జైశ్రీరామ్.
‘‘సూర్యశ్రీరామం’’(సంపూర్ణ వచన రామాయణము)గ్రంథావిష్కరణ సభ.
ది.05.03.2025న హైదరాబాద్ నందలి మల్కాజ్గిరి, ఆనంద్ బాగ్ లోని ‘‘లలితా పరమేశ్వరి దేవస్థానమునందు సా. 4గం.లకు అత్యంత వైభవముగా జరిగినది.
వేదికపైకి ఆహూతులైన పండితులను సమంచిత రీతి నాహ్వానించుటకు చిరంజీవి పొన్నెకంటి అరుణ్ కిరణ్ ముఖ్యపాత్ర వహించి సభను సాహితీసుగంధభరిత ప్రాంగణముగా మలచి ఈ డిజిటల్ యుగంలో పుస్తకముద్రణావశ్యకతనుగూర్చి వివరిస్తు, కార్యక్రమం ప్రారంభించారు.
నాటి సభాధ్యక్షులు శ్రీ చింతా రామకృష్ణారావు గారు ( చిత్రకవితా విశారదులు, అష్టావధానులు)వీరి తమ తొలిపలుకులలో రామాయణ విశిష్ఠత ‘‘సూర్యశ్రీరామం’’ నామ విశిష్ఠత దాని ప్రాధాన్యం వివరించారు. రచనా శైలినిగూర్చి ప్రశంశించారు.
‘‘సూర్యశ్రీరామం’’గ్రంథావిష్కర్త మాన్యులు ఆచార్య డా11 బేతవోలు రామబ్రహ్మంగారు. వీరు రామాయణ కావ్యమునందలి ముఖ్య రహస్యములను మూలమునందు వాల్మీకి మహర్షి పద ప్రయోగాలను వాటి అంతరార్థాలను మనోహరముగా వర్ణించి తాను రచిస్తున్న రామాయణాంతర్గత భావాలను వివరించి సభాసదుల కొన్ని సందేహాలను తీర్చారు. సూర్యశ్రీరామంలోని భావసారళ్యమును ప్రస్తావించి కృతికర్తను స్వయముగా ప్రేమాభిమానాలతో ‘‘సూర్యశ్రీ’’ అను కలముపేరుతో ప్రసిద్ధిచెందుమని ఆశీర్వదించారు. నేటి సమాజంలో ఇలాంటి గ్రంథాల ఆవశ్యకతను పేర్కొన్నారు. ఇదే సందర్భంగా ‘‘గురుపాద శతకము’’ను, చిరంజీవి మాచిరాజు హిమజ వేసిన ‘‘రాముడు హనుమను కౌగిలించుకొను చిత్రమును కూడ ఆవిష్కరించారు.
గ్రంథ విశ్లేషకులుగా సుప్రసిద్ధ అవధాని వర్యులు శ్రీ సురభి శంకర శర్మగారు గ్రంథమునందలి నామసార్ధక్యమును, గురుశిష్య సంబంధమును గూర్చి, కావ్యమునందుపయోగించిన సంప్రదాయిక వ్యాకరణబద్ధమైన సరళ గ్రాంథికభాషాప్రయోగమును గూర్చి, సంప్రదాయ కవిత్వపు విలువలను గూర్చి ప్రస్తావించారు. కవి తన వ్రాత ప్రతిని ఒంటిమిట్ట కోదండరామస్వామి పాదపద్మములందు సమర్పించుట, కేవలము రెండు సంవత్సరములలోనే ఏడుకాండలు పూర్తిచేయుటను ప్రశంశించారు.
కల్యాణశ్రీ గా ప్రసిద్ధులైన జంధ్యాల వేంకటరామ శాస్త్రి గారు సూర్యశ్రీరామం అనే సులభవచన రామాయణము ‘‘ ఆంధ్రప్రభ’’ ద్వారా సాహితీగవాక్షంలో క్రమంతప్పక ప్రతి ఆదివారం చదివే వాడనని రచనా శైలి మనోహరంగా, వాల్మీకి భావాలకంతరాయం కలుగని రీతిలో సంక్షిప్తీకరణము ఆకర్షణీయంగా ఉందని నామసార్ధక్యం చక్కగా ఉందని పేర్కొన్నారు.
వక్తలు విశ్రాంతాంధ్రోపన్యాసకులు డా. రామడుగు వేంకటేశ్వర శర్మగారు విశ్రాంతాంధ్రోపాధ్యాయులు శ్రీ జొన్నలగడ్డ జయరామశర్మగారు, తాము రామాయణమును గూర్చి, కృతికర్తను గూర్చి చక్కని చిక్కని పద్యాలను చదివారు. కృతికర్తశిష్యుడు, అవధాని చింతలపాటి బుచ్చి వేంకటప్పేశ్వర శర్మ గురువుగారిని గూర్చి పద్యరూపంలో స్తుతించారు. ఆనాటి సభకు ప్రముఖ హాస్యావధాని శ్రీ శంకరనారాయణగారు, ప్రముఖ అవధానివరేణ్యులు ముద్దు రాజయ్యగారు, మున్నగు సాహితీ మిత్రులు సభను జయప్రదం చేశారు.కార్యక్రమమున మధ్యమధ్యన చిరంజీవి పొన్నెకంటి మనోజ్ఞ వినాయకప్రార్ధన, గీతాలాపములు శ్రోతల నలరించినవి. వందనసమర్పణతో సభ సుసంపన్నమైనది.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.