జైశ్రీరామ్.
కం. శ్రీ దాయిని నిత్యోదయ
వేదాంత నిరూపితార్థ ప్రియవాగ్ధాత్రిన్
నాదౌ రీతిని దలతు ను
షోదయవేళా విరాజ శోభాకృతిగాన్ ...1
భావము.
అమ్మా శ్రీ లలితా! అన్ని విధాల సిరిసంపదలు ఇచ్చే తల్లివి నీవు. వేదవేదాంతాలే నిన్ను ఇలా ఉంటావని పూర్తిగా నిరూపించలేక ఎప్పుడు కొత్తగానే నీ గురించి చెప్తాయి. ఐనా నా మాటలన్నీ ఇష్టంగా నీవు ఇచ్చినవేకదా! ఇలా ఏదో నాకు తోచిన విధంగా ఇష్టమైన ఈ మాటలతో ప్రతి ఉదయాన వెలిగే వెలుగుల అందమైన రూపానివిగా నిన్ను భావించి తరిస్తున్నాను. కనికరించు.
కం. తలచెద నుదయపు వేళల
లలితాంబిక వదన కమల రాగాధరమున్
లలియౌ ముత్తెపు ముక్కెర
గల చంపక నాసికన్ ప్రకాశిత నేత్రన్...2
భావము.
అమ్మ శ్రీ మాతా! ఈ ఉదయం నిన్ను తలుచుకోగానే అందమైన కమలంలాంటి నీ ముఖంలో ఎరుపెక్కిన పెదాలు కనిపించాయి. అవి నాకేదో అద్భుతమైన మాటలు చెబుతున్నాయేమో అనిపించింది. అదిగో నీ ముక్కున మెరిసే సొగసైన ముత్యాలముక్కెర. దాని తెల్లని వెలుగుల్లో నీ మాటలు నన్ను ఆశీర్వదిస్తున్నట్టు ఉన్నాయి. ఆపైన సంపెంగలాంటి అందమైన కోటేరు ముక్కు, దానిపైన ప్రకాశించే నీ రెండుకళ్ళు.. ఇవన్నీ నాకు ఈ ఉదయాన్ని మరింత శోభామయం చేశాయమ్మా!
కం. తలచెద చెవిదాకెడి క
న్నుల వాత్సల్యమును గుఱియు, నూతన తిలకో
జ్జ్వల ఫాలలోచనను, కుం
డల దీప్తిన్ మందహాస టంకార శృతిన్...3
భావము.
అమ్మా !ఈ తెల్లారి వేళ నిన్ను తలచుకోగానే నీ ఏటవాలుకళ్ళు నా పైన అనంతమైన, కరుణాపూరిత వాత్సల్య రసాన్ని కురిపిస్తున్నాయి. నీ కడగంటి కటాక్షానికి నోచుకున్న ప్రియతనూజుడిని నేనే కదా! నీ విశాలమైన నుదిటిభాగంలో పెట్టుకున్న కుంకుమ ఎప్పుడూ క్రొత్తగా ప్రకాశిస్తూ అందమైన మూడవకన్నులా అగుపిస్తుందమ్మా! (త్రినేత్రుని అర్థాంగివి కదా) అది మా పైన ఎప్పుడు అమృతాన్నే వర్షిస్తుందమ్మా! నీ చెవులకు పెట్టుకున్న ఆ అందాలదుద్దులు, అవి సూర్యచంద్ర మణులతో వెదజల్లే కాంతులలో అలా అలా కదులుతూ మృదువైన టంకార నాదాలు చేస్తూ, నీ పలుకులకు శృతి కలుపుతున్నట్టుగా ఉన్నాయమ్మా!
కం. తలచెద లలితా సుందరి
గళమంగళ సూత్రరక్షఁ గారుణ్యముతో
తలదాల్చిన నెలవంకను
తులలేని విభవములిచ్చు తోయజ నేత్రన్..4
భావము.
