గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, మే 2018, బుధవారం

శ్రీమన్నారాయణ శతకము. 20/20వ భాగము. 96 నుండి 108 రచన చింతా రామకృష్ణారావు

జైశ్రీరామ్
శ్రీమన్నారాయణ శతకము.
రచన. చింతా రామకృష్ణారావు.
96. శా. కన్నారన్ గనబోవ నిన్ను, కలుగున్ గన్నీరు మున్నీరమై.
యన్నన్నా కనుటెట్లునిన్ను? మహనీయానందమెట్లబ్బు? నీ
కన్నన్ గాంచగనెవ్వడుండు జగతిన్? గాంక్షింతు నిన్గాంచ. శ్రీ
మన్నారాయణ! కన్నులన్ వెలుగుమా. మా మానసంబెంచుమా.
భావము.  ఓశ్రీమన్నారాయణా! నిన్ను కనుల నిండుగా చూడబోవ కన్నీరు మున్నీరగును.
అయ్యయ్యో. నిన్ను మరి యే విధముగా చూడనగును? నిన్ను చూచుట వలన కలిగెడి
మహదానందమేవిధముగా లభించును? ఈ సృష్టిలో చూడదగువారు నీకన్నా ఎవరుందురు?
నిన్ను చూడ వలెనని కోరుకొందును. మా మనసు గ్రహించుము. మా కన్నులలో
వెలుగుము.

97. శా. ఎన్నో బాధ్యతలాత్మ మెచ్చనివి నాకేలన్? మహా దేవ!. నీ
కన్నన్బ్రీతి హితంబు వేరు కలదా? కామాదిషట్శత్రువుల్
నన్నున్వీడవు. ధర్మమెట్లొనరుతున్? నా యోగమున్ మార్చి శ్రీ
మన్నారాయణ! సత్య ధర్మ హిత సన్మార్గంబు కల్పింపుమా. 
భావము.  ఓ శ్రీ మన్నారాయణా! న మనస్సు చేయుటకంగీకరించని ఎన్నో బాధ్యతలనిన్నాళ్ళుగా నాపై మోపితివి. నీకన్నాప్రియమైనదీ హితమైనది వేరే ఏదైనా ఉన్నదాయేమి. కామాది శత్రుషట్కము నన్ను వీడిపోవు. ఇఃక నేను ధర్మమేరీతిగా ఆచరింపనగును. నాయోగమునే మార్చివేసి సత్య ధర్మ హిత సన్మార్గములను నాకుష
కల్పింపుము.

98. శా. సున్నుండల్, వడపప్పు, బూరె, లరిసెల్, శుద్ధోదకం, బుప్పు. క్షీ
రాన్నంబున్పులిహో, గార్లు, పుణుకుల్, యావన్మనోహార్యముల్
మున్నే నీకు తినంగ బెట్టుదుముగా. మూర్కొందువే గాని, శ్రీ
మన్నారాయణ! కొంచెమైన గొనవే, మా తృప్తికైనన్ హరీ!  
భావము.  ఓ శ్రీమన్నారాయణా! శ్రీహరీ! సున్నుండలు , వడపప్పు , బూరెలు , అరిసెలు , మంచినీరు ,
లవణము పరమాన్నము , చిత్రాన్నము , గారెలు, పుణుకులు , సమస్తమైన మనోహర పదార్థములు   ముందుగానే నీకు భుజించమని పెట్టుదుము కదా. వాటిని నీవు ఆఘ్రాణము చేతువే కాని, మా తృప్తి కొఱకైనను కొంచెమైనా తినవు కదా.

99. శా. జొన్నన్నంబయినన్ లభింపదు కదా శోధింప కోట్లుండినన్.
సన్నన్నంబె లభించు నీదు కృపచే సన్మాన్యతం బేదకై
నన్నీ వల్లనె. యెంత వింత! దయ గన్నన్ చాలదే మాకు. శ్రీ
మన్నారాయణ! జీవితేశ! సదయన్ మమ్మేలు లోకేశ్వరా!      
భావము.  ఓ శ్రీమన్నారాయణా! మాకు పుణ్యముచే లభించినవాడా. మా జీవితేశా. దయతో మమ్ము పాలించు లోకేశ్వరా!.  ఆలోచించగా కోట్లున్నను జొన్నన్నమయినా లభింపకపోవుట, పేదవానికయినా
సన్నబియ్యపన్నమే లభించుటవీటికి నీ కృపయే కారణము. ఆహా. ఇది నీవల్లనేకదా! యెంత వింత!

