గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, సెప్టెంబర్ 2026, బుధవారం

రేనాటి సూరీడు. ... వీరరసాన్విత ప్రబంధము. ... విద్వాన్, చక్రాల లక్ష్మీకాంత రాజారావు గారు ఎం.ఏ.,

 జైశ్రీరామ్.

ఛందో వైవిద్యనిష్ణాత., ఛందస్సవ్యసాచి., స్వర్ణకంకణ కవిగండపెండేరపు సత్కార గ్రహీత., విద్వాన్, చక్రాల లక్ష్మీకాంత రాజారావు ఎం.ఏ., విశ్రాంత సంస్కృతాంధ్రోపన్యాసకులు, హైదరాబాద్, చరవాణి, 9291333880
వీరరసాన్విత ప్రబంధము
   పద్యరచనలందు నెన్ని ఛందోవైవిధ్య రచనలున్నవో అన్నింటఁ దన పాండితీప్రతిభతోఁ గావ్యములు రచించిన వారిలో నాధునిక కవిశేఖరులలోఁ బ్రథమ తాంబూలమునందుకో దగినవారు శ్రీ చింతా రామకృష్ణారావుగారు. వీరు సంస్కృతాంధ్ర భాషలలో పండితులగుట చేతను, అనేకానేక కావ్యములను బఠించుట చేతను, ఆయా పద్యరచనా ప్రక్రియలలోఁ గల  వివిధ మార్గాలను బరిశీలించి, ఆయా మార్గాలందుఁ గృతులు వ్రాయుట చేతను వీరికి కావ్య రచనలన్న నల్లేరుపై బండి నడక వంటిది. 
   పద్య సాహితీ జగత్తులో 2రాష్ట్రాలలో కావ్య రచనలు చేయుచున్న మహాకవీశ్వరులలో శ్రీ చింతా రామకృష్ణారావుగారి పేరు తెలియనివారుండరు. వీరికున్న భాషావైదుష్యము, పద్యరచనా పాటవము, ఆశుకవితాభినివేశము, శ్రీ శారదాదేవీపదపద్మారాధనము, ఇతర కవులతోనున్న పరిచయ సౌభాగ్యము నిజముగా ప్రశంసనీయములు.
    భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామ రంగమున దుర్మార్గులయిన ఆంగ్లేయులతోఁ బోరాడి యశువులఁ బాసిన వీరులెందరో యున్నారు. అట్టి వీరవరులలో రాయలసీమలో రూపనగుడి గ్రామమున జన్మించి, ఉయ్యాలవాడలోఁ బెరిగి, ప్రజలలో చైతన్యమును దెచ్చి,   వారికి నాయకుఁడుగానుండి, తెల్లదొరలనెదిరించి, తుదకు వారి చేతులలో హతమైన వ్యక్తి రేనాటి సూరీడుగా కీర్తిఁ గొన్నట్టి శక్తి, శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. వీరి జీవిత చరిత్రను ఒక మహా ప్రబంధముగా రచించి,తెలుఁగువారికినందించిన మహోదాత్త చిత్తవృత్తి గల మహాకవి శ్రీ చింతా రామకృష్ణారావుగారు. 
     ఇక్కావ్య నామము రేనాటి సూరీడుఱేనాడు అని రాయలసీమ ప్రాంతమునకు మారు పేరు. ఇచట నల్ల యెఱ్ఱరేగడభూములున్నాయి. ఈ భూములలో వరిసాగు గాక మరి వివిధములైన పంటలు పండును. ముఖ్యముగా నల్లరేగడులందు ప్రత్తిపంట విస్తారముగా పండును. ఈ ప్రాంతము వర్షాధార ప్రాంతమగుటచేఁ గరువు సీమగా రాయలసీమకు పేరుంది. ఇచట జీవనదులు లేవు. అన్నియును వర్షాధార నదులే. రేనాట కుముద్వతి, పినాకి నదులు ప్రసిద్ధములు. ఉయ్యాలవాడ ప్రాంతమున కుముద్వతి ప్రవహించును. దానిని కుందు అని కూడా పిలుతురు. రాయలసీమలో రెడ్లకు బలమెక్కువ. ఎక్కువ భాగము వారే పాలకులు. ఇక్కావ్య నాయకుఁడయిన నరసింహారెడ్డి కూడా  అటువంటి పాలకుల యింట జన్మించినారు. రేనాట ప్రతిగ్రామమునకు గ్రామాధికారులుందురు. వారిని మునసబు, కరణము అను నామములతోఁ బిలుతురు. అట్టి గ్రామ పాలకులే మన కథానాయకులైనవారి వంశస్థులు.
