గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, డిసెంబర్ 2024, బుధవారం

శ్రీ రావు పంగనామముల ఫౌండేషన్ మరియు నేషనల్ రీసోర్స డవలప్మెంట్ కోపరెటీవ్ సొసైటీ హైదరాబాదు వారి నుండి (లైఫ్ టైం ఎచ్చీవ్మెంట్ ఎవార్డ్) జీవిత సాఫల్య పురస్కారము పొందుచున్న శుభ సందర్భంలో బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మహోదయులుకు నా హృదయపూర్వక అభినందనలు.

 జైశ్రీరామ్.




శ్రీరస్తు   ..   శుభమస్తు   ..   అవిఘ్నమస్తు.

శ్రీ రావు పంగనామముల ఫౌండేషన్ మరియు నేషనల్ రీసోర్స డవలప్మెంట్ 
కోపరెటీవ్ సొసైటీ హైదరాబాదు వారి నుండి (లైఫ్ టైం ఎచ్చీవ్మెంట్ ఎవార్డ్) జీవిత సాఫల్య పురస్కారము 
పొందుచున్న శుభ సందర్భంలో బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మహోదయులుకు నా హృదయపూర్వక అభినందనలు.

శా.  శ్రీన్నానావిధమంత్ర పుష్పములతో జిజ్ఞాసతోఁ గొల్చు మీ 
రన్నన్ శ్రీహరి కంతు లేని కృప, మోహాదుల్ విడంజేయుటన్ 
మన్నింపంబడుచుందురంతటను దీమంతా! శుభాకార! శ్రీ
మన్నారాయణ! వెల్గుడీ ధరణిఁ బ్రేమన్ మీరు మీ పత్నితోన్.

మ.  క్షితినత్యద్భుత పంగనామముల రావ్ శ్రీమత్ పురస్కారమున్
మతిమంతుల్ వరణీయ సద్గుణయుతుల్ మాన్యుల్ గనం జాలువా
రతుల ప్రాభవ యుక్తిచే ధరను, మీరత్యంతయోగ్యంపు జీ
వితసాఫల్య పురస్కృతిన్ గనిరి భావింపన్ చిదానందులే.

శా.  శ్రీమల్లాప్రగడాన్వయా! శుభమయా! శ్రీచక్రసంవాసినిన్
బ్రేమన్ మీరు సతంబు గొల్చి శుభముల్ విఖ్యాతిగా బొందుచున్,
క్షేమంబే జనపాళికిన్ గొలుపగా శ్రీకావ్య సద్భాష్యముల్
ధీమంతుల్ విని మెచ్చఁ బల్కుదురుగా, దేదీప్యమానంబుగా.

శా.  యన్నార్డీ. మరి యార్పియఫ్. కలిసి శ్రేయంబున్ సదా పంచు శ్రీ
మన్నారాయణ యంచు నెంచి ధర సమ్మాన్యంబుగా నిచ్చిరే
మన్నింపంబడు సత్కృతిన్, తమకు శ్రీమంతా! గుణోపేత! శ్రీ
మన్నారాయణమూర్తి మీకు శుభముల్ మాన్యా! సదా కొల్పుతన్.

ఉ. మంగళమౌత మీకు ధర మాన్యమహోదయ! మంగళాకరా!
మంగళమౌత మీ సతికి మంగళమౌ జనపాళికిన్ సదా,
మంగళమౌ కవీశులకు, మంగళమౌ వర భక్తపాళికిన్,
మంగళమౌత శాంభవికి మంగళమౌ మన భారతాంబకున్.

బుధజన విధేయుఁడు,
చింతా రామకృష్ణారావు.

26/12, 8:06 am] Mallaapragada Sreemannaaraayana: 
మీ సౌజన్య మనన్యము
మీ సంస్కారము తరగని
          మేల్మి పసిడియౌ
మీ సౌహార్దము వెన్నెల
మీ సంభాషణ చెలిమికి
          మేలిమి గురుతౌ. 
🙏🙏🙏🙏🙏🙏
[26/12, 8:14 am] Mallaapragada Sreemannaaraayana: 
సౌజన్యము నాత్మీయత
సాజంబగు రూపు గొనెనొ!
          సాక్షా ద్వాణీ
తేజమె 'చింతా' కవియై
ఈ జన్మకు దక్కెనిట్లు
          నీశ్వరు కరుణన్.
🙏🙏🙏🙏🙏🕉️
[26/12, 8:46 am] Chinta Ramakrishnarao: 
ఉ.  మాటలు రావు నాకు గుణమాన్యులు మీరె గణింప నన్ను, మీ

పాటి మనోహరుండనిన భక్తజనాశ్రయుఁడౌ నృసింహుఁడే,

ధాటిగ సత్సభా స్థలి సుధల్ ప్రసరించెడి వాగ్విదాంవరా!

మాటలవెట్లు వచ్చు పరమంబగు మీ నుతులాలకించినన్?
🙏🏻🙏🏻🙏🏻

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.