గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, సెప్టెంబర్ 2026, గురువారం

శ్రీ భారతాంబికా శతకము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,

జైశ్రీరామ్. 

శ్రీ  భారతాంబికా శతకము

                                        రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,

                                                                  జుత్తాడ,


ఉత్పల మాలా వృత్తము,             


              శ్రీవరు నాన నూని జన జీవన భాగ్యము!సర్వ సామ్యమై

             పావన భాగ్య భారతికి!బంగరు బాటలు వేయనెంచి!సం

            భావిత భక్తి తత్వముల!భద్రత గల్గు నటంచు నాశతో!

            ఆవలి బాధలు న్మదిని హత్తిన!బానిస తత్వమెంచి!జీ

            వావరణంబు!సౌఖ్య మవ!పట్టితి దీక్షను బాగు సేయగన్!

           జీవన దాయి వేదమతి!వర్ధిలు మాత సు భూతి భాతినిన్!

           స్థావర జంగమాది!శుభ!జన్యుల కీర్తి ప్ర కీర్తులన్ సు శ్రీ

           దీవన!దేవ సంభరిత దివ్యత! క్షేమ విభూతి భాసిలన్?

           రావణ కాష్ట మేర్చెడిని!రక్కసి మూకల గీటడంచి! భూ

           తావని  ప్రీతి గాచు నిక!ధన్యత గూర్చుత!భావి సంతతిన్!

           నేవము మీర ధీ! వరత!వ్రాయ దలంచితి!సౌమ్య ధృష్టి! సం

           భావన! 'భారతీ శతక'-భాసుర రత్నము!మేలిడ న్సదా!


                           తొలి పలుకు

                           ****


       శ్రీమంతంబై!సదా!సచ్చి దానంద మై!జగతిని మేల్బంతియై!యలరారెడు భారతాంబ

 సుమారు700 సంవత్సరములు పర పాలనా శృంఖలాల బంధింపబడి!స్వేచ్ఛా వాయువు

 లను,పీల్చ జాలక!పరపాలనా!భీతయై వర్తిలి మహనీయులత్యాగ ఫలమున స్వతంత్ర 

ప్రతిపత్తి, స్వయం సమృద్ధి గడించి,ప్రపంచ దేశాలలోపేరెన్నిక గన్నది,ఐనను.,స్వార్ధ ములతో,

సంకుచిత స్వభావము లతో,జాతి కుల మత వివక్షలతో,నిత్య మారణ హోమమై,స్వార్ధ జీవు

 లేలికను .సర్వ సామ్యత గనరాక పరితపించు భారతికి,వెతనుతొలగించి,యానందము 

జేకూర్చు తపనయే!ప్రకృత కృతి  "శ్రీ భారతాంబికా"-శతకము.,యదార్ధ వాదీ లోక విరోధి

 నానుడినిజమై నను.  భావనను,భావి తరములు,సత్యమును గ్రహించి,సంతసింతురు!గాక!

సామ్య ధృష్టిని  సోద రాదర భావాన గ్రహించి

 తప్పు లున్న  క్షమింతురు గాక!



                                                          

 జుత్తాడ,                                           ఇట్లు

తే,16.1.2009.                         విద్వద్వి ధేయుడు,

                              వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,




            ఆది గణపతి స్తుతి

        ==============


  తే,గీ.   ఆది గణపతి గణపయ్య!యగజ సుతుడు!

            సిద్ధి బుద్ధుల జేకూర్చు!శివ తనయుని!

            ముదము కీర్తిల భారతి!ముందు నడచి!

            స్తుతి మతంబుగ శతకము తొలుత నిలుప!


            కుల దేవతా స్తుతి.    

            *****

తే,గీ:-   కలియుగ ప్రధాన దైవమై!వెలయు స్వామి!

           భరత మాతను రక్షించు!భాగ్య  శీలి!

           వేంక టాచల నాధుని!విశ్వ విభుని!

          నాదు కుల దైవమును!భక్తి!నమ్మి గొలుతు!


.        తల్లి దండ్రుల స్తుతి

         ÷÷÷÷÷÷÷÷÷÷÷

ఉ:-శుద్ధియు బుద్ధియుం గుదుర!శోభిలు సంస్కృతి నేర్చి కూర్చి!సం

      సిద్ధుల జేసి!వాక్సతియె?శ్రీయని!శ్రేయము నిచ్చు నంచు!, తా

     మిద్దరు బిడ్డలుం దనయ!నింపగు రీతిని! దీర్చి నట్టి! మా

     ముద్దుల తల్లి దండ్రులను!ముచ్చట గొల్చెద!మమ్ము గావగన్!


         భరత మాత స్తుతి,

       ×××××××××××××

శా:-అమ్మా!భారత మాత!నీ వలరెదే?యాధార్ధ్యముం గాంచినన్!

     కొమ్మా!కంటిని!తాళ జాలక నిటుల్!కూర్మి న్సదా!తెల్పితిన్!

     ఇమ్మా?సౌఖ్యము నీతి నిల్పి!నరుల న్హింసింపక న్గావుమా!

     కొమ్మా?యంజలి!సామ్యవాద మలరన్!క్రొంగొత్త దీప్తి న్సదా!


       ప్రస్తుత స్థితి

     +++++++++.


కం:-సరదా యని సంబరమని!

     నిరతంబును నీతి దప్పి నీ నా యనకన్!

     పర దాస్యము విడు వడి నను!

      పర పీడన పెచ్చు పెరిగె!భారత భువిలోన్!



                       పండితాభి ప్రాయములు,

                       ================


అవధాన శారద,

శ్రీ,భద్రం వేణు గోపాలాచార్యులు,

                   ఎమ్యే బి,యిడి,

గణేశ్ నగర్,ఆముదాల వలస,

శ్రీకాకుళమ్ జిల్లా,

తే,:-6.1.2009.దీ,


                       సౌ మనస్యం

                       """"""""""""""""""


       సాహితీ వనములో ఎన్నో?సమనస్సులు మరెన్నో?పరిమళలు,కావ్యాలు కొన్ని

అయితే,ప్రబంధాలు కొన్ని వచన రచనలు,మరెన్నో ఛందోబద్ధ ప్రబంధాల నుండి,

యెన్నో శాఖలై,కవితా సుందరి కళ్ళకు కట్టి నటు సాహితీ సౌందర్యాలను వెద జల్లు

తుంది,కవితా భావనా సుగంథాలు విరజిమ్ము తుంది,ఆ శాఖలలో శతక రచన

యొకటి,

     "భారతాంబికా"-మకుటం"తో విరబూసిన మందారం ఒకటి.దాన్ని చూసేభాగ్యాన్ని కల్పించారు

సంధాన కర్త శ్రీ కొమ్మాజోస్యుల వేంకట్రావు మాష్టారు(,కళింగ పట్నం).వీరే మాకు 

కవిగారితో ప్రధమ పరిచయాన్ని కూర్చిన వారు, "భారతాంబిక ను"-పదిమంది చేతను,శతదా

 శ్లాఘింప జేయాలని,శ్రీవల్లభవఝలవారు సంకల్పించి రేమో!శతక రచనా ప్రక్రియ తోను,సంస్కార

 వాసనా  బలం చేతను,శ్రీ వల్లభేశ ,హేరంభ కరుణామయ రవం చేతను,ప్రతి పద్య సుమం లోను,,

మాథుర్యాలను,సంతరించారు,పాఠక మథుప వ్రతాన్ని,కమ్మదనంతో సత్కరించారు,ధారా

 శుద్ధి గల రసవాహిని,కవి "మూర్తి " హృదయాన్ని,ఆవిష్కరించింది,మూర్తీభ వించిన భావనా 

సంస్కారం ,శ్రీ వి,ఏ,ఎన్ మూర్తెలోప్రస్ఫుటిస్తుంది,  దాని సుగంథమే సర్వదా కావ్యం లో 

పరిమళించింది,వీరి శతకములో,మొదటి పద్యం పరిశీలిద్దాం,


ఉ:- మానవ సేవయే మథుర మాథవ సేవగ!మానసంబునన్!

      మానిత కీర్తి దామమయి-మానవు లందున దైవము న్గనన్ !

      తానె పరాత్పరాంశ గల తత్పరమాత్ము డటంచు గొల్వరే?

      వానికి మోక్షము న్గల్గు-వల్లభ! మెచ్చును భారతాంబికా!

