గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, డిసెంబర్ 2024, సోమవారం

 మంత్ర పుష్పంలో అంతరిక్షం - 2-- ఆర్. శర్మ దంతుర్తి

భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదనీ, మన మనసులోనే ఉన్న భగవంతుణ్ణి చూడాలంటే అంతర్దృష్టి ఉంటే చాలనీ క్రితం నెల లో ప్రచురించబడిన మంత్రపుష్పం మొదటి భాగంలో చూసాం. మరి ఆ అంతర్దృష్టి వచ్చే దారిలో మనం దేహం చాలిస్తే, మన భూమి మీద మనుగడ కుదరకపోతే ఏం చేయాలో ఈ రెండో భాగమైన యోపాం పుష్పం మనకి దిశానిర్దేశం చేస్తున్నట్టూ మనం గమనించవచ్చు.


యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి

చంద్రమా వా అపాం పుష్పమ్ పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి

య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి


ఎవరైతే జలముని పుష్పంగా తెలుసుకుంటున్నాడో, ఎవరైతే చంద్రుడే ఈ భూమిమీద జలాలకి ఆథారభూతుడిగా తెలుసుకుంటున్నారో వారు మంచి యువతులని కలవాడు, మంచి సంతానం కలవాడు అవుతున్నాడు. అంటే మొదట భూమి మీద మనుగడకి కారణం నీరు కనక ఆ నీరు చంద్రుడివల్ల సాథ్యమైంది. అలా చంద్రుడు కారణం అని తెలుసుకుంటే ముందు ముందు ప్రజోత్పత్తికీ, మనుషుల మనుగడకీ మంచిది. కుటుంబ వృధ్ధికి/మరో జన్మలో బ్రహ్మాన్ని తెలుసుకునేదానికీ కారణం ఇదే.


అగ్నిర్వా అపామాయతనం, ఆయతనవాన్ భవతి

యోగ్నేరాయతనం వేద ఆయతనవాన్ భవతి

ఆపో వా అగ్నేరాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద

యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి


నీరు అయ్యాక చూడవల్సింది నిప్పు. అగ్ని ఈ జలాలకి ఆథారం. అలాగే జలాలకి అగ్ని ఆథారం అవుతూ రెండూ పరస్పరాథారాలవుతున్నాయి. మనకి తెలిసిన కొత్త పరిశోధనలలో కూడా ఇదే చెప్పేది. మొదట్లో ఈ భూమిమీద నీరు తప్ప ఏమీ ఉండేది కాదు. తర్వాత ప్రాణికోటి నీటిమీదనుంచి భూమిమీదకి వచ్చింది. దశావతారాల్లో చెప్పినట్టూ మొదట్లో జలచరాలు, తర్వాత మెల్లిగా ఒక్కో జీవరాశి వృధ్ధి చెందుతూ ఇప్పుడు మనుషుల్లా అయ్యాక దశావతారం చివరిలో పై లోకాలకి కల్కి తన గుర్రంమీద తీసుకెళ్తాడని కధనం అనుకుంటే, తెలిసేదేమంటే రాబోయే రోజుల్లో అంతరిక్షంలోకి మన ప్రయాణం తప్పనిసరి. మనం వాడే పదార్ధాలవల్లా, వ్యర్ధాలవల్లా ఈ భూమి నాశనం అయితే ఇంక మిగిలేది ఏమీ ఉండదు కనక అంతరిక్షం లోకి చూసుకోవాలి. అలా పైకి చూసినపుడు మనకి కావాల్సిందేమిటి? నీరు, అందులో ఉన్న ఉదజని, ప్రాణవాయువుల వల్లే మనం నిప్పుకూడా తయారు చేసుకోవచ్చని మనం చదువుకునే కొత్త శాస్త్రం కూడా ఘోషించేది. అందువల్ల రాబోయే మంత్రంలో చెప్పేది వాయువు గురించి.


వాయుర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి

యో వాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతి

ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద

యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి


నీటికి ఆధారమైనది వాయువు. అందువల్ల నీరు, ప్రాణవాయువు ఒకదానికొకటి పరస్పరాధారితాలు అని తెలుసుకున్నవాడే ఉత్కృష్టపదం ఎరిగినవాడు. ఇక్కడ మనకి తెలిసేదేమంటే, ఉదజని ఒక్కటే ఉంటే చాలదు. ప్రాణవాయువు ఉండాలి మనం వెదికే అంతరిక్షంలో. ఆ ప్రాణవాయువు, నీరు, ఒకదానికొకటి ఆధారితం.


