రేనాటి సూరీడు...ద్వితీయాశ్వాసము.
క. శ్రీమల్లక్ష్మీ సహితుఁడ!
శ్రీమన్నరసింహదేవ! చిత్తమునందున్
బ్రేమన్ గొలిచెద నిన్నున్,
ధీమంతులనిలను గాచి తేజమునిమ్మా! 1.
నరసింహారెడ్డి యౌవనము.
ఉ. మూతిని నూగు మీసములు పూర్తిగ మారుచు కోరమీస వి
ఖ్యాతిని పొంది యవ్వనము గణ్యముగా పొడసూపఁజొచ్చె నా
నీతికి మారుపేరయిన నిర్మలుఁడౌ నరసింహరెడ్డికిన్,
భ్రాతిని గొల్పు కాంతి తనరారగ కన్యల కాశఁ గొల్పుచున్. 2.
ఉ. పౌరుషమే స్వరూపముగ ప్రస్ఫుటమైన స్వదేశభక్తుఁడై,
స్వారికి నశ్వమెక్కి విలసన్నుత వేగముతోడ నశ్వమున్
ధీరతఁ జూపుచున్ పరుగు తీయగఁ జేయు కుశాగ్రబుద్ధి యీ
వీరుఁడు నారసింహుఁ డరివీరభయంకరుఁడై వెలింగెనే. 3.
ఉ. ఖడ్గము చేతఁ గల్గెడు నగణ్య మహాద్భుత యోధుఁడైన స
మ్రాడ్గణనీయుఁ డీతఁడు, ధరన్ రిపుసంహతిపై చెలంగెనా
యీడ్గిలి పారు శత్రువు లహీనపరాక్రముఁడౌ నృసింహుఁడే
యేడ్గడయౌచు పేదలు గణించెడి తీరున నేలు రాజ్యమున్. 4.
ఉ. ఈతని పౌరుషప్రభకనేకులు సజ్జను లేకమై ధరన్
ఖ్యాతిగ మిత్రభావన నహర్నిశలున్ దరి చేరియుండి ప్ర
ఖ్యాతిగ పాలనంబున నగాధము లేర్పడినప్పుడందరున్
నేతను వీడకుండ ధరణిన్ విహరింతురు వెన్నుదన్నుగాన్. 5.
నరసింహరెడ్డికి సైరానరసింహరెడ్డి పేరు వచ్చిన విధము.
శా. సైరా సైర నృసింహరెడ్డి! యనుచున్, సై యన్న సై యంచు తా
చేరన్ శ్రీనరసింహరెడ్డి కడకున్ జిత్తంబులుప్పొంగగా
పారావారమువోలె పౌరు లతఁడున్ వాత్సల్యమొప్పార, సు
స్మేరాంభోజ ముఖుండునై వెలుగు నా స్నిగ్ధస్వభావంబుతోన్. 6.
క. ఈ రీతి నొప్పుచుండఁగ
సైరిక, సైనిక సులభుఁడు, సైరానరసిం
హారెడ్డి పేరఁ బ్రబలెను,
వీరుఁడు నరసింహరెడ్డి విశ్వమునందున్. 7.
వసంత ఋతువు..ఉద్యానవన శోభ.
చ. కరువున కాటకంబున ప్రకాశము రాయలసీమ కోల్పడన్,
బరమ పవిత్ర భావమున భక్తిగ నందరు దేవదేవునిన్
నిరుపమ రీతిఁ గొల్వ, కరుణించెను మేఘుఁడు చల్లబర్చె, భూ
పరిమళముల్ రహింప నొకవానను తా కురిసెన్ ఘనంబుగాన్. 8.
ఉ. సృష్టియె వింత చూడగ, ప్రసిద్ధ మహాద్భుత శోభలొల్కు న
క్లిష్ట వసంతశోభ "తొలగించఁగ వచ్చె నవారితంపు సం
క్లిష్టపరిస్థితుల్ ప్రకృతికిన్, శుభసంహతినందఁజేసి, సం
తుష్టిని జీవకోటికిడ, దుర్జనసంహతి నాహరింపఁగన్".
(అక్లిష్ట = తక్కువకాని, సులభమైన) 9.
చ. విరిసినపూలతో కనుల విందుగనొప్పు వనాళిఁ జూడఁగాఁ
బరుగున పిల్లవాయువులు వచ్చుచు వీచుచునుండె చల్లగా,
తరువులు పొంగిపోవుచు ముదంబున పల్లవపాణులూపుచున్
ధరణికి ధన్యవాదములు తప్పక చెప్పుడటంచుఁ దెల్పెడిన్. 10.
చ. విరిసిన గున్నమామిడులు పృథ్విని శోభిలుచుండఁ జూచి, సుం
దర వనశోభకున్ మురిసి, దర్పిలి కూయఁగ కోయిలల్, మనో
హరమగు పంచమస్వర మహత్త్వమునెన్నుచు సత్కవీశ్వరుల్
పరవశులై కవిత్వసుధ భక్తిని రక్తిని గూర్పఁ బంచిరే. 11.
నాయికల జలక్రీడ.
చ. సరసుల నిర్మలోదకము సారసనేత్రుల క్రీడనెంచుచున్
గురుతర మోద సంభ్రమము కూర్మిని పంకజపాళినుంచి, సం
బరముగ చూచుచుండగనె, వారిజ నేత్రలు వచ్చి మున్గి, సుం
దరముగ క్రీడలన్ సలిపి తాము గృహంబులకేగి రుద్ధతిన్. 12.
మ. మహితోద్యానవనంబులన్ యువత ప్రేమన్ జేయు సంచారముల్,
మహికిన్ శోభను గూర్చు నీ సరసులన్ లక్ష్యంబుగా కేళికల్
మహిళామూర్తులొనర్చుచుండఁగను గ్రామంబుల్ శుభోద్భాసమై
యహమున్ వీడి సమష్టిభావనలతో నానందమున్ వెల్గెనే. 13.
నరసింహారెడ్డి పెండ్లి.
ఉ. యుక్తవయస్సు వచ్చుటననూహ్యముగా తన పెద్దలందరున్
రక్తిని పెండ్లి చేయుటకు శ్రద్ధవహించి యొనర్చినారు, చి
చ్ఛక్తిని నొప్పు సిద్ధమను సన్నుతరీతి వివాహమాడె తాన్,
దిక్తటి మారుమ్రోగె నినదించెడి వాద్యపుఘోష నత్తరిన్. 14.
ఉ. రాజ్యమునందునంతట విరాజిలు పచ్చని తోరణమ్ములే,
భోజ్యపదార్థముల్ మనసు పూర్తిగ తృప్తి నొసంగె పెండ్లిలో
నాజ్యమనోజ్ఞపూర్ణములనంతసువాసననొప్పె నత్తరిన్
రాజ్యమునందు సంతసము రాజిలఁ, బొంగిరి పేదసాదలున్. 15.
