సాహిత్యసౌరభం
http://sahityasourabham.blogspot.in/2016/07/9.html
ఆంధ్రనామ సంగ్రహము
పైడిపాటి లక్ష్మణ కవి
క. శ్రీపతివంద్యు విశాలా
క్షీపతిని భజించి యిష్టసిద్ధులు వరుసన్
బ్రాపింపఁగ గణనాథుని
శ్రీపాదంబులకు నెఱిఁగి చెందిన వేడ్కన్ (1)
(ఇది ఇష్టదేవతా ప్రార్థనము. పైడిపాటి లక్ష్మణకవి ఆంధ్రనామ సంగ్రహము అనెడి గ్రంధరచనకు పూనుకొని ప్రారంభమున భగవత్ప్రార్థన తో ఆరంభించుచున్నాడు)
క. నతభక్తలోకరక్షా
రతికిం జంచత్కృపాతరంగితమతికిన్
శతమఖముఖసురనుతిసం
గతికిన్ మహిమోన్నతికిని గాశీపతికిన్ (2)
తే. అంకిత మొనర్తుఁ దెనుఁగుపేళ్ళరసి కూర్చి
గరిమతో నాంధ్రనామ సంగ్రహ మనంగ
నమరుకృతిఁ బైఁడిపాటి యేకామ్రమంత్రి
సుతుఁడఁ గవిలక్ష్మణాఖ్యుఁడ సుజనహితుఁడ (3)
(పైడిపాటి ఏకామ్రమంత్రి కుమారుడను, సజ్జనుల కిష్టుడనైన పైడిపాటి కవిలక్ష్మణూడను నేను తలచిన కోర్కెలు నెరవేరుటకై శ్రీమహావిష్ణువుచే పూజింపదగిన విశాలాక్షిపతి యగు కాశీవిశ్వేశ్వరుని ధ్యానించి పిదప విఘ్నేశ్వరుని మహిమగలపాదములకు మ్రొక్కి దేవేంద్రుడు మొదలగు దేవతలచే మ్రొక్కులందువాడయిన కాశీవిశ్వనాథునికి అంకితముగా తెలుగుపేళ్ళన్నియు చేర్చి ఆంధ్రనామ సంగ్రహమను గ్రంథము నొనర్చెదను)
తే.
దేవ మానవ స్థావర తిర్యగాఖ్య
వర్గు లొనరింతు
నానార్థ వర్గుఁ గూడ
వర్గములు గాఁగ గూర్తు నాహ్వయములందు
నిడుదు వివరించునెడల సంస్కృతపదంబు (4)
(ఇందు దేవవర్గు, మానవవర్గు, స్థావరవర్గు, తిర్యగ్వర్గు, నానార్థవర్గు అను ఐదువర్గులను రచించెదను. పర్యాయపదములన్నియు తెలుగుపదములుగా ఉండును. అర్థము వివరించుటకై ఈపర్యాయపదములకు చివర సంస్కృతపదమును ఉంచెదను)
(దేవవర్గునందు దేవతలు వారికి సంబంధించినవి చెప్పబడినవి. మానవ వర్గునందు మనుష్యులు వారికి సంభందించిన వివరములు, స్థావరవర్గు నందు కొండలు చెట్లు మొన్నగు నచరములు గురించి, తిర్యగ్వర్గునందు పశుపక్ష్యాదులకు సంబందించిన వానిని గూర్చి, నానార్థువర్గునందు ననేకార్థములయి పదముల గురించి వివరింపదడినది)
క. శ్రీలలనాధిప వంద్య వి
శాలాక్షి ప్రాణనాథ శతమఖముఖది
క్పాలాభీష్టద సమధిక
శీలా కాశీనివేశ శ్రీవిశ్వేశా! (5)
(లక్ష్మీనాథుడగు విష్ణుచేత కొనియాడదగినవాడవు. కాశీవిశాలాక్షికి మగడవు. ఇంద్రాదిలోకపాలుర కోర్కెలు నీడేర్చువాడవు గొప్ప స్వభావము గలవాడవు నైన కాశీపురియందు వెలయుచున్న యోవిశ్వేశ్వరా! నీవు నా గ్రంథమును అవధరింపుము)
1. దేవవర్గు
సీ. ముక్కంటి యరపది మోముల వేలుపు, మినుసిగదయ్యంబు మిత్తిగొంగ
గట్టువిల్తుఁడు గఱకంఠుఁ మిక్కిలి, కంటిదేవర బేసికంటివేల్పు
వలిమలల్లుఁడు మిన్నువాలతాలుపు కొండ, వీటిజంగము గుజ్జువేల్పుతండ్రి
వలరాజుసూడు జక్కులఱేనిచెలికాఁడు, బూచులయెకిమీఁడు పునుకతాల్పు
తే. విసపుమేఁతరి జన్నంపు వేఁటకాఁడు
బుడుతనెలతాల్పు వెలియాల పోతురాజు
తోలుదాలుపు ముమ్మొనవాలుదాల్పు
నాఁగ భవదాఖ్య లొప్పు (నంధకవిపక్ష) (6)
తా. ముక్కంటి=మూడు నేత్రములుగలవాడు, అరపదిమోములవేలుపు= ఐదుముఖములు గల దేవుడు, మినుసిగదయ్యంబు=ఆకాశము జుట్టుగా గలదేవుడు, మిత్తిగొంగ=మృత్యువునకు శత్రువు, (మిత్తి-ప్రకృతి,మృత్యువు), గట్టువిల్తుడు= మేరుపర్వతము ధనుస్సుగా గలవాడు, కఱకంఠుఁడు=నల్లని కంఠము కలవాడు, మిక్కిలి కంటిదేవర=హెచ్చునేత్రములు గల దేవుడు, బేసికంటివేల్పు=మూడునేత్రములు గలదేవుడు, వలిమలల్లుడు=మంచుకొందయొక్క (హిమవంతుని) అల్లుడు, మిన్నువాకతాలుపు=(మిన్ను=ఆకాశము, వాక=నది) ఆకాశగంగను శిరసున ధరించువాడు, కొండవీటిజంగము=కైలాసపర్వతము నివాసముగాగల భిక్షుకుడు, గుజ్జువేల్పుతండ్రి=పొట్టిదేవర యగు విఘ్నేశ్వరుని జనకుడు, వలరాజు సూడు= మన్మధునికి శత్రువు, జక్కులఱేని చెలికాడు=(జక్కులు=యక్షులు, వారికి ఱేడు కుభేరుడు, అతనికి స్నేహితుడు) కుబేరునికి మిత్రుడు, బూచులయెకిమీడు=పిశాచములకు అధిపతి, పునుకతాల్పు=కపాలధారి, విసపుమేతరి=విషము తిన్నవాడు, జన్నంపువేటకాడు=దక్షునియజ్ఞము ధ్వంసము చేసినవాడు, బుడుతనెలతాల్పు= బాలచంద్రుని శిరమున దాల్చినవాడు, వెలియాలిపోతురౌతు=తెల్లనియాబోతు నెక్కు యోధుడు, తోలుదాలుపు= పులితోలుచర్మమును) ధరించువాడు, ముమ్మొనవాలుదాల్పు=మూడుమొనలుగల ఆయుధమును (త్రిశూలమును) ధరించినవాడు, నాగన్ =అని ఈ ఇరువదిరెండును, అంధకపక్ష=అంధకాసురునికి శత్రుడా, భవత్ ఆఖ్యలు ఒప్పును= నీ పేళ్ళనదగును) (ఈ పద్యములో 22 ను ఈశ్వరుని పేర్లు)
సీ. సోఁకుమూకలగొంగ చుట్టుగైదువుజోదు, పచ్చవిల్తునితండ్రి లచ్చిమగడు
పులుఁగుతత్తడిరౌతు వలమురితాలుపు, నెన్నుఁడు కఱివేల్పు వెన్నదొంగ
నునుగాడ్పుదిండిపానుపునఁ బండెడిమేటి, బమ్మదేవరతండ్రి తమ్మికంటి
పదివేసములసామి పసిఁడిపుట్టముదాల్పు, కఱ్ఱినెచ్చెలి తరిగట్టుదారి
తే. యాలకాపరి వ్రేఁతల మేలువాడు
పాలకడలల్లుఁడును బక్కిడాలుఱేడు
ఱేయుఁబవలును జేయుకన్దోయివాఁడు
మామమా మన హరి యొప్పు శ్రీమహేశ (7)
తా. సోకుమూకలగొంగ=రాక్షస సమూహములకు శత్రువు, చుట్టుగైదువుజోదు= గుండ్రనియాయుధమును (సుదర్శనము) దాల్చువీరుడు, పచ్చవిల్తుతండ్రి=పచ్చనివిల్లు గలమన్మధునికి తండ్రి, లచ్చిమగడు=లక్ష్మికి భర్త, పులుగుతత్తడిరౌతు=గరుడవాహనము ఎక్కెడివీరుడు, వలమురితాలుపు=పాంచజన్యమను శంఖమును ధరించువాడు, వెన్నుడు=అంతటా వ్యాపించువాడు, కఱివేల్పు=నల్లను మేనిచాయ గలవాడు, వెన్నదొంగ=వెన్నను అపహరించినవాడు, నునుగాడ్పుదిండిపానుపున బండెడుమేటి= మృదువైన వాయువును భక్షించెడు శేషతల్పమున పండెడు దొర, బమ్మదేవర తండ్రి=బ్రహ్మదేవునికి తండ్రి, తమ్మికంటి=కమలములవంటి కన్నులు గలవాడు, పదివేసములసామి= దశావతారములెత్తిన దేవుడు, పసిడిపుట్టముదాల్పు=పీతాంబరమును ధరించినవాడు, కఱ్ఱినెచ్చెలి=అర్జునునకు ముఖ్యమిత్రుడు, తరిగట్టుదారి=కవ్వపుగొండను (మందరపర్వతమును) మోసినవాడు, ఆలకాపరి=పశువులను మేపినవాడు, వ్రేతలమేలువాడు= గోపికాస్త్రీలను రక్షించువాడు, పాలకడలల్లుడు= పాలసముద్రునికల్లుడు, పక్కిడాలు ఱేడు=గరుడధ్వజము గలవాడు, రేయుబవలును చేయుకన్దోయివాడు= సూర్యచంద్రులు నేత్రములుగా కలవాడు, మామమామ=మామయగు సముద్రునికి మామ అనన్ (శ్రీమహేశా) హరి యొప్పున్.
(ఈ 22 పేర్లును విష్ణువునకు పేర్లు)
సీ. పక్కిడాల్వేలుపు పొక్కిలి పసిబిడ్డఁ, డంచతేజినెక్కి యాడురౌతు
మనెడుప్రొద్దులనొసళ్ళను వ్రాయుదేవర, చదువులబేలుపు జన్నిగట్టు
తెలిదమ్మిగద్దియ గొలువుండురాయఁడు, నిక్కపుజగమేలు నేర్పుకాఁడు
కడుపుబంగారుబొక్కసముఁ జేసినమేటి, పోరోగిరముతిండి పోతుతండ్రి
ఆ. నలువ తమ్మిచూలి నలుమొగంబులవేల్పు
వేల్పు పెద్దపలుకు వెలఁదిమగఁడు
తాత బమ్మ యన విధాతనామములొప్పు
(నఘవినాశ యీశ యభ్రకేశ) (8)
తా. పక్కిడాల్వేలుపు పొక్కిలిపసిబిడ్డఁడు= గరుఢధ్వజుడైన విష్ణువుయొక్క నాభికమలమునందు పుట్టిన చిన్న బిడ్డడు, అంచతేజినెక్కియాడు రౌతు= హంసవాహనారూఢుడు, మనెడుప్రొద్దునొసళ్ళనువ్రాయుదేవర=మానవుల జీవితకాలమును మోములందు వ్రాసెడువేల్పు, చదువులవేలుపు=విద్యలకు ప్రభువు, జన్నిగట్టు=యజ్ఞోపవీతమును దాల్చినవాడు, తెలుదమ్మిగద్దియఁ గొలువుండురాయఁడు=తెల్లనితామరపువ్వు అనెడి సింహాసనమందు గూర్చుండు ప్రభువు, నిక్కపుజగమేలు నేర్పుకాడు= సత్యలోకమును పాలించెడి ప్రభువు, కడుపుబంగారు బొక్కసము చేసినమేటి=హిరణ్యగర్భుఁడు, పోరోగిరముతిండిపోతుతండ్రి= జగడమే ఆహారముగా గలిగిన నారదునకు తండ్రి, నలువ= నాలుగు నోళ్ళుగలవాడు, తమ్మిచూలి=విష్ణువు నాభికమలమునందు పుట్టినవాడు, నలుమొగంబులవేల్పు=చతుర్ముఖుడగు దేవుడు, వేల్పుపెద్ద=దేవతలకు పెద్దవాడు, పలుకువెలఁదిమగఁడు=వాక్కులదేవియగు సరస్వతికి భర్త, తాత=పితామహిడు, బమ్మ=బ్రహ్మ. (ఈ 16 ను బ్రహ్మయొక్క పేర్లు)
ఆంధ్రనామ సంగ్రహము -2
తే. గట్లరాయనిపట్టి ముక్కంటివెలఁది
యేనుఁగులగొంగతత్తడి నెక్కుదంట
సామిసామేనిఁ జేకొన్న చాన జగము
తల్లి యన గౌరిపేళ్ళొప్పు (ధర నుమేశ) (9)
తా. గట్లరాయనిపట్టి=పర్వతరాజగు హిమవంతుని కూతురు, ముక్కంటివెలఁది=త్రినేత్రుని భార్య, ఏనుఁగులగొంగతత్తడి నెక్కుదంట= ఏనుగులకు విరోధియైన సింహమునెక్కెడి ధీరురాలు, సామిసామేనిఁ జేకొన్నచాన= ణర్తయొక్క యర్థాంగమును గ్రహించినయాడుది (సామేను=సగముదేహము), జగముతల్లి=లోకముయొక్క తల్లి - అను ఈ 5 ను పార్వతికి పేళ్ళు.
