రాగానే బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మొదలగువారి కిరీటములచే నీరాజనము చేయుచున్న పాదపద్మములు గల నీ సాయుజ్యమును ఇచ్చుచున్నావు కదా

శ్లో.  త్వయా హృత్వా వామం వపు-రపరితృప్తేన మనసా
శరీరార్ధం శంభో-రపరమపి శంకే హృతమభూత్ |
యదేతత్ త్వద్రూపం సకలమరుణాభం త్రినయనం
కుచాభ్యామానమ్రం కుటిల-శశిచూడాల-మకుటమ్ || 23 |

సీ.  వామ భాగమునందు వరలుచు శివునిలో, సంతృప్తి గనకేమొ శంభురాణి!

మిగిలిన దేహాన మేలుగానిలిచినట్లనిపించుచుండెనో యమ్మ! కమగ,

నామది ముకురాన నీ మాన్య తేజంబు కనిపించునట్టులో కంబు కంఠి!

ఉదయభానుని తేజమది నీదు దేహంబునుండిభానుఁడు కోరి పొందియుండు.

తే.గీ.  నంతచక్కమి కాంతితో సుంత వంగె

స్థనభరంబుననన్నట్లు సన్నుతముగ

మూడు కన్నులతో వంపు తోడనొప్పె,

నీవు శివతత్త్వపూర్ణవో నిరుపమాంబ!. 23

తాత్పర్యము :

జగన్మాతా! తల్లీ! అమ్మా! నీవు ముందర శివశంభుడి వామ భాగాన్ని గ్రహించావు.అయినా నీకు తనివి తీర లేదనిపిస్తుంది.ఎందుకంటే తనివితీరని మనస్సుతో అర్థనారీశ్వరుడి మిగిలిన సగ భాగంకూడా ఆక్రమించావనిపిస్తుంది. నాకు ఎందుకు ఇలా అనిపిస్తుందంటే నా హృదయఫలకం పైన విరాజిల్లుతున్న నీ దివ్య స్వరూపం అలా గోచరిస్తున్నది. నీ దివ్య స్వరూపం ఉదయ భానుడి కాంతితో సాటి వచ్చే కెంపు కాంతులతో ఒప్పారుతూ వుంది. పాలిండ్ల జంటతో యించుక ముందుకు వంగినట్లు కనపడుతూ వుంది. నీ దివ్య స్వరూపం మూడు కన్నులు కలిగి, వంపు తిరిగిన చంద్రకళ శిరోమణిగా ఉన్న కిరీటంతో సొంపారుతూ, విరాజిల్లితుంది. దీని భావం ఏందంటే అమ్మవారు తనలో శివతత్త్వాన్ని లయం చేసుకున్నారని.

శ్లో.  జగత్సూతే ధాతా హరిరవతి రుద్రః క్షపయతే
తిరస్కుర్వ-న్నేతత్ స్వమపి వపు-రీశ-స్తిరయతి |
సదా పూర్వః సర్వం తదిద మనుగృహ్ణాతి శివ-
స్తవాఙ్ఞా మలంబ్య క్షణచలితయో ర్భ్రూలతికయోః || 24 ||

ఉ.  నీ కను సన్నలన్ విధి గణించి సృజించును సృష్టి, విష్ణు వా

శ్రీకర సృష్టిఁ బెంచు, లయ చేయు శివుండది, కల్పమంతమం

దా ఘనుఁడౌ సదాశివుఁడె యంతయు లోనికి చేర్చుకొంచు, తా

నీ కను సన్నలన్ మరల నేర్పునఁ జేయఁగ జేయు వారిచే. 24

తాత్పర్యము.

మాతా! తల్లీ! భగవతీ! అమ్మా! సృష్టికి కర్త అయిన బ్రహ్మ విశ్వాన్ని సృష్టిస్తున్నాడు. మహావిష్ణువు ఏమో రక్షిస్తున్నాడు. రుద్రుడు ఏమో విశ్వాన్ని లయింప చేస్తున్నాడు. కల్పాంతం లో మహేశ్వరుడు బ్రహ్మ, విష్ణువు, రుద్రులను తనలో లీనం చేసుకొని సదాశివతత్త్వంలో అంతర్భూతం చేస్తున్నాడు. ప్రకారంగా బ్రహ్మాండం అంతా లయమయిపోతుంది. మళ్ళీ   సదాశివుడు కల్పాదిలో నీవు నీ కనుబొమ్మలను ఒక్క క్షణం కదిలించగానే, అదే ఆజ్ఞగా  గ్రహించి నాలుగు తత్త్వాలతో మళ్ళీ యథావిధిగా సృష్ట్యాది కార్యాలు జరిపిస్తున్నాడు.

శ్లో.  త్రయాణాం దేవానాం త్రిగుణ-జనితానాం తవ శివే
భవేత్ పూజా పూజా తవ చరణయో-ర్యా విరచితా |
తథా హి త్వత్పాదోద్వహన-మణిపీఠస్య నికటే
స్థితా హ్యేతే-శశ్వన్ముకులిత కరోత్తంస-మకుటాః || 25 ||

ఉ.  నీదు గుణత్రయంబె వరణీయ త్రిమూర్తులు, కావునన్ సతీ!

నీదరి నిల్చి మ్రొక్కిన, గణింతురు వారలు వారికన్నటుల్,

మోదముతోడ నిన్నుఁ గని పూజ్యముగా మది నిల్పి గొల్తురే,

నీ దయ కల్గినన్ గలుగు నీ పద పంకజ సేవ మాకిలన్. 25

తాత్పర్యము.

మాతా! తల్లీ! అమ్మా! శివానీ! త్రిమూర్తులు నీ త్రిగుణాలవలన జనించిన వారే కదా. కావున నీ చరణాలకు మేము చేసే పూజే వారికి కూడా చేసే పూజ అవుతుంది. వారికి ఇంక వేరే పూజలు అవసరము లేదు. ఎందుకంటే వాళ్ళందరూ ఎల్లప్పుడూ నీ పాదాలను వహిస్తున్న నవరత్న ఖచ్చిత పీఠానికి దగ్గరగా చేరి, చేతులు తమ మణిమయ శిరోమకుటాలకు తాకేటట్లు పెట్టుకొని నీకు మొక్కుతూ వుంటారు. సర్వకాల సర్వావస్థలలో నీ ఆజ్ఞను శిరసావహిస్తుంటారు. కాబట్టి ఆతల్లి పాదసేవ ఆమె కటాక్షిస్తేనే మనకు దక్కేది అని దీని అంతరార్థం.

శ్లో.  విరించిః పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం
వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనమ్ |
వితంద్రీ మాహేంద్రీ-వితతిరపి సంమీలిత-దృశా
మహాసంహారేஉస్మిన్ విహరతి సతి త్వత్పతి రసౌ || 26 ||

చం.  కలిగెడి యా మహా ప్రళయ కాలమునందున బ్రహ్మ, విష్ణు రు

ద్రులు, యముఁడున్, గుబేరుఁడు,నరుల్దివిజాధిపుడింద్రుడున్, మునుల్

కలియుటనిక్కమెన్నగను కాలగతిన్,బ్రళయంబునందునన్

గలియుచు నిన్ను గూడి కరకంఠుడు తాను సుఖించునేకదా. 26,

తాత్పర్యము :

అమ్మా ! మహా ప్రళయము సంభవించినప్పుడు బ్రహ్మ, విష్ణువు కూడా అంతమును పొందెదరు. అందరికీ మృత్యు పాశములు వేయు యముడు కూడా మృత్యువును పొందుచున్నాడు. ధనమునకు అధిపతి అయిన కుబేరుడు కూడా మరణము చెందు చున్నాడు. ఇంద్రుడు మున్నగు దేవతలు, మునులు కూడా అంతము చెందుచున్నారు. అటువంటి మహా ప్రళయమునందు కూడా నీ పతి యగు సదాశివుడు నిన్ను చేరి స్వేచ్చగా నీతో విహారము చేయుచున్నాడు కదా

 శ్లో.  జపో జల్పః శిల్పం సకలమపి ముద్రావిరచనా
గతిః ప్రాదక్షిణ్య-క్రమణ-మశనాద్యా హుతి-విధిః |
ప్రణామః సంవేశః సుఖమఖిల-మాత్మార్పణ-దృశా
సపర్యా పర్యాయ-స్తవ భవతు యన్మే విలసితమ్ || 27 ||

తే.గీ.  నా క్రియాకల్పముల్ నీకు నాదు జపము,

నాదు ముద్రలున్ గమనమున్ నయనిధాన!

నీకు నా ప్రదక్షిణలగు! నేను నీకు

నిచ్చుహవిస్సులౌ నిచటి భుక్తి,

నావిలాసంబులవియెల్ల నతులు నీకు. 27.

తాత్పర్యము :

ఆత్మార్పణ-దృష్టితో నేను నీకు చేయు జపము నా సమస్తమైన క్రియాకల్పములు, నా ముద్రలు, నా గమనములు,  నేను చేయు ప్రదక్షిణలు,  భోజనాదులు, నీకు సమర్పించు హవిస్సులు,  ప్రణామములు, సాష్టాంగ నమస్కారములు, సుఖకరమైన నా విలాసములు, అన్నీ నీ సేవలే, నీ పూజలే. 

శ్లో.  సుధామప్యాస్వాద్య ప్రతి-భయ-జరమృత్యు-హరిణీం
విపద్యంతే విశ్వే విధి-శతమఖాద్యా దివిషదః |
కరాలం యత్ క్ష్వేలం కబలితవతః కాలకలనా
శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా || 28 ||

మ.  సుధ సేవించియు మృత్యువొందుదురుగా చూడంగ కల్పాంతమున్

విధి బ్రహ్మాదులె, కాలకూట విషమున్ విశ్వేశుఁడే త్రాగియున్

వ్యధనే పొందడు, నిన్నుఁ జేరి మనుటన్, భాస్వంతతాటంకముల్

సుధలన్ జిందునొ? నిన్నుఁ జేరి మనుటన్, శుభ్రాంతరంగప్రభా!  28.

తాత్పర్యము :

తల్లీ ! బ్రహ్మ ఇంద్రుడు ఆదిగాగల సకల దేవతలూ భయంకరమైన జరామృత్యువులను హరించే అమృతాన్ని గ్రోలియు ప్రళయకాలంలో మరణిస్తున్నారు. అతిభయంకరమై లోకాలను దహించే కాలకూటమనే మహావిషాన్ని భక్షించిననూ నీ పతి శివుడికి మరణం సంభవించలేదు. ఇందుకు ముఖ్యకారణం నీ చెవులకు భాసిల్లే రత్నతాటంకాల ( రత్నాల కమ్మల) ప్రభావమే కదా! ( తల్లియొక్క తేజస్సు మహిమ అంత అద్భుతమైనదని భావము)

శ్లో.  కిరీటం వైరించం పరిహర పురః కైటభభిదః
కఠోరే కోఠీరే స్కలసి జహి జంభారి-మకుటమ్ |
ప్రణమ్రేష్వేతేషు ప్రసభ-ముపయాతస్య భవనం
భవస్యభ్యుత్థానే తవ పరిజనోక్తి-ర్విజయతే || 29 ||

సీ.  విధికిరీటంబిది పదిలంబుగా నీవు తప్పించుకొని నడు, తగులకుండ,

హరి కిరీటంబది, యటు కాలు మోపకు, కాలుకు తగిలిన కందిపోవు,

యింద్రమకుటమది, యిటుప్రక్క పోబోకు, తగిలినచో బాధ తప్పదమ్మ,

ప్రణమిల్లుచుండిన భక్తుల మకుటమ్ము లనుచుపరిజనంబులనెడివాక్కు

తే.గీ.  లటకు నరుదెంచుచున్ననీ నిటలనయను

నకు పరిజనులముందున నయతనొప్పి

రాజిలుచును సర్వోత్కర్షతో జయంబు

గొల్పు,ను సదాశివునిగొల్చు కూర్మి జనని! || 29 ||

తాత్పర్యము :

అమ్మా! నీ ముందున్న  బ్రహ్మను తప్పించుకొని దూరముగా నడువుము.  విష్ణుమూర్తియొక్క కిరీటమును తప్పించుకొని దూరముగానుండుము.  మహేంద్రుని తప్పించుకొని  దూరముగా నడువుము. వీరు నమస్కరించుచుండగా,  నీ మందిరమునకు వచ్చిన,   పరమేశ్వరునకు వెంటనే, నీ పరిజనుల ముందు సర్వోత్కర్షతో విరాజిల్లు చున్నది. మూడు గ్రంథులుదాటి సదాశివస్థితికి చేరిన/చేరగలిగిన సాధకునకు జగత్తు ప్రణమిల్లును.

శ్లో.  స్వదేహోద్భూతాభి-ర్ఘృణిభి-రణిమాద్యాభి-రభితో
నిషేవ్యే నిత్యే త్వా మహమితి సదా భావయతి యః |
కిమాశ్చర్యం తస్య త్రినయన-సమృద్ధిం తృణయతో
మహాసంవర్తాగ్ని-ర్విరచయతి నీరాజనవిధిమ్ || 30 ||

శా.  అమ్మా నిత్యము నీవె సృష్టిని సతీ! యాద్యంతముల్ లేని నీ

కిమ్మున్ బుట్టిన నీప్రభా వృతముతో, హృద్యంపు సిద్ద్యాదులే,

నెమ్మిని జుట్టిగ మధ్య నున్న నిను నిత్యంబు నాతల్లియం

చిమ్మున్ వీడునొ యన్యమున్నతమికిన్ హృద్యంబె పాషాణమున్ || 30 ||

తాత్పర్యము :

అమ్మా నీవు నిత్యము, ఆద్యంతాలు లేనిదానవు, నీనుండి ఉద్భవించిన,  కిరణములతోను, అణిమాదిసిద్ధులతోను,  చుట్టియున్న నిన్ను, తనదానిగా ఎవ్వడు ధ్యానము చేయునో,  సర్వసమృద్ధిని తృణీకరించు అట్టి వానికి,  మహా ప్రళయాగ్నికూడా నీరాజనమును ఇచ్చుటలో ఆశ్చర్యము ఏమిఉన్నది.

శ్లో.  చతుః-షష్టయా తంత్రైః సకల మతిసంధాయ భువనం
స్థితస్తత్త్త-సిద్ధి ప్రసవ పరతంత్రైః పశుపతిః |
పునస్త్వ-న్నిర్బంధా దఖిల-పురుషార్థైక ఘటనా-
స్వతంత్రం తే తంత్రం క్షితితల మవాతీతర-దిదమ్ || 31 ||

సీ.  అరువదినాలుగౌ యపురూప తంత్రముల్ ప్రభవింపఁ జేసెను భవుఁడు తలచి,

యొక్కొక్కటొక్కొక్కటొప్పుగానొరలించు కోరిన విధముగా దారి చూపు,

హరుఁడు విశ్రమమొంద, హరుపత్నియౌ దేవి హరుని యాజ్ఞనుగొని వరలఁజేసె

శ్రీవిద్యననితరచిద్భాసమగు విద్య, విశ్వమందున బ్రహ్మ విద్య కలుగ

తే.గీ.  నాత్మనే దెల్పెడి దరయ నాత్మ విద్య,

రెంటికిసమన్వయముగూర్చి శ్రేయమునిడు

నట్టిదగు విద్య శ్రీవిద్య, పట్టినేర్వ

ముక్తి నిడునట్టి విద్య యీ పూజ్య విద్య. 31.

భావము.
అమ్మా, భగవతీ! పశుపతి అరవై నాలుగు విధాలైన మహామాయా శంబరాది తంత్రాలను భూమండలంలో ప్రవేశపెట్టాడు . సకలసిద్ది ప్రదాయకమూ , ఐహిక ఫల ప్రదాయికాలూ ఐన తంత్రాలద్వారా సమస్త ప్రపంచాన్ని మోహింపజేసి మిన్నకున్నాడు .మళ్ళా నీ అభీష్టం మేరకు ధర్మార్ధ కామమోక్షాలనే చతుర్విధ పురుషార్ధాలను ప్రసాదించేదైన నీ తంత్రాన్ని ( శ్రీవిద్యా తంత్రాన్ని ) లోకానికి ప్రసాదించాడు ..