అమ్మా లలితా మాతా! సర్వమంగళ స్వరూపిణివి అయిన నీవు మంగళ సూత్రంతో ఎల్లవేళలా ఈ లోకాలనన్నిటినీ కాపాడుతున్న జగన్మాతవు! పరమ కరుణామయమైన హృదయంతో తలపైన నెలవంకను ధరించి ఈ లోకాలకు వెలుగులు ప్రసాదిస్తున్నావు. నీవే పద్మవు. పద్మం లాంటి నీముఖ బింబంలో కమలాల వంటి నీ కళ్ళు మాకు లెక్క లేనన్ని సంపదలను అందిస్తున్నాయి . ఉదయాన్నే ఇంతటి నీ త్రిపురసుందరీ రూపాన్ని తలచుకుంటే చాలు అన్ని శుభాలే!
కం. కొలిచెద నుదయమె సదయను
కలితమృగమద సులలాట కాంతిన్ క్షాంతి
న్నలకల చిరుమేఘావళి
కళలలరారెడు విలాస కాదంబినినిన్...5
భావము.
అమ్మ శ్రీ లలితా! ప్రతి ఉదయము అందమైన నీ నుదుటి కాంతితో విరిగిపోతుందమ్మా! తలచుకుంటే చాలు ఒళ్ళు పులకరించిపోతుంది. లోకాని కంతటికీ క్షమాగుణంతో క్షేమాన్ని కలిగించడానికి కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యాలను పూయగా తళుక్కుమనే నీ నుదుటి భాగం సరికొత్త కాంతితో మెరిసిపోతుందమ్మా! నల్లటి దట్టమైన నిండైన నీ కొప్పు ఆకాశంలాగా ఉంటే నుదుటిఅద్దంపై అలా అలా నెమ్మదిగా కదలాడే నీలిముంగురులు చిరు మేఘాలలాగా ఊగిసలాడుతున్నాయి.
కం. అలయక భజింతు లలితాం
బ లసద్విలసిత కదంబ ప్రాంచద్భూషాం
చల నికురంబ కరంబుల
మలంపులల రత్నకుంభ కాంతిచ్ఛటలన్ ...6
భావము.
అమ్మా లలితాంబికా! కోరిన కోరికలు తీర్చే కదంబకల్పవృక్షం లాంటి నీ అందమైన రత్నాభరణాలుగల చేతులలో ధరించిన ఆపాత్ర ఏమిటమ్మా? ఓహో ! అది మా కొరకు అందిస్తున్న దయామృత రత్న భాండమే కదా! దాన్ని మాపై ఒడుపుగా ఒలికిస్తున్నప్పుడు గలగలమని వినిపించే మణి మాణిక్యాలు పొదిగిన నీ గాజుల చప్పుడు దివ్యకాంతి రేఖలను కూడా మాపై ప్రసరింపజేస్తుంది. ఇంతటి దయామయివైన నిన్ను అలుపన్నది లేకుండా కొలుస్తాను.
కం. ఉదయమె దలంతు మణులను
పొదిగిన హేమాంగుళీయ ప్రోద్యత్ప్రభలం
దొదవెడు రమణీయామే
య దయావిర్భూత వాంఛితార్థవిధాత్రిన్...7
భావము.
తల్లీ! ఈ ఉదయం వేళ నిన్ను చూస్తున్న సమయంలో నీ పది చేతుల వేళ్లకు ధరించిన బంగారు ఉంగరాలు, వాటికి పొదిగిన రత్నాలు అంతులేని ఆనందాన్ని కలిగిస్తున్నాయమ్మా! నీ చేతి వ్రేళ్ళకున్న ఉంగరాలలోని రత్నాల కాంతి సామాన్యమైనదా! అది కాంతి కాదేమో మా కోరిన కోరికలన్నీ తీర్చడానికి దయామయివైన నీ హృదయంలో ఉప్పొంగిన ప్రేమనంతా ఇలా మాపై కురిపించడానికి నీ చల్లని చేతులలో అంతటి వెలుగులు దాచుకున్నవేమో!
దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు లోకంలో శ్రీ మన్నారాయణమూర్తి అవతరించిన పది అవతారాలు కూడా నీ పది వేళ్ళ నుంచి వచ్చినవే కదా !