తే. లచ్చి కలుములజవరాలు పచ్చవిల్తు
తల్లి కఱివేల్పునిల్లాలు తల్లితల్లి
కడలికూఁతురు సిరి లిబ్బిపదఁతి తమ్మి
యింటిగరితన శ్రీయొప్పు (మృగధరాంక) (10)
తా. లక్ష్మి, కలుములజవరాలు=సంపదలుగల యాడుదు, పచ్చవిల్తుతల్లి=మన్మధుని తల్లి, కఱివేల్పునిల్లాలు=నీలమేఘశ్యాముడైన విష్ణువుకు పత్ని, తల్లితల్లి=తల్లియైన గంగకు తల్లి, కడలికూతురు= సముద్రుని కూతురు, సిరి=శ్రీ, లిబ్బిపడతి=నిధులందుండు దేవత, తమ్మియింటిగరిత=కమలానివాసిని యగునాడుది, అను ఈ 6 ను లక్ష్మికి నామములు
క. తలవాఁకిటను మెలంగెడి
పొలఁతుక పలుకుల వెలఁది పొత్తముముత్తో
నలువపడఁతి కలుములపై
దలికోడ లనంగఁ బరఁగు (ధర) వాణి (శివ) (11)
తా. తలవాఁకిటను మెలంగెడుపొలఁతుక=శిరస్సునకు ద్వారమైన నోటియందు సంచరించెడి స్త్రీ, పలుకులవెలంది= వాక్కుల కధిదేవత యగు పడుచు, పొత్తము ముత్తో= పుస్తకములందు వెలయునట్టి ముత్తైదువ, నలువపడఁతి=బ్రహ్మదేవుని భార్య, కలుములపైదలికోడలు=సంపదలకధిదేవతయైన లక్ష్మీదేవికి కోడలు, ఈ 5 ను సరస్వతీదేవికి పేళ్ళు
సీ. ఇద్దరుతల్లుల ముద్దుబిడ్డఁడు పని, చెఱుపులదొర చేటచెవులవేల్పు
వంకరతొండంబు వాఁ డేనుఁగు మొగంబు, దేవర పాఁపజందెములమేటి
మ్రొక్కువారలపనుల్ చక్కఁజేసెడుసామి, గఱికపూజలమెచ్చు గబ్బివేల్పు
ముక్కంటిపండుల మెక్కెడితిండీండు, ముక్కంటిగారాబు ముద్దుపట్టి
ఆ. పెద్దకడుపువేల్పు పిళ్ళారికుడుముల
తిండికాఁడు కొక్కుతేజిరౌతు
గుజ్జువేలు పొంటికొమ్ముదేవర వెన
కయ్య యన వినాయకాక్య (లీశ) (12)
తీ. యిద్దఱుతల్లులముద్దుబిడ్డఁడు=గంగాపార్వతుల కిద్దఱకుఁ ముద్దుల కొడుకు, పనిచెఱుపుల దొర=కార్యవిఘ్నముచేయు దేవుడు, చేటచెవులవేల్పు=చేటలవలె వెడల్పయిన చెవులుగల దేవుడు, వంకరతొడంబువాడు= వంకరగానుండు తొండంబు గలవాడు, ఏనుఁగు మొగంబుదేవర=గజవక్త్రముగల దేవత, పాఁపజందెములమేటి=పాములే యజ్ఞోపవీతముగా దాల్చు ప్రభువు, మ్రొక్కువారలపనుల్ చక్కఁజేసెడు సామి=తన్ను కొల్చినవారి కార్యములను అనుకూలపరచు దేవుడు, గఱికపూజల మెచ్చు గబ్బివేల్పు=గరికపూజకు మెచ్చుకొనెడు గొప్పదేవుడు, ముక్కంటిపండుల మెక్కెడుతిండిఁడు= తెంకాయలను తినెడువాడు, ముక్కంటిగారాబు ముద్దుపట్టి=త్రినేత్రుడగు ఈశ్వరునికి యిష్టుడగు కుమారుడు, పెద్దకడుపు వేలుపు = లంబోదరుడగు వేలుపు, పిళ్ళారి కుడుముల తిండికాడు= కుడుములను తినెడువాడు, కొక్కుతేజి రౌతు = మూషికవాహనము ఎక్కు దేవుడు, గుజ్జువేలుపు=పొట్టిదేవుడు, ఒంటికొమ్ముదేవర=ఒకదంతముగలదేవుడు, వెనకయ్య- ఈ 17 వినాయకుని పేళ్ళు
సీ. పెనుఁబాఁపకవణంబుఁ దినువారువంబురౌతు, గట్టుయేకిమీనిపట్టిపట్టి
ఱెల్లుచూ లార్గురు తల్లులకొమరుండు, గాడుపుసంగడి కానికొడుకు
పుంజుదాలుపు వేలుపులఱేనిదళవాయి, జంటముమ్మోముల దంటవేల్పు
కొంచగుబ్బలి వ్రక్కలించినబలుదిట్ట, రెండాఱుచేతుల దండిమగడు
తే. వేలుపులమూఁకపేరిటి వెలఁదిమగఁడు
వేల్పుగమికాఁడు వెనకయ్య వెనుకవాఁడు
కొమరుసా మన సేనాని కొమరుమిగులు
(విగతభవపాశ కాశీనివేశ యీశ) (13)
టీ. పెనుబాఁపకవణంబుఁదినువారువమురౌతు= గొప్పసర్పములను తినియెడి నెమ్మినెక్కు రౌతు, (మయూర వాహనుడు), గట్టులయెకిమీనిపట్టిపట్టి=పర్వతరాజపుత్రి యగుపార్వతికి పుత్రుడు, ఱెల్లుచూలు=ఱెల్లునందు పుట్టినవాడు, ఆర్గురుతల్లులకొమరుండు=షత్కృత్తికలకు పుట్టినవాడు, గాడుపుసంగడికాని కొడుకు = వాయు సఖుడగు అగ్నికి పుత్రుడు, పుంజుదెఆలుపు= కోడిపుంజు ధ్వజమునందు ధరించినవాడు, వేలుపులఱేని దళవాయి = ఇంద్రుని సేనాధిపతి, జంతముమ్మోములదంటవేల్పు= ఆఱుముఖములుగల దేవుడు, కొంచగుబ్బలి వ్రక్కలించిన బలుదిట్ట=క్రౌంచపర్వతంబును పగులగొట్టిన బలవంతుడు, రెండాఱుచేతులదండిమగడు=పంద్రెండు చేతులుగల వీరపురుషుడు, వేలుపులమూకపేరిటివెలదిమగడు= దేవసేనయను కాంతకు భర్త, వేలుపుగమికాడు= దేవతల సేనాధిపతి, వెనకయ్యవెనుకవాడు= వినాయకుని తమ్ముడు, కొమరుసాము=కుమారస్వామి, ఈ 14 ను కుమార స్వామికి పేళ్ళు
సీ. అలరువిల్తుండు కన్నులవిల్తుఁడు గమ్మ, విలుకాఁడు చక్కెర వింటివాడు
చెఱకువిల్కాఁడు కెంజిగురులవిల్తుఁడు, వెడవిల్తుఁడును బచ్చవిల్తుఁడించు
విల్లుదాలుపు తుంట విలుకాఁడు తియ్యని, ల్కాఁడును జమిలిముక్కాలినారి
విలుకాఁడు చౌవంచ ములుకులుగలదంట, రాచిల్కనెక్కెడు రాయరౌతు
తే. మీనుమొసలిసిడంబుల మేటి చంద
మామయల్లుఁడు వలరాజు మరుడు లచ్చి
కొమరుఁ డనుపేళ్ళ నొప్పును గుసుమధ్న్వి
(విగతభవపాశ కాశీనివేశ యీశ) (14)
టీ. అలరువిల్తుండు=పుష్పములు ధనుస్సుగా గలవాడు, కన్నులవిల్తుండు=కణుపుల ధనుస్సు గలవాడు, కమ్మ విలుకాడు =తియ్యనిధనుస్సు గలవాడు, చెక్కెరవింటివాడు=పంచదార నొసగు ధనస్సుగలవాడు, చెఱకువిలుకాడు= చెఱకుగడ ధనుస్సు ధరించువాడు, తుంటవిలుకాడు=చెఱకుతుంట విల్లుగాకలవాడు, తియ్యవిల్కాడు=తియ్యని విల్లు గలవాడు, కమిలిముక్కాలినారివిలుకాడు= ఆరుకాళ్ళుగల పురుహులు (తుమ్మెదలు) అల్లెత్రాడుగా గల ధనుస్సు గలవాడు, చౌవంచములుకు గలదంత= ఐదుబాణములుగలయోధుడు, రాచిల్కనెక్కెడురాయరౌతు= శ్రేష్ఠమగు చిలుక నెక్కెడు మేటివీరుడు, మీనుమొసలిసిడంబులమేటి=చేపలు మొసళ్ళు ధ్వజమునందు గల దిట్టరి, చందమామయల్లుడు= చంద్రునకు అల్లుడు, వలరాజు= ప్రేమలకు నధిపుడు, మరుడు, లచ్చికొమరుడు=లక్ష్మీదేవికి పుత్రుడు ఈ 18 ను మన్మధునకు పేళ్ళు
సీ. చలువలఱేఁడు వెన్నెలఱేఁడు రేఱేఁడు, జాబిల్లి రేవెల్గు చందమామ
తమ్ములపగవాఁడు కమ్మవిల్తునిమామ, కలువలఱేఁడు పాల్కడలిపట్టి
జక్కవకవిప్పు ముక్కంటితలపువ్వు, చుక్కలదొర ప్రొద్దుజోడుకోడె
తపసికన్పాప బిత్తరిజింకతాలుపు, కఱివేల్పుడాకన్ను కడలివెన్న
పంటపైరుల యెకిమీడు జంటదంట
చౌకములపాళ్ళ తెలిమిద్ద చలివెలుంగు
వేలుపులబువ్వ చీఁకటి వేరువిత్తు
నెల యనఁగఁ జంద్రు పేళ్ళొప్పు (నీలకంఠ) (15)
టీ. చలువఱేడు=చల్లదనముగల రాజు, వెన్నెలరేడు = నిశానాథుడు, జాబిల్లి, రేవెల్గు=రాత్రియందు ప్రకాశించువాడు, చందమామ, తమ్ములపగవాడు=కమలకు విరోధి, కమ్మవిల్తునిమామ=మన్మధునికి మామ, కలువలఱేడు = ఉత్పలములకు రాజు, పాల్కడలిపట్టి=క్షీరసముద్రునిపుత్రుడు, జక్కవకవిప్పు=చక్రవాకమిధున బాగపరచువాడు, ముక్కంటితలపువ్వు= ఈశ్వరునికి శిరోభూషణమయినవాడు, చుక్కలదొర=నక్షత్రములకు రాజు, ప్రొద్దుజోడుకోడె = సూర్యునితో సమానుడు, తపసికన్పాప=అత్రిమునీంద్రిన్ని నేత్రమున ఉన్నవాడు బిత్తరిజింకతాలుపు= సొగసైన మృగంబు దాల్చినవాడు, కఱివేల్పుడకన్ను=విష్ణువుయొక్క ఎడమనేత్రము, కడలివెన్న=సముద్రమునందలి వెన్న, పంట పైరులయెకిమీడు=సస్యములకు రాజు, జంటదంటచౌకములపాళ్ళ తెలిముద్ద=పదునారు కళలుగల తెల్లనిబింబము(జంట=రెండు, దంట=రెండు, చౌకము=నాలుగు, రెండురెళ్ళు నాలుగు, నాల్గు నాల్గులు పదహారు), చలివెలుంగు=చల్లనికిరణములు గలవాడు, వేలుపులబువ్వ=దేవతలకాహారమైనవాడు, చీకటివేరువిత్తు=చీకటిని
పోగొట్టువాడు, నెల, అని ఈ 24 ను చంద్రునికి పేళ్ళు.
సీ. వెన్నునివలకన్ను వేఁడివేలుపు ప్రొద్దు, తొవలరాయిడికాఁడు పవలుసేయు
వేలుపు పచ్చగుఱ్ఱాలవజీరుండు, వేడివెలుంగు రేవెల్గుజోడు
జంటాఱుమేనుల సామి చీఁకటిగొంగ, యెఱ్ఱనివేలుపు నివముసూడు
చదలుమానికము ప్రాఁ జదువులపెట్టియ, యేడుగుఱ్ఱములతేరెక్కుజోదు
మువ్వేలుపులయిక్కమ్రొక్కులదేవర, గాములఱేఁడు జక్కవలఱేఁడు
వేయిచేతులఱేఁడు వెలుఁగులయెకిమీఁడు, చెయువులసాకిరి చాయమగఁడు
తే. మింటితెరువరి తమ్మివాల్గంటిమగఁడు
పోరనీల్గెడు మొనగాండ్రు పోవుదారి
జగముచుట్టంబు జమునయ్య జగముకన్ను
నాఁగ సూర్యునిపేళ్ళొప్పు (నాగభూష) (16)
టీ. వెన్నినువలకన్ను=విష్ణువుయొక్క కుడికన్నైనవాడు, వేడివేలుపు=వేడికి దేవుడు, ప్రొద్దు, తొవలరాయిడికాడు = కలువలకు విరోధి, పవ్చలుసేయువేలుపు=దినకరుడు, పచ్చగుఱ్ఱాలవజీరుండు= పచ్చగుఱ్ఱముల నెక్కెడిరౌతు, వేడివెలుంగు=వేడికిరణంబులు గలవాడు, రేవెల్గుజోడు= రాత్రియందు ప్రకాసించు చంద్రునకు సమానుడు, జంటాఱు మేనులసామి= ద్వాదశాత్ముడూ, చీకటిగొంగ=చీకటిని పోగొట్టు దేవుడు, ఎఱ్ఱనివేలుపు=ఎఱ్ఱని దేహముగలదేవుడు, ఇవముసూడు=మంచునకు శత్రువు, చదలుమానికము=ఆకాశమునకు రత్నము, ప్రాఁజదువులపెట్టియ = వేదముల కునికిపట్టు, ఏడుగుఱ్ఱములతేరెక్కుజోదు, మువ్వేలుపులయిక్క=త్రిమూర్తులకు దావరమైనవాడు, మ్రొక్కుల దేవర=నమస్కారములకు బ్రియుడయిన దేవుడు, గాములరేడు=గ్రహములకు రాజు, జక్కలువలఱేడు = చక్రవాకములకధిపతి, వేయిచేతులఱేడు=సహస్రకిరణుడు, వెలుగుల ఏకిమీడు=వెల్తురులకన్నిటికి ప్రభువు, చెయువులసాకిరి=కర్మలకు సాక్షీభూతుండు, చాయమగడు=ఛాయాదేవికి పెనిమిటి, మింటితెరువరి=ఆకాశమున తిరుగు బాటసారి, తమ్మివాల్గంటిమగడు=పద్మినియను కాంతకు నాథుడు, పోరనీల్గెడు మొనగాండ్రుపోవుదారి= యుద్ధమున చచ్చిన వీరులు స్వర్గలోకమునకు పోవుమార్గమైనవాడు, జగముచుట్టంబు=లోకబాంధవుడు, జమునయ్య=యమునకు తండ్రి, జగముకన్ను= లోకమునకు నేత్రము (ఈ 29 పేర్లు సూర్యునికి నామములు)
సీ. చట్టుపల్ దెగగట్లఁ గొట్టెడుజెట్టి నూ, ఱంచులవాలు చేమించుజోదు
దుగబొట్లపిఱిఁది యైదుకనుంగవలవేల్పు, పాఱుతపసియింటి పంచకోడి
యొడలిచూపొడయఁ డెక్కుడుమొగుల్ గలప్రోడ, నిక్కువీనులజిక్కి నెక్కురౌతు
తెల్లయేనుఁగు నెక్కి తిరిగెడుదొర తూర్పు, మాగానియేలెడు మణియకాఁడు
తే. జమిలిచౌవంచపదులు జన్నములు సేసి
నట్టివేలుపు సోమాసి పెట్టుఁజెట్టు
పొట్టితమ్ముఁడు గల్గిన యట్టివేల్పు
నాఁగ నింద్రునిపేళ్ళొప్పు (నాగభూష) (17)
టీ. చట్టుపల్ దెగగట్లఁ గొట్టెడుజెట్టి=పర్వతముల ఱెక్కలను చేదించిన దిట్ట, నూఱంచులవాలుచేమించుజోదు= నూరంచులు గల వజ్రాయుధమును చేత దాల్చిన యోధుడు, దుగబొట్లపిఱిఁది యైదుకనుంగవలవేల్పు = సహస్త్రనేత్రుడు (దుగబొట్లపిఱిది యైదు= అనగా రెణ్దుసున్నాలు వెనుకగల అయిదు=500, వానికవలు=వాని జత 500x2=1000) పాఱుతాపసియింటిపంచకోడి= గౌతమునియాశ్రమమున కోడిరూపము ఎత్తినవాడు, ఒడలి చూపొడయడు =దేహమంతయు కన్నులు గల దొర, ఎక్కుడుమొగుల్ గలప్రోడ= మేఘములే వాహనములుగాగ నేర్పుకాడు, నిక్కువీనులజక్కి నెక్కురౌతు= నిక్కు చెవులవాహనమును ఎక్కునట్టి దిట్టరి, తెల్లయేనుఁగునెక్కి తిరిగెడు దొర= ఐరావతమను గజమునెక్కి సంచరించెడు ప్రభువు, తూర్పుమాగానియేలెడు మణియకాడు = తూర్పు దిక్కును పాలించెడి ఉద్యోగస్తుడు, జమిలిచౌవంచపదులు జన్నములుసేసినట్టి వేలుపు= నూఱు యాగములు చేసిన దేవుడు, (జమిలి=రెండు, చౌవంచ=ఐదు, రెండూఇదులు=పదు, పదిపదులు=నూఱు), సోమాసిపెట్టుజట్టు= సోమయాజులపాలిటి కల్పవృక్షము, పొట్టితమ్ముడు గల్గినయట్టివేల్పు= వామనుని తమ్మునిగా గలవాడు, అను ఈ 12 ఇంద్రునికి పేళ్ళు.
ఆ. నీరుపాప గాలినెచ్చెలి యన్నింటి
తిండికాఁడు కప్పుఁ దెరువుజాణ
యంటరానివేల్పు జంటమోములసామి
యగ్గి యనఁగ నొప్పు ననలుఁ (డీశ) (18)
టీ. నీరుపాప=నీటియందు పుట్టిన బిడ్డడు, గాలినెచ్చెలి= గాలికి మిత్రుడు, అన్నింటితిండికాడు=సర్వభక్షకుడు, కప్పుదెరువు జాడ=నల్లని మార్గము కలవాడు (కృష్ణవర్మ), అంటరానివేల్పు=తాకుటకు వీలుపడనిదేవుడు, జంట మోముల సామి= రెండుముఖముల వేలుపు, అగ్గి, ఈ 7 ను అగ్నిహోత్రుని నామములు
తే. జమునసైదోడు పెతరులసామి జముఁడు
ప్రొద్దుకొమరుఁడు గుదెతాల్పు పోతుజిక్కి
నెక్కియాడెడుబలురౌతు దక్కిణంపు
సామి యన నంతకుం డొప్పు (శ్రీమహేశా) (19)
టీ. జమునసైదోడు= యమునకు తోడబుట్టినవాడు, పెతరులసామి=పితృదేవతలకు ప్రభువు, జముఁడు= యముడు, ప్రొద్దుకొమరుఁడు=సూర్యుని కొడుకు, గుదెతాల్పు= గుదెను ధరించినవాడు, పోతుజక్కినెక్కి యాడెడు బలురౌతు= దున్నపోతునెక్కెడిబలముగల దిట్ట, దక్కిణంపుసామి=దక్షిణదిశ నేలువాడు, ఈ 7 ను యముని నామములు
ఆ. మూలఱేఁడు సోఁకుమూఁకలఱేఁడు రే
ద్రిమ్మరీఁడు పొలసు దిండిపోతు
రక్కసుండు నల్ల ద్రావువాఁ డనఁగను
నిరృతివేళ్ళు స్వ్ల్లు (నీలకంఠ) (20)
టీ. మూలఱేడు=నిరృతిమూలకు అధిపతి, సోఁకుమూఁకలఱేఁడు=రాక్షసులసేనలకు రాజు, రేద్రిమ్మరీడు= రాత్రులందు తిరుగువాడు, పొలసుదిండిపోతు= మాంసమును దినువాడు, రక్కసుఁడు=రాక్షసుడు, నల్లద్రావువాఁడు = రక్తపానము చేయువాడు. ఈ 6 ను నిరృతికి పేళ్ళు.
ఆ. మేటినీరుచూలి మెయితాలుపులసామి
వల్లెత్రాడుదాల్పు నీళ్ళరాయఁ
డేటిబోఁటిమగల యెకిమీఁడు పడమటి
దొర యనంగ నొప్పు వరుణుఁ (డీశ) (21)
టీ. మేటినీరుచూలిమెయితాలుపులసామి= విస్తారజలముగల సముద్రమునందు పుట్టిన దేహములుగల జలజంతువులకు వేలుపు, వల్లెత్రాడుతాల్పు= పాశమనెడు ఆయుధమును దాల్చినవాడు, నీళ్ళరాయడు= రసాధిపతి, ఏటిబోటిమగలయెకిమీడు= నదులకు భర్తలయిన సముద్రములకు రాజు, పడమటిదొర= పడమటిదిక్కు నేలెడు రాజు, ఈ 5 ను వరుణునికి పేళ్ళు.