అసౌ వై తపన్నపామాయతనం ఆయతనవాన్ భవతి

యోముష్య తపత ఆయతనం వేద ఆయతనవాన్ భవతి

ఆపోవా అముష్య తపత ఆయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద

యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి


నీటికి ఉన్న ప్రాధాన్యత చెప్పారు కనక ఇప్పుడు ఆ నీటికి ఆధారితం అయిన సూర్యుడి గురించి చెప్తున్నారు. అంటే మనం బతకగలగాలంటే మనకో వెలుగు ఇచ్చే నక్షత్రం అవసరం. అదే మనకి వెలుగూ, మనకి కావాల్సిన ప్రాణవాయువూ, ఉదజనీ, వీటివల్ల కలిగే నీరు లభించేది. ఇవన్నీ ఒకదానికొకటి పరస్పరాధారితాలు.


చంద్రమా వా అపామాయతనం ఆయతనవాన్ భవతి

యశ్చంద్రమస ఆయతనం వేద ఆయతనవాన్ భవతి

ఆపో వై చంద్రమస ఆయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద

యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి


సూర్యుడికెంత ప్రాముఖ్యతో చంద్రుడికి కూడా అదే ప్రాముఖ్యత ఉన్నట్టు, చంద్రుడి వల్లే మనకి సముద్రంలో ఆటుపోట్లు కలుగుతున్నట్టూ తెలుసు. అందువల్ల నక్షత్రం ఒకటి ఉండాలి, వాయువు ఉండాలి, ఉదజని ఉండాలి అని చెప్పాక, ఫలానా భూమిలా బతికే గ్రహం ఉండాలంటే దానిక్కావాల్సిన చంద్రుడు లాంటి ఉపగ్రహం కూడా ఉండాలి మనిషి మనుగడకి. అందువల్ల ఇందులో చెప్పేదేమంటే చంద్రుడు, నీరూ పరస్పరాధారితాలు. ఇది తెలుసుకున్నవారు చక్కని ఉనికిపట్టుగలవారవుతున్నారు.


నక్షత్రాణి వా అపామాయతనం ఆయతనవాన్ భవతి

యో నక్షత్రాణామాయతనం వేద ఆయతనవాన్ భవతి

ఆపో వై నక్షత్రాణామాయతనమ్ ఆయతనవాన్ భవతి య ఏవం వేద

యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి


ఇప్పటివరకూ చదివినది చూస్తే మనకి కావాల్సినది ఓ గ్రహ మండలం, ఒక మంచి సూర్యుడు, ఒక చంద్రుడు, అగ్ని, వాయువు, నీటిని కలిగించే ఉదజని, ప్రాణవాయువు అనేవి. మరి వీటినెక్కడ చూడడం అంతరిక్షంలో? ఇప్పుడు చెప్పేది, నక్షత్రాలకేసి దృష్టి సారించమని. మనకున్న ఈ సూర్యుడివంటి నక్షత్రాలకేసి చూడాలి. ఆ నక్షత్రాలూ, నీరూ పరస్పరాధారితాలు అని తెలుసుకున్నవారే ముక్తిపదం పొందగలుగుతున్నారు.


పర్జన్యో వా అపామాయతనమ్ ఆయతనవాన్ భవతి

యః పర్జన్యస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి

ఆపో వై పర్జన్యస్యాయతనమ్ ఆయతనవాన్ భవతి య ఏవం వేద

యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి


సరే ఇప్పుడు మనం చూడాల్సింది నక్షత్రాలకేసి కదా మరి అవెక్కడున్నాయి? సూర్యుడు కేంద్రంగా ఉన్న మనం మనకున్న నవగ్రహాలూ, గ్రహమండలం దాటి బయటకెళ్ళాలి. ఆ బయటకి ఎంతదూరం వెళ్ళాలనేది ఈ మంత్రం చెపుతోంది. మేఘాలు దాటాలి. మేఘం అంటే మనకి కనిపించే వర్షించే మేఘం అనుకుంటే ఈ వర్షించే మేఘాలు మన వాతావరణం దాటితే ఉండవు కదా, మరెలా? అందువల్ల మేఘం అంటే మన గ్రహమండలం దాటాక ఉండేదేమిటా అని ఆలోచిస్తే మనకి తెలిసేది ‘క్యూపర్ బెల్ట్’ అనే అనేకానేక కలశాలతో చుట్టూరా కప్పుకున్న మేఘం. అది దాటితే గ్రహాంతరాళంలో ఉన్న మిగతా నక్షత్రాలకి వెళ్లవచ్చన్నమాట. అందువల్ల ఈ పర్జన్యం తెలుసుకున్నవాడే ముక్తికి దగ్గిరౌతున్నాడు. మరి అక్కడకి వెళ్లడం ఎలాగయ్యా అనేది తర్వాతి మంత్రం చెపుతోంది.


