గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, జులై 2018, శుక్రవారం

శ్రీ"గోవర్ధనోద్ధారణము.శ్రీ అవధాన శారదా భద్రం వేణు గోపాలాచార్య ప్రణీతమ్.

జైశ్రీరామ్.
శ్రీ అవధాన శారదా 
భద్రం వేణు గోపాలాచార్య ప్రణీతమ్.
శ్రీ"గోవర్ధనోద్ధారణము.
శ్రీ చతుర్వింశతి మూర్తి కథా కీర్తనము.

                రచన:-"అవధాన శారదా"-
.                          భద్రం వేణుగోపాలాచార్యులు.
                           విశ్రాంత ప్రధానోపాధ్యాయులు.
                                ఆముదాలవలస.
                                 శ్రీకాకుళం.జిల్లా.

లోకంలో రుక్మిణి కల్యాణము పఠించిన వివాహమవుతుందని, నల చరిత్ర
చదివిన కలిదోష హరణమవుతందని,విరాట పర్వం చదివితే సకాలంలో
వర్షాలు పడి భూమి సశ్య శ్యామల మవుతుందని,నమ్మకంతో చదవడం
సత్ఫలితాలు పొందడం జరుగుచున్నది.పోతన మహాకవి కృతంబైన
శ్రీమదాంధ్ర మహాభాగవతములోని,"గోవర్ధనొద్ధరణ కథ పఠించితే
కొండంత కష్టాలు గోరంతలో పోతాయని జనవాక్యం.దీనికి దీటుగా
తనదైన శైలిలో అవధాన శారదా,శ్రీ,శ్రీ,శ్రీ.భద్రం వేణు గోపాలాచార్యులు
వారు, *గోవర్ధనోద్ధారణ*-యనుశీర్షికలో "చతుర్వింశతి పద్యాలు వ్రాసిరి.
అవి చదువు చున్న వారికి సర్వ శుభాలు కలుగుతున్న ఉదంతాలు
కనబడుచున్నవి.
ఈచతుర్వింశతి వరాత్మకమైన కృతి,మూర్తిత్రయాత్మక సన్నిభమై
బీజాక్షర సంపుటీ కణమై,పఠితులకు శుభ ఫల మొసగు చున్నది.
కావున
ఈపద్యములు ఆంధ్రామృత వీక్షకులు నిష్టతో పఠియించి సర్వ
శుభములు పొందుదురు గాక.

