గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, అక్టోబర్ 2018, బుధవారం

‘నవరత్న మాలికా’ ... డా.కే రాజన్న శాస్త్రి గారు వివరణ డా. కొరిడేవిశ్వనాధశర్మగారు.

జైశ్రీరామ్.
‘నవరత్న మాలికా’  ...   డా.కే రాజన్న శాస్త్రి గారు వివరణ డా. కొరిడేవిశ్వనాధశర్మగారు.
మా నాన్నగారు {డా.కే రాజన్న శాస్త్రి గారు ) 14 సంవత్సారలకు పూర్వం {13.9.1999} ‘కవితా విపంచీ’ అనే తనచిన్ననాటనుండి ఆయా సందర్భాలలో వ్రాసిన సంస్కృతకవితల పుస్తకమును విడుదల చేసినారు. దానిలో నుండి లలితాదేవీ తత్వమును తెలిపే ఈ ‘నవరత్న మాలికా’ యను పద్యనవరత్నములను శరన్నవరాత్రి సం దర్భమును పురస్కరించుకొని వ్రాయబడినది. “సూర్యోదయః” అను సంస్కృతపత్రికలో ప్రచురితమైనది. ఈ శరన్నవ రాత్రోత్సవముల సందర్భముగా మీకు నిత్యము అందించిననూ, అన్నింటినీ ఒకచోటనే అందింస్తే బాగుంటుందన్న సహృదయసుహృన్మిత్రుల ఆకాంక్షలతో మరల పూర్తి పూర్తి భాగమును మీకు అందిస్తున్నాను.
శా. శ్రీమచ్చంద్రకలావతంసరుచిరా కారుణ్యపూర్ణేక్షణా,
గర్వాఖర్వసుపర్వవైరివిపిన శ్రేణీదవాగ్నిచ్చటా|
శిష్టానిష్టనివారణోద్యమపరా స్రష్ట్రాదిసంసేవితా,
భూయాచ్చ్రీలలితాంబికా భగవతీ నః శ్రేయసే భూయసే || 1 ||
తా. శోభాయమానమానమగు చంద్రకళయే శిరోరత్నమై ప్రకాశించున్నటిదియునూ, కారుణ్యముతోనిండిన కన్నులు కలదియునూ,అత్యధికమైనగర్వముతోకూడిన రాక్షసులు అను అటవికి దావాగ్నిశిఖలు కలిదియునూ, సత్పురుషుల బాధలను నివారించుటయను ఉద్యమమే ప్రధానమైనట్టిదియునూ, బ్రాహ్మాదులచేత మిక్కిలి సేవించబడునట్టిదియునూ, అగు శ్రీ లలితాంబికాదేవి మిక్కిలి మనకు శ్రేయస్సును కలిగించునుగాక!

శిఖరిణి. ముఖే స్వే భాస్వత్వం నయనయుగళేఽబ్జత్వమధరే-
రుణత్వం సౌమ్యత్వం మనసి కుచయుగ్మే చ గురుతామ్|
కృపాయాం సత్కావ్యం నను గతిషు మాన్ద్యం, కచభరే
తమోభూయం, కేతుత్వమరిషు జయస్యంబ ! దధతీ ||2|
తా. అమ్మ ! నీ స్వముఖమునందు ప్రకాశత్వము { సూర్యలక్షణము}, నేత్రద్వయమునందు కమలత్వము { నీటినపుట్టిన చంద్రుని లక్షణము} , అధరమునందు అరుణత్వము { కుజుని లక్షణము}, మనస్సునందు సౌమ్యత్వము {బుధ లక్షణము} కుచయుగమునందు గురుత్వము {భారత్వము,/ గురులక్షణము} అనుగ్రహమునందు సత్కావ్యము {శుక్రలక్షణము}, గమనమునందు మందత్వము {శనిలక్షణము} కేశపాశమునందు అంధకారత్వము {రాహు లక్షణము}, శత్రువులందు విజయ ధ్వజమును {కేతులక్షణము} ఇట్టి లక్షణములను ధరించుచున్నదానవై విజయమును పొందుచున్నావు.

పృథ్వీ. సుమాయుధమనన్యజం నిజనిదేశసంచారిణం
హ్యపాంగవలనైర్ నిజైరధికసత్త్వసంపన్నతామ్|
నయన్త్యథ సుశిక్షితుం భువనమోహవిద్యామముం
కిమమ్బ ! ధృతవత్యసి త్వము సుమేషుమేతం కరే || 3||
తా. ఓ అమ్మ ! అన్యులెవ్వరి చేత జనించని {స్వయముగా జనించునట్టి} వాడై, నీ ఆదేశముల ప్రకారము నడుచునట్టివాడునూ అగు మన్మథునికి నీ క్రీగంటిచేతనే మిక్కిలి సత్త్వసంపన్నమైనదగు ఈ జగన్మోహనవిద్యను కల్గియున్నదానవై నీవు నేర్పుటకేనా చేతియందు ఈ పుష్పబాణమును ధరించుచున్నావు?

పృథ్వీ. పురాభవసుసంచితాన్యమితదీనదీనానన-
స్వసంశ్రితజనావలీకటువిపాకకర్మాణి భోః ! |
విధాతుమివ మాధురీరసభరాణి కారుణ్యతః
కరే కృతవతీ శివే ! విమలమిక్షుఖండం నిజే || 4 ||
తా. హే శివపత్ని/మంగళరూపిణి ! మిక్కిలిదుఃఖితులదీనమైనముఖములచేత ఆశ్రయించబడిన జనసమూహములకఠోరములై పరిపక్వములైన పూర్వజన్మ సంచితకర్మలను కారుణ్యముతో మధురరసభరితములుగా చేయబూనుచున్నావో యన్నట్లు నీ స్వహస్తమున నిర్మలమైన ఇక్షుదండమును ఉంచినావు.