    మానవ సేవను ,ఒక తియ్యని,దైవ సేవగా భావించాలి,కీర్తిని పొందినస్థానంగా,మనస్సు నర్తిల్లాలి

సోదర మానవులలో దైవాన్ని చూడ గల్గాలి,అట్టి వానిని దేవుడని ప్రజ లందరు, గౌరవిస్తారు,అట్టి వారికి 

మోక్ష సామ్రాజ్యంకూడ లభిస్తుంది,అంటారు కవిగారు,

     ఈపద్యంలో"భారతాంబికా"-మకుటంతో బాటు మంగళ ప్రదుడైన వల్లభేశ గణపతికి మహిళ యైన

,శ్రీ వల్లభ మెచ్చును,అని దైవీ శక్తినికూడ తోడు కూర్చుకొన్నారు,కవిగారు,

       శ్రీ అప్పల నరసింహ మూర్తి కవి గారి'శతకం'-కేవలం ఆధ్యాత్మిక వచనాలే?గాక,గతి తప్పిన 

మనుష్యుల మనస్సులను,అతి సచ యేచ్ఛతో,పల్లటీలు కొడుతున్న దుండుడుకు ఆలోచనలను,

భావనా బలహీనమైన పరాన్న భుక్కుల,చింతనలను,నిష్కర్షగా యెత్తి చూపారు,సాటి వారిని మేటి 

వారిగా చూడాలే?తప్ప,మాటున పెట్టడం నేరమన్నారు,కుల మత భేదాలు పెట్టిందని,హిందూ సమా

 జాన్ని  తిట్టిన పెద్ద మనుష్యులు,స్వార్ధ బుద్ధితో,ఓట్టు,నోట్లు,కోసం!కులాలను బలత్కరించి,వశం చేసి

 కొనడాన్ని,!మతాల పేరుతో విదేశీ దిగుమతి మతాలతోతప్పిస్తూ,మారణహోమాలుచేయించడాన్ని

,నొక్కి జెప్పి కవి-నిర్మోమాటి యనిపించు కొన్నారు,

 ----కులమును బట్టి వెల దేలును గాని(రిజర్వేషన్లు ఎండ గట్టారు)

-----కులమని వెఱ్ఱి కూతలు కూయుచు(పేద వారిని అణచి వేయడమే)

                                                                 అని వెక్కిరించారు,  

-----మతమను మాట లేల?  (భారతీయు లంతా ఒకటై స్వాతంత్ర్యము 

                     తెచ్చు కున్నారుగదా)!అని గుర్తు చేస్తున్నారు కవిగారు,

       అంతే కాదు!నాయకు లనిపించు కొనే వారు,ఎలా?ఉండాలో చెప్పారు,

                ఎలా ఉంటున్నారో?చాటి చెప్పారు,

------భూత విషాసి మానవుల"--నీచ కృత్యముల వలన,బాధ పడేవారిని

                                               కాపాడ వలెనని,అర్ధించారు,

-------శాంతి నహింస సత్యముల్"--గన నేక దీక్షతో"-గాంధీ ఏర్పరచిన 

                 స్వాతంత్ర్య రాజ్యమునకు,యెప్పుడు సత్పాలన లభించునో?

                                             యని వాపోయారు,

       అంతేగాదు,భాషను గూర్చి,సాహిత్యాన్ని గూర్చి,సంస్కృతిని గూర్చి తెల్పుతూమానవతా సం

స్కారాన్ని,చక్కగా!చిక్కని  తెలుగులో మొక్కవోనిధైర్యముతో!సమ్మతి తో,శతక పద్య సుమ సౌరభాలను

సాహితీ వనమునకు ప్రోది చేశారు,

      శ్రీ మూర్తి"-కవి గారి తలిదండ్రులు ధన్యులు,వారి తాత ముత్తాతలు,ధన్యులు,శ్రీ మూర్తి కవి

గారిలో--సంస్కారం మూర్తి మయం చేసినందుకు,వారెల్లరు,ధన్యులే కదా!

        కవిత్వానికి భావనా సంస్కారం అవుసరము కదా!పద్యాలు చదివే యలవాటున్నప్రతి పాఠకులు,

"భారతాంబిక"-శతకము లోని పోకడలకు,ముచ్చట పడక మానరు,శతకం చదవండి,చదివించండి,చదివి 

వినిపించండి,అంటోంది "భారతాంబిక'మనోహరంబుగా!మథురంగా,!  

         శ్లో:-ధన్యో హం కవి సింహాయ!జ్ఞాన దీప్తాయ మూర్తయే!

               నమస్కరోమి విజ్ఞాయ దృశ్యతే!భారతాంబికా"-


                                                   భవదీయుడు,

                                      భద్రం వేణుగోపాలా చార్యులు,

                                            ఆముదాల వలస,





శ్రీ చింతా రామకృష్ణా రావు,

              భాషాప్రవీణ,ఎం,ఏ

ప్రభుత్వ డిగ్రీ కళశాలచోడవరం,

విశ్రాంత తెలుగు ఉపన్యాసకులు,

మారుతీ నగర్,గాంధీ గ్రామం,

తే,6.1.2009.దీ,  


                       అభినందన మందారం

                    ================

         శ్రీమాన్ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి గారి కలము నుండి జాలు

వారిన కవితా సుథ,చంప కోత్పల మాలలుగ రూపు ధరించి,మన భారతాంబికా

కంఠ హారమై ---శతాధిక భావ పరిమళములు విరజిమ్ముతూ,పాఠకులమస్థిష్కాలికి

ఆనంద ప్రద మగుటయే గాక!ఆలోచనా లోచనాలకు,విప్పార జేస్తాయి,

      ఏ రచన చేయబడినా,--అది పాఠక లోకానికి ఆనంద కలుగ జేయడంతో పాటు,

ఉపదేశమును కూడ చేయ గలగడమే ఆరచన యొక్క అస్థిత్వాన్ని చాటు తుంది,

కావ్య మనగానే--కావ్య లక్షణ సమన్వితమైన ఒక ఉద్గ్రంధ మను కుంటే.----మనం

పొరపాటు పడి నట్టే!"వాక్యమ్ రసాత్మకమ్ కావ్యమ్."-అన్న విషయం కూడ 

యదార్ధమని ఱు జువు చేసే శతకాలు , మనముందు శతకాలకు కావ్యత్వాన్ని,

ఆపాదిస్తున్నా యన్న విషయం"-ఈ భారతాంబికా శతకము చదివిన వారికి 

తెలియక మానదు,

        ఉ:-శ్రీ మహితాబ్ధి వాసినిని"క్షేమక"-లం"-వదనారవిందతన్

            ప్రేమత"ఏమ్,అయిమ్:-చరణ భీజ వశీకృక,సారసాక్షినిన్!

           కామిత గంథకీ"వసుథ"-కారక శక్తిని,వహ్ని ప్రేరితన్!

          రామణి,"ఘ్రాం"-సునేత్ర!హృది రమ్యను గొల్చెద!భారతాంబికా!


            లమ్ ,ఏమ్,-అనేవి  అత్యంత మహిమాన్విత లక్ష్మీ బీజములు,ఒక చిన్న

వృత్త పద్యములో,చొప్పించి,కామితా.ర్థ వాంఛ ఫలముగా,పాఠకుల కందించుట,

ఈ కవి వరేణ్యుని జ్ఞాన సూక్ష్మతకు తార్కాణము,

         ఈ కవి పుంగవులు,రస నిష్పత్తి,చేసే పద్యములతో బాటు,దేశ భక్తి ప్ర పూరిత

మైన పద్యాలు,వెలయించుటలో దిట్ట,!తన మదిలో కలవర పరిచేటి,భారతాంబిక పై,

జరుగుతున్న దౌష్ట్యములను తెగనాడి,---నిర్ద్వందముగా,తన భావమును,పద్యమున 

వ్యక్తీకరించి,తన ఆవేదనను,పదిమందికి తెల్పి,దేశ భక్తి భావపూరితులుగా చేయుట

ద్వారా,తన ఆశయ సాధనకు మార్గం చేసి కోవడంలో  కవి నిపుణత వ్యక్త మవుతుంది,

ఇందులకు వారి భారతాంబికా శతకం--83.వ,పద్యం తార్కాణము,

      ఉ:-తల్లిరొ?నీదు శీర్షమును,తప్పక ధృంచియు!పుస్తె లాగి, తా

           మెల్లను పాశ్చ్య దేశ్యముల! మెల్లగ చాటున కోట్లు దాచుచున్!

          కల్లల మాయ మాటలను!కాలును లాగి విషాసి కోతలన్!

         తృళ్ళగ జేయు నాయకుల!ద్రోహ మడంచవె?భారతాంబికా!

మోక్ష కాములగు వారు,ఆత్మ శుద్ధి యేవిధంగా ?చేసుకుంటే!ముక్తి సుగమ మౌతుందో

నన్న విషయాన్ని,,

      ఉ:-కామ మనో వికార మమకార సురూప విచార సంగతా

          రామ విరామ జీవన!సరాగ రసోత్ఫల వాంఛితార్థ, సం

          క్షేమ హృదాంతరంగ!పరకేయ మహేంద్ర సమంచితాకృతా

          ధామ విరాజి తాకరము!ధామము ముక్తికి!భారతాంబికా!


.    అనే,107.వ పద్యంలో,ఎంత చక్కగా వర్ణించారు,అందులో గల క్లిష్ట సామాన్య

 బాహుళ్యం ఆపని యెంత క్లిష్టమో?తెలియ జెప్పు తున్న ట్లున్నది,ఎంతటి

గడుసరి ఈకవి,

       చెప్పుకుంటూ పోతే,ప్రతీ పద్యము,ఒక ఖండ కావ్యముగా చెప్పేరన్నా 

అతిశయోక్తి కానేరదు,తినబోతూ కూర రుచి అడగ నవసరము లేదు కదా!

ఈ శతకాన్ని చదువ బోతున్న మీకీ విషయం స్పష్ట మౌతుంధి,

       దేశ భక్తి,సత్స మా జాను రక్తి,పెల్లుబికే,ఈ మహాకవిని,మనసారా,

అభినందిస్తూ,లోక కల్యాణ ప్రదమగు ,పెక్కు రచనలు చేయుట ద్వారా!

భారతాంబిక ముద్దు బిడ్డడును,పుట్టి నందుకు మాతౄణము తీర్చు కొనే!

ఉత్తమ భారతీయుడు లా భాసింతురని ,ఆశిస్తున్నాను,

                    కం:-అప్పల నరసింహ కవిని

                         గొప్పగ కనె భారతాంబ!కూర్మిన్ కరుణన్!

                        రెప్పల వలె!కంటికి తా!

                        తప్పగ రక్షించు గాక!ధరపై!నెలమిన్!


