గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, మే 2024, గురువారం

విరాట నగరే రమ్యే ... ప్రహేళిక. చెప్పుకోండి చూద్దాం. .. ఈ రోజు అవధానశిక్షణా ఛాత్రులకొఱకు మా దత్తశర్మ సహోదరుఁడు వివరించిన చమత్కార శ్లోకము.

 జైశ్రీరామ్.

విరాట నగరే రమ్యే  -  కీచకాదుపకీచకం

తత్ర  క్రియాపదం వక్తుమ్  - హైమం దాస్యామి కంకణం. 


రమ్యమైన విరాటనగరములో కీచకుని నుండి ఉపకీచకుని వరకూ"  

అనే పాదద్వయంలో క్రియాపదం దాగియున్నది. అది చెప్పినవారికి 

హైమ కంకణం యిస్తాను అన్నాడొక పండితుడు.

క్రియాపదం ఎక్కడుందో ఏరూపంలో వుందో  వెతుక్కోవాలి. 


వేరొక పండితుడు ఎలాగో కస్టపడి క్రియాపదము కనుక్కొని, యిలా వివరించాడు.

రమ్యే= రమ్యమైనటువంటి,  నగరే =అరణ్యమున 

(నగర పదమునకు అరణ్యమనే అర్థము కూడావుంది).  

కీచకాత్=ఒక వెదురు చెట్టునుండి,  ఉపకీచకం = వేరొక వెదురుచెట్టువరకూ 

వి: =పక్షి,  ఆట=తిరిగెను. 'విరాట అనే పదాన్ని విడదీస్తే వి:+ ఆట  =విరాట.

అట అనునది క్రియాపదం.  ఒక పక్షి ఒకవెదురు చెట్టునుండి మరొక 

వెదురు చెట్టువరకూ తిరిగింది (లేక ఎగిరింది)

కీచకుడు,  ఉపకీచకుడు అనే అర్థాలు విరాట నగరానికి సంబంధించినవే. 

అవే  పదాలు అరణ్యార్థం లో వాడితే వెదురు చెట్టు మరొక వెదురుచెట్టు అనే 

అర్థాలనిస్తాయి.  ఇవి శబ్దాలను విడదీయడం వలన ప్రకరణాన్ని బట్టి 

వచ్చే అర్థాలు.  

ఇలా విడమరిచి చెప్పి మరి మీరిస్తానన్న హైమ కంకణం యివ్వండని అడిగాడు.


ఆ పృచ్ఛకుడు  కూడా చమత్కారే. వెంటనే ఒక పాత్రతో చల్లని నీరు తెప్పించి  

ఆ పండితుడి చేతిలో ఒకబోట్టునీరు వుంచి, యిదే నేను నీకిచ్చే బహుమానం 

అన్నాడు.

దానితో సమాధానం చెప్పిన పండితుడికి కోపం వచ్చింది. నీవు హైమ కంకణం 

యిస్తానన్నావని నేనెంతో  ఆలోచించి,పరిశ్రమ చేసి ఆ చిక్కుముడి విప్పాను 

అన్నాడు. 

దానికి ఆ పృచ్ఛకుడు అయ్యా! నేను అబద్ధమాడడం లేదండీ, 

హిమం అంటే మంచు, హైమం అంటే మంచుతో వున్న, కం =నీరు,  

కణం అంటే కణమును, మంచుతో కూడుకున్న నీటిబొట్టును ఇస్తానని 

అన్నాను గదా! అదే మీకు యిస్తున్నాను  అంతే గానీ బంగారుకంకణం 

యిస్తాననలేదు కదా అని తప్పించుకున్నాడు. దాంతో ఆ  పండితుడి ముఖం 

నెత్తురు చుక్క లేనట్టుగా తెల్లబడిపోయింది.  చమత్కారాలిలా ఉంటాయి 

తెలుసుకుంటే ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి .

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.