జైశ్రీరామ్.
శా. భాసిల్లన్ భువి శ్రామికుల్ నిరతమున్ భానుప్రకాశాఖ్యులీ
భాసించే వర కస్పి గ్రంథ సుమమున్ భాగ్యంబుగా నిచ్చుటన్
భాషాపాండితినొప్పువారి నుతులన్ భాగ్యంబుగా పొందెడున్.
మీ సాన్నిధ్యము మేలు గూర్చు ప్రజకున్ మీకున్ మమస్కారముల్.
ఓం శ్రీమాత్రే నమః.🙏🏼
శ్రమజీవన సౌందర్యం / పని సంస్కృతి
1) శా. శ్రీమన్మంగళ భారతావని జనుల్ చిద్భావనోద్భాసితుల్,
ప్రేమన్ బంచుచు నెల్లవారి సుఖమున్ విశ్వంబునన్ గోరుచున్,
భూమిన్ శ్రామిక జీవులై జగతికే పూజ్యంబుగా నొప్పుచున్,
శ్రీమంతంబుగ వెల్గుచుందురు ధరిత్రిన్ దివ్య సత్కీర్తితో.
2) ఉ. శ్రామిక జీవన మ్మవనిఁ జక్కని సన్నుత జీవనమ్ము, స
ద్ధీమతులెల్లవేళలు క్షితిన్ శ్రమఁ జేయుచు నాత్మ గౌరవం
బే మహితంబుగాఁ దలచి వెల్గుచునుందురు విశ్వమందునన్,
భూమియు పొంగు నా జనుల పూజ్య విధానము గాంచి మెచ్చుచున్.
3) మ. తినునాహారము శ్రామికాళి కృషి, యత్నంబున్ సదా చేయుచున్,
ఘనమౌ పంటలు పండఁ జేయు కృషిచే, ఘర్మంబు చిందించుచున్,
వినయంబున్ సువివేకమున్ గలిగి సద్విజ్ఞాన తేజంబుతో
ననయంబున్ సుభకారులై జగతికిన్ హాయిన్ బ్రసాదింతురే.
4) ఉ. కమ్మరివారు, కుమ్మరులు, కాడిని పట్టుచు దున్నువారు, యా
తమ్ములు పట్టువారు, ఘవతన్ గృషిచేసెడి నేతవారు, మ
త్స్యమ్ముల బట్టువారు, వినుతంబుగ వీధులనూడ్చువారు, క్షే
మమ్మును గోరువారె కద, మాన్యులు కార్ముక వీరులిందరున్.
5) మ. ధనగర్వంబున కార్మికోత్తములపై ధాష్టీకమున్ జూపు దు
ర్జనులన్ సంఘము పారద్రోలవలె, ఘోరంబుల్ వినన్ రాదిలన్,
వినుతానందము కార్ముకాళికమరన్ విశ్వంబె భాసించు,భా
వన చేయన్ నుతకార్మికాళి కిదియే భానుప్రకాశంబగున్.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.