సంవత్సరో వా అపామాయతనమ్ ఆయతనవాన్ భవతి

యస్సంవత్సరస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి

ఆపో వై సంవత్సరస్యాయతనమ్ఆయతనవాన్ భవతి య ఏవం వేద

యోప్సు నావం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవ తిష్ఠతి


వెళ్ళేదూరం అతి ఎక్కువకాబట్టి వెయ్యిమైళ్ల వేగంతో వెళ్ళినా అంత దూరం వెళ్ళడానికి మనకి ఆయుర్దాయం చాలదు. అందువల్ల కాంతివేగంతో వెళ్ళాలిట. అలా కొలిచే దూరాన్నే మనం కాంతిసంవత్సరం అంటున్నాం కాబట్టి ఈ మంత్రం చెప్పే సంవత్సరం, కాంతి సంవత్సరం అనుకుంటే నీటికి ఆధారితమైన నక్షత్రాలకి వెళ్ళే కాంతిసంవత్సరాన్ని ఎరిగినవాడే బాగా ఎరుక తెల్సినవాడు.


కిం తద్విష్ణోర్బల మాహుః కాదీప్తిః కింపరాయణం

ఏకో యద్ధారయద్దేవః రేజతీ రోదసీ ఉభే


అందువల్ల ఒక్కో నక్షత్రం వెదుకుకుంటూ ఈభూమి పోయినా భగవంతుణ్ణి తెలుసుకునేవరకూ మనుగడ సాగించాలి. మరి ఈ భగవంతుడి భూమ్యాకాశాలలో ఉన్నాడా లేకపోతే మనం సృష్టించుకున్న భగవంతుడు ఈ భూమిమీదేనా ఉండేది అనే ప్రశ్నకి సమాథానం ఈ మంత్రం.  రోజతీ, రోదసీ లలో ఉండే భగవంతుడు భూమ్యాకాశాలని భరించగలిగేవాడు. మరి అతనికెలా ఇటువంటి తేజస్సు ఎలా సాథ్యమౌతోంది?


వాతాద్విష్ణోర్బల మాహుః అక్షరాద్దీప్తిః రుచ్యతే

త్రిపదాద్ధారయద్దేవః యద్విష్ణోరేకముత్తమమ్


వాయువువల్ల బలం, శాశ్వతుడు కనక తేజస్సు కలుగుతున్నాయి. త్రిపాదాద్విభూతి, మూడు అంశాల వల్ల ఈ భూమ్యాకాశాలనీ అంతరిక్షాన్నీ భరించగలుగుతున్నాడు. అలా భరించగలుగుతున్నాడు కనక భగవంతుడొక్కడే ఉత్తముడు.


రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమోవయం వై

స్రవణాయకుర్మహే సమే కామాన్ కామకామాయ

మహ్యం  కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరా

య వై స్రవణాయ మహారాజాయ నమః


మనకి ఏం చేయాలో తెలిసింది కానీ మనం చేసే ఈ పనులు, మన మనుగడకి కనుక్కో బోయే మరో భూమీ మనకి సులభంగా దొరుకుతాయా? మనం చేసే ప్రయత్నాలు చేసాక అవి ఫలించడానికి శరణు అనడం తప్ప మనం ఏం చేయగలం? అందువల్ల ఈ ప్రార్థన ఇప్పుడు – పరమోత్కృష్టమైన భగవంతుడు విశేషశ్రవణ శక్తి ఉన్నవాడు కనక మన కోరికలు తీర్చుగాక. విశేషశ్రవణ శక్తి ప్రస్తావన ఎందుకంటే ఆయనెక్కడో విశ్వాంతరాళంలో ఉన్నా ఆయనకి చీమ చిటుక్కుమన్నా వినిపించగలదు. అందువల్ల మనం శరణువేడేది ఆయనకి తెలిసి తీరుతుంది.


ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా

ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోన్నమః

అన్తశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు


ప్రణవాక్షరమైన ఓం అనేది గ్రహ నక్షత్రమండలాలు తిరుగుతుంటే వచ్చే శబ్దం అనుకున్నాం కనక అలా గ్రహగతులు దాటాక ప్రణవప్రతిపాదితమైనదే బ్రహ్మ, అదే వాయువు, అదే ఆత్మస్వరూపం, అదే సత్యం, అదే సర్వానికీ ఆధారభూతమై ఉంది. అనేక భూతాలలో అంతస్వరూపంగా నిబిడీకృతమై ఉన్న దానికి నమస్కారం.


త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమిన్ద్రస్త్వగ్ం రుద్రస్త్వంవిష్ణుస్త్వం బ్రహ్మ త్వం ప్రజాపతిః

త్వం తదాప ఆపోజ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్


భగవంతుణ్ణి ఏ రూపంలో కొలిచినా, ఎలాగ ఊహించుకున్నా, ఈ ఓంకారానికి కారణమైన పరమేశ్వరుడైనవాడూ, యజ్ఞరూపుడైనవాడూ, బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపుడూ అందరూ ఒకరే.


ఈశానస్సర్వవిద్యానామీశ్వరస్సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్

బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదా శివోమ్


ఈశానుడనే పేరుతో సర్వ విద్యలకీ కారణమైనవాడు – సర్వవిద్యలూ మరో భూమి వెతుక్కోవడంలో సాయపడతాయి కాబట్టి, ప్రాణికోటికి అథిపతీ అయిన పరమాత్మ మనలని అనుగ్రహించుగాక.


తద్విష్ణో పరమం పదగ్ం సదా పశ్యన్తి సూరయః  దివీవ చక్షు రాతతమ్

తద్విప్రాసో విపన్వవో జాగృదాం సస్సమిన్దతే విష్ణోర్య త్పరమం పదమ్


పండితులు, అంటే ఋషులైనవారు ఇక్కడే తమ హృదయంలో కనుకొన్న భగంతుణ్ణి తాము దర్శించిన జ్ఞానం వల్ల కన్నులకి కట్టినట్టూ దర్శించగలుగుతున్నారు. అంటే ఈ భూమిమీదో, అంతరిక్షంలో మనం కనుక్కోబోయే మరోచోటో మొత్తానికి భగవంతుణ్ణి దర్శించగలిగేది మాత్రం, మొదట్లో చెప్పినట్టు మన హృదయంలోనే.


ఋతగ్ం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగళమ్, ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమోనమః

ఓమ్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్


మోక్షపదంలో ఉండేవాడూ, కృష్ణవర్ణంలో ఉండేవాడూ, పరబ్రహ్మమూ అయిన భగవంతుడికి నమస్కారం. ఇది మనం చేసే పనులకి శక్తి ఇవ్వడానికీ, శరణువేడే దారిలో చేసే మరో ప్రార్థన. అయితే ప్రతీ మనిషి తలొక విధంగా ప్రార్ధన చేస్తాడు కనక ఎవరెలా చేసినా మొత్తానికి మనసు ముఖ్యంగానీ రూపురేఖలూ రంగులు ముఖ్యం కాదనీ ఎవరెలా ప్రార్థన చేసినా భగవంతుడు ఒకడేననీ చెప్పేది చివరి మంత్రం.


ఆకాశాత్పతితం తోయం యథా గచ్ఛతి సాగరమ్ సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్ఛతి


ఆకాశంలోంచి కిందపడే నీరు ఏ విధంగా అయితే సముద్రాలకి చేరుతోందో అదే విధంగా ఏ దేవుడికి నమస్కారం పెట్టినా అది ఒకే భగవంతుణ్ణి చేరుతోంది.


మొత్తానికి మనకి తెలిసేదేమంటే భగవంతుణ్ణి దర్శించడానికి మనం చూడవల్సినది ఒకటే దారి – మన మనసులోకి. అది కష్టం కనకా, మన ఆయుర్దాయం చాలదు కనకా అలా ప్రయత్నాలు చేస్తూ ఒక జన్మ తర్వాత మరో జన్మ ఎత్తున్నప్పుడు ఈ భూమి మీద మనుగడ కష్టం కనక వేరే చోటు వెతుక్కోవడం తప్పనిసరి. వేరే గ్రహగతుల్లోకి వెళ్ళినా, భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మార్గం అనన్య శరణాగతీ, అంతర్దృష్టీ. నాన్యపంథా విద్యతే అయనాయ – ఈ దారి తప్ప ఎంత, ఎవరు, ఎలా, ఎక్కడ గింజుకున్నా, వేరు దారి లేదు.


***సమాప్తం*** 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.