గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, అక్టోబర్ 2018, మంగళవారం

నారదుఁడు చతురోక్తుల శ్రీకృష్ణుని నుతించుట ... చిత్ర బంధ గర్భ కవితాదులు.,

జైశ్రీరామ్.
ఆర్యులారా! నమస్సులు.
చిత్రకవితాభిరామమయిన పారిజాతాపహరణమున ముక్కు తిమ్మన విరచించిన చిత్రకవితలనిట గమనించి, మనమూ వ్రాయుటకు యత్నింపనగును.
గమనింపుడు.
పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన పంచమాశ్వాసము
నారదుఁడు చతురోక్తుల శ్రీకృష్ణుని నుతించుట
అనులోమ విలోమ కందము.
నాయశరగసార విరయ
తాయనజయసారసుభగధరధీనియమా
మాయనిధీరధగభసుర
సాయజనయతాయరవిరసాగరశయనా! 92
(దీని నర్ధభ్రమక కంద మనియు నందురు. మొదటి రెండు పాదములను దుది నుండి
వెనుకకుఁ జదివినచో మూఁడు నాలుగు పాదము లగును. అనఁగా బూర్వార్ధమును
ద్రిప్పి చదివినచో నుత్తరార్ధమును, ఉత్తరార్ధమును వెనుక నుండి చదివినచో
పూర్వార్ధమును నగునని భావము.)

పాదభ్రమక కందము.
ధీర శయనీయ శరధీ
మార విభానుమత మమత మనుభావిరమా
సార సవననవసరసా
దారద సమ తార హార తామసదరదా! 93
(పాదభ్రమక మనఁగా బ్రతిపాదమును వెనుకనుండి చదివినను నదే పాదము యగును.
దీనినే యనులోమ విలోమ పాద మనియు నందురు.)

గోమూత్రికా బంధ కందము.
విదళితదైత్య రమాగృహ
పదసారస వినతదేవ పతగేశహయా
చిదమిత చైత్యశమావహ
మదవారణ విమతభావమతపాశజయా! 94

నాగ బంధ చంపకమాల.
జలదవితాననీల ఖలసాలకులక్షతివారణేశ ని
శ్చలమునివారపాల సురచారణయక్షనవానుకూల కుం
డలివరహారలోల నరనారదతత్పర భూవిధేయ యు
జ్జ్వలమనునీతిశీలితవశంవద శక్రరమానికేతనా! 95

ఛురికా బంధ కందము.
శ్రీవర వరవరహృత భవ
భావన వనజాయతాక్ష పాలితవిబుధా
ధావితదనుభవనియమి స
భావనచతురా సముద్ధృతార్ణవ వసుధా! 96

చక్ర బంధ శార్దూలము.
చిత్రాకృత్యభినందిత వ్రజమృగాక్షీమధ్యగా యక్షరా
మిత్రోష్ణద్యుతిదిగ్ధచక్ర జనివల్మీకర్క్షపా కృష్ణభా
సత్రారాధ్య నుతింతు నిన్ను జగదీశా విక్రమాతిస్థిరా
రాత్రీ నాంచితభామితాబ్జ సదయా రాధానుభావాకరా! 97
(ఈ బంధమున మూఁడవ చుట్టున "కృష్ణరాయకృతి" యనియు
నాఱవ చుట్టున "నందితిమ్మకవి" యనియుఁ
గృతిపతి కృతిభర్త నామములు గూర్పఁబడి యున్నవి.)

ద్వ్యక్షరి కందము. 
మనమున ననుమానము నూ
నను నీనామ మనుమనుమననమునునేమ
మ్మున మాన నన్ను మన్నన
మను మను నానామునీనమానానూనా! 98
(ఈ కంద పద్యము "న, మ" యను రెండక్షరముల తోడనే సాగినది.
కావున దీనికి ద్వ్యక్షరి కంద మని పేరు. ఈ రెండక్షరములనే
గ్రహించుటచే నయ్యది నమః పూర్వకస్తుతి యైనది.)

ద్వికంద క్రౌంచపదవృత్తము:
క. అంకురితశ్రీ సంగభు
జాంకా హరిహయమణి మదహర తనువర్ణా
సంకటకృద్దైత్యాశయ
శంకాజనన నిజచరిత శయధృతశంఖా! 99
క. పంకజనాభా భంజిత
పంకా పరమపురుష భవపరిభవనామా
శంకరభావా కిసలయ
సంకాశపదయుగ కలశశరనిధిశయనా! 100
(పై రెండు కంద పద్యములను గలిపి వానిలోని రెండేసి పాదముల నేక పాదముగాఁ
జేసి చదివినచో నది నాలుగు పాదములు గల క్రౌంచపద వృత్త మగును.
లక్షణము: ప్రతి పాదము నందును భ, మ, స, భ, న, న, న, య, యను గణము లుండును.
పదు నొకండవ యక్షరమునకును బందొమ్మిదవ యక్షరమునకును ( ౧  -  ౧౧  -  ౧౯ ) యతి.)

భుజంగప్రయాతగర్భ స్రగ్విణి.
వాసుదేవా ఘనస్వచ్ఛకాంతీ రమా
వాస వంశస్వరవ్యక్తవేద క్రమా
రాసలాస్యప్రకార ప్రవీణోద్యమా
వాసవాదిస్తుతవ్యక్తనామా నమః. 101
(ఇది స్రగ్విణీ వృత్తము. దీనిలో మరొక భుజంగ ప్రయాత మను
వృత్త మిమిడి యున్నది. పద్యాంత మందలి "నమః" యను పదమును
"నమో" యని మొదటఁ జేర్చి చదివినచో భుజంగ ప్రయాత వృత్తమగును.
స్రగ్విణి లక్షణము: ఇందుఁ బ్రతిపాదము నందును నాలుగు "ర" గణము లుండును.
ఏడవ యక్షరము యతి.
భుజంగ ప్రయాత లక్షణము: ఇందుఁ బ్రతిపాదమునందును నాలుగు "య" గణము లుండును.
ఇందు నెనిమిదవ యక్షరము యతి)

క. అని చిత్రగతుల నవ్విభుఁ
గొనియాడి మునీంద్రుఁ డరిగె గోపవధూటి
జనతా వల్లభుఁడును మి
త్ర నికాయముతోడ నిజపురంబున కరిగెన్‌. 102
 జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
నంది తిమ్మనగారి " అనులోమ విలోమ కందము , పాదబ్రమకము ,మున్నగు ఈ పద్యములు .వ్రాయడం రాదుగానీ నాకు చాలా ఇష్టము. శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.