గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, అక్టోబర్ 2017, సోమవారం

కంద గర్భిత శార్దూలము. .. .. .. రచన. శ్రీమతి పావులూరి సుప్రభ

 జైశ్రీరామ్.
కంద గర్భిత శార్దూలము.  ..   ..   ..   రచన. శ్రీమతి పావులూరి సుప్రభ
నీవే దిక్కని కొల్చెదమ్మ మదిలో, నిక్కమ్ము, విద్యాధరీ!
రావే! వెల్గునుఁ జూపి లోనఁ బ్రియమారంగాఁ , గృపాసాగరీ!
నీవందించిన శక్తి, నిత్యమికపై నిర్మించి నైపుణ్యమున్‌
నే వైవిధ్యము తోడఁ జేతుఁ బ్రణుతుల్‌ నిత్యా ముదంబీయఁగా
శార్దూల గర్భస్థ కందము.
నీవే దిక్కని కొల్చెద
వే వెల్గునుఁ జూపి లోనఁ బ్రియమారంగా
నీవందించిన శక్తిని
వైవిధ్యము తోడఁ జేతుఁ బ్రణుతుల్‌ నిత్యా!
సుప్రభ

09-15-2017
చింతా వారు ప్రచురించిన కందగర్భ శార్దూలవిక్రీడితము చూడగానే, చాల రోజుల తరువాత మళ్లీ గర్భకవితను యత్నించాలనే యూహ కలిగినది. వెంటనే లోనున్న వారు వ్రాయిస్తానులే, క్రిందికి వెళ్ళి పనులు పూర్తిజేసికొని రా, అని చెప్పారు. అలాగే అని ఆ పనులు పూర్తి చేసికొని వచ్చి కూర్చుని మరల ముఖపుస్తకములోని సందేశములను జూస్తూ కూర్చున్నాను. కాసేపటికి లోనుండి ఆదేశము వచ్చినది..ఆ పద్యము ముందునుంచుకోమని. అలాగే నని ముందు బెట్టుకొని కావలసిన గుర్తులు బెట్టుకొన్నాను. అందించిన స్ఫూర్తితో కూర్చిన పద్యము పైన నున్నది.
వారి పద్యముతో స్ఫూర్తి కలిగించిన చింతావారికి ధన్యవాదములు. మనసు తెలిసికొని వెంటనే కానుక నందించిన వారికి వందన శతములు.

అవలీలగా గర్భకవితలందించుచున్న అమ్మకు అభినందనలు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
సుప్రభ గారు ! మీరు అదృష్ట వంతులు .అమ్మదయ శ్రీ చింతా సోదరులకృప మీకు పుష్కలముగా లభించనున్నవి .ముందుకు మున్ముందుకు , సాగి పొండి .శుభమస్తు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.