ఆంధ్రనామ సంగ్రహము - 3
సీ. వడిగలజింకతత్తడి నెక్కు నెఱరౌతు, మేటిపాములమేఁత నీటితాత
యొడలితాల్పులపిండుకుసురగు బలియుండు, సోకుదయ్యము మింటిచూలి గాలి
కరువలి తెమ్మెర గాడ్పు పయ్యర యొంటి, మ్రాకులపెనుముప్పు మబ్బువిప్పు
సుతటివీవులఁబుట్టు సుడిగొట్టు చలినట్టు, బక్కవారల పెనుబాద యీఁద
తే. అబ్బురపుఁదియ్యవిలుకాని నిబ్బరంపు
దెబ్బపోరుల నలయిక ప్రబ్బుబొంట్ల
గబ్బిగుబ్బలచెమటల యుబ్బడంచు
గబ్బినాఁ జను మారుతాఖ్యలు (మహేశా) (22)
క. మరుదాఖ్య లొప్పుచుండును
ధర వినుచూలి యన సోఁకుదయ్య మనం బ
య్యొర యన గొ ట్టని నీఁ దనఁ
గరువలి యనఁ దెమ్మె రనఁగ గాలి యనంగన్ (23)
టీ. వడిగలజింకతత్తడినెక్కునెఱరౌతు= వేహ్గముగల లేడి వాహనమునెక్కు నేర్పరి. మేటిపాములమేత= శ్రేష్ఠములగు పాములకు ఆహారమైనవాడు, నీటితాత= ఉదకములకు తాత, బడలితాల్పులపిండు కుసురగు బలియుండు= దేహధారులకు ప్రాణమైన బలిమిగలవాడు, సోఁకుదయ్యము=స్పర్శగుణము కలవాడు, మింటిచూలి= ఆకాశంబున పుట్టినవాడు, గాలి, కరువలి, తెమ్మెర, గాడ్పు, పయ్యర, ఒంటిమ్రాకుల పెనుముప్పు= ఒంటరిగా ఉన్న చెట్లకు మిక్కిలి బాధ కలిగించునది, మబ్బునిప్పు= మబ్బులను చెదరగొట్టునది, సురటివీవులబుట్టు= సురటి వీచుటచే పుట్టినది, సుడిగొట్టు= గుండ్రముగా వీచునది, చలినట్టు= శీతమునకు ఉనికిపట్టయినది, బక్కవారల పెనుబాధ= కృశించినవారికి మిక్కిలి బాధాకరుడు, ఈడ, అబ్బురపుఁదియ్యవిలుకాని నిబ్బరంపు దెబ్బపోరుల నలయిక ప్రబ్బుబోంట్ల గబ్బిగుబ్బల చెమటల యుబ్బడగించుగబ్బి= ఆశ్చర్యకరములై మన్మధుని బాణముల ప్రహారమువలన నలతనొందిన యువతులయొక్క గొప్పస్తనములమీది చమట పోగొట్టు నేర్పరి, వినుచూలి=ఆకాశమున పుట్టిన దేవుడు, గొట్టు, ఈ 21 యును గాలికి పేర్లు.
క. ముక్కంటియనుఁగుఁజెలి వడ
చక్కేలిక చాగకాఁడు జక్కులదొర బల్
రొక్కమెకిమీఁడు మానిసి
నెక్కెడువాఁ డనఁగ జను ధనేశుం (డభవా) (24)
టీ. ముక్కంటియనుఁగుఁజెలి= ఈశ్వరునికి బ్రాణస్నేహితుడు, వడచక్కేలిక= ఉత్తరదిక్కి నేలెడి ప్రభువు, చా(తే)గకాడు= ధనము ఇచ్చేవాడు, జక్కులదొర= యక్షులకు రాజు, బల్ రొక్కమెకిమీడు= ఎక్కువ కలిమికి రాజు, మానిసి నెక్కెడువాడు= నరవాహనుడు, అను ఈ 6 ను కుబేరునికి నామములు.
క. విడిముడి గల వేలుపుచెలి
జడముడిజంగంబు గడదెసం గాపరి యౌ
యెడయండు పాఁపతొడవుల
నిడియెడివే ల్పనఁగ నొప్పు నీశానుఁ డిలన్ (25)
టీ. విడిముడిగల వేలుపుచెలి = రొక్కముగల వేల్పునకు (కుబేరునకు) మిత్రుడు, జడముడిజంగంబు= జడలను దాల్చిన బిచ్చగాడు, కడదేశగాపరియౌ యడయండు= కడపటి దిక్కగు ఈశాన్య దిక్కునేలెడు ప్రభువు, పాప తొడవుల నిడియెడివేలుపు= నాగభూషణు డగు దేవుడు - ఈ 4 ను ఈశానుని పేర్లు
క. దేవాలయాహ్వయంబులు
కోవెల యన దేవళంబు గుడి నా వెలయున్
దేవ ళ్ళన జేజేలనఁ
గా వేలుపు లనఁగ వెలయుఁ గ్రతుభుగభిఖ్యల్ (26)
టీ. కోవెల, దేవళంబు, గుడి, ఈ మూడును దేవాలయములకు పేర్లు. దేవళ్లు, జేజేలు, వేల్పులు అను ఈ 3 ను దేవతలకు పేర్లు
ఆ. క్షితిని బేళ్ళు దనరు సీద్రంపుఁబెద్ద బల్
పాఁపఱేఁడు వెన్ను పానుపనఁగఁ
బుడమితాలు పనఁగఁ దడవులనిడుపఁడు
చిలువఱెఁ డనంగ శేషునకు (27)
టీ. సీద్రంపుఁబెద్ద=కుబుసముగల గొప్పవాడు, బల్పాపఱేడు= పాములపెద్దలకు పెద్దదైన పాము, వెన్నుపానుపు = విష్ణువుయొక్క పానుపైనవాడు, పుడమితాలుపు= భూమిని మోయువాడు, తడవులనిడుపడు = చిరకాలజీవి, చిలువఱేడు=పాపరాజు,-- ఈ 6 ను ఆదిశేషునకు పేర్లు.
క. మర్రునయ్యతేజి పులుఁగుల
దొర పాములవేఁటకాఁడు తూరుపునా డేల్
దొరబువ్వఁ గొన్నలావరి
గరుటామంతుఁ డన నొప్పు గరుడుం (డభవా) (28)
టీ. మరునయ్యతేజి=మన్మథునితండ్రియగు విష్ణునకు వాహనము, పులుగులదొర=పక్షింద్రుడు, పాములవేటకాడు= పన్నగశత్రువు, తూరుపునాడేలుదొరబువ్వగొన్నవావరి= పూర్వదిశను పాలించు దేవుడగు నింద్రుని ఆహారం అయిన అమృతం తెచ్చిన బలవంతుడు, గరుటామంతుడు - ఈ 5 ను గరుత్మంతుని పేర్లు.
ఆ. నల్లవలువతాల్పు తెల్లనిమైదంట
వెన్నదొంగయన్న వెఱ్ఱినీళ్ల
మేలువాఁడు దుక్కివాలుదాలుపు దాటి
పడగవాఁ డనంగ బలుఁడు (రుద్ర) (29)
టీ. నల్లవలువతాల్పు= నల్లనిబట్ట దాల్చినవాడు, తెల్లనిమైదంట= తెల్లని దేహము గల్గిన దిట్ట, వెన్నదొంగయన్న= కృష్ణునికి అన్న, వెఱ్ఱినీళ్లమేలువాడు= మధ్యపానము నందాసక్తి కలవాడు, దుక్కివాలుదాలుపు= నాగలి ఆయుధముగా కలవాడు, తాటిపడగవాడు - ఈ 6 ను బలరామునికి పేర్లు
క. వడముడి యనఁగా గాడుపు
కొడుకన నివి రెండు బేళ్ళగున్ భీమునకుం
బుడమిం గఱ్ఱి యనంగ
వ్వడి యన వివ్వచ్చుఁ డనఁగ వాసవి (యీశా) (30)
టీ. వడముడి, గాడుపుకొడుకు=వాయుపుత్రుడు - ఈరెండును భీమునికి పేరులు, కఱ్ఱి, కవ్వడి=రెండుచేతులతో బాణప్రయోగము చేయువాడు, వివ్వచ్చుడు (భీభత్స శబ్ధభవము) -
ఈమూడును అర్జునునికి పేర్లు.
తే. వేలుపులత్రోవ యుప్పర వీదు యాక
సంబు విను విన్ను మిను మిన్ను చదలు నింగి
దివి మొయిలుదారి చుక్కలతెరువు బయలు
గాడ్పుతం డ్రన నభ మొప్పు (గరళకంఠ) (31)
టీ. వేలుపులత్రోవ= దేవతలు సంచరించు మార్గము, ఉప్పరవీధి= పైనుండుమార్గము, ఆకసంబు (ఆకాశ శబ్ధభవము), విను విన్ను, మిను, మిన్ను, చదలు, నింగి, దివి, మొయిలుదారి=మేఘ మార్గము, చుక్కలతెరువు= నక్షత్ర మార్గము, బయలు, గాడ్పుతండ్రి= వాయువు తండ్రి = ఈ 14 ను ఆకశమునకు పేర్లు
తే. వెలయు ధరణిఁ జతుర్దశల్ నలుఁగడ లన
నలరు దచ్చికడ లన దిశాష్టకంబు
దనరు నీరైదుకడలు నా దశదిశలును
(మౌళి ధృతగంగ యంగజ మదవిభంగ) (32)
టీ. నలుఁగడలు=నాలుగు దిక్కులకు పేరు, దచ్చికడలు= ఎనిమిది దిక్కులకు పేరు, ఈరైదికడలు (ఈరు=రెండు, ఐదులు=పది) పది దిక్కులకు పేరు
ఆ. తాటిసిడమువాని తల్మి కూఁతురిబిడ్డ
వెన్ను నడుగుపాప మిన్నువాఁక
వేల్పుటేఱు గడలి వెలఁదుక ముత్త్రోవ
ద్రిమ్మ రనఁగ నొప్పు (దివిజగంగ) (33)
టీ. తాటిసిడమువానితల్లి= తాలధ్వజుడగు భీష్ముని తల్లి, కూఁతురిబిడ్డ= తనకూతురగు లక్ష్మికి కూతురు, వెన్నునడుగుపాప= విష్ణుపాదమున పుట్టిన చిన్నది, మిన్నువాఁక= ఆకశమునందు పాఱునది, వేల్పుటేఱు= దేవతల నది, కడలివెలఁదుక= సముద్రుని భార్య, ముత్త్రోవద్రిమ్మరి= మూడుత్రోవలుగా పాఱు నది, త్రిపథగ- ఈ ఏడును గంగానదికి పేర్లు.
తే. వేలుపులగౌరు చౌదంతి వెల్లయేనుఁ
గనఁగ నైరావతంబున కాఖ్యలమరు
వేల్పుదొరతేజి యనఁగను వెల్లగుఱ్ఱ
మడఁగ నుచ్చైశ్రవం బొప్పు నంబికేశ (34)
టీ. వేలుపులగౌరు= దేవతల ఏనుగు, చౌదంతి= నాలుగు దంతములు గలది, వెల్లయేనుఁగు = తెల్ల యేనుగు -- ఈ మూడును ఐరావతమునకు పేర్లు. వేల్పుదొరతేజి= దేవేంద్రుని వాహనమగు గుఱ్ఱము, వెల్లగుఱ్ఱము= తెల్లని గుఱ్ఱము, -- ఈ రెండును ఉచ్చైశ్శ్రవమునకు నామములు.
ఆ. పుడుకుఁదొడుకు వేలు పులగిడ్డి వెలిమొద
వనఁగఁ గామధేను వలరుచుండు
గల్పకంబు దనరు వేల్పుఁజెట్టీవుల
మ్రాను వెల్లమ్రాను నా (నుమేశ) (35)
టీ. పుడుకుఁదొడుకు = కోర్ర్కుల నొసగునట్టి ఆవు, వేలుపులగిడ్డి= దేవతల ఆవు, వెలిమొదవు= తెల్లనియావు, -- ఈ మూడును కామధేనువునకు పేర్లు. వేల్పుజెట్టు = దేవతల వృక్షము, దెల్లమ్రాను= తెల్లని చెట్టు, ఈవులమ్రాను = కోరికెలను తీర్చెడి చెట్టు, -- ఈ మూడును కల్పవృక్షమునకు నామములు
ఆ. అవని గుడుసుకైదు వనఁగ వేయంచుల
కైదు వనఁగ జుట్టుఁ గైదు వనఁగ
బట్టువుఁగైదు వనఁగఁ బరఁగు సుదర్శన
చక్రమునకు బేళ్ళు (చంద్రమౌళి) (36)
టీ. గడుసుకైదువు= గుండ్రని ఆయుధము, వేయంచులకైదువు = వేయి మొనలుగల ఆయుధము, చుట్టుఁగైదువు = గుండ్రమైన ఆయుధము, బట్టువుఁగైదువు= దిట్టమైన ఆయుధము, -- ఈ నాలుగును విష్ణుచక్రమైన సుదర్శనము నకు పేర్లు.
ఆ. వలమురి యనఁ జుట్టు వాలుజో డనఁ గల్మి
కొమ్మమగనిబూర గొమ్మనంగఁ
దనరుఁ బాంచజన్యమునకు నభిఖ్యలు
(ధృతకురంగ ధవళ వృషతురంగ) (37)
టీ. వలమురి = కుడితట్టుగ తిరిగి యుండూనది, చుట్టువాలుజోడు= సుదర్శనమునకు తోడైనది, కల్కికొమ్మమగనిబూరగొమ్ము= లక్ష్మి దేవి భర్త పూరించు వాద్య విశేషము -- అను ఈ 3 పాంచజన్యమనెడి శంఖమునకు పేర్లు.
తే. రిక్కలనఁ జుక్కలమగను ఋక్షములకు
నాఖ్యలై యొప్పుఁ దెఱఁగంటి యన్నులనఁగ
నచ్చర లనంగ వేలుపు మచ్చకంటు
లనఁగ సురకాంతలకు నాఖ్యలగు (గిరీశా) (38)
టీ. రిక్కలు, చుక్కలు అని ఈ రెండును నక్షత్రములకు పేర్లు. తెఱఁగంటియన్నులు= అనిమిషస్త్రీలు, అచ్చరలు (అప్సర శబ్ధమునకు వికృతి) వేలుపుమచ్చకంతులు= దేవతల
స్త్రీలు, -- ఈ మూడును అప్సరసలకు పేర్లు.
తే. పవలు పగ లనఁ బేళ్లొప్పు దివమునకును
రాత్రిపే ళ్లొప్పు రే రేయి రాతి రనఁగ
వెలయుచుండును రేయెండ వెన్నె లనఁగఁ
జంద్రికకును సమాఖ్యలు (చంద్రమౌళి) (39)
టీ. పవలు, పగలు -- ఈ రెండును దినమునకు పేర్లు, రే, రేయి, రాతిరి -- ఈ మూడును రాత్రికి పేర్లు, రేయెండ= రాత్రులందు కాయు ఎండ, వెన్నెల= తెల్లని చంద్రుడు గలది (వెలి+నెల) ఈ రెండును చంద్రకాంతికి పేర్లు.
క. మించు లన మెఱుపు లనఁగను
జంచలలకుఁ బేళ్లు దనరు, జలధరములు రా
ణించుం బలుకంగ మొయి
ళ్లంచు మొగుళ్లంచు మబ్బులంచున్ (భర్గ) (40)
టీ. మించులు, మెఱుపులు -- ఈ రెండును మెఱుపులకు పేర్లు. మొయిలు, మొగులు, మబ్బు -- ఈ మూడును మేఘములకు పేర్లు
క. తొలుచదువులు ప్రాఁజదువులు
దొలుమినుకులు ప్రామినుకులు దొలుపలుకులు ప్రాఁ
బలుకులు పెనుమినుకులు నా
వెలయున్ శ్రుతులకును బేళ్లు (విశ్వాధిపతీ) (41)
టీ. తొలుచదువులు, ప్రాఁజదువులు, తొలిమినుకులు, ప్రామినుకులు, తొలిపలుకులు, ప్రాఁబలుకులు (ఈ ఆరు పదములకు "ఆదివాక్యము" లను అర్థము) పెనుమినుకులు= విస్తారవాక్యములు అని ఈ ఏడు ను వేదములకు పేర్లు.
క. ఇది దేవవర్గు దీనిం
జదివిన వ్రాసినను వినిన జనులకు నిత్యా
భ్యుదయంబు లొసఁగుచుండును
వదలక కాశీనివాసవాసుఁడు పేర్మిన్ (42)
ఈ దేవవర్గు నెవరు చదువుచున్నారో, ఎవరు వ్రాయుచున్నారో ఎవరు వినుచున్నారో వారికి కాశీవిశ్వేశ్వరుడు కరుణించి యెడతెగని సంపద లొసగును.
