గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, జూన్ 2018, శుక్రవారం

కవిసింహ కాఫీ దండకము. .. .. .. పోకూరి కాశీపతి

జైశ్రీరామ్.

కాఫీ దండకం

ఆర్యులారా!
కవిసింహ పోకూరి కాశీపతిగారిని మద్రాసులో జరిగిన అవధాన సభలో
కాఫీని గురించిన దండకంచెప్పమని
కోరినపుడు ఆశువుగా చెప్పినది.

శ్రీమన్మహాదేవి! లోకేశ్వరీ! కాళికాసన్నిభా హారిణీ!
లోకసంచారిణీ!అంబ!కాఫీ!జగన్మోహినీ! తొల్లి శ్రీకృష్ణు డా
స్వర్గమున్ జేరి పూతంబునౌ పారిజాతంబునున్ దెచ్చియున్
నాతికిన్ బ్రీతిగానిచ్చు కాలంబునందా సుమంబందునంగల్గు
బీజంబు లుర్వీస్థలిన్ రాలియున్ లోకభేదంబుచే కాఫి భూజంబుగా బుట్టియున్
గొమ్మలన్ రెమ్మలన్ బూవులన్
దావులన్ జక్కనౌ పిందెలన్ జక్కనౌ కాయలన్ జొక్కమౌ
పండ్ల‌ భాసిల్ల దద్బీజ జాలంబు నైర్లండు నింగ్లాండు హాలెండు
పోలెండు రష్యా జపాన్ జర్మనీ గ్రీకు దేశంబులన్ నాటి పెన్
మ్రాకులై ఇండియాన్ దోటలై విత్తనాలిచ్చుచున్నావటంచున్
మదిన్  దోచెడిన్ బాపురే! తీపిలో నీరమున్ క్షీరమున్ జక్కెరన్ మించుటన్
గాదె  నీ బీజ చూర్ణంబు నా మూటిలో
జేర్చి సేవించుటన్ నీదు బీజంబులన్ బెంచులో మాడ్చి
చూర్ణంబు గావించినన్ దీపి పోదాయె నీ మాధురీశక్తి నీ యింపు నీ సొంపు నీ
పెంపు వర్ణింప నేనెంత వాడన్
ధనాకర్షణీ! ప్రాణసంరక్షణీ! ధాత్రినెవ్వారలేన్ వేకువన్ లేచియున్
నిత్యకృత్యంబులన్ దీర్చి మున్ ముందుగా
నిన్ను సేవింప కేకార్యమున్ సేయగా లేరదెట్లందువా నిన్ను
బానంబు గావింపకున్నన్ ద్విజుల్ వేదమంత్రంబులన్
బల్కగాలేరు ప్రాంచత్కవుల్ పద్యముల్ హృద్యమౌరీతి నిర్మింపగా లేరు
శ్రావ్యంబుగా శౌరిదాసుల్ గళంబెత్తియున్
బాడి నృత్యంబులన్ సేయగాలేరు శిల్పుల్ మనస్ఫూర్తిగా
సుత్తె జేపట్టగాలేరు డ్రైవర్లు మోటార్ల స్టీరింగులన్ బట్టగాలేరు
*టీచర్లు పాఠంబులన్ జెప్పగాలేరు* డాక్టర్లు నింజక్షనున్
జేయగాలేరు ప్లీడర్లు నోరెత్తి వాదింపగాలేరు జడ్జీలు నే స్వల్పమౌ
తీర్పులన్ వ్రాయగాలేరు దిట్టంబుగా బాలసుల్
కూటసాక్ష్యంబులన్ జెప్పగాలేరు ముప్పూటలన్ నిన్నొగిన్
గ్రోలకున్నన్ శిరోభారమై నాల్క యెండున్ మనంబెంతొ
చాంచల్యమున్ బొందుచున్ గుండియల్ తల్లడం బందుచున్  మేను కంపించుగాదే!
కటాక్షంబుతోనిత్యమున్
వేకువన్ దర్శనంబిచ్చి  నిన్ బాగుగాద్రాగు సౌభాగ్యమున్గూర్చి
రక్షింపవే!సారెకున్ గొల్చెదన్నిన్ను *పోకూరికాశీపతి*స్వాంత రాజీవ
సంవాసినీ నీకికన్ మంగళంబౌ మహాకాఫిదేవీ!నమస్తే నమస్తే నమస్తే నమః.

జైహింద్.
Print this post

3 comments:

sam చెప్పారు...

dear sir very good blog and very good content
Telugu News

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ పోకూరి కాశీపతిగారి కఫీ దండకం అద్భుతముగా నున్నది.

Unknown చెప్పారు...

చాలా చాలా బాగుందండీ.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.