గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, మే 2018, శుక్రవారం

శ్రీమన్నారాయణశతకముపై. శ్రీపొన్నెకంటి సూర్యనారాయణరావు గారి సమీక్ష.

జైశ్రీరామ్.
ఆర్యులారా!. 
బ్రహ్మశ్రీ పొన్నెకంటి సూర్యనారాయణరావుగారు 
నాచే రచింపఁబడిన శ్రీమన్నారాయణశతకముపై వారి అభిప్రాయమునుగ్గడించియున్నారు. చూడఁగలరు.
జైశ్రీమన్నారాయణ.
శ్రీ మన్నారాయణ శతకమును గూర్చి ..... నా యాలోచన.  
సోదరులు చింతా రామకృష్ణారావు గారి మస్తిష్కమొక "అమృత భాండము". దాని నుండి నిరంతర
భక్తిరస ప్రపూర్ణామృత ధారలు కురియుచునే యుండును. వారి కవిలెల్లప్పుడును
"కావ్యం యశసే అర్థకృతే వ్యవహారవిదే శివేతర క్షతయే"అను ప్రయోజనములలో
"శివేతరక్షతయే"యను ప్రయోజనమునే కోరుచుండును. ఏలనన అది శాశ్వతమైనది,
మోక్షదాయిని కనుక. భక్తిభావ సమన్విత కవితాఝరి గంగానది వలె ఎల్లకాలము
ప్రవహించును. వీరి కవిత నిరుపమానము, నిస్స్వార్థము. ఉదా : శా : " నన్నున్
గావగ రమ్ము నీవనినచో నా స్వార్థమే యౌను. నీ......ఉన్నావందరి కోసమంచు కని,
దీనోద్ధారకా." యనుటలో  నన్ను మాత్రమే కాదు సమస్త ప్రాణికోటిని దయతో
గావుమనుటెంతో నిస్స్వార్థ భక్తి ప్రపత్తి. జీవిత పరమావధి మోక్షము.
పూర్వజన్మ కర్మ పరిపాకము కానిదే ముక్తి రాదను విషయమందరకు విదితమే. కర్మలు
నశించుటకు భక్తి యత్యంత ప్రభావవంతమైన సాధనము. దానిని తాను పొందియుండుటచే
నిత్య శ్రీమన్నారాయణ నామ స్మరణజేయు సంకల్పము కలిగినది. కనుకనే ధైర్యముగా
"ఓ శ్రీమన్నారాయణా!ప్రేమతో ముక్తి ప్రసాదింపుమా!"అంటారు కవిగారు ఎంతో
చొరవగా, ఆత్మీయముగా.    ఓ దేవా! నీవున్న న్ని నాళ్ళే నాయీ శరీర
సౌందర్యము. నీవు వెడలిన నాడిది దేవుడు లేని గుడే. కనుక నీవుండగనే నాకు నీ
కథలతో పంచేంద్రియ సుఖములనిమ్మని కోరుకుంటారు.                  ఉదా :
కన్నుల్, కాళ్ళును , జేతులున్.......ఇలా సూర్య తేజాన్ని అద్దంలో చూపించటం
అసాధ్యము. అన్నీ (108) సూర్యతేజాలే. ఉపాసనాబలంతో నే వానిని అర్థం
చేసికొనగలము.                         
" సూర్య తేజస్సు మీయందు శోభగూర్చి.,                    
భక్తి విశ్వాస శార్దూల వృత్తశతము.,                    
శతక కావ్యంపు మధురిమ సంతరించె.,         
రామకృష్ణ కవి వరేణ్య! రమ్య చరిత!".
   శుభం భూయాత్!!
సోదరుడు....పొన్నెకంటి సూర్యనారాయణ రావు. భాగ్యనగరము.  30.04.2018.
తమ అమూల్యమయిన అభిప్రాయమునందించిన శ్రీపొన్నెకంటి సూర్యనారాయణరావు సహోదరులకు ధన్యవాదములు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ప్రణామములు
ప్రముఖ కవివరేణ్యులు ఇంతచక్కగా అభినందన మందారములను కురిపించగా ఇక నాకేమి మిగిలినది ?
ఇక ఆనందంతో శోదరునికి హృదయపూర్వక శుభాభి నందనలు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.