గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, అక్టోబర్ 2017, మంగళవారం

యువశక్తి నిర్వీర్యం కాకూడదు.

  జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీమాన్ ముమ్మడి ఛంద్రషెఖర్ ఆచర్యులవారు ముఖ పుస్తకమున వ్రాసిన ఉత్పల మాల చదివిన నేను చేసిన వ్యాఖ్యలో నేనూహించుచున్న యువతకుండు శక్తి ఉత్పల మాలికగా వెలువడినది. చూడఁగలరు.
శ్రీమాన్ ముమ్మడి ఛంద్రషెఖర్ ఆచర్యులవారు ఇలా వ్రాసిరి. 
పండితమిత్రులందఱికి వందనాలు
ఇలా తోచింది వ్రాసి యున్నాను.
ఉత్ప.
ఏమని చెప్పుదీయువత కెక్కడి బుధ్ధులు నావహించెనో
కామనలెక్కువయ్యె నిల కష్టము లేమియు లేకనొంటికిన్,
భామల దూలనాడి కడు పాపపు మూటనుమోయనెంచగా
నీమము దప్పిరీప్రజల నీవెటు జక్కనొనర్తువమ్మరో!
ముమ్మడి,,,, 2-10-’17.

నావ్యాఖ్య.
చంపక మాలిక..
యువకులు కొందరే క్షితినయోమయ దుస్థితి కారణంబుగా
భవితను కానలేక పరవశ్యమనంబున బ్రాంత చిత్తులై
ప్రవిమల స్త్రీజనంబులను వంచన చేయఁ దలంతురద్దిరా!
యువతకుఁ గల్గు శక్తిని ప్రయుక్తము చేసిన మంచిచేయగా
జవనహయంబులై చెలఁగు. సత్పరివర్తన సంభవించు. సం
భవమగు సంస్కృతీ ప్రగతి, వర్ధనమౌ వర సాంప్రదాయముల్,
కవులు వచించునాకృతయుగంబు రహించును ధర్మపూర్ణమై.
శ్రవణకుమారులున్ వెలయు చక్కఁగ చూడఁగ తల్లిదండ్రులన్,
ప్రవిమలదేశభక్తియుత భావితరాలకు మార్గదర్శమౌన్
కవులును గాయకుల్ వెలయు, గౌరవ వర్తన కాంతులీను,సం
స్తవ శుభ వర్తనల్ పెరుగు, ధర్మవిరుద్ధములుండఁబోవు, ప్రా
భవమది దీపితంబగు. శుభంబులె గాంచుదురెల్లరున్ సదా.
నవనవ కాంతులీనెడుననావిల భాసుర భారతావనిన్.
ప్రవరవరుల్ జనించుదురు భారతజాతికి కీర్తి పెంపగున్.
పవనకుమారులై ప్రగతిబాటను సాగుదురాత్మశక్తితో,
శివుని త్రినేత్రులై దురిత చిత్తుల దుర్మతి కాల్తురిత్తరిన్,
లవణ జలంబులన్ సుధను లక్ష్యముతో వెలి దీతురెన్నుచున్,
ప్రవహములై జలంబులు ప్రపన్నులఁ గావఁగ జాలునిబ్భువిన్.
నివసనముల్ రహించు మహనీయుల గొరవమెన్నగాబడున్,
ధవళితమౌను వేదములు ధాత్రిని విశ్వజనీనతన్, మహో
ద్భవులుగ భారతీయులిల ప్రాభవమున్ గొను సజ్జనాళిచేన్.
రవియు కనంగఁ జాలని పరాత్పరునిన్ గననేర్తురెల్లరున్.
యువతయె సాధకుల్ కన. ప్రయుక్తిని ఛండమయూఖులౌదు రీ
యువతకు దారి జూపెడి ప్రయోజకులిప్పుడు మృగ్యమౌటచే
ప్రవరులె బాటతప్పి పలు రాక్షస కృత్యము లబ్బి ధాత్రికిన్
యువతయె కీడు చేతురన నొప్పుచునుండిరి చంద్రశేఖరా!!

యువశక్తి వర్ధిల్లుఁగాక.
సస్తి.
జైహింద్. 
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
యువశక్తి పైన రచించిన " ఉత్పలమాల , ఉత్పలమాలికలు ,యువకులకు మార్గదర్శకములుగా వెలుగులీను చున్నవి ధన్య వాదములు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.