                                          భవదీయుడు,

                                 చింతా రామ కృష్ణా రావు,

                                          చోడవరం,



శ్రీయుతులు

మేడూరి సూర్యనారాయణ మూర్తి,

ఎమ్,ఏ,(తెలుగు),ఏమ్ ఏ,(సంస్కృతము).

ప్రభుత్వ జూనియర్ కళాశాల,ఉపన్యాసకులు,

డెంకాడ,విజయ నగరం(జిల్లా).

తే,6-1-2009.దీ,


                                భారతీ దర్శనం

                             *****


          పూజ్య ప్రియతమ మిత్రులు,గౌ,శ్రీ వల్లభవఝల అప్లల నరసింహ మూర్తి,మహోదయులు

రచించిన దేశ భక్తి శతకం,శ్రీ భారతాంబికా శతకము,సాంతముచదివి,స్వాంతం సంతస మెంతో

పొందింది,అల్ప జ్ఞాణున్ని ,నన్ను మాటి మాటికి అందల మెక్కిస్తున్న వారి,అంతరంగ మాథుర్యా

నికి,నమోవాకములు,వారి కలం కళావరి వస్య చేస్తు,కలకల లాడుతూ ఉండాలని,ఇలాగే యేదో 

ఒక అందమైన కలకలం సృష్టిస్తూ ఆనందమైన కోలాహలం పుట్టిస్తూ ఉండాలని, కామన"కవితా

సతినొసట నిత్య రసగంగాధర తిలకం!  సమకాలిక సమస్యలకు స్వచ్ఛ స్ఫాటిక పలకం"-అంటూ 

అమృతం కురిసిన రాత్రి అమృత కవి బాల గంగాధర తిలక్ ను అక్షరాక్షర సత్యంగ ప్రశంసించారు!

        శ్రీ వల్లభ వఝల వారి  యీకృతి కూడ,కవితా సతి తిలక మంటే!సమకాలీన సామాజిక

సమస్యలకు స్వచ్ఛ స్ఫటిక ఫలకమంటే అతిశయోక్తి కాదు,అమృతం కురిసిన రాత్రి లాగే!

అమృతం కురిసిన ధాత్రి"-యీ బంగారు భరత భూమి మీద వారు కృతి వెలయించారు,

వారి కవితా చాతురిని చూపడానికి ఉదాహరణలతో యీ అభిప్రాయాన్ని పొడిగించే ప్రయత్నం

చేస్తే,రసజ్ఞ పాఠక జన ముదాహరణమే,అవుతుంది,

     అయినా,నా మనస్తృప్తి కోసం కొంత తప్పదు,మన్నించండి,

25.వ,పద్యం,

       ఉ: రాజులు పాలు గానిదియు!రాత్రి చరుల్ !కొన లేని దౌచు, తా

            భాజిక మంద నేరనిది!భారము లేనిది!కర్చు చేయుచో?

            రాజిలి పెంపు నందగల!రమ్య పదంబది! విద్య యే!సుమా!

          తేజము నింపు విద్య లిల!తెల్విగ నేర్పవె?భారతాంబికా!

----విద్య ప్రశస్తిని వర్ణించే పద్యమిది,రాక్షసులనే  అర్ధముతో రూఢ్ కెక్కిన"నక్తం చర"-శబ్దాన్ని 

యిక్కడ కవి గారు,దొంగల పరంగా ఉపయోగించి,గడుసు తనంప్రదర్శించారు,దొంగలు దొంగి

లించ లేని,ధనము మాత్రమే కాకుండ,రాక్షసులకు కూడ,చేజిక్కని,అమృతం విద్య,.రాత్రే అసలు 

తమస్సుకు నెలవు గదా!మరి,

       శ్లో:-నచోర హార్యమ్!నచ రాజ్య హార్యమ్!

             నభ్రాతృ భాజ్యమ్!నచ భార కారీ!

            వ్యయె కృతే వర్ధత యేవ నిత్యమ్!           

           విద్యా ధనమ్!సర్వ ధన ప్రధానమ్!

                        అనే మౌలిక శ్లోకానికి మౌళి మౌక్తికంగా ఉంది,తెలుగు పద్యము,వ్యాన్

(V a n)నిండా యెంతెంత మథురాతి మథుర కవితా రస సామగ్రి ఉందో!యేమౌ?మరి,


16.వ,పద్యం

            ఉ:-విద్యయె!కీర్తి భోగదము!విద్యయె!పాతు ధనంబు నౌ గదా!

                 విద్య గురుండు!లోకహిత!విస్తృత కీర్తి విరాజితంబు నై!

                విద్య వివేక సంపదలు-వెల్గులు నింపుచు వర్తిలన్!, సదా

               విద్య సు శిక్షణం వరల-వెల్గులు నిపవె?భారతాంబికా!


శ్రో:-విద్యానామ నర స్వరూప మధికమ్!ప్రచ్ఛన్న గుప్తం ధనమ్!

       విద్యా!భోగకరీ!యశః స్సుఖ కరీ!విద్యా!గురూణాం గురుః!

       విద్యా బంధు జనో?విదేశ గమనే! విద్యా!పరా దేవతా!

       విద్యా!రాజి సుపూజ్యతే!నహిధనమ్!విద్యా విహీనః పశుః!!

----   శ్లోకంలో కనిపిస్తున్న భర్తృహరి కవీంద్రుడికీ పద్యంలో కాన వస్తున్న,వల్లభవఝల

కవీశ్వరుడు,ధీటుగా నున్నాడు కదూ?"భర్తృ'"-శబ్ధం,వల్లభ"- శబ్ధంరెండునూ పర్యాయాలే!

కదండి మరి,

-----------పై పద్యాలు రెండింటి లోనూ,తళుక్కు మనిపించిన,శతక కారుడు,క్రింది పద్యంలో

మనస్సు నొక్కసారి ఎలా?కలుక్కు మనిపించారో చిత్తగించండి,యీ పద్యం పై రెండింటి లాగ

అనువాదం కూడా కాదు,సర్వ స్వతంత్రమైన పద్యం,

        ఉ:-కట్టును తప్పి లక్ష్మి యట!కల్లల మాయల లొంగిపోయి! ఏ

             పట్టున బీదకు న్దరికి!వచ్చుట మాని,సు దూర గామియై!

             దిట్టలు దుష్ప్రచారులను,తెల్విడి లేమిని జేరి పోవగా!

             పెట్టని సొమ్ము భారతికి!--పేదరికంబగు!భారతాంబికా!

----భారత(మాతకు).భూమికి పేదరికము పెట్టని సొమ్ము,(సహజ ఆభరణము)అనే

మాట సత్యమే అయినా భారతీయుని గుండెను పిండి కలుక్కుమనిపించి,మెలి పెట్టి

నలిపేసి ,కది పేసే!వ్యధా భరిత కధనం కదండీ!మరి,

          అగ్ని జల్లినా అమృతం కురిసినా,అందం యానందం,గాని పరమావధి యనికవి తిలక్

చె ప్పిన కవితా తత్వం యిదే కాబోలు మరి,

          వల్లభ వఝల కవితా ఝరి పొడవునా యిలాంటివి ఎన్నో తళుక్కులు,మరెన్నో 

చమక్కులు!ఇంకెన్నో?చురుక్కులు!అన్నీ కూడా కవితాసతి క్రీగంటియందమైన"లుక్కులే"-

కమ్మ నైన జిమిక్కులే!

         మెచ్చులీనే!మచ్చలేని!కవిచంద్రుడి!అచ్చపు కవితా చంద్రికలకు మచ్చులుమరీ 

హెచ్చుగా!యెందుకు?కవితారస సమాస్వాదనకు ఆనందంగా సాగి పొండి,యిక ముందుకు

ఠ,సెలవు, 


                                                భవదీయుడు,

                                      ఎమ్,యస్,యన్,మూర్తి,

                                                 డెంకాడ,

                                    విజయ నగరం (జిల్లా). 



                                 ॐ

                          శ్రీ మాత్రేనమః

                  శ్రీ భారతాంబికా శతకము,


                                         రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,

                                                                  జుత్తాడ,



1.శా:-శ్రీ మాయా యమ వల్లభావృత భవున్!శ్రీ విష్ణు!నిర్హంతునిన్!

         భూమార్ధ ప్రతిపాది తార్థ!శుభగున్!మోక్షైక సంధాయకున్!

        లేమా!హేమవతీ!సుతోద్గుణ ఘనున్!లీలా మయోల్లాసునిన్!

       శ్రీమత్కాశి పురాధి నాధు!కొలుతున్!శ్రీ భారతాంబా!శుభా!


2.ఉ:-శ్రీరమ!గంథ నామకి!వశీకర దైవము!చంద్ర సోదరిన్!

       నీరజ భవ్య వాసినిని!నిరజనాయకు మాత!శ్రీ మణిన్!

      పూరిత"లం"-సు భీజ యుత!పూర్ణ ముఖిన్!సిరులిచ్చి యెప్పి సం

      సారము బ్రొచు!గంథవతి!సన్మతి గొల్తును,భారతాంబికా!


3.ఉ:-గంథవతీ!వరాంగి భువి!కల్ముల గాచెడి!కల్ప వల్లినిన్!

       బంధుర విక్ర మాన్వితను,భాసిత భాస్కరు కాంతి వెల్గెడిన్!

       మందర మేరు భూధర సుమందిర నిందిర!పద్మ వాసినిన్!

      బంధ విమోచకున్!హరిని!భక్తిని గొల్చెద!భారతాంబికా!


4,ఉ:-కారణ కార్య కర్తృతపు!కర్తయు!భర్తయు!హర్తయున్!సదా!

