జైశ్రీరామ్.
ఇష్టాగోష్టిగా అవధానం
28/11/2024 న సాయంత్రం 4. 00 గంటల నుండి 5.00 గంటల వరకు మియాపూర్ లోని
శ్రీ చింతా రామకృష్ణా రావు గారి స్వగృహంలో శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ ఇష్టాగోష్టిగా క్షిప్రావధానం చేశారు. కేవీయన్ ఆచార్య అవధానానికి సాక్షిగా, సల్లేఖకులుగా వ్యవహరించారు. శ్రీ సంగనభట్ల నరసయ్య గారు అతిథిగా పాల్గొన్నారు. శ్రీ చింతా వారే ఒక్కో అంశాన్ని ఇచ్చి పూరించమన్నారు.
ముందుగా
1. నిషిద్ధాక్షరి.
అమ్మ వారి ప్రార్థన
శ్రీ (వ) య (న)ంబా(-)వి (జ) ద్యా(వ) ంబా
నీయా(శ)న (న)తి (త) ని (-)మ్ము (క) వే(గ) డ ని(న) త్యా - న న్నున్
శ్రీ యంబా విద్యాంబా!
నీయానతినిమ్ము వేడ నిత్యా ! నన్నున్
బాయక ప్రోచెడి జననివి
శ్రేయంబులు గూర్చుమమ్మ! చిత్సుధలొలుకన్
2. సమస్య.
కొడుకా రమ్మనుచు నతడు కోతిని బిలిచెన్.
విడువకు సజ్జన మైత్రిని
తడయక పినతండ్రి మాట తలదాల్చుమనెన్
వడి వాలియె రామునికిడ
కొడుకా రమ్మనుచు నతడు కోతిని బిలిచెన్.
(వాలి అంగదునితో..తన ప్రాణోత్క్రమణ సమయంలో అంటున్న మాటలు)
3. దత్తపది
అమ్మ,కమ్మ, బొమ్మ, రెమ్మ..ఉదయవర్ణన
దివ్య భానుండు మాయమ్మ తిలకమయ్యె!
కమ్మతెమ్మెరల్ వీచగా కమలమువిడె!
పొద్దుపొడుపున నీరూపు బొమ్మగట్టె,
రెమ్మ రెమ్మకు పూలిచ్చె కొమ్మటంచు
4. వర్ణన.
శ్రీ కృష్ణ ని వర్ణన
విశ్వో త్పత్తికి హేతువు
విశ్వమ్మును నిలిపి ప్రోచువిష్ణుం డతడే!
శశ్వత్ సాధు మనంబుల
నాశ్వాసించెడు వెలుంగు నచ్యుతు గొలుతున్.
5. న్యస్తాక్షరి.
వ ర దు డు 1,2,3,4, అక్షరాలలో వరుసగా నాలుగు పాదాలలో
గరుస్తుతి, తేటగీతి
వదలె భవబంధ సంగతుల్ ప్రబలమనుచు
పరమశాంతమ్ము జూపుచున్ వరలునెపుడు
తనదు జీవనమార్గమే దార్శనికము
వరదుడు గురువు నాకిడె పరమ సఖము.
( అవధానిగారు ఈ పద్యాలన్నీ ధారణ చేసినారు)
జరిగినదేమిటంటే.
ఎందరెందరికో అవధాన శిక్షణాశిబిరంలో
ఎంతకాలంగానో శిక్షణనిప్పిస్తున్న దత్తాత్రేయశర్మచేత అవధానం చేయించాలనే కోరిక నాకు కలిగింది.
సోదరభావంతో నన్ను కలియుటకు దత్తాత్రేయ సహోదరుఁడు కేవీయన్. ఆచార్యతో మాయింటికిరడం ,అంతలోనే డా.సంగంభట్ల నరసయ్యగారు కూడా అనుకోకుండా రావడం జరిగింది. ఇదే మంచి అదునుగా భావించి నేను దత్తాత్రేయకు చెప్పకుండానే ప్రశ్నలు సంధిస్తుంటే దత్తాత్రేయసమాధానాలు చెప్పడానికి ఉపక్రమించడంతో నేనన్నాను. ఇది అష్టావధానమని. అయ్యో నేను చేయలేనన్నయ్యా అని వారన్నప్పటికీ ప్రయత్నం మానలేనందున నేను ప్రశ్నలతో ముందుకు నడిపించ సాగాను. ఆద్యంతం అద్భుతమైన పూరణలతో నా ప్రశ్నకలు దీటుగా సమాధానం చెప్పారు. అతి స్వల్ప సమయంలో ఈ అవధానం పరిసమాప్తమవడంతో ఇదిక్షిప్రావధానం దత్తాత్రేయావధాని నిర్వహించింది. అని ఆచార్యులవారు ప్రకటించారు. ఇది అత్యద్భుతంగా సాగింది.
ఇంతటి చక్కని అవకాశం ఈ త్రిమూర్తుల రాకతో నాకు లభించినందునకు నాకు చాలా ఆనందంగా ఉంది.
కం. దత్తాత్రేయసహోదర!
తత్తరపాటొందకుండ తగునుత్తరముల్
బత్తినియొసగిరిక్షిప్రము
కొత్తింతయు కాదనునటు గొప్పగ మీరల్.
అంటూ ప్రశంసలందఁజేశాను.
నా దత్తసహోదరుఁడు ఒక్కొక్కటిగా అవధానాలు చేయుచూ చక్కగా శతవధానములు త్వరత్వరగా పూర్తిచేసి నాకు మన మియాపూర్ మిత్రమండలికి ఆనందం కలిగించాలని, కన్నకలలు పండించాలని ఆశిస్తున్నాను.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.