దేవవర్గు సమాప్తము
ఆంధ్రనామసంగ్రహము - 4
2. మానవవర్గు
తే. పాఱుఁ డనగఁ బుడమివేల్పు బాఁపఁ డనఁగ
జన్నిగట్టన విప్రుండు జగతిఁ బరఁగు
నొడయఁ డేలిక యెకిమీడు పుడమిఱేఁడు
ఱేఁడు గొర సామి యన నొప్పు నృపతి పేర్లు (1)
టీ. పాఱుఁడు, పుడమివేల్పు= భూదేవుఁడు, బాపడు, జన్నిగట్టు = యజ్ఞోపవీతమును ధరించువాడు - ఈ నాల్గును బ్రాహ్మణుని పేర్లు. ఓడయుఁడు, ఏలిక, ఎకిమీడు, పుడమిఱేఁడు = భూపాలుఁడు, ఱేఁడు, సామి, దొర - ఈ ఏడు ను క్షత్రీయునికి పేర్లు
సీ. కోమట్లు మూఁడవ కోలమువాండ్రన బేరు, లన వైశ్యనామము ల్దనరుఁ గాఁపు
వాండ్రు నా నాలవవాండ్రు, నా బలిజెవాం, డ్రనఁ జను శూద్రసమాహ్వయములు
వడుగు నా గోఁచిబాపఁడు నాఁగ బ్రహ్మచా, రికి బేళ్లు నడచు ధరిత్రియందు
నాలుబిడ్డలు గల యతఁ డిలుఱేఁడు గేస్తన నొప్పుఁ బేళ్లు గృహాధిపతికి
ఆ. నడవిమనికిపట్టు జడదారి యన వన
వాసి యొప్పునిల్లువాసి తిరుగు
బోడ తపసి కావి పుట్టగోఁచులసామి
యన యతీంద్రుఁ డలరు (నలికనేత్ర) (2)
టీ. కోమట్లు, మూఁడవకొలమువారు, బేరులు - ఈమూడును వైశ్యునికి పేర్లు. కాఁవాండ్రు, నాలవవాండ్రు, బలిజెవాండ్రు - ఈ మూడును శూద్రునికి పేర్లు, వడుగు, గోఁబాపఁడు - ఈ రెండును బ్రహ్మచారికి పేర్లు, ఆలుబిడ్దలుగల యతండు = పెండ్లాము పిల్లలు గలవాడు, ఇలుఱేఁడు= ఇంటియజమానుడు, గేస్తు - ఈ మూడును గృహస్థుని పేర్లు. అడవిమనికిపట్టు = అరణ్యమునందు ఉండువాడు, జడదారి = జడలను ధరించినవాడు, - ఈ రెండును వానప్రస్థునికి పేర్లు, ఇల్లువాసి తిరుగు = ఇంటిని విడిచిపెట్టి తిరుగువాడు, బోడ, తపసి, కావిపుట్టగోచులసామి = కావిరంగుగల పుట్తగోచులను బెట్టుకొనువాడు - ఈ నాల్గును సన్న్యాసికి పేర్లు
సీ. అమ్మ నాఁ దల్లి నా నవ్వ నాఁ గన్నది, యన మాతృకాఖ్యలౌ (నభ్రకేశ)
అబ్బ నాయన యయ్య యనఁ దండ్రి యన నప్ప, యన జనకాఖ్యలౌ (నగనివేశ)
తోడఁబుట్టనఁగ సైదోడు తోఁబుట్టన, సోదరాహ్వయము లౌ (నాదిదేవ)
భర్తృసహోదరు భార్యకుఁ దోడికో, దలన నేరా లన నలరు (నభవ)
తే. చెలియ లనఁజెల్లె లనఁగను వెలయుచుండు
నాహ్వయములు కనిష్ఠికన్యకు (గిరీశ)
జేష్ఠకన్యకు నాఖ్యలై క్షితిని వెలయు
నప్ప యన నక్క యనఁగఁ (జంద్రార్ధమకుట) (3)
టీ. అమ్మ, తల్లి అవ్వ, కన్నది _ ఈ నాల్గును మాతకు పేర్లు, అబ్బ, నాయన, అయ్య తండ్రి, అప్ప ఈ ఐదును తండ్రికి పేర్లు, తోడఁబుట్టు (పా. తోడబుట్టగు), తోడఁబుట్టువు, సైదోడు, తోఁబుట్టు (పా. టోబుట్టువు), తోబుట్టువు - ఈ మూడును సోదరునుకి పేర్లు, తోడికోడలు = తనతో సమానురాలగు కోడలు, ఏరాలు = అన్యుని భార్య (ఎరవు+ఆలు) - ఈ రెండును తోడికోడలికి పేర్లు, చెలియలు, చెల్లెలు అను ఈ రెండు చిన్న ఆడుతోబుట్టువునకు పేర్లు, అప్ప, అక్క - ఈరెండును పెద్ద ఆడుతోబుట్టువునకు పేర్లు
సీ. ముగ్ధకుఁ బేళ్ళగు ముగుద యనన్ ముద్ద, రాలు నా గోల నా బేల యనఁగ
గట్టివాయి యనంగ గయ్యాళి యన ఱాఁగ, యన ధూర్తసతికి నాహ్వయము లమరు
నైదువ నాఁగము నాఁ ముత్తైదువ నా నయి, దువరాలు నా బుణ్యయువతి వెలయు
మృతచిరంటికి నాఖ్య లెనఁగుఁ బేరంటాలు, నాఁగను జిక్కిని నా ధరిత్రి
తే. గేస్తురా లనునాఖ్యచే గృహిణి వెలయు
నాలు పెండ్లాము రాణి యిల్లా లనంగ
భార్య దనరును దొత్తన బానిసె యన
వరవుడన దాసికాహ్యలౌ (గరళకంఠ) (4)
టీ. ముగుద, ముద్దరాలు, గోల బేల - ఈ నాలుగును పదునారు సంవత్సరములు వయసు గల గల పడుచునకు పేర్లు, గట్టివాయి = పెద్దగొంతు కలది, గయ్యాళి, ఱాగ - ఈ మూడును ధూర్తస్త్రీకి పేర్లు, ఐదువ, ముత్తైదువ, అయిదువరాలు (మంగళసూత్రము, పసుపు, కుంకుమము, గాజులు, చెవ్వాకు అను ఐదు వస్తువులు గలది), - ఈ మూడును సుమంగళియగు స్త్రీకి పేర్లు, పేరంటాలు, జక్కిని - ఈ రెండును మృతినొందిన ముత్తైదువరాలికి పేర్లు, గేస్తురాలు, ఆలు, పెండ్లాము, రాణి ఇల్లాలు, - ఈ అయిదును భార్యకు పేర్లు, తొత్తు, బానిసె, వరపుడు - ఈ మూడును దాసికి పేర్లు.
సీ. కన్నియ కన్నె వాఁ గన్యకుఁ బే ళ్ళొప్పు, జవరాలు కొమరాలు జవ్వని యనఁ
దనరు యువతి ప్రోడ యన గట్టివయసుది, యనఁ బ్రౌడ దాల్చునీ యాహ్వయములు
ముసలి మిండలకోర ముప్పదియాఱేండ్లు, చనినది యనుపేళ్ల నెనయు లోల
ముసలిది ముదుసలి ముదియ పెద్దన నివి, యాఖ్యలై తనరు వేధ్థాంగనకును
ఆ. చెడిప ఱంకులాడి చెడ్డతొయ్యలి వెలి
చవులుగనిన దనఁగ జార దనరు
నిలను విటులదూత యెడకాఁడు కుంటెన
కాఁ డనంగఁ దనరుఁ (గరళకంఠ) (5)
టీ. కన్నియ, కన్నె - ఈ రెండు ను పెండ్లికాని పడుచు పేర్లు. జవరాలు, కొమరాలు, జవ్వని - ఈ మూడును యౌవ్వనయువతికి పేర్లు. ప్రోడ, గట్టివయసుది = దిటవైన వయసు గలది - ఈ రెండును ముప్పది యేండ్ల వయసు గలదాని పేర్లు, ముసలి, మిండలకోర, ముప్పదియాఱేండ్లు చనినది - ఈ మూడును లోలస్త్రీకి పేర్లు. ముసలిది, ముదుసలి, ముదియ, పెద్ద - ఈ నాలుగును వృద్ధాంగనకు పేర్లు. చెడిప, ఱంకులాడి, చెడ్డతొయ్యలి = చెడు గుణము గల యాడుది, వెలిచ్వులుగనినది= పరపురుషుల వలన పొందు మరిగినది - ఈ అయిదును వ్యభిచారిణికి పేర్లు. ఎడకాఁడు, కుంటెనకాఁడు = స్త్రీ పురుషులను చేర్చునట్టివాడు - ఈరెండును విటునిదూత పేర్లు.
తే. వేల్పుబానిసె వెలయాలు వేడ్కకత్తె
లంజె బోగముచాన వెల్లాటకత్తె
పడపుఁజెలి యాటచేడియ గడనకత్తె
నాఁగ నివి వేశ్య కాఖ్యలౌ (నగనివేశ) (6)
టీ. వేల్పుబానిసె = దేవతల పనికత్తె, వెలయాలు = రొక్కమునకు వచ్చెడి భార్య, (వెల+ఆలు=వెలయాలు), వేడ్కకత్తె, లంజె, బోగముచాన = అనుభవించుటకైన స్త్రీ, వెల్లాటకత్తె (పెల్లాట్ల కత్తె) = ఎక్కువ నాత్యము చేయునది, పదపుఁజెలి = స్రవ్య సంపాదనము చేసెడి స్త్రీ (పడపు + చెలి), ఆటచేడియ = ఆటాడునట్టి ఆడుది, గడనకత్తె = సంపాదన చేయు స్త్రీ - ఈ ఆరును బోగముదాని పేర్లు.
ఆ. వెచ్చకాఁడు బొజఁగు వేడుకకాఁడు మిం
డండు ననుపుకాఁడు మిండగీఁడు
లంజెకాఁడు నాధరం జనుఁ బల్ల వ
నామధేయములు (పినాకహస్త) (7)
టీ. వెచ్చకాఁడు = ద్రవ్యవ్యయము చేయువాడు, బిజగు, వేడుకకాఁడు = సొగసు కలవాడు, మిండడు, ననుపుకాఁడు= మెత్తదనము గలవాడు, మిండగీఁడు, లంజకాఁడు = లంజె కలవాడు - ఈ ఏడును విటుని పేర్లు
ఆ. కోడెకాఁ డనంగ గోవాళ్లు నాఁగను
యువజనాఖ్య లొప్పుచుండు రెండు
నాగవాస మనఁగ నామ మౌ వేశ్యాజ
నంబుమేలమునకు (నంబికేశ) (8)
టీ. కోడెకాఁడు = యౌవ్వనవంతుడు, గోవాళ్లు = యౌవ్వనము గలవాడు (గోవ+వారలు = గోవాళ్లు) - ఈ రెండును ప్రాయముగలవానుకి పేర్లు, నాగవాసము ఇది వేశ్యజన కూటమునకు పేరు.
సీ. నెలఁతుక క్రాల్గంటి పొలఁతుక ముద్దియ, వ్చాలుఁగంటి మగువ పడఁతి మడఁతి
చెలి మచ్చకంటి యుగ్మలి యింతి తొయ్యలి, నవలా కలువకంటి నాతి గోతి
పూఁబోఁడి చిగురాకు బోఁడి పైదలి మించు, బోఁడి ముద్దుల గుమ్మ పొలఁతికొమ్మ
ప్రోయా లువిద తీఁగబోఁడి చేడియ యించు, బోఁడి యన్ను వెలంది బోటీ జోటి
తే. చాన తెఱవ వెలందుక చామ లేమ
చెలువ యెలనాగ చిలకలకొలికి కలికి
తలిరుఁబోఁడి యలరుఁబోఁడి నెలఁత పొల్తి
గరిత యతివ నా స్త్రీ సమాఖ్యలు (మహేశ) (9)
టీ. నెలఁతుక, క్రాల్గంటి = ప్రకాశించెడి కన్నులు గలది, పొలంతుక, ముద్దియ, వాలుఁగంటి= వెడల్పు నేత్రములు గలది, మగువ, పడఁతి, మాడఁతి, చెలి, మచ్చెకంటి = మీననేత్ర, ఉగ్మలి, ఇంతి, తొయ్యలి, నవలా, కలువకంటి = కలువలను పోలు కన్నులు గలది, నాతి, గోతి, పూఁబోఁడి = పువ్వువంటి శరీరము గలది, చిగురాకుబోఁడి = చిగురువంటి మేను గలది, పైదలి, మించుబోఁడి = మెఱపు వలె వెలిగెడు స్వరూపము గలది, ముద్దులగుమ్మ = ముద్దుల మూట గట్టునది, పొలఁతి, కొమ్మ, ప్రోయలు, ఉవిద, తీఁగెబోఁడి = తీగెవంటి శరీరము గలది, చేడియ, ఇంచుబోఁడి = చెఱకువలె ప్రియమైన శరీరము గలది, అన్ను, వెలది, బోటి, జోటి, చాన తెఱవ, వెలందుక, చామ, లేమ, చెలువ, ఎలనాగ, చిలుకలకొలికి = చిలుక ముక్కు వంటి కన్నుల కొనలు కలది, కలికి, తలిరుబోడి = చిగురువలె మెత్తని దేహము గలది, అలరుబోడి = పువ్వువంటి మెత్తని దేహము గలది, నెలత, పొల్తి, గరిత, అతివ - ఈ 48 యును స్త్రీకి పేర్లు.
తే. చెలిమి నేస్తంబు పొందు నా స్నేహ మలరు
నెచ్చెలి యనుంగు సంగాతి నేస్తకాఁడు
సంగడీఁ డనఁ జెలికాఁడనంగఁ దనరు
స్నేహితునకు సమాఖ్యలు (శ్రీమహేశ) (10)
టీ. చెలిమి నేస్తము, పొందు - ఈ మూడును స్నేహమునకు పేర్లు. నెచ్చెలి, అనుంగు, సంగాతి, నేస్తకాఁడు, సంగడీఁడు, చెలికాఁడు - ఈ ఆరును స్నేహితునకు పేర్లు.
సీ దొంగ తెక్కలికాఁడు దొరకోలుసన్నాసి, ముచ్చెత్తుబరికాఁడు ముడియవిడుపు
తెరవాటుకాఁడు కత్తెరదొంగ చేవాఁడి, కాఁడు వల్లడికాఁడు కన్నగాఁడు
మునిముచ్చు గడిదొంగ యనఁ దస్కరాఖ్యలౌఁ, జెండిపోతు గరాసు మొండికట్టె
టకటొంకు టాటోటు టక్కులాడు పిసాళి, టక్కరి ముడికాఁడు ఠవళికాఁడు
తే. కల్లరియు గొంటు కైలాటకాఁడు చెడుగు
బేరజము కుచ్చితుఁడు దోసకారి చెనఁటి
పాలసుఁడు నాలిబూతంబు పలువ తులువ
కూళ గడు సన వర్తిల్లు గుజనుపేళ్లు (11)
టీ. దొంగ, తెక్కలికాఁడు= బందిపోటు వేయువాడు, దొరకోలు సన్నాసి= వేషముదాల్చి యితరులను నమ్మించి సొమ్మూపహరించుకొని పోవువాడు, ముచ్చు, ఎత్తుబరికాడు, ముడియవిడుపు = ముడివిచ్చి యెత్తుకొని పోవువాడు, తెరువాటుకాడు = దారి యడ్డగించి కొట్టి తీసుకొని పోవువాడు, కత్తెరదొంగ = కత్తిరించి దొంగిలించువాడు, చేవడికాడు = చేతిపనితనము గలవాడు, వల్లడికాడు = కొల్ల పెట్టువాడు, కన్నగాడు = కన్నము వేసి దొంగిలించు వాడు, మునిముచ్చు = మునివలె మౌనముతో ఏమీ తెలియనట్లుండెడివాడు, గడిదొంగ = ఆంతర్యము నెరింగినవాడు - ఈ పదమూడును దొంగకు పేర్లు, చెండిపోతు = మూఢబుద్ధి కలవాడు, గరాసు, మొండికట్టె, టకటొంకు, టాటోటు, టక్కులాడు = కల్లలాడువాడు, పిసాళి, టక్కరి, ముడికాడు, ఠవళికాడు = మోసము కలవాడు, కల్లరి = బొంకులాడు వాడు, గొంటు, కైలాటకాడు = మాయోపాయముల నెరిగినవాడు, చెడుగు, బేరజము, కుచ్చితుడు, దోసకారి = పాపములు చేయువాడు, చెనటి, పాలసుడు, నాలిభూతము, పలువ, తులువ, కూళ, గడుసు - ఈ ఇరువదినాలుగు కుత్సితునకు పేర్లు.
ఆ. పాప బుడుత చిఱుత పట్టి సిసువు కందు
కూన నిసువు బిడ్డ కుఱ్ఱ బొట్టె
యనఁగ శిశుసమాఖ్య లగుఁ గొమరుండు నాఁ
గొడుకు నాఁ కుమారకుండు వెలయు (12)
టీ. పాప, బుడుత, చిఱుత, పట్టి, సిసువు (శిశు శబ్ధభవము) కందు, కూన, నిసువు, బిడ్డ, కుఱ్ఱ బొట్టె - ఈ పదకొండు శిశువునకు పేర్లు. కొమరుడు, కొడుకు - ఈ రెండును పుత్రునిపేర్లు
ఆంధ్రనామసంగ్రహము - 5
ఆ. వటుసమాఖ్య లగును వసుధలోఁ గొండిక
వాఁ డనంగఁ బడుచు వాఁ డనంగఁ
బిన్నవాఁ డనంగఁ జిన్న వాఁడనఁగను
(వినుతగుణసనాథ విశ్వనాథ) (13)
టీ. కొండికవాఁడు, పడుచువాఁడు, పిన్నవాఁడు, చిన్నవాఁడు - ఈ నాలుగు బాలునికి పేర్లు
సీ. గిటక పొట్టి కుఱుచ గిట్ట గుజ్జనఁగ వా, మనుఁ డొప్పుఁ జను నవ స్మారిపేళ్లు
వెడఁగు వేఁదుఱు వెఱ్ఱి వీఱిఁడి వేఱిఁడి, వెంగలి వెంబర విత్తనంగ
జతురునకును బేళ్ళు జాణ దంట వలంతి, వెరవరి ప్రోడ నేర్పరి యనంగ
ప్రన్ననివాఁడు రూపరి చూడఁగలవాఁడు, చక్కనివాఁడు నా జగతిఁ బరఁగు
తే. సుందరాకారవంతుండు సొగసుకాఁడు
వన్నెకాఁదన శృంగారి వసుధ వెలయు
సంధకునిపేళ్లు చీకు గ్రుడ్డనఁగ మూఁగ
మూవ యన మూకనామముల్ (దేవ దేవ) (14)
టీ. గిటక, పొట్టి కుఱుచ, గిట్ట, గుజ్జు - ఈఅయిదును పొట్టివాని పేళ్లు. వెడఁగు, వేఁదుఱు, వెఱ్ఱి, వీఱిఁడి, వేఱిఁడి, వెంగలి, వెంబరవిత్తు - ఈ ఏడును మూర్ఖునికి పేర్లు. జాణ, దంట, వలంతి, వెరవరి = ఉపాయము కలవాడు, ప్రోడ, నేర్పరి = నేర్పు కలవాడు - ఈ ఆరును సమర్థునికి పేర్లు. ప్రన్ననివాడు, రూపరి=అందము కలవాడు, చూడగలవాడు= ఇతరులచే చూడతగినవాడు, చక్కనివాడూ - ఈ అయిదును సౌందర్యవంతునికి పేర్లు. సొగసుకాడు = వేడుక కలవాడు, వన్నెకాడు = వన్నె కలవాడు - ఈ రెండును సింగారించుకొనిన వానికి పేర్లు. చీకు, గ్రుడ్డి - ఈ రెండును అంధునికి నామములు, మూగ, మూవ - ఈ రెండును మూగవాని పేర్లు.