సూర్యాస్తమయము - చంద్రోదయము.
పద్మనాభ వృత్తము.( త త త త త త త గగ. యతి 13.)
ఉయ్యాలవాడన్ మహోత్సాహమున్ గాంచి యుత్సాహమే వీగి యా పశ్చమాద్రిన్
జయ్యన్ బ్రవేశించె సూర్యుండు, శత్రుల్ మనన్ సత్వమున్ వీడు చందంబుతోడన్,
వయ్యారమున్ వెల్గు పూర్ణేందు డవ్వేళ భవ్యంబుగా వచ్చె నైంద్రిన్, భళారే,
యుయ్యాలవారింట నుయ్యాల లూగంగ నుత్సాహియై చేసి శోభింపఁ జేయన్. 16.
చ. వలిపపు చీరఁ గట్టి శిఖ భాసిలఁ బూవులు పెట్టుకొన్న, ని
స్తుల సుగుణాల సిద్ధమను చూచి రమించి సుఖించె నా నృసిం
హుఁ డనుపమంబుగా, మదు లహో పులకింపగ నిద్దరొక్కటై
వలపులపంట పండునని భావనలందున తేలియాడిరే. (ల - డ .. అభేదప్రాస ) 17.
ఉ. రాజు లనేక భార్యలను రాజిలు ధర్మము నాశ్రయించి, వి
భ్రాజిత మూర్తియౌ నృహరి భార్యగ పేరమనే ద్వితీయగా
రాజిత సాధ్వి యోబులమ రాజిలునట్లు తృతీయ భార్యగా
మోజునఁ బెండ్లి చేసికొనె పూర్ణ మనంబులఁ బొంగ నందరున్. 18.
నరసింహారెడ్డి దంపతులకు పుత్రోదయము.
క. నరసింహరెడ్డికిని మరి
వర సిద్ధమకును గలిగె శుభప్రదు డిల స
ద్వర సుబ్బయ ప్రతిభుం డా
తరమున సత్కీర్తిఁ గొలుప ధర్మము నిలుపన్. 19.
గీ. నారసింహ పేరమల కపారమయిన
సంతసము గొల్పు బాలిక జననమయ్యె,
నోబులమ్మకునతనికి నొప్పిదముగ
సుతులిరువురు పుట్టిరి ధాత్రి నతులితముగ. 20.
రాయలసీమలో కొండలు కోనలు.
ఉ. రాయలసీమలోన తనరారెడి కొండలు గుట్టలెన్నియో,
లోయ లరణ్యముల్, మదులలో పులకింతలు కొల్పు శ్రావ్యమౌ
కోయిల గానముల్, ప్రజలకున్ వరమైన యమోఘ వృక్షముల్,
కోయని యన్నచోఁ బ్రతిగ కోయని పల్కుమహాద్రులుండెనే. 21.
గీ. తొలుత కర్నూలు జిల్లాను తూర్పు వైపు
వినుత శ్రీశైలము మొదలు ఘన తిరుమల
వరకు నుత్తర దక్షిణ ప్రాంతములను
వరలు నల్లమలాటవుల్, ప్రస్ఫుటముగ. 22.
గీ. నుతిగ ద్రోణాచలము నుండి నొస్సము వర
కుఁ గల తూర్పు పడమరలకుఁ గల కుధర
మెర్రమలలుగా కలవిల, నెన్నిచూడ,
వినుత కర్నూలు పట్టణ ఘనత యిద్ది. 23.
క. నల్లమల యడవు లిట రా
జిల్లెడు కొండలను గలిగి చెలఁగుచు, ప్రకృతిన్
జల్లని గాలుల నొప్పుచు
నుల్లము రంజిల్లఁ జేయు నోహో యనగన్. 24.
నల్లమల కొండల్లోని పేరుసోమల వద్ద గల జగన్నాథాలయం.
గీ. అల్ల నట నల్లమల కొండలందు పేరు
సోమల దరి జగన్నాథ ధామముండె,
చేరు భక్తుల కొంగు బంగారమతఁడు,
నరసరెడ్డి కీ ప్రాంతంబె నిరుపమ గతి. 25.
మజ్జారి నరసింహారెడ్డిస్వప్నవృత్తాంతము. జగన్నాథదేవాలయము.
ఉ. ఆలయమందునున్న పరమాత్ముఁడు స్వప్నమునందు రెడ్డినే
బేలగ కోరె నాలయము ప్రీతిగ నిచ్చటఁ గట్టమంచు, నా
వేళఁ దలంచె దైవ మిట వెల్గిన భక్తులకండయంచు పు
ణ్యాలఫలంబు రెడ్డి, మహితాలయమచ్చట కట్టె నిమ్ముగన్. 26.
కార్తికపౌర్ణమికి జగన్నాథ గుట్టపై అఖండ దీపారాధన.
గీ. వినుతమజ్జారివంశజ ఘనుడు రెడ్డి
విమల కార్తిక పౌర్ణమి వేళలందు
వాదు తప్పక ప్రతి యేట మేదురముగ
దేవదేవునికిన్ బెట్టు దీపమొకటి. 27.
శా. తద్దీపంబది గ్రామ గ్రామములకున్ దర్శింపగాఁ గన్బడున్,
శ్రద్ధన్ గాంచి నమస్కరింతురు జనుల్ సంతోషమొప్పారఁగా
నిద్ధాత్రిన్ శుభసంహతిన్ గొలుప నా యీశుండె యాకొండపై
నిద్దీపంబుగ వెల్గుచున్ గనఁబడున్ హృద్యంబుగా నొప్పుచున్. 28.
ఉ. వింతగ దేవతాకృతిని వెన్నెల వోలె వెలుంగు దీపమున్
జెంతను గల్గు గ్రామముల నిర్మలభక్తులు గాంచువారు, లే
దింతటి తేజమెన్నగ గణింపును గాంచిన వెన్నెలమ్మకున్,
గొంతయినన్ లభించె నిటు క్షోణిని పుణ్యఫలంబు భాగ్యమై. 29.
ఉ. కార్తిక పౌర్ణమిప్రభలు కావవి శ్రీ జగదీశు కోవెలన్
స్మార్తులు మంత్రముల్ చదువ చక్కఁగ శ్రీనరసింహరెడ్డి, సత్
స్ఫూర్తిని పెట్టినట్టిదగు శోభిలుచున్న యఖండదీపమౌ,
నార్తినొసంగుటిద్ది పరమాత్మకునంచు జనంబు పల్కెడున్. 30.
క. పూరీ కేగెడి ప్రజ లీ - దారిని వెడలుచును తాము తప్పక భక్తిన్
గోరి జగన్నాథుని గని - తీరికగా వెడలుచుంద్రు దేవుని కడకున్. 31.
గోపురబంధ భావగోపన చిత్ర కందము.
గోపిత భావము ... మధ్య వరుసలో నిలువుగా ... శ్రీధరుఁడ! కనుమా.
గోపురబంధ భావగోపన చిత్ర కందము.
శ్రీతో ధరపై నిరుపమ! - ఖ్యాతిన్ నడయాడుమయ! సుగతి, కవితలలో,
నాతపము కనుమయ కృపను - భ్రాతిన్ వేడుచు క్షమాపరా! నినుఁ గొల్తున్. 32.
గీ. సుకవివరులిట్లు ప్రార్థించి చూతురచట
గోపురమువైపు నందులో కూర్మినున్న
శ్రీజగన్నాథ దేవునిన్ జిత్రగతిని
శ్రీధరుఁడకనుమా! యని చెలఁగి పలుకు. 33.
అనేకులనేకవిధములుగ దైవప్రార్థన చేయుట.
1కందద్వయ - 2నీలోత్పలమాలా - 3మణిగణనికర గర్భ
సరసిజవృత్తము. (మ త య న న న న స. యతి 1 - 10 - 18)
శ్రీ మద్దైవా రాధన ప్రేమన్, శ్రిత సుగుణమణులు ప్రియ జయ కరులై
శ్రీమంతుల్ గావింతురు సీమన్, జితమనసిజులయి క్షితి వెలుగుదురే,
నేమంబున్ రక్షించుత నేమిన్, నితలము చొరక యనృతమున కెడగా
భూమీశుల్ పాలించెడు భూమిన్, బుతబుతలు విడి చవులు గొలుప ధరన్. (బుతబుత=వెలవెల పాటు) 34.
జగన్నాథుని గుట్ట సమీపముననున్న పాలకుంట నెత్తుటికుంట.
మ. గుడికిన్ వెన్కనె పాలకుంట, యచటన్ గోక్షీర భాండంబులన్
గడుగన్, దాహము తీరఁ ద్రాగుటకనంగా నీరమొప్పారుచున్,
బొడమన్ జేయును శక్తి ప్రాణితతికిన్, బొల్పున్ బ్రసాదించుచున్,
జడమున్ బాపుచుఁ బ్రేరణంబుఁ గొలుపున్, సంస్కారమున్ గొల్పుచున్. 35.
ఉ. నెత్తుటికుంట యున్న దటనే గుడిముందట, నెత్తురొల్కు పె
న్గత్తుల నచ్చటన్ గడిగి క్రాలుటచేనది యెర్రబారె, ను
న్మత్తులు తప్ప యీ జలముఁ ద్రాగరటన్యులు, రక్తసిక్తమై
నెత్తురువోలె నుండుట గణించుచు నెత్తుటిగుంట యందురే. 36.
రాయలసీమలో రాజకీయ పరిస్థితులు.
సీ. పదునేడువంద లేబదిలోన దక్షిణభారతంబున తెల్లవారు కాలు
మోప, నిజాంనవాబును, హైదరాలీయు బలమైన నాయక వరులటంచు,
హైదరాలీన్ గెల్చి యారాజ్యమును పొంద పలుమార్లు దండెత్త పారఁద్రోలె
హైదరాలీసుతుండగు టిప్పుసుల్తాను, పీష్వానిజాములు వెనుకనిలిచి
గీ. సాయమందించ, టిప్పును చంపివేసి
తెల్లవారు రాజ్యమ్మును తీసుకొనుచు,
వారు సుల్తాన్కు, పీష్వాకు పంచి కొంత,
కొంతవారు పాలించుచు కుదిరిరచట. 37.
నిజాం పాలనావిముఖులైన ప్రజల తిరుగుబాటు.
ఉ. సీమ నిజాము పాలగుటచే సహియింపని పాలెగాండ్రు నా
సీమను కల్గినట్టి ప్రజ చిత్తములన్ సహియింప నేరమిన్
దా మొకటై నవాబుల మదంబునడంపఁగఁ బూని, వార లా
సీమ నవాబు మిత్రులు నశింపఁగఁ జంపుచునుండి రత్తరిన్. 38.
ఉ. భారత జాతి గౌరవము, భద్రత, ముఖ్యముగాఁ దలంచి యీ
భారత మాత సంతతి ప్రభాకరతేజముతోఁ జెలంగి, సు
స్మేరముఖాంబుజుల్ సెగలు చిందు భయావహనేత్రులౌచు సం
చార దురాత్ములైన యరి సంఘములన్ బరిమార్చఁ జొచ్చిరే. 39.
చ. నిరుపమ సాహసాన్వితులు, నిర్భర భీకర పౌరుషాగ్నులై
కరములఁ బట్టినట్టి చురకత్తులతో నట సీమలోన సం
చరిలు నసీడుజంగును, ముజాఫరుజంగును బట్టి, కొట్టి, భీ
కరముగఁ గత్తులన్ బొడిచి కాష్ఠము పాలొనరించి రుద్ధతిన్. 40.
ఉ. ధూర్త నవాబువారలను దున్మిరి సీమనటంచుఁ బ్రాకు నీ
వార్తను నాలకించిన నవాబు భయంబునఁ గంపమంది, సం
హర్తలు పాలెగాండ్రె, పరిహారము చేయఁగలేనటంచు తా
నార్తినిఁ బొందె రోయుచు, ననంతర కార్యవిమూఢచిత్తుఁడై. 41.
1802లో నవాబుల పాలననుండు రాయలసీమ ఆంగ్లేయులకు దత్తమగుట.
చ. వినిరి నిజాము పాలకుఁడు పృథ్వి నెదుర్కొనుచున్న దుస్స్థితిన్,
క్షణమున నాంగ్లపాలకు లగణ్య బలాన్విత సైన్యశక్తితోఁ
బనిగొని యుద్ధమున్ సలిపి, వారిని యోడఁగఁ జేయ, రాజ్యమున్
గొనుఁడని వారికిచ్చి, రది కోల్పడి క్రుంగుచు మానసంబులన్. 42.
ఉ. పాలన చేయుచుండెడి నవాబులు రాయలసీమ రాజ్యమున్
కూళల కాంగ్లపాలకులకున్ రణమందున నోడి యిచ్చి రా
పాలిత దత్తమండలిని వర్ధిలుచుండెడి పాలెగాళు లాం
దోళన నొందఁ జొచ్చిరిల దుర్భర దుస్స్థితి నూహచేయుచున్. 43.
పాలెగాళ్ళ వ్యవస్తపై తెల్లదొరల పెత్తనము.
సీ. పాలెగాళ్ళహరువు పద్దెందివందల ముప్పదియారులో పుంజుకొనెను,
విజయనగరరాజవీరు లీ పద్ధతిన్ వెలయంగఁ జేసిరి ప్రీతితోడ,
నెనుబదిమంది యిట్లెలమిని పాలెగాండ్రుండిరానాటికి నొప్పిదముగ,
పాలన చే జిక్క పద్దెమ్దివందల తొంబది తొమ్దిలో దొరగ మన్రొ
గీ. పాలెగాండ్ర వ్యవస్థను పాతిపెట్టి,
వీరి కికపైన భృతినిచ్చు వీలు కొలుపె,
స్వేచ్ఛఁ గోల్పోయి సామంత వీరులెల్ల,
భాధపడుచును క్రుంగిరి భవితనెన్ని. 44.
