గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, అక్టోబర్ 2017, సోమవారం

నదీ వృత్త గర్భ సీసపద్యము .. .. .. రచన. శ్రీ నారుమంచి వేంకట అనంత కృష్ణ

 జైశ్రీరామ్.
ఆర్యులారా! నా ప్రియ సహోదరులు శ్రీ నారుమంచి వేంకట అనంత కృష్ణ గారు నదీ వృత్త గర్భ సీసపద్యమును వ్రాసినారు చూడండి.
శ్రీ Chinta Rama Krishna Rao గారు వ్రాసిన అమ్మ స్తుతి స్ఫూర్తితో ... సామాజికాంశం గా ఒక
నదీ వృత్త గర్భ సీసము.
సీ॥
తెలిసికూడ కనులు తెరువరే కానగ
దీన జీవాల్ వారి హీన గతుల
తెలుపరేల తనకు తెలిసినా తప్పుకు
పోవుటేలా తోటి జీవులగని
శిలలైతిరె మనసు తెలుపరే మంచికి
తోడురారే వారి గోడు వినరె
మారరేల జనుల మనసులో జాగృతి
కల్గునెట్లో కదా వెల్గు నింప
తే॥గీ॥
పదుగురొకటైన చాలును ఫలితముండు
తనకు కుదిరినంతటి సేవ ఘనత కాదు
మనసు పెట్టిన పూనిక మానకుండ
వెలుగు నింపుట తేలిక వెతల బాప

సీస గర్భస్థ నదీ వృత్తము. (న న త జ గగ .. యతి 8)
కనులు తెరువరే కానగ దీన జీవాల్
తనకు తెలిసినా తప్పుకు పోవుటేలా
మనసు తెలుపరే మంచికి తోడురారే
జనుల మనసులో జాగృతి కల్గునెట్లో
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
సులభ శైలిలో నదీ వృత్తము అద్భుతముగా నున్నది .ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.