గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, అక్టోబర్ 2017, గురువారం

బ్రహ్మశ్రీ ఏల్చూరి మురళీధరరావు విద్వద్వరేణ్యులు ప్రవహింపఁ జేసిన ఆంధ్రామృతం గ్రోలండి.

జైశ్రీరామ్.
బ్రహ్మశ్రీ ఏల్చూరి మురళీధరరావు విద్వద్వరేణ్యులు ప్రవహింపఁ జేసిన ఆంధ్రామృతం గ్రోలండి.
బ్రహ్మశ్రీ ఏల్చూరి మురళీధరరావు విద్వద్వరేణ్యులు

వేదార్థప్రతిపాదనైకపరమై విఖ్యాతసత్సంప్రదా
యాదిత్యోదయసానుమచ్ఛిఖరమై యాంధ్రావళీసంతతా
హ్లాదాపాదకమై మహాకవిశుభవ్యాహారనిష్పన్నమౌ 
ఓ దివ్యాంధ్రసరస్వతీ! కొనుమివే యుద్యన్మదీయస్తుతుల్. 
నన్నపార్యుని సుధీసన్నుతస్వచ్ఛగీర్వాణాంధ్రగంగాప్రవాహఘోష 
తిక్కన్న కవి తేట తెనుఁగు పల్కుల చక్కెరలతోడి మావిముక్కల పసందు 
శ్రీనాథకవినాథు శృంగారచాటూక్తినందనప్రసవమరందధార 
పోతనామాత్యుని మోక్ష్మలక్ష్మీపరిష్వంగ సంరంభ వాక్పాటవంబు

పెద్దనార్యుని కవనగాంభీర్యరేఖ 
రాయల బహుశాస్త్రప్రౌఢరసజగత్తు
దివ్యదీధితు లొలయు చాంద్రీమయాంధ్రి! 
దీవెనలు వోసి మమ్మోము తెలుఁగు తల్లి! 

చిన్నయసూరికృతోన్నయనంబున జీవసత్త్వంబునఁ జేవమీఱి
తిరుపతి వేంకటేశ్వరకవీంద్రవధానశుభవాక్యసంహతి శోభఁ జెలఁగి 
మానవల్లిబుధేంద్రమానితాఖిలకావ్యమాణిక్యరోచుల మహిమఁ జెంది
వేదాన్వయోదయవేంకటరాయశాస్త్రి మహాత్మ కృతికళాదీప్తి నలరి

నన్నయాద్రిశిఖరసముత్పన్నమైన
విశ్వనాథార్షభారతీశశ్వదమృత
నిమ్నగాస్నాతపూతమై నీ పదాబ్జ
యుగళి మా కభయచికీర్ష నెగడుఁ గాత. 

పలుకులు భావముల్ మధురభంగిమఁ జొప్పడ; సత్యవస్తుతా
స్ఖలితకళాస్వరూపముఁ, బ్రశస్తరసధ్వనిచార్వలంకృతుల్, 
లలితగుణంబులున్ మెఱయు లక్షణలక్షితగీఃప్రపంచసం 
చలితసరస్వతీకృతివిశాలజగత్పరమేశి కంజలుల్! 

(ఒకరోజు కళాశాలలో తెలుగు పద్యం గురించిన పరిచయ పాఠాన్ని ముగించిన తర్వాత 
సాహిత్యచరిత్ర విద్యార్థులకు వినిపించిన ప్రార్థన)

ఈ పాండిత్య ప్రకర్ష సంభవము శ్రీ ఏల్చూరికే. భక్తికిన్ 
సోపానంబగు మీ సుబోధ, మురళీ శ్రోత్రాద్భుతారావమై
కాపాడంగలదాంధ్రభాషను. శుభాకాంక్షల్. మహాత్మా! భివిన్
దీపింపన్ మహనీయ కావ్యకరణోద్దీప్తిం బ్రవర్ధిల్లుడీ!
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పాండితీ స్రష్టకు ప్రణామములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.