జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.🙏🏼
డా. బోచ్కర్ ఓం ప్రకాశ్ గారికి గ్రంథత్రయావిష్కరణ సందర్భముగా అభినందనలు.
🌹🍇🍑🤝🏼👍🏻
శా. శ్రీమన్మంగళ సత్ సభాసదులకున్ శ్రీ యోంప్రకాశ జ్ఞానికిన్,
శ్రీమద్వేదిక నున్న పూజ్యులకు, వాసిన్ వెల్గు మిత్రాళికిన్,
బ్రేమానంద మహత్వ మూర్తులకు, భావిన్ బ్రోచు పూజ్యాళికిన్,
శ్రీమచ్ఛాంభవి దీవనల్ కలుగుతన్, శ్రీభారతీ సత్కృపన్.
శా. శ్రీమన్మంగళ బోచ్కరాన్వయ! సుధీ! శ్రీ యోంప్రకాశా! శుభం
బో మాన్యా! వరలంగ లోకమున దివ్యోద్భాస గ్రంథత్రయం
బీ మాన్యాళి సమక్షమందు సభలో నిప్పట్టు నావిశ్కృతిన్
బ్రేమన్ జేయఁగఁ జేసె భారతి, భళీ! విజ్ఞుల్ మిమున్ మెచ్చగన్.
సీ. ఆనందభరిత నిత్యానందరావుగా
రతిథిగా సభలోన నలరినారు,
కమనీయ సాహిత్య కమలాకరంబైన
సాగివంశజ శర్మ సభను వెలిగె,
ప్రఖ్యాత రమణీయ పద్యప్రకాశాత్మ
శ్రీరమణాచారి చెలగిరిచట,
మామిడి హరికృష్ణ మహిత సాంస్కృతిక సం
చాలకు లిచ్చోటు సదయనిచ్చె,
తే.గీ. దర్శనానంద హైందవ ధర్మమూర్తు
లెందరెందరో యీ సభ యందు కలరు,
శ్రీ ఫణీంద్రుఁడున్, మహితులున్ జిత్తమలర
నిలిచి రావిష్కరణమున నిండుగాను.
సీ. జయ మార్గమున శ్రీయశశ్వినీ సత్కృతిన్
మంచినీళుల రమామణి వచించె,
సభను నానారాజ సందర్శనానుశీ
లనను సాయి వచించె ఘనతరముగ,
ప్రఖ్యాత రమణీయ ప్రద్యప్రకాశ సద్
వ్యాఖ్యను రాజేంద్ర ఖ్యాతిఁ దెలిపె,
మహితమైన సభాస మన్వయ సద్వ్యాఖ్య
స్వాతిప్రసాదంబు వరలఁ జేసె,
తే.గీ. యిట్టి మహనీయ సభలోన నిచ్ఛతోడ
నన్ను, గాయత్రిగారిని, సన్నుతముగ
నుత పురస్కృతులను జేసి క్షితిని మాకు
ఘనత పెంచిరో బోచ్కర్ సుకవివరేణ్య!
ఉ. మంగళమౌత బోచ్కరుని మంజుల గ్రంథ సురత్న పాళికిన్,
మంగళ మోంప్రకాశునకు, మంగళ మీ సభనున్నవారికి,
మంగళమౌత గ్రంథములు మంచిగ నెంచి పఠించువారికిన్,
మంగళమౌత శాంభవికి, మంగళముల్ మన భారతాంబకున్.
స్వస్తి.
అమ్మ దయతో🙏🏼
చింతా రామకృష్ణారావు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.