సీ. భరణ మా యుయ్యాలవాడకు పాలెగాఁడైన మల్లన్నకు నాంగ్లవిభులు
డెబ్బది రూప్యముల్ నిబ్బరంబుగ నీయ, నందు సగము సొమ్ము లతని తమ్ము
నకు పంచగా, నింక నొక ముప్పదైదె తా సకలమ్మునకు ఖర్చు సలుప మిగులు,
జాగీరు నుండి తా సరిగ ముప్పదివేల రూపాయలను పొందు రోజులందు
గీ. ముప్పదైదు రూపాయలు పొందు టనిన
బాధ కలిగింప కెటులుండు వారి మదికి?
జీవనము సాగుటెట్టుల? భావి తరము
నకిల నాధారమేదని? వికలుఁడాయె. 45.
మ.కో. పిక్కపాలెము పాలెగాఁడగు విజ్ఞుఁడౌ జయరామిరె
డ్డొక్క మన్మఁడు నారసింహుఁడె యుండె నాకిల దత్తుఁడై
మక్కువన్ బరిపాలనంబు సమంచితంబుగఁ జేయువాఁ
డిక్కడంచు ధనంబు నంతయు నిచ్చుచుండెను వానికిన్. 46.
గీ. తాత జయరామిరెడ్డికిన్ ఖ్యాతిగాను
భృతిగ వేయిరూపాయలే ప్రతిగనిచ్చు
చుండి రాంగ్లేయ పాలకుల్ ఖండితముగ
పాలెగాండ్రవ్యవస్థను బాపివైచి. 47.
నరసింహారెడ్డి కోటలనేకము కట్టించుట.
క. జయరామిరెడ్డి తాతయ
ప్రియముగ తన కొసఁగు ధనము విలువను గనుచున్
నయముగ కోటలు పెక్కులు
రయముగ కట్టించె నృహరి రమణీయముగాన్. 48.
గీ. కోటలను గట్టె రూపనగుడిని నొకటి,
గుళ్ళదుర్తిలో మరియును, కూర్మితోడ
గిద్దలూ, రుప్పులూరుల, నొద్దికగను,
మహితుఁడుయ్యాలవాడలోన్ మహిమఁ దనర, 49.
చ. ప్రజలకు కష్టకాలమున బాధలు బాప నృసింహరెడ్డియే
నిజమగు తోడునీడ ధరణిన్, క్షణమైన నుపేక్షచేయఁ డా
నిజము గ్రహించినట్టి ప్రజ నిత్యము వాని మనంబు నెంచుచున్
బ్రజనిత ప్రేమపూర్ణులయి వర్ధిలనెంచిరి వాని నీడలోన్. 50.
అశ్వధాటి. (ప్రాస యతి)(త భ య జ స ర న గ. ప్రాసయతి. 2-9-16.)
ఉయ్యాలవాడ నరసయ్యన్ బ్రజల్ మిగుల నెయ్యంబుతోడఁ గనుచున్,
సయ్యన్న సయ్యనుచు కయ్యంబులందయిన నుయ్యాలతో మెలగుచున్,
కయ్యాలమారులగునయ్యాంగ్లపాలకుల నియ్యాంధ్ర సీమ విడువన్
జయ్యన్ నొనర్చుటకు సయ్యంచు నొక్కటయి కయ్యంబునాడ దిగిరే. 51.
శిస్తు వసూలు చేయుటకు వచ్చిన ఆంగ్లేయుల అరాచకాలు.
క. ఎల్లందొర, సభ్యా దొర,
మళ్ళందొర, నాటరు దొర . మాలిస్ దొరయున్,
బల్లె ప్రజల బాధించిరి
చెల్లింపుడటంచు శిస్తు చేరి యచటికిన్ . 52.
ఆంగ్లేయులు మద్యంమత్తులో చేయుచున్న అకృత్యాలు.
చ. మధువును గ్రోలినట్టులుగ, మద్యము గ్రోలుదు రాంగ్లపాలకుల్,
మదమును చూపుచున్ దురభిమానులు మద్యము త్రాగుచుండి సం
పదలనె యాహరింతురభిమానవిహీనులు మత్తులోననే
వదరుచునుందు రార్యుల నవారిత రీతిని నిందఁ జేయుచున్. 53.
కాంతి వృత్త గర్భ సీసము.
సారపూర్ణంపు పాశ్చాత్య సురన్ గొని వాగుదురే వారు పలువిధముల,
సిగ్గునే వీడి నిశ్చింతగ వర్తిలు - నేతలహో, సిస్తునే గొనంగ
జాలియే వీడి దుశ్చర్యలు చేయుట - తో జనులేమియు తోచకునికి,
చింతలంజిక్కి, నిశ్చేష్టులుగా ధర - నిల్చిరయా! తోడు నీడయగుచు
గీ. నుండు రాజుల నైకత నుండకునికి,
ప్రజల బాధలు చూచినన్ బాధ కలుగు,
కొంతసిస్తునే గొనుడంచు కొందరీయ
నంతసిస్తు నిమ్మని ప్రభు లరతు రయ్యొ. 54.
కలితాంతము(గీతాలంబము) .. (త జ జ వ. యతి 8.)
దుర్వర్తనులాంగ్లు లధోగతినే
గర్వంబునఁ గొల్పుచుఁ గ్రాలునిటన్,
సర్వంబును భారత సంపదయే
పర్వంబుగ దోతు రవస్థ యిదే. 55.
పేదరికపు దురవస్థలో ఉన్న రాయలసీమ .
సీ. అలనాటి పేద రాయలసీమ దురవస్థఁ గాంచినన్ బ్రహ్మయుఁ గలతఁ జెందు,
వర్షముల్ లేక యే పంటయున్ బండని దక్షిణ భారత ధాత్రి యిద్ది,
కొండలున్ కోనలున్ మెండుగానుండుటన్ బంటలిచ్చెడి భూములుంట యరుదు,
వర్షముల్ పడిననే పారుచుండెడి నదుల్, కర్షకాళికెపుడుఁ గఱవె చూడ
గీ. నెఱ్ఱకొండల వరుసలున్, చుఱ్ఱు మనెడి
యెండలున్, నల్లరేగడి పండనట్టి
భూమియున్ గల్గు, సంపదల్ పూజ్యమచట,
బ్రతుకు భారంబుగాఁ దోచు ప్రాంతమిద్ది. 56.
