రేనాటి సూరీడు...పంచమాశ్వాసము.
శా. శ్రీమద్భారతదేశమాతను రిపుల్ చేపట్టి పాలించుటన్
ధీమంతుల్ భరియింపలేరుకద? మా దేవా! జగన్నాయకా!
నీ మాహాత్మ్యము చూపి స్వేచ్ఛ కొఱకై నిత్యంబు యత్నించు నీ
ప్రేమన్ గోరెడివారి రక్షణము నీవే చేయుమోదేవరా! 1.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆంగ్లేయులకు లొంగిపోవుట.
గీ. శ్రీ జగన్నాథు గుట్టపై చేతులెత్తి
దైవమును గొల్చిస్వేచ్ఛకై, తాను లొంగె
శత్రు వితతికి స్వయముగా, మిత్రకోటి
విగతజీవనులయిరని వెతను పొంది. 2.
గీ. తనను బంధింప నొక్కఁడున్ దగ్గరకును
రాఁడు భయపడి, తనకు తా రేడు వెడలె
శాత్రవులవెంట, కాక్రేను మాత్రమపుడు
బంధనము చేయుఁడనె, రెడ్డి ప్రజ్ఞ నెఱిఁగి. 3.
ఉ. తొమ్మిదివందలొక్కరిని దోషులుగా చెరసాల నుంచి, వా
దమ్మున కొందరిన్ విడిచి, తక్కిన వందకు పైన దోషులన్
సమ్మతి తోడ వారి చెరసాలను బంధనమందు నుంచి, ధ
ర్మమ్మును చర్చ చేసిరి, సమంచిత రీతినిశిక్ష చేయగన్. 4.
క. న్యాయవిచారణ జరిగెను,
వేయఁదగినశిక్ష లెన్ని వేసి, చెరలలో
కాయంబులు మాయువరకు
ధ్యేయంబునఁ గొందరి నిడు తీర్పు వెలువడెన్. 5.
ఉ. కొందరి నండమాన్ చెరలకున్ గొనిపోయిరి దోషులంచు, నిం
కొందరి నక్కడే చెరలకున్ గొనిపోయిరి, వారి తప్పు లే
నందున కొందరిన్ విడిచి, రానరసింహ సుయోధునెన్ని, గ
ర్వాంధులె యాంగ్లపాలకులహంబును జూపుచు శిక్ష వేసిరే. 6.
09 - 01 - 1847న ఇచ్చిన తీర్పు నరసింహారెడ్డికి ఉరిశిక్ష.
చ. ప్రవరుఁడు, దేశభక్తుఁడును, భక్తవరుండగు నారసింహునిన్
బ్రవిమల చిత్తశోభితుని బంధన చేసి చెరన్ విధించియున్
జివర కురిన్ విధించిరయ శిక్షగ, రెడ్డి పరాక్రమప్రభల్
భవితను ముప్పుగొల్పునని పట్టి వధించుటె ధర్మమంచహో! 7.
ఉ. భీకరమౌచు రెడ్డికురి వేసెడివార్త చెలంగె నంతటన్,
లోకములోని శత్రువులె లోపల లోపల క్రుంగుచుండగా
శోకసముద్రమై ప్రజలు స్రుక్కుచునుండుట వింత కాదుగా?
మాకిల దేవుఁడీతఁడని మాన్యులు కూడ వచించుచుండిరే. 8.
ఉ. భారత జాతికంతకును భారమె చూడగ కుంఫిణీలు, వి
స్తారము చేయుచుండిరి యసంగత రీతిని రాజ్యపాలనన్,
స్మేరముఖారవిందుఁడగు శ్రీ నరసింహుఁడు వీరి పాలనన్
ధీరతఁ జూపి మాపుటకు దీక్షగ నిల్చి, యురిన్ వరించెనే. 9.
ఉ. ఎంతటి గొప్పవాఁడితఁడు, హృద్య మనోహర సద్గుణాఢ్యుఁడై
శాంతి విఘాతులైన పరశక్తుల పాలనఁ బాపనెంచి, యొ
క్కింత తెగింపుచూపి పరికించి దురాత్ముల శీర్ష ఖండనల్
పంతముతోడఁ జేసి పరపాలకులందు భయంబు నింపెనే. 10.