   ఇక కావ్య రచనా వైశిష్యమును గూర్చి తెలుసుకొందము. శ్రీ చింతా వంశ్యులు కావ్యలక్షణములు తెలిసినవారు గాన తనదగు రేనాటి సూరీడు అనునీ కావ్యమున నాశ్వాస విభాగములు, ప్రతి ఆశ్వాసమునందు శీర్షికలు, ఉపశీర్షికలు, సమయోచిత వర్ణనలు, సందర్భోచిత ఛందః ప్రయోగ విన్యాసములు, తొలుత శ్రీకారంతో ప్రారంభించడం, దైవ నుతి, తన వంశ్యనుతి, పూర్వాచీన కవుల నుతులు, కావ్యాంకితము, తదుపరి కథాప్రారంభము, ఇలా పూవుల దండవలె కొనసాగినది.  
   ప్రథమాశ్వాసమున కథానాయకుని స్మరించు పద్యమును గుప్త పంచమపాద ఉత్సాహ చ్ఛందమున వ్రాసి నీరు తమ కవితా వైభవమును ప్రదర్శించినారు. భారతదేశౌన్నత్యమును వివరించుచు, సమశీతోష్ణ మనోజ్ఞ దేశమిది, ధర్మము నాల్గుపాదములఁ దప్పకనొప్పుగ వెల్గు ధాత్రి,  యంచు తమ కవితా వైశారధ్యమును, దేశభక్తిని వెల్లడి చేసినారు. రాయలసీమ పరిస్థితులను కన్నులకు కట్టినట్లుగా తెలిపినారు. రేనాటి నగరమును వర్ణించినారు. కుందునదిని నదీప్రఘోషవృత్తమున తెలిపి, విషయమును తచ్ఛందమునందే అవినాభావసంబంధమునట్లు రచించినారు. ఇట్టి రచనను నామౌచిత్య చ్ఛందమందురు.  
   ద్వితీయాశ్వాసమున కథానాయకుని రూప లావణ్యాదులను వర్ణించుచు "పౌరుషమే స్వరూపముగ ప్రస్ఫుటమైన స్వదేశ భక్తుఁడం" చు భవిష్యత్తునూహించి, అదేరీతిగా వర్ధిల్లునని భావించి, వీరు రచించడము అనందకరమగు విషయము. శ్రీ జగన్నాథుని, స్వామి దేవాలయమును, గోపురమును చిత్రీకరించుచు తద్విషయమున గోపురబంధ భావగోపన చిత్ర కందముగా రచించినారు. శిస్తు వసూలు చేయుటకు వచ్చిన ఆంగ్లేయుల అరాచకాలను జనావళి పడిన బాధలను ఉన్నదున్నట్లుగా చిత్రీకరించినారు. 
   తృతీయాశ్వాసమున రెడ్డికి ననుంగు మిత్రుఁడగు హరిసింగ్ చూపిన మైత్రీ బంధము ప్రశంసాపాత్రము. నృసింహునికి తనకున్న మిత్రతా స్ఫూర్తని తెల్లదొరలకునాశ్చర్యము కలుగునట్లు చెప్పిన తీరును శ్రీ చింతా వారు గంభీర పదజాలముతో ధీరతా దర్శనముతో రచించినారు.
   చతుర్థాశ్వాసమున అజ్ఞాతములోనున్న రెడ్డిని గుర్తించుటకు ఆంగ్లేయులు పడిన పాట్లను కవిగారు చక్కగా వర్ణించినారు. ఆ వర్ణనలో శ్రీ చింతావారు వాడిన అపరాజిత మనోజ్ఞ వృత్తాలు కడు రమణీయములు.
   పంచమాశ్వాసమున మన స్వాతంత్ర్యసమరవీరుల ధీరతావైభవమును జూచి "తిరుగుబాటులకోర్వజాలక  అంటూ తరళ చ్ఛందమున తెల్లవారెట్లు తమ దేశమునకు పారిపోయిరో చక్కగా వర్ణించినారు. 
   ఇలా యీ ప్రబంధమున ప్రతిపద్యము ఒక ఆణిముత్యము.  పాఠకులకు హుషారెత్తించు పద్ధతిలో కథను వీరు నడిపినారు. అందుకే నేను వీరిని పుంభావ భారతీ యని కీర్తించితిని.
   శ్రీ చింతా రామకృష్ణారావుగారు మరిన్ని కావ్యాలు వ్రాసి తెలుఁగు భాషాభివృద్ధికి, పద్య రచన చేయువారికి తగిన మార్గములను చూపుదురని ప్రార్థన.
ఇట్లు
బుధజన విధేయుఁడు
చక్రాల లక్ష్మీకాంత రాజారావు.
హైదరాబాద్,
తే. 12 - 9 -2026.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.