గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, మే 2018, ఆదివారం

శ్రీమన్నారాయణ శతకము. 17/20వ భాగము. 81 నుండి 85 రచన చింతా రామకృష్ణారావు

జైశ్రీరామ్
శ్రీమన్నారాయణ శతకము.
రచన. చింతా రామకృష్ణారావు.
81. శా. నిన్నున్ బోలుదు రార్యులెల్ల పృథివిన్ నీ నామ సారూప్యమున్,
పిన్నల్ పెద్దలు వారినెన్నుదురుగా విశ్వాసమొప్పారగా.
నిన్నే నీవు సృజించుకొందువొ హరీ ? నేర్పారఁగా బ్రోవ. శ్రీ
మన్నారాయణ! లోకమున్. సుజనులన్ మాపై కృపంజూపుచున్.
భావము.
ఓశ్రీమన్నారాయణా! పుడమిపై ఆర్యులు నామ సారూప్యముచే నిన్ను పోలి యుందురు. ఆబాలగోపాలము వారిని గుర్తించి విశ్వాసముతో ఫ్రశంసింతురు. నీ నేర్పు మీర లోకమును సుజనులను బ్రోచుట కొఱకు మాపై కృప జూపుతూ నిన్ను నువ్వే ఈ విధముగా పుట్టించుకొందువా?

82. శా. తిన్నన్ జాలు నుగాది పచ్చడిని, భాతిం గొల్పు నారోగ్యమున్,
విన్నన్ జాలును భూసురుల్ పలుకు భావిన్దెల్పు పంచాంగమున్.
కన్నా దివ్య యుగాదినాడునిజ సంకల్పంబులీడేరు. శ్రీ
మన్నారాయణ! నిత్య చేతనమిడన్ మాలో నుగాదైతివా?
భావము.
ఓశ్రీమన్నారాయణా! ఓ కన్న తండ్రీ. ప్రతీ సంవత్సరమూ ఉగాది రోజున ఉగాది పచ్చడిని తినిన చాలును. భాతిని, ఆరోగ్యమును కలిగించును. భూదేవతలు పలికెడి భావిని తెలియజేయు పంచాంగమును వినీనసరిపోవును. మా సంకల్పములన్నియు నెరవేరును. మాలో నిత్య చైతన్యము కల్పించుటకు నీవు మాలో ఉగాదివై యుంటుందువా.

83. శా. కొన్నన్మానస పీఠిపై నిలుపగా గోవింద ! నీ పాదముల్
చెన్నారన్ గొన నొప్పు మాకు శుభముల్ శ్రీ దేవి కల్పింపగా.
మిన్నున్ దాకును మా ముదంబు గని నీ మేలైన  పాదాళి. శ్రీ
మన్నారాయణ ! మాదు పుణ్యఫలముం బండించు  నీ సత్కృపన్. 
భావము.
ఓ గోవిందా! నీ పాదములను మా మనసు ఆనెడి సింహాసనముపై నిలుపుటకు గ్లహిఃచినచో ఆ లక్ష్మీదేవి కటక్షముచే మాకు చెన్నుగా శుభములు స్వీకరింపనొప్పును. నీ మేలచన పాదములను చూడగనే మా ఆనందము ఆకిశమునంటును. ఓ శ్రీ మన్నారాయణా!. నీ మంచి కృపతో మా పుణ్యములు పండింము..

84. శా. ఎన్నన్ బుణ్య ఫలంబు స్వర్గసుఖమే యిచ్చున్ శుభోద్దీప్తితో
నన్నన్మాకది చేసినంతె కద? మాకత్యంత సౌఖ్యంబు మే
మున్నన్ నీదరినబ్బు సత్యమిది. లేకున్నన్ వ్యర్థమే చూడ. శ్రీ
మన్నారాయణ! నీ పదాబ్జమమరన్ మాకేలనీ పుణ్యముల్ ?  
భావము.  ఓ శ్రీమన్నారాయణా! మనము గుర్తించినచో మేము చేసుకొనెడి పుణ్యము వలన ప్రాప్తించెడి ఫలము శుభమునుద్దీపింప చేయుచు స్వర్గ సౌఖ్యమే యిచ్చుననిన అది మేము చేసుకొనినది  ఎంత పుణ్యమో అంత మాత్రమే కదా. మేము నీ సమీపముననున్నచో మాకు అత్యంత సౌఖ్యము లభించును. ఇది సత్యము. ఆ విధముగా కానినాడు ఈ పుణ్యాదులు నిరుపయోగమే. నీ పాదపద్మములే మాకు అమరినచో యీపుణ్యములిక మాకెందులకు? వ్యర్థమే సుమా.


85. శా. భిన్నంబన్నది లేదు భావమున భావింన్ నినున్ నమ్ముటన్.
మన్నారాయణుడీవె. నన్ను సతమున్ మన్నించి రక్షింతువే.
నిన్నున్ వీడి మనంగలేను జగతిన్. నిత్యుండ నాకీవె. శ్రీ
మన్నారాయణ! మన్మనోజ్ఞ ధిషణా. మా ధైర్య మీవేనయా.
భావము.   నాలో ప్రకాశించే నిన్ను నమ్ముట విషయములో నా భావనలో భిన్నమన్నదే లేదు. నీవు నా నారాయణుడవు. నన్ను ఎల్లప్పుడు మన్నించి రక్షించుదువు. నిన్ను విడిచి జీవించలేను. ఈ లోకములో నాకు నీవే భాగ్యము. నాకు మనోజ్ఞమయిన జ్ఞానస్వరూపా. నీవే మా ధైర్యము.
జైహింద్

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.