ఆ.వె. పచ్చదనము లేని వ్యవసాయ భూములు,
వసుధ కనుల నీటి వాగు రైతు,
బీడు భూములందు మోడులైనను లేక
పాడి తక్కు విచ్చు పసరము లయొ! 57.
గీ. వర్షములు లేక బీడైన పంట భూమి,
తినుటకాధారమే లేక మనెడి వారు,
జీవితమె భారమైనను చేవఁగలిగి
పౌరుషముతోఁడ బ్రతికెడి వారె వారు. 58.
చ. కరువులు కాటకమ్ములును, కాల్చుచునుండ జనాళి గుండెలన్,
వెరపును కల్గఁజేయుచు ప్రవేశము చేసిరనేక దాష్టికుల్
బిరబిర సీమపేటలకు, వేగమె పన్నును కట్టమంచు, ము
ష్కరుల దురాగతంబుల నసాధ్య మెదుర్కొనఁ బేదవారికిన్. 59.
ఉ. పన్నులు కట్టలేమనెడి వారికిఁ జేతులు కాళ్ళు కట్టుచున్
దన్నుచు కాళ్ళతో, మరియు దండములన్ దెగ బాదుచుండి, వి
చ్ఛిన్నశరీరభాగములఁ జిందెడి రక్తముపైన కారమున్
గ్రన్నన జల్లుచుండ, కొరగాముల నోర్వక చచ్చిరెందరో. 60.
ఉ. పండిన పంటలన్ గొనుచు వద్దని వారినెదుర్చునందరిన్
బండికిఁ గట్టి యీడ్చుకొని పట్టణముల్ గొనిపోయి యచ్చటన్
దండన వేసి, బాధలను దండిగపెట్టుచు నవ్వుచుండి రా
దండు దురాగతంబుల నెదన్ దలపోసిన బాధ కల్గెడున్. 61.
శా. స్త్రీలన్ బట్టి వివేకహీనులగుచున్ జేలంబులన్ విప్పుచున్,
జాలిన్ వీడి శరీరభాగములపైనన్ జేతులన్ వేయుచున్,
వేళాకోళము చేయుచున్, గనులతో వీక్షించుచున్ దౌష్ట్యముల్
బేలల్ దుఃఖములంద తెల్లదొరలే భీతిన్ గనన్ జేసిరే. 62.
ఆటవెలది త్రయ గర్భ సీసము.
పతుల కనులముందె పత్నులన్ జెరఁబట్టి సిస్తునీయకునికి చెరచుచుంద్రు,
ధరణి పయిని కొంగు పఱపంగఁ జేయుచు వాటిపైన నడచి వదరుచుంద్రు,
శిశువులకును పాలు చెంగుచాటుననీయ, పట్టివిడగఁ జేసి పరవశింతు
రెదురు తిరుగుచుండ నెంతవారినిగాని కుళ్ళగొట్టుచునుంద్రు తెల్లవారు,
ఆ. ఆడువారితోడ నాటాడు దుష్టులౌ
తెల్లవారినణచి, యెల్లరకును
రక్షణమును గొలుప ప్రభవించు దైవమం
చతివలెదురుచూచిరాతురతను. 63.
నరసింహారెడ్డి మనసు చలించిపోవుట.
ఉ. శిస్తు వసూలు పేరున హసించుచు నాంగ్లదురాత్మకుల్ ప్రజన్
బస్తులు కొల్పుచున్ గొనుచు పంటలనన్నిటినొక్కమారుగా,
హస్తగతంపుపంటలనహంకృతితో గొనుచున్న వారికిన్
శాస్తి యొనర్పనెంచె గుణసన్నుతుఁడౌ నరసింహరెడ్డియే. 64.
ఉ. పంటపొలంబు రైతులది, పంటను పండఁగఁ జేయు రైతులే,
కంటికి రెప్పయట్టులనె కాంచుచునుందురు పంటభూమి తా
మొంటి సుఖంబు కానరు, మహోన్నత సద్గుణ శీలు రెన్నగా,
మంటిని నమ్ము కర్షకు లమాయకులౌటను మోసగింతురా? 65.
శా. దుష్క్రీడన్ దురితాత్ములై చెలగు నా దుర్మార్గులాంగ్లేయులే
దుష్కృత్యంబులు చేయుచుండఁ గని విద్యుద్ఘాతమట్లాతఁడా
నిష్క్రోధాత్ముఁడె నారసింహుఁ డచటన్ భీతిల్ల నా మూర్ఖులౌ
దుష్క్రోధాత్ముల నెంచి, యొంచఁ దొడఁగెన్ దుర్వార ఖడ్గంబుతోన్. 66.
ఉ. ఎవ్వని బాబు సొమ్మనుచు నిట్టుల శిస్తు వసూలు చేయ నీ
కెవ్వరొసంగి రాజ్ఞ? పొల మెవ్వరి దా ఫలసాయ మెన్న నీ
వెవ్వఁడ విట్లుశిస్తుఁగొన? హీనుఁడ! శిస్తు నొసంగ కున్న నీ
వివ్విధి దారుణంబయిన హింసలు పెట్టుదువా? యటంచనెన్. 67.
ఉ. మీరు వసూలు చేసి యది మీకడనే నిలవుంచినట్టి యా
మేరయెలేని శిస్తు నిక మీరు గ్రహింపగలేరటంచు వి
స్తార విశాలనేత్రముల దాగిన కోపదవాగ్నిఁ గాల్చుచున్
దారుణ ఖడ్గమెత్తి గణుతంబుగ శీర్షము త్రుంచె వారికిన్. 68.
ఆడువారివస్త్రమును విప్పుచున్నవాని చేతిని నృసింహరెడ్డి ఖండించుట.
ఉ. ఇంతకు ముందె యొక్కఁ డొక యింతినిఁ జేతను బట్టి లాగ నా
యింతి దురాత్మకుండొకఁడు హేయముగా నను పట్టెఁ, జూచి, మీ
రంతయు రండు వీనికిక నంతిమ కాలము చూపఁగా ననన్,
జెంతనె యున్నరెడ్డతని చేతిని ఖండనఁ జేసె వెంటనే. 69.
ఉ. ఒక్క దురాత్మకుండతివనొక్కతెఁబట్టుచు నామెకుంకుమన్
ఠక్కునఁ జేతితోఁ దుడువ నర్సవిభుండది చూచి, మూర్ఖుఁడా!
యెక్కడివాఁడ వీ విచట నింతటి దుష్కృతి నెట్లు చేసినా
వక్కట! యంచు వాని శిర మక్కడె ఖండనఁ జేసె నత్తరిన్. 70.
ఉ. వారిని గల్గు నొక్కరుఁ డవారిత రీతిని బ్రేలుచుండగాఁ
జేరుచు వానిఁ బట్టి, యొక చెట్టున కట్టుచు కొట్టి కోలతోఁ,
బారఁగ రక్త మత్తరిని బట్టుగ కారము పూసి వానితోఁ
బోర, దురాత్మకుండ! చని పూర్తిగ పాలకులెన్నఁ దెల్పుమా. 71.