ఉ. కంతుని తమ్ముఁడందమున, జ్ఞానసుధానిధి పాలనప్రభన్,
జెంతను జేరు మిత్రుల నజేయులుగా నిలుపంగనేర్చు, క
వ్వింతలు చేయఁజూడ నరివీర భయంకరుఁ డీనృసింహుఁడే,
శాంతికి మారు పేరనఁగఁ జక్కని పాలనఁ జేసె నాఁడిలన్. 11.
ఉ. దానము ధర్మమున్ సలుపు తానిట వేంగళరాయుఁడే యనన్,
మాన ధనుండు చూడఁగను, మాన్యులలోపల మాన్యుఁడీతఁడే,
దీనజనాళి బాధలను తీర్చుచుఁ గాచిన పుణ్యమూర్తి, యీ
క్షోణి స్వతంత్ర సాధనకు గొప్పఁగ యత్నము చేసి వీగెనే. 12.
ఉ. నాయకుఁడన్న నీతఁడె, యనారత మిద్ధర పేదసాదకున్
జేయఁగనొప్పు సాయమును జేసిన సౌమ్యుఁడు, శత్రువర్గమున్
ధ్యేయముతోఁడఁ జంపు మగధీరుఁడు శ్రీ నరసింహరెడ్డి, యే
మాయలెఱుంగఁడీతఁడు, సమాదరలీల నురిన్ వరించెనే. 13.
మ. పరమార్థంబగు నిండు స్వేచ్ఛ కొఱకున్ బ్రఖ్యాతిగాఁ గొల్పగన్
వరసద్భాషణశేముషీ నిపుణతన్ భాషించి చైతన్యమున్
దరికిన్ వచ్చెడివారికిన్ గొలుపుచున్ దక్షుండుగా నిల్చె నీ
భరతాంబన్ తగు స్వేచ్ఛతో నిలుపఁగా, వర్ధిల్లఁగాఁ జేయగన్. 14.
పంచచామరము.(జ ర జ ర జ గ. యతి 10.)
అరాచకప్రవృత్తిఁ గల్గ నాంగ్లపాలకాధముల్
భరంబు కాగ ధాత్రిఁ బేదవారిఁ గట్టి, వారలన్,
గరంబునందుఁ గల్గినట్టి ఖడ్గధారఁ జూపుచున్
శిరంబులెన్ని ఖండనంబుఁ జేసె రెడ్డి వీరుఁడై. 15.
చ. ఒకటిగఁ జేసి యందరిని యుజ్జ్వల తేజము కొల్పి వారిలోఁ
బ్రకటితమై రహించునటు భవ్య సమైకతఁ గొల్పి, యాంగ్ల సై
నికులకు ప్రశ్నయై మిగిలి, నేడిటు తా నురినే వరించె, పా
లకులకు తానె చిక్కె, మదులన్ మహనీయుఁడుగా రహించుఁగా? 16.
గీ. ఘనుఁడు నరసింహుఁ డాస్థాన కవిగ నిలిపె
నోబళాచారినే ధాత్రి నొప్పిదముగ,
పెక్కు కావ్యముల్ రచియించి పేరుగనిన
వానికావ్యమొక్కటికూడ కానరాదు. 17.
గీ. తాను కుందుర్తి రామావధాని కొఱకు
కోటగడ్డను దానంబు కోరి చేసె
నతఁడు మంత్రిగా తనకుండి యలరఁజేసి
కోటలను గట్టఁ జేయుటన్ కూర్మినిచ్చె. 18.
గీ. పెక్కు దేవాలయమ్ములనక్కజముగ
తాను కట్టించె రెడ్డియే ధరణిపైన,
నట్టినర్సింహరెడ్డికీ మట్టిపైన
నురిని తీయుట బాధయే యరసి చూడ. 19.
ఆ. పట్రకులమువారు పట్టుగా నైక్యమై
నరసరెడ్డి సేనను రహియించి
యున్నహేతువుననె యుయ్యాలవాడయున్
దోపిడీలు చేయు దొంగ యనిరి. 20.