కం. ఉదయమె భజింతు జననిని
హృదయానందకర లీల నీశ్వర ప్రేమా
స్పద విభవాఢ్య సుహాసిని
రదనాచ్ఛ రుచిర విభాస రాగాహ్లాదిన్...8
భావము.
జననీ! నిన్ను తలచుకుంటే చాలు. ఈ ఉదయము మా హృదయాలను రాగరంజితం చేసే నీ అనురాగం లాగా ఉంది. పరమేశ్వరుని ప్రేమకు నిలయమైన ఆనందదాయనివి నీవు. నీ సుందర దరహాసంలో ఈశ్వరుని ప్రేమ ఉంది. అది నీ చిరునవ్వురూపంలో ఈ లోకానికి చాటుతున్నావు. స్వచ్ఛంగా మనోజ్ఞంగా నవ్వుతున్నప్పుడు తెల్లనైన నీ పలువరస నుండి వెలువడే అందమైన కాంతులు ఈ ఉదయరాగంలో ప్రతిబింబించి మా మనసును ఆనంద డోలికలలలో ఓలలాడిస్తుందమ్మా!
కం. లలితాంబిక ప్రాభవముల
తొలిపొడుపులగని నుతింతు తోషమునిండన్
ఖల తామసము హరించెడు
విలయాభీల వికరాళి విజయన్కాళిన్...9
భావము.
తల్లీ! ఈ తొలిపొద్దుపొడుపులలో నిన్ను ఎంతగా పొగిడితే అంతగా నా మనసు ఆనందంతో ఊగిపోతుంది. నీవే దేవివి కనుక ఈ దివ్యత్వం అంతా నీ కరుణే కదా! తల్లిగా లాలిత్యాన్ని చూపుతావు. దుష్టులపాలిటి కాళికవౌతావు.
అజ్ఞానమనే అంధకారాన్ని తనుమాడడానికి అవతరించిన ప్రళయకాలభీకర వికరాళివి, విజయాలకు కారణభూతమైన విజయ దుర్గవు నీవే! చిమ్మ చీకట్లను చీల్చిచెండాడి వెలుగుల వివేకాన్నిపంచి పెట్టే నీకు నమస్సులు.
కం. తలతు నుదయ సంధ్యారుణ
తిలకంబును భ్రుకుటి మధ్య దీర్చిన తీరున్
ఛలధూర్వహ తిమిరాపహ
కలభాస్వంత ముఖబింబ గౌరవదీప్తిన్...10
భావము.
జగన్మాతా! ఈఉదయ సంధ్యా సమయంలో నెమ్మది నెమ్మదిగా తిమిరాలను చీల్చివేస్తూ అరుణారుణ కాంతులు వెల్లడౌతున్నాయి. ఉదయభాను బింబం నీ నుదుటి నడుమతీర్చిదిద్దిన కుంకుమ విలేపనంలాగా తోస్తుంది. నీముఖబింబానికి మరింత శోభను గౌరవాన్ని కలిగించే ఉదయరవిబింబాన్ని తలచుకోగానే మాలోలోపలి చీకట్లన్నీ పారిపోతున్నాయి.
కం. తలచెద నుదయ కుహూరత
కిలకిల సుస్వన పతంగ గీర్వాణోక్తుల్
పలికిన పలుకులు జననికి
పులకలు గలిగించు మేలు పొద్దులుగాగన్...11
భావము.
అమ్మా! ఈ ఉదయాన్ని తలచుకుంటే ఎంత మనోజ్ఞంగా ఉందోచూడు. మాకన్నా ముందుగానే నిద్దుర లేచిన పక్షులన్నీ కిలకిలమని కుహూ కుహ రావాలు చేస్తున్నాయి. బహుశా పక్షులన్నీ మధురాతి మధురంగా వాటి భాషలో ఈ అందమైన ఉదయవేళ నీకు శుభాకాంక్షలు చెప్తున్నాయేమో! అందుకేనేమో నీకీ గగుర్పాటు కలుగుతుంది కదా!