చ. అనుచు నృసింహరెడ్డి, తనవారికి ధైర్యము కల్గఁ జేసి, బా
ధను విడనాడఁ జేసి, వినుతంబుగ శిస్తుధనంబునంతయున్
గొనుఁడని వారికిచ్చి, తన కోవెల చెంతకు సాగి ఖడ్గమున్
వినుతిగ చేతితోఁ గడిగె నెత్తురుకుంట నమేయ దీప్తితోన్. 72.
ఉ. ఆవలి వైపు నా గుడికి నాతఁడు చేరుచు పాలకుంటకున్
బోవునటుల్ శ్రమంబు నట పూర్తిగ త్రాగెను నీరు, దైవమున్
భావనఁజేసి దర్శనము బాగుగఁ జేసి, యనంతరంబు తా
రావలె స్వేచ్ఛ దేశ మిలరంజిలగావలెనంచు కోరెనే. 73.
ప్రజలు ఐక్యమై పాలెగాండ్రను ఐక్యముతోనెదిరింపుమని కోరుట.
ఉ. ఓరుపు సన్నగిల్లె, ప్రజ లొక్కటిగా సమకూడి దుష్టులన్
బారఁగఁ జేయఁ బూని, తమ పాలనఁ బూర్వము చేసియున్న స
ద్ధీరులు పాలెగాండ్రనుచు దివ్యముగానెదిరింప రండయా
చీరుదు మయ్య దుష్టులను జీల్చగరండని పిల్చిరత్తరిన్. 74.
మదనసాయక వృత్తము. (న భ న భ న భ ర. యతి 1-7-13.)
ప్రజలలోపల ప్రబలుమంటలు భయమునే తొలగించగా,
సుజనులందరు చురుకుగా మనసులను మార్చిరి యేకమై,
స్వజన రక్షణ వరలఁ జేయగ, పరమ భక్తులు దీక్షతో
నిజముగా ధరణిని రహింపగ నిదుర మాని తపించిరే. 75.
మందాక్రాంత వృత్తము.(మ భ న త త గా. యతి 11)
మాయావర్తుల్ బ్రిటిషుప్రభువుల్ మానవత్వంబె లేన
ట్లే యీనేలన్ బ్రతుకు జనులన్ హింసతో వేచుచుండన్,
రాయల్సీమన్ బ్రజలమదులన్ రాజుగా నానృసింహుం
డే యిద్ధాత్రిన్ బరవశముతో నేలువాఁడై రహించెన్. 76.
జగన్నాథుని గుట్ట - భక్తుల ప్రార్థన.
మలయజ వృత్త గర్భ సీసము.
వినుతజగత్పతి! వినుమయ వేదన, విజయపథంబున, వెలుగునటుల
కనుమయ మమ్ముల, కరుణను నిత్యము, కమలదళాక్షుఁడ! కరుణ నిలను,
జనులు సుఖంబుగ సకల శుభంబులు సమధికరీతిని, సరసమతిని
గొనునటు చేయుము, కుజన హరా! మది గుణగణనా! హరి! కొలుతును నిను,
గీ. పేదసాదలబ్రతుకులు వీగుచుండె,
నాత్మధైర్యమే రక్షగా నలరు జనుల
నాదుకొనుమయ్య! యో కరుణాలవాల!
యంచు ప్రార్థింత్రు భక్తులాప్రాంతమందు. 77.
గోసాయివెంకన్న దుర్గాదేవిని ప్రార్థించుట.
అతివినయ వృత్త గర్భ సీసము.
సకల జయములిడు జనని! నిను సముచి - తము కొలుతున్, నీదు దయను కనఁగ,
మహిత భయహరణ! మదిని నిలు, భవము - మము విడువన్, జ్ఞానమార్గమిమ్ము,
ధరను నయ రహిత పరుఁడు పతనదిశ - గ ధరఁ గొనున్, రాజ్యకాంక్షతోడ,
ననయ నయపథమునను నడుపు నను, రి - పుల మడువన్ జేసి పుడమినేల,
గీ. ఆంగ్లపాలకులను బాపి యాదుకొనుము,
నీదు సంతానమును కావ నీవె తగుదు,
వమ్మ! దుర్గమ్మ! మముఁ గావ రమ్ము వేగ
మనెను గోసాయి వెంకన్న ప్రార్థనమున. 78.
క్రౌంచపదము. (భ మ స భ న న న య. యతి 1 - 11 - 19)
వంచితులై భూస్వాములు శోకింపఁగవలయునొ యనవరతము ధాత్రిన్?
వంచనలే నిత్యంబును గావింపగ మసలుఘనులొ పరులగునాంగ్లుల్?
కొంచెము యోచింపన్వలె శిస్తుల్ గొనుటకిలనెవరొకొ? యెదురు నిల్తున్,
వంచకులన్ జంపింతును, సాధింపగవలచి, గెలువ భగవతిఁ గొల్తున్. 79.
గోసాయి వేంకన్న ఘనతను రెడ్డి వర్ణించుట.
ఉ. సంకులమందుఁ గల్గునొక సాధ్వికి గర్భముపైన గాయమై
శంకగ నుండ, వేంకనయె చక్కఁగ గర్భము కాచె యుక్తితోన్,
వేంకన ధీమహత్వమె యవేద్యమటంచు నృసింహరెడ్డియే
యంకితమయ్యె వానికి మహత్తర సద్గురుదేవభావనన్. 80.
కంద గర్భ తేటగీతి.
పరమగురుఁడౌను వేంకన నిరుపముఁడగు
సద్గుణమణి, నిర్మలుఁడును సద్వరుఁడును,
వర సఖుఁడును, శాంకరిఁ గొల్చు వసుధ హితుఁడు,
నొకపరి కనెదనే నిప్పుడొప్పిదముగ. 81.
దీక్షతో జగన్మాత అనుగ్రహమును పొందుట.
మ. అనుచున్ భావనఁ జేయుచుండి నరసింహారెడ్డి దేవీ కృపన్
గొనగానెంచి గ్రహింప దీక్ష గురువౌ గోసాయి వేంకన్నచే,
మననంబున్ బొనరింతు నో గురువరా! మంత్రోపదేశంబునే
జననిన్ గాంచఁగఁ జేయుడయ్య! యనగా శాంతుండు వేంకన్ననెన్. 82.
కందద్వయ గర్భ క్రౌంచపద వృత్తము.(భ మ స భ న న న య. యతి 1 - 11 - 19)
కాళిని పూజింపన్ వలె, కాళీ ఘనపదములు మదిఁ గని వర భక్తిన్
వాలుచు, సేవింతున్ నిను, పాలింపఁగ వలయుననుచుఁ బలుకుట యొప్పున్,
కాళియె యాత్మజ్యోతిగఁ గ్రాలున్ గరుణను గనుచును కలిమిని గూర్చున్,
గాలము పోనీకిత్తరి కాళిన్ గను జతనమునను కదలు నృసింహా! 83.