       భారణ ధారణాన్వి తిహ!బంధ విమోచన!కారణాన్వి తా

      ధారము!భారమున్గనుచు!ధాత్రిని బ్రోచెడి!శక్తి భీజమౌ!

      తారకు!విశ్వ రక్షకుని!తప్పక మ్రొక్కెద!భారతాంబికా!


5.ఉ:-మాయ యనంగ లక్ష్మి యని!మాథవు!విఘ్ననిహంతయౌ!మహా 

        నాయకుడంచు,నా శృతు లనాదిగ ఘోషిల!నాది మూర్తు లై!

        పాయక!సృష్టి కార్యముల!భాసిలి పోషణ,నాశనంబులం

         జేయుచు నుండ!గొల్చెదము!జీవము వర్ధిల!భారతాంబికా!


6.ఉ:-సార విహీన జీవనము!శాశ్వత మెంచను గాదు!గాదు! సం

       సారము!రాగ బంధనల!సంకల నానృత!పాప కూప మౌ!

       తారణ లేక!మోహితము!తత్పరమాత్ముని గొల్వగా మదిన్!

      నేరదు గాన !వర్జితము!నిక్కము!గానవె!భారతాంబికా!


7.ఉ:-జన్మములందు!మానవుని జన్మయె!గొప్ప టదందు రేలనన్ !

        జన్మ వివేచనా!పరము!చక్కటి యూహల మంచి చెడ్డలన్!

        జన్మ  మశాశ్వతం బనుచు!శక్తి నెరింగి!పరాత్పరున్సదా!

       తన్మయ భక్తి కొల్వగను!తప్పును కాదుగ? భారతాంబికా!


8.ఉ:-మూడగు నాళ్ళ ముచ్చటని!ముందును వెన్కను గానకుండ, తా

        మూఢత! నిచ్ఛ మీరుచును!మోహిత దుష్టత!కర్మ కారులై!

       పాపము  గోరి!స్వార్ధు లయి!పాపము మూటను గట్టి యొప్పి కా

       పాడెడు !దైవ దూషణము!పారము జేర్చునె?భారతాంబికా!


9.ఉ:-సత్య,మహింస,ధర్మముల!సాక్షిగ తత్పరమాత్ము డొప్ప!. తా

        నిత్యము సత్య సందుడయి!నిర్మల చిత్తత వేద మూర్తియై!

       కృత్ఫము లెల్ల!త్తపరమ కీర్తిత గాన సమంచితంబునై!

       సత్యము నిల్ప!మోక్షమును చక్కగ నొందరె?భారతాంబికా!


10.ఉ;- మానవ సేవయే?మథుర మాథవు సేవగ మానసంబునన్!

            మానిత కీర్తి ధామ మయి!మానవు లందున దైవమున్గనన్!

           తానె?పరాత్ప రాంశ గల!తత్పరమాత్ము డటంచు గొల్వరే?

            వానికి మోక్షముం గలుగు!వల్లభ మెచ్చును!భారతాంబికా!


11.ఉ:-సత్యము!సత్య సాయి! నర జాతికి గన్పడు!జీవ బ్రహ్మ! సం

          స్తుత్యుడు!వేద విద్య నుత!సూర్య ప్రభా విభవాభి రాముడై!

         నిత్యము పూజ్య దైవమయి!నిండును గూర్పగ!భక్తి భావనన్!

        భృత్యత నొప్ఫు భక్తులను!ప్రీతిని గావడె?భారతాంబికా!


12.ఉ:-పర్తి పురాధి నాథుడగు!భవ్యుడు సాయి!శుభాభి దుండు! స

          ద్వర్తన! బాబయై దనరె!ధర్మము నీతిని భక్తి భావమున్!

         వర్తిల!భేద భావమును!బాపి శుభంబుల నొంద జేసి, సం

         ర్కర్తయు భర్త యున్నగుచు!సర్వుల గావడె?భారతాంబికా!


13.చం:-గరళము కుత్తుక న్నిలిపి!కాళము కంఠపు తావి జేసి సం

            బరమున గంగ నెత్తి నిడి!పార్వతి దేహపు టర్ధమై జనన్!

           తిరిపెపు బోలె చేతలను!తిర్గెడు! జంగమ దేవరుండు  నై!

          వరదుడు!చంద్ర శేఖరుడు!వర్ధిల గావడె?భారతాంబికా!


14.చం:-క్షర మన నాశనార్థకము!కానగ!నక్షర!నాశ దూరమున్!

            అలయగ జ్ఞాన సంకలన!అంచిత కీల్తి సుభాకరంబు నౌ

            తరతమ భేద భావనము! తానగు సంస్కృతి కాలవాలమై!

            నిరుపమ కీర్తి రేఖలును నింపదె?విద్యయు!భారతాంబికా!


15.ఉ:-రాజుల పాలు గానిదియు!రాత్రి చరు ల్గొన లేని దౌచు, తా

          భాజక మంద నేరనిది!భారము లేనిది!ఖర్చు చేయుచో

         రాజిలి పెంపు నొంద గలరమ్య పదంబది!విద్యయే?సుమా!

         తేజము నింపు విద్య లిల దెల్విగ!నేర్పవె?భారతాంబికా!


16.ఉ:-విద్యయె కీర్తి భోగదము!విద్యయె!పాతు ధనంబునౌ గదా!

          విద్య గురుండు!లోకహిత!విస్తృత కీర్తి విరాజితంబునై,

         విద్య వివేక సంపదల!వెల్గులు నింపుచు!వర్తిలు న్సదా!

        విద్య సుశిక్షణ న్వరల!వెల్గులు నిండవె?భారతాంబికా!


17.ఉ:-వాణి మదీయ భావముల వాస్తవముల్!గ్రహియింప జేసి,సం

           తానము భావి జీవన!నృతంబును దీర్చి!శుభంబు లేర్పడన్!

           కానగరాని కష్టముల కాలము దూరము జేసి!సంపదల్

           మానిత కీర్తులన్!నిలిపి!మర్త్యుల బ్రోవవె!భారతాంబికా!


18. చం:-కులమును బట్టి!యొన గూరును ఋనేడు!నిజంపు ప్రజ్ఞకున్

             విలువయు మృగ్యమై దనరె!వింత కదే?యిది యెంచి చూడగా!

            నిలుకడ లేని యూహలను నేటి జగంబు చరించు చుండగా!

            తలపగ!ప్రాజ్ఞు లేగతిని?తాళగ నేర్తురె?భారతాంబికా!


19.ఉ;-విజ్ఞుని పాత్ర పోషణ మవిజ్ఞుడు జేసెడి నేటి భారతిన్!

         విజ్ఞత గానగా!నిజము విస్తృత దేశ వినాశ భీజమౌ?

          ప్రజ్ఞకు లేదు?లెక్కనుచు! పాడొనరించు తలంపు మాని, స

         త్ప్రజ్ఞకు నందలం బిడగ!రమ్యత నొందవె?భారతాంబికా!


20.ఉ:-విద్య యనంగ బుద్ధి!యది విజ్ఞత నిచ్చెడి భాగ్య దాయి!, యా

          విద్యకు ప్రజ్ఞ రూపిణికి--విస్తృత పీఠము దక్క నీయకన్?

         సద్యశ మంచు,నా కులమె?సద్యశ ప్రజ్ఞగ నెంచి మన్నుచో?

         తద్యశ మెందు!నిల్చునొకొ?దక్కునె? కీర్తియు!భారతాంబికా!


21.చం:-జలగల నైజమూని!పర శక్తులు రక్తము పీల్చి యొప్పగా!

           యలమట దీరె!స్వేచ్ఛగని!హాయిని గంటివె?నేటి కేనియున్

           కులమును బట్టి జీవనము గూర్చెడి తీరది!స్వేచ్ఛ యౌనొకో?

          తలపగ ప్రజ్ఞ గీడ్పడగ!ధర్మము నిల్చునె?భారతాంబికా!


22.ఉ:-కట్టును దప్పి లక్ష్మీయట!కల్లలు మాయల లొంగి పోయి! యే

          పట్టున బీదకు న్దరికి వచ్చుట మాని సుదూర గామియై!

          దిట్టలు దుష్ట చారులను!తెల్విడి లేమిని, చేరి పోవగా!

          పెట్టని సొమ్ము! భారతికి పేదరికంబగు!భారతాంబికా!


23.ఉ;-కామము క్రోధము న్వదలి! కాతర జేయక లోభ మోహము

          ల్బాముల దూర గామి యయి!పట్టక దుర్మద మత్సరంబులన్

          కామిత కీర్తి నీశ్వరుని కైవల దాయిని,పార్వ తీశునిన్

          తా! మది గొల్వ!మోక్ష పరధామము,కల్గదె?భారతాంబికా!


24.చం:-జననియు!జన్మ భూమియును!స్వర్గము కన్నను గొప్ప వంచు!స

             న్మననము సేయు వానికి!సమాదర బుద్ధియు నబ్బు టభ్రమే?

             మననము దైవచింతనము!మానిత కీర్తి సు భూషయౌ!గదా!

             కనకను హేళనం దనర!కల్మష మౌ గదె? భారతాంబికా!


25.ఉ:-శ్రీ మహితాబ్జ వాసిని!క్షేమక! "లం"-వదనారవిందతన్

           ప్రేమత-" ఏమ్",అయిమ్"-చరణ భీజ వశీకృత సారసాక్షినిన్!

          కామిత గంథకీ !వసుథ కారక శక్తిని-"వహ్ని"-ప్రేరితన్!

          రామణి-ఘ్రాం"-సునేత్ర హృది రమ్యను!గొల్చెద!భారతాంబికా!

             (భీజాక్షరములు-",లం," -"ఏమ్"-ఐమ్"-హ్రీం"-లు,).


