గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, డిసెంబర్ 2017, శనివారం

"వీర రసాతిరేక! రణవిశ్రుత! వేమనరేంద్ర! .. .. .. చిత్ర కవిత్వము,


జైశ్రీరామ్.
చిత్ర కవిత్వము - బ్రహ్మశ్రీ చొప్పకట్ల సత్యనారాయణ
ఉ: "వీర రసాతిరేక! రణవిశ్రుత! వేమనరేంద్ర! నీయశం
బారభమాన తారకరహార సమానము , నీభుజామహం
బారభమాన తారకరహార సమానము ,నీపరాక్రమం
బారభమాన తారకరహార సమానము-" చిత్రమారయన్!!
కవిసార్వభౌముడు శ్రీనాధుడు అల్లాడ వేమారెడ్డి గారి పై చెప్పిన పద్యంగా యిది సారస్వత లోకంలో ప్రచారాన్ని పొందుతోంది.
పంచపాషాణములలో నిదియొకటి యని పండితుల యభిప్రాయము.
ఇందు వేమారెడ్డిగారి కీర్తి ,బాహుబలము , పరాక్రమములు వర్ణింపబడినాయి.
మూడుపాదాలలోనూ "ఆరభమాన తారకరహార సమానము"-అనుసమాసం యదాతధంగా వస్తుంది.
రెండవపాదంలో కీర్తిని సూచించేటప్పుడు
ఆర--పాదరసం ; భ--నక్షత్రములు-; మానతారకర-- వెండి వడగళ్ళు;
హార--ముత్యాల హారములవలె తెల్లగా ప్రకాశించును.
మూడవపాదం:-భుజబలాన్ని ప్రశంసిచే సందర్భంలో
ఆర-అంగారకుడు; భ-అగ్ని; మాన--పగడము-- తారకర--మేరుపర్వతం; హార-బంగారము , వీటితోపోల్చ దగినది యని ;అర్ధం;
నాల్గవ పాదంలో పరాక్రమాన్ని ప్రశంసించేటప్పుడు
" ఆరభమా--ఆనత--అర-కర- హా- రస- మా- ఆనము;అనిపదివిభాగం. ఏంతగొప్పవారైనా నీకడ నోడి కరుణరస మాలపించి శరణుకోర వలసినదే యని భావము.
పై అర్ధవివరణ నాచిన్ననాట విద్యబోధించిన గురుదేవుల వివరణము. నాప్రజ్ఙకాదు.
ఏకాక్షర నిఘంటు పరిచయముగలవారు దక్క యితరులకిది యసాధ్యమగుట పాషాణపద్యముగా పరిగణింప బడుచున్నది. ఇట్టి క్లేశభూయిష్ఠమైన రచనలు విశేషాదరణమునకు నోచుకొనుట యరుదు..
స్వస్తి!
చొప్పకట్ల సత్యనారాయణ.
శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారికి ధన్యవాదములు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అద్భుతమైన సాహిత్యాన్ని అందించిన శ్రీ చొప్పకట్ల సత్యనారాయణగారికి అభినందన మందారములు .అందించిన శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.