ఉ. వత్స! మహేశ్వరీ కృపను వర్ధిలవచ్చును భక్తపాళి, సం
పత్సముపేతులై జగతి మాన్యులుగా వెలుగంగవచ్చు, నే
కుత్సితభావముల్ కనక కూర్మిని లోక హితార్థులై సదా
యుత్సహనంబుతోడను మహోద్ధతిఁ గాంచఁగ వచ్చు నెమ్మితోన్. 84.
ఉపదేశించుటకు ముందు నరసింహారెడ్డిని కరుణించమని గురువు గోసాయి వెంకన్న శ్రీమాతను
ప్రార్థించుట.
శ్రీచక్రబంధ తేటగీతి.
శ్రీచక్రబంధ తేటగీతి.
వెలుగులమ్మ! రా! శ్రీమాత! ప్రీతిఁ జేరెఁ
గనుము, గొప్పగా శ్రీవిద్యఁ గాంచు వీని
యత్నసారమౌ శ్రీనిచ్చి హాయి నేలు,
వెలుగ జేయఁగ రెడ్డిని వేలుపీవె. 85.
గోసాయి వేంకన్న రెడ్డికి మంత్రోపదేశము చేయుట.
మ. ఉపదేశింతును నీకు మంత్రమును నీ యుత్సాహముప్పొంగగాఁ,
దపమున్ జేయుచు, మంత్రసాధనముతో దర్శింపుమా దేవతన్,
గృపతో దేవత కాంచెనా జయము నీకే నిత్యమున్ లభ్యమౌన్,
విపరీతంబగు నాత్మశక్తి యొడమున్, విఖ్యాతియున్ గల్గెడున్. 86.
ఉ. కూరిమితోడఁ బల్కి యిటు గోప్యముగా నుపదేశమిచ్చె, వి
స్తార శుభాస్పదంబయిన శాంభవి మంత్రము భక్తినొప్పుచున్,
ధీరుఁడు నారసింహుఁడు సుధీవర వేంకన నుండి మంత్రమున్
గోరి గ్రహించి, సాధనను గొప్పగఁ జేసెను భక్తియుక్తుఁడై. 87.
నరసింహారెడ్డి ఔద్ధత్యముకొఱకు వెంటనుండుమని దుర్గమ్మను వేంకన్న ప్రార్థించుట.
షడరచక్రబంధ శార్దూలము.
3వ వృత్తమున (కవి పేరు) రామకృష్ణ కవి.
6వ వృత్తమున (కావ్యము పేరు) రేనాటి సూరీడు.
శా. దుర్గా! రా! కను రేని భారము, భజింతున్, సూర్యునుష్ణమ్బ! మా
వర్గా! మఞ్చిగ నా లకించుము లసద్వాగ్ రీతివై కమ్ము, నీ
భర్గా కృష్టి తటిల్లతాధ్వమున మా వాఁడుద్ధతిన్ విచ్చు, మా
మార్గంబందున బ్రోవఁగా బ్రభలతో మావెంట నీవుండుమా! 88.
గీ. అనుచు గోసాయి వేంకన్న ఘనతరముగ
జననినే గొల్చెఁ బ్రీతితోఁ జక్కగాను,
గురువు శిష్యులకొఱకని గురుతరమగు
బాధ్యతనుమ్రోయుటిద్దియే, ప్రబలఁజేయ. 89.
గీ. దీక్షఁ గొనినట్టి రెడ్డి తా దేవి కొఱకు
ధ్యానమగ్నుఁడై మనసులోఁ దలచుకొనుచు
తల్లి దుర్గమ్మనేచూచి ధన్యతఁ గన
పట్టుదలతోడనుండెను భవ్యముగను. 90.
ఉ. సాగుచునుండె దీక్ష, మనసార జగజ్జననిన్ మనంబునన్
వేగమె దర్శనంబు నిడ వేడెను మానసమందె, దీక్షయే
యోగముకాగ నా జననియున్ గనిపించెను మానసంబునన్,
మూగగ కండ్లు మూసుకొని పూర్తిగ లోననె జూచె నాతఁడున్. 91.
చ. జతనము సాగె దేవి మనసారగ దర్శన మిచ్చె రెడ్డికిన్,
స్తుతమతియైన శాంభవిని చూచి మనంబునఁ బొంగిపోవుచున్
సతతము నామనంబుననె జక్కఁగనుండుము శంభురాణి! నే
క్షితిపయి ధర్మరక్షణము చేసెడి వేళను కావఁగా ననెన్. 92.
ఉ. వెండియుఁ బల్కెనిట్టు లిలవేలుపువైన నినున్ స్మరించి, నా
కండగ నుంటి వీవనుచు నాత్మబలంబున దేశరక్షకై
నిండుమనంబుతో నిలిచి, నే నరివర్గముపై రణంబునే
మెండగు ధైర్యమున్ గలిగి మేదినిఁ జేసెద, నీవె యుండినన్. 93.
ఉ. భారత సంపదల్ కొనగ పాప దురాత్మకులాంగ్ల పాలకుల్
చేరిరి భారతావనికిఁ జేసెద మిచ్చట వర్తకం బటం
చారసి రాజులందు కలహంబులు పెట్టి, యనైక్యతన్ ధరన్
వేరు పడంగఁ జేసి రిట విజ్ఞతనే నశియింపఁ జేయుచున్. 94.
ఉ. రాజు లనేకతన్ మసల, ప్రాంతములొక్కొకటాక్రమించుచున్
రోజుకు రోజుకున్ బ్రబలి న్యూనముగా గనఁ జొచ్చి రీ ప్రజన్,
వాజిని ఖడ్గఘాతమున వారల నేనణగింపఁ జేయుమా,
రాజిలఁ జేయుమమ్మ ననుఁ బ్రార్థనఁ జేయుచు నీకు మ్రొక్కెదన్. 95.
జగన్మాత నరసింహారెడ్డికి ఖడ్గమునిచ్చుట.
చ. అన విని, నారసింహ! యసహాయమహాద్భుత శూరశేఖరా!
ఘనతరమైన దీక్షఁ గొని కాంచఁగఁ గల్గితి వీవు నన్ను, నీ
వనయము శత్రు సంహరణ నంచితరీతిని జేయనెంచుచున్
ఘనమగు ఖడ్గమిచ్చెదను గైకొనుమంచు నొసంగె వానికిన్. 96.
ఇరువైపుల దారుగనున్న అమ్మవారి అనుగ్రహము పొందిన ఖడ్గము.