శ్లో.  శివః శక్తిః కామః క్షితి-రథ రవిః శీతకిరణః
స్మరో హంసః శక్ర-స్తదను పరా-మార-హరయః |
అమీ హృల్లేఖాభి-స్తిసృభి-రవసానేషు ఘటితా
భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతామ్ || 32 ||

మ..  శివుఁడున్ శక్తియు కానుఁడున్ క్షితిరవుల్, శీతాంశుఁడట్లే స్మరుం

డవలన్ హంసయు, శక్రుఁడున్, గన ఘనంబౌనా పరాశక్తియున్,

భవుడౌ మన్మధుఁడున్, దగన్ హరియు,  నీభవ్యాళి సంకేతవర్ణో

ద్భవ హృల్లేఖలు చేరగా తుదిని నీ భాస్వంత మంత్రంబగున్. 32.

తాత్పర్యము :- జననీ! శివుడు, శక్తి, కాముడు, క్షితి; రవి, శీతకిరణుడు, స్మరుడు, హంసుడు, శుక్రుడు; పరాశక్తి, మన్మథుడు, హరి అనేవారి సంకేతాలైన వర్ణాలు, మూడు హృల్లేఖలు, చివరలో చేరగా వర్ణాలు మాతా! నీ నామరూపాలవుతున్నాయి (నీ మంత్రమవుతున్నవి). (మంత్రం హ్రీం, హ్రీం, హ్రీం, అని. ఇదే పంచదశీ మంత్రం లేక పంచదశాక్షరీ మంత్ర మవుతోందని తెలియనగును).

శ్లో.  స్మరం యోనిం లక్ష్మీం త్రితయ-మిద-మాదౌ తవ మనో
ర్నిధాయైకే నిత్యే నిరవధి-మహాభోగ-రసికాః |
భజంతి త్వాం చింతామణి-గుణనిబద్ధాక్ష-వలయాః
శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృత-ధారాహుతి-శతై || 33 ||

మ.  స్నర బీజంబును, యోని బీజమును, శ్రీ మాతృప్రభా బీజమున్,

వరలన్ నీదగు నామమంత్రములకున్ ప్రారంభమున్ నిల్పుచున్

వరచింతామణితావళాంచితులు సద్భావుల్ శివాగ్నిన్ నినున్

బరమానందము తోడఁ జేయుదురు సద్భావంబుతో హోమమున్,  33.

తాత్పర్యము :

, నిత్యస్వరూపురాలా! నీ మంత్రమునకు మొదట మన్మథ బీజము (క్లీం) భువనేశ్వరీ బీజమును(హ్రీం) శ్రీ బీజమును(శ్రీం) మూడింటినీ ఉంచి కొందరు మాత్రము, హద్దులులేని మహానందముయొక్క రసజ్ఞులు,  చింతా మణుల సమూహము చేత కూర్చబడిన అక్షమాలలు గలవారై, శివాగ్నియందు నిన్ను,  కామధేనువుయొక్క నేతిధారల ఆహుతులయొక్క పలు మారులు హోమముచేయుచు సేవించు చున్నారు.

శ్లో.  శరీరం త్వం శంభోః శశి-మిహిర-వక్షోరుహ-యుగం
తవాత్మానం మన్యే భగవతి నవాత్మాన-మనఘమ్ |
అతః శేషః శేషీత్యయ-ముభయ-సాధారణతయా
స్థితః సంబంధో వాం సమరస-పరానంద-పరయోః || 34 ||

చం.  శివునకు దేహమీవెగ, ప్రసిద్ధిగ నీవల సూర్య చంద్రులన్

గవలిగ వక్షమందుగల కాంతవు నిన్ శివుఁడంచు నెంచినన్

బ్రవిమల శేషి యా శివుఁడు, వర్ధిలు శేషము నీవె చూడగా,

భవుఁడు పరుండు,నీవు పరభవ్యునిసంతసమమ్మరో! సతీ!   34.

తాత్పర్యము : ఓ భగవతీ! నవాత్మకుఁడయిన శంభునకు సూర్యచంద్రులు వక్షోరుహములుగా ఉన్న నీవు శరీరమగుచున్నావు. కాబట్టి అతఁడు శేషి.  నీవు శేషము అగుచున్నారు. ఆయన పరుఁడు. నీవు పరానందవు. మీ యిద్దరికినీ ఉభయ సాధారణ సంబంధము కలదు.

శ్లో.  మనస్త్వం వ్యోమ త్వం మరుదసి మరుత్సారథి-రసి
త్వమాప-స్త్వం భూమి-స్త్వయి పరిణతాయాం హి పరమ్ |
త్వమేవ స్వాత్మానం పరిణ్మయితుం విశ్వ వపుషా
చిదానందాకారం శివయువతి భావేన బిభృషే || 35 ||

సీ.  ఆజ్ఞా సుచక్రాన నలమనస్తత్త్వమై, యలవిశుద్ధినిజూడ నాకసముగ,

వరననాహతమునవాయుతత్త్వంబుగా,నామణిపూరమందగ్నిగాను,

జలతత్త్వముగ నీవు కలిగి స్వాధిష్ఠాన,నరయ మూలాధారమందు పృథ్వి

గను నీవె యుంటివి, ఘనముగా సృష్టితో పరిణమింపగఁ జేయ వరలు నీవె

తే.గీ.  స్వస్వరూపమున్ సాంబునిగాసరగున గని

యనుపమాన్ందభైరవునాకృతి గను

ధారణను జేయుచున్ నీవు స్మేర ముఖిగ

నుండి భక్తులన్ గాచుచు నుందునమ్మ.  35.

తాత్పర్యము :

ఆజ్ఞాచక్రమునందలి మనస్తత్వమును, విశుద్ధిలోని ఆకాశతత్వమును,  అనాహతలోని వాయుతత్వమును, మణిపురలోని అగ్నితత్వమును,  స్వాధిష్ఠానలోని జలతత్వమును, మూలాధారచక్రములోని పృధ్వితత్వమును, నీవే తప్ప ఇంకొకరు లేరు. నీవే నీ స్వస్వరూపమును ప్రపంచరూపముతో పరిణమింపచేయుటకు, చిచ్ఛక్తియుతుడైన ఆనంద భైరవుని లేదా శివ తత్వమును శివయువతి భావముచే ధరించుచున్నావు.

శ్లో.  తవాఙ్ఞచక్రస్థం తపన-శశి కోటి-ద్యుతిధరం
పరం శంభు వందే పరిమిలిత-పార్శ్వం పరచితా |
యమారాధ్యన్ భక్త్యా రవి శశి శుచీనా-మవిషయే
నిరాలోకేஉలోకే నివసతి హి భాలోక-భువనే || 36 ||

చం.  రవిశశికోటి కాంతియుత భ్రాజిత మూర్తి, మహత్ పరంపు చి

ద్భవమహనీయ శక్తినిరుపార్శ్వములన్భవదీయ చక్రమౌ

స్తవమహితాజ్ఞకున్ గలుగు సన్నుత శంభుని కంజలింతు, నా

భవునినుతించు సాధకుఁడు భవ్య సహస్రమునందు వెల్గునే.  36.

తాత్పర్యము :

నీ సంబంధిత ఆజ్ఞా చక్రమందున్న కోటి సూర్య చంద్ర కాంతులను ధరించిన,  పరమగు చిచ్ఛక్తివలన కలిసిన రెండు ప్రక్కలు కలవాడును, పరుడు అయిన శంభుని నమస్కరించుచున్నాను,  శంభుని భక్తితో ఆరాధించి సాధకుడు రవి చంద్రుల ప్రకాశమునకు అగోచరమై, బాహ్యదృష్టికి అందని ఏకాంతమైన సహస్రార కమలమునందు నివసిస్తున్నాడు.

శ్లో.  విశుద్ధౌ తే శుద్ధస్ఫటిక విశదం వ్యోమ-జనకం
శివం సేవే దేవీమపి శివసమాన-వ్యవసితామ్ |
యయోః కాంత్యా యాంత్యాః శశికిరణ్-సారూప్యసరణే
విధూతాంత-ర్ధ్వాంతా విలసతి చకోరీవ జగతీ || 37 ||

ఉ.  నీదు విశుద్ధ చక్రమున నిర్మలమౌ నభతత్త్వ హేతువౌ

జోదుగవెల్గు నాశివుని, శొభిలుచుండెడి నిన్నుఁ గొల్చెదన్

మోదమునొప్పుమీ కళలుపూర్ణముగా లభియింపఁ వీడెడున్

నాదగు చీకటుల్, మదిననంత మహాద్భుత కామ్తినొప్పెదన్.  37.

తాత్పర్యము :  

అమ్మా ! నీ విశుద్ధి చక్రమున దోషము లేని స్ఫటిక మణి వలె నిర్మలుడునూ ఆకాశ తత్వము ఉత్పాదకమునకు  కారణమయిన శివతత్వమును, శివునితో సమానమయిన యత్నము గల దేవియగు నిన్ను నేను  పూజింతును. అట్టి శివాశివులు అయిన మీ నుండి వచ్చుచున్న శశి కిరణములతో సాటి గల కాంతుల చేత జగత్తు ఎగరగొట్టబడిన అజ్ఞానము కలదయిచకోరపక్షి వలే ప్రకాశించును కదా

శ్లో.  సమున్మీలత్ సంవిత్కమల-మకరందైక-రసికం
భజే హంసద్వంద్వం కిమపి మహతాం మానసచరమ్ |
యదాలాపా-దష్టాదశ-గుణిత-విద్యాపరిణతిః
యదాదత్తే దోషాద్ గుణ-మఖిల-మద్భ్యః పయ ఇవ || 38 ||

తే.గీ.  జ్ఞాన సుమ మధువును కోరు, కరుణనొప్పు

యోగులగువారి మదులలోనుండు, మంచి

నే గ్రహించు హంసలజంటనే సతంబు

మదిని నినిపికొల్చెదనమ్మ! నీరజాక్షి!  38.

తాత్పర్యము :

వికసించుచున్న, జ్ఞాన పద్మమునందలి తేనె మాత్రమె ఇష్టపడునది,  యోగీశ్వరుల మనస్సులో చరించునది ఇట్టిదని చెప్పుటకు వీలులేని రాజ హంసల జంటను సేవించెదను, పరస్పర మథుర సంభాషణలవలన 18 విద్యల యొక్క పరిణామము, హంసలజంట అవలక్షణములనుండి సమస్తమైన సద్గుణ సముదాయమును నీళ్ళనుండి పాలను గ్రహించుచున్నదో.

శ్లో.  తవ స్వాధిష్ఠానే హుతవహ-మధిష్ఠాయ నిరతం
తమీడే సంవర్తం జనని మహతీం తాం సమయామ్ |
యదాలోకే లోకాన్ దహతి మహసి క్రోధ-కలితే
దయార్ద్రా యా దృష్టిః శిశిర-ముపచారం రచయతి || 39 ||

సీ.  నీదు స్వాధిష్ఠాన నిరుపమ చక్రాన నగ్ని తత్త్వంబున నమరుయుండు,

నగ్నిరూపుండైన యాశివున్ స్తుతియింతు, సమయ పేరునగల సన్నుత మగు

మహిమాన్వితంబైనమాతృస్వరూపిణీ! నిన్నునున్ దలచుచు సన్నుతింతు,

నేకాగ్రతను జేయునీశుని ధ్యానాగ్నినిని లోకములు కాలుననెడియపుడు

తే.గీ.  నీదు కృపనొప్పు చూడ్కులునిరుపమాన

పూర్ణ శశిచంద్రికలె యార్పు పూర్తిగాను,

లోకములనేలు జనని! సులోచనాంబ!

వందనంబులు చేసెద నందుకొనుము.  39.

తాత్పర్యము :

స్వాధిష్ఠానచక్రమునందలి అగ్నితత్వమును అధిష్ఠించి ఎల్లప్పుడు, అగ్ని రూపుడయిన శివుడిని స్తుతించెదను. అదే విధముగాసమయఅనుపేరుగల మహిమాన్వితమైన నిన్ను స్తుతించెదను. మిక్కిలి గొప్పదై  ఏకాగ్రతతో కూడిన   పరమేశ్వరుని ధ్యానాగ్ని చూపు భూలోకాది లోకములను దహించును. ,  నీ కృపతో కూడిన చూపు శీతలమును ఉపశమనమును కావించుచున్నది.

శ్లో.  తటిత్వంతం శక్త్యా తిమిర పరిపన్ధిస్పురణయా 

స్ఫుర న్నానారత్నాభరణ పరిణద్దేన్ద్ర ధనుషమ్

తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణం 

నిషేవే వర్షన్తం హర మిహిర తప్తం త్రిభువనమ్l|| 40 ||

సీ.  మణిపూర చక్రమే మహిత వాసమ్ముగా కలిగి చీకటినట వెలుగునదియు,

కలిగిన శక్తిచే వెలుగులీనునదియు, వెలుగులీనెడిరత్న ములను గలిగి

యున్న యింద్రధనువు నొప్పుచు, జగతిని శివరవి తప్తమౌ చిక్కుచున్న

ముల్లోకములకును పూర్ణ వృష్టి నొసగు మేఘమౌ జననిని మేలు గొలుతు.

తే.గీ.  అమ్మ! నీ దివ్య రూపంబు కమ్మగాను

వర్ణనము చేయు శక్తితో పరగనిమ్మ!

నమ్మి నినుఁగొల్చుచుంటినోయమ్మ నిన్ను,

వందన్ంబులు చేసెద నందుకొనుము.  40.

సీ.  మీ మణిపూరకమే నెలవుగ గల్గి యట చీకటికి శత్రువయిన కాంతి

కలిగిననవరత్న ములయలంకారముల్గలిగినహరివిల్లు కలిగి యసిత

వర్ణము కలయట్టి పరమేశుఁడను దిన కరునిచే దగ్ధమై

అమ్మా ! నీ యొక్క మణిపూర చక్రమే ముఖ్యమయిన నెలవుగా కలిగి అందలి చీకటికి శత్రువు అయిన ప్రకాశములు కలిగిన వివిధ రత్నముల అలంకారములచే అలంకరింపబడిన ఇంద్ర ధనుస్సు కల నల్లని వర్ణము కలిగినట్టిదియు ఈశ్వరుడు అను సూర్యుని చే కాల్చబడిన మూడు లోకములను తన వర్ష ధారలచేత తడుపునట్టి నిర్వచించుటకు వీలు లేనట్టి మేఘమును ( ఈశ్వరుని ) పూజింతును .కదా

తాత్పర్యము :

మణిపురచక్రమే నివాసముగా కలిగి, చీకటికి శతృవై ప్రకాశించు శక్తిచేత విద్యుల్లత మెరుపుగల,  ప్రకాశించుచున్న వివిధములైన రత్నములతోకూడిన ఆభరణములచే కూడిన ఇంద్రధనుస్సువలె వెలుగునదియు,  నీలి వన్నెలుగల, శివునిచే దగ్ధమైన, మూడులోకములగూర్చి వర్షించునది అయిన ఇట్టిది అని చెప్పుటకు వీలుకాని మేఘస్వరూపమయిన శివుని ధ్యానస్వరూపమును సేవించెదను.

శ్లో.  తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా
నవాత్మాన మన్యే నవరస-మహాతాండవ-నటమ్ |
ఉభాభ్యా మేతాభ్యా-ముదయ-విధి ముద్దిశ్య దయయా
సనాథాభ్యాం జఙ్ఞే జనక జననీమత్ జగదిదమ్ || 41 ||                                                                          

సీ.  నీదు మూలాధార నిర్మల చక్రాన సమయా యనెడిశక్తిసహితులగుచు

ప్రవర శృంగారాది నవరసములనొప్పు, ప్రళయతాండవనాట్యకలిత శివుని

తలచెదను నవాత్మునిలను నానందభైరవునిగాతలచెద, ప్రళయ దగ్ధ

లోకాల సృజనకై శ్రీకరముగ కూడి యున్న యిరువురి చేతను యీ జగమ్ము

తే.గీ.  తల్లిదండ్రులు కలదిగా తలతు నేను,

లోకములనేలు తలిదండ్రులేకమగుచు

దివ్యదర్శనభాగ్యమీ దీనునకిడ

వేడుకొందును, నిలుడిల నీడవోలె.  41.

తాత్పర్యము :

నీ మూలాధార చక్రమునందు నృత్యాసక్తిగలసమయాఅనే పేరుగల శక్తితోకూడి, శృంగారాది నవరసములతో నొప్పారుచు  ప్రళయమునందు అద్భుతమైన తాండవ నాట్యమును అభినయించు శివుని తలచెదను. నవాత్మునిగా తలచెదను. ఆనందభైరవునిగా తలచెదను.  ప్రళయాగ్నికి దగ్ధమైన లోకములను మరల   జగదుత్పత్తి కార్యమును ఉద్దేశించి ఆనంద మహాభైరవులచేత కరుణచేత,  ఇద్దరి కలయికతో జగత్తు తల్లీ తండ్రి కలదని తెలుసుకొనుచున్నాను.