26.ఉ:-అన్న యనంగ నగ్రజుడు!నన్నిట!నాధ్యుడు!విష్ణు రూపుడున్!

          మిన్నగు,భావనా గరిమ!మేటి జగంబుగ దీర్చు వాడెపో!

         అన్న యనాది బ్రహ్మ యను!హర్ష మనీష సమాశ్రితుండునౌ!

        నెన్నడు చిన్న గాదనుచు!నేర్పడ!దెల్పవె?భారతాంబికా!


27.ఉ:-జాతికి మేలు చేయుటన!చక్కగ తత్కుల ప్రాభవోన్నతిన్!

          నీతిగ జేయుచున్!మిగుల నీయక నొండు కులంబు సౌఖ్యమున్!

          పాతుక బడ్డ పూర్వ విభవంబులు నెత్తుచు!మూతి నేతులే?

         నేతల చర్వణంబు గన!నేహ్యము గాదొకొ?భారతాంబికా!


28.ఉ;-జూదమునందు నోటమిని జుఱ్ఱెడు  వేళల నైన కాని,నీ

           చాదర బుద్ధి రూకలను!జల్లియు గెల్వగ జూచు నట్టి!,నై

          జోదర!రాజకీయమని!చొప్పడియేల్బడి జేయు వార లీ

         బీదల బాగు చూతు రన!విశ్వస నీయమె?భారతాంబికా!


29.చం:-షిరిడి"-పురీశ!సాయి!చిత్తమునం దలపోయుచుండి, సం

            కరమతి!నీచ బుద్ధి!తన కామము దీరగ!రాజకీయతన్

            నిరతము నీతి నెట్టుచును!నీచపు భావపు ముక్తి గోరి! సం

           బరమున నొప్పు!ఘాతుకుల!భాగ్యము లార్పవె!భారతాంబికా!


30;-ఉ:-పెద్దలు చేయు తప్పులవి!పేరగు "ఒప్పులు"-గాని,తప్పులా?

            సుద్దులు జెప్ప మేము సరి!శూరత!మా సరి మేమె గాని, మీ

            కెద్దిర?--"హక్కు"-తప్పునకు!క్రిందగు వారలు గాన! మీకు మా

           సుద్దులు నీతులం చనెడు!శుంఠల గాల్పవె!భారతాంబికా!


31.ఉ:-తేనియ లూరు పల్కులను!తెల్వికి మాసరి లే రటంచు!నె

          య్యాన వసించి,వీలుగని,-ఆరని మంటలు లేపు చుండి,దీ

          నానన నర్మ వా  క్చతుర  నాట్య కళా ప్రభవాభి రమ్యతన్!

         మానితులైన తుచ్ఛులను!మాయగ జేయవె?భారతాంబికా! 


32.చం:-కులమను పేరు పెట్టి!తనకున్నది చాలక మభ్యపెట్టి!, తా

             విలువను పెంపు జేసికొని,వీరునిగా!మది నెంచి మించి, దీ

            నానన!వాక్చతుర! నాట్యకళా ప్రభ వాభి రమ్యతన్!  

            మానితులైన తుచ్ఛులను!మాయగ జేయవె?భారతాంబికా!


33.ఉ:-ఆశకు మేర లేక!కనకాసన మందిన!మాయ కాశ!, తా

           కాసులె!యాశ జీవమని!కాలము నీచ తమో!వికారతన్!

          కాశిని పొందలేక?నిజ కర్మలు వీడుచు! నీతి దూరులై!

          గాసిలు నీతి హీనులకు!కైవల మున్నదె?భారతాంబికా!


34.చం:-ధనమును గోరి పాటుపడి!ధర్మము దప్పుచు నీతి హీనులై!

             వినయ మమాయ కత్వమును,!విశ్వ జనీనమంచు బల్కుచున్!

            కనికర మెంతొ!యేర్పడగ గన్పడి!మోసమె!చింతనంబుగా

            మనియెడు భూ జనాళి కెటు?మంచిని గూర్తువొ?భారతాంబికా!


35.చం:-కులమను వెఱ్ఱి కూతలను!రాజ్యము నేల జూచి సం

             కలనమ లేని భాషణల!కాతర సేయక నొండు వర్ణముల్!

            పలుకగ భావ్యమా!వరలు బంగరు బాటకు బీట లేల?ఏ

            కులమును గోరి?పాటు పడె!కూరిమి!గాంథి జి!భారతాంబికా!


36.చం:-మతమను మాట లేల?నయ!మానవు లందరు!మాననీయులే!

             సతతము భారతీయులని!చక్కటి బుద్ధిని పోరి పోరి, స

             త్కృత నవజీవ మేర్పరచి!తృప్తిగ!నిండుగ నుండ జేసిరే!

             గతము దలంచి!జీవనము--కల్ముల నింపరె?భారతాంబికా!


37.ఉ:-పాలును గోరి రొమ్ములను!పట్టుచు పీకెడి!మంద భాగ్యు ,లీ

          కాలము కల్కి భావమని!కల్కికి రుద్దుచు!బుద్ధి హీనతన్!

         తేలిక మాటలన్!తిరము తీరము గానక!పాప కూపమే!

         పాలు ఘటించు!షంఢ తతి!పాపము బాయునె?భారతాంబికా!


38.ఉ:-ఓటను మాట పాఠవము!నోటుగ మారి మహాపరాధియై!

           కోటను గట్టె!భీషణపు!కోరల రక్కసి రాజకీయతన్!

          పాటులు బడ్డ వారలకు!పాటులె దక్కె!నదేమి?చిత్రమో.    

          కోటులు పెంచు వారలదె? కూరిమి రాజ్యమ!భారతాంబికా!


39.ఉ:-నేరక పుట్టినా ననుచు! నీశు ,రహీములు,యేశు క్రీస్తులన్!

          దూరగ నెల?తప్పు గద!దుష్కృత చేష్టలు వీడనాడి, సం

          స్కారము పెంచి!సోదర సగౌరవ బుద్ధిని!విశ్వ సౌఖ్యమున్

           నేరుగ నంద!నీ సుతుల!నెన్నడు!జూతువొ?భారతాంబికా!


40:-ఉ;-ధర్మము నీతి మార్గమును! దప్పక నీసరి మానవాళికిన్!

           నిర్మల బుద్ధి సాయ పడి!నిక్కము దైవము గొల్చి యొప్పుచున్!

          కర్మ వశాన గల్గు చిరు కాసుల నొందుచు!జీవ ముక్తికై!

         మర్మము వీడి పాటు పడు!మర్త్యుల జూడవె?భారతాంబికా!


41.ఉ:-అక్షయ రాజ్య విస్తరణ నందగ!నగ్ర మహాగ్ర రాజ్యముల్!

          భక్షణ గోరి!శాస్త్రమను,పాడౌ తలంపున,మారణాస్త్రముల్!

          రక్షణ పేర జేసి! నర రాక్షస రూపున నొప్పు చుండ! నే

         దక్షత లేదు! లోకులకు? ధర్మము లేదిల?భారతాంబికా!


42.చం:-కరము జనాను రంజకము,కావ్యము సంస్కృతి పెంపు సేయ! ని

            శ్చరమగు భావ పుష్టి యుత!శాస్త్రము జీవన హేతు భూతమై

           బరగిన నిండు జీవనము వర్ధిలు! సోదర భావ మేర్పడున్!

           అర మర లేని విశ్వమగు!నందన మౌ!గదె?భారతాంబికా!


43.చం:-కుల మత భాగ్య సంభరిత!కుత్సిత దేహులు కోరు కొందురే?

            జలనిథు లింకినన్!ప్రళయ సంకట కాలము దాపురించినన్!

           తలపగ రాని ఘోరముల!దండన మొందిన!పారమార్ధతన్!

           పలువుర భాగ్య మెంచెడిని!భాగ్యము గల్గునె?భారతాంబికా!


44.ఉ:-కాతర జేయకం బరుల కష్టము జూచియు!బాధ నొందకన్!

          వేతన మొంది, దేశమున వెంగలి కూతల నీతి దూరులై!

          చేతికి నంకు లంచముల!చెన్నుగ గుంజెడి!ఘాతు కాళినిన్!

          పా తెద వెట్టులో?పరమ పావని గావొకొ?భారతాంబికా!


45.ఉ:-నితిగ జాతి భాగ్యమును!నిర్మల చిత్తత నెంచి యొప్పు, స

           న్నీతి యుతాభి రాములను!నిందలు మోపుచు మోస బుద్ధితో

          పాతగ జూచు మాయజన బారిని తప్పగ?గాచె దెప్పుడో?

         పూత విషాసి మానవుల! పొంక మడంచియు!భారతాంబికా!


46.చం:-అతులిత మాథురిన్!కుల మనందగు మాటలు నెట్టి యావలన్!

            వితరణ బుద్ధి ప్రజ్ఞ గని!వీరని,వారని, మాటలాడకన్!

           సతతపు నీతి చేతనల!సత్కృప మానవ జాతి, సౌమ్యమున్!

           రతిమెయి!జేయుచో!జగతి రంజిలి యొప్పదె?భారతాంబికా!


47.చం:-పదవిని గోరి పాటుపడి!భాగ్యముగా దలపోసి, దానినే!

            వదలక నర్థ చింతనమె!వన్నెయటంచును నీదు లాడుచున్!

           మదన మనోవికారమున!మత్తిలి నర్తిలు నైజ మానవుల్!

            సదమల భక్తి మార్గమున!సజ్జను లౌదురె?భారతాంబికా!


48.చం:-అరుదుగ నెన్బ దేండ్ల మల!హాయగు భారతి స్వేచ్ఛయేమొకో?