మ. తనవారే తనకోసమై యసువులన్ తా వీడుటన్ జూచి యీ
ఘనుఁడౌ రెడ్డి సహింపలేక దొరికెన్ గాక్రేనునే చేరి, వే
దననే పొందెను తోటివారి కొఱకై, ధన్యాత్ముఁడీతండిలన్
మనినన్నాళ్ళును మానవత్వమెలయన్ మాన్యుండుగా వెల్గెనే. 21.
శా. అయ్యో యంచు జనాళి యీ విధముగా నారెడ్డినే గూర్చి తా
నెయ్యంబారఁగఁ బల్కుచుండి రకటా! నిర్వేదమున్ బొందు నా
యుయ్యాల్వాడ నృసింహరెడ్డి కథ యీ యుర్విన్ స్వతంత్రేచ్ఛనే
చయ్యన్ గొల్పక యుండునెట్లు? కనఁగా సంస్తుత్యుఁడీతండిలన్. 22.
రెడ్డికి పడిన ఉరి శిక్షకు 06 - 02 - 1847న గవర్నర్ ఆమోదముద్ర.
మ. ఆమోదించె ప్రభుండు శిక్ష నరసింహారెడ్డికిన్వేయుటన్,
ధీమంతుండగు రెడ్డి క్రుంగక మహా తేజంబుతో నొప్పుచున్
క్షేమంబీభరతాంబకున్ గొలుపఁగా స్వేచ్ఛన్ సదా కోరుదున్,
మీ మాయల్ పని చేయవింక త్వరగా మీరందరున్ బోవలెన్. 23.
గీ. అనుచు నాంగ్లేయులందరిన్ బనుపనెంచి
పలుకుచుండగ మాటలే ములుకులగుచు
నాంగ్ల జాతికి గుండెలో నలుఁగులటుల
గ్రుచ్చుకొనుచుండి వారినే రెచ్చఁగొట్టు. 24.
22 - 02 - 1847న ఉదయం 7గంటలకు ఉరి శిక్ష అమలు.
క. ప్రకటించిరి యురిశిక్షను,
సకల జనులు చూచుచుండ జరుపమనుచు నో
ప్రకటనఁ జేయుచు ప్రజలకు
నొకపరి గనరండటంచు నుద్ధతి తోడన్. 25.
క. చాటింపు వేయఁబడె నీ
మేటిగ నన్నిటనునుండి మించెడి రెడ్డిన్
గాటికి పంపఁగ నురినే
పాటించుచు తీయుదురను వార్త వెలువడెన్. 26.
గీ. నేటి కోయిలకుంట్ల, జుర్రేటి దరిని
నాడు పద్ధెమ్దివందలనలుబదేడు
ఫిబ్రవరి సోమవారము వేకువననె
యిరువదియురెండు తేదీన యురిని తీయు. 27.
క. దావానలంబు పోలుచు
నీ వార్త జనాళిఁ జేరె నీ నరసింహుం
డే వారల నెదిరించుచు
పోవఁగఁ దగువాఁడె, కాని, పోడటు లరయన్. 28.
గీ. వీర నరసింహుఁడాతఁడు, పేడి కాడు,
పౌరుషముతోడ నెదిరించి పట్టుపడెను
తనకు తానుగ రిపులకున్, ధరణి జనుల
స్వేచ్ఛనాశించి, పోరాడి విసిగిపోయె. 29.
మ. తన ఖడ్గంబునఁ ద్రుంచెఁ గుత్తుకలనే దండింపగా నాంగ్లులన్,
మనమందున్ దురితాత్ములంచుఁ గనెనా మానండు చంపన్, బ్రతి
క్షణమున్ భారతమాత స్వేచ్ఛ కొఱకై సాగించె నీ పద్ధతిన్,
ఘనుఁడై వెల్గె నృసింహరెడ్డి కడకున్ గాంక్షించె తానీ యురిన్. 30.