1 నుండి 41 శ్లోకము వరకు గల శ్లోకములను " ఆనందలహరి " అని

42 శ్లోకము నుండి" సౌందర్యలహరి " అని వ్యవహారం లో ప్రసిద్ధి .

శ్లో. గతైర్మాణిక్యత్వం గగన మణిభిః సాంద్ర ఘటితమ్
కిరీటంతే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః!
నీడేయచ్ఛాయా చ్ఛురణ శబలం చంద్ర శకలమ్
ధనుః శౌనాశీరం కిమితి నిబధ్నాతి ధిషణామ్ !  42.

సీ.  హిమగిరి నందినీ! సముచితముగ సూర్యులందరిన్ మణులుగ పొందబడిన

నీ స్వర్ణమకుటమున్ నియతితో కీర్తించునెవ్వం  డతం డిల నెంచకున్నె

ద్వాదశాదిత్యుల వర్ధిల్లు మణికాంతి సోకుచు నొప్పెడి సోముని గని

యింద్ర ధనుస్సుగా, సాంద్రకృపాంబ! తత్ కల్యాణతేజంబు ఘనతరంబు.

తే.గీ. నీ కిరీటంబు తేజంబు నే దలంచి

యాత్మలోతృప్తినందెదనమ్మ కృపను

నీవు నామదిలోననే నిలిచి యుండి

మకుట తేజంబు కననిమ్ము సుకరముగను.  42.
తాత్పర్యము

హిమగిరితనయా ! పార్వతీ ! మణి భావమును పొందిన ద్వాదశ సూర్యుల చేత దట్టముగా కూర్పబడిన నీ బంగారు కిరీటాన్ని ఎవడు కీర్తిస్తాడో _ కవీశ్వరుడు గోళాకారంగాయున్న కిరీటములో కుదుళ్ళయందు బిగించబడిన ద్వాదశాదిత్యులనే మణుల కాంతుల ప్రసారంతో, చిత్ర విచిత్ర వర్ణములు గల చంద్ర ఖండాన్ని చూసి , అది ఇంద్రుని ధనస్సు అని ఎందుకు భావన చేయకుండా వుంటాడు. (చంద్ర రేఖను తన మనస్సులో ధ్యానించి ధ్యానించి అది తప్పక ఇంద్రధనుస్సు అని నిశ్చయ బుద్ధి ని కల్గించు కుంటాడని భావము ) పండ్రెండుగురు సూర్యులు దేవి కిరీటములో మణులైయుంటారు. అందులో చంద్ర రేఖ కూడా వుంటుంది. సూర్య కాంతుల ప్రతిఫలంతో కూడిన చంద్ర వంక వర్ణించు వారికి ఇంద్రధనుస్సనే భావాన్ని తప్పక కల్గిస్తుంది.

శ్లో.  ధునోతు ధ్వాంతం -స్తులిత-దలితేందీవర-వనం

ఘనస్నిగ్ధ-శ్లక్ష్ణం చికుర నికురుంబం తవ శివే |

యదీయం సౌరభ్యం సహజ-ముపలబ్ధుం సుమనసో

వసంత్యస్మిన్ మన్యే బలమథన వాటీ-విటపినామ్ || 43 ||

తే.గీ.  నల్లకలువలన్, మేఘమునల్ల గెలుచు

నల్లనౌ నీకురుల వాసనను గ్రహించు

బలుని జంపిన యింద్రుని పాదపంబు

కల్పకము యొక్క కుసుమముల్ కమలనయన.   43.

భావము.

అమ్మా ! అప్పుడే వికసించిన నల్లకలువవలెను, నల్లని మేఘముల వలె దట్టముగా ఉండి సుకుమారమయి ఉన్న నీ కేశముల ముడి మా అజ్ఞానము అనబడు చీకటిని పారద్రోలును. వాటినుండి వెలువడు సువాసనలను పీల్చుటకు బలుడు అను రాక్షసుని చంపిన ఇంద్రుని కల్పవృక్షముల యొక్క పూలు వాటిని ఆశ్రయించును కదా ! 

శ్లో.  తనోతు క్షేమం స్తవ వదన సౌందర్య లహరీ

పరీవాహ స్రోత _ స్సరణి రివ సీమంత సరణిః !

వహంతీ సందూరం _ ప్రబల కబరీ భార తిమిర

ద్విషాంబృందైర్బందీ _ కృత మివ నవీనార్కకిరణమ్!!

ఉ.  నీ ముఖ శోభ నుండి గణనీయముగా ప్రవహించుచున్న  యా

శ్రీమహిమంపు పాపటి  ప్రసిద్ధ మహత్కర కుంకుమ ప్రభల్

రోమతమిస్రశత్రుతతిలోపలఁ చిక్కినబాలసూర్యుఁడే,

క్షేమము సంపదల్ మరియు శ్రీకర యోగము మాకుఁ గొల్పుతన్,  44.

తాత్పర్యము:-
దేవీ ! నీ పాపటయందు సిందూరపు రేఖ యున్నది
సిందూరముతో నున్న నీ సీమంత మార్గము (పాపట దారి ) నీముఖసౌందర్యము పొంగులు పొంగి ప్రవహించే ప్రవాహము నుండి, చీలి పైకి ప్రవహించేనీటి పాయ యొక్క ప్రవాహపు దారి ఏమో అన్నట్లు ఉన్నది . అంతేకాదు దట్టము లయిన నీ కేశపాశములు , సాంద్రములైన చీకట్లవలె ఉన్నవి. చీకట్లకు సూర్యునికి విరోధము. కాబట్టి చీకట్లు అనే బలమైన శత్రువు చేత చెర బట్టబడిన బాల సూర్యుని కిరణమేమో యన్నట్లు నీనల్లని కురుల మధ్య సిందూర పరాగమును ధరించిన పాపట కనిపిస్తున్నది. ఇటువంటి నీ పాపటరేఖ మాకు యోగక్షేమములను అభివృద్ధి ని పొందించును గాక.

శ్లో.  " అరాళైస్స్వాభావ్యా _ దళికలభస శ్రీభి రలకైః
పరీతం తే వక్త్రం_ పరిహసతి పంకేరుహ రుచిమ్!
దర స్మేరేయస్మిన్_ దశన రుచి కింజల్క రుచిరే
సుగంధౌ మాద్యంతి_స్మర దహన చక్షుర్మధులిహః".  45.

చం.  సురుచిరహాసమై విరియు, సుందర దంతపు కాంతి కేసరో

త్కర వర సౌరభాన్వితపు గణ్యపు నీ ముఖపద్మమందునన్

స్మరునియడంచినట్టి శివ సన్నుతదృక్భ్రమరమ్మువ్రాలెగా,

వరలెడి నీలి ముంగురులు పద్మపు కాంతిని గేలి సేయుగా.  45.

తాత్పర్యము:-
జగన్మాతా ! చిరు నవ్వుతో వికసింౘుౘున్నదియు దంతముల కాంతులు అనే కేసరములచే సుందర మైనదియు, సువాసన కలదియు అయిన నీముఖ పద్మము నందు, మన్మథుని దహించిన శివుని చూపులు అనే తుమ్మెదలు కూడా మోహ పడుతున్నాయి.

సహజంగా నే వంకరలు తిరిగిన వై, కొదమ తుమ్మెదల కాంతివంటి నల్లని కాంతి ని కల్గి యున్న ముంగురులతో కూడిన నీముఖము, పద్మ కాంతిని (అందాన్ని) పరిహసిస్తూన్నది.

శ్లో.  " లలాటం లావణ్యద్యుతి _విమల మాభాతితవయత్
ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్ర శకలం !
విపర్యా సన్యాసా దుభయమపి సంభూయచ మిధః
సుధాలేపస్యూతిః పరిణమతి రాకా హిమకరః "!!
శా.  లావణ్యాంచితస్వచ్ఛభాసురముఖీ! శ్లాఘింతునద్దానినే

భావంబందున నర్థచంద్రుఁడనుచున్ భాసించుటన్ గాంచి,పై

నావంకన్ గలనీకిరీట శశిదౌ యాఖండభాగంబిదే,

శ్రావించుంసుధరెండునొక్కటగుటన్, సన్మాన్య పూజ్యా! సతీ!  46.

తాత్పర్యము:-
దేవీ నీ నుదురు నిర్మలమైన లావణ్యమును, నిర్మల మైన కాంతియు కలిగియున్నది. దీనికి గల లావణ్యా న్నీ, కాంతినీబట్టి చూస్తే , బ్రహ్మ ఒకే చంద్ర బింబాన్ని రెండు ఖండములుగా జేసి ఆరెంటిలో క్రింది ఖండాన్నినీ కిరీటములో చంద్ర శకలము గానూ, పై ఖండాన్ని కిరీటంలోని చంద్ర ఖండానికి ఎదురు దిశలో నీ నుదురు గానూ అమర్చినాడని ఊహిస్తున్నాను. ఎందుకనగా రెంటిలో పై ఖండాన్ని క్రింది కి గానీ క్రింది ఖండాన్ని పైకిగానీజరిపి, రెండు ముక్కల నాలుగు కొనలలో, రెండేసి ఒక్కొక్క చోట కలిసేటట్లు అమృతపు వెన్నెలతో అతికితే, పున్నమినాటి చంద్రుడు అవుతాడు. అనగా నీ లలాటము పున్నమినాటి చంద్రుని వలె ప్రకాశించుచున్నది.

శ్లో.  "భ్రువౌ భుగ్నే కించ_ద్భువన భయభంగ వ్యసనిని
త్వదీయేనేత్రాభ్యాం మధుకరరుచిభ్యాంధృతగుణమ్!
ధనుర్మన్యే సవ్యే _తరకరగృహీతం రతిపతేః
ప్రకోష్ఠే ముష్టౌచ_స్థగయతి నిగూఢాంతర ముమే!!"      47.

తే.గీ.  భువన భయ హర వ్యసన! కన్ బొమలు నీవి

మరుని విల్ త్రాడు లాగెడి కరణినొప్ప,

పిడికిటనుపట్టి యున్నట్లు వింటిత్రాడు

మధ్య కనరాని మరువిల్లు మదిని తోచు.   47.
తాత్పర్యము:-
ఉమాదేవీ! లోకములయొక్క భయాన్ని పోగొట్టుటయందు ఆసక్తి గల తల్లీ ! నా కంటికి నీ కనుబొమలు మన్మథుని ధనస్సువలె అగుపిస్తున్నాయి. తుమ్మెదల కాంతివంటి కాంతి కల్గిన నీ కన్నులు, ఆధనుస్సుకుకూర్చబడిన వింటినారివలె కనిపిస్తూ ఉన్నాయి . నీ కనుబొమలు కొంచెము వంగి ఉన్నాయి . మన్మథుడు ఆవింటిని తన ఎడమచేతి ముంజేతితోనూ ,పిడికిలితోనూ పట్టుకొన్నందువల్ల వింటి నడిమి భాగము కానరాక దాగియున్న మన్మథుని కోదండముగా (విల్లుగా) నాకంటికి తోచుచున్నది.

శ్లో.  "అహస్సూతే సవ్యం_తవనయన మర్కాత్మకతయా
త్రియామాం వామంతే సృజతి రజనీనాయకతయా!
తృతీయేతేదృష్టిర్దరదళిత హేమాంబుజ రుచిః
సమాధత్తే సంధ్యాం దివస నిశయోరంతర చరీమ్ !!"        48
తే.గీ.  పగలు కొలుపునీ కుడికన్ను పరగు రవిని,

రాత్రిఁ గొలుపు వామాక్షము, రాజుఁ గలిగి,

నడిమి నేత్రమగ్నియగుటన్ నడుపు సంధ్య,

కాలరూపమే నీవమ్మ కమలనయన!  48.
తాత్పర్యము:-
జగన్మాతా ! నీ కుడికన్ను సూర్యుని రూపం . అందువల్ల అది పగటిని కలిగిస్తున్నది . నీ ఎడమ కన్ను చంద్రుని స్వరూపం. అందువల్ల అది రాత్రి ని తలపిస్తున్నది. కొంచముగావికసించిన బంగారు కమలము వంటిదైన నీనొసటియందున్న మూడవ నేత్రము యొక్క దృష్టి , దివారాత్రముల మధ్య సంచరిస్తున్న ప్రాతస్సంధ్య, సాయంసంధ్య, అనే ఉభయ సంధ్యా కాలములనూ చక్కగా ధరిస్తున్నది. (అనగా ఉభయ సంధ్యలనూ పుట్టిస్తున్నది).

శ్లో.  విశాలా కల్యాణీ_స్ఫుటరుచి రయోధ్యా కువలయైః
కృపాధారా ధారా కిమపి మధురా భోగవతికా !
అవన్తీ దృష్టి స్తే _ బహునగర విస్తార విజయా
ధ్రువం తత్తన్నామ వ్యవహరణయోగ్యా విజయతే!!"      49
శా.  అమ్మా! నీ కను చూపులా విరివియై యత్యంత తేజంబులై,

నెమ్మిన్ మంగళ హేతువై, విజిత సన్నీలోత్పలోత్తేజమై,

యిమ్మున్ సత్కరుణాప్రవాహ ఝరియై, చిద్భా! యనిర్వాచ్యజీ

వమ్మై,మాధురినొప్పి, కాచునదియై, భాసిల్లు పల్ పట్టణా

ర్థమ్మౌచున్, వర నామరూపమగుచున్, ధాత్రిన్ బ్రకాశించునే.  49.

తాత్పర్యము :-
దేవీ ! నీచూపు విశాలమై "విశాల" అనే నగరము యొక్క పేరుతో వ్యవహరించుటకు యోగ్యమై యున్నది . కళ్యాణప్రదమై "కళ్యాణి" అనే పేరుతో వ్యవహరించుటకు యోగ్యమై ఉన్నది . చక్కని కాంతి కల్గి నల్ల కలువల చేత ఎదుర్కొన బడుటకు వీలు కానిదై(నల్ల కలువలను మించిన నేత్ర సౌందర్యంకలదై "అయోధ్యా" నగరము పేరుతో వ్యవహరించుటకు యోగ్యమై యున్నది. కృపామృతధారలకు ఆధారమై "ధారా" నగరము పేరుతో వ్యవహరింౘ డానికి తగినదై ఉన్నది. అవ్యక్త మధురమై "మధురా" నగరము అను పేరుతో పిలువబడుటకు తగినదై ఉన్నది . లోపల వైశాల్య ముగలదై " భోగవతి" అనే నగర నామముతో వ్యవహరించుటకు తగిన దైయున్నది. ఆశ్రితులను రక్షించు నదై "అవంతీ" నగరము అనే పేరుతో వ్యవహరించుటకు యోగ్యమై యున్నది.ఆయానగరముల యొక్క విజయముకలదై " విజయ నగరము" అనే పేరుతో వ్యవహరింప యోగ్యమై _ నిశ్చయముగా ప్రకాశిస్తున్నది.

శ్లో. "కవీనాం సందర్భ స్తబక మకరందైక రసికం
కటాక్షవ్యాక్షేప భ్రమరకలభౌ కర్ణయుగళం !
అముంచంతౌ దృష్ట్వా తవ నవరసాస్వాద తరళౌ
అసూయాసంసర్గా దళిక నయనం కించి దరుణమ్!!       50
చం.  కవుల కవిత్వసన్మధువు కమ్మగ ప్రీతిని గ్రోలగనెంచియున్,

చెవులను వీడనట్టివియు, శ్రీకరమైన సునేత్ర సన్మిషన్,

ప్రవిమల తేజ సద్భ్రమర భాతిని చూచి యసూయను చెంది, మూ

డవదగు నేత్ర మెఱ్ఱఁబడె నమ్మరొ నీకు, మనోహరాకృతీ!   50.

తాత్పర్యము:-
దేవీ కవీశ్వరులు రసవత్తరముగా రచించిన రచనలు
అనే మకరందమును ఆస్వాదించుట యందు ప్రీతి కలిగి నట్టియు , అందుచే చెవుల జంటను విడువ నట్టివియు , నవ రసములనూ ఆస్వాదించుట యందు మిక్కిలి ఆసక్తి కలిగినట్టివియు అయిన నీ కడగంటి చూపులు అనే మిషతో ఉన్న తుమ్మెదల జంటను చూచి , అసూయ చేతనో ఏమో నీ ఫాలనేత్రము కొంచము ఎర్రవారినది.

శ్లో.  "శివే శృంగారార్ద్రా_తదితర జనే కుత్సన పరా
సరోషా గంగాయాం_గిరిశ చరితే (నయనే) విస్మయవతీ !
హరాహిభ్యో భీతా_సరసిరుహ సౌభాగ్య జననీ
సఖీషు స్మేరాతే మయి జనని ! దృష్టి స్సకరుణా !!          51.
ఉ.  సారస నేత్రి! నీ కనులు శర్వునెడన్ గురిపించు దివ్య శృం

గారము, భీతిఁగొల్పు కలికల్మషులందు, భయానకంబు సం

చార భుజంగ భూషలన, స్వర్ఝరిపైన ననన్యరౌద్రమున్,

కోరుచు నాపయిన్ గరుణ, గోపతి గాధలకద్భుతంబు నా

వీరము యుద్ధవేళలను, విస్త్రుత హాస్యము మిత్రపాళికిన్,

చేరఁగ వచ్చు భక్తులకు శ్రీలనుగిల్పుచు శోభ గూర్తువే.  51.
తాత్పర్యము:-
తల్లీ! నీ కన్నుల యొక్క చూపు సదాశివునియందు "శృంగార రసము " చే తడుప బడినదై ఆయనకు అనురాగం పుట్టించేదిగా ఉన్నది. శివునికంటే ఇతరులైన ప్రాకృత జనుల యందు రోత గల్గి, " బీభత్స రసము "తో గూడి వున్నది. సవతి యగు గంగా దేవియందు రోషముతో ఉండి, "రౌద్రరసము" కలదిగా యున్నది . త్రిపురాసుర సంహారముమొదలయిన శివుని విజయ గాథల యందు విస్మయము కలిగి "అద్భుతరసా"విష్టమై ఉన్నది. శివుడు ఆభరణములు గా ధరించిన సర్పముల యందు భయము కల్గి "భయానక" రసముతో కూడినదై యున్నది. ఎర్రకలువల సౌందర్యాన్నీ , రక్తిమనూ పుట్టించేదయి, "వీరరసము" తో కూడినట్లు భాసించు చున్నది . చెలికత్తె లందు కదలిక లేని స్థిరమైన కంటిగ్రుడ్లతో అనగా చిరునవ్వుతో ఉండి "హాస్యరసము" తో ఒప్పుచున్నది. నిన్ను స్తుతించే నాయందు "కరుణ" రసముతో నిండియున్నది.

 

శ్లో. "గతే కర్ణాభ్యర్ణం _ గరుత ఇవ పక్ష్మాణి దధతీ
పురాంభేత్తు శ్చిత్త ప్రశమరసవిద్రావణ ఫలే !
ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తంస కలికే !
తవా కర్ణాకృష్ట _ స్మరశరవిలాసం కలయతః !! 52
చం.  హిమగిరి వంశ శీర్ష సుమ! హే మహిమాన్విత! హైమ! నీదు క

ర్ణములకు కన్నులంటి, ఖగరాజు నెఱిం దలపింపనొప్పి, శాం

తము నడగించి ప్రేమ కరుణారసపూర్ణ శివాత్మఁగొల్ప మా

రు మహిత చాప సోయగపు రోచిగ తోచుచునుండెనమ్మరో!   52.

తాత్పర్యము:-
పర్వతాధిపుడయిన హిమవంతుని వంశానికి శిరోభూషణ మైనపువ్వు మొగ్గ వంటి పార్వతీ ! నీ కన్నులు చెవులనంటి యున్నవి . కన్నుల రెప్పల వెండ్రుకలు , బాణమునకు కట్టబడిన గ్రద్ద ఈకల వలె ఉంటాయి. అవి పరమ శివుని మనస్సులో ని శాంత రసాన్ని పోగొట్టి శృంగార రసాన్ని ఉత్పన్నము చేయడమే ఫలముగా కల్గి ఉంటాయి. అటువంటి నీ నేత్రములు, చెవుల వరకూ లాగబడిన మన్మథుని బాణముల సౌందర్యాన్ని తలపిస్తున్నాయి.

శ్లో  . విభక్త-త్రైవర్ణ్యం వ్యతికరిత-లీలాంజనతయా

విభాతి త్వన్నేత్ర త్రితయ మిద-మీశానదయితే |

పునః స్రష్టుం దేవాన్ ద్రుహిణ హరి-రుద్రానుపరతాన్

రజః సత్వం బిభ్రత్ తమ ఇతి గుణానాం త్రయమివ || 53 ||

తే.గీ.  నల్లకలువలన్, మేఘమునల్ల గెలుచు

నల్లనౌ నీకురుల వాసనను గ్రహించు

బలుని జంపిన యింద్రుని పాదపంబు

కల్పకము యొక్క కుసుమముల్ కమలనయన.   53.

భావము.

శివుని ప్రియురాలైన దేవీ ! పార్వతీ ! కన్పిస్తున్న నీ మూడు

కన్నులునూ , అర్ధ వలయాకారంగా విలాసము కొరకై తీర్చి దిద్ధి కాటుక కలవై , విభజింప బడిన ఎరుపు, తెలుపు , నలుపు అనే మూడు వర్ణములు కలవై యుండి , ప్రళయమునందు నీ యందు లీనమైన బ్రహ్మ , విష్ణు , రుద్రులనే దేవతలను, తిరిగీ బ్రహ్మాండము నందు సృష్టించడానికై సత్వరజస్తమో గుణములనే మూడు గుణములనూ ధరిస్తున్నావా అన్నట్లు ప్రకాశిస్తున్నాయి.

శ్లో  .పవిత్రీకర్తుం నః పశుపతి-పరాధీన-హృదయే

దయామిత్రై ర్నేత్రై-రరుణ-ధవల-శ్యామ రుచిభిః |

నదః శోణో గంగా తపనతనయేతి ధ్రువమయమ్

త్రయాణాం తీర్థానా-ముపనయసి సంభేద-మనఘమ్ || 54 ||

శా.  మమ్ముం జేయగ సత్ పవిత్రులుగ నమ్మా! సద్దయార్ద్రంపు శో

ణమ్మున్ శ్వేతము,కృష్ణమున్,గలుగు జ్ఞానంబిచ్చు నీ మూడు నే

త్రమ్ముల్గంగను,శోణ నా యమునని ద్ధాత్రిన్ గృపన్నొక్కెడన్

నెమ్మిన్ నిల్పెనొకో గుణత్రయమటుల్, నిన్ గొల్వ నాకెట్లగున్?     54.

భావము.

పశుపతియైనశివునియందులగ్నమైనచిత్తము కలదానా ! దేవీ దయారసముతో కూడిన ఎరుపు, తెలుపు, నలుపు కాంతులు కలవైన నీ కన్నులచే ఎర్రని జలప్రవాహముగల శోణ నదము, తెల్లని జల ప్రవాహము గల గంగ, నీల జలప్రవాహముగల యమున అనే మూడు నదుల సంగమ స్థానమును మమ్ము లను పవిత్రులను గా చేయటానికై మాకు సంపాదించిఇస్తున్నావు.ఇదినిజము.
శ్లో.  నిమేషోన్మేషాభ్యాం ప్రలయముదయం యాతి జగతి

తవేత్యాహుః సంతో ధరణిధర-రాజన్యతనయే

త్వదున్మేషాజ్జాతం జగదిద-మశేషం ప్రలయతః

పరేత్రాతుం శంకే పరిహృత-నిమేషా-స్తవ దృశః || 55 ||

కం.  నీ కనులు మూసి తెరచిన

లోకప్రళయంబు సృష్టి లోనగునవగున్!

లోకప్రళయము నిలుపన్

నీ కనులను మూయవీవు నిత్యముగ సతీ!   55.

భావము.

తల్లీ! పర్వతరాజ పుత్రికా! నీ కనురప్పలు మూతపడడం వల్ల జగత్తుకు ప్రళయమున్నూ , కను రెప్పలుతెరచు కోవడం వలన జగత్తు సృష్టించ బడుతుందని పండితులు తెలుపుచున్నారు. విధంగా నీనిమేష, ఉన్మేషముల వలన జగత్తు యొక్క ఉత్పత్తి వినాశ ములు జరుగుతున్నవని , దానిని ప్రళయము నుండి రక్షించు కొనుటకై నీ రెప్పలు వికసించుట వలన పుట్టిన సర్వ జగత్తునూ
నాశనం పొందకుండా కాపాడడానికై, నీవు కనురెప్పలు మూయడం మానివేశావని భావిస్తున్నాను .

శ్లో.  తవాపర్ణే కర్ణే జపనయన పైశున్య చకితాః

నిలీయంతే తోయే నియత మనిమేషాః శఫరికాః |

ఇయం శ్రీ-ర్బద్ధచ్చద పుటకవాటం కువలయం

జహాతి ప్రత్యూషే నిశి విఘటయ్య ప్రవిశతి|| 56 ||

సీ.  చెవులఁ దాకెడి నీదు చెన్నారు కనులతోఁ దమను బోల్చుకొను మత్స్యములు బెడిసి

తమ గుట్టుదాగగా దాగుకొనునవియె, అపురూప సౌభాగ్యమమరియున్న

నీ నేత్ర లక్ష్మిని నేర్పున కలువ లావిష్కరించినటులవినఁగ జెప్పు

నీ కర్ణములకంచు నేర్పుగా దాగుచు పగలు, రేయిని విచ్చు మొగము దాచ,

తే.గీ. మత్స్య కంటివి నీవమ్మ! మాదు జనని!

కలువ కంటివి, నీరూపుఁ గనెడి కనులు

కనులు నిజముగ, కాకున్న కనులు కావు,

నిన్నుఁ గాంచగా చేయుమా నేర్పునొసఁగి.  56.

భావము.

అమ్మా! అపర్ణా! నీ చెవులకు తాకుతున్నట్లు నీ కనులు కనబడటం వలన, చెవులకు తమ రహస్యం వెల్లడి కాకుండా తమను అమ్మ కళ్ళతో పోల్చుకున్న చేపలు బెడిసి తమ రూపాలను కనబడనీయకుండా దాక్కున్నాయి. నీ కనులలో నున్న కాంతియైన సౌభాగ్య లక్ష్మి ని కలువలు ఆవిష్కరించాయని నీ చెవులతో నేత్రాలు చెబుతాయేమోనని భయపడి పగలు, పూవుని విడిచి రాత్రి మాత్రమే పూవుల రేకు డిప్పలను తెరిచి ప్రవేశిస్తోంది. అమ్మ సౌందర్యముతో తమను తాము పోల్చుకున్నామనే బెరుకు వీటిచే పని చేయింస్తోంది. కదా.

శ్లో.  దృశా ద్రాఘీయస్యా దరదళిత నీలోత్పల రుచా

దవీయాంసం దీనం స్నపా కృపయా మామపి శివే |

అనేనాయం ధన్యో భవతి తే హానిరియతా

వనే వా హర్మ్యే వా సమకర నిపాతో హిమకరః || 57 ||

ఉ.  దీనుఁడనమ్మ! దూరముగ తేజవిహీనుఁడనైన నాపయిన్

నీనయన ప్రదీప్తులను నిత్యముగా ప్రసరింపనీయుమా,

హానియొకింతయున్ గలుగదమ్మరొ నీకుఁ, గృతార్థునౌదు, నా

యేణభృతుండు వెన్నెలనదెక్కడనైనను పంచు తీరునన్.   57.

భావము.

తల్లీ!పార్వతీదేవీ!నీనేత్రముమిక్కిలిదీర్ఘమైకొంచముగావికసించిన నల్ల కలువల కాంతి వంటి కాంతితో చక్కగా ఉన్నది. నేను నిన్ను శ్రద్ధ గా ఉపాసించలేని దీనుడను. కాబట్టి ఎంత దూరమైనా ప్రసరింప జేయగల నీ కడగంటి చూపును నీకు మిక్కిలి దూరంలో ఉన్న నాపై కూడా ప్రసరింప జేసి, నీదృష్టి నుండి ప్రసరించే కృపారసముతో నన్ను కూడా(తడుపుము) స్నానమాడింపుము. నీవు నీ కడగంటి చూపులోని కృపారసముతో తడిపినంత మాత్రము చేతనే , నేను ధన్యుడ నవుతాను. మాత్రం నన్ను కనికరించడం వలన నీకు విధమైన లోటూరాదు. (నీకు పోయేదేమీలేదు) నీ వామ నేత్రమయిన చంద్రుడు , తన కిరణాలను అడవి లోనూ రాజభవనముల మీదనూ సమముగానే ప్రసరింపజేస్తున్నాడుకదా!

శ్లో.  అరాళం తే పాళీయుగళ-మగరాజన్యతనయే

కేషా-మాధత్తే కుసుమశర కోదండ-కుతుకమ్ |

తిరశ్చీనో యత్ర శ్రవణపథ-ముల్లంఘ్య విలసన్

అపాంగ వ్యాసంగో దిశతి శరసంధాన ధిషణామ్ || 58 ||

ఉ.  వంకరనుండు నీ కణఁత భాగలన్ గిరిరాజపుత్రికా!

జంకరదెవ్వరున్ దలపఁ జక్కను కాముని విల్లటంచు, న

వ్వంకను కన్నులడ్డముగ భాసిలుచున్ మది నమ్ము విల్లుపై

నంకితమైనటుల్ తలచునట్టులఁనొప్పుచునుండెనొప్పుగన్.   58.

భావము.

పర్వతరాజ పుత్రీ ! పార్వతీ ! అందముగా వక్రముగా ఉన్న నీ చెవితమ్మల జంటను చూస్తే, భావుకులకు అవి పుష్ప బాణుడైన మన్మథుడి ధనస్సులో ఏమో అనే భావన కలిగి , చూడ ముచ్చటగా ఉంటుంది . ఎందుకంటే , నీ కడగంటి ప్రసారము , అడ్డముగా తిరిగి చెవి త్రోవను దాటి , (చెవుల అంచుల వరకు చేరి) ప్రకాశిస్తూ బాణములు సంధింప బడుతున్నాయనే ఊహను కల్గిస్తుంది. (దేవి క్రీగంటి చూపులు, మన్మథుడి పూల బాణాలని , శ్రీదేవి చెవి తమ్మెలు (కణతలు), మన్మథుని ధనస్సులనీ భ్రాంతిని కల్గిస్తున్నాయి). వంగిన విల్లు లేదా ఎక్కుపెట్టిన విల్లు నుంచి బాణ పరంపర వర్షించడం సహజమేకదా! ఇక్కడ వర్షించేవి ఎటువంటి బాణాలు ? కరుణా కటాక్షములనే చూపుల బాణాలు . అవి కడగంటి నుంచి మొదలై, చెవుల పర్యంతమేగాక. చెవులనూదాటిపోతూన్నాయికదా!
శ్లో.  స్ఫురద్గండాభోగ-ప్రతిఫలిత తాటంక యుగళం

చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథమ్ |

యమారుహ్య ద్రుహ్య త్యవనిరథ మర్కేందుచరణం

మహావీరో మారః ప్రమథపతయే సజ్జితవతే || 59 ||

చం.  సురుచిరమైన నీ ముఖము, సుందర గండ యుగంబు గొప్పగా

మెరియుచు నీదు కమ్మల భ్రమింపగ చేసెడుఁ జక్రభాస  సు

న్దర మరు తేరిఁ బోల, శశి  ధత్ర సుచక్ర ధరా రథాన సుం

దరహరుఁడెక్కియుండ హరినందనుఁడేచుచుఁబ్రేమఁ గొల్పెనే.  59.

భావము.

