గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, మే 2018, బుధవారం

శ్రీమన్నారాయణ శతకము. 13/20వ భాగము. 61 నుండి 65 రచన చింతా రామకృష్ణారావు

జైశ్రీరామ్
శ్రీమన్నారాయణ శతకము.
                                                       రచన. చింతా రామకృష్ణారావు.
61. శా. అన్నైవత్తువు నన్ను కావ కృపతోనానంద సంధాయివై,
అన్నాయంచును వచ్చి చేరుదువు నన్నా త్రంబుతోఁ మ్ముగా
నన్నన్నా భవదీయ సత్కృపకునంతన్నట్టిదే లేదు. శ్రీ
మన్నారాయణ ! భక్తపాలనపరా ! మత్పుణ్యభాగ్యా ! హరీ !  
భావము.  ఓ శ్రీమన్నారాయణా! నీవు ఆనందమును కూర్చువాడవై నాకు అన్నగా కాపాడ వత్తువు. భక్తపాలనపరుడా. నా పుణ్యభాగ్యమైన శ్రీ హరీ. ఆ నీవే నన్ను అన్నాయని పిలుచుచు ఆతురతతో తమ్ముడుగా నన్ను చేరుదువు. అన్నన్నా. నీ కృపకు అంతు అనేటువంటిదే లేదుకదా.

62. శా. మన్నించే గుణమీకు కల్గెను కదా మాన్యుండ! నీ భక్తులన్
మన్నించన్ బరివర్తనన్ సుగుణసమ్మాన్యాళిగా మారి , యా
పన్నత్రాతవటంచు కొల్తురు కదా. ప్రార్థింతు మన్నింప. శ్రీ
మన్నారాయణ ! మంచి పెంచుమిలలో మా పూజ్య దేవా ! హరీ ! 
భావము.  ఓ శ్రీమన్నారాయణా !  మన్నించుట అనెడి శుభ లక్షణము నీకున్నదికదా. మాన్యుడా. నీ భక్తులను నీవు మన్నించినచో వారిలో పరివర్తన కలిగి ,సుగుణములచే సమ్మాన్యాళిగా మారి , నిన్ను ఆశన్నత్రాతవని సేవింతురు కదా. ఆ విధముగా నీవు మన్నింప గలందులకు నేను నిన్ను ప్రార్థింతును. మా పూజ్యదైవమా!  భూమిపై మంచిని పెంచుము..

63. శా. కొన్నాళ్ళే కద భూమిపై బ్రతుకు. మా కోపాదులన్ కాలమే
యెన్నాళ్ళైనను వ్యర్థమౌన్. కనవొ ? నీవీ మార్గమున్ వీడి మే
మున్నన్నాళ్ళును ప్రేమతోఁ బ్రతుకనీ ఉద్రేకముల్ బాపి. శ్రీ
మన్నారాయణ ! శాంతిమార్గమున సమ్మార్గంబునన్ నిల్పుమా. 
భావము.
ఓశ్రీమన్నారాయణా! మేము భూమిపై ఉండునది కొన్నినాళ్ళేకదా. మాకున్న కోపతాపాదుల వలన ఎంత కాలమున్నను నిరుపయోగమగుచున్నదికదా. నీవు గుర్తించవా? నీవు ఈ మార్గమును విడనాడి , మేము బ్రతికి ఉన్నంత కాలము మాలోని కోపాదులను పోగొట్టి  , ప్రేమతో బ్రతుకునట్లు చేయుము. మమ్ములను శాంతిమార్గములో మంచి మార్గములో నిలుపుము.

64. శా. అన్నన్ జాలును సోహమంచు, మరి దాసోహమ్మటంచంటి, నే
పిన్నన్, నేర్వను నన్ను నీ కొసగుటన్ విశ్వాసమున్ గొల్ప. నా
విన్నాణంబది చాలకుండెనయ. సంవేద్యంబె నీకిద్ది. శ్రీ
మన్నారాయణ ! నీకు తోచినటులే మమ్మందరిన్ జేయుమా. 
భావము.
ఓశ్రీమన్నారాయణా! ఆ పరమాత్మను నేనే అనిన చాలును. నేను నీ ముంగిటదాసోహమ్మనుచుఃటిని. నీకు నమ్మకము కలుగు విధముగా నన్ను నేనునీ కర్పించుకొనుట యెఱుగను. అందుకు నాకు గల విజ్ఞానము సరిపోవుట లేదు. ఆ విషయమునీకు తెలిసినదే. నీకం తోచిన విధముగా మా అందరినీ నీవే చేయుము.

65. శా.  కొన్నాళ్ళేమొ శిశుత్వమున్గొలిపి యింకొన్నాళ్ళు కౌమారమున్.
కొన్నాళ్ళంచిత యౌవనంబు నిడి , యింకోన్నాళ్ళు వార్ధక్యమున్.
క్రన్నన్ గొల్పి దురంత దుస్థితి మమున్క్రమ్మన్ నిరీక్షించు శ్రీ
మన్నారాయణ! నీకు ధర్మ మిదియా? మాకెందుకీవ్యర్థముల్?  

భావము.
ఓశ్రీమన్నారాయణా ! మాకు కొన్నాళ్ళపాటు బాల్యము , కొన్నాళ్ళు కౌమారము , మరికొన్నాళ్ళు యౌవనము , యింకొన్నాళ్ళు వార్ధకము కొలిపి అంతు  లేని దుస్థితి మమ్ము చుట్టిముట్టగా నిరీక్షింతువు. నీకు ఇదేమైనా ధర్మమా! ఈ నిరుపయోగమైనవన్నియు మాకెందులకయ్యా
                                                                       జైహింద్
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శైశవము నుంచి వార్ధక్యము వరకు అనేక కష్ట నష్టములను జూపుచు మమ్ము ఎందులకు గురిచేస్తున్నావు తండ్రీ ? అని ప్రస్నించిన చివరి పద్యము మరింత అద్భుతముగా నున్నది. నిత్యం పఠించి నందున ఆ శ్రీమన్నారాయణుని కృప మాపైన కుడా ప్రసరించును గాక. ధన్యోస్మి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.