గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, డిసెంబర్ 2017, ఆదివారం

దత్త బీజ మంత్రాత్మక పద్యములు. . . . రచన. శ్రీ నారుమంచి అనంత కృష్ణ

జైశ్రీరామ్.
 నేడు దత్తాత్రేయ జయంతి సందర్భముగా ఆంధ్రామృత పాఠకులందరికీ శుభాకాంక్షలు.
ఆర్యులారా! నిరాడంబర మహా జ్ఞాని బ్రహ్మశ్రీ నారుమంచి అనంతకృష్ణ. ధారాశుద్ధినొప్పారు వీరి రచనలు పాఠకులకు చవులూరించుటయే కాక భక్తాగ్రగణ్యులకనురక్తి కలిగిస్తాయి. అటువంటి

శ్రీ నారుమంచి అనంత కృష్ణ కవి 
దత్త జయంతినాడు వ్రాసిన దత్త బీజ మంత్రాత్మక పద్యములు. 
పద్యాల ఆద్యాక్షరాలు దత్త మంత్రాక్షరాలు. చదివితే మీకే అర్థమౌతుంది నా మాటలు ప్రత్యక్షర సత్యాలని. మరెందుకాలస్యం చదవండి.
ఓంకారమ్మున మూడు వర్ణములు తాముచ్చారణందొంటియౌ
సంకాశమ్ముగ మూడు మూర్తులొకటౌ సంపూర్ణ తత్త్వమ్ముగా
సంకల్పించిన తావులన్ తరలు నీ సాంగత్యమున్ కోరుచున్ 
జింకన్ పోలిక భీతుడన్ స్థిరమతిన్ సేవింతు దత్తప్రభో

ద్రా(మ్)మిత్యాదిగ బీజ మంత్ర చయ వీర్యంబౌచునుత్తేజమై
కైమోడ్పుల్ మది నిన్ను కొల్చుటొకటే కార్యంబు నాభాగ్యమై
తామేరీతిగ పిల్చినన్ పలుకుచో ధైర్యంబు సంపూర్ణమై
క్షేమంబొప్పగ స్థైర్యమిమ్ముదయతో సేవింతు దత్తప్రభో

దక్కంజేయు దిగంబరా స్మరణమే దాక్షిణ్య సాకారమా
చక్కంజేయుము దోష పూర్ణ నడతల్ శాసింతువే సర్వమున్
నిక్కంబీవె మహాత్మ ఆది గురువై నీవానిగా గొమ్మయా
చిక్కంజేయకు మాయకున్ మిషలకున్ సేవింతు దత్తప్రభో

త్తాత్తాత్తా యన అర్ధహీన మగు శబ్దంబంచు దూషించకన్
దత్తా యంటినటంచు భావన మదిన్ తామెంచి ప్రేమార్ద్రతన్
మత్తాపంబు హరించి ధాత రచనల్ మన్నించకన్ మార్చుచున్
చిత్తైకాగ్రత నిచ్చిరే మరువకన్ సేవింతు దత్తప్రభో

త్రేతాగ్నుల్ ఘన పాఠముల్ వివరముల్ దేశాటనల్ నేర్వనే
నీతోనుండెడి చిత్తమున్ నిరతమున్ నిండైన సద్భక్తియున్
మాతోనుండగ వేడ్కయున్ నిరవధిన్ మన్నాధ భావంబుతో
చేతోవృత్తిగ నిల్పగా సతతమున్ సేవింతు దత్తప్రభో

యాచింతున్ నిను స్మర్తృగామివని సహ్యాద్రీశ సంరక్షకా
ప్రాచీనుండవు భక్తపాలన పరా రావే ప్రపన్నుండనే
నా చేతమ్మున నిల్చియుండుమనెదన్ జ్ఞానోపదేశమ్మిడన్
స్త్రీచాంచల్య విరాగినై సదమలా సేవింతు దత్తప్రభో

యంత్రప్రాయపు జీవనమ్ములగుచో యజ్ఞాదులెట్లుండురా
మంత్రామ్రేడిత సాధనా బలిమియున్ మాలోన లేకున్నదే
సంత్రాణంబొనరింపు చిక్కితినయా సంసార కూపమ్ములో
చేంత్రాడట్లుగ చేయి నిమ్మని సదా సేవింతు దత్తప్రభో

నమ్మయ్యా విడబోను పాదయుగళిన్ నాకింక దిక్కెవ్వరే
ఇమ్మయ్యా అవధూత చింతన సదా యింకేది నాకేటికో
కొమ్మయ్యా అరి షట్కమేల నిడితో కొండంత నీవుండగా
చిమ్మయ్యా పరిపూర్ణ సాంద్ర కరుణన్ సేవింతు దత్తప్రభో

మద్దైన్యంబును బాపరా భయహరా మంత్రార్ధమున్ జూపరా
పొద్దున్ బుచ్చెద భోగమోక్ష కరమౌ పూర్ణత్వ సంప్రాప్తితో
సద్దున్ చేయక బ్రహ్మతత్త్వమది సాక్షాత్కారమై నిత్యమై
చిద్దేశంబుననంతకాంతులలరన్ సేవింతు దత్తప్రభో.
జైహింద్.
Print this post

2 comments:

కందుల వర ప్రసాద్ చెప్పారు...

బ్రహ్మశ్రీ నారుమంచి అనంతకృష్ణ కవి గారికి, మీకు దత్తాత్రేయ జయంతి సందర్భముగా శుభాకాంక్షలు. అమృత ధారలు కొన్ని మాకు పంచి నందులకు ధన్యవాదములు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పాండితీ స్రష్టలకు " దత్తాత్రేయ జయంతి సందర్భముగా హృదయపూర్వక శుభాకాంక్షలు. రసరమ్య మైన కావ్యములను మాకందించిననందిలకు కృతజ్ఞతలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.