గీ. వచ్చె నురితీయు రోజది, వచ్చినారు
రెడ్డినురితీయువారలు రెడ్డితోడ,
జనుల సందోహమఁటఁ జేరె జాలిగాను,
శిక్షతప్పింప నెవరికి చేతనగును? 31.
గీ. కరుణ జాల్వార దుఃఖసాగరమునందు
సీమ జనులెల్ల మునిగిరి, చేయుట కిఁక
నేమియును లేక, బాధతో స్వామి నచటఁ
జూచి జుర్రేటి చెంతను, శోకిలుచును. 32.
గీ. అచట కాక్క్రేన్ సమక్షాన నమలు చేయ
నురికి సిద్ధంబు చేసి రా తరుణమందు
రెడ్డి ముఖమున చింతయే లేదు చూడ
నెదురు తిరుగుటయును లేదు, బెదురు లేదు. 33
చ. చివరిగ నేమి కావలెను చెప్పుమటంచనె కాక్కిరేను, నీ
కివె చివరి క్షణంబులనె నీప్సితమున్ నెరవేర్తునంచనెన్,
ప్రవరులు నా ప్రజాళి, కని వారిని నేనిఁట పల్కరించెదన్,
భవితను చూడఁ జేసెదను, పల్కగనిండనె రెడ్డి వానితోన్. 34.
శా. భీతిన్ జెందెను కాక్కిరేను, యితఁ డే ప్రేలాపనల్ పేలునో?
యేతన్మాత్ర జనాళి విప్లవము తా మీనాడె చేపట్టునో?
ఖ్యాతిన్ వెల్గెడి యాంగ్లపాలనకిలన్ కాలంబె చెల్లింతురో?
యీతండింక వచింపరాదు ప్రజతోనిప్పట్టునంచెంచె తాన్. 35.
చ. సమయము మించిపోవు నిక చప్పున వీనిని తీయుడీ యురిన్,
క్షమ తగదింక, చెప్పినటు సాంతము చేయుఁడటంచు నాజ్ఞనే
యమలునుఁ జేయుఁడంచనియె నయ్యెడ కాక్క్రెను, రెడ్డి గట్టిగా
ప్రముదముతోడ భారతము వర్ధిలు గావుత స్వేచ్ఛనంచనెన్. 36.
శా. స్వాతంత్ర్యోద్యమమాగ దీభరత భూవాసుల్ సమైక్యంబుగా
నాతత్త్వంబు గ్రహించి, స్వేచ్ఛ కొఱకై నా మార్గమున్ బూని, స
చ్చైతన్యంబును రెచ్చఁ గొట్టి ఫలమే సాధించు నందాక తా
భీతిన్ గొల్పుచు నాంగ్లపాలకులనే వీడంగఁ జేయన్ గనన్. 37.
ఉ. పోయెడివాఁడనొక్కడినె, పోరును సల్ప ననేకు లిద్ధరన్
న్యాయ పథంబునన్ నుత మహత్తర శక్తిగ నొక్కటౌచు స
ద్ధ్యేయముతో స్వతంత్రమును తెత్తురు నిక్కము మిమ్ము పంపి, య
న్యాయములాచరించు మిము నందరినిం కడదేర్త్రు కాక్కిరేన్! 38.
పఙ్క్తి వృత్తము.(భ భ భ గ. యతి 7.)
భారత మాతకు పల్కెద నే
ధీరత జై యని దిక్తటులన్
మారుగ మ్రోగఁగ, నాకురినే
మీరు బిగించుచు మీరునెడన్. 39.
మ. అనుచున్ రెడ్డి జయంబు పల్కుతరి, నాహాకారముల్ మిన్నుఁ దా
కెనె యచ్చోట తలారి రెడ్డి కురి శక్తిన్ జూపుచున్ వేయ, నా
జనసందోహము చేయుటన్, శివశివా! సాధింప స్వాతంత్ర్యమున్
తన ప్రాణంబులుపెట్టె తా పణముగా ధన్యాత్ముడౌ రెడ్డియే. 40.