        శ్రీ గోవర్థనోద్ధారణము.
       ******************
1.తే.గీ చూడగా యశోదమ్మను చుట్టు కున్న
           బాల గోపాల మూర్తి కృపాళు డగుచు
          తోడుగా వచ్చి ధృతి నిచ్చి జాడ చూపు
         పల్కులను గైకొనగ కొండ బరువు తీరు!
2.ఉ:-శ్రీ సఖమైన మోము వికసించిన మోహన పారిజాతముల్
        హాసము మౌళి బద్ధ ఘన హార మనోహర బర్హి పింఛమున్
        వాసము పొన్నచెట్టు తమి వస్త్ర్రములన్ వ్రజ కాంతలా వనిన్
        దోసము లంటరాని,యెద దోచు ముకుందుడు నంద బాలుడే!
3.తే.గీ:-చరణ రాజీవ యుగ్మ విచారణమున
            మనసు పొత్తిళ్ళలో నిల్చు మన్నన గని
            చరణ చారణ సేవలో సాగు మనకి
            మేలు ఫలమగును హరి సామీప్య ముక్తి!
4.కం:-అని మనమున తలపోసెడు
         జన జీవన గోకులమ్ము జడి ముడి వడగా
        కొనలై కోపము పెనగొన
        కనలి మఘోనుడు వడి వడగండ్లు కురియన్!
5.తే.గీ:-బెదిరి పోయిరి గొల్లెతల్ బిక్కు మనుచు
            అదిరి పడె  నాలమందలు చెదిరిపోయి
           పెద్ద లయ్యెడ పిన్నల వెంట గొనుచు
          ఆర్తి దలచిరి  శ్రీకృష్ణు  నా  సహిష్ణు!
6.శా:-నీవే దిక్కని నమ్మినాము నృహరీ!నీ పాలనమ్మే గదా!
         నీ వాల్లభ్యముతో సుఖమ్ము,బ్రతుకుల్ నిండార పండింప వే
        గావన్ ,శైలము గోట నెత్తి పిలువన్ కాలూన సందేహమౌ
        భావంబుల్ విడనాడి రమ్మనుటచే భాగ్యంబు మాకబ్బెనే!
7.శా:-రండో!గోపకులారా!మీరనుచు నీప్రావృట్ప యోదార్భటీ
         దండంబై పిలుపందు కొంటిమి గదా!దాక్షిణ్య చూడామణీ!
         కొండన్ మాగొడుగై శిలల్ చెదరనీ గోవర్ధ నోద్ధారణన్
         చెండై నీ కరమందు కృష్ణ!మసలెన్ జీమూత సంహారకా!
8.తే.గీ:-వన మయూరము లివిగొ,జీవన విహారి
            అవిగొ! కలహంసములు వంశ రవళి దేలి
           మేము, పశులు, కాపరి నీవేమొ  శౌరి
           అనుచు పరవశ మందిరి గనుచు పరుని!
9.తే.గీ.:-ఏడు గడల ముంగిట లేడు గడచె
             జాడ లేదు మృతుల భీతి జాడ లేదు!
             వేయి కన్నులకుం దోచె వెక్కిరింత
            వెరపు చింతలో!మది కనువిప్పు గలిగె!
10.సీ:-ఏనాటి బంధమో!యీనాటి గంధమై
                హరి వాటి జలధాటి పొరల జారె!
         కల వాణి శ్రీవాణి కలిమి కప్పుర రాణి
              కదిలించి యెద నించి కదిలి పోయె
        సురలోక మొప్ప, భూసుర లోకమున నిల్చి
            చెరలాట ,హరియాట, చేదు కొనియె
       గిరి గొన గోటితో,హరి గొన కోటులై
            జీవజాల మట రాజీవ మయ్యె
       తే.గీ:-నారదుని మాట లేపాటి సారమనుచు
                దోర బట్టు గోవర్ధన భార మరసి
                పొట్ట మోసెడి లోకాలు పుట్టెడున్న
                చిట్టి తండ్రిగ! సురపతి చింత దలచె!
11.కం:-అనుకొను శత ముఖు డయ్యెడ
            కనిపించె యదుకుల చంద్రు కను లల్లాడన్
            వినిపించె మాధవుడు సూ
            క్తిని పెంచెను బాధ్యతను స్తుతింపగ సురల్!
12.కం:-సిరి వెన్నెల నగవులతో
            సరి వాడవి సుర పతిని ప్రాసాద మనమునన్
           సరియగు మార్గము జూపగ
           విరి వానలు కురియ నసుర విద్వేషి యనెన్!
13,మ:-గనవే!సత్కృప సర్వ మానవుల విఘ్నాయాస సంతృప్తులన్
            ఘన నీలాంబుద నాధ!దేవ పదవీ  కల్యాణ  కార్య ప్రదా!
            విను నీకున్ మనమందు బాధ వొడమెన్!వేధింప నే నెంతునా!
           పెను మాయాగతి జూడ నింతియె గదా!విజ్ఞాన పాదోనిధీ!
14.తే.గీ:-వెలితి లేదు గదా!వినిపింప దివిని
              దేవతానీకము మది సుఖా వహమెగ!
              దైత్య వీర భయము వెద తలంపవు గద
             దివిజ నాయక శాంతియే  తేజరిల్ల!
15.ఉ:-నీవు త్రిలోక నాధుడవు!నెమ్మన మొప్పగ సర్వ లోకముల్
           కావన నౌను గాదె!యన కమ్ర సుధార్ద్ర వచో విలాసుడై
          నీవ! మహాప్రభుండ వని నిస్తుల శక్తి మయుండ వంచు  నే
         నీవిధి గుర్తెరుంగ నెద నియ్యెడ,నిబ్బర మయ్యె మాధవా!
16.తే.గీ:-మానవా తీతమై!యోగమాయ తోడ
               మానవాకార!గోవింద!మాన్య చరిత!
               తరమె బ్రహ్మకు నైన నీదారి నెరుగ!
               తప్పిదము కృప మన్నించు దైవ మీవె!
17.తే.గీ:-  కనవె గోవింద!గోవింద!కరుణ తోడ!
                నీ! మహాత్మ్యము విన దుఃఖ ధూమ మెల్ల
                దొలగి, సుఖ శాంతు లలరు,సంతుష్టి గలుగు
                ననుచు,ఫల సిద్ధి వివరించె నమర వరుడు!
18.ఆ.వె:-భద్ర మగునీకు! పాక శాసన విను,
               నేటి నుండి పిలుపు మేటీ యగును!
               గోప బాలుడేను గోవిందు డను పేర
               పలుకు చుందు వేణు వలరు చుండ!
19.ఉత్సాహ
      భూమి సురలు,నరులు,ధరయు,భూమి పతులు ముదముచే
      క్షేమ  మల్ల  లాడ  వేడ  కేలు  మోడ్చి  పిలువగా!
     కామితార్ధ మగును,గోపకాంత చెంత కొడుకునై!రక్కసులను
     దునిమి యుంటి, రక్ష సేయ మొదలుగా!
20.కం:-ఇరువది నాలుగు మూర్తుల
           పరుడగు గోపాల మూర్తి పలుకుల తోడన్
           సురలోక గణము మురియగ
          సురపతి దర్శించె హరిని సుమశరు పితరున్!
21.కం:-గో గణములు గోపాలురు
            దాగుట కట స్వస్తి పలికె! ధైర్యము తోడన్
           సాగగ ముందుకు నడిచిరి
           తూగెను శ్రీ కృష్ణు గాన తోయపు తరగల్!
22.ఆ.వె:-కొండ దించు కొన్న కోమల హస్తము
               అండ జేరు వారి కాప్తి కరము
               చండ భీకర హిమ ఖండ నిర్దూమము
               మండె నేమొ! కృష్ణ! మట్టి బరువు!
23.ఆ.వె:-వెన్న తిన్న నీకు వెన్న రాసెద నన్న
               వెన్నుడనుచు మ్రొక్కె వేయి కనులు
               వెన్నవంటి యెదను వెత బాపు నీవంటి
               కన్న  తండ్రి  యెవరు  కాన రారు!  
24.కం:-వేణువు నూదన్ మాధవ,
            జాణవు,లోకమ్ము లూపు జాలుదు వయ్యా!
           త్రిణి పదమ్ముల బలినే
          ద్రోణిని పడవేయ లేదె,?త్రొక్కుడు లాటన్!!

      కం:-నీకరములు శుభకరములు
             శ్రీకర సంసేవ్య మాన!చిన్మయ పదముల్
             మా కనులకు క్లీం కారము 
             లై, వినిపించి మము గాచు ననియెద కృష్ణా!
                          శ్రీ,శ్రీ,శ్రీ,శ్రీ,శ్రీ,
ఇతి శ్రీ అవధాన శారదా 
భద్రం వేణు గోపాలాచార్య ప్రణీతమ్.
ఓమ్!శాంతిః,శాంతిః,శాంతిః
తత్సత్!శ్రీ పర బ్రహ్మార్పణ మస్తు!.
స్వస్తి.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.