గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, జూన్ 2018, గురువారం

చాటువులు. ~కొరిడె విశ్వ నాథశర్మ. " యస్య షష్ఠీ చతుర్థీ చ

 జైశ్రీరామ్.
చాటువులు.
~ కొరిడె విశ్వనాథశర్మ.
" యస్య షష్ఠీ చతుర్థీ చ
విహస్య చ విహాయ చ |
అహం కథం ద్వితీయా స్యాత్ ?
ద్వితీయాస్యామహం కథమ్ ||”

సాధారణముగా ఏ కన్య యైనా తనకు కాబోయే భర్త చదువులో కాని, ఆర్థికములో కాని అధికారములో కాని తమస్థాయి కంటే ఉన్నతుడై ఉండాలని కోరుకుంటుంది. అటువంటి వరుడికై వెతుకుతుంటుంది. లేదా తమ స్థాయి యైనా అంగీకరించవచ్చు. కాని తన కంటే అధమమైనవాడిని ఎన్నుకొనుట ఎక్కడో ఒక చోట గాని సర్వ సాధారణముగా జరుగదు .
ఒక విద్యావతి పెళ్ళి చూపులో ఏమి రాని శుంఠను ఎట్లు వ్యతిరేకించిందో గమనించండి. వరుని పక్షమువాళ్ళతో వరుడు వచ్చినాడు. పెళ్ళిచూపులు జరిగినవి. అబ్బాయి అమ్మాయి నచ్చిందని చెప్పాడు. అమ్మాయికి ఆ అబ్బాయి చదువు మీద ఎందుకో అనుమానము వచ్చినేను కొన్ని ప్రశ్నలు వేస్తాను చెప్పమంది. ఆ అమ్మాయి విద్వాంసుడైన తండ్రి దగ్గర చదువుకొన్నది. మంచి విద్వత్తును సాధించుటయే కాక ఛందోబద్ధకముగా పద్యములల్లగల విదుషీమణి. అబ్బాయి సరే అడుగమన్నాడు.
అమె కొంచం తేలికయైన పదములను అడిగి , ఆ తర్వాత క్లిష్టమైన వాటిని అడుగాలని అనుకొన్నది.‘విహస్య’ , ‘ విహాయ’ , ‘ అహం ’ అనువాటి వ్యాకర్ణవిషయములను తెల్పమన్నది.
అప్పుడా అబ్బాయి తడబడ్డాడు. బాగాచదువుకొన్నవాడని దాంబికాలు చెప్పాడే కాని నిజమునకు రామ (మొదటి) శబ్దము తప్పించి మరొకటి రాదు. అందుకే విచారించాడు. ఐనా లేని ధైర్యాన్ని తెచ్చుకొని అంతా తెలిసిన వాడివలె " దీంట్లో ఏముంది అన్నీ రామ శబ్దము వలెనే ఉంటాయి. ‘విహస్య’ రామ శబ్దములో ‘ రామస్య, రామయొః, రామాణాం’ అని చెప్పినట్లే ‘విహస్య , విహయోః , విహానాం ’ , అని షష్ఠి విభక్తి విహునియొక్క అని అర్థము. అన్నాడు. ఐతే మరి ‘ విహాయ ’ ఏమిటి అని అడిగితే అది కూడ రామ శబ్దము వలె చతుర్థీ విభక్తి . విహునికొరకు అని అర్థము. అన్నాడు. ఒహో అట్లానా ! మరి ‘ అహం ’ ? అని అడగగా అయ్యొ అది ద్వితీయా విభక్తి. అహునిగురించి అని అర్థము. అని చెప్పగానే.. ఆ అమ్మాయికి ఆ శుంఠని చూచి క్రొధురాలై ‘ ఈ పరమ శుంఠను నేను చేసుకోను అన్నది. ఎందుకమ్మా? అని బంధువులడగగా అప్పుడు ఈ శ్లోక రూపకముగా జవాబు చెప్పినది.

" యస్య షష్ఠీ చతుర్థీ చ
విహస్య చ విహాయ చ |
అహం కథం ద్వితీయా స్యాత్ ?
ద్వితీయాస్యామహం కథమ్ ||”

ఈ మూర్ఖునికి రామశబ్దము తప్పించి మరొకటి రాదు. విహస్య , విహాయ పదములు షష్ఠీ చతుర్థీ అని చెప్పే ఈ అల్పాజ్ఞాని నాకిష్టము లేదు. అహం అనేది ద్వితీయా అని చెపుతున్నాడు. అదెట్లా ఔతుంది. అందుకే అహం (నేను) ఈతనికి ద్వితీయ ( భార్య) ను ఎట్లగుదును ? అని ప్రశ్నిస్తూ వ్యతిరేకతను తెలిపింది. ఇక్కడ విహస్య విహాయ రెండూ కూడ ల్యప్ ప్రత్యయాన్తరూపములే కాని శబ్దములు కావు. అవి అవ్యయములు. (లింగవిభక్తి వచన శూన్యములు.)
అనగా ఇక్కడ ‘ హస్’ ధాతువుపై ‘ వి ’ అనే ఉపసర్గ చేర్చుతద్వారా అసమాపకార్థమున ‘ ల్యప్ ’ అనే కృత్ ప్రత్యయము వచ్చి ‘ విహస్య ’ (నవ్వి) అనేపదము, అదేవిధముగా ‘ విహాయ ’ కూడ ‘ హా ’ త్యాగే అను ధాతువుపైన ‘ ల్యప్ ’ వచ్చి ‘ విహాయ ’ ( వదిలి ) అని మారును. అదేవిధముగా అహం అనేది దకారాన్త ‘ అస్మద్’ శబ్దము యొక్క ప్రథమావిభక్తి. నేను అనే అర్థము కలది.
ఈ శ్లోకము ద్వారా ముఖ్యముగా ఉత్తరార్ధముద్వారా ఆమె వైదుష్యము చక్కగా ప్రదర్శితమగుచున్నది.
జైహింద్
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ కొరిడె విశ్వనాధ శర్మ గారి చాటువులు చమత్కార భరితంగా ఆశక్తి కరంగా బాగున్నాయి. అభినందనలు.మా కందించిన శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.