గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, అక్టోబర్ 2017, గురువారం

పద్మ దీప బంధ సీస మాలిక. .. .. .. శ్రీమాన్ హరి వీయస్సెన్ మూర్తి.

జైశ్రీరామ్.
ఆర్యులారా! 
శ్రీమాన్ హరి వీయస్సెన్ మూర్తిగారు. 
పద్మ దీప బంధ సీసమాలికను ఎంత ముదావహంగా రచించారో చూడండి.
"దీప పద్మ గర్భ సీసమాలిక"
(శ్రీయుతులు 'పూసపాటి కృష్ణ సూర్య కుమార్' గారు దీపావళినాడు 'శంకరాభరణం' బ్లాగులో ప్రచురించిన రచన వలన కలిగిన స్ఫూర్తితో చేసిన అభ్యాసము. వారికి ధన్యవాదములు)
సీసము
శంకరా! త్రిపురారి! సర్వేశ్వరుండవు నీవే కదా ప్రభూ! నిన్ను సకల
లోకంబు లన్తటన్ శ్రీకంఠుడను సత్యనామంబు ఘనదీప్తి నడచుచుండు
సర్వార్థ సుఖదాత! సాంత్వనోద్ధారకా! కోసలేశప్రియా! గొల్తు నిన్ను
చంద్రశేఖర! సత్వ సద్యోగమానస! సర్వకాలస్థితా! సద్గుణాఢ్య!
నీసంతతిం గావ నిత్య మీవాసనల్ దూరకు స్ఫూర్తిద! ధూర్తహంత!
హే వ్యాసపూజితా! హే భవా! వాంఛితసంపత్ప్రదా! సర్వసన్నుతాంగ!
తా నెవ్వ డున్నాడు త్రాత సత్యము నీవె వేదనాసంహార! విశ్వవాస!
ముక్తిదాతా! శివా! మునిసాధుజనవాస! నిర్వాణదాయకా! నీలకంఠ!
హే హరా! సర్వదా యాహరిన్నీవెగా ప్రేమించినావు సత్ప్రీతితోడ
హర్షసాన్నిధ్యాన నధివాసమై వెల్గి నీదు సాయుజ్యమున్ నేను జేరు
సద్భావభాగ్యంబు సంగూఢశక్తులన్ నతిసమర్పింతును నాకు దాన
సాధింప జూపి సత్సౌమనస్యం బిచ్చి దాసుడన్ గావవా దాసబంధు!
నిత్యంబు నిను జేరి నిష్ఠతో ధ్యాసను జోడించెదను సుంత సుగుణ మిమ్ము
సన్మానదాయకా! సాధనానందదా! దేవ! సత్పరిపాల! దివ్యమూర్తి!
హే భక్తపాల! సద్వైభవాన్విత! రుద్ర! ప్రణతులం జేసెద పరమపురుష!
తే.గీ.
శంభు! వేదాన్తసందీప్త! సాంబ! నిన్ను
సన్నుతించెద నావాంఛ నెన్ని నాకు
ముక్తి నీయవె సంసారయుక్తి గూల్చి
దాసదాసానుదాసుండ ధర్మమూర్తి!
హ.వేం.స.నా. మూర్తి. 
మూర్తిగారికి హృదయపూర్వక అభినందనలు.
 జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పూజ్య గురువులు శ్రీమాన్ హరి వీయస్సెన్ మూర్తి గారి " పద్మ దీప బంధ సీసమాలిక దేదీప్య మానముగా వెలుగులీను తున్నది ధన్య వాదములు ఇన్ని రకముల ఛందస్సులను తెలుసుకోగల అదృష్టాన్ని కలిగిస్తున్న పెద్దలకు ధన్య వాదములు . శ్రీ చింతా సోదరులు అభినంద నీయులు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.