అమ్మా ! విశాలమైన నీ చెక్కిళ్ళ పై , నీ చెవి తమ్మెల జత ప్రతిఫలిస్తోంది. అందువల్ల నీ చెవితమ్మల జంట , వాటి రెండు ప్రతిబింబాలూ కలసి , మొత్తం నాలుగు చక్రములు కాగా ,నీముఖమునాలుగుచక్రములుగలమన్మథుడు ఎక్కిన రథము వలె నాకు తోస్తున్నది. నాలుగు చక్రముల రథాన్ని ఎక్కి మన్మథుడు మహా వీరుడై _ సూర్యుడు , చంద్రుడు అనే రెండు చక్రాలు మాత్రమే కల , భూమి అనే రథాన్ని త్రిపుర సంహార సమయంలో యుద్దానికి సిద్ధం చేసికొన్న ప్రమథాధిపతియైన శివుడికి ద్రోహం తలపెట్టాలనీ, శివుడి తోనే పోరాడాలనీ పన్నాగం చేస్తున్నాడు. (అనగా శివుడికి కూడా మోహం కల్పించటానికి ప్రయత్నించాడు.అందుకుసుందరమైనదేవిముఖంఅతనికితోడ్పడినది.)
శ్లో.  సరస్వత్యాః సూక్తీ-రమృతలహరీ కౌశలహరీః

పిబంత్యాః శర్వాణి శ్రవణ-చులుకాభ్యా-మవిరళమ్

చమత్కారః-శ్లాఘాచలిత-శిరసః కుండలగణో

ఝణత్కారైస్తారైః ప్రతివచన-మాచష్ట ఇవ తే|| 60 ||

శా.  వాణీగానసుధాస్రవంతికుశలత్వప్రాభవంబీవు శ

ర్వాణీ! దోసిటఁ గ్రోలుచున్ శిరము కంపంబున్ బొంద శ్లాఘించుటన్,

మాణిక్యాంచిత కర్ణభూషలటులే మార్మ్రోగు కంపించుచున్

  దానిన్ సత్ప్రణవంబుఁ బోలెడి ఝణత్కారంబహో! శ్లాఘ్యమే.  60.

శర్వాణీ ! సరస్వతీదేవి నీ కొలువునకువచ్చి, అమృత ప్రవాహము యొక్క మాధుర్య మృదుత్వములను మించిన మధుర వాక్కులను (కవితలను)నీపై రచించి వాటినిపాడుతూ నీకు వినిపిస్తూ ఉంటుంది అమృత మును పుడిసిళ్ళతో త్రాగేటట్లు, నీవు సరస్వతి మధుర కవితారచనలు (స్తోత్రములను) నీ చెవులనే పుడిసిళ్ళతో చక్కగా త్రాగు తూ వుంటావు (వింటూ ఉంటావు). నీవు సరస్వతీ దేవి చేసిన స్తోత్ర గానంలోని చమత్కారమును ప్రశంశించడానికి తలను కదలిస్తూ ఉంటావు. అప్పుడు నీ చెవులకున్న కర్ణభూషణముల సముదాయము, అధికముగా ఝణ ఝణ ధ్వనులు సరస్వతీదేవి కవిత్వం లోని భావములకు అంగీకారాన్ని తెలిపే , నీ ప్రతివచనము లేమోఅన్నట్లువున్నవి.

శ్లో.  అసౌ నాసావంశ-స్తుహినగిరివంశ-ధ్వజపటి

త్వదీయో నేదీయః ఫలతు ఫల-మస్మాకముచితమ్ |

వహత్యంతర్ముక్తాః శిశిరకర-నిశ్వాస-గళితం

సమృద్ధ్యా యత్తాసాం బహిరపి ముక్తామణిధరః || 61 ||

చం.  హిమగిరి వంశ కేతన! మహేశ్వరి! నీ దగు ఘ్రాణ వంశ మా

కు మహితసత్ఫలప్రద యగున్, భవదీయ కృపన్, గనంగ, న

క్రము తన లోన నిందు వర రత్నముదాల్చుచు నిందునాడి మా

ర్గమున గమించుదానినె దగన్ బయటన్ ధరియించె గొప్పగన్.   61.

(నక్రము=ముక్కు, ఇందు(వర)రత్నము=ముత్యము,ఇందునాడి=ఇడానాడి)

భావము.

తుహిన గిరివంశ ధ్వజవటీ ! (హిమవంతుని వంశకీర్తిని లోకానికి చాటే తల్లీ !) పార్వతీ ! నీ యొక్కనాసావంశము(వంశము=వెదురువెదురుగడను పోలిన ముక్కు ) మామనస్సు నందలి కోరికకు తగిన ఫలితాన్ని అందజేయు గాక. నీ నాసావంశ దండము లోపల ముత్యములను ధరిస్తుంది. నీ ముక్కునకు చివర అలంకారంగా ఉన్న నాసాభరణంలో ( ముక్కెరలో) ముత్యం వుంది. నీ ముక్కు వెదురుగడ కాబట్టి వెదురుగడ నుండి ముత్యాలు పుట్టడం లోక సహజం కాబట్టి నీముక్కుఅనేవెదురుగడలోప్రసరించేచల్లనిచంద్రకిరణాలప్రసారంతో సమృద్ధిగా ముత్యాలు దానిలో పుట్టాయి . వామ నాసిక నుండి వచ్చే నిట్టూర్పు గాలివల్ల వాటిలో ఒక ముత్యం బయటికి రాగాదానినివెలుపలకూడా నీముక్కు ధరించిందేమో అన్నట్లునీముక్కుముక్తామణినిధరించినది.
శ్లో.  ప్రకృత్యాఽఽరక్తయా-స్తవ సుదతి దంతచ్ఛదరుచేః

ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలతా |

బింబం తద్బింబ-ప్రతిఫలన-రాగా-దరుణితం

తులామధ్యారోఢుం కథమివ నలజ్జేత కలయా || 62 ||

మ.  జననీ! నీ యధరారుణప్రభలు సాజంబమ్మ! నే దెల్పెద

న్వినుతింపందగు పోలికన్, విద్రుమమే నేర్పున్ ఫలంబున్ గనన్

ఘనమౌ నీయధరారుణప్రభలనే కల్గించునవ్వాటికిన్,

వినుతింపందగు సామ్యమున్ దలపగా వ్రీడన్ మదిన్ పొందదే?   62.

భావము.

అమ్మా జగజ్జననీ, స్వభావ సిద్ధముగానే కెంపురంగుగల నీ పెదవుల అందమునకు,  సరియైన పోలికను చెప్పుచున్నానుపగడపు తీగె,  పండును పుట్టించిగలిగినచో  నీ రెండు పెదవులు దానికి సరిపోతాయి. అది నీ పెదవుల కాంతితో పగడపండ్లను  పోలుటకు సిగ్గుపడును.
శ్లో.  స్మితజ్యోత్స్నాజాలం తవ వదనచంద్రస్య పిబతాం

చకోరాణా-మాసీ-దతిరసతయా చంచు-జడిమా |

అతస్తే శీతాంశో-రమృతలహరీ రామ్లరుచయః

పిబంతీ స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచిక ధియా || 63 ||

శా.  అమలా! నీ నగుమోము చంద్రికలనే యాస్వాదనన్ జేయ, ను

త్తమ మాధుర్యము నాల్కలన్ నిలిచె మాతా! యీ చకోరాళికిన్,

  రమణీ! చంద్రునినుండియామ్లరుచులన్ బ్రార్థించి యాచంద్రికల్

  ప్రముదంబున్ గొను కాంచికన్ నిశలలోభావింప చిత్రంబిదే.   63.

భావము.

అమ్మా, నీ ముఖ చంద్రుని చిరునవ్వును త్రాగుచున్న చకోరపక్షులకు అతి మథురిమతో నాలుక మొద్దుబారినది,  అందువలన చకోరపక్షులు పులుపు రుచిని కోరుచు చంద్రుని వెన్నెల కోరుచు, అన్నపు గంజి ఇష్టము వచ్చినట్లుగా ప్రతి రాత్రియందు బాగా త్రాగుచున్నవి.

శ్లో.  అవిశ్రాంతం పత్యుర్గుణగణ కథామ్రేడనజపా

జపాపుష్పచ్ఛాయా తవ జనని జిహ్వా జయతి సా |

యదగ్రాసీనాయాః స్ఫటికదృష-దచ్ఛచ్ఛవిమయీ

సరస్వత్యకా మూర్తిః పరిణమతి మాణిక్యవపుషా || 64 ||

చం.  సతతము నీ సదాశివుని సన్నుతిఁ జేయుచునుండుటన్ సతీ!

యతులిత జిహ్వ యెఱ్ఱఁబడెనమ్మరొనీకు, గణించగా, సర

స్వతి సతతంబు నాల్కపయి సన్నుతినొప్పుచునుండుటన్ లస

న్నుతమగు పద్మరాగరుచితోపరిణామము పొందియుండెడిన్.  64.

భావము.

నిరంతరము సదాశివుని గుణ గణములుగల వృత్తాంతమును మరల మరల వచించుటవలన నీ నాలుక ఎర్రబడ్ఢది. నీ జిహ్వాగ్రమునందు సరస్వతీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది. అందువలన ఎర్రరంగుగా మారినది.

శ్లో.  రణే జిత్వా దైత్యా నపహృత-శిరస్త్రైః కవచిభిః

నివృత్తై-శ్చండాంశ-త్రిపురహర-నిర్మాల్య-విముఖైః |

విశాఖేంద్రోపేంద్రైః శశివిశద-కర్పూరశకలాః

విలీయంతౌ మాతస్తవ వదనతాంబూల-కబళాః || 65 ||

చం.  రణమున నోడి వీడిన శిరస్త్రులు, చట్టలు నైన్ రాక్షసుల్

ఘనముగఁ గల్గి, యాత్రిపురుఁ గాటికిఁ బంపిన శంభునిర్మలం

బును గొననట్టి యా స్థిరుఁడు, ముక్తినొసంగెడి విష్ణువింద్రుఁడున్,

తినుదురు మాత! నీ వదన దివ్యపు వీడ్యము జ్ఞానదీప్తికై.  65.

భావము.

తల్లీ ! సంగ్రామంలో రాక్షసులను జయించడం చేత కలిగినఆనందం వల్ల , కిరీటాన్ని (కాస్సేపు అలసట తీర్చుకోవడానికా అన్నట్టు ) వదులు చేసి , చండునికి శివ నిర్మాల్యాన్నిచ్చేసి , నీ నివాసానికొచ్చే నీ పుత్రాది దేవతలు, నీ నోటి తాంబూలాన్ని కోరుతారు. వాళ్ళేమన్నా తక్కువ వాళ్ళా? ఎటువంటి యుద్ధంలోనైనా సరే గెలవడమే తప్ప ఓడడం అనేది యెరగని వాళ్ళూ, రాక్షసులను రాచి రంపాన పెట్టడంలో వాళ్ళకు వాళ్ళే సాటియైన వాళ్ళు కదా !అయినా , నీ ప్రసాదమైన తాంబూలాన్ని ఆశిస్తున్నారంటే అందుకు కారణం అది తెల్లగా _ స్వచ్చంగా _ పరిమళ భరితంగా ఉండి, అందు లోని పచ్చ కర్పూరం మొదలగునవి నీవు బాగా నమిలి ఉండడం వల్ల పరిపూర్ణ జీర్ణకారి కావడమే !

శ్లో.  విపంచ్యా గాయంతీ వివిధ-మపదానం పశుపతే-

స్త్వయారబ్ధే వక్తుం చలితశిరసా సాధువచనే |

తదీయై-ర్మాధుర్యై-రపలపిత-తంత్రీకలరవాం

నిజాం వీణాం వాణీం నిచుళయతి చోళేన నిభృతమ్ || 66 ||

ఉ.  వాణి విపంచిపై శివుని పావనసచ్చరితంబు మీటుచున్

నీ నయవాక్సుధార్ణవము నెమ్మినిభావన చేసి దానితో

వీణియ పోలదంచు కని వేగమె కొంగున కప్పె వీణనే,

ప్రాణము నీవెయై మదిని వర్ధిలు తల్లి! నమస్కరించెదన్.  66.

భావము.
తల్లీ! సరస్వతీదేవి వీణను శృతిచేసి నీ ఎదుట పశుపతి వీరగాధలను గానం చేస్తూంటె నువ్వు ఆనందం పొంది , ఆమెపాటను మెచ్చుకుంటూ ప్రశంసా వాక్యాలు చెబుతుంటె , నీ వాజ్మాధుర్యం తన వీణానాదంకంటె మాధుర్యం కలదని తెలిసి ఆమె తనవీణను కనపడకుండా వస్త్రంతో కప్పి దాస్తుంది.

శ్లో.  కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా

గిరీశేనోదస్తం ముహురధరపానాకులతయా |

కరగ్రాహ్యం శంభోర్ముఖముకురవృంతం గిరిసుతే

కథంకారం బ్రూమ-స్తవ చుబుకమోపమ్యరహితమ్ || 67 ||

చం.  జనకుఁడు ప్రేమగా నిమురు చక్కని నీ చుబుకంబు, నీ ధవుం

డనవరతంబు నీ యధరమానెడి వేడ్కను తొట్రుబాటుతోఁ

జనువున పట్టి తేల్చఁబడు చక్కని మోవి, సఖుండు చేతఁ లే

పిన ముఖమన్ లసన్ముకురవృంతము, నాకదిపోల్చ సాధ్యమా.  67.

తాత్పర్యము :
హిమగిరితనయా ! తండ్రియైన హిమవంతుడిచే అమిత. వాత్సల్యంతో మునివ్రేళ్ళతో పుడుక బడినదీ, కైలాస పతి చేత అధర పానము నందలి ఆకులత్వం చేత మాటి మాటికి తొట్రు పడుతూ పైకెత్త బడినదీ, శంభుని చేతితో పుచ్చుకో దగినదీ, సాటిలేనిదీ ముఖమనే అద్దంయొక్క పిడీ ఐన నీ చుబుకాన్ని ఏమని వర్ణించగలను ?

శ్లో.  భుజాశ్లేషాన్నిత్యం పురదమయితుః కంటకవతీ

తవ గ్రీవా ధత్తే ముఖకమలనాళ-శ్రియమియమ్ |

స్వతః శ్వేతా కాలా గరు బహుళ-జంభాలమలినా

మృణాలీలాలిత్యం వహతి యదధో హారలతికా || 68 ||

చం.  పురహరు బాహు బంధమునఁ బొల్పగు నీదగు కంఠనాళమే

సురనుత! కంటకాంకుర ప్రశోభితవారిజనాళమట్లు కాన్

వరలుచు గంధ పంకమున భాసిలె హారము నాళమట్లుగన్.

నిరుపమ! నిన్ మదిన్ నిలిపి నేను భజించెద గాంచుమా కృపన్.  68.

తాత్పర్యము:
భగవతీ ! నీ యీ కంఠం త్రిపురాంతకుడైన శివుడి బాహువులచే గావించబడిన ఆలింగనంతో గగుర్పాటు నొందినదై ముఖ పద్మానికి నాళం వంటిదవుతోంది. నీ కంఠానికి క్రింది భాగాన సొంపారుతూ స్వభావ సిద్ధంగా నే తెల్లనై, స్వచ్ఛమైన నీ యీ ముత్యాల పేరు తీవె నల్ల అగరు గంధపు టసలు నీలి వన్నె చే తామర తూడు ౘక్కదనాన్ని పొందుతూన్నది.

శ్లో.  గళేరేఖాస్తిశ్రో గతి గమకగీతైక నిపుణే 

వివాహ-వ్యానద్ధ-ప్రగుణగుణ-సంఖ్యా ప్రతిభువః |

విరాజంతే నానావిధ-మధుర-రాగాకర-భువాం

త్రయాణాం గ్రామాణాం స్థితి-నియమ-సీమాన ఇవ తే || 69 ||

తే.గీ.  గమక గీతైక నిపుణ! నీ కంఠ రేఖ

లు తగె మూడు సూత్రపు ముడులువలెనమ్మ!

షడ్జ, మధ్యమ, గాంధార, సంస్తుతగతి

కమరు హద్దన నొప్పె, మహత్వముగను.  69.

భావము.

సంగీత గానములో ముఖ్యమైన నేర్పరితనముగలదానా, నీ కంఠములో మూడు ముడతలు, పెళ్లిసమయములో కట్టిన ముప్పేటల సూత్రమును గుర్తుచేయుచున్నవి.   కల్యాణి మొదలగు అనేక రాగములకు ఆశ్రమస్థానములైన  షడ్జ మధ్యమ గాంధారముల ఉనికికై ఏర్పరచిన సరిద్దులవలె ప్రకాశించు చున్నవి.

శ్లో.  మృణాలీ-మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం

చతుర్భిః సౌందర్యం సరసిజభవః స్తౌతి వదనైః |

నఖేభ్యః సంత్రస్యన్ ప్రథమ-మథనా దంతకరిపోః

చతుర్ణాం శీర్షాణాం సమ-మభయహస్తార్పణ-ధియా || 70 ||

శా.  అమ్మా! శూలి నఖంబులన్ జిదిమె తా నాబ్రహ్మ శీర్షంబటం

చిమ్మారక్షణ మాకటంచు గిలితో నీశాని! శీర్షంబులన్

నెమ్మిన్ నీ మృదుహస్తపల్లవములన్ నేర్పార వేడెన్, భళీ!