కం. కాయముపేళ్ళై వెలయును
మే యన వొడ లనఁగ మేను మెయి యన భోగ్య
ప్రాయము పేళ్ళగుఁ బరువము
పాయము జవ్వన మనంగ (భావజదమనా) (15)
టీ. మే, ఒడలు, మేను మెయి - ఈ నాలుగు ను శరీరమునకు నామములు, పరువము, పాయము, జవ్వనము, - ఈ మూడును యౌవ్వనమునకు నామములు.
తే. నెఱులు కురులు వెండ్రుకలు నా నెఱక లనఁగఁ
గొప్పు తుఱు మన వేనలి క్రొవ్వెద యనఁ
గేశధమిల్లములు మించుఁ గీలుగంటు
క్రొమ్ముడి యనంగఁ గేశబంధమ్మగు (భవ) (16)
టీ. నెఱులు,కురులు, వెండ్రుకలు, నెఱకలు - ఈ నాలుగును కేశముల నామములు. కొప్పు, తుఱుము, వేనలి, క్రొవ్వెద (క్రొత్త+వెద) - ఈ నాలుగును స్త్రీల కొప్పునకు పేర్లు, కీలుగంటు, క్రొమ్ముడి (క్రొత్త+ ముడి) - ఈ రెండునును వెండ్రుకలముడికి పేర్లు.
తే. నొసలు నెన్నొసల్ నుదురు నెన్నుదు రనంగఁ
దనరు ఫాలంబు చూడ్కి చూపనఁగ నొప్పు
నాహ్వయము లీక్షణమునకు నక్షికాఖ్య
లలరుఁ గన్ గను కన్ను నా ( నభ్రకేశ) (17)
టీ. నొసలు నెన్నొసలు, నుదురు, నెన్నుదురు - ఇవి నాలుగును ఫాలభాగమునకు పేర్లు. చూడికి (చూడ్కి) చూపు - ఈ రెండును చూచుటకు పేర్లు. కన్ కను కన్ను - ఈ మూడును నేత్రమునకు పేర్లు.
క. వీను లనఁ జెవులనంగా
జానుగు లన నాహ్వయములు శ్రవణంబులకున్
గౌ నన నడు మనఁగ నభి
ధానము లగు మధ్యమునకు (దరుణేందుధరా) (18)
టీ. వీను, చెవి, జానుగు - ఈ మూడును చెవులకు నామములు. కౌను, నడుము - ఈ రెండును నడుమునకు పేర్లు
తే. అక్కు ఱొ మ్మెద బోర నా నలరు వక్ష
మాస్యమున కొప్పుచుండు నాఖ్యలు మొగంబు
మోర మో మనఁ బేళ్ళొప్పు నూరువునకుఁ
బెందొడ యనంగఁ గుఱువు నా (నందివాహ) (19)
టీ. అక్కు, ఱొమ్ము, ఎద, బోర - ఈ నాలుగును వక్షస్థలంబునకు పేర్లు. మొగంబు, మోర, మోము - ఈ మూడును ముఖమునకు పేర్లు. పెందొడ, కుఱువు - ఈ రెండును ఊరువుకు నామములు.
తే. వదనగుగ యొప్పు నోరు నావాయి యనఁగఁ
బల్లు పలు నాఁగ దంతంబు పేళ్లు వెలయుఁ
బెదవి వాతెఱ మోవి యన్పేళ్లఁ దనరు
చుండు నోష్ఠంబు (శీతాంశుఖండమౌళి) (20)
టీ నోరు, వాయి - ఈ రెండును నోటిరంధ్రమునకు పేర్లు. పల్లు, పలు _ రెండును దంతనామములు. పెదవి, వాతెఱ, మోవి - ఈ మూడును ఓష్ఠమునకు నామములు.
క. కయి యనఁ గైనాఁ గే లనఁ
జెయి యనఁ జై నాఁగఁ జెయ్యి చే వాహస్త
హ్వయము లగు (నన్నపూర్ణా
ప్రియవల్లభ కాశికాపురీవరనిలయా) (21)
టీ. కయి, కై, కేలు, చెయి, చై, చెయ్యి, చే - ఈ ఏడును కస్తములు.
క. ఎద యన డెందం బనఁగ
మది యనఁగా నెడఁ దనంగ మఱి యుల్లము నా
హృదయమునకు నివి యెసఁగును
విదితంబుగ నాహ్వయములు (విశ్వాధిపతీ) (22)
టీ. ఎద, డెందము, మది, ఎడద (ఎడ) ఉల్లము - ఈ ఐదును మనస్సునకు పేర్లు.
క. లోఁజె య్యన నఱచె య్యనఁ
గాఁ జెల్లును బేళ్లు రెండు కరతలములకున్
మీఁజె య్యన బెడచెయ్యి యు
నాఁ జనుఁ గరచరమభాగనామములు (శివా) (23)
టీ. లోఁజెయ్యి=చేతి యొక్క లోపలి ణాగము, అఱజెయ్యి = లోపలి చెయ్యి - ఈ రెండును అఱచేతికి పేర్లు. మీఁజెయ్యి - చేతియొక్క మీది భాగము, పెడచెయ్యి = చేతికి వెనుకటి భాగము - ఈ రెండును హస్తము యొక్క వెనుకటి భాగమునకు పేర్లు.
ఆ. పొట్ట డొక్క కడుపు బొజ్జ బొఱ్ఱ యనంగ
నొప్పుచుండు నాఖ్య లుదరమునకు
నాభిబీలమునకును నామధేయము లగు
బొడ్డు నాఁగ మఱియుఁ బొక్కి లనఁగఁ (24)
టీ. పొట్ట, డొక్క, కడుపు, బొజ్జ, బొఱ్ఱ - ఈ ఐదును ఉదరమునకు పేర్లు. బొడ్డు, పొక్కిలి - ఈ రెండును నాభికి పేర్లు.
తే. వెన్ననంగను వీఁపు నా వెనుకమేను
నాఁగఁ జరమాంగమున కొప్పు నామములుగఁ
బుఱ్ఱె తలపాల నాఁ బున్క పుఱియ నాఁగ
ఫాలమున కాఖ్య లై యొప్పు (ఫాలనేత్ర) (25)
టీ. వెన్ను, వీపు, వెనుకమేను = శరీరము యొక్క వెనుకటి భాగము - ఈ మూడును వీపుకు పేర్లు. పుఱ్ఱె, తలపాల, పునుక, పుఱియ - ఈ నాల్గును కపాలమునకు పేర్లు.
క. అడు గంజ హజ్జ యనఁగఁ
బుడమిఁ బదంబునకు నామములు విలసిల్లున్
మెడ కుత్తు కఱ్ఱు గొం తన
నడారు గళంబునకుఁ బే(ళ్లనంగధ్వంసీ) (26)
టీ. అడుగు, అంజ, హజ్జ - ఈ మూడును పాదమునకు పేర్లు. మెడ, కుత్తుక, అఱ్ఱు, గొంతు - ఈ నాలుగును గొంతునకు పేర్లు.
ఆ. బువ్వ వంటకంబు బోనంబు మెతుకు కూ
డోగిరము పసాద మోరె మనఁగ
నన్న మొప్పుఁ జేల మలరుఁ బుట్తంబు దు
వ్వలువ చీర కోక వలువ యనఁగ (27)
టీ. బువ్వ, వంటకము, బోనము, మెతుకు, కూడు, ఓగిరము, పసాదము, ఓరెము - ఈ ఎనిమిది అన్నమునకు నామములు. పుట్టము, దువ్వలువ, చీర (చీరె), కోక, వలువ - ఈ నాలుగును వస్త్రమునకు నామములు.
తే. మెసవె నారోగిణమొనర్చె మెక్కెఁ దినియెఁ
గుడిచె నారగించెను, బసాపడియె నమలె
సాపడె ననంగ నొప్పు భోజనము సేసె
ననుటకివి యాఖ్యలై (యీశయభ్రకేశ) (28)
టీ. మెసవెను (మెసగెను) అరోగిణమొనర్చెను, మెక్కెను, తినియెను, కుడిచెను, ఆరగించెను, పసాపడియె, నమలెను, సాపడెను, - ఈ తొమ్మిదియు భోజనము చేసెననుటకు పేర్లు.
క. నాన యన సిగ్గు సిబ్బితి
నా నివి వ్రీడాపదంబు నామంబు లగుం
బానము సేయుట పేళ్లగు
నానుట త్రాపుటనఁ ద్రాగుటనఁ గ్రోలుటనన్ (29)
టీ. నాన, సిగ్గు, సిబ్బితి - ఈ మూడును లజ్జకు పేర్లు. ఆనుట, త్రాగుట, త్రాపుట, క్రోలుట - ఈ నాలుగును మద్యాది ద్రవ్యముల బానము సేయుటకు పేర్లు.
ఆ. తళియ పళ్లెరంబు తెలె హరివాణంబు
తట్టి కంచ మనఁగ దనరుఁ బాత్ర
చెల్లుఁ జషకమునకు బేళ్లు డబ్బుర కోర
గిన్నె యనఁగ (రజితగిరి నివాస) (30)
టీ. తళియ, పళ్ళెరము, తెలె, హరివాణము, తట్టి, కంచము, - ఈ ఆరును భోజనపాత్రమునకు పేర్లు. డబ్బుర, కోర, గిన్నె - ఈ మూడును పానపాత్రమునకు పేర్లు.
తే. నతికిఁ బేళ్లొప్పు జోత దండము జొహారు
మ్రొక్కు జేజే యనంగఁ గేల్ మొగిచెఁ గొలిచె
నెఱఁగెఁ జేమోడ్చె నన నమస్కృతి యొనర్చె
ననుట కివి యాఖ్యలగు (నీశ యభ్రకేశ) (31)
టీ. జోత, దండము, జొహారు, మ్రొక్కు, జేజే - ఈ అయిదును నమస్కారమునకు పేర్లు. కేల్మొగిచెన్ = చేతులు జోడించెను, కొలిచెను, ఎఱఁగెన్ (ఎరఁగెన్) చేమోడ్చెను = చేతులు జోడించెను - ఈ నాలుగును నమస్కారము చేసెననుటకు పేర్లు.
తే. ఒప్పు శయనించుటకును బన్నుండెఁ బండెఁ
బవ్వడించెఁ బరుండెను బవ్వళించె
నత్తమిల్లె నన న్మఱి మెత్త సెజ్జ
పఱపు పాన్పనఁ తగు శయ్య (ఫాలనేత్ర) (32)
టీ. పన్నుండెను, పండెను, పవ్వడించెను, పరుండెను, పవ్వళించెను, అత్తమిల్లెను - ఈ తొమ్మిదియు శయనించెననుటకు పేర్లు. మెత్త, సెజ్జ (శయ్య - వికృ సెజ్జ)పఱపు, పాన్పు - ఈ నాలుగును శయ్యకు పేర్లు.
తే. ఒప్పు ధ్వనిపేళ్లు రొదయన నులిపు నాఁగ
సద్దనంగను గూఁత నాఁ జప్పు డనఁగఁ
నలుకు డన రోదనము సేసె ననుట కాఖ్య
లెసఁగు నఱచెను వాపోయె నేడ్చె ననఁగ (33)
టీ. రొద, ఉలిపు, సద్దు (శబ్దశబ్ద వికృతి) కూత, చప్పుడు, అలుకుడు - ఈ ఆరును శబ్దమునకు పేర్లు. అఱచెను, వాపోయెను, ఏడ్చెను - ఈ మూడును రోదనము చేసెననుటకు పేర్లు.
క. అగుఁ బేళ్లు నీరువ ట్టన
దగ దప్పిము దూప యనఁగ దాహంబునకున్
నగవు నగు నవ్వు నవు నా
నగు నాఖ్యలు హాసమునకు (నగజాధీశా) (34)
టీ. నీరువట్టు, దగ, దప్పి, దూప - ఈ నాలుగును దాహమునకు పేర్లు. నగవు, నగు, నవ్వు నవు - ఈ నాలుగును హాసమునకు పేర్లు.
క. చాగము నాఁ బుడు కనఁగా
నీగి యనఁగ నిడుట యనఁగ నీవి యనంగాఁ
దేగము నాఁ బెట్టుడు నాఁ
ద్యాగమునకు నాఖ్య లగుచు ధరఁబరఁగు (శివ) (35)
టీ. చాగము, పుడుకు, ఈగి, ఇడుట, ఈవి, తేగము (త్యాగ శబ్దభవము) పెట్టుడు - ఈ ఏడును దానమునకు పేర్లు.
ఆ. ఎలసె బెరసె హత్తె నెనసె నదికెఁ జెందె
బొందె దొరసెఁ గూడె నొందె చెనకె
ననఁగ సక్తమయ్యె ననుటకు నివి యాఖ్య
లగు (గిరీశ యీశ యభ్రకేశ) (36)
టీ. ఎలసెన్, బెరసెన్, హత్తెన్, ఎనసెన్, అదికెన్, చెందెన్, పొందెన్, దొరసెన్, కూడెన్ ఒందెన్, చెనకెన్ - ఈ పదకొండును ను కలిసి కొనెననుటకు పేర్లు.
ఆంధ్రనామ సంగ్రహము - 6
ఆ. ఎడసెఁ బాసె వేఱుపడెఁ బురివిచ్చె నా
నలరు భేద మయ్యె ననుట పేళ్ళు
స్వవశ మయ్యె ననుట కవుఁ బేళ్లు లోనయ్యె
నగ్గమయ్యె ననఁగ (నసమనేత్ర) (37)
టీ. ఎడసెన్, పాసెన్, వేఱుపడెన్, పురివిచ్చెన్ - ఈ నాలుగును వియోగమయ్యె ననుటకు బేరులు. లోనయ్యెన్ అగ్గమయ్యెను - ఈ రెండును స్వాధీనపడె ననుటకు పేర్లు.
ఆ. అగు గృహీతమయ్యె ననుటకుఁ బేళ్లగ
పడియెఁ జేపడియెను బట్టువడియెఁ
జిక్కువడియెఁ దగిలెఁ జిక్కెఁ దగుల్పడె
ననఁగ (నగనివేశ యభ్రకేశ) (38)
టీ. అగపడియెన్ (అగ్గము+పడియెను) = ఆధీనమయ్యెను, చేపడియెను (చే+పడియెను) = చేత చిక్కెను, పట్టువడియెను = పట్టుచిక్కెను, చిక్కువడియెను, తగిలెను, చిక్కెను, తగుల్పడెను, ఈ తొమ్మిది యును గృహీతమయ్యె ననుటకు పేర్లు.
తే. అనియె నొడివె వక్కాణించె నాడెఁ జెప్పె
వినిచె వాక్రుచ్చెఁ బలికె నాఁ జను వచించె
ననుట కాలించె నాలకించెను వినె నన
నలరు నవధరించె నంటంట కాఖ్య (లీశ) (39)
టీ. అనియెను, నొడివెను, వక్కాణించెను, ఆడెను, చెప్పెను, వినిచెను, వాక్రుచ్చెను, పలికెను - ఈ ఎనిమిదియు చెప్పె ననుటకు పర్యాయములు. ఆలించెను, ఆలకించెను, వినెను - ఈ మూడును అవధరించె ననుటకు పేర్లు.
క. కనియెను చూచెను కాంచెను
కనుఁగొనెఁ గన్గొనె ననంగ హలయవి పేళ్లె
చను వీక్షించె నటంటకు
(ఘనతరగోరాజగమన కాయజదమన) (40)
టీ. కనియెను, చూచెను, కాంచెను, కనుఁగొనెను, కన్గొనెను - ఈ అయిదును దర్శించెననుటకు పేర్లు.
క. చనుఁ గృతగమనుఁడ నయ్యెద
ననుటకు నామంబు లగుచు నవని నరిగెదన్
జనియెదఁ బోయెద నేగెద
పనివినియెద ననెడునట్టి పలుకులు (రుద్ర) (41)
టీ. అరిగెను, చనియెను, పోయెను, ఏగెను, పనివినియెను - ఈ అయిదును బయలుదేఱె ననుటకు పేర్లు.
ఆ. ద్విగుణమున కభిఖ్యలగు తిబ్బ డిమ్మడి
జంట దంట దుగయు జమిలి రెట్టి
యినుమడి యన మిథునమున కాఖ్యలగు జోడు
దోయి కవ యనంగ (ధూతకలుష) (42)
టీ. ఇబ్బడి, ఇమ్మడి, జంట, దంట, దుగ, జమిలి, రెట్టి (రెంట) ఇనుమడి - ఈ ఎనిమిదియు రెండింతలకు పేర్లు. జోడు, దొయి, కవ - ఈ మూడును మిధునమునకు పేర్లు.