             తిరిపెపు బుద్ధి మూకలిల!తిన్నది లెక్కకు మీరి యుండగా!

              సరగునె?భావి జీవనము!సర్వుల మేలును గోరునట్టి, సం 

             స్కరణలు సేయగా బడునె?స్వార్ధము మాయునె?భారతాంబికా!


49.ఉ:-వారును వీరౌనుం గలిసి!పౌరుష ముల్వెలి బుచ్చి!సర్వదా!

          పోరును గోరు చుండియును!పూజిత కాలము నీరు గార్చుచున్!

          సార విహీను లౌచు!తమ సంస్కృతి చాటు కొనంగ! గాంచెడిన్?

          పౌరులు వెఱ్ఱి బాగు లొకొ?పట్టరె?పట్టును!భారతాంబికా!


50.ఉ:-నాయక వృత్తి యందు!సమ న్యాయము! ధర్మము సామరస్యమున్!

           బాయక యున్న గాదె?నిజ గౌరవ,భాగ్యము పౌరసత్వమున్

           శ్రేయము నొంది వర్ధిలును!సిద్ధత జేకురు!పార తంత్ర్యమున్

           పోయె నటన్న భావనము!పూర్ణత నందును!భారతాంబికా!


51.చం:-కులమను మాట లేల?తనకున్నది కోట్లకు మించినన్! సదా

             కులమును బట్టి బీదయని!కుంచిత బుద్ధిని పెంపు సేయగా!

             తలపగ!న్యాయ సమ్మతమె?ధారుణ రాక్షస తత్వ మౌ గదే!

            నిలుపుచు సర్వ సామ్యమును!యేలగ జేయవె?భారతాంబికా!


52.చం:-ప్రగతిని గోరి పాటు పడె!పారగు!గాంథి మహాత్ము డెంతయో?

             సుగమత గూర్చి భారతికి!చోప్పగు శృంఖలు లూడ్చి యొప్పగా!

            నిగమము లెల్ల తప్పులని! నిందలు సేయుచు!నిచ్ఛ మీర! తా

           సగమగు జ్ఞానమున్ వెలుగు జాతుల!గాల్పవె?భారతాంబికా!


53.చం:-అరయగ గ్రామ సింహమున కందల మీయగ!నందు నుండునే?

            చిరమున నెంగి లాకు గని!శీఘ్రముగా!దిగి వచ్చు గాక! సం

            స్కరణము లేని వారలిల!సార విహీనులు!తుచ్ఛ బుద్ధులన్!

           నిరతము దాస్య జీర్ణితుల!నేర్పవె?నీతిని!భారతాంబికా!


54.చం:-శతముల రెండిటన్! మిగుల శాంతము లేక!నశాంతి మ్రగ్గగా!

             కృత మతి శాంతి గల్గినను!కృళ్ళిన బుద్ధుల తేలి యాడు! నీ

             నుతమతి పాలనా విభవ శూన్యత! పోరుల ద్రోహ చర్యలన్!

            మతి చలియించె!నాకనుచు!మన్నెద వెట్టులొ?భారతాంబికా!


55.ఉ:-తల్లిరొ?నీదు పుత్రులును!తన్నుచు చచ్చుచు వేరు గోరచున్?

           చల్లటి పూర్ణ భారతిని!చక్కున ముక్కలు చేయ నెంచుచున్!

           ఎల్లలు మార్పు చేయుటకు!నెన్నియొ?యూహల దేలు చున్న,యీ

           కల్లల రాజకీయముల!కట్టడి సేయవె?భారతాంబికా!


56.ఉ:-భారము మోపలేక!నిజ బాధలు నెన్నడు తీరనీక! ని

          స్సారపు వాక్కులన్?నిలువ శక్యము గానటు!తీర్చి దిద్ది! నిం

         డార రహస్యముల్!పరుల హాయికి లోనయి! చేర వేయగా!

         ధారుణ దాస్య జీవనము!తప్పదు నేమొకొ?భారతాంబికా!


57.ఉ:-పిల్లలు పాపలున్ ప్రజలు! పెంపు వహింపగ!నిండు బుద్ధితో

          కల్లలు లేని జీవనము!క్షామ విదూరత!రామ రాజ్యమై!

         జల్లులు వేళకు న్బడుచు!చక్కటి పంటలు మేలు మేలనన్!

         తల్లిరొ!నీవు గూర్పగను!ధర్మము నేర్పవె!భారతాంబికా!


58.చం:-తనువును వీడిన న్సరియె!తప్పగ లేచును సొమ్ము జూపినన్!

             మనుజులు సొమ్ము మోహమున!మంత్రితు లైరను మాట!నమ్ముమా!

            ధనమును,పొంకమున్గడగి!ధర్మము వీడి సదా!వసించుచున్!

            మనుగడ!ముప్పు కోరెడిని!మంధుల గాల్పవె?భారతాంబికా!


59.ఉ:-చేతన హీన కూతలను!చెల్వము గన్పడ!నాట్య కారులై!

           పోతర మూని దేహమును!పూజ్యత నొందు తలంపు నొప్పగా!

           ఘాతుక రాజకీయముల!కాతర జేయక!భావి పౌరులున్!

          చూతురు!నీచ భావమున!చుల్కన గాదొకొ?భారతాంబికా!


60.ఉ:-నేరము జేసి నీతిగను!నిందలు నెట్టుచు సాటి వారిపై!

          చోర మనో విభూషితులు! శోధన జేయగ!బుద్ధి మంతు లే?

         వారిని మెచ్చు వారలకు!వచ్చును కష్టము లెన్నడేనియున్!

         తీరుగ ప్రాణము ల్జనునె?దివ్యులు మెత్తురె?భారతాంబికా!


61.ఉ:-ఉన్నది దాలి గుంట యని-యూర్జిత బుద్ధియు వీడనాడియున్!

          తిన్నది చాలనకన్?పరుల తిండిని లాగెడు- దుష్ట బుద్ధితో

          నెన్నగ రాని యోచనల - హీనత గూర్చుచు సాటి వారిలో

         నన్నల  మేలు లెన్నగను-అమ్మరొ?భావ్యమె! భారతాంబికా!


62.చం;-తెనుగు తెనుంగుగా దలచి-తెలివిని పెంపొనరింప జేయ, తా

             మనుగడ ముప్పుగోరి,పదిమందియు మెచ్చగ,నప్పు టూబిలో

            మునగగ జేసి తా!తెనుగు ముండన మేర్పడ!చిల్లు సిద్దలో

            జినుకు సుథా రసంబిలను!జెల్లునె!యమ్మరొ?భారతాంబికా!


63.ఉ:-బీద జనాను రంజకము వీడ నటంచును బల్కు!నాయకుల్

          సోదెలు మానుకో వలెను!శుద్ధులు కావలె?నేతి బీరలో

         పాదు కొనెండు నేతికిని!పాలన తీరుకు తుల్య మాయెగా!

         చేదు నిజంబునే?దెలిసి!సిగ్గిల రేలనొ?భారతాంబికా!


64.చం:-స్తన! సుథ లార గ్రోలి యది చాలదటంచును రాక్ష సాత్ములై

            స్తనములు ద్రుంచు కీచకుల సాటి జనంబన జెల్లు దుష్టులన్

           ఖననము చేసిననం జనులు గాతురె?వెఱ్ఱిగ నమ్మ నేటికిన్?

          మనమున "ఓటు"-నందెడిని మార్గమె నెంతురు!భారతాంబికా!


65.ఉ:-పాలక వర్గ తొత్తులయి! భాగ్యము పుష్టి దలిర్చు వారలే!

           చాలని తిండి  సామ్యులను జంతర మంతర రాజకీయ వి

            ద్యాలయ బోధనంబలర!తత్వ మదేమి?వి చిత్రమెంచగన్!

            శీలవిహీనులే?జగము చిందర జేసిరి!భారతాంబికా!


66.ఉ:-నీమము మీరి సంతతిని నేర్పున పెంచుచు కామ మగ్నులై!

          క్షేమము నెంచకన్ జగతి క్షీణత గోరుచు నొప్పు చుండగా!

          తామస లోకు లార!గన!తానుగ భూమి విశాల మౌనొకో?

         తాము వశింపగన్?స్థలము!దక్కునె?యూహిల!భారతాంబికా!


67.ఉ:-ఉట్టెను పట్ట నేరక!మహోన్నత భావు డటంచు నెంచగా!

           పట్టుగ నాకమేగతిని!పట్ట గలండొకొ?నట్టులే గదా!

          ఎట్టుల?పాశ్చ్య భావనము!నిచ్చట చెల్లును?కట్టు బొట్టులం

         దెట్టుల సాటి?దెల్సికొని !తెల్విడ జేయవె?భారతాంబికా!


68.ఉ:-ఆసనమందు పుండు గల -అత్తకు వైద్యము సేయు రీతిగా!

          దోస మదేల?యంటెనని-దుశ్చరితార్థ భవాబ్ధి నీదగా!

          భాసిలె. తెన్గు తల్లి యని!బల్కు దురాత్ములు నిశ్చ లాత్ములే?

         మోస విషాసి చిత్తులను!ముంచవె?నీటను!భారతాంబికా!


69.ఉ:-ఆది యనంగ బ్రహ్మ!పరమార్థ మనంతము!శేష సాయితో

           సాదర మాదరంబునను!సర్వము!మేలును గూర్తురంచు నే

           మాథవు పద్మ సంభవుల!మన్నన నొందుచు!లోక సర్వమున్

           మేథ సువేద్యమై దనర మేలిడ గోరెద!భారతాంబికా!


70.ఉ:- ముష్టియె!జీవయాత్ర!తమ ముచ్చటగా! తలపోయు వారికిన్!

           తుష్టినిగూర్చుటొప్పుటది!తుల్వు తనంబగు!దుర్మదంబునన్!

            పుష్టిని వీడి జాగిలము!పొందునె?యాసన మెంతకేనియున్!

             భ్రష్ట మనో వికారులను!ప్రక్కకు  నెట్టవె?భారతాంబికా!


71.ఉ:-ఆదరణాది నామముల!నందల మందున నుండ నెంచి తా

           బీదల పెంపుకై పరులు పీడిల తిండిని లాగి పంచుచున్!

           నీ దరి సొమ్ము పెంపొనర!నెమ్మది యప్పుల గజ్జి నింపుచున్!

           సాదర మంచు బల్కగను!జాతియు మెచ్చునె?భారతాంబికా!


72.చం:-పనులను మాని సోమరత!పాలకు లిచ్చెడి వానినందుచున్!

             మనుజుల మధ్య లంచములు!మాటల నేర్పున నొందుచుండి తా

              దినములు పుచ్చు రీతి ఘనతేర్చు నటందువె?తప్పు తప్పదే?

              మునిగెడు తెప్ప తేలు నొకొ?మూర్ఖతయే?సుమ!భారతాంబికా!


73.ఉ;-ఆసకు నాశయంబు!కనకాసన మిచ్చుట గాదు సుమ్మి! వి

          శ్వాసము పెంపు సేసి!నిజ శక్తిని జీవము నంద జేసెడిన్

         ధ్యాసయు గూర్పగా వలెను!ధర్మము తప్పక నీతి మార్గమే

         ఆసయు గాగ దీర్ప!పరమామృత తుల్యము!భారతాంబికా!


74.ఉ:-అప్పులు దీర్చి యంగడుల వసింపను!తప్పు గాదు! తా

          చప్పుడు చేయకన్!ప్రజల చేదగు రీతుల దీర్చి!చేసెడిన్

          యప్పుల ముప్పు లుప్ప తిలు!యాంత్రిక శక్తిని పెంచ మానినన్!

          చిప్పయె దక్కు!భావితర శ్రేయము మాయును!భారతాంబికా!


75.ఉ:-ఎవ్వరి కోర్కె పైని"రవి"-యింపగు తేజము నింపు భూతలిన్!

           ఎవ్వరి కోరికన్!మొయిలు-యిచ్చును తీయని వాన జల్లులన్!

           ఎవ్వరి కోరికన్!జగతి కెల్లను తిండి యొసంగు!కర్షకుం

           డెవ్వరి? లోభ ధృష్టి!పడి!హీనత నొందెను!భారతాంబికా!


76.ఉ;-అర్థము జూడ లేదు!పరమార్థము కోసిన కానరాదు! ని

          స్వార్థము నెంచగా గనదు!సామ్యము చచ్చిన రాదు రాదు! బా

          ధార్థ విమోహ చింతనమె?ధాత్రి శుభాశ్రిత జీవితార్థమై!

           వ్యర్థత గూర్చు చుండ!భువి భగ్గున మండదె?భారతాంబికా!


77.ఉ:-వేనకు వేలు రూప్యములు!వెఱ్ఱిగ జల్లుచు!"ఓట్లు"-పొందు స

            మ్మానిత శ్రీ లవెంచగ!నమాయకులే?సుగుణాభి రాములే?

             దీనుల శోభ జేకురునె?తీతురు గోతులు!ముంతు రప్పులన్!

             దానిని తెల్స కో గలుగు తత్వము!గూర్పవె!భారతాంబికా!


78.ఉ:-కర్షక వృత్తిచే!తనదు కష్టము నిష్ట మెయిం దలర్చుచున్!

           హర్షము గల్గ పంటలను!హాయిని గూర్చి!చరించి  దేశమం

          దార్ష! మహా మనీషిగను!దైవము నెంచుచు!భక్తి భావ నో

          త్కర్షము గల్గి చొప్పడిన!ధర్మము నిల్వదె?భారతాంబికా!


79.ఉ:-కోతులు బట్టి యాడుచును!కోవిదులం దునుమాడు సంస్కృతిన్!

           చేతయు గాని కూతలను!జీర్ణ వచానృత పాడు సంస్కృతిన్!

           పోతరిలన్!దిగంతముల!పూజ్యుల మాదిరి మెచ్చు మెప్పులన్!

          నీతిగ మెచ్చు నాయకుల!నీటను ముంచవె!భారతాంబికా!


80.ఉ:- స్వార్థము లేని నాయకులు!జాతి సమైక్యము గోరు వారలున్!

            అర్థ విమోహ లంపటులు!ఆర్జన హీనులు! బీదవారలున్!

            వ్యర్థులుగా జరించిరని! వర్ణన జేసెడి!నేటి యేలికల్

            వ్యర్థులు!శాస్త్రి పాలనకు!సాటియె!దెల్పవె!భారతాంబికా!


81.ఉ:-సంతతి పెంపు నందు మనజాతిని మించిన జాతి లేదిలన్!

          పంతము నందు జూడ మన పంతము శాంతత జెల్ల నేరునే?

          గొంతెమ కోరిక ల్గనగ!కొండలు గావలె!నండ దండగా!

          చింతన మాట!యొక్కటగు!క్షేమము!కల్లరొ?భారతాంబికా!


82.ఉ;-బానిస జీవమందు!పలు వర్షము లుండియు!బాని సత్వమే!

           మానవ జీవనంబనగ!మంత్రిత మాయెను!మార్పు రాదు! సం

          ధాన,,మధర్మ ధర్మముల!ధర్మమె పెచ్చగు!మంచి యొప్పగా!

         కానన మందు వెన్నెలయు!గాదొకొ?నెంచగ!భారతాంబికా!


83.ఉ:-తల్లిరొ?నీదు శీర్షమును!తప్పగ ధృంచియు!పుస్తె లాగి! తా

           మెల్లను!పాశ్చ్య దేశముల మెల్లగ చాటున కోట్లు దాచుచున్!

          కల్లల మాయ మాటలను!కాలును లాగి విషాసి కోతలన్!

         తృళ్ళగ జేయు నాయకుల ద్రోహ మడంచవె?భారతాంబికా!


84.ఉ:-దొంగలు నీతి హీనులను తుంటరి తత్వ పయోముఖాభిదుల్

           భంగము లేని దుర్మదులు!వర్జిత లజ్జులు దీర్ఘ  సంకటుల్!

           యెంగిలి పొట్ట నింపుకొను!వెంగళి మూకల!షండ తత్వులున్!

           బంగరు తల్లి!నీమహిమ!పాడొన రించిరి!భారతాంబికా!


85.ఉ:-దేశము తీరు తానెరిగి!తెల్విగ భావి సుఖంబు నెంచుచున్!

          పాశ విమోహ లంపట!విభాసిత!రీతి సు దూర గామియై!

          గాసిల నేర్చు కోట్లు గల!కల్మి జనాళిని కొట్టి బీదకున్!

           భాసిత కీర్తి పంచగల!పాలకు లేరిల?భారతాంబికా!


86.ఉ;-సాలిడు!భార్యపై యలిగి!చక్కటి మగ్గము పై బడె న్యనన్?

           తేలిక కూతలం దెలివి తేటల!మథ్యమ వర్గ నాశమున్!

          ఫాలము నందు కన్నగల భర్గుడు జూచి!సహింప నోపునే?

         ఏలిక  నీతి దూర మతి!నేర్పున మాపవె?భారతాంబికా!


87.ఉ:-నేతల రాతి మానసము!నీతి సు దూరము!స్వార్థపూర్ణమున్!

          చేతన దోష స్వేచ్ఛ.!కుల శ్రేయ సరాగము!దుర్మ దాంధమున్!

           కూతల గార్ధభ స్ఫురణ!కొంపలు గూల్చెడిదుష్ట చింతయున్!

           కాతర లేని వీరలను!కట్టడి సేయవె?భారతాంబికా!


88.ఉ:-సృష్టి రహస్యము న్గనెడి!చింతన మెంచగ గొప్పదే?యగున్!

           స్రష్టను మించు స్రష్ట లయి!సర్వ మెరుంగుచు సృష్టి జేయుచో?

           స్రష్టయు పెచ్చు మెచ్చి నరజాతికి ముక్తినిచ్చునొ?మానునో?

           సృష్టి రహస్య ఛేదనము!క్షేమమొ?క్షామమొ?భారతాంబికా!     


89.చం;-గతముకు స్వస్థి జెప్పి!నిజ కర్మము దప్పక!పెచ్చు మేథచే!

             నతులిత కీర్తి కాములయి!హాయిని గూర్చు విశోధితంబు నౌ

            మతి చరియించు!శాస్త్ర పర మార్ధ నిధుల్గన!పూర్ణ దీక్షితుల్!

           నుత మతు లెంచ!నీ పరువు నున్నతి పెంచరె?భారతాంబికా!


90.చం:-పరమ మనీషి మానవుడు!పట్టిన పట్టును వీడక న్సదా!

            స్థిరమగు ప్రజ్ఞ జూపి!నిజ దీక్షను!దూర ధృగాది యంత్రముల్!

           సు రుచిర శ్రావ్య యంత్రములు!శోధిత సేంద్రియ సార జంబులున్!

           తరగని మేథ గూర్చి!నిజ ధర్మము చాటెను!భారతాంబికా!


91.చం:-కనగను శాస్త్ర శోధనము!కల్ములు నింపగ! చంద్ర గోళమున్!

            మనుజుడు చేరి రాగలిగె!మంధుడు కాడు!మహాత్ము డెంచగన్!