యిమ్మా మాకును నీదురక్ష జననీ! హృద్యంబుగ నెల్లెడన్.  70.

భావము.  :
అమ్మా! బ్రహ్మ అంధకాసురినికి విరోధి అయి వానిని వధించిన పరమ శివుడు, తన అయిదవ తలను తన గోళ్ళతో పెరికి వేయుట వలన మిక్కిలి భయపడిన వాడయి తన నాలుగు తలలతో తనకు అభయ హస్తమును ఇమ్మని తామర తూడుల వలె మృదువయిన నీ నాలుగు చేతులనూ ప్రార్ధించు చున్నాడు కదా!

శ్లో.  నఖానా-ముద్యోతై-ర్నవనళినరాగం విహసతాం

కరాణాం తే కాంతిం కథయ కథయామః కథముమే |

కయాచిద్వా సామ్యం భజతు కలయా హంత కమలం

యది క్రీడల్లక్ష్మీ-చరణతల-లాక్షారస-చణమ్ || 71 ||

చం.  విరియుచునున్న తామరల విస్త్రుతశోభనె వెక్కిరించు నీ

మురిపెము గొల్పు చేతులను బోల్చగ నాకది సాధ్యమౌనొకో?

సరసిజ వారిజాకరము చక్కగనౌ రమ, పాదలత్తుక

స్ఫురణను బొందినన్ దగును బోల్చఁగఁ గొంత, నిజంబు పార్వతీ!  71.

భావము. 

అమ్మా! పార్వతీదేవీ అప్పుడే వికసించిన కమలముల కాంతిని పరిహసించు చున్న నీ హస్తముల కాంతిని ఎట్లు వర్ణింతును? చెప్పుము. కమలములు కమలాలయములు అయిన లక్ష్మీదేవి, పాదముల యందలి లత్తుక రసముతో కలసి అరుణిమ కాంతిని పొందిన యెడల కొద్దిగా పోల్చవచ్చునేమో కదా !

శ్లో.  సమం దేవి స్కంద ద్విపవదన పీతం స్తనయుగం

తవేదం నః ఖేదం హరతు సతతం ప్రస్నుత-ముఖమ్ |

యదాలోక్యాశంకాకులిత హృదయో హాసజనకః

స్వకుంభౌ హేరంబః పరిమృశతి హస్తేన ఝటితి || 72 |

ఉ. నీ కుచ యుగ్మముం గని గణేశుఁడు కుంభము శీర్షమచ్చటన్

ప్రాకటమొప్పకల్గినటు భావనఁ జేయుచునుండె శంకతో,

నేక నిమేషమందునె గణేశునకున్ మరి శూర క్రౌంచభే

ద్యాకలిఁ దీర్చు నీ చనులు హాయిగ మమ్ములఁ గాచుఁగావుతన్.

భావము.

అమ్మా! పాలు కారుచున్న నీ వక్షముల జంటను చూసి గణపతి తన శిరస్సు కుంభములు ఇచ్చటకు వచ్చెనేమో అని తలచి తొండముతో తన తలను తాకి చూసుకుంటున్నాడు కదా. ఒకే సమయమున కుమారులు అయిన గణపతి, కుమారస్వాము చేత పానము చేయబడినవో, అట్టి స్తన ద్వయము మాకు మేలు కలిగించును. కదా !

శ్లో.  అమూ తే వక్షోజావమృతరస-మాణిక్య కుతుపౌ

సందేహస్పందో నగపతి పతాకే మనసి నః |

పిబంతౌ తౌ యస్మా దవిదిత వధూసంగ రసికౌ

కుమారావద్యాపి ద్విరదవదన-క్రౌంచదళనౌ || 73 ||

చం.  మిత సుధారసాంచితము లద్దిన కెంపులకుప్పెలెన్న నీ

విమలపయోధరంబులు, స్రవించెడి పాలను గ్రోలుటన్ సదా

హిమగిరి వంశ కేతన మహేశ్వరి! నీ వరపుత్రులిద్దరున్

బ్రముదముతోడ బాల్యమునె వర్ధిలు చుండిరి బ్రహ్మచారులై,  73.

భావము.

అమ్మా! హిమవంతుని వంశమనే ధ్వజమునకుపతాక అయిన ఓ పార్వతీమాతా! నీ కుచములు అమృత రసముతో నిండి, మాణిక్యములతో నిర్మింపబడిన కుప్పెలు అనుటకు మాకు ఎటువంటి సందేహమునూ లేదు. ఎందుకు అనగా కుచముల పాలు త్రాగిన గణపతి, కుమారస్వామి ఇప్పటికినీ బాలురు గానే ఉన్నారు. కదా !

శ్లో.  వహత్యంబ స్తంబేరమ-దనుజ-కుంభప్రకృతిభిః

సమారబ్ధాం ముక్తామణిభిరమలాం హారలతికామ్ |

కుచాభోగో బింబాధర-రుచిభి-రంతః శబలితాం

ప్రతాప-వ్యామిశ్రాం పురదమయితుః కీర్తిమివ తే || 74 ||

ఉ.  అమ్మరొ! నీదుహారము గజాసురకుంభజముత్యభాసితం

బెమ్మెయిఁ జూడ నిర్మలమహీనశుభాస్పద దోషదూరమో

యమ్మ! నిజారుణద్యుతి శుభాధర బింబ నుండి సోకి సాం

తమ్మును చిత్రవర్ణమయి త్ర్యక్షుని కీర్తి వహించె చూడగన్.  74.

భావము. 

అమ్మా! నీ మెడలో ధరించిన హారము గజాసురుని కుంభస్థలమునుండి పుట్టిన ముత్యములచే కూర్చబడినదియూ, దోష రహితమై నిర్మలమైనదియూ, దొండపండు వంటి పెదవి యొక్క కాంతులచే చిత్ర వర్ణముగా చేయబడి ఈశ్వరుని పరాక్రమము తో కూడిన కీర్తి ని వహించుచున్నట్లుగా కనబడుచున్నది.

శ్లో.  తవ స్తన్యం మన్యే ధరణిధరకన్యే హృదయతః

పయః పారావారః పరివహతి సారస్వతమివ |

దయావత్యా దత్తం ద్రవిడశిశు-రాస్వాద్య తవ యత్

కవీనాం ప్రౌఢానా మజని కమనీయః కవయితా || 75 ||

మ.  హృదయోద్భూత మహత్వ వాఙ్మయ సుధా ధృత్వంబుగానెంచెదన్

క్షుధపోకార్పెడి నీదు స్తన్యమును, నాకున్ నీవు వాత్సల్య మొ

ప్పదయన్ బట్టిన కారణంబుననె యీ బాలుండు ప్రౌఢంపు సత్

సుధలన్ జిందెడిప్రౌఢసత్ కవులలోశోభిల్లెనొక్కండుగా.  75.

భావము.

అమ్మా! పర్వత నందినీ! నీ చనుబాలను హృదయము నుండి ప్రవహించుచున్న వాజ్మయముతో నిండిన పాలసముద్రము వలె నేను తలచు చున్నాను. ఎందువలన అనగా వాత్సల్యముతో నీవు ఇచ్చిన స్తన్యము త్రాగి ద్రవిడ బాలుడు ( శ్రీ శంకర భగవత్పాదులు) కవులలో మనోహరుడు అయిన కవి కాజాలెను కదా !

శ్లో.  హరక్రోధ-జ్వాలావళిభి-రవళీఢేన వపుషా

గభీరే తే నాభీసరసి కృతసంగో మనసిజః |

సముత్తస్థౌ తస్మా-దచలతనయే ధూమలతికా

జనస్తాం జానీతే తవ జనని రోమావళిరితి || 76 ||

శా.  శ్రీమాతా! మదనుండు దగ్ధమగుచున్ శ్రీశంభు కోపాగ్నిలో

నీమంబొప్పగ రక్షకై దుమికె తా నీ నాభి సత్రమ్ములో,

ధీమంతుండుపశాంతిఁబొందె శిఖి శాంతించన్ పొగల్ వెల్వడెన్

ధూమంబున్ గనుగొంచు నెంచితది నీ నూగారుగా శాంభవీ!  76.

భావము.

అమ్మా! పర్వతరాజ కుమారీ ! మన్మధుడు పరమ శివుని కోపాగ్ని కీలలతో దహింప బడిన శరీరముతో నీ యొక్క లోతయిన నాభి మడువున దూకి తనను తాను కాపాడుకొనెను. కాలుచున్న వాని శరీరము చల్లారుట చేత వెడలిన పొగ తీగ బయల్పడగా , దానిని నీ యొక్క నూగారు ప్రాంతముగా కనబడుచున్నది కదా!

శ్లో.  యదే తత్కాళిందీ-తనుతర-తరంగాకృతి శివే

కృశే మధ్యే కించిజ్జనని తవ యద్భాతి సుధియామ్

విమర్దా-దన్యోన్యం కుచకలశయో-రంతరగతం

తనూభూతం వ్యోమ ప్రవిశదివ నాభిం కుహరిణీమ్ || 77 ||

మ.  జననీ! నీ కృశమధ్యమందుఁ గలదౌ సన్నంపు నూగారునే

కనినన్ నీ కుచపాళి మధ్యగలనాకాశంబుసన్నంబవన్

ఘనమౌతా కృశియించి నల్లఁబడి యా కాళింది జారంగ ని

ట్లనవద్యంబగు  నూగుగాఁ దలతురే యారాధ్యులౌ పండితుల్.  77.

భావము.

భగవతీ! యమునానదీ తరంగంవలె సన్ననిదై, నీ కృశమధ్యంలో అగపడే నూగారనే చిన్నవస్తువును చూసి యోచించగా - నీ కుచముల మధ్యనున్న ఆకాశం ఆకుచములురెండు పరస్పరం ఒరయటం వల్ల ఆఒరపిడికి తాళలేక నలిగినల్లనై సన్నగా కిందికి నాభివరకు లక్క జారినట్లు జారినదిగా వున్నది.

శ్లో.  స్థిరో గంగా వర్తః స్తనముకుళ-రోమావళి-లతా

కలావాలం కుండం కుసుమశర తేజో-హుతభుజః |

రతే-ర్లీలాగారం కిమపి తవ నాభిర్గిరిసుతే

బిలద్వారం సిద్ధే-ర్గిరిశనయనానాం విజయతే || 78 ||

ఉ.  నీదగు నాభి, గాంగ నుతనిర్ఝరలో సుడి, గుబ్బమొగ్గలన్

మోదము నిల్పు రోమలత మూలము, మన్మధతేజసాగ్నికిన్

పాదగునగ్నిగుండ,మనవద్యరతీగృహ మాత్రిశూలికిన్

శ్రీద సునేత్రపర్వగుహ సీమపు ద్వారమవర్ణయమమ్మరో!  78.

భావము.

హిమగిరికన్యకా ! నీ నాభి చలనంలేని గంగానది నీటి సుడిగాను , పాలిండ్లనే పూమొగ్గలకు ఆధారమైన రోమరాజి అనే తీగయొక్క పాదుగాను , మన్మధుడి తేజస్సనే అగ్నికి హోమకుండంగాను , మరుని చెలువ ఐన రతీదేవికి శృంగారభవనంగాను , నీ పతి ఐన సదాశివుడి నయనాల తపస్సిధ్ధికి గుహాద్వారమై , అనిర్వాచ్యమై , అతిసుందరమై సర్వోత్కర్షతో ప్రకాశిస్తొంది ...

శ్లో.  నిసర్గ-క్షీణస్య స్తనతట-భరేణ క్లమజుషో

నమన్మూర్తే ర్నారీతిలక శనకై-స్త్రుట్యత ఇవ |

చిరం తే మధ్యస్య త్రుటిత తటినీ-తీర-తరుణా

సమావస్థా-స్థేమ్నో భవతు కుశలం శైలతనయే || 79 ||

ఉ.  శైల తనూజ నీ నడుము చెన్నగు నీ స్తనభారమోపమిన్

బేలవమై కృశించి జడిపించును తా విఱుగంగనున్నటుల్

వాలిన యేటిగట్టుపయి వాలినచెట్టును బోలి, నీకికన్

మేలగుగాతనీ నడుము మేలుగ వర్ధిలుగాక నిచ్చలున్.  79.

భావము.

శైలతనయా ! నారీ తిలకమా ! సన్ననిదీ , పాలిండ్ల భారంచేత బడలినదీ క్రిందకువంగి తెగుతున్నదో అన్నట్లున్నదీ , కట్టతెగిన ఏటిగట్టునందలి చెట్టుతో సమానమైన స్ధితిని పొందినదీ , ఐన నీ నడుము చిరకాలం సురక్షితంగా వుండుగాక ...

అమ్మా జగజ్జననీ, స్వభావ సిద్ధముగా పలుచగానున్న,  అలసట పొందినదైన, కొంచెముగా వంగిన, కొంచెము విడిగానున్న ఇడా పింగళా(స్తనద్వయ)మధ్య ప్రదేశము అయిన అనాహత చక్రము,  తెగిన నదీ గట్టునందలి వృక్షము వలె నున్న నీ నడుమునకు అనగా స్వాధిష్టాన చక్రమునకు క్షేమము అగుగాక.

శ్లో.  కుచౌ సద్యః స్విద్య-త్తటఘటిత-కూర్పాసభిదురౌ

కషంతౌ-దౌర్మూలే కనకకలశాభౌ కలయతా |

తవ త్రాతుం భగ్నా దలమితి వలగ్నం తనుభువా

త్రిధా నద్దం దేవీ త్రివళి లవలీవల్లిభిరివ || 80 ||

చం.  చెమరుచు నీదు పార్శ్వముల చీలునొ చోలమనంగ నొత్తు నీ

విమల పయోధరంబులను విస్తృతిఁగొల్పెడి మన్మధుండు భం

గము కలిగింపరాదనుచు కౌనునకొప్ప వళీలతాళితో

సముచితరీతిఁ గట్టినటుచక్కగనొప్పుచునున్నదమ్మరో!  80.

భావము

ప్రకాశించే రూపుగల దేవీ! ఎప్పటికప్పుడే చెమట పోస్తున్న పార్శ్వాలలో అంటుకొనివున్న రవికెను పిగుల్చుచున్నవీ , బాహుమూలల సమీప ప్రదేశాలను ఒరయుచున్నవీ , బంగారుకలశంవలె ఒప్పారుచున్నవీ ఐన కుచములను నిర్మిస్తూన్న మన్మధుడు, యీ (స్తనభారంవల్ల ) భంగంకలుగరాదని నడుమును కాపాడటానికి అడవిలతలచేత ముప్పేటగా కట్టబడెనా అన్నట్లు నీ పొట్టమీద మూడుముడతలు తోచుతున్నాయి..

శ్లో.  గురుత్వం విస్తారం క్షితిధరపతిః పార్వతి నిజాత్

నితంబా-దాచ్ఛిద్య త్వయి హరణ రూపేణ నిదధౌ |

అతస్తే విస్తీర్ణో గురురయమశేషాం వసుమతీం

నితంబ-ప్రాగ్భారః స్థగయతి లఘుత్వం నయతి  || 81 ||

చం.  జనకుని నుండి పొందిన బ్రశస్త నితంబ ఘనంబుఁ జేసి ధా

రణమును చేయఁదల్గుటగు ప్రాభవమొప్పధరన్, నితంబ స

ద్ధన మరణంబుగాగ, సుకృతంబయె నీకది, భూ ధరంబునన్,

మనమున నిన్నునెన్ను నను మానిని నెమ్మిని మున్నునెన్నుమా.  81.

భావము

తల్లీ ! శైలజా! నీ జనకుడు హిమవంతుడు తన నితంబ ( కొండ నడుమ పైనున్న చదునైన ) ప్రదేశం నుంచి గొప్పబరువును , వైశాల్యాన్ని గ్రహించి నీకు అరణముగా ( వివాహసమయంలో తండ్రి కుమార్తెకు ఇచ్చే కానుక) ఇచ్చాడు. కాబట్టే నీ పెరుగుదల ఘనత బరువై, విశాలమై, భూమండలాన్నంతా కప్పుతూ తనబరువుచే భూమిని తేలికైన దాన్నిగా చేస్తున్నది.దీన్లో సందేహం లేదు....

శ్లో.  కరీంద్రాణాం శుండాన్-కనకకదళీం-కాండపటలీం

ఉభాభ్యామూరుభ్యా-ముభయమపి నిర్జిత్య భవతి |

సువృత్తాభ్యాం పత్యుః ప్రణతికఠినాభ్యాం గిరిసుతే

విధిజ్ఞే జానుభ్యాం విబుధ కరికుంభ ద్వయమసి || 82 ||

మ.  గిరిజా! సన్నుత యో విధిజ్ఞ! జయసంకేతమ్మ!  నీ యూరువుల్

కరి తొండమ్ముల, నవ్యదివ్య కదళీకాండమ్ములన్ గెల్చునే,

పరమేశానుని సత్ప్రదక్షిణవిధిన్ బ్రార్థించుటన్ జానువుల్

కరి కుంభమ్ములయెన్, గణింపఁ దగు సంకాశమ్మె లేదీశ్వరీ!  82.

భావము

హిమగిరిపుత్రీ! వేదార్ధవిధి నెఱిగి అనుష్ఠించే రాణీ, నీ ఊరుపులు అందంలో గజరాజాల తొండములను ,బంగారు అరటిస్థంభాల సముదాయములను ధిక్కరిస్తున్నవి. నీ రెండు ఊరుపులు ( తొడల) చేత జయించి , శోభనములై వర్తులములు కలిగినవీ భర్త ఐన పరమేశ్వరుడికి మొక్కటంచేత గట్టిపడినవైన నీ జానువులు , దిగ్గజాల కుంభస్థలముల జంటలను కూడ జయించి ప్రకాశిస్తున్నాయి.( బ్రహ్మాండమే అమ్మ స్వరూపమైనప్పుడు సృష్టిలోని శరీరం ఆమె సౌందర్యంతో తులతూగ గలదు ? తులతూగలేదు అని భావము...

శ్లో.  పరాజేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసుతే

నిషంగౌ జంఘే తే విషమవిశిఖో బాఢ-మకృత |

యదగ్రే దృశ్యంతే దశశరఫలాః పాదయుగళీ

నఖాగ్రచ్ఛన్మానః సుర ముకుట-శాణైక-నిశితాః || 83 ||

చం.  మదనుఁడు శంభునిన్ గెలువ మాతరొ! తా శరపంచకంబునే

పదిగనొనర్పనెంచి, తమ పాదపు వ్రేళ్ళను, పిక్కలన్ దగన్

మది శరపాళిగా, దొనగ, మన్ననఁ జేసె, నఖాళిముల్కులా

పదునుగ చేయబడ్డ సురపాళికిరీటపుకెంపులే కనన్.  83.

భావము

హిమగిరిసుతా! మన్మధుడు రుద్రుణ్ణి ఓడించటానికి తన ఐదుబాణాలు చాలవని వాటిని పదిబాణాలు చేసుకోనెంచి , నీ పిక్కలను అమ్ముల పొదులుగాను ,కాలివ్రేళ్ళను బాణాలుగాను , నఖాగ్రాలను బాణాల కొనలందు పదనుబెట్టి ఉంచిన ఉక్కుముక్కలుగాను గావించుకొన్నాడు .( నమస్కరిస్తూన్న దేవతల కిరీటాలలోని మణులనే ఒరపిడి రాళ్ళచే నఖాగ్రాలనే ములుకులు పదను పెట్టబడినవి)

శ్లో.  శ్రుతీనాం మూర్ధానో దధతి తవ యౌ శేఖరతయా

మమాప్యేతౌ మాతః శిరసి దయయా దేహి చరణౌ |

యయోః పాద్యం పాథః పశుపతి జటాజూట తటినీ

యయో-ర్లాక్షా-లక్ష్మీ-రరుణ హరిచూడామణి రుచిః       84

శా.  ఏ నీ పాదజలంబులాయెను హరుండే తాల్చు నా గంగయే,

యే నీ పాదపు కాంతిఁ గొల్పు నజగుండే దాల్చు చూడామణిన్.

ఏ నీ పాదములన్ ధరించు శ్రుతులున్ ధ్యేయంబుతో నెప్పుడున్,

ఆ నీ పాదములుంచు నాదు తలపైనమ్మా! కృపన్, నిత్యమున్.  84.

భావము

లోకమాతా ! నీ చరణాలకు శివుడి జటాజూటంలో వర్తించే గంగ పాదప్రక్షాళన జలం అవుతుందో , నీ చరణలత్తుక రసంపు కాంతికెంజాయలు శ్రీ మహావిష్ణువు మణిమయ కిరీటానికి వెలుగును ఆపాదిస్తున్నాయో , శ్రుతులశిరస్సులైన ఉపనిషత్తులు నీ పదాలను సిగపువ్వుగా ధరిస్తున్నవో, మాతా! కృపతో కూడిన చిత్తంగల దానవైన నీవు , నీ చరణాలను నాశిరస్సుమీద కూడా ఉంచు...

శ్లో.  నమో వాకం బ్రూమో నయన-రమణీయాయ పదయోః

తవాస్మై ద్వంద్వాయ స్ఫుట-రుచి రసాలక్తకవతే |

అసూయత్యత్యంతం యదభిహననాయ స్పృహయతే

పశూనా-మీశానః ప్రమదవన-కంకేళితరవే || 85 ||

మ.  నయనానందకరంబుగా వెలుగు గణ్యంబైన పారాణితో.

జయదంబై కృపఁ జూపు నీ పదములన్ శర్వాణి! నే గొల్తు న

క్షయ శాంతిప్రదుడీశ్వరుండు తగులన్ గాంక్షించు నీ పాదముల్,

జయ కంకేళిని నీవు చూతువని యీర్ష్యన్ బొందు నీశుండహో.  85.

భావము.
భగవతీ! లత్తుక రసంచే తడిసి కెంపుగొన్నదై , చూచువారి కనుదమ్ములకు మిగుల సొంపు నింపు గొలిపేదై చక్కగా వెలుగొందుతున్న నీ పాదద్వయానికి నమస్కరిస్తున్నాం. పశుపతి ఐన శివుడు ఏనీ పాదపద్మ తాడనాన్ని కోరుతూ , ఆతాడన భాగ్యానికి నోచుకునే అలరుల తోటలోని అశోకవృక్షాన్ని గాంచి దానిపై అసూయపడుతున్నాడో అట్టి నీ చరణారవిందాలకు నమస్కరిస్తున్నాను.

శ్లో.  మృషా కృత్వా గోత్రస్ఖలన-మథ వైలక్ష్యనమితం

లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే |

చిరాదంతః శల్యం దహనకృత మున్మూలితవతా

తులాకోటిక్వాణైః కిలికిలిత మీశాన రిపుణా || 86 ||

చం.  పొరపడి నీ సపత్ని తలపున్ ప్రకటించియు మిన్నకున్న, నీ

చరణముతోడ తన్నితివి శంభుని, యందేలధ్వానమేర్పడన్,

మురియుచునున్న శంకరునిముంచుచు ప్రేమను కిల్కిలధ్వనుల్

సరసన కాముడొప్పె గుణ సంణసంస్తుత! శాంభవి! నీవెఱుంగవా?  86.

భావము .
తల్లీ! పొరపాటుగా నీదగ్గర సవతి పేరు జెప్పి తరువాత ఏమీ చేయటానికి తోచక వెలవెలబాటుచే లొంగిన భర్తను , నీ చరణకమంలంతో నుదుట తాడనం జరుపగా గాంచి శివుడికి శత్రువైన మన్మధుడు ( ఇలాగైనా తనపగ తీరేట్లు శాస్తి జరిగిందని ) నీ కాలి అందెల మ్రోతలచేత కిలకిలారావాన్ని గావించారు.. ... 

అమ్మా, పొరపాటున సవతిపేరు పలికి తరువాత కిమ్మనక కూర్చోవటము. అందువలన శివుని పాదపద్మముతో ఫాలభాగము తన్నెను.   

శ్లో.  హిమానీ హంతవ్యం హిమగిరినివాసైక-చతురౌ

నిశాయాం నిద్రాణాం నిశి-చరమభాగే విశదౌ |

వరం లక్ష్మీపాత్రం శ్రియ-మతిసృజంతౌ సమయినాం

సరోజం త్వత్పాదౌ జనని జయత-శ్చిత్రమిహ కిమ్ || 87 ||

ఉ.  నీ పదపద్మముల్ నిశిని, నిత్యము విచ్చి హిమాద్రినుండియున్,

మాపటి యంతమందయిన మాయవు, భక్తులకెల్ల సంపదల్

ప్రాపితమౌనటుల్ గనెడు, పద్మచయంబు నిశిన్ గృశించుటన్

నీ పదపాళిఁ బోలదుగ, నిత్యశుభంకరి! దివ్యశాంకరీ!  87.

భావము .
జననీ! మంచుకొండలలో సైతం కుచించుకు పోకుండా ఉండగలిగేవీ రాత్రీ పగలు వికసిస్తూ నీ భక్తులకు అనూన సంపదలను కలిగించేవీ ఐన నీ పాద కమలాలతో ,మంచుచేత నశింపజేయదగినదీ లక్ష్మీదేవికి అలవాలమై రాత్రివేళలో ముడుచుకొని పోయేదీ ఐన సామాన్య కమలం ఏవిధంగానూ సరితూగదని చెప్పడంలో ఆశ్చర్యం ఏమున్నది ? ఏమీలేదు..

అమ్మా నీ పాదములు మంచు కొండ యందు నివాసముండుటలో నేర్పరితనము గలవి, రాత్రి, రాత్రిచివరిలో కూడా  ప్రకాశ వికాశము గలవియు,   భక్తులకు సంపదను అధికముగా కలుగజేయునవియు అయినవి. అట్టి నీ పాదములను మంచు నశింపచేయజాలదు.   రాత్రియందు నిద్రించునవియు,  లక్ష్మీదేవికి ఇష్టమైనవియు, అగు పద్మములను జయించుచున్నవి. అట్టి   పద్మములకు అతీతమైన నీ పాదములు.

ఇక్కడ పార్వతి అనగా పరా + వాటి అనగా పరాశక్తిగలది. పరాశక్తి మొదట్లో వేడిగాయుండును. కుండలినీ జాగృతి ఎక్కువైనప్పుడు క్రమముగా చల్ల బడును. అందుకనే ఆవిడని హైమవతి అందురు.

శ్లో.    పదం తే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం

కథం నీతం సద్భిః కఠిన కమఠీకర్పరతులాం

కథం వా పాణిభ్యా ముపయమనకాలే పురభిదా

యదాదాయ న్యస్తం దృషది దయామానేన మనసా ll 88 ll

శా.  ఆమ్మా! కీర్తికి దావలంబగుచు, ఘోరాఘంబులన్, వ్యాధులన్,

నెమ్మిన్ బాపు సుకోమలంబయినవౌ నీ పాద పద్మమ్ములన్

సమ్మాన్యుల్ కమఠంపు కర్పరమనున్,సామ్యంబె? శ్రీకంఠు డో

యమ్మా! పెండ్లికి బండరాతిపయినే యానించె నీ పాదముల్.  88.

తాత్పర్యము.

దేవీ! కీర్తికినెలవై సంకటములను పారదోలు కుసుమసుకుమారమగు నీపాదమును మహాకవులు క్రూరముగా తాబేటిబొచ్చెతో నెట్లుపోల్చిరో తెలియదు. వివాహకాలమందు శంకరుడు తాను దయగలవాడయ్యుండి రెండుచేతులతోబట్టి యెట్లుసన్నెకంటి (నూఱుడుఱాయి) ని నొక్కించెనో తెలియదు.

శ్లో.  నఖై-ర్నాకస్త్రీణాం కరకమల-సంకోచ-శశిభిః

స్తరూణాం దివ్యానాం సహత ఇవ తే చండి చరణౌ |

ఫలాని స్వఃస్థేభ్యః కిసలయ-కరాగ్రేణ దదతాం

దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశ-మహ్నాయ దదతౌ || 89 ||

చం.  దివిజులనంతభోగు లటఁ దీర్చును కోర్కెలువారికే సదా

దివిఁగల కల్పకంబు, మరి దివ్యపు నీ పదపాళి పేదకున్

ప్రవిమలసంపదాళినిడు, భవ్యపు నీకర చంద్ర సత్ప్రభల్

దివిఁగలస్త్రీల హస్తములు దించఁగఁ జేయును, శాంభవీసతీ!  89.

భావము .
చండీ నామంతో శోభిల్లే తల్లీ ! నీ పాదాలు, సకలసంపదలతో తులతూగుతున్న దేవతలకు మాత్రమే కోరికలు తీర్చే కల్పవృక్షాన్ని తలదన్నుతూ , దీనజనులకు మంగళకరమైన అధిక సంపదలను ఒసగుతున్నాయి .నీ గోళ్ళు దేవతాస్త్రీల కరపద్మాలను ముకుళింపజేసే చంద్రుడిలా శోభిల్లుతున్నాయి...

శ్లో.  దదానే దీనేభ్యః శ్రియమనిశ-మాశానుసదృశీం

అమందం సౌందర్యం ప్రకర-మకరందం వికిరతి |

తవాస్మిన్ మందార-స్తబక-సుభగే యాతు చరణే

నిమజ్జన్ మజ్జీవః కరణచరణైః ష్షట్  చరణతామ్ || 90 ||

భావము .
అమ్మా భగవతీ ! మందార పుష్పగుచ్ఛమనదగ్గ నీ దివ్య చరణాలు లావణ్య మకరందాలను ఒలకబోస్తూ దీనులకు సర్వసంపదలను ఒసగుతున్నాయి . నా ప్రాణేంద్రియాలు ఆరు పాదాల భ్రమరమై నీ పాద పుష్పజనిత పూదేనియను గ్రోలుటయందు నిరంతరం నిమగ్నమగుగాక!...

మ.  ఘన మందార సుపుష్పగుచ్ఛములు నీకల్యాణపదాళి, భ

వనఁ జేయంగ మరందముల్ జిలుకుచున్ భాగ్యాళినిచ్చుంగదా,

నిను భావించెడి నాదు జీవన సుకాండిక్షోభలే వాయుతన్

వినుతిన్ నీపదపద్మసన్మధువులేప్రీతిన్ సదా క్రోలుటన్.  90.

భావము.

అమ్మా, దరిద్రులకు సిరిసంపదలను ఎల్లప్పుడూ వారివారి యుక్తమైన కోరికలకు అనుగుణముగా అనుగ్రహించెదవు.  అట్టి అధిక సౌందర్యముయొక్క గుణములు అను తేనెనువెదజల్లుతున్నదియు మందార కల్ప వృక్షముయొక్క పుష్పగుచ్ఛం నీ పాదమునందు ఉంచి మనస్సు కర్మ వాచా అనగా ఇంద్రియములతో భక్తుడు నమస్కారము. భ్రమరకీటకము వలె   భావమును పొందెదను గాక.

శ్లో.  పదన్యాస-క్రీడా పరిచయ-మివారబ్ధు-మనసః

స్ఖలంతస్తే ఖేలం భవనకలహంసా జహతి |

అతస్తేషాం శిక్షాం సుభగమణి-మంజీర-రణిత-

చ్ఛలాదాచక్షాణం చరణకమలం చారుచరితే || 91 ||

శా.  నిత్యంబున్ కలహంసలెన్ని గనుచున్  నీదౌ పదన్యాసమున్

ప్రత్యేకంబుగా నేర్చుచుండె జననీ! వర్ధిల్లగా నెంచి, యౌ

న్నత్యంబుం గొలుపంగ శిక్షణము గ్రన్నన్ నేర్పునట్లొప్పుచున్

నిత్యంబీవు ధరించునందెల రవల్ స్నిగ్ధంబుగా నొప్పెడిన్.  91.

భావము .
చారుచరితా ! నీ అద్భుత గమనవిన్యాసాన్ని గాంచి నడక నేర్చుకోదలచినవై, నీ పెంపుడు హంసలు తొట్రుపాటు చెందుతూ నీ గమన విలాసాన్ని వీడకున్నవి. అందువల్ల నీ పాదకమలం కెంపులు మొదలగు రత్నాలు తాపిన అందియ మ్రోతలనే నెపంతో , ఆరాజహంసకు ఖేలన శిక్షను గరుపుతున్నట్లుగా ఉన్నది..