పృథ్వీ. జగద్ధితముపేక్ష్య యే స్వహితమేవ చాశాసతే
సమే పశవ ఇత్యముం మనసికృత్య తాన్ ఘాతుకాన్ |
మదోద్ధతమహాసురాన్ దమయితుం మదేభాన్ సృణిం
కరే ధృతవతీ స్వకే మహిషమర్దినీ ! త్వం కిము || 5 ||
తా. హే మహిషమర్దిని ! లోకహితమును ఎవరైతే అశ్రద్ధవహించి, తమ హితమునే కోరుతుంటారో, వారు పశుసమానులు అని మనస్సున తలంచి ఆట్టి కౄరులగు మదొద్ధతులైన మహాసురులు అను మదపుటేనుగులను అణచుటకొరకు నీవు నీ చేతియందుఅంకుశమును ధరించితివా ఏమి ?

ఉపజాతి. సంసారవాప్యాం విషయగ్రహాయాం
నిపత్య పాహీతి లపంతమేతమ్ |
ఆర్తం సముద్ధర్తుమనాః స్వహస్తే
పాశం బిభర్ష్యంబ ! దయావతీ త్వమ్ || 6 ||
తా.అమ్మ! విషయమనే మొసళ్ళచేత నున్నట్టిదైన సంసారకూపమునందు పడిరక్షించమని వదురుచున్నట్టి ఈ నన్ను ఉద్ధరించుటకొరుచున్నదానివై నీవు నీ నిజహస్తమునందు ఫాశమును ధరించుచున్నావా?
( ఉపజాతి వృత్తము = 1, 3 ,4 పాదాలలో ఇంద్రవజ్ర , 2 వ పాదంలో ఉపేంద్ర వజ్ర)

అశ్వధాటీ. సైషా సుమేషురిపుయోషా మహోజ్జ్వలవిభూషా విశిష్టవపుషా
శేషాహితల్పసుతయోషామశేషసురయోషాసమాం విదధతీ |
భూషావతీ శిరసి దోషాకృతా మధురభాషాంచితా భవతు న-
స్తోషాయ నిర్మథితదోషాచరా వినతదోషాపనోదనిపుణా || 7 ||
తా. మిక్కిలి ప్రకాశమానమగు అలంకాములతోకకూడినట్టిదియునూ,విశిష్టమైన ఆకృతితో సమస్తదేవకన్యలతో సమానమైనదగు ఆదిశేషతల్పగుడగు శ్రీమహావిష్ణుకోడలైన రతీదేవిని ధరించినట్టిదియునూ, శిరస్సుయందు చంద్రునితో అలంకరిచబడినట్టిదియునూ,మధురమైన వాక్కులచేత {స్తోత్రములచేత} అలంకరింపబడినట్టిదియునూ, దుష్టసంహారిణియునూ వినతులదోషములనుతొలగించుటలో శ్రేష్ఠురాలునూ యగు అట్టి మన్మథశత్రువైన శివునిధర్మపత్ని మనల సంతోషములనిచ్చుగాక !

అశ్వధాటీ. స్థూలా కుచే జలదనీలా కచే జలజలీలా విలోచనయుగే
హేలావినిర్జితమరాలాతిశోభిగతిశీలా కుశేశయకరా |
బాలారుణప్రభసుచేలా కదంబవనలీలావిహారరసికా
బాలా భవాంబునిధివేలాం నయత్వచలబాలామణిర్జనమిమమ్|| 8 ||
తా. కుచములందు స్థూలత్వముగలదియునూ, కేశములందు మేఘములనీలవర్ణము గలదియునూ, నేత్రయుగళమునందు కమలముల విలాసము గలదియునూ, హేళనచేతనే
జయింపబడిన హంసల మిక్కిలి శోభాయమానమగు నడకలప్రవర్తన గలదియునూ, కమలములవంటి కరములు కలదియునూ, బాలాసూర్యుని కాంతులవంటి శోభిల్లు చీరను
ధరించినట్టీడియును అగు హైమవతీదేవి ఈ నన్ను సంసారసాగరము నుండి గట్టెక్కించు గాక !

భుజంగప్రయాతమ్. దహన్తీ స్మృతా వాసనాబీజజాతం
వహన్తీ దృగన్తే చ కారుణ్యపూరమ్ |
ధునానా మమైనశ్చిదానన్దరూపా
లసత్వన్తరంగే సదా మామకీనే || 9 |
తా. కేవలము స్మరణ మాత్రముచేతనే వాసనాబీజజాతమైన ఈ సాంసారికవిషయాసక్తిత్వమును దహింపజేయుచున్నట్టిదియునూ, తన కటాక్షవీక్షణమునందు కారుణ్యజలప్రవాహమును ప్రవహింపజేయునట్టిదియునూ, నా పాతకములను నశింపజేయునట్టిదియునూ అగు చిదానన్దరూపాత్మకమైన ఆ దేవి నిరంతరము నా అంతరంగమునందు ప్రకాశించునుగాక !
జైహింద్..
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
నవనవోన్మేషణ యగు లలితాంబికా స్తుతిని అద్భుతమైన వర్ణనతో నవవిధములుగా పద్య రూపమున మాకందించిన శ్రీ డా. కె. రాజన్నగారికి , సోదరులు శ్రీ చింతా వారికీ కృతజ్ఞతలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.