మ. ఉరిత్రాటిన్ బిగియించఁ గొంత వడికా యుచ్ఛ్వాసనిశ్శ్వాసలున్
బరమాత్మన్ వడిఁ జేరిపోయె, కనుపాపల్ కాంతినే వీడగా,
పరికించెన్ భువి కాక్కిరేన్ నరహరిప్రాణంబులే పోవుటన్,
సరిగా ఖండనఁ జేయు మీ శిర మనెన్, శాశించి తల్వారినే. 41.
ఆ. తీర్పు ననుసరించి తెగఁదీసి శిరమును
కోట లోననె యురి కొయ్య చివర
వ్రేలదీయవలయు, భీతిల్ల జనులెల్ల,
ననెను కాక్కిరేను ఘనముగాను. 42.
గీ. చేసెను తలారి కాక్క్రేను చెప్పినటులె,
కోటగుమ్మాన నురికొయ్యకు నరసింహు
శీర్షమును వ్రేలఁ దీసె, నశించిపోక
యట్టులే ముప్పదేడులు కట్టియుండె. 43.
ఉ. దీనిని చూచుచుండిన మదిన్ భయమందుచు నాంగ్ల జాతిపై
మౌనముతోడనుందురని, మాటికిమాటికి స్వేచ్ఛవాంఛతోఁ
బ్రాణముతీయ రారనుచు భావనఁ జేసిరి కుంఫిణీ ప్రభు
త్వాన గలట్టి పాలకు లవారిత రీతిని తీర్పునిచ్చిరే. 44.
సీ. సుద్దుల కథలోన శోభించె నుయ్యాలవాడ నృసింహుని ప్రవర చరిత,
పిచ్చుకుంటల వారి విఖ్యాతమగు పాట లయి వెల్గె సైర నృహరి సుచరిత,
కోలాట పాటలన్ గొప్పగా కలదెన్న నరసింహరెడ్డి ఘనమగు చరిత,
వరలెను గ్రుడ్డిదాసరుల పాటలలోన వీరనృసింహుని విపులచరిత,
గీ. ప్రథమముగను స్వాతంత్ర్యసంగ్రామమునకు
మూలమగు నీ పదేండ్లకు ముందె జరిగి
యున్న సైరానృసింహుని యుజ్వలకథ,
దేశమాతకు స్వేచ్ఛను తెచ్చిన కథ. 45.
సీ. నరసింహునురితీయుటరసిన ప్రజలలో స్వాతంత్ర్య సత్కాంక్ష ప్రబలసాగె,
నల్లూరి రామరా జిల్లువాకిలి వీడి తెల్లవారికి పోరు తీరు చూపి,
యూపిరాడక చేసి, యుత్సాహ భరితుఁడై మన్యంపు దొరయంచు మహిని వెలిగె,
తాంతియాతోపియా ధైర్యంబుతో నాంగ్ల జాతితోపోరాడె ఖ్యాతిగాను,
గీ. భారతావనిన్ బ్రతియింటఁ బ్రబలినారు
స్వేచ్ఛకైపోరుసల్పంగ వీరులగుచు,
స్వార్థమును వీడి ప్రతివారు భారతాంబ
స్వేచ్ఛనాశించి త్యాగముల్ చేసినారు. 46.
గీ. రెడ్డి నడచిన పథమునన్ బ్రీతితోడ
సాగఁ జొచ్చిరి ప్రజలెల్ల సన్నుతముగ
నో పదేండ్లకుపూర్తిగా నొప్పిదముగ
మహితసంగ్రామ రూపమ్ము మహిని పొందె. 47.
ఉ. తొంబది వర్షముల్ రిపులతో నొనరించిరి యుద్ధమిట్లు, లో
కంబున తెల్లవారలు కకావికలౌనటు రెచ్చిపోయి, ఖే
దంబును గొల్పినారు, బహుధా తమశక్తులనొడ్డినారు, వా
దంబులు చేసి యాంగ్లుల మదంబును డుల్చిరి భారతీయులే. 48.
తరళము. (న భ ర స జ జ గ. యతి 12.)