సీ. ఒండొకఁ డొకటి యెండొక్కొం డన నగు నేక, మీరు రెండిరు నాఁగ నెసఁగు ద్వయము
తిగ మూఁడు మూ ర్నాఁగ దగు ద్రయి తీవంచ, నాలు నాల్గు చౌ యన నగుఁ జతుష్క
మెసఁగుఁ జౌవంచ యైదే ననఁ బంచకం, బా ఱిరుమూఁడి తిగనగ నొప్పు
షట్కంబు ఋషిసంఖ్య నత చక్కుపగడ యే, డన నొప్పు నష్ట సంఖ్యకును బేళ్లు
తే. దనరు నిరునాలు గెనిమిది దచ్చి యనఁగఁ
బరఁగు నీరాఱు పండ్రెండు బార యనఁగఁ
ద్వాదశమునకు నాఖ్యలు ధరణియందు
(వినుతకరుణాసనాథ శ్రీవిశ్వనాథ) (43)
టీ. ఒండు, ఒక్కఁడు, ఒకటి, ఒక్కండు - ఈ నాలుగును ఏకసంఖ్యకు నామములు. ఈరు, రెండు, ఇరు - ఈ మూడును ద్వయమునకు పేర్లు. తిగ, మూఁడు, మూరు - త్రితయమునకు పేర్లు. తీవంచ = మూడునొక్కటియు, నలు, నాలుగు, చౌ - ఈ నాలుగును నాలుగునకు పేర్లు. చౌవంచ = నాలుగునొక్కటియు, ఐదు (రూ. అయిదు) ఏను - ఈ మూడును పంచసంఖ్యా నామములు. ఆఱు, ఇరుమూడు = రెండు మూడులు, ఇత్తుగ (ఇరు+తీగ) = రెండు మూడులు, - ఈ మూడును షత్సంఖ్యా నామములు. సత (సప్త శబ్ధభవము) చక్కుపగడ = ఆఱునొక్కటియు, ఏడు - ఈ మూడును సప్తసంఖ్యకు పేర్లు. ఇరు నాలుగు = రెండు నాలుగులు, ఎనిమిది, దచ్చి - ఈ మూడును అష్ట సంఖ్యకు నామములు. ఈరాఱు = రెండాఱులు, పండ్రెండు, బార - ఈ మూడును ద్వాదశ సంఖ్యకు పేర్లు.
తే. జరిగె నూడెను జాఱెను నుఱికే వెళ్లెఁ
బాఱెఁ బఱచెను దెలఁగె నప్పలుకు లెల్ల
నవనిలోనఁ బలాయితుండయ్యె ననుట
కాఖ్యలై యొప్పుఁ (జెంద్ర రేఖావతంస) (44)
టీ. జరిగెను, ఊడెను, జాఱెను, ఉఱికెను, వెళ్లెను, పాఱెను, పఱచెను, తొలగెను, _ ఈ ఎనిమిదియు పరుగెత్తె ననుటకు పేర్లు.
క. వేంచేసెను వచ్చెం జను
దెంచెను విచ్చేసె నరుగుదెంచె ననఁగ నే
తెంచె నన నయ్యె నాగతుఁ
డంచుం బలుకుటకు నాఖ్య (లంబరకేశా) (45)
టీ. వేంచేసెను, వచ్చెను, చనుదెంచెను (చను+ తెంచెను) విచ్చేసెను, అరుగుదెంచెను, అరుదెంచెను, ఏతెంచెను (పా> ఏగుదెంచెను) - ఈ తొమ్మిదియు ఆగతుడయ్యె ననుటకు పేర్లు.
తే. నాఁటిసుత నాఁటినుండియు నాఁటఁగోలె
నాఁటఁబట్టి నాఁడుమొదలు నాఁగ నాహ్వ
యమ్ము లయ్యె దదారభ్య యనుట కవని
(వినుతకరుణాసనాథ శ్రీవిశ్వనాథ) (46)
టీ. నాఁటిసుత, నాఁటినుండి, నాఁటఁగోలె, నాఁటఁబట్టి, నాఁడు మొదలు _ ఈ అయిదును, ఆదిమొదలు = ఆదినము నుండి అనుటకు పేర్లు.
తే. వైరమునకును ధర సమాహ్వయము లమరుఁ
గంటు పగ మచ్చరంబు సూడోంటమి యన
వలపు కూరిమి మేలు నా నలరుఁ బేళ్ళు
మోహమునకును (శారదాంబుదనిభాంగ) (47)
టీ. కంటు, పగ మచ్చరము, (మత్సర శబ్ధభవము) సూడు, ఒంటమి - ఈ అయిదును విరోధమునకు పేర్లు. వలపు, కూరిమి (కూర్మి) మేలు - ఈ మూడును మోహమునకు పేర్లు.
క. పెనఁకువ జగడము కయ్యం
బని బవరము కలను చివ్వయాలము పోట్లా
టన దురము పోరు నాఁగాఁ
జను యుద్ధంబునకుఁ బేళ్ళు (చంద్రార్ధధరా) (48)
టీ. పెనఁకువ, జగడము, కయ్యము (కలహ శబ్ధభవము) అని, బవరము, కలను, చివ్వ, ఆలము, పోట్లాట, దురము, పోరు - ఈ పదకొండును యుద్ధమునకు పేర్లు.
ఆ. సదమదంబు సేసెఁ జక్కాడె నుగ్గాడెఁ
జదిపెఁ బీఁచమడచెఁ జంపెఁ గెడపె
నుఱుముసేసెఁ గ్రుంచెఁ బరిమార్చెఁ దెగటార్చె
మన్ని గొనియెఁ దునిమె మడిపె ననఁగ (49)
తే. హతము గావించె ననుటకు నాఖ్యలయ్యె
మనిపె నేలెను బ్రతికించె మంచెఁ బ్రోచె
సాఁకె నన నొప్పు నాఖ్యలు సరవితోడ
నరయఁ బోషించె ననుటకు (నంబికేశ) (50)
టీ. సదమదంబు సేసె, చుక్కాడె, నుగ్గాడెన్, చదిపెన్, పీచమడఁచెన్, చంపెన్, కెడపెన్, నుఱుముచేసెన్, త్రుంచెన్, తెగటార్చెను, మన్నిగొనియెన్, తునిమెను, నుడిపెను _ ఈ పదునాల్గును సంహరించెననుటకు పేర్లు. మనిపెను, ఏలెను, బ్రతికించెను, మంచెను, ప్రోచెను, సాకెను _ ఈ తొమ్మిదియును రక్షించెననుటకు పేర్లు.
క. ధరలో శూరాహ్వయములు
పరఁగున్ మొనకాఁ డనంగ బం టనఁగా బో
టరియన వడిగలవాఁ డన
బిరు దన వాఁడిమగఁ డనఁగ (భీమకపర్ధీ) (51)
టీ. మొనకాడు, బంటు (భట శబ్ధభవము) పోటరి (పోటు+ అరి)= శౌర్యము గలవాడు, వడిగలవాడు, బిరుదువాడిమగడు - ఈ ఆరును శూరునికి పేర్లు
తే. బాసట యనంగఁ దోడ్పాటు నా సమాహ్వ
యంబు లగుచుండు రెండు సాహాయ్యమునకు
నాఖ్యలు శుభంబునకును లగ్గనఁగ బా గ
నంగ మేలన లెస్స యనంగ (నీశ) (52)
టీ. బాసట, తోడ్పాటు, - ఈ రెండును సాహాయ్యమునకు పేర్లు. లగ్గు, బాగు, మేలు, లెస్స - ఈ నాలుగును క్షేమమునకు పేర్లు.
ఆ. కూలె నీల్గెఁ జచ్చెఁ గాలంబు సేసెను
గడసె సమసె నాఱె మడిసెఁ జెల్లెఁ
బెద్దనిదురవోయె బిద్దె దోరెను గంతు
గొనియె ననుటపేళ్లగును మృతునకు (53)
టీ. కూలెను, నీల్గెను, చచ్చెను, కాలంబుచేసెను, కెడసెను, సమసెను, ఆఱెను, మడిసెను, చెల్లెను, పెద్దనిదురపోయెను, బిద్దెను, దీరెను, గంతు గొనియెను - ఈ పదమూడును మృతి నొందెననుటకు పేర్లు.
సీ. తిమ్మనైనది యనఁ దిన్ననైనది యన, జానైన దనఁగ బాగైన దనఁగ
నాణెమైన దన విన్నాణమైనది యన, మానైన దనఁగ లెస్సైన దనఁగ
బిన్ననైనది యనఁ జెన్నైన దన నలు, వైనది యనఁగ జెల్వైన దనఁగఁ
బొనరినయది యన నొనరిన దనఁగఁ జొ, క్కటమైన దనఁగ జక్కని దనంగ
సొబగైన దనఁగను సొంపైన దనఁ గొమ, రైనది యన గొనబైన దనఁగఁ
దోరమైన దన సింగారమైనది యన, మేలైన దనఁగ మెచ్చైన దనఁగ
తే. మురువుగలయది యొప్పైన దొఱపుగలది
యందమైనది తనరిన దలరినట్టి
దనఁగఁ బరఁగిన దనఁ బేళ్ళు తనరుచుండు
మంజులం బైన దనుటకు (మదనదమన) (54)
టీ. తిమ్మనైనది, తిన్ననైనది, జానైనది, బాగైనది, నాణెమైనది, విన్నాణమైనది, మానైనది, లెస్సైనది, పిన్ననైనది, చెన్నైనది, నలువైనది, చెల్వైనది, పొనరినయది, ఒనరినది, చొక్కటమైనది, చక్కనిది, సొబగైనది, సొంపైనది, కొమరైనది, గొనబైనది, తోరమైనది, సింగారమైనది, మేలైనది, మెచ్చైనది, మురుపుగలయది, ఒప్పైనది, ఒఱుపు గలది, అందమైనది, తనరినది, అలరినట్టిది, పరగినది - ఈ ముప్పదిఒకటియు సౌందర్యమునకు పేర్లు.
తే. కపుర మనఁ గప్పురం బన గప్ర మనఁగఁ
బుడమిఁ గర్పూర మొప్పుఁ దాంబూల మొప్పు
వీడియము వక్కలాకులు విడెము తమ్మ
లంబు వీడెంబు వీడ్య మనం (బురారి) (55)
టీ. కపురము, కప్పురము, కప్రము - ఈ మూడును కర్పూరమునకు పేర్లు. వీడియము - రూ. విడియము, వక్కలాకులు, విడెము, తమ్మలము, వీడెంబు, వీడ్యము - ఈ ఆరును తాంబూలమునకు పేర్లు.
తే. వెలయుచుండును సిరి లచ్చి కలిమి యనెడు
పేళ్ళ సంపద యెద్దడి పేదఱికము
లేమి నిప్పచ్చరము నెవ్వలేమి డనఁగ
నలరు దారిద్ర్యమునకు నాఖ్యలు (గిరీశ) (56)
టీ. సిరి (శ్రీ శబ్ధభవము) లచ్చి కలిమి - ఈ మూడును సంపదకు పేర్లు. ఎద్దడి, పేదఱికము, లేమి, నిప్పచ్చరము, నెవ్వ, లేమిడి - ఈ ఆరును దారిద్ర్యమునకు పేర్లు.
తే. మగతనం బన గండన మగఁటిమి యనఁ
బౌరుషంబున కాఖ్యలై పరఁగుచుండు
నుక్కు చేగ దిటము చేవ యుదుటు గట్టి
దిట్ట ముఱిది బిగువు నాగ ధృతికిఁ బేళ్ళు (57)
టీ. మగతనము, గండు, మగటిమి - ఈ మూడును పౌరుషమునకు పేర్లు. ఉక్కు, చేగ, దిటము, చేవ, ఉదుటు, గట్టి, దిట్టము, ఉఱిది, బిగువు - ఈ ఆరును ధైర్యమునకు పేర్లు.
తే. నద్ధు నా బొంకు నాఁగ దబ్బర యనంగఁ
గల్ల నాఁగ హుళిక్కి నాఁజెల్లుఁ బేళ్లు
ధర నసత్యమునకును సత్యంబు పరఁగు
నిజ మనగఁ నిక్కువం బన నిక్క మనగ (58)
టీ. బద్దు, బొంకు, దబ్బర, కల్ల, హుళిక్కి - ఈ అయిదును అసత్యమునకు పేర్లు. నిజము, నిక్కువము, నిక్కము - ఈ మూడును సత్యమునకు పేర్లు.
ఆంధ్రనామ సంగ్రహము - 7
క. బెడఁద దెస చేటు చేడ్పా
డ్గొడ వాత్రం బంగలార్పు గోరంబు దొసం
గిడుమ వెత కస్తి యంగద
కడగం డ్లనఁ జను విపత్తు (గౌరీరమణా) (59)
టీ. బెడద, దెస చేడ్పాటు, గొడవ, ఆత్రము, అంగలార్పు, గోరము, దొసంగు, ఇడుము, వెత, కస్తి, అంగద, కడగండ్లు - ఈ పదునాల్గును ఆపదకు పేర్లు.
క. వెల జట్టి విలువ రో యనఁ
గలనుడువులు దనరుచుండు గ్రయనామము లౌ
వెలయంగ వంగసము నాఁ
గొల మన వంగడము నాఁగఁగుల మొప్పు (శివ) (60)
టీ. వెల, జట్టి, విలువ, రో - ఈ నాలుగును క్రయమునకు పేరులు. వంగసము, కొలము, వంగడము - ఈ మూడును కులమునకు పేర్లు.
క. క్రమ్మఱ నెప్పటి వెండియుఁ
గ్రమ్మఱి తిరుగన్ మఱిన్ మరల మగుడను నా
నిమ్మహిఁ బునఃపదంబున
కిమ్ముల నివియాఖ్యలగు (మహీధరచాపా) (61)
టీ. క్రమ్మఱన్, నెప్పటి, వెండియున్, క్రమ్మఱి, తిరుగన్, మఱి, మరలను, మగుడను - ఈ ఎనిమిదియు ఇంకను అను నర్ధముగలవి.
ఒకమరి యొకపరి యొకమా
టొకసా రొకతేప యనఁగ నొకపా రనఁగా
నొకవిడుత యొక్కతూ కన
నొకతడవ యనంగ మఱియు నొకతుఱి యనన్ (62)
తే. ఏకవారం బనుట కొప్పు నిన్ని పేళ్ళు
జగతిఁ బల్మాఱు వేమాఱు సారె పెక్కు
మాఱు లెన్నెనిమార్లనఁ బరగు నాఖ్య
లగుచు నివి బహువారంబు లనుట (ఖీశ) (63)
టీ. ఒకమరి, ఒకపరి, ఒకమాటు, ఒకసారి ఒకతేప, ఒకసారి, ఒకవిడుత, ఒకతూకు, ఒకతడవ, ఒకతూరి _ ఈ పదుయును ఏకపర్యాయమనుటకు పేర్లు. పల్మాఱు (రూ.పలుమాఱు) పలుమాఱు, వేమాఱు, సారె, పెక్కు మాఱులు, ఎన్నేని మాఱులు - ఈ నాలుగును మాటిమాటికి అనుటకు పర్యాయములు.
తే. త్వరితమున కొప్పుఁ బేళ్లు చెచ్చరను సరగ
వేగిరము, వేగ వేళము వెసను వడిగ
గ్రక్కునను గ్రద్దన ననంగఁ గ్రన్న ననఁగ
గొబ్బునను దిగ్గున ననాంగఁ (గుధరచాపా) (64)
టీ. చెచ్చెర (చర+చర) సరగ, వేగిరము, వేగ, వేళము, వెసన్, వడిగన్, గ్రక్కునన్, గ్రద్దనన్, క్రన్నన, గొబ్బునను, దిగ్గునన్, - ఈ పండ్రెండును శీఘ్రముగా అనుటకు పేర్లు.
క. కలవు వివరింపఁగా నా
ఖ్యలు వరుసన్ నిర్గమించె ననుటకు ధరలో
వెలువడియె వెళ్లె వెడలెను
వెలలెననం (జిత్ప్రకాశ విశ్వాధిపతీ) (65)
టీ. వెలువడియెను, వెళ్లెను, వెడలెను, వెలలెను -ఈ నాల్గును పయనమయ్యె ననుటకు పేర్లు.
క. వినుతియొనరించె ననుటకుఁ
దనరున్ నామంబు లగుచు ధరపై నగ్గిం
చెను గైవారము సేసెన్
గొనియాడెను బొగడె ననఁగ గొండాడె ననన్ (66)
టీ. అగ్గించెను, కైవారము సేసెను = స్తోత్రము చేసెను, కొనియాడెను, పొగడెను, కొండాడెను - ఈ ఐదును స్తోత్రము చేసెననుటకు నామములు.
సీ. చుట్టలు విందులు చుట్టాలు బందుగు, లనఁ జను బంధు సమాహ్వయములు
వఱలు నన్యుఁడు లాతివాఁ డనఁగా వింత, వాఁ దనఁగాఁ బెఱవాఁ దనంగ
వ్యాజంబునకు నామమౌ నెపం బనఁగ న, న్వేషించె ననుటకౌ వెదకె నెమకె
నరసె రోసె ననంగ నారసెఁ దడవె నాఁ, గాంక్షకుఁ బేరు లౌఁ గ్రమముతోడఁ
తే. గ్రచ్చు కోరిక తమి కోర్కి యిచ్చ యనఁగ
నెపుడు నెడపక యుడుగక యెల్లపు డన
నిచ్చ యనయంబు నాఁగను నిచ్చ లనఁగఁ
దనరు నాఖ్యలు సతతం బనుట (కీశ) (67)
టీ. చుట్టలు (ఏక. చుట్టము ) విందులు, చుట్టాలు, బందుగులు - ఈ నాలుగును బంధువునకు పేర్లు. లాతివాడు, వింతవాడు, పెఱవాడు - ఈ మూడును అన్యుడనుటకు పేర్లు. నెపము, వ్యాజమునకు పేరు. వెదకెను, నెమకెను, అరసెను, రోసెను, అరసెను, తడవెను - ఈ ఆరును విచారించెననుటకు పేర్లు. క్రచ్చు, కోరిక, తమి, కోర్కి, ఇచ్చ - ఈ నాలుగును ఆపేక్షకు పేర్లు. ఎపుడు, ఎడపక, ఉడుగక, ఎల్లపుడు, నిచ్చ, అనయము, నిచ్చలు - ఈ ఏడు ను సర్వదా అనుటకు పర్యాయములు.