కం. తలచెద ప్రభాత వేళల
తలవాకిట వేచియుండు దనుజారి గమిన్
తలమోపగ తల్లియెదుట
నిలువంబడు వే నిలింప నికరము నిపుడున్... 12
భావము.
జగదానందకారిణివైన జనయిత్రీ! తెల్లవారుజామున గుమ్మం ముందు నీ దర్శనానికై దేవతలందరూ వేచిఉన్నారు. ఎప్పుడెప్పుడు నీ దర్శనం అవుతుందా అని ఎదురుచూస్తూ కనపడగానే నీ పాదాలపై తలలుంచి నమస్కరించాలని ఆరాటంతో వేగిరపడుతున్న ఈ దేవత సమూహాన్ని కనికరించడానికి త్వరగా నిద్రలేచి రావమ్మా! అని తలచుకుంటున్నాను.
కం. తలచెద బలరిపు గణముల
మిలమిలమెరిసెడు కిరీట మేదుర కాంతుల్
గల లలిత రత్న నూపుర
ఝలంఝల విలాస కాంతి సదమల శోభన్... 13
భావము.
మాతా! నీ ఉదయకాల దర్శనం కోసం కొలువుదీరిన ఇంద్రాది దేవతలందరి అదృష్టం పండింది. అద్భుతమైన దివ్యమైన నీదర్శనభాగ్యం వారికి లభించింది. అమ్మా! ఇంద్రుడు మొదలైన దేవతలందరు నీకు పాద నమస్కారాలు చేసేవేళ వారి కిరీటాలలో పొదిగిన మణులకాంతుల ధగధగలతో నీ పాదాల మువ్వల రత్నాలకాంతులు జతపడి మరింతగా వెలుగులీనుతున్నాయి. స్వచ్ఛమైన నీపాదమంజీరాల చిరుసవ్వడులుతెచ్చే కాంతి ప్రసారంతో ఈ ఉదయ దర్శనం సరికొత్తగా భాసిస్తుంది.
కం. శ్రీ లాస్యంబుగ దలచెద
లాలిత కుసుమమలయానిలమ్ముల జల్లున్
దూలిన పరీమళములకు
శ్రీలలితాసతి మురిసెడు స్మితవదనంబున్...14
భావము.
అమ్మా! నీవు నిద్ర లేచే సమయం అయిందని ఎలా తెలిసిందో ఏమో ఈ
ప్రకృతి కూడా పులకరించిపోతుంది. విలాసంగా పూల చెట్లన్నీ అందాల
పూల జల్లులు కురిపిస్తున్నాయి. పూల జల్లులు కురుస్తూ ఉన్న ఉదయం
పూట మలయ పర్వతం నుంచి వచ్చే చల్లనిగాలి ఆ పూల పరిమాణాలను
మోసుకుని వస్తూ ఉంటే అమ్మా! అది అందమైన నీ విలాస లాస్యంలాగా
మాకు తోస్తుంది. ఈ పూల జల్లులకు, ఈ మలయానిల సౌరభాలకు
మురిసిపోతూ చిరునవ్వులు చిందించే నీ సుందర ముఖబింబాన్ని
దర్శించడమే మా భాగ్యంకదా!
కం. ప్రాభాత వేళ దలచెద
సౌభాగ్యము గూర్ప భూరి సాష్టాంగవిధిన్
శ్రీ భక్త సౌఖ శాయని
కాభీష్ట ప్రణతుల మురియు హ్లాదమ్మునకున్...15
భావము.
ఓ శ్రీ మాతా! ప్రతి సుప్రభాత సమయంలో నిన్ను తలిచి పొంగిపోతున్నానమ్మా! నీ భక్తులు పొద్దుపొద్దుననే నిన్ను నిద్దుర లేపి కుశలమడిగి, చేస్తున్న సాష్టాంగ నమస్కారాలకు నీవెంతో మురిసిపోతున్నావమ్మా! నమస్కరించినంత మాత్రాన వారి మదిలోని కోరికలను గ్రహించి సంతోషంతో సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తున్నావు కదమ్మా!