100. శా. అన్నీ నీ కెరుకే కదా. వరములే నాశింపగానేల? నా
కన్నుల్ గానని నాదు భావిని కనంగా నీకె సాధ్యంబు. నీ
కున్నే జెప్పఁ బనేమి? నీకె తెలియున్. కోరన్ నినున్ నేను. శ్రీ
మన్నారాయణ! 'వంద'నంబులయ.  నా మార్గంబు నీవేనయా. 
భావము.  ఓశ్రీమన్నారాయణా! నన్ను గూర్చిన అన్ని విషయములు నీకు తెలియునుకదా. నీ నుండి వరములను నేనాశించ వలసిన పని యేమున్నది? నా కన్నులు చూడలేని నా భవిష్యత్తు చూచుట నీకే సాధ్యమగును. నీకు నేనిక చెప్పవలసిన పనియేమున్నది? ఏమి చేయ వలయునో నీకే తెలియును.  ఇంక నేను నిన్నేమీ కోరను. నీకు నమస్కారములు. నాయొక్క మార్గము నీవేసుమా.

101. శా. నిన్నున్ నన్నును నమ్మినట్టి మహితుల్ నీ పేరిటన్ వ్రాయు శ్రీ
మన్నారాయణ దివ్యపద్య పఠనన్ మాన్యత్వమున్ బొంది, సం
పన్నుల్, సంతస పూర్ణులై ప్రబలుతన్ బ్రఖ్యాతినార్జించి. శ్రీ
మన్నారాయణ! వారినెల్లఁ గని సమ్మాన్యంబుగా ప్రోవుమా. 
భావము. ఓ శ్రీ మన్నారాయణా ! నిన్నును , నన్నును విశ్వసించునటంవంటి మహాత్ములు నేను నీ పేరున వ్రాయుచున్న శ్రీ మన్నారాయణ పద్యమువలన మాన్యత్వమును పొంది , సంపన్నులుగను , ప్రఖ్యాతిని సంపాదించి,   సంతోషముతో నిండినవారయి ప్రబలుదురు గాక. వొరినందరినీ నీవు ప్రేమతో చూచి, సన్మాన్యముగా చేసి కాపాడుము.

102. శా. కొన్నింటన్ కమనీయ కావ్య గుణముల్కొన్నింట సద్బోధనల్,
కొన్నింటన్ వర భావ రమ్య సుగతుల్, కూర్మిన్ గనన్ జేయు నీ
వన్నింటన్ వర పద్యరూపుఁడవు. భావాతీత గోవింద! శ్రీ
మన్నారాయణ!  దేవ దేవ! మహితా! మద్భావనోద్భాసితా!  
భావము.  నా భావనలో మిక్కిలి ప్రకాశించువాడాఓ శ్రీమన్నారాయణా! నీవు రచింపించిన యీ శ్రీమన్నారాయణ శతకమున గల పద్యములలో కొన్నింటిలో కమనీయమైన కావ్య గుణములు, కొన్నింట మంచిని చూపే బోధనలు, కొన్నింటిలో భావ రమ్యమైన సత్కవితా విధానములు, ప్రేమతో చూచునట్లు చేసెడి నీవు అన్నింటిలోను పద్యరూపముననుంటివి. భావాతీతుడవయిన ఓ గోవిందా! పాప రహితా! నీకువందనములు.

103. శా. మన్నింపందగు దోషముల్ కలిగినన్. మా దేవ దేవా! ననున్.
నీన్నే మానసమందు నిల్పితినయా నే వ్రాయు వేళన్ బ్రభూ!
ఎన్నం జాలను దోషముల్, మదిని నిన్నే నెన్నగన్ జాలి. శ్రీ
మన్నారాయణ! దోషముల్ కలిగినన్ మన్నించు. దోషాపహా!  
భావము.  మా దేవదేవా! ఓశ్రీమన్నారాయణా! నా రచనలో దోషములున్నను నన్ను మన్నింపదగును. ఓ ప్రభూ. ఈ పద్యములు వ్రాయు సమయమున నిన్నే నేను మనసులో నిలిపితిని సుమా. మదిలో నిన్నే ఎన్నుటకు సరిపోయి యున్న నేను దోషములనెన్న సరిపోను. దోషములను పరిహరించువాడా! దోషములున్నచో నన్ను మన్నించుము.

104. శా. నన్నున్ జిత్ర కవీశుడంచు సుజనుల్ నా బాధ్యతన్ బెంచ, నీ
వన్నెల్ చిన్నెలు చిత్ర గర్భ కవితన్ భాసించి నా గౌరవం
బెన్నంజేయుచు నిల్పు నన్ను కవిగా. హే మాధవా! నీవె శ్రీ
మన్నారాయణ! చిత్ర బంధ కవి కాన్, మర్యాద నాకబ్బెనే
భావము.    శ్రీమన్నారాయణా! సుజనులు నన్ను చిత్రకవీశ్వరుఁడు అని అనుచు, నా బాధ్యతను పెంచగా నీక సంబంధించిన వన్నెలు, చిన్నెలు, నా చిత్ర బంధ గర్భ కవితలలో భాసించి నా గౌరవమును పరిగణించునట్లు చేయుచు, నన్ను కవిగా నిలుపును. మాధవుఁడా! నీవే చిత్రబంధ కవివయి యున్నావు. విధముగా నీవుండగా మర్యాద నాకు లభించినది కదా!