తిరుగుబాటులకోర్వఁ జాలక తెల్లవారలె భీతితోఁ
బరుగుఁ దీసిరి భారతావని వారు వీడుచు, నయ్యెడన్
బరువునే మదినెంచి వారలు ప్రస్ఫుటంబగు పద్ధతిన్
స్థిరముగా మన భారతాంబకు స్వేచ్ఛనే ప్రకటించిరే. 49.
ఉ. సైర నృసింహరెడ్డి కల సన్నుతిగా నెరవేరె నేటికిన్,
వీరుల త్యాగ సత్ఫలము నేటికిఁ బూర్తిగ లభ్యమయ్యె, వి
స్తార మనోజ్ఞభారతము సాధ్యము కాక, లభించె కొంతయే,
కోరుచు పాక్కుదేశముగ కొంత విడెన్ బరితాపహేతువై. 50.
సీ. ప్రారంభమాయెను పద్ధెమ్ది వందలనలుబదారున స్వేచ్ఛ వలయుననుచు,
రేనాటి సూరీడె యానాడు మొదలిడి ప్రాణములర్పింపఁ బ్రతిఫలముగఁ
బ్రఖ్యాతమౌ స్వేచ్ఛ పందొమ్ది వందల నలుబదేడున వచ్చి వెలయఁ జేసె
భారతాంబ సుకీర్తి పరగ దిశాంతముల్, ప్రజలుస్వేచ్ఛగనిఁట ప్రబలునటుల,
గీ. చక్కనైనట్టి రాజ్యాంగ మొక్కటగుచు
చేసి నారిఁట పెద్దలు ధ్యాసఁ బెట్టి,
పంచవర్షప్రణాళికన్ బ్రగతి కొఱకు
నేర్పరచినారు పాలనన్ నేర్పుఁ జూప. 51.
శా. స్వాతంత్ర్యంబొకమారు కోల్పడితిమా సర్వంబు శూన్యంబగున్,
స్వాతంత్ర్యంబు లభించెనంచు మదిలోనన్ బొంగ వచ్చున్, సదా
స్వాతంత్ర్యంబును నిల్పుకోవలయు, దుస్స్వార్థంబునే వీడుచున్
స్వాతంత్ర్యంబిల భారతీయులెలమిన్ సద్భాతి భోగింపనౌన్. 52.
ఉ. భావి తరమ్మువారె పరివర్ధిలు దీప్తులు, వారె సమ్మతిన్
భావమునందు నిత్యమును భారతమాత శుభాస్పదంబుగా
దేవతగా రహించుచు, ప్రదీపిత శాంతమనోజ్ఞ తేజయై
సేవితపాదయై, యిలఁ బ్రసిద్ధిని గాంచఁగ నెంచఁగావలెన్. 53.
ఉ. ప్రకృతి విరుద్ధమౌ పనులు భారతవాసులు చేయ నొప్ప దే
వికృతపు చేష్టలున్ దగవు, వేల్పుల నెప్పుడు గౌరవించుచున్,
బ్రకృతమునందు మెల్గవలె భక్తిగ నీ వర దేశ వాసమే
సుకృతి ఫలంబటంచు మది శోభిలఁ గాంచుచు మెల్గఁగావలెన్. 54.
శా. ప్రాచీనంబగు దేవళంబులనిలన్ వర్ధిల్లఁ జేయన్ వలెన్,
శ్రీచక్రాంకితపాదపద్మరజమే ప్రీతిన్ గనున్ భారతిన్,
నీచంబైన ప్రవర్తనన్ ధరణిపై నిత్యంబు ఖండించుచున్
బ్రాచుర్యంబును భారతావనికిలన్ వర్ధిల్లఁ జేయన్వలెన్. 55.
సీ. పాశ్చాత్యులిద్ధరన్ బాతుకు పోవుటన్ బరిపాలనంబును బట్టినారు,
వారట్లు మనదేశ వాసులమధ్యనే చిచ్చును బెట్టుచుఁ జెలగినారు,
మనలో ననేకతన్ ఘనముగా కల్పించి విడిపోవఁగాఁ జేసి పెరిగినారు,
మనవారె తమవారు, మనకు మనమె శత్రువులగా ప్రవర్తించి కలియకుండ
గీ. నుండుటనుజేసి స్వేచ్ఛతోనుండ్రి వారు,
స్వేచ్ఛఁ గోల్పోయినామట్టి స్వేచ్ఛకొఱకు
నెందరెందరో ప్రాణమ్ములిచ్చినారు,
నాటి స్థితియె రాకూడ దేనాటికినిల. 56.