కం. నిత్యోదయ దర్శనముల
నత్యంత సుఖద కవోష్ణ హార్ధస్పర్శా
దిత్య కరమ్ముల వెలిగెడు
సత్యానుభవమ్ము జనని సాంగత్యముగన్..16
భావము.
ఓ జనయిత్రీ ! ప్రతి నిత్యము నిన్ను దర్శించడానికి వచ్చిన సమయంలో, అప్పుడే ఉదయించిన లేలేత సూర్యుని కిరణాల గోరువెచ్చని వేడి, ఆ వేడితో పాటు వచ్చేవెలుగు మాకు వెచ్చగా తగలడం వల్ల అమ్మా! నీఒడిలొ పడుకున్న మా చిన్నప్పటి ఆనంద స్పర్షా సుఖాన్ని అనుభవిస్తున్నాను. నిజమైన నీ ప్రణయాన్ని ఇలా సూర్య కిరణాల రూపంలో అందిస్తూ లాలిస్తున్నావు కదా!
కం. ఉదయశ్రీరాగమధుర
మృదులోహల సద్ద్విజాళి మేల్భజనంబుల్
సదయామయి తల్లికిడెడు
హృదయాంజలి సుప్రభాత మిదియని దలతున్... 17
భావము.
అమ్మా! దయామయీ!! ప్రతి ఉదయం నిన్ను మేల్కొల్పే సమయంలో వేద పండితులు సుసంస్కృత శబ్దాలతో, శ్లోకాలలో మృదు మధురంగా సుప్రభాతగీతాలు ఆలపిస్తారు. సద్విజులు చేసే ఆ అమృత గానం ఎంత గొప్పదో అప్పుడప్పుడే నిద్రలేచి రెక్కల నల్లారుస్తూ పక్షులు ( ద్విజులు) చేసే ఈ కిలకిలా రావాలు కూడా ఉదయశ్రీ రాగంలో నిన్ను కీర్తిస్తున్న మేలి మేలుకొలుపు లాగానే అనిపిస్తుందమ్మా నాకు.
కం. కన్మూసి తెరిచినంతనె
తన్మూలమగుజగతి గతి తడబడురీతిన్
మన్మనమునదలచెద నా
యున్మేషనిమిష విపన్న ప్రోద్యద్ధాత్రిన్..18
భావము.
అమ్మా! నీవు కన్ను తెరిస్తే సకలచరాచర సృష్టికి జననం. నీ కనుల వెలుగుసోకితే జీవచైతన్యం. నీవు కన్నుమూస్తే విలయం. ఒక్కసారి నీవు కన్ను మూసి తెరిచినంతలో(రెప్పపాటులో) ఈ జగత్తంతా చావు పుట్టుకల సయ్యాటగా మారిపోతుంది. సృష్టి, స్థితి, లయకారకు రాలివయిన నీవే కదా ఈ జగతికి ఆధారం. అందుకనే మదిలో నీ స్మరణతోనే ప్రతి ఉదయాన్ని ప్రారంభిస్తాను.
కం. పతి విసమున్ ద్రావగ స
మ్మతినిడు సౌభాగ్య సర్వమంగళ నిచ్ఛా
మతిదలతును ప్రత్యుదయము
శ్రుతిసీమంతిని నపర్ణ శుభకామేశిన్... 19
భావము.
జగన్మాతా! క్షీరసాగర మధన సమయంలో పాలసముద్రాన్ని చిలుకుతున్న సమయంలో పుట్టిన విషాన్ని త్రాగడానికి నీ భర్త అయిన పరమేశ్వరునికే అనుమతినిచ్చిన గొప్ప ఇల్లాలివి కదా! నీ మంగళ సూత్రాల పైన నీకున్న నమ్మకం అలాంటిది. తల్లులందరి మంగళసూత్రాలను కాపాడే సర్వమంగళ స్వరూపిణివి నీవే కదా! వేదాలే తలపై దాల్చిన సౌభాగ్యకర సిందూర రూపమైన అపర్ణా సతివి నీవు. కామేశ్వరునికి ప్రాణ సఖివి కనుకనే అన్ని సౌభాగ్యాలకు నిలయవైనావు. నిన్ను తలచుకున్న ప్రతి ఉదయమూ నాకు శుభోదయమే.
