గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, సెప్టెంబర్ 2026, సోమవారం

బ్రహ్మశ్రీ మరుమాముల వేంకట రమణ (దర్శనం) శర్మకు అభినందన పంచ రత్నావళి. రచన .. సమర్పణ .. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.

శ్రీరస్తు  ..  శుభమస్తు ..  అవిఘ్నమస్తు.

హీదూ ధర్మరక్షాకంకణధారియైన అపర భార్గవమూర్తి

బ్రహ్మశ్రీ మరుమాముల వేంకట రమణ (దర్శనం) శర్మకు 

అభినందన పంచ రత్నావళి. 

రచన  ..  సమర్పణ ..  చింతా రామకృష్ణారావు.


శా.  శ్రీమన్మంగళ హైందవప్రభలతోఁ జెల్వొందు దేశంబిలన్

శ్రీమన్మంజుల భారతావనియె, సుశ్రీలన్ బ్రసాదించు నీ

శ్రీమంతంబగు దేశమాత సుతుఁడౌ శ్రీమంతుఁడౌ శర్మకున్

శ్రీమన్మంగళ వేంకటేశుఁడు లసచ్చిచ్ఛక్తి నే గొల్పుతన్.


ఉ.  హైందవ ధర్మ తేజము మహత్తరమై భువిపైననంతటన్

సుందరమైన శోభలను శోభిలఁ జేయ ననారతంబు నా

నందముతోడ సత్కృషి ననంతమహాద్భుత శక్తియుక్తులన్

గందక చేయునట్టి గుణగణ్యుని శర్మను దెల్ప శక్యమే?


ఉ.  దర్శనశర్మ సోదరుఁడు ధర్మనిబద్ధ సుదర్శనంబు నా

దర్శనమంచుఁ గైకొని ముదంబున పుత్రికవోలె పత్రికన్

దర్శనమున్ రచించుచు సుధారసధారల హైందవప్రభన్

స్పర్శనఁ జేయ నంటునటు పాఠకపాళికినందఁ జేయునే.


ఉ.  కర్షకులైన కొంతవడి కన్నులుమూయుచు విశ్రమింతు, రా

కర్షణ గల్గు శర్మ గుణగణ్యుల ధర్మనిబద్ధమూర్తులన్

గర్షణ చేసి ధార్మికులుగా వెలుగొందఁగఁ జేయ నిత్యమున్

ఘర్షణ చిత్తుఁడై నిదుర కానడదెంతటి ధర్మదీక్షయో!


సప్తవింశత్యధిక ద్వివిధకంద, తేటగీతి గర్భ చంపకమాల.

తన ఘృణియై మనన్ ధరణి దర్శన శర్మకు దారిఁజూపురా,

దిన మణియే కృపన్, వరల ధీరనయోజ్వల భాసమిచ్చురా, 

ఘన గుణధీ ప్రభన్ వెలుఁగఁగా ప్రణవంబుగఁ బ్రేమఁ గొల్పురా,

మను గణనన్ సదా మహిని మార్గణ భార్గవ! మంగళంబురా! 

(మార్గణము = బాణము)

మంగళమ్  ..  మహత్  ..  శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ

జైహింద్. 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.