శ్లో.  గతాస్తే మంచత్వం ద్రుహిణ హరి రుద్రేశ్వర భృతః

శివః స్వచ్ఛ-చ్ఛాయా-ఘటిత-కపట-ప్రచ్ఛదపటః |

త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయా

శరీరీ శృంగారో రస ఇవ దృశాం దోగ్ధి కుతుకమ్ || 92 ||

చం.  శివుఁడును, బ్రహ్మ విష్ణువులు, శ్రీకరుఁడైన సదాశివుండు, ని

న్నవిమల భక్తిమంచమునకన్నున నాలుగు కోడులైరి, నీ

వవిరళరీతిమంచమున హాయిగవిశ్రమమంద నా సదా

శివుఁడు త్వదీయ తేజమును చెన్నుగ నొంది ముదంబునొందెడున్.  92.

భావము .
హే భగవతీ ! బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు అనే అదికార పురుషులు నలుగురు మహేశ్వరతత్వంలో అంతర్గతులైనవారు కాబట్టి నువ్వు అధిష్టించే మంచముయొక్క నాలుగు కోడులై వున్నారు. సదాశివుడు విమలకాంతి ఘటనారూపం వ్యాజాన దుప్పటమగుతూ , నీ మేనికాంతులు ప్రతిఫలించటంచేత ఎర్రబారిమూర్తిమంతమైన శృంగారరసంవలె నయనాలకు ఆనందాన్ని ఇస్తున్నాడు. ( తెల్లని కాంతిగల శివుడు దేవి మేని ఎర్రని కాంతులు ప్రతిఫలించగా ఎర్రనివాడై ఆమెను సేవిస్తున్నాడని భావము.)

శ్లో.  అరాళా కేశేషు ప్రకృత సరళా మందహసితే

శిరీషాభా చిత్తే దృషదుపలశోభా కుచతటే |

భృశం తన్వీ మధ్యే పృథు-రురసిజారోహ విషయే

జగత్త్రాతుం శంభో-ర్జయతి కరుణా కాచిదరుణా || 93 ||

చం.  జనని యరాళ కేశములు, చక్కని నవ్వు, శిరీషపేశలం

బనఁదగు చిత్తమున్, సుకుచ భార నితంబము లొప్పియుండి వీ

క్షణముల గాచునీ జగతి సన్నుతమౌ దయతోడనొప్పె నా

ఘనమగు శ్రీసదాశివుని కమ్మని యా యరుణప్రభాధృతిన్.  93.

భావము.
తల్లీ ! శంభుడి అనిర్వాచ్యమైన అరాళా అనేశక్తి నీ కురులలో ప్రకాశిస్తోంది. చిరునవ్వులో నీదు సహజమైన సరళా అనేశక్తి ప్రకాశిస్తూంది. చిత్తంలో దిరిసెన పువ్వులాగా మిక్కిలి మెత్తనైన శక్తి ప్రకాశిస్తోంది. స్తనప్రదేశంలో సన్నికల్లు శోభగల శక్తి ప్రకాశిస్తోంది. పిరుదులలో స్థూలశక్తి ప్రకాశిస్తూంది. దేవి జగత్తును రక్షించటానికి అరుణ అనే శక్తీ, కరుణ అనే శక్తీ భాసిల్లుతున్నాయి

శ్లో.  కళంకః కస్తూరీ రజనికర బింబం జలమయం

కళాభిః కర్పూరై-ర్మరకతకరందం నిబిడితమ్ |

అతస్త్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం

విధి-ర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే || 94 ||

చం. చందురుఁడంచునెంచునది చంద్రుఁడు కాదు, సుగంధ పేటియే,

యందలి మచ్చ నీదగు ప్రియంబగు కస్తురి, యెవ్వరెన్నుచున్

జందురుడందురందరది చక్కని నీ జలకప్రదేశమే

చందురునొప్పునాకళలుచక్కని కప్పురఖండికల్ సతీ!

యందవినీవువాడ విధి యాత్రముతోడను నింపువెండియున్.  94.

భావము .
మాతా! లోకంలోని జనులు అఙ్ఞానంతో దేన్ని చంద్రమండలమని తలచుతున్నారో , నిజానికది మరకత మణులచే చేయబడి నీవు కస్తూరి మొదలైన వస్తువులు ఉంచుకోనే భరిణ , చంద్రుడి కలంకంగాభావించబడుచున్నది . నువ్వు ఉపయోగించేకస్తూరి. దేన్ని చంద్రుడనుకుంటున్నారో అది నువ్వు జలకమాడే పన్నీరు నింపిన కుప్పె. చద్రకళలని భావించబడుతున్నవి పచ్చకప్పురపు ఖండాలు .నీవు ఉపయోగించటం వలన తరుగుతున్న వస్తువులను నీదు సేవకుడైన బ్రహ్నమరల నింపుతున్నాడు.. 

శ్లో.  పురారాతే-రంతః పురమసి తత-స్త్వచ్చరణయోః

స్సపర్యా-మర్యాదా తరలకరణానా-మసులభా |

తథా హ్యేతే నీతాః శతమఖముఖాః సిద్ధిమతులాం

తవ ద్వారోపాంతః స్థితిభి-రణిమాద్యాభి-రమరాః || 95 ||

ఉ.  పట్టపురాణివాశివుని పార్వతి! నీ పద దర్శనంబహో

యెట్టులఁ గల్గు పాపులకు? నింద్రుఁడు మున్నగువారలున్ నినున్

బట్టుగచూడ ద్వారములబైటనెయుండియు సిద్దులొందిరో

గట్టుతనూజ! నేనెటుల నిన్ గన జాలుదు పాదసేవకై?  95.

భావము .
తల్లీ! భగవతీ! నువ్వు శివుడి పట్టపుదేవి వవుతావు. అందువల్ల నిన్ను పూజించే భాగ్యం చపలచిత్తులైన వారికి లభించదు. ఇంద్రుడు మొదలైన దేవతలు నీ ద్వారాల చెంత అణిమాది అష్టసిద్దులతోపాటు కావలి కాస్తున్నారు. ( చంచల చిత్తులుకాని సమయాచారులకే శ్రీ దేవి పాదాంబుజ సేవ లభిస్తుంది. . ఇంద్రాదులకు సైతం అష్టసిద్దులు లభిస్తాయి కానీ అమ్మపాదసేవాభాగ్యము లభించదని భావము...)

శ్లో.  కళత్రం వైధాత్రం కతికతి భజంతే కవయః

శ్రియో దేవ్యాః కో వా భవతి పతిః కైరపి ధనైః |

మహాదేవం హిత్వా తవ సతి సతీనా-మచరమే

కుచాభ్యా-మాసంగః కురవక-తరో-రప్యసులభః || 96 ||

శా.  శ్రీవాణీపతిగా వెలుంగుదురు తా శ్రీవాణినే గొల్చుటన్,

భావింపన్ సిరి సేవచే ధరణిపై భాసింత్రు లక్ష్మీపతుల్

దేవీ! చూడగ పార్వతీపతియనన్ దీపించునారుద్రుఁడే,

సావాసంబు కురంటమే కలిగి నీ సంపర్కమున్ పొందదే,

సీ.  బ్రహ్మరాణిని గొల్చి భవ్య సత్ కవులయి వాణీపతిగకీర్తిఁ బరగువారు,

శ్రీలక్ష్మినే గొల్చి శ్రీదేవి కృపచేత ధనికులై పేరొంది ధనపతులుగ

వెలుఁగువారుకలరు, విశ్వేశుఁడొక్కఁడే పార్వతీపతియని ప్రబలు ధాత్రి,

పతిని వీడక నిత్యమతనినే యెదనిల్పి పరవశించెడినిన్ను బడయనేర

తే.గీ.  దవని కురవకమయిననో యమ్మ! నీదు

యెదను పులకించు భాగ్యము నిందువదన!

నీదుపతిఁగూడి యున్న నిన్ నాదు మదిని

నిలిపి పులకించనిమ్ము నన్ నీరజాక్షి!  96.

భావము

ఎందరు కవులు విద్వాంసులు బ్రహ్మదేవుని భార్య యైన సరస్వతిని సేవించుట లేదు? (అనేక మంది సేవించు చున్నారని భావము. పిల్లలమఱ్ఱి పినవీరభద్రుఁడు వాణి నా రాణి అని స గర్వము గా చెప్పుకొని న విషయం ఇక్కడ గమనించ దగినది.) లక్ష్మీ దేవిని సేవించి లక్ష్మీ పతి లేదా ధనపతి అని ఎందరు ప్రసిద్ధి కెక్కలేదు? (ఎంతో మంది ప్రసిద్ధి పొందిరని భావము. ఇతరులు పై విధముగా ప్రసిద్ధి పొందుట ఒక విధముగా లక్ష్మీ సరస్వతుల పాతివ్రత్యమునకు కళంకము అని భావము.) పార్వతీ దేవి స్తన ద్వయ సంపర్కము కేవలం ఒక్క పరమేశ్వరునికి తప్ప ఎవరికిని అచేత నములయిన కురవకము (నీల గోరింట చెట్టు)నకు కూడా అలభ్యము. (లోకములో పార్వతీ పతి అను మాట పరమేశ్వరునికి తప్ప మరెవరికీ లేదని భావము. వాని నా రాణి అని, లక్ష్మీ పతి అని అనిపించుకున్న వాళ్ళు ఉంటే ఉండవచ్చు. పార్వతీ పతి అని ఒక్క పరమేశ్వరుని తప్ప ఎవ్వరినీ అనరు. ఇది పార్వతీ దేవి పాతి వ్రత్య ము అవాఙ్మా నస గోచరము అనుటకు నిదర్శనము. లక్ష్మీ సర స్వతుల కంటే పార్వతీ దేవి పాతి వ్రతము ఉదాత్తమైన ది అని ఫలితార్థము. నీలగోరింట చెట్టునకు దోహద క్రియ స్త్రీల స్తనస్పర్శ అని చెప్పుదురు. అ కాలములో పుష్పించుటకు చేయు క్రియలు దోహద క్రియలు అని చెప్పుదురు.)

శ్లో.  గిరామాహు-ర్దేవీం ద్రుహిణగృహిణీ-మాగమవిదో

హరేః పత్నీం పద్మాం హరసహచరీ-మద్రితనయామ్ |

తురీయా కాపి త్వం దురధిగమ-నిస్సీమ-మహిమా

మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మమహిషి || 97 ||

శా.  నిన్నేబ్రహ్మకు పత్నిగా తలచుచున్ నిత్యంబు సేవింతురా

నిన్నే విష్ణుని పత్నిగాఁ గొలుచుచున్ నేర్పార పూజింతురా

నిన్నే శంభుని పత్నిగాఁదలతురే నిత్యంబు వేదజ్ఞు లే

మన్నన్ వేరగు శక్తి వీ జగతి మోహభ్రాంతులన్ గొల్పితే.  97.

భావము.
పరబ్రహ్మ పట్టపుదేవీ! ఆగమవిదులు నిన్నే బ్రహ్మ పత్నివైన సరస్వతి అంటారు. నిన్నే శ్రీహరి పత్ని లక్ష్మి అంటారు. నిన్నే హరుని సహచారి ఐన గిరితనయ అంటారు. కానీ నువ్వు ఈమువ్వురికంటే వేరై నాల్గవదేవియై ఇట్టిదట్టిదని వచింపనలవిగాని ఆమెవై అనిర్వాచ్యవై, దేశ కాల వస్తువులకు అపరిచ్ఛిన్నమై, భేదించరాని మహాప్రభావం కలిగినదానవై, శుద్దవిద్యలో అంతర్గతమైన మహామాయవై, మాయాతత్త్వమవుతూ ప్రపంచాన్ని నానా విధాలుగా మోహపెట్టుతున్నావు..  

శ్లో.  కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం

పిబేయం విద్యార్థీ తవ చరణ-నిర్ణేజనజలమ్ |

ప్రకృత్యా మూకానామపి కవితాకారణతయా

కదా ధత్తే వాణీముఖకమల-తాంబూల-రసతామ్    98

శా.  శ్రీ లం జిందు కవిత్వమొందగను నీ చెంతున్న విద్యార్థినే,

నీ లాక్షారస యుక్త పాదజలమున్ నే గ్రోలగానెప్పుడౌన్?

చాలున్ మూకకుఁ బల్కుశక్తినిడుచున్ సత్కైతలల్లించనా

మేలౌశారదవీటిఁబోలు రయి భూమిన్ నాకదెట్లబ్బునో?   98.

భావము.
అమ్మా! లత్తుక రసంతో కలిసిన నీ పాద ప్రక్షాళన జలాన్ని విద్యార్ధినైన నేను ఎప్పుడు గ్రోలతానో చెప్పు.. సరస్వతీ మోము తారలోని తాంబూలరసమనదగ్గ నీ పాద ప్రక్షాళిత జల మూగవారికి సైతం కవిత్వరచనా సౌభాగ్యాన్ని ప్రసాదించగలదు. లక్తకరసం నాకు ఎప్పుడు ప్రసాదిస్తావో గదా! నీ పాద ప్రక్షాళిత జలాన్ని నాకు ప్రసాదించి నాముఖం నుండి కవితా సుధారస ధారలను ఎప్పుడు ప్రవహింపజేస్తావో గదా! 

శ్లో.  సరస్వత్యా లక్ష్మ్యా విధి హరి సపత్నో విహరతే

రతేః పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా |

చిరం జీవన్నేవ క్షపిత-పశుపాశ-వ్యతికరః

పరానందాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్ || 99 ||

మ.  నిను సేవించెడివాడు దివ్య ధనుఁడై, నిష్ణాతుఁడై విద్యలన్,

ఘనుఁడౌ బ్రహ్మకు, పద్మగర్భునకుఁ,గాకన్నీర్ష్యచేఁ గొల్పు, తా

తనువున్ దీప్తిని గల్గి యా రతిపునీతన్ మార్చు, నిస్సారమౌ

తనువున్ వీడి నిరంతమంక్తినిగొనున్ తాసాంబునే దల్చుచున్.  99.

భావము.
అమ్మా భగవతీ ! నిన్ను ఉపాసించేవారు , సరస్వతీ దేవినీ (సర్వవిద్యలను) లక్ష్మీదేవినీ ( సర్వసంపదలను ) పొంది వాళ్ళభర్తలైన బ్రహ్మవిష్ణువులకు వైరిగా మారుతున్నారు .రమ్య శరీరంచే రతీదేవిని సైతం ఆకర్షించి ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగిస్తున్నాడు. పశుతుల్య శరీరాన్ని తొలగించుకొని , జీవన్ముక్తుడై కేవలం సదాశివ తత్త్వాత్ముడై పరానంద సుఖాన్ని ఆస్వాదిస్తున్నాడు...

శ్లో.  ప్రదీప జ్వాలాభి-ర్దివసకర-నీరాజనవిధిః

సుధాసూతే-శ్చంద్రోపల-జలలవై-రఘ్యరచనా |

స్వకీయైరంభోభిః సలిల-నిధి-సౌహిత్యకరణం

త్వదీయాభి-ర్వాగ్భి-స్తవ జనని వాచాం స్తుతిరియమ్ || 100 ||

సీ.  నీ చేతి డివిటీల నీరాజనంబును సూర్యదేవునికిచ్చుచున్నయట్లు,

శశికాంతిశిలనుండిజాలువారెడి బిందు జలములనర్ఘ్యంబు శశికొసంగు

నట్లుదకంబులనర్ఘ్యంబుదధికిచ్చినట్టుల నీనుండి యిట్టులేను

నీనుండి పొడమిన నిరుపమ వాగ్ఘరిన్ నినునుతియించుచున్ నిలిచితిటుల,

తే.గీ. ధన్య జీవుఁడనయితి  సౌందర్యలహరి

శంకరులువ్రాయ తెలిఁగించి, శాశ్వతమగు

ముక్తి, సత్కీర్తి, నొసఁగెడి శక్తి! జనని!

అంకితముచేసితినినీకునందుకొనుము.

భావము.
భగవతీ!స్వకీయాలైన చేతి దివిటీల జ్వాలలచేత సూర్యుడికి ఆరతి గావిస్తూన్నట్లు చంద్రకాంత శిలనుండి శ్రవిస్తూన్న జలబిందువులచేత చంద్రుడికి ఆర్ఘం సమర్పిస్తూన్నట్లూ, ఉదకాలచే సముద్రుడికి తృప్తికారణమైన తర్పణం కావిస్తూన్నట్లూ , నీ వల్ల పొడిమినటువంటి నీ స్వరూపాలైన వాక్కుల కూర్పులచే నిన్ను నేను స్తుతిస్తున్నాను.

సౌందర్యలహరి స్తోత్రమునకు ఆంధ్రపద్యానువాదము సంపూర్ణము.

01 . 6 . 2023. 

 

                                             


          ఓం శ్రీమాత్రే నమః



Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.