గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, అక్టోబర్ 2017, గురువారం

కంద, గీత, గర్భిత ఉత్పలమాల .. .. .. రచన శ్రీమతి పావులూరి సుప్రభ.

జైశ్రీరామ్.
కంద, గీత, గర్భిత ఉత్పలమాల రచన పావులూరి సుప్రభ.
సుస్వర మాలతో జనని, సుస్వర రాజ్ఞిని సన్నుతించి జ్ఞా
నేశ్వరిగా, సదా పలుకు నీరజ నేత్రిగఁ బాడ భక్తితో
నాస్వర దీప్తితో వెలుఁగనా వరదాయిని బిడ్డ నౌచు భా
షా స్వరమై నటుల్‌ శుచిగ శంకరమై నుడి శోభమీఱఁగా.

గర్భితమైన కందము
స్వర మాల తో జనని సు
స్వర రాజ్ఞిని సన్నుతించి జ్ఞానేశ్వరిగా
స్వర దీప్తితో వెలుఁగనా
వరదాయిని బిడ్డ వోలె, భాషా స్వరమై!

గర్భితమైన తేటగీతి
జనని సుస్వర రాజ్ఞిని సన్ను తించి
పలుకు నీరజ నేత్రిగఁ బాడ భక్తి
వెలుఁగనా వరదాయిని బిడ్డ నౌచు
శుచిగ శంకరమై నుడి శోభ మీఱ
సుప్రభ

09-17-2017
చింతా వారి గర్భకవిత స్ఫూర్తిగా, నేను ప్రచురించిన "నీవే దిక్కని" అనే కందగర్భిత శార్దూలమును చదివి వారు కంద,గీత గర్భిత ఉత్పలమాల లో స్పందనను దెలిపారు. అది చూడగానే చాలాకాలముగా నటువంటిది వ్రాయాలని యున్న సంకల్పము బలపడి పురికొల్పినది. కొంచెము కష్టపడినా లోనున్న వారి సాయముతో పై పద్య రూపములో పూర్తిజేయగలిగాను. :-) విషయము మాత్రము మామూలే. )-:
సంకల్పము రూపు దిద్దుకొనుటకు స్ఫూర్తినిచ్చిన చింతా వారికి ధన్యవాదములు. లోనుండి మౌనముగానే సాయమిచ్చిన వారికి శతాధిక వందనములు.

ఈ సుగుణవతికి అభినందన పూర్వకముగా నేను వ్రాసినది.
దేవరాజ వృత్త గర్భ సీసము,
గణ్య కవితలల్లగా సముచిత కల్ప - నంబు కలుగుచున్ నవంబు నెంచి,
భవ్య భవిత నెన్నిభారతికిని పావు - లూరి శుభ ప్రభాస ధీర వనిత
గణ్య భువిని గర్భకావ్య కలన పూజ్య - వౌదు వనునటుల్ శుభాదులొప్ప
సత్య కవన తేజసంబు కొలుపఁ గల్గి - తీవు. శుభగుణాళి తేజమీవు.
తే.గీ. సత్కవిత్వ ప్రదీప్తంబు సలుపనెంచి
గర్భచిత్రాదులన్ వ్రాయఁ గాంచి నన్ను
తత్ సుధాధార కైఁగొంచు తన్మయతను
వ్రాయుచున్నట్టి మీరిలన్ వరలుడమ్మ.
జైహింద్. 
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఒకరిని మించిన మరొకరు . ఇద్దరూ పండితులే అయినప్పుడు కవిత్వానికి కొదవేమున్నది. చాలా సంతోషముగా నున్నది ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.