గీ. ప్రజలు సత్సమైకతఁ గల్గి ప్రబలవలయు,
దేశపు రహస్య విషయముల్ తెలుపరాదు
పరులకెన్నడున్, దెలిపినన్ వాఁడె దేశ
శత్రువుగనెన్ని యురితీత జరుప వలయు. 57.
గీ. దేశభద్రత ముఖ్యము, దీనిలోన
తరతమాంతరమ్ములకింక దారి లేదు,
భారతావనిన్ బ్రతుకుచు, పరులకొఱకు
జయముపల్కెడి మూర్ఖులన్ జంపుటొప్పు. 58.
గీ. పెద్దలును బాలురును కూడ పృథ్విపైనఁ
జొక్కవలయును సతతంబు శుభచయమున
నాయురారోగ్యములతోడఁ నంతమంది
వర్ధిలన్వలె, భక్తి సద్భాగ్యమొదవి. 59.
ఆ. త్యాగధనులనెంచి ధన్యులు వారంచు
త్యాగబుద్ధిఁ గలిగి ధన్యతఁ గను,
భోగభాగ్యములను బొందవచ్చును కాని
యోగసిద్ధి మనకు యోగ్యమెఱుఁగ. 60.
గీ. దేశపున్ స్వేచ్ఛకొఱకునై తెల్లవారి
కెదురు నిలిచి ప్రాణంబులనొదిలినట్టి
ధన్యులకు తర్పణంబిడి తలచు కొనుచు
ఋణము తీర్చుకో వలయు, ధరణిని మనము. 61.
గీ. సైర నరసింహు నాత్మకున్ జక్కనైన
దేశభక్తి నివాళియౌ, దివ్యమైన
భారతావనిన్ నిరతంబు భక్తిఁ గొలుచు
భవ్య భక్తులకర్పింతు వందనములు. 62.
పంక్తి.(భ భ భ గ. యతి 7.)
జై భరతాంబకు జై యనరా!
శోభను గొల్పఁగఁ జూడుమురా
శోభిలు సన్నుత శుద్ధమతిన్,
జై భరతాంబకు జై యనరా! 63.
ఆశ్వాసాంతము.
స్రగ్విణి. (ర ర ర ర. యతి 7.)
నారసింహప్రభూ! నాదుదేశంబునున్
వీర భక్తావళిన్ బ్రేమతోఁ గావరా!
భారతాంబన్ గృపన్ వర్ధిలన్ జేయరా!
వీర కావ్యంబిదే ప్రీతితోఁ గాంచరా! 64.
ఆ. స్వస్తి జనులకెల్ల, స్వస్తి మా భూమాత
భారతాంబకెపుడు, భక్తతతికి,
స్వస్తి పాఠకులకు, స్వస్తి రేనాటికిన్,
స్వస్తి కాంతలకును, బాలలకును. 65.
కాణ్వశాఖీయ కౌశికస గోత్ర చింతా వంశజ సన్యాసిరామారావు ధర్మపత్నివేంకటరత్నమాంబ పుణ్య దంపతుల జ్యేష్ట పుత్రుఁడును, పూజ్య సద్గురుదేవ పరమాత్మ స్వరూప కల్వపూడి వేంకట వీర రాఘవాచార్యుల ప్రియ శిష్యుఁడును చిత్రకవితా సమ్రాట్ బిరుదాంకితుండును రామకృష్ణారావు నామధేయుఁడనగు నాచే విరచింపంబడిన రేనాటి సూరీడు అను చారిత్రక ప్రబంధమున పంచమాశ్వాసము సమాప్తము.
సర్వము సంపూర్ణము.
స్వస్తిశ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సర ఆషాఢబహుళ పాడ్యమీ భౌమవారమ్.
తే. 30 - 6 - 2026.
Print this post
వ్రాసినది



0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.