ఉ. బారెడు ఖడ్గమద్ది, పిడిఁ బట్టుకొనన్ గరవాలమై తగన్
దారును రెండువైపుల నుదంచితరీతిని కల్గి శత్రులన్
పారఁగఁ జేయునట్టిది, యపారముగా రిపు మస్తకంబులన్
వేరుగఁ జేసి మొండెములు నేలను వ్రాలఁగఁ జేయు శక్తియే. 97.
నరసింహారెడ్డి చేతిలోని కత్తి.
ఖడ్గ బంధ సుగంధి వృత్తము.
దారు తీరు వేరు చూడ దండనండనుండరా!
రార! నిన్ వధింతునంచుఁ బ్రజ్ఞఁ జూపఁ బిల్చు రా,
రార, వేగమంచు దూకి ప్రాణ హీనుఁ జేయురా,
రారురా, రిపుల్ధరిత్రి, రాణ్నృసింహు కత్తిరా! 98.
ఉ. అమ్మ కరంబులన్ గొని సమంచితరీతిని నాదు ఖడ్గమే
కొమ్మని నాకొసంగుటది గొప్పగనున్నది నాకు, నిందు చే
కొమ్మని నాకొసంగుటను గుంభనమౌ మహనీయ శక్తి, ఖ
డ్గమ్మునఁ జేరియుండినది, కల్గఁగఁ జేయ జయంబటంచు తాన్. 99.
ఉ. అమ్మ యొసంగ గైకొనె మహాద్భుతమౌ కరవాలమున్, నృసిం
హమ్మె నృసింహరెడ్డి యన నాత్మబలంబున నొప్పుచుండి, యా
యమ్మకు మ్రొక్కి దీవనలనంతముగా గ్రహియించి, వీడుకో
లమ్మ యొసంగగాఁ దెరచె నాతని కన్నులనప్పుడచ్చటన్. 100.
ఉ. ఇంతయు దీక్షలోననె మహేశ్వరి సత్కృపఁ జేసెనంచు, ర
వ్వంతయు శంకలేక పరమాద్భుత శక్తిగఁ జూచి ఖడ్గమున్
జెంతకుచేరి వందనము చేసి, గురూత్తము దర్శనార్థమై
పొంతనె యున్న వేంకనకుఁ బొంగుచు వందన మాచరించుచున్. 101.
ఉ. సాంతము తెల్పె నాతనికి సన్నుత శాంభవి సత్కృపాద్యుతిన్,
భ్రాంతులు వీడిపోయినవి, భక్తియె నిల్చెను దేశమాతపై,
నంతయు మీ కృపన్ గలిగె నార్య! యటంచు వచించె రెడ్డి, వి
భ్రాంతిని పొంది యా గురుఁడు వర్ధిలుమంచు నొసంగె దీవనల్. 102.
నరసింహారెడ్డి దళంలో చేరినవారు.
గీ. కుంఫిణీ ప్రభుత్వము చేయు ఘోరములను
చూచి, యోర్వఁజాలని రెడ్డి వేచి, తిరుగు
బాటు చేయఁగ వీనితోఁ బాటు ప్రజలు
బోయ, వడ్డె, చంచులు, నిల్చి పోరినారు. 103.
సీ. గురుతుల్యుఁడైనట్టి గోసాయి వేంకన్న, - కరణమశ్వద్ధామ ఘనుడు, ధరణి
జంగము మల్లయ్య, జయశీలి దాసరి, - రోశిరెడ్డియు చేరి రాశ కదుర,
రాజా రమేశ్వర రావును, వనపర్తి - జామీనుదారును ప్రేమ మీర,
మునగాల రామ్ కృష్ణ, పెనుగొండను జమీను - దారులు, మహితులౌ ధీరవరులు
గీ. నవుకు రాజు నారాయణుండతని తమ్ముఁ
డయిన వేంకట రామ్రాజు, మయిదకూరు
పాలెగాఁడు వీరారెడ్డి, వరలుచున్న
పాలెగాండ్రు చేరిరి రెడ్డి ప్రక్కకపుడు. 104.
సీ. మార్కాపురమునేలు మహనీయుఁ డసమాన మిత్రుఁడై రెడ్డికి మేలు చేయు,
చిత్తూర్ జమీందారు చెలఁగుచు మైత్రితో నరసింహరెడ్డితో నడచుచుండె,
శ్రీకరుండై యొప్పు శ్రీయనంతపుర జమీందారు రెడ్డికి మిత్రుఁడయ్యె,
ఘనతతో వెల్గునా కాసిముఖాను నృసింహరెడ్డిని గూడి చెలగు చుండె,
గీ. రమ్యమైనట్టి జటుప్రోలు రాజ లక్ష్మ
ణుఁడను రాయుఁడున్, కర్నూలు పిడుగు పాప
ఖానును, సికింద్రబాద్ సలీమ్ ఖాను, మరియు
ప్రవర బనగానపల్లి నవాబు ఖాను, (తరువాత పద్యముతో అన్వయము.)105.
గీ. కత్తియుద్ధమునందున ఘనతఁ గన్న,
దిట్టగాపేరు పొందిన దివ్యచరితుఁ
డొడ్డె యోబయ్యయును, ధర రెడ్డికిలను
కుడిభుజంబుగ నిలిచెను కూర్మితోడ. 106.
గీ. కుమ్మరి కుల సీతన్నయు కూర్మితోడ
చేరె నరసింహరెడ్డి సంస్కారమెన్ని
యతనితోపాటు నడువంగ నతులితగతి,
సైరసై యంచు తనయొక్క శక్తిఁ జూప. 107.
గీ. ప్రతిభులైనట్టి వీరలు ప్రజల కొఱకు,
నారసింహుని దళమున చేరినారు.
దేశ స్వాతంత్ర్య వాంఛతో దీక్షఁ బూని
ప్రాణములనొడ్డి నిలిచిరి భక్తితోడ. 108.
ఆశ్వాసాంతము.
స్రగ్విణి. (ర ర ర ర . యతి 1-7)
నారసింహా! కృపన్ న్యాయమార్గంబునన్
ధీరచిత్తుల్ సదా తీరుగావర్తిలన్
బ్రేరణన్ గొల్పుచున్ వేల్పువై చేయరా,
సారసాక్షుండ! నే సంస్తుతింతున్ నినున్. 109.
కాణ్వశాఖీయ కౌశికస గోత్ర చింతా వంశజ సన్యాసిరామారావు ధర్మపత్నివేంకటరత్నమాంబ పుణ్య దంపతుల జ్యేష్ట పుత్రుఁడును, పూజ్య సద్గురుదేవ పరమాత్మ స్వరూప కల్వపూడి వేంకట వీర రాఘవాచార్యుల ప్రియ శిష్యుఁడును రామకృష్ణారావు నామధేయుఁడనగు నాచే విరచింపంబడిన రేనాటి సూరీడు అను చారిత్రక ప్రబంధమున ద్వితీయాశ్వాసము సమాప్తము.
వ్రాసినది



0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.