గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, అక్టోబర్ 2017, శుక్రవారం

కవయిత్రి పావులూరి సుప్రభ కృత ద్వివిధ కందద్వయ తేటగీతి గర్భ చంపకమాల

 జైశ్రీరామ్.
ఆర్యులారా! కవయిత్రి పావులూరి సుప్రభ గారు గర్భకవితానురక్తులై విరచించిన ద్వివిధ కందద్వయ తేటగీతి గర్భ చంపకమాల ఎంత చక్కగా వ్రాసిరో గమనించండి.
కందద్వయ, - తేటగీతి - గర్భ  చంపక మాల .
వర గుణదాయినీ జనని పావన రూపిణి శారదాంబ వా
సర రమణీమణీ కృపను సత్యమెరుంగగ నీయ శక్తి య
క్షర ఘనతన్‌ వి/గనన్‌ ముదముగా నిను బాడెడి పుత్రినౌదు, నీ
దరి రమణన్‌, సదా సుముఖతన్‌ గమకంబును జూపనౌను గా.
చంపకమాలలో గర్భితమైన....
కం. (1)
గుణదాయినీ జనని పా
వన రూపిణి శారదాంబ వాసరరమణీ
ఘనతన్‌ వి/గనన్‌ ముదముగా
నిను బాడెడి పుత్రినౌదు నీ దరి రమణన్‌
కం. (2)
రమణీమణీ! కృపను స
త్యమెరుంగఁగ నీయ శక్తి, యక్షర ఘనతన్‌
రమణన్‌, సదా సుముఖతన్‌
గమకంబును జూపనౌనుగా వర గుణదా!
తే.గీ
జనని పావన రూపిణి శారదాంబ
కృపను సత్యమెరుంగఁగ నీయ శక్తి
ముదముగా నిను బాడెడి పుత్రినౌదు,
సుముఖతన్‌ గమకంబును జూపనౌను.

చింతా రామకృష్ణారావు గారి "ద్వివిధ కందద్వయ, తేటగీతి గర్భ చంపకమాల" స్ఫూర్తితో యత్నించినది. వారికి హార్దిక ధన్యవాదములు,
సుప్రభ .
అందంబుగ ద్వివిధంబగు
కంద ద్వయ గీతములను కల చంపకమున్,
సుందరభామృతముగ
నందించిన కవయిత్రికి హారతులిడుడీ!
జైహింద్.


Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పావులూరి సుప్రభ గారి కృషి అనన్యం .అద్భుతముగా నున్నది. శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.