సీ. తనరుఁ బ్రవేశించె ననుటకు నాఖ్యలు, తూకొనెఁ జొచ్చెను దూఱె ననఁగ
నంఘ్రితాడితుఁ జేసె ననుటకు బేళ్లగుఁ, దాఁచెఁ గాళ్ల గ్రుమ్మెఁ దన్నె ననఁగ
నాలస్య మొనరించె ననుటకుఁ జెల్లు నా, మమ్ములు తడసెను మసలె ననఁగఁ
ద్యక్తంబు గావించె ననుటకు నాఖ్య లౌ, వీడెను వదలెను విడిచె ననఁగ
తే. దాఱుమాఱయ్యె వీడ్వడెఁ దడఁబడె నన
నాఖ్య లొప్పు విపర్యస్తమయ్యె ననుట
కలరుఁ బ్రహరించె ననుట కాహ్వయము లడిచెఁ
గొట్టె మొత్తెను మోఁదె నాఁ (గుధరనిలయ) (68)
టీ. తూకొనెను, చొచ్చెను, తూఱెను - ఈ మూడును ప్రవేశించెను అనుటకు పేర్లు. తాచెను, కాళ్ళ గ్రుమ్మెను, తన్నెను - ఈ మూడును కాలితో దన్నెననుటకు పేర్లు. తడసెను మసలెను - ఈ రెండును ఆలస్యము చేసెను అనకు పేర్లు. వీడెను, వదలెను, విడిచెను - ఈ మూడును పరిత్యజించెను అనుటకు నామములు. తాఱుమాఱయ్యెను, వీడ్వడెను, తడబడెను - ఈ మూడును హెచ్చుతక్కువయ్యెను అనుటకు పేర్లు. అడిచెను, కొట్టెను, మొత్తెను, మోదెను - ఈ నాలుగును ప్రహరించె ననుటకు పేర్లు.
సీ. ముందట నెదుటను మ్రోల ముంగల నాఁగ, నాఖ్యలౌ సముఖమందనుట (కభవ)
యలయిక బడలిక యలపు సేద యనంగ, శ్రమమున కాఖ్యలౌ (శమనదమన)
తాలిమి యోరుపు తాలిక నాఁగను, క్షమకు నాహ్వయములౌ (జర్మవసన)
ఠవళి బవంతంబు టక్కు దుత్తూరంబు వెడ్డు నా ఛద్మమౌ (విషమనేత్ర)
తే. వెఱ పనఁగ నెద యనఁగను వెఱ యనంగ
నళు కనఁగ భీతి కాఖ్యలౌ (నసితకంఠ)
నిమ్మళం బన నెమ్మి నా నెమ్మది యనఁ
దనరుఁ బేళ్లు నిరాతంకమునకు (నీశ) (69)
టీ. ముందటను, ఎదుటను, మ్రోలన్, ముంగలన్ - ఈ నాలుగును సమ్ముఖమందనుటకు పేర్లు. అలయిక, బడలిక, అలపు, సేద - ఈ నాలుగును శ్రమమునకు పేర్లు. తాలిమి (రూ. తాల్మి) ఓరుపు, (రూ. ఓర్పు) తాలిక - ఈ మూడును క్షమకు పేరులు. ఠవళి, బవంతము, టక్కు, దుత్తూరము, వెడ్డు _ నాల్గును కపటమునకు పేర్లు. నిమ్మళము, నెమ్మి, నెమ్మది, (నెఱ + మది = నిండు మనస్సు) - ఈ మూడుని నిర్భయమునకు పేర్లు.
సీ. అసదు కొంచెము సైక మలఁతి యన్నుప చిన్న, నలికంబు సన్నంబు నాఁ దనర్చు
స్వల్ప మెక్కుడు నాఁగఁ జాల నెంతేనియు, మిగులఁ దద్దయుఁ దద్ద మిక్కిలి యనఁ
బెద్దయు ననునివి పేళ్లగు భృశముగా, ననుటకు నుత్కటమయ్యె ననుట
కగుఁ బేళ్లు వెగ్గలంబయ్యెఁ గ్రిక్కిఱిసె వె, క్కసమయ్యె ననునివి క్రమముతోడ
తే. స గ్గెఁ గుందె డోంకెఁ దగ్గెను సడలెను
క్రుంగె సుబ్బణంగె స్రుక్కె ననఁగఁ
దనరుఁ బేళ్లు క్షీణదశ నొందె ననుటకు
(నీశ్వరీసనాథ విశ్వనాథ) (70)
టీ. అసదు, కొంచము, సైకము, అలతి, అన్నువ, చిన్న నలికము, సన్నము - ఈ ఎనిమిదియు కొంచమనుటకు పేర్లు. ఎక్కుడు, చాలన్, ఎంతేనియున్, మిగులన్, తద్దియున్, తద్ద, మిక్కిలి, పెద్దయున్, - ఈ ఎనిమిదియు అధికముగా ననుటకు పేర్లు. వెగ్గలమయ్యెను, క్రిక్కిఱిసెను, వెక్కసమయ్యెను, - ఈ మూడును హెచ్చయ్యె ననుటకు పేర్లు. సగ్గె, కుందె, డొంకె, తగ్గె, సడలె, క్రుంగె, ఉబ్బణగె, స్రుక్కె - ఈ ఎనిమిదియు క్షీణదశనొందె ననుటకు పేర్లు.
ఆ. మించు వాసి మేలు మేటి పె చ్చె చ్చన
నధికమునకు నాఖ్య లగుచు వెలయుఁ
బసులు నాఁగఁ జెయువులనఁ జేత లన నొప్పుఁ
గర్మమునకుఁ బేళ్లు (చర్మవసన) (71)
టీ. మించు, వాసి, మేలు, మేటి, పెచ్చు, ఎచ్చు - ఈ ఆరును అదిక మనుటకు పేర్లు. పనులు, చెయివులు, చేతలు - ఈ మూడును కార్యమునకు పేర్లు.
ఆ. అనిపె ననిచెఁ బనిపెఁ బనిచె నంపెను బంపెఁ
బుచ్చె గెలుపుమనియె బొమ్మటనియె
ననఁగ నివి సమాహ్య లగును ప్రస్థాపించె
ననెడు క్రియకు (నీశ యభ్రకేశ) (72)
టీ. అనిపెను, అనుచెను, పమిపెను, పనిచెను, అంపెను, పంపెను, పుచ్చెను, గెలుపుమనెను, పొమ్మటనియె _ ఈ తొమ్మిదియు పయనముచేసి పంపెను అనుటకు నామములు.
తే. కొదవ కొద కుందు తగ్గు తక్కువ కొఱంత
వెలితి కొఱ లొచ్చు కడమ నా వెలయు న్యూన
సమభిధానము లర సాము సగము సవము
నాఁగ నర్ధాహ్వయంబు లౌ (నాగభూష) (73)
టీ. కొదవ, కొద, కుందు, తగ్గు, తక్కువ, కొఱత, వెలితి, కొఱ, లొచ్చు, కడమ - ఈ పదియును న్యూనతకు పేర్లు. అర, సాము, సగము, సవము _ ఈ నాలుగును అర్ధమనుటకు పేర్లు.
తే. పేళ్లు పశ్చాత్తనుటకును జెల్లు వెనుకఁ
బిదపఁ దర్వాతఁ బదపడి పిమ్మట నన
మునుపు మును మున్ను తొలి తొల్లి ముందు తొలుత
ననఁగఁ బూర్వపదార్థఖ్య లౌ (గిరీశ) (74)
టీ. వెనుకన్, పిదపన్, తర్వాతన్, పదపడి, పిమ్మటన్ - ఈ ఐదును అనంతరం అనుటకు పేర్లు. మునుపు, మును, మున్ను, తొలి, తొల్లి, ముందు, తొలుత - ఈ ఏడును పూర్వమనుటకు పేర్లు.
ఆ. పాఱుఁబోతు పిఱికి పంద కోఁచ యనంగఁ
బేళ్లు దనరు సమర భీరువునకు
దిట్ట యుక్కుతునియ గట్టిడెందంబువాఁ
డనఁగ ధైర్యవంతుఁ డలరు (నీశ) (75)
టీ. పాఱుబోతు, పిఱికి, పంద, కోచ, - ఈ నాలుగును యుద్ధమున భయపడువానికి పేర్లు. దిట్ట, ఉక్కుతునియ, గట్టిడెందమువాడు - ఈ మూడును ధైర్యవంతునకు పేర్లు.
తే. పౌజు చేరువ మొత్తంబు బారు తుటుము
దండు పరి గమి కూటువ పిండు దాఁటు
మూఁక దళమును బేళ్లు సమూహమునకు
(భుజగవరహార యవిముక్తపురవిహార) (76)
టీ. పౌజు, చేరువ, మొత్తము, బారు, తుటుము, దండు, పరి, గమి, కూటువ, పిండు,, దాటు, మూక దళము - ఈ పదమూడును సమూహమునకు పేర్లు.
సీ. పూనె నూనెను దాల్చె నానెను మోచె నా, వహియించె ననుట కౌ (నహివిభూష)
నామము లిచ్చాటనము చేసె ననుటకు, వరుసతోఁ దఱిమెను బఱపె వెలిచెఁ
దోలెను ఱొప్పె నా (ద్రుహిణాదిసురనుత), త్రిప్పెను నాఁ గ్రమ్మరించె ననఁగ
మగిడించె ననఁగను మరలించె నన సమా, హ్వాయములై పరఁగు నివర్తితంబు
తే. చేసె ననుటకు (సురముని సిద్ధసేవ్య)
యడ్డగించెను నా నిల్పె ననఁగ నాఁగె
నన నివారించె ననుటకు నాక్య లమరు
(నగసుతానాథ గుహగజాననసనాథ) (77)
టీ. పూనెను, ఊనెను, తాల్చెను, ఆనెను, మోచెను - ఈ ఐదును ధరించె ననుటకు పేర్లు. తఱిమెను, పఱపెను, వెలిచెను, తోలెను, ఱొప్పెను - ఈ అయిదును ఊచ్ఛాటనము చేసె ననుటకు పేర్లు. త్రిప్పెను, క్రమ్మఱించెను, మగిడించెను, మరలించెను, నిల్పెను, ఆగెను - ఈ మూడును నిరోధించెననుటకు పేర్లు.
తే. దండ చేరువ సంగడి దాపు చెంత
సరస చెంగట యొద్ద డగ్గఱ కురంగ
టండ పజ్జయు నా సమీపాఖ్య లమరు
(రమ్యధవళాంక కలశనీరధినిషంగ) (78)
టీ. దండ, చేరువ, సంగడి, దాపు, చెంత, సరస, చెంగట, ఒద్ద, డగ్గఱ, కురంగట, అండ, పజ్జ, - ఈ పన్నెండును సమీపమందనుటకు పేర్లు.
తే. అచట నచ్చట నచ్చోట నందు నాడ
నచొట నచ్చొట నక్కడ నయ్యెడ నట
ననఁగఁ దత్ప్రదేశంబునం దనుట కాహ్య
లయ్యె (భక్తవిధేయ యార్యాసహాయ) (79)
టీ. అచట, అచ్చట అచ్చోట, అందు, ఆడ, అచొట, అచ్చొట, అక్కడన్, (ఆ+కడన్)= ఆ దిక్కున, ఆయ్యెడన్ (ఆ = యెడన్) = ఆ ప్రదేశమున, అటన్ - ఈ పదియు ఆప్రదేశమం దనుటకు పేర్లు.
క. ఇరుగెలఁకుల నిరువంకల
నిరుదెస నిరుచక్కియందు నిరుపక్కియలం
దిరుగ్రేవల నిరుగడ నన
బొరిఁ బేళ్లగు నుభయపార్శ్వముల ననుట (కజా) (80)
టీ. ఇరుగేలకులన్, ఇరువంకలన్, ఇరుదెసన్, ఇరుచక్కియందున్, ఇరుపక్కియలందున్, ఇరుగ్రేవలన్, ఇరుగడన్ - ఈ ఏడును రెండువైపులందు అనుటకు పేర్లు.
క. నవముగ ధరలో నీమా
నవవర్గువు వేడ్కఁ జదివినను వ్రాసిన మా
నవులకు ననవరతంబును
శివుఁ డవిముక్తేశ్వరుండు చెలువం బొసఁగున్ (81)
ట. ఎవరీ మానవవర్గు వ్రాయుచున్నారో లేక చదువుచున్నారో, వారికి కాశీవిశ్వేశ్వరుని దయవలన సకలసంపదలు కలుగును.
మానవవర్గు సమాప్తము.
ఆంధ్ర నామసంగ్రహము - 8
3. స్థావరవర్గు
సీ. వలిదిప్ప వడఁకుగుబ్బలి చలిమిరిమల, గట్టులఱేఁడు ముక్కంటిమామ
మంచుఁగొం డన హిమక్ష్మాధరాఖ్యలు చను, వేలుపుఁగొండ జేజేలగట్టు
పుత్తడిగుబ్బలి పూనుకకంచమువాని, విల్లు నా మేరువు పేళ్లు వెలయు
వెలిదిప్ప ముక్కంటిమల వెండికొండ నాఁ, గైలాసపర్వతాఖ్యలు సెలంగు
తే. వెలయుఁ దరిగొండ కవ్వంపుమల యనంగ
మంధరాఖ్యలు కడపటిమల యనంగఁ
జుట్టుఁగొం డనఁ దనరు నీక్షోణియందుఁ
జక్రవాళాద్రి (వృషవాహ శైలగేహ) (1)
టీ. వలిదిప్ప ( వలి = చల్లదనముగల తిప్ప = కొండ), వడకుగుబ్బలి (పా. వణకుగుబ్బలి) వడకునట్లు చేయు పర్వతము, చలిమిరిమల = చల్లని కొండ, గట్టులఱేడు = పర్వతములకు రాజు, ముక్కంటిమామ = శివునకు మామ, మంచుఁగొండ = హిమముగల పర్వతము - ఈ ఆరును హిమవత్పర్వతమునకు పేర్లు. వేలుపుఁ గొండ (వేలుపు + కొండ) = దేవతలు నివసించు పర్వతము, జేజేలగట్టు = దేవతల పర్వతము, పుత్తడుగుబ్బలి = బంగారు పర్వతము, పూనుకకంచమువాని విల్లు = ఈశ్వరుని ధనుస్సు - ఈ నాలుగును మేరు పర్వతమునకు పేర్లు. వెలిదిప్ప (వెలి + తిప్ప) = తెల్లని పర్వతము, ముక్కంటిమల = శివునకు ఉనికిపట్టగు పర్వతము, వెండికొండ = వెండివలె దెల్లని పర్వతము, - మూడును కైలాస పర్వతమునకు పేర్లు. తరిగొండ (తరి + కొండ), కవ్వంపుమల (కవ్వము + మల) - ఈ రెండును మంధర పర్వతమునకు పేర్లు. కడపటిమల = కడగా నుండెడు పర్వతము, చుట్టుఁగొండ (చుట్టు + కొండ) = భూమి చుట్టు నుండెడు పర్వతము - ఈ రెండును చక్రవాళ పర్వతమునకు పేర్లు.
ఆ. తూర్పుఁగొండ నాఁగఁ దొలుగట్టు నాఁగను
బొడుపుగుబ్బ లనఁగఁ బూర్వశిఖరి
పరఁగుఁ గ్రుంకుమెట్టు పడమటికొండ నా
వెలయు నస్తశిఖరి (విశ్వనాథ) (2)
టీ. తూర్పు గొండ (తూర్పు + కొండ) =పూర్వ దిక్కునందుండెడి పర్వతము, తొలుగట్టు = పూర్వదిక్కు నందలి పర్వతము, పొడుపుగుబ్బలి = సూర్యు దుదయించెడు పర్వతము, - ఈ మూడును ఉదయ పర్వతమునకు పేర్లు. క్రుంకుమెట్టు = సూర్యుడస్తమించు పర్వతము, పడమటికొండ = పడమటిదిక్కు నందుండెడి పర్వతము - ఈ రెండును అస్తమయ పర్వతమునకు పేర్లు.
తే. ఒప్పు గిరిపేళ్లు మల గట్టు తిప్ప మెట్టు
కొండ గుబ్బలి నా మేరు (కుధరచాప)
ఱాయి నాఁ గ ల్లనంగను ఱా యనంగ
శిల కభిఖ్యలు దగు నిల (శేషభూష) (3)
టీ. మల, గట్టు, తిప్ప, మెట్టు, కొండ, గుబ్బలి, - ఈ ఆరును పర్వతమునకు పేర్లు. ఱాయి, కల్లు, ఱా - ఈ మూడును శిలకు పేర్లు.
తే. పల్లె, కొటిక కుప్పమ్ము నాఁగ
నూ రనఁగ గ్రామనామంబు లొప్పుచుండుఁ
బట్టణంబున కాఖ్యలు పరఁగుచుండుఁ
బ్రోలనఁగ వీడనంగను (శూలపాణి) (4)
టీ. పల్లె (రూ. పల్లియ), కొట్టిక, కొటిక, కుప్పము, ఊరు - ఈ అయిదును గ్రామమునకు పేర్లు. ప్రోలు, వీడు - ఈ రెండును పట్టణమునకు పేర్లు.
ఆ. ఉనికిపట్టు తావు మనికిప ట్టిర విల్లు
తెంకి యిక్క నట్టు టెంకి యిమ్ము
నెలవు గీము నాఁగ నలరు నివాసదే
శంబునకును బేళ్లు (చంద్రమౌళి) (5)
టీ. ఉనికిపట్టు, తావు, మనికిపట్టు, ఇరవు, తెంకి, యిక్క, నట్టు, టెంకి ఇమ్మి, నెలవు, గీము (గృహశబ్ధ భవము) - ఈ పన్నెండును నివాసస్థానమునకు పేర్లు.
సీ. తెంకాయచె ట్టనఁ డెంకాయమ్రా నన, నారికేళం బొప్పు (నగనివేశ)
మావిమ్రా ననఁగను మామిడిచెట్టన, నామ్రభూజం బొప్పు (నభ్రకేశ)
అత్తిమ్రానన మేడి యనఁగ నౌదుంబర, ధారుణీజం బొప్పు (మేరుచాపా)
యరఁటి యనఁటి నాఁగ నంశుమత్ఫలధారు, ణిరుహం బగు (ధరణీశతాంగ)
తే> యలరుఁ దుంబీశలాటుసమాఖ్య లాను
గంబు సొఱకాయ వదరు నా (గరళకంఠ)
తా డనంగను దాడి నా తాళభూరు
హంబునకు నాఖ్యలై యొప్పు (నంబికేశ) (6)
టీ. తెంకాయచెట్టు, టెంకాయమ్రాను - ఈ రెండును కొబ్బరి చెట్టు పేర్లు. మావిమ్రాను, మామిడిచెట్టు - ఈ రెండును చూతవృక్షమునకు పేర్లు. అత్తిమ్రాను, మేడి - ఈ రెండును అత్తిచెట్టుకు పేర్లు. అరటి, అనటి - ఈ రెండును కదళీ వృక్షమునకు పేర్లు. అనుగము, సొఱకాయ వదరు - ఈ మూడును సొఱకాయ పేర్లు. తాడు, తాడి - ఈ రెండును తాటిచెట్టు పేర్లు.