           కనుగొనె!శాస్త్ర పద్ధతులు!కర్షక రక్షక!సేంద్రియంబులున్!

           తనదగు రీతి గూర్చి!నిజ ధర్మము చాటెను!భారతాంబికా!


92.ఉ:-వంచన జీవమున్గడుపు!వాల్మికి"-పూర్వము రామ నామమున్!

           మించి జపించి!రామ కధ!మేలగు భంగి రచించె భక్తినిన్!

          సంచిత కీర్తి ధాముడయి!ఆర్యుడు నాధ్యుడు!పూజ్యుడై జనెన్!

          యెంచగ!భక్తి దీక్షలవి! యీయవె?సౌఖ్యము భారతాంబికా!


93.చం:-పరగెను"-భారతంబ"-దియు-పంచమ వేదమనంగ?క్ష్మా తలిన్!

             నిరుపమ నన్నమాది త్రయ-నిర్మిత పర్వ సుపర్వమై జనెన్!

            వరదుడు పోతనార్యు కృతి-భాగవతంబది!కీర్తిదంబు నై!

            విరియగ సాహితీ గరిమ!-పేరును గంటిని!భారతాంబికా!


94.చం:-భరత మునీంద్రు నాట్యమది-భాసుర లీల వసించె నేటికిన్!

            అరయగ కూచిపూడి యను-నంచిత నృత్యము నింపు నింపుచున్!

           వరలగ ప్రాచ్య నృత్యమది-వల్లె యనంగను!నేటి నృత్యముల్!

           నిరుపమ కీర్తి నింపగను-నెమ్మది!మెచ్చవె!భారతాంబికా!


95.చం:-సునిశిత!సూక్ష్మ గ్రాహ్యతను-శుద్ధ మనోజ్ఞత!నిండు కౌండలై!

            మనియెడు!భూ జనాళి కిల-మంచిని గూర్చెడి మాట లెన్నియో?

            తనియగ!బోధనంబు నిడు-ధన్యులు ముందుగ వచ్చి నిల్చుచో?

            మనుజులు పూర్ణ కీర్తులను-మన్నన లొందరె?భారతాంబికా!


96.ఉ:-సత్య మహింస ధర్మములు-చక్కటి పోషణ గూర్చి యొప్పి! తా

          నిత్య ,వసంత శోభల వి నిర్మిత శుద్ధ మనోజ్ఞ  దీపికా!

          రత్యభిమాన!సౌ రుచుల-రమ్య సమంచిత దివ్య రత్న మా

         లాత్యభి రామమై!యెసగ-హాయిని గంటివి!భారతాంబికా!


97.ఉ:-అన్న!యనంగ!మిన్న యను నర్థము నందలరారు నట్టి య

          త్యున్నత భావముం గనక-యూహల నందల మొంద నెంచుచో?

            నున్నది పోవుటే?యగును?ఓర్మియు పేర్మియు నిల్పు కొన్నచో?

           చెన్నగు కీర్తి నొంద దగు-శ్రేయము గల్గును!భారతాంబికా!


98.చం:-నిరుపమ జ్ఞాన దీప్తులను-నిండును గూర్చెడి!జ్ఞాన మూర్తినిన్!

            వరమయి!బ్రహ్మ,విష్ణు శివ-భాసిత కీర్తి శుభాభి రామునిన్!

           "గురుని"-వచింప శక్య మొకొ?కూరిమి మీరెడు!దివ్య నామమున్?

              సరియగు రీతి వాడకయె?-సద్గతి గల్గునె?భారతాంబికా!


99.ఉ:-మాత"-యనంగ తల్లి!నవమాసము బిడ్డను మోసి కన్న, యా

          మాతను"-మాతృ శ్రీ యనుచు! మన్నన జేయుచు!దేవు నామెలో?

          నాతప జ్ఞాన ధృష్టి గని-హర్షము నొంది!సుఖించు వారిలన్!

          మాతృ ఱుణంబు దీర్చెడిని--మాన్యులు గారొకొ?భారతాంబికా!


100.ఉ:-తల్లిని,తండ్రినిన్నెగడు!దైవము లేదిల!వార లెన్నడున్?

             పిల్లల బాగు కోరెదరు!ప్రీతి దలిర్పగ!పెంపు గోరుచున్!

             కల్లయు!కాదు కాదు! నవ కాంతులు నింపెడు నట్టి వారినిన్!

             తల్ల డిలంగ జేయ!కడు తప్పద!గాదొకొ?భారతాంబికా!


101.ఉ:-వల్లభు డెవ్వడో?యనెడు--ప్రశ్నకు నుత్తర మాది బ్రహ్మయై

            యెల్ల?సురా సురోరగ మునీశ్వర యక్ష మనుష్య దక్షులున్!

             ఫుల్ల మనోజ్ఞ భావమున--పూజ్య గజానను నేక దంతునిన్!

            వల్లభు గా!దలంచి!కొలువంగ!శుభంబగు!భారతాంబికా!


102.చం:-వరదుడు!వేంకటాద్రి పతి--వాసి గనెన్?కలికాల మందునన్!

               చరమయ!జీవ రక్షణము--సత్యము గావగ!ధర్మ మూర్తియై!

               భరమగు యీతి బాధలను--ప్రార్థన సేయగ!బాపి!కావగా!

              నిరతము నీతి మ్రొక్కెదను!--నీతిని నింపవె?భారతాంబికా!


103.చం:-మరణ మవారితంబు-- మహిమాన్విత!జీవము!మాన నీయమౌ!

              "జర"-యది రోగ సంభరము--ఛానల లంపట!యవ్వనంబు నౌ!

              బరగును బాల్యముం దెలివి చాలక!బా ల్యవివేక చేష్టలన్!

              సరయగ నీశ్వరుం గొలుతు--సాదర బుద్ధిని !భారతాంబికా!


104.ఉ:-ధర్మము నొంటి పాదమును--దా జన!నీకలి కాలమందు! స

            ద్ధర్మము నిల్ప మృగ్యమగు--తత్పరమాత్ముని దీక్ష గల్గు చో?

           కర్మము సత్ఫలంబిడును--కాచును!దైవము వేంక టేశుడున్!

            నిర్మల చిత్తముం గుదురు--నీతియు నిండును!భారతాంబికా!


105.ఉ:-జీవము నిచ్చు తల్లియును--జీవిత మేర్పడ దీర్చు!తండ్రియున్!

             పావన భక్తి భావమున --పట్టగు సోదర సోదరీ మణిన్!

              జీవన భాగ దేయ యగు--శ్రీమతి!భార్యను పుత్ర సంతతిన్!

             శ్రీవరదుండు గావగను--చింతన జేసెదు!భారతాంబికా!


106.ఉ:-రాజులు రాజ రాజులు!విరాజిత!రాజ్య రమా విభూషితుల్!

             రాజులు,ముక్తి  గోరు దినరాజ సువంశ జ!రాజ భూషణుల్!

             రాజిల!రాజ రాజు వలె?రక్షణ నిచ్చెడి! రాజు లేరిలన్?

              రాజన?రామ చంద్రుడని?రక్తి వచింపవె?భారతాంబికా!


107.ఉ:-కామ మనోవికార మమకార సరూప విచార సంగతా

           రామ విరామ జీవన సరాగ!రసోత్పల వాంఛితార్ధ, సం

           క్షేమ!హృదంతరంగ!పరకీయ!మహేంద్ర సమంచితా కృతా

           ధామ విరాజి తాకరము!ధామము ముక్తికి!భారతాంబికా!


108.చం:-శతకము పూర్తి జేయదగు!శక్తియు,యుక్తియు,భావనంబునున్!

              స్తుతుమతి!భారతీ సతియు!చొప్పొనరంగ!పదాళి పొందికన్!

             గత చరితార్ధ ధీనిథులు!--కైవల దాయులు!నన్నయాదులన్

             సతతము నెంచు మత్కృతిని!--సర్వద!కీర్తిడు!భారతాంబికా!  



                        మంగళా శాసనమ్,

                      =============


ఉ:-మంగమ నాయకుం డిలను!మంగళము ల్గలిగించి!కావుతన్!

     జంగమ మల్లి కార్జునుడు!సత్కృప సర్వద శాంత మేర్చుతన్!

     రంగ విభుం డభంగముగ!రంజిల మర్త్యుల తీర్చి బ్రోవుతన్!

      మంగశ దాయినీ జనని!మామక మేర్చుత!భారతాంబికా!


                       ఓమ్,తత్సత్,

               శ్రీ పరబ్రహ్మా ర్పణ మస్తు,

            ఓమ్!శాంతిః శాంతిః శాంతిః


గద్యము


       ఇది శ్రీమదుభయ భాషా భూషణ!విద్వద్వరేణ్య!వేంకట్రాయ శాస్త్రి వరేణ్య

ప్ర పౌత్ర, సారస్వత కృపా పాత్ర,కాశ్యపస గోత్ర పవిత్ర!వల్లభ వఝల సంజ్ఞా

పయః పారావార!రాకా సుథాకర!నరసింహ వరేణ్య పౌత్రః! శ్రీరామ మూర్తి

నారాయణాంబ!గర్భ శుక్తిః!ముక్తా ఫలాయ మాన,సోదర,సోదరీ సమన్విత

సుధీ విధేయ!అప్పల నరసింహ మూర్తి శర్మ నామ ధేయ,--విరచిత

శ్రీ భారతాంబికా శతకమ్,సమాప్తమ్,


                             మంగళమ్ మహాత్

                                 శ్రీ శ్రీ శ్రీ,శ్రీ,శ్రీ,

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.