కం. ప్రాతర్వేళల వినెదను
మాతృశ్రీ విభవ వేదమంత్రోచ్చరణో
పేత శుచీభూత ఘన
శ్రౌతస్మృతి విధి పఠించు సామనిగమమున్...20
భావము.
తల్లీ! తెల్లవారిపోతుంది. ఉదయకాల స్నానసంధ్యావందనాదులు నిర్వర్తించుకొని వేదవిదులైన వారు శ్రీ సూక్త అరుణసూక్తాది పారాయణలతో నీ గుణ వైభవాలను మంత్రముగ్ధ గానంగా ఆలపిస్తుంటే, వారు పఠిస్తున్న సుస్వర సామగానం, ఆ వేదనాదం మనసులను పవిత్రం చేస్తుందమ్మా! వింటున్న మేమెంత మురిసిపోతున్నామో నీకు కూడా ఎంతో సంతోషం కలుగుతుంది కదమ్మా!
కం. వేదనతొలగగ గొలిచెద
సాదరి మా! సరిగ సాగ సామసుదీప్తిన్
వేదమయిన్ నాదాత్మగ
పాదసరిగ రిగమ దద పపాయని శ్రుతులన్...21
భావము.
హేమాతా! సంగీత సాహిత్య సమలంకృతివి నీవు. వేదమయివి, నాదమయివీ నీవేకదా! వినగానే ఆనంద డోలికలలో విహరింపజేసే సంగీతానికి ఉన్న లయాత్మకత మా వేదనలన్నీ తొలగిస్తుందమ్మా! మా నిర్వేదాన్ని పారద్రోలే వేదాన్ని "సాగరి మా సరిగా సాగా పాదసరిగా రిగమా దాదా పపా " అని సప్త స్వరాల ఆరోహణ అవరోహణలతో అందిస్తున్న సామగానం నీవు కూడా చెవులకింపుగా వింటున్నావు కదా!
కం. వెలుగై నొకపరి చెలగుచు
తలపై నొకపరి నితాంత తామస హరమై
పలుకైవెలువడి వైఖరి
పలుతీరులగాంతు జనని వాగ్వైభవమున్...22
భావము.
అమ్మా! సృష్టిలో ఏ ప్రాణికోటికి ఇవ్వని వాక్కును మాకు ప్రసాదించావు. నీవు ఇచ్చిన ఈ వాక్కుతోనే అనేక తీరులుగా నిన్నే స్తుతించగల అదృష్టాన్ని నాకు ప్రసాదించావు.
చైతన్య రూపమైన ప్రకాశానివై నాలోనే ఉంటూ చీకట్లను పారద్రోలుతావు. ఒక్కొక్కసారి పరా రూపంలో హృదయంలో కుదురుకున్న వాక్కువై పశ్యంతిగామారి మధ్యమగా నాలుకపై చేరి వైఖరీ రూపమైన మాటగా లోకానికి నిన్ను అందించే శక్తిని ప్రసాదిస్తావు. ఈజన్మకు ఇంకేం కావాలమ్మా!
కం. వెలుగుల వెల్లువ లలలై
మిలమిల ప్రాచీ దిశగను మేల్మురిపెపు ద్రో
వల శ్రీ లావణ్యంబై
చెలగిన మృదుభావనము వచింతును సతమున్..23
భావము.
అమ్మా! తూరుపు తెల్లబారుతుంది. క్రమక్రమంగా వెలుగుల ప్రవాహం అలలు అలలుగా లోకమంతా విస్తరిస్తుంది. వెలుగులన్నీ తూర్పు దిక్కునుంచి ముద్దు మురిపెంగా ప్రయాణం చేస్తూ శోభస్కరమైన అందాలతో కనువిందు చేస్తున్న వైనాన్ని మృదుమధురమైన భావనలతో ఇలాగే ప్రతి ఉదయాన వర్ణిస్తూనే ఉంటానమ్మా!
కం. హృదయ మపర్ణాలయముగ
నొదవిన ప్రతిపద్యమామె యూపిరి కాగా
సదయామయి నర్చింతును
మృదుకచ్ఛపి నాదమట్లు మేలిమి జతితోన్...24
భావము.
అమ్మా! ఎంతటి దయగల తల్లి వమ్మానీవు! శివుని యెదలో నీవు కొలువై ఉన్నట్లే నా హృదయంలోనూ అపర్ణాదేవివై నిండుగా నీవై ఉన్నావు. నాలో పురుడు పోసుకున్న ప్రతిపద్యానికీ నీవే ఊపిరులూదుతున్నావు. నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో నీవు మ్రోగించే కచ్చిపి నాదమే శ్రుతి చేసుకుని వుంటుంది. ఇలాగే ఉండమని నిన్ను ఎల్లప్పుడూ కొలుస్తుంటాను.
కం. ప్రాతస్సంధ్యా సమయ
జ్యోతిర్మండల ప్రదీప్త శోభామయమౌ
శ్రీతను కాంతిని శాంతిని
చేతన ముప్పొంగ గొలుతు క్షేమంకరినిన్... 25
భావము.
అమ్మా! లోకాల కన్నిటికీ క్షేమాన్ని సమకూర్చే తల్లివి నీవే కదా! ఉదయసంధ్యా సమయంలో ఆకాశమండలంలో వెలిగే నక్షత్రాలన్నీ నీ శరీరకాంతిని లోకానికి అందిస్తూ శాంతిని ప్రసాదిస్తున్నాయి. కాంతికీ, లోక శాంతకీ ఆధారానివి నీవే! ఇంతటి దయగల నిన్ను నా మనసు పొంగిపోయే విధంగా పదేపదే కొలుస్తుంటానమ్మా!
కం. తేజస్స్వాంత విధాత్రికి
నైజాప్తత నొసగినట్టి నయవినయములే
నాజన్మకు సాఫల్యత
పూజాపుష్పంబునగుదు పుణ్యోన్నతిచే. ..26
భావము.
అమ్మా! అంతులేని ప్రకాశాన్ని నా హృదయం నిండా నింపినటువంటి నీదైన ఆత్మీయతకు ఎంతో ఎంతో మురిసిపోతున్నానమ్మా ! నాకు నిన్ను ఎంతోకొంత వర్ణించగల నేర్పరితనాన్ని ఇచ్చావు. అందుకు తగిన వినయాన్నీ ప్రసాదించావు. ఇంకేం కావాలి? ఇంతకంటే నా జన్మకు సఫలత మరొకటి ఉంటుందా? అందుకే ఈ పద్యాలరూపంలో నా పూర్వజన్మ పుణ్యంతో నీ పూజకు పుష్పాన్నై పరీమళిస్తాను.
కం. శ్రీ దాక్షాయని రక్షగ
భేదమ్ముల బోనడంచి కృపగనువేళన్
హ్లాదమ్మెల్లడల విరియ
గా దల్లికి నొనరనిడుదు కార్తజ్ఞ్యంబుల్...27
భావము.
అమ్మా! నీ పేరే దాక్షాయిని. నీకంటే దయామయమైన తల్లి ఇంకెవరుంటారు?నీదయ కురిస్తేచాలు మాబాధలన్నీ పటాపంచలైపోతాయి. హృదయం ఆనందం తాండవ చేస్తుంది. ఇంతటి భాగ్యాన్ని ప్రసాదించిన నీకు ఎన్నైనా కృతజ్ఞతలు చెప్పుకుని నా ఋణం కొంతైనా తీర్చుకుంటాను.
***
ఇంత చక్కగా ఉదయశ్రీ లలితాతారావళి
రచించిన దత్త సహోదరులకు,
మనోహర సంగీతనును అందించిన శ్రీనివాసులకు,
చక్కగా ఆలపించిన సరస్వతీ రామశర్నకు అభినందనలు.
జైహింద్.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.