గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, మార్చి 2025, బుధవారం

741 నుండి 750 లలిత...

 జైశ్రీరామ్.

741. ఓం రంభాదివందితాయై నమః.
నామ వివరణ.
రంభా మున్నగు అప్సరాంగనలచే నమస్కరించఁబడు తల్లి మన అమ్మ.
కం.  కరుణను వనితలఁ గనుమా,
శరణమొసఁగి గురుతరముగ, స్వయముగ నీవే 
నిరతము నిరుపమ రక్షణ
ధరణికి *రంభాదివందితా*! మరువకుమా.
742. ఓం భవ దావ సుధావృష్ట్యై నమః. 
నామ వివరణ.
సంసారమనెడి దవానలమునార్పు అమృతవృష్టి మన అమ్మయే.
కం.  *భవ దావ సుధా వృష్టీ*!
భవదావానలము చేత భయపడుచుంటిన్,
నవనీత హృదయ వీవే
భువి నను గాపాడి ముక్తిఁ బొందగనిమ్మా.,
కం.  అసలగు జ్ఞాన జ్యోతిగ
వసుధంగల జనులలోన వరలుదువీవే,
కొసరుచు కోరుదు *భవదా
వ సుధావృష్టీ*! విముక్తి, వారిజ నయనా!
743. ఓం పాపారణ్య దవానలాయై నమః.
నామ వివరణ.
పాపములు అనే కీకారణ్యములను కాల్చి బూడిద చేయు దావానలము మన అమ్మయే.
శా.  నా పాపంబులనంత మెన్న జననీ! నా భాగ్య మీపాటిదే,
నీ పాదాబ్జములెన్న నేరమిని నే నిత్యంబు దుర్వర్తినై
పాపారణ్యమునందు జిక్కితిని నా పాపంబులన్ గాల్చు మో
*పాపారణ్య దవానలా*! శరణ మీ పాపాత్ము రక్షింపుమా.
744. ఓం దౌర్భాగ్య తూల వాతూలాయై నమః
నామ వివరణ.
దౌర్భాగ్యమనెడి గడ్డిని దూరముగా ఎగురఁగొట్టివేయు వాయువు మన అమ్మ.
కం.  క్షితి నాదౌర్భాగ్యమ్ముల
నతులితగతి తూలఁజేయుమమ్మా! నినునే
మతినిల్పి గొల్తు, *దౌర్భా
గ్యతూలవాతూల*! నన్నుఁ గావుము తల్లీ!
745. ఓం జరాధ్వాంత రవిప్రభాయై నమః.
నామ వివరణ.
ముసలితనము అనెడి చీకటిని నశింపఁ జేయుసూర్యప్రభ మన అమ్మ.
ఉ.  సాంతము నీవె నాకనుచు, సత్యము నీవె యటంచు నా మదిన్,
కాంతును నిన్ను నేను మమకారము నీ పయిఁ గల్గితిన్, జరా
ధ్వాంతము నా మదిన్ మరుపు వర్ధిలఁ జేయుచు నుండె, నో *జరా
ధ్వాంత రవి ప్రభా*! కనుము, వాపి జరన్ నినుఁ గొల్వఁ జేయుమా.
746. ఓం భాగ్యాబ్ధిచంద్రికాయై నమః.
నామ వివరణ.
భాగ్యము అనెడి సముద్రమునకు  వెన్నెల మన అమ్మ.
ఆ.వె.  వరలుచుండ నీవు *భాగ్యాబ్ధి చంద్రికా*!
నేను సాగరమునె, నిత్య శుభము
లందుచుందునమ్మ, సుందరమ్ముగ నీవు
చలువనిచ్చి కావు చక్కగాను.
747. ఓం భక్త చిత్త కేకిఘనాఘనాయై నమః.
నామ వివరణ.
భక్తుల మనసులనెడి నెమళ్ళకు సంతోషము కలిగించెడి చక్కని మేఘము మన్ అమ్మ.
ఆ.వె. చిత్స్వరూప! *భక్త చిత్త కేకి ఘనాఘ
నా*! మదిన్ దలంతు నాదు జనని!
నా మనసను కేకి నర్తించు నినుఁ జూచి,
మేఘము వలె నీవు మేలు కొలుప. 
748. ఓం రోగపర్వత దంభోళ్యై నమః.
నామ వివరణ.
రోగములు అనెడి పర్వతములను నాశనము చేయు వజ్రాయుధము మన అమ్మ.
తే.గీ.  *రోగ పర్వత దంభోళి*! ప్రోవుము నను,
వేగఁ జాలను దుర్యోగ రోగములకు,
సాగఁ జేయుము దుర్యోగ రోగ రహిత
జీవనము నాకు, వర్ధిల్ల జేయుము నను.
749. ఓం మృత్యుదారు కుఠారికాయై నమః.
నామ వివరణ.
మృత్యువు అనెడి కర్రను నరికివేయు గొడ్డలివంటిది మన అమ్మ.
మత్తకోకిల.
మేలుగా నమృతత్వమిచ్చెడి *మృత్యుదారు కుఠారికా*!
కాలగర్భమునందుఁ గల్పక కాపు కాచుచు నిత్యమున్
హేలగా నప మృత్యుహీనుగ నీశ్వరీ యొనరింతువే,
జాలితో ననుఁ గాచు తల్లివి, సన్నుతింతు నినున్ సదా! 
750. ఓం మహేశ్వర్యై నమః.
నామ వివరణ.
అమ్మ గొప్పదయిన సకలమునకు బ్రహ్మ పదార్థముగా ఉన్న ఈశ్వరి.
ఉ.  ఈ జగతిన్ సృజించితె? *మహేశ్వరి*! నీ కరుణా కటాక్షమే
బీజము వేయు సద్గతికి, వేల్పుగ నిన్ మది నిల్పి నిత్యమున్
బూజలు చేయఁ జేయు నిను, పుణ్య ఫలంబుగ పొందనౌనుగా,
రాజిత నేత్రయుగ్మ! కన రమ్ము, నినున్ గననిమ్ము నమ్మికన్. 

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.