సీ. మొక్క మోక నిసువు మొలక మో సనఁగ నం, కురమునకు బేళ్లు (కుధరచాప)
యిగు రనఁ దలిరు నా జిగురు నా జివు రనఁ, బల్లవనామముల్ పరఁగు (నీశ)
మ్రా ననఁ జె ట్టన మ్రాఁ కన భూరుహ, నామధేయము లగు (వామదేవ)
పువు పువ్వు పూ నాఁగఁ బుప్పము విరి యల, రనఁ గుసుమాఖ్య లైయలరు (నీశ)
తే. గుబురు దట్టము జొంపంబు గుంపు తఱచు
నాఁగ నిబిడంబు పేళ్లొప్పు (నందివాహ)
వల్లరిసమాఖ్య లగుచు వర్తిల్లు దీఁగ
తీవ తీవియ తీవె నాఁ (ద్రిపురవైరి) (7)
టీ. మొక్క, మోక, నిసువు, మొలక, మోసు - ఈ అయిదును అంకురమునకు పేర్లు. ఇగురు, తలిరు, చిగురు, చివురు - ఈ నాలుగును పల్లవముల పేర్లు. మ్రాను (రూ. మాను), చెట్టు, మ్రాకు, - ఈ మూడును చెట్టునకు నామములు. పువు, పువ్వు, పూ, పుప్పము (పుష్పశబ్ధభవము) విరి, అలరు, - ఈ ఆరును పుషపు పేర్లు. గుబురు, దట్టము, జొంపము, గుంపు, తఱచు - ఈ అయిదును సందులేక యుండువానికి పేర్లు. తీగ, తీవ, తీవియ, తీవె (రూ. తీగె) - ఈ నాలుగును తీగకు పేర్లు.
ఆ. అగ్రమున కభిక్య లగుచుండుఁ దుద సుద
కొన యనంగ వేక్షకోటరమున
కలరుఁ బేళ్లు తొఱట తొలి తొఱ్ఱ తొఱ నాఁగ
(నాగహర రజతనగ విహార) (8)
టీ. తుద, సుద, కొన _ ఈ మూడును అగ్రమునకు పేర్లు. తొఱట, తొలొ, తొఱ్ఱ, తొఱ - ఈ నాలుగును చెట్టుతొఱ్ఱకు పేర్లు.
ఆ. ఇక్షువున కభిఖ్య లీక్షితిఁ గన్నుల
మ్రాను చెఱకు తియ్యమ్రా ననంగఁ
దనరు దవ యనంగఁ దలవాఁడె నాఁగఁ ద
దగ్రమున కభిఖ్య లగు (గిరీశ) (9)
టీ. కన్నులమ్రాను = గనుపులుగల చెట్టు, చెఱకు, తియ్యమ్రాను = మధురమైన వృక్షము - ఈ మూడును చెఱకునకు పేర్లు. దవ, తలవాడె - ఈ రెండును చెఱకు కొనకు పేర్లు.
క. అగుఁ బే ళ్లుత్పలమునకుం
దొగ తొవ గల్వ గలు వనఁగఁ దోయజ మొప్పుం
దగఁ దమ్మి తామరనఁగా
మొగడన మొగ్గ యబఁ దనరు ముకుళంబు (శివా) (10)
టీ. తొగ, తొవ, కల్వ, కలువ - ఈ నాలుగును ఉత్పలములకు పేర్లు. తమ్మి తామర - ఈ రెండును తామరపువ్వు నకు పేర్లు. మొగడ, మొగ్గ - ఈ రెండును ముకుళమునకు పేర్లు.
తే. ఎసఁగుఁ జెందొవ చెందొగ యెఱ్ఱగలువ
యనఁగ రక్తోత్పలంబు రక్తాబ్జ మొప్పు
నిలను గెందమ్మి కెందామ రెఱ్ఱదామ
రనఁగఁ జెందమ్మి చెందామరన (మహేశా) (11)
టీ. చెందొవ, చెందొగ, ఎఱ్ఱగలువ - ఈ మూడును ఎఱ్ఱని కలువకు పేర్లు. కెందమ్మి, కెందామర (కెంపు + తామర), ఎఱ్ఱదామర, చెందమ్మి, చెందామర - ఈ అయిదును ఎఱ్ఱతామరపువ్వునకు పేర్లు.
క. గొడుగు గొడు వెల్లి యనఁ జె
న్నడరు ఛత్రంబు కేతనాహ్వయము లగున్
సిడె మనఁగఁ డెక్కె మనఁగాఁ
బడగ యనన్ డా లనంగఁ (బర్వతధన్వీ) (12)
టీ. గొడుగు, గొడువు ఎల్లి - ఈ మూడును ఛత్రమునకు పేర్లు. సిడెము, టెక్కెము, పడగ (పతాక శబ్ధ భవము), డాలు - ఈ నాలుగును ధ్వజమునకు పేర్లు.
క. మఱుఁ గనఁగ నోల మనఁగాఁ
మఱు వనఁగాఁ జా టనంగ మా టన వరుసం
బరఁగు ని వెల్ల నగోచర
ధరణీనామంబు లగుచు (దర్పకమదనా) (13)
టీ. మఱుగు, ఓలము, మఱువు, చాటు, మాటు _ ఈ అయిదును కన్నులకు కనపడని ప్రదేశమునకు నామములు.
క. పొసఁగుఁ దృణాఖ్యలు పులు నాఁ
గస వనఁగాఁ బూరి యనఁగ గడ్డి యనంగా
వసుమతిలో నెన్నంబడు
ససి సస్సెము పై రనంగ సస్యం (బభవా) (14)
టీ. పులు, కసవు, పూరి, గడ్డి - ఈ నాలుగును తృణమునకు పేర్లు. ససి, సస్సెము, పైరు - ఈ మూడును ధాన్యమునకు పేర్లు.
ఆ. తెలుపు దెల్ల వెల్ల తెలి వెలి నాఁగ నా
హ్వయము లమరు ధవళవర్ణమునకుఁ
గప్పు నలుపు నల్ల కఱ యన నాఖ్యలౌ
నీలవర్ణమునకు (నీలకంఠ) (15)
టీ. తెలుపు, తెల్ల ,వెల్ల, తెలి, వెలి, - ఈ అయిదునును ధవళవర్ణమునకు పేర్లు. కప్పు, నలుపు, నల్ల, కఱ (పా. కఱి) - ఈ నాలుహును నీలవర్ణమునకు నామములు.
ఆ. కెంపు దొగరు దొవరు గెంజాయ యెఱు పెఱ్ఱ
యనఁగ నరుణకాంతి కాఖ్యలయ్యె
నళిది పసుపుచాయ యనగ హారిద్రవ
ర్ణమునకు కాఖ్యలగుఁ (బినాకహస్త) (16)
టీ. కెంపు, తొగరు, తొవరు, కెంజాయ (కెంపు + చాయ) ఎఱుపు, ఎఱ్ఱ _ ఈ ఆరును ఎఱ్ఱని కాంతికి పేర్లు. అళిది (రూ. హళిది) పసుపుచాయ - ఈ రెండును హారిద్ర వర్ణమునకు పేర్లు.
ఆ. శ్యామవర్ణమునకు నామంబు లగుచుండుఁ
బసరుచాయ యనఁగ బచ్చ యనఁగ
వన్నె డాలురంగు వన్నియ జిగి జోతి
చాయ యనఁగ బరఁగు జగతిఁ గాంతి (17)
టీ. పసరుచాయ, పచ్చ - ఈ రెండును ఆకుపచ్చ వన్నెకు నామములు. వన్నె (వర్ణ శబ్ధభవము) డాలు, రంగు, వన్నియ, (ప్ర. వర్ణము), జిగి, జోతి, చాయ (ప్ర. ఛాయ) - ఈ ఏడును కాంతికి నామములు.
తే. మానికము లన రతనముల్ నా నెసంగు
నవని మాణిక్యములకు సమాహ్వయములు
మెఱుఁ గనంగను నిగ్గు నా మెఱయుచుండు
నాఖ్య లుత్కృష్టకాంతికి (నభ్రకేశ) (18)
టీ. మానికము (ప్ర. మాణిక్యము) రతనము (ప్ర. రత్నము), - ఈ రెండును రత్నములకు పేర్లు. మెఱుఁగు, నిగ్గు - ఈ రెండును విశేషకాంతికి పేర్లు.
తే. జడధిపే ళ్లగు మున్నీరు కడలి సంద్ర
మనఁగ మడుఁగన మడువు నా హ్రదము దనరుఁ
బరఁగు నాఱవసంద్రంబు పాలవెల్లి
జిడ్డుకడలి పాల్కడలి నా క్షీరజలధి (19)
టీ. మున్నీరు (మును + నీరు)= మొదటిసృష్టి, కడలి, సంద్రము (ప్ర. సముద్రము), - ఈ మూడును సముద్రమునకు పేర్లు. మడుగు, మడువు - ఈ రెండును హృదము పేర్లు. ఆఱవ సంద్రము, (లవణ, ఇక్షు, సుర, సర్పి, దధి, క్షీర, నీర సముద్రములలో ఇది ఆరవది), పాలవెల్లి (పాలు + వెల్లి) = క్షీర ప్రవాహము, జిడ్డుకడలి = జిడ్డుకల సముద్రము, పాల కడలి = క్షీర సముద్రము - ఈ నాలుగును క్షీర సముద్రమునకు పేర్లు.
క. నంజె యన మడి యనంగను
మంజుల కేదారభూసమాఖ్యలు వెలయుం
బుంజె యనఁ జేను పొల మనఁ
గం జన మరుభూమిపేళ్లు (కాయజదమనా) (20)
టీ. నంజె, మండి _ ఈ రెండును మాగాణిభూమికి పేర్లు. పుంజె, చేను, పొలము - ఈ మూడును మెట్టభూమి పేర్లు. కంజ యనగా నిర్జల ప్రదేశమునకు పేరు.
క. ధరణిన్ వివరాఖ్య లగున్
బొఱియ కలుగు లాఁగ బొక్క బొంద యనంగా
దరి యొడ్డు గట్టనంగాఁ
బరఁగుం దీరంబు పేళ్లు (ప్రమథగణేశా) (21)
టీ. బొఱియ, కలుగు, లాగ, బొక్క, బొంద - ఈ అయిదును బొంద పేర్లు. దరి, ఒడ్డు, గట్టు - ఈ మూడును తీరమునకు పేర్లు.
ఆ. అస లనంగను ఱొంపి నా నడు సనంగ
బుఱద నా నొప్పు గర్దమంబునకు బేళ్లు
భూమికి సమాఖ్యలగు బువి పుడమి నేల
మన్ను పంటవలంతి నా (మదనదమన) (22)
టీ. అసలు ఱొంపి, అడుసు, బుఱద - ఈ నాలుగును అడుసునకు పేర్లు. బువి (ప్ర. భువి), పుడమి (ప్ర. పృథివి), నేల మన్ను, పంటవలంతి = పంతలనొసగు దేవి - ఈ అయిదును భూమి పేర్లు.
ఆంధ్రనామ సంగ్రహము - 9
తే. జగిలె యనఁగ నరుఁగు నాఁగ జగతి నాఁగఁ
దిన్నె యన వేదికాఖ్యలై యెన్నఁ దనరు
మి ఱ్ఱనంగను మెరక నా మిట్ట యనఁగ
నున్నతక్షితి కాఖ్యలై యొప్పు (నభవ) (23)
టీ. జగిలె (రూ. జగ్గిలె) అరుగు, జగతి, తిన్నె - ఈ నాలుగు తిన్నెకు పేర్లు. మిఱ్ఱు, మెరక, మిట్ట - ఈ మూడు ను ఎత్తైన చోటికి పేర్లు.
తే. తనరు నిశ్రేణి తాప నిచ్చెన యనంగఁ
దెప్ప తేపనునాఖ్యల నొప్పుఁ బ్లవము
పరఁగు నో డనఁ గల మనఁ దరణి ధరణిఁ
(దరణిశీతాశుశిఖనేత్ర ధవళగాత్ర) (24)
టీ. తాప, నిచ్చెన - ఈ రెండును నిచ్చెనకు పేర్లు. తెప్ప, తేప - ఈ రెండును ప్లవమునకు పేర్లు. ఓడ, కమలము - ఈ రెండును నావకు పేర్లు.
తే. కార్ముకం బొప్పు విల్లు సింగాణి యనఁగఁ
దూణ మొప్పు బత్తళిక నాదొన యనంగఁ
దరకసం బనఁ బొది యనఁ దనరు శరము
కోల ములి కమ్ము తూఁపు నా (శూలపాణి) (25)
టీ. విల్లి, సింగాణి - ఈ రెండును ధనస్సునకు పేర్లు. వత్తళిక, దొన తరకసము, పొది - ఈ నాలుగును అమ్ములపొది పేర్లు. కోల, ములికి, అమ్ము, తూపు - ఈ నాలుగును శరము పేర్లు.
తే. తనరుఁ బేళ్లు తనుత్రాణమునకుఁ గత్త
ళంబు జోడు జిరా దుప్పటంబు బొంద
ళం బనఁగ నాఖ్యలగు శతాంగంబునకును
దేరు నా నరదము నాఁగ (మేరుచాప) (26)
టీ. కత్తళంబు, జోడు, జిరా, దుప్పటంబు, బొందళంబు - ఈ అయిదును కవచమునకు పేర్లు. తేరు, అరదము (ప్ర. రథము) - ఈ రెండును రధమునకు పేర్లు.
క. కన్నా కన్నను దలక
ట్టన్నను మఱి మేలుబంతి యన్నను ధరలో
నిన్నియు శ్రేష్ఠము పేళ్ళై
యెన్నంబడు రాజసభల (నిభదైత్యహరా) (27)
టీ. కన్నాకు, తలకట్టు, మేలుబంతి - ఈ మూడును ఉత్తముని పేర్లు.
క. సొ మ్మనఁ చొడ బనఁగా రవ
ణ మ్మన నగుఁ బేళ్లు భూషణమ్ములకును హా
తమ్ములకు నగును నభిధా
నమ్ములు పేరు లన సరులు నా (శితికంఠా) (28)
టీ. సొమ్ము, తొడవు, రవణము - ఈ మూడును భూషణమునకు పేర్లు. పేరు, సరి - ఈ రెండును హారమునకు పేర్లు.
తే. సరము లెత్తులు దండలు సరు లనంగ
నామధేయంబులగుఁ బుష్పదామములకు
వాసనకు నాఖ్యలై యొప్పు వలపు కంపు
తావి కమ్మన యనఁగ (గాత్యాయనీశ) (29)
టి. సరములు, ఎతూలు, దండలు, సరులు, - ఈ నాలుగును పువ్వులదండలకు పేర్లు. వలపు, కంపు తావి, కమ్మన - ఈ నాలుగును వాసనకు పేర్లు.
క. ఒడమె యన సొమ్మనంగా
విడిముడి యన రొక్క మనఁగ విత్తంబునకుం
బుడమిని నామములగు నివి
(యుడు రాజకళావతంస యురగాభరణా) (30)
టీ. ఒడమె, సొమ్ము, విడిముడి, రొక్కము (రుక్మ శబ్ధభవము), - ఈ నాలుగును ధనమునకు పేర్లు.
తే. మచ్చు లన మిద్దె లనఁగను మాడుగు లన
దారునిర్మిత గేహముల్ దనరుచుండుఁ
బరఁగు సౌధంబు మేడ యుప్పరిగ యనఁగఁ
(నాగకేయూర మౌనిమానసవిహార) (31)
టీ. మచ్చులు, మిద్దెలు, మాడుగులు (రూ. మాడువులు) - ఈ మూడును కొయ్యతో కట్టబడిన యిండ్లకు పేర్లు. ఉప్పరిగ, మేడ - ఈ రెండును రాచనగళ్లకు పేర్లు.
తే. పెట్టి యన మందసం బనఁ బెట్టె యనఁగఁ
బెట్టియ యనంగఁ బేటికాభిఖ్య లమరు
మ్రో డనంగను మోటు నా మొ ద్దనంగ
వెలయు స్థాణుసమాఖ్యలు (విశ్వనాథ) (32)
టీ. పెట్టి, మందసంబు, పెట్టె, పెట్టియ - ఈ నాలుగును పేటిక పేర్లు. మ్రోడు, మోటు, మొద్దు - ఈ మూడును స్థాణువు పేర్లు.
ఆ. విస్తృతాఖ్య లొప్పు విప్పు తనర్పు నా
వెడఁద విరివి పఱపు వెడలు పనఁగ
దీర్ఘమునకు నామధేయంబులై యొప్పు
నిడుద చాఁపు నిడివి నిడు పనంగ (33)
టీ. విప్పు, తనర్పు, వెడద, విరివి, పఱపు, వెడలుపు _ ఈ ఆరును వెడల్పు పేర్లు. నిడుద, చాపు, నిడివి, నిడుపు - ఈ నాలుగును నిడివికి పేర్లు.
ఆ. ఈడు దినుసు సాటి యెన దొర సరి జోడు
సవతు మాద్రి యుద్ది జత తరంబు
పురుడు నాఁగ సదెఋశమునకివి యాఖ్యలౌ
(వివిధగుణసనాథ విశ్వనాథ) (34)
టీ. ఈడు, దినుసు, సాటి, ఎన, దొర, సరి, జోడు, సవతు, మాