గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, అక్టోబర్ 2018, సోమవారం

కృష్ణసంతానం . . శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారు

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారు ఎంత వివరంగా సమీకరించి చూపారో చూడండి. వారికి ధన్యవాదములు.
కృష్ణసంతానం
శ్రీకృష్ణుడికి రుక్మిణి, సత్యభామ తదితర అష్ఠ మహిషులు, పదహారు వేల వంద మంది భార్యలు ఉన్నారు. కృష్ణుడికి ఆ భార్యల వల్ల కలిగిన సంతానం ఎంత? భార్యలందరితోనూ ఆయనకు ఒక్కొక్కరి వల్ల పదేసి మంది పిల్లలు పుట్టారు.
*రుక్మిణి వల్ల కృష్ణుడికి*
ప్రద్యుమ్నుడు,
చారుదేష్ణుడు,
సుదేష్ణుడు,
చారుదేహుడు,
సుబారుడు,
చారుగుప్తుడు,
భద్రచారుడు,
చారుచంద్రుడు,
విచారుడు,
చారుడు అనే బిడ్డలు కలిగారు.
*కృష్ణుడికి సత్యభామ* వల్ల
భానుడు,
సుభానుడు,
స్వర్భానుడు,
ప్రభానుడు,
భానుమంతుడు,
చంద్రభానుడు,
బృహద్భానుడు,
అతిభానుడు,
శ్రీభానుడు,
ప్రతిభానుడు అనే బిడ్డలు కలిగారు.
*జాంబవతీ శ్రీకృష్ణులకు*
సాంబుడు,
సుమిత్రుడు,
పురజిత్తు,
శతజిత్తు,
సహస్రజిత్తు,
విజయుడు,
చిత్రకేతుడు,
వసుమంతుడు,
ద్రవిడుడు,
క్రతువు అనే సంతానం కలిగింది. జాంబవతికి కలిగిన ఈ బిడ్డలంటే కృష్ణుడికి ప్రత్యేకమైన ప్రేమ ఉండేది.
*నాగ్నజితి, కృష్ణులకు*
వీరుడు,
చంద్రుడు,
అశ్వసేనుడు,
చిత్రగుడు,
వేగవంతుడు,
వృషుడు,
లముడు,
శంకుడు,
వసుడు,
కుంతి అనే పిల్లలు కలిగారు.
*కృష్ణుడికి కాళింది* వల్ల
శ్రుతుడు,
కవి,
వృషుడు,
వీరుడు,
సుబాహుడు,
భద్రుడు,
శాంతి,
దర్శుడు,
పూర్ణమానుడు,
శోమకుడు అనే కుమారులు జన్మించారు.
*లక్షణకు, శ్రీకృష్ణుడికి*
ప్రఘోషుడు,
గాత్రవంతుడు,
సింహుడు,
బలుడు,
ప్రబలుడు,
ఊర్ధ్వగుడు,
మహాశక్తి,
సహుడు,
ఓజుడు,
అపరాజితుడు అనే సంతానం కలిగింది.
*మిత్రవింద, కృష్ణులకు*
వృకుడు,
హర్షుడు,
అనిలుడు,
గృద్ధుడు,
వర్ధనుడు,
అన్నాదుడు,
మహాశుడు,
పావనుడు,
వహ్ని,
క్షుధి అనే పుత్రులు పుట్టారు.
*కృష్ణుడికి భద్ర* అనే భార్య వల్ల
సంగ్రామజిత్తు,
బృహత్సేనుడు,
శూరుడు,
ప్రహరణుడు,
అరిజిత్తు,
జయుడు,
సుభద్రుడు,
వాముడు,
ఆయువు,
సత్యకుడు అనే పిల్లలు పుట్టారు.
*శ్రీ కృష్ణ నిర్యాణం*
కురుక్షేత్ర సంగ్రామం అనంతరం, ఒకనాడు కణ్వ, విశ్వామిత్ర , నారద మహర్షులు శ్రీ కృష్ణుని సందర్శనార్దం ద్వారకకు విచ్చేశారు. వీరు పురవీధుల్లో సంచరిస్తూ ఉండగా కొందరు ద్వారక యువకులకు చిలిపి ఊహ తట్టింది. ఆ యువకులు ఒకడికి స్త్రీ వేషం వేసి ఆ మునుల వద్దకు తీసుకుని పోయి ఈ చిన్నదానికి ఆడ బిడ్డ పుడతాడో , మగ బిడ్డ పుడతాడో చెప్పమన్నారు. ఆ మహర్షులు అమాయకులు కాదు కదా, దివ్యదృష్టి తో మొత్తం కనుక్కుని ఆగ్రహం తో, ఆడబిడ్డా కాదు మగబిడ్డా కాదు ఒక ముసలం(రోకలి) పుడుతుంది, అది మీ యాదవ వంశం మొత్తాన్ని నాశనం చేస్తుంది అని శపించి వెనక్కి వెళ్ళిపోయారు.
ఈ విషయం శ్రీ కృష్ణునికి తెలిసింది. విధి రాత ను ఎవరూ తప్పించలేరు, యాదవ వంశానికి కాలం చెల్లింది అనుకున్నాడు.
మహర్షుల తపశ్శక్తి ఫలితంగా ఆ యువకుడికి ముసలం జన్మించింది.
ఆ యువకులు దానిని శ్రీ కృష్ణుని వద్దకు తీసుకుపోయారు.
శ్రీ కృష్ణునికి అది యాదవ వంశాన్ని నాశనం చేసే ఆయుధం లా కనిపించింది. దానిని పిండి చేసి సముద్రం లో కలపమని ఆ యువకులకు చెప్పాడు.
వారు దానిని పిండి చేసి సముద్రం లో కలిపారు. చివరగా ఒక ముక్కను అరగదీయలేక దానిని సముద్రం లోనికి విసిరివేశారు. పిండి చేసిన ముసలం మనల్ని ఎలా నాశనం చేస్తుంది లెమ్మని సంతోషం గా ఇళ్ళకు పోయారు. కానీ మునుల వాక్కు వృధా పోదు కదా. మిగిలిన ఆ రోకలి ముక్క తీరానికి కొట్టుకు వచ్చి ఒకానొక చోట ఇసుకలో దిగబడింది.
సముద్రంలో కలిసిన రోకలి పిండి బడబాగ్ని వలె కాచుకుని ఉంది. శ్రీ కృష్ణునికి ఇవన్నీ తెలిసినా విధి రాతను తప్పించే శక్తి లేక మిన్నకుండి పోయాడు.
అది మొదలు ద్వారక నగరం లో అనేక ఉత్పాతాలు సంభవించాయి.
ఎపుడూ లేని విధంగా యాదవులు సజ్జనలును బాధించడం మొదలుపెట్టారు.
స్త్రీలు భ్రష్టు పట్టిపోతున్నారు. యాదవవంశ నాశనం దగ్గరలోనే ఉందని కృష్ణునికి అర్ధం అయ్యింది.
తను ఎంతో ప్రేమించే ద్వారకలో యాదవులు నాశనం అవ్వడం ఇష్టం లేని కృష్ణుడు యాదవులు అందరినీ కొలువుపర్చాడు.
సముద్రానికి జాతర చెయ్యాలని అందరినీ బయలుదేరమని చెప్పాడు. అందరూ కావలసిన సరంజామా అంతా తీసుకుని బయలుదేరారు.
బలరాముడు అరణ్యమునకు బయలుదేరాడు. శ్రీ కృష్ణుడు ఒక్కడే యాదవుల తో పాటు వెళ్ళాడు. వెళ్ళే ముందు తండ్రియైన వసుదేవునితో ఇలా అన్నాడు. “తండ్రీ! కొద్ది రోజులలో ద్వారకను సముద్రం ముంచెత్తనున్నది. అర్జునుడు వస్తాడు మిమ్ములను అందరినీ ఉద్ధరిస్తాడు. అతను వేరు నేను వేరు కాదు. అందరూ అతని ఆజ్ఞను పాటించండి.”
సముద్ర తీరానికి వెళ్ళిన యాదవులు సుష్ఠుగా భోజనం చేసి, కృష్ణుని ఎదుటే మద్యం తాగి ఒకరిలో ఒకరు కలహించుకోసాగారు.
అన్నీ తెలిసినా కృష్ణుడు ఏమీ చెయ్యలేని వాడయ్యాడు.
అంతలో ఒకడు ఆనాడు సముద్ర తీరంలో దిగబడిన రోకలి తుంగను తీసుకుని ఒకడిని మోది చంపేశాడు.
అది మొదలు అందరూ ఒకరిని ఒకరు చంపుకున్నారు.
మిగిలిన దారుకుడిని, భబ్రుడిని తీసుకుని బలరాముడు ఉన్న చోటికి బయలుదేరాడు శ్రీ కృష్ణుడు. అక్కడ బలరాముడు అరణ్యం లో ధ్యానం లో ఉన్నాడు.
అపుడు శ్రీ కృష్ణుడు అర్జునుడి ని ద్వారకకు తీసుకురమ్మని దారుకుడిని పంపాడు. భబ్రుడి ని ద్వారకలోని స్త్రీలను, మిగిలిన వాళ్ళని ప్రయాణమునకు సిద్దం చెయ్యమని పంపాడు.
కానీ మార్గమధ్యం లో ఒక ఆటవికుడు అతనిని అదే రోకలి తుంగ తో సంహరించాడు.
దారుకుడు ఏడుస్తూ పాండవుల దగ్గరికి వెళ్ళాడు. అతనిని ఆ పరిస్థితి లో చూసి పాండవులు చలించిపోయారు.
అపుడు దారుకుడు జరిగిన విషయం చెప్పి బలరామకృష్ణులు అరణ్యం లో ఉన్నారని, అర్జునుడుని ద్వారకకు తీసుకువెల్లమన్నారని చెప్పాడు.
అది విని పాండవులు ఆశ్చర్యపోయారు.
శ్రీ కృష్ణ భగవానుడు అచట ఉండగా ఇలా ఎందుకు జరిగిందా అని చాలా భాధపడ్డారు. అర్జునుడు వెంటనే ద్వారకకు పయనమయ్యాడు.
అచట అరణ్యంలో బలరాముడు తన దేహమును విడిచి తన అంశ అయిన మహా సర్ప రూపం ధరించి సముద్రం లో కలిసిపోయాడు.
తన అన్న లేని లోకంలో ఉండటం వృధా అని తలచి, తను చెయ్యవలసిన పనులు కూడా ఏమీ లేవని గ్రహించి తన శరీరం వదలడానికి ఏమి కారణం దొరుకుతుందా అని వేచి చూడసాగాడు. ఒకనాడు తనకు అరికాలితో మరణం సంభవిస్తుందని దుర్వాస మహాముని శాపం ఇవ్వడం గుర్తుకువచ్చింది.
అపుడు శ్రీ కృష్ణుడు ఒక మహా వృక్షం నీడన మేను వాల్చి, అక్కడకు వస్తున్న ఒక బోయవానికి, తన పాదం లేడి పిల్ల లాగా భ్రమింపచేశాడు. అది తెలియని బోయవాడు గురి చూసి కృష్ణుని పాదానికి బాణం వదిలాడు.
తర్వాత వచ్చి చూసి దేవదేవుడైన వాసుదేవునికా నేను బాణం వేసింది అని రోదించడం మొదలు పెట్టాడు. శ్రీ కృష్ణుడు అతనిని ఓదార్చి ఇలా అన్నాడు.
“త్రేతాయుగాన వాలి వైన నిన్ను చెట్టు చాటునుండి చంపిన ఫలితం ఇపుడు అనుభవిస్తున్నాను. కర్మ ఫలమును భగవంతుడైనను అనుభవించవలసినదే. నీవు నిమిత్తమాత్రుడవు.”
అని శ్రీ కృష్ణుడు తన శరీరమును త్యజించాడు.
ద్వారకకు చేరుకున్న అర్జునుడు కృష్ణుడు లేని ద్వారకను చూసి ఖిన్నుడయ్యాడు. శ్రీ కృష్ణుడి ప్రియ సఖుడైన ఆర్జునుడిని చూడగానే శ్రీ కృష్ణుని భార్యలు పలు విధాల రోదించారు.
వసుదేవుడు శ్రీ కృష్ణుడు తనకు చెప్పినదంతా అర్జునుడికి చెప్పి తన యోగనిస్ఠ తో శరీరం వదిలాడు.
వసుదేవుని మరణవార్త శ్రీ కృష్ణునికి చేరవేయడానికి అర్జునుడు అరణ్యానికి బయలుదేరాడు. అరణ్యం లో శ్రీ కృష్ణ భగవానుని మృతదేహం చూసి కన్నీళ్ళ పర్వంతం అయ్యాడు. మృతదేహానికి చెయ్యవలసిన కార్యక్రమాలు చేసి తను ద్వారకకు పయనమయ్యాడు. సిద్ధంగా ఉన్నవారిని తీసుకుని తన రాజ్యానికి బయలుదేరాడు. అర్జునుడు ద్వారక విడిచిన మరుక్షణం అప్పటివరకు కాచుకుని ఉన్న సముద్రం ద్వారకను ముంచెత్తింది.
స్వస్తి !
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చాలా బాగుంది. నాలాంటి వారికి తెలియని ఎన్నో విషయములను చక్కగా వివరించి నందులకు శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారికి ధన్య వాదములు .శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.