105. శా. నిన్నున్నమ్మితినంచు నమ్మితివి నన్.  నీ పేరుతో పద్యముల్
క్రన్నన్ వేకువనే రచించి చదువంగా పంపి భక్తాళికిన్
నన్నున్ మన్ననలందగా కనితివానందంబుతో నీవు. శ్రీ
మన్నారాయణ! నీ కృపామృతమునే మాకందఁగాఁ జేసితే. 
భావము.  ఓ శ్రీమన్నారాయణా! నిన్ను నమ్మితినని నన్ను నీవు విశ్వసించితివి. నీ పేరుతో పద్యములను వేకువనే రచించి చదువుట కొఱకు నీ భక్తులకు పంపి మన్ననలందునట్లు ఆనందముతో నన్ననుగ్రహించితివి. నీ కృపామృతమునే మాకు అందునట్లు చేసితివా.

106. శా. అన్నా! నీ నగుమోము బాధలను పోకార్పున్ గదా! ఏల నీ
వెన్నాళ్ళైనను కాన రావు? కన నింకెన్నాళ్ళు రాకుందువో?
కన్నా! కన్నులలోన నిన్ నిలిపి నే కన్మూయునాడైన శ్రీ
మన్నారాయణ! కావరమ్ము వరదా! మద్భాగ్య! మోక్షప్రదా!  
భావము. నా భాగ్యమైన వాఁడా! మోక్షము నొసంగువాఁడా! శ్రీమన్నారాయణా! నీ నగుమోము బాధలను పోగొట్టును కదా! ఎన్నాళ్ళైనా నీవు ఎందులకు కనిపింప రావు? నన్ను చూచుట కొఱకు ఇంకా ఎన్నాళ్ళు నీవు రాకుండా ఉందువోకదా. కన్నతండ్రీ! వరదా! నా కన్నులలో నిన్ను నిలిపి నేను కన్ను మూయునాడైనను నీ మాన్యత్వమొప్పారునట్లుగా నన్ను కాపాదుటకు రమ్ము.

107. శా. ఉన్నంజాలును దేవ సంతతము నా యుచ్ఛ్వాస నిశ్వాసవై
కన్నన్ జాలును కాంతులీను కనులన్ కారుణ్య, మిత్రాళివై.
నిన్నున్నే వర చిత్ర గర్భకవినై నేర్పార చూపింతు శ్రీ
మన్నారాయణ! లోకులెన్నఁ మహిన్ మాన్యుండ! ముక్తిప్రదా! 
భావము.    శ్రీమన్నారాయణా! ముక్తిని ప్రసాదించు సర్వ శ్రేష్టుఁడా! నీవు నా ఉచ్ఛ్వాసనిశ్వాసవై ఎల్లప్పుడు ఉండిన చాలును. కారుణాస్వభావా! నీ కాంతులు చిందే కనులతో మిత్రుల సమూహమై నన్ను చూచిన చాలును. నేను శ్రేష్టమైన చిత్ర గర్భ బంధ కవినై నా నైపుణ్యముతో లోకులు నిన్ను గుర్తించినట్లుగా భువిపై వారికి నిన్ను చూపుదును.


108. శా.చిన్నా! సద్గురు రాఘవార్యు కృపచే సిద్ధించెనీవిద్య. నే
మన్నింపంబడు రామకృష్ణుఁడ, కవిన్. మా తండ్రి సన్యాసిరా
ము న్నాతల్లిని రత్నమాంబను మదిన్ బూజించి, పద్యాళి, శ్రీ
మన్నారాయణ! వ్రాసితిన్ గొనుమ. శ్రీమంతా. సదా మంగళమ్. 
భావము.  ఓ చిన్నా! మద్గురుదేవులు కల్వపూడి వేంకటవీరరాఘవాచార్యుల కృపచే యీ విద్య నాకు లభించినది. సహృదయులచే మన్నింపఁబడు నేను చింతా వంశజుఁడనైన రామకృష్ణారావు అను పేరు గల కవిని. మా తండ్రిగారయిన సన్యాసిరామారావు గారిని, మా తల్లిగారయిన వేంకటరత్నమాంబను, ముందుగా మదిలో పూజించి, పిదప నిన్నెంచి యీ శతకము వ్రాసితిని. శ్రీమంతా! ఓ శ్రీమన్నారాయణా! నీవీ శతకమును కృతిభర్తవై స్వీకరింపుము. ఎల్లప్పుడు మంగళము అగును గాక.     
స్వస్తి.
జైహింద్

Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
కృతిభర్తగా ఆ శ్రీమన్నారాయణు నికే అంకితమీయగల అదృష్ట వంతులు .ఇలాగే మరిన్ని శతకములను రచించి భగవంతునికి అంకిత మీయగలరని ఆశీర్వదించి అక్క

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.