గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, అక్టోబర్ 2017, బుధవారం

శతావధాని రాంభట్ల పార్వతీశ్వర శర్మ 47వ - అష్టావధానం. ..

జైశ్రీరామ్.
ఆర్యులారా!
తేదీ 27.09.2017, శతచండీయాగం సందర్భంగా. చింతలూరు, రావులపాలెం దగ్గర జరిగిన.
శతావధాని రాంభట్ల పార్వతీశ్వర శర్మ 47వ - అష్టావధానం.
సంచాలకులు : శ్రీ మధునాపంతుల సత్యనారాయణ మూర్తి, పల్లిపాలెం
సమస్య : డా. నరసింహదేవర ఉమామహేశ్వర శాస్త్రి,
దత్తపది: శ్రీ వర్మ గారు
వర్ణన: శ్రీమతి ఓలేటి
నిషిద్ధాక్షరి: శ్రీ ఓలేటి బంగారేశ్వర శర్మ
న్యస్తాక్షరి: శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి
ఆశువు: -----------------------------
ఘంటానాదం: డా. పాలంకి లక్ష్మీ దేవి
అప్రస్తుతం: ద్విభాష్యం వేంకటేశ్వర్లు
ధారణాంశాలైన పద్యాలు ఆస్వాదించి ఆశీర్వదించండి!
సమస్య:
చండీ మండన దండనంబులను హింసాహింసపాలింపవే
గండంబుల్ కలిగించు దుష్టుల మఖాకారంబునందుంచి, వే
దండంబెక్కి మహార్షరూపిణివనన్ ధర్మంబు పృథ్విం గనన్
నిండున్ ప్రేమముజూపి భక్తతతిపై, నిర్లక్ష్యపుం ధూర్తులన్
చండీ మండన దండనంబులను హింసాహింసపాలింపవే!
దత్తపది : చండి, కాళిక, భైరవి, రుద్రాణి - అమ్మవారి స్తుతి.
చండి దేహమునందలి శత్రు తతికి!
కవులగాచెడికాళిక కథలవినమె!
భైరవీయంచు పూజింప బాధలెల్ల
దంష్ట్రముల జిక్కి త్రెళ్ళు రుద్రాణి! నతులు!!
వర్ణన: చింతలూరు - చండీయాగం
ఆయుర్వేదమహాలయంబనగ విఖ్యాతింగన్నదీ సీమయే
ఆయుర్దాతగు శక్తి నిల్చెనిట; సఖ్యంబిచ్చు నీ యాగముల్;
ధీయుక్తంబుగ చింతలూరు సతమున్ దేదీప్య మానంబుగా
నీ యా చోటు లనేక ప్రాంతములలో నీ రీతి పెంపుంగనున్!
నిషిద్ధాక్షరి: శారదా స్తవం (మూడు పాదాలు ప్రత్యక్షర నిషేధం, నాల్గవ పాదం స్వేచ్ఛ)
శ్రీ మాకిచ్చున్ నీ వా
శ్రీ! మాపాలిని! జనని! వరించుమ మమ్మున్!!
లేమా! అజనిజభామా!
ధీమంతుల జేయుమమ్మ దీవ్యత్ప్రభలన్!!
న్యస్తాక్షరి:
ర, న, త,వి అనే అక్షరాలు వరుసగా నాలుగు పాదాల్లో మొదటి అక్షరాలుగా ఉంచుతూ చండీ యాగం - అవధాన వేదిక వర్ణన.
రయమున నేలుమమ్మ! ఘనరమ్య వధాన విధాన మంతయున్
నయనములారయన్ చనని నవ్య పథాన పదాల పోహళిం
త యనగ పృచ్ఛకాళి శృతి దప్పని రాగము నాగ మెచ్చ దే
వి! యనుగు బాలుడున్ గనుమ విశ్రుత పాండితి గల్గ జేయుమా!!
తదుపరి
ఆశువులు, ఘంటాగణనం, అప్రస్తుత ప్రసంగంతో అష్టావధానం సంపూర్ణమైంది
స్వస్తి
ఈ కార్యక్రమ నిర్వాహకులకు, అవధానిగారికి, పృచ్ఛకాళికి అభినందనలు.
  జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవధానము నందలి అన్ని అంశములను మాకందించి నందులకు శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు . చిరంజీవి శ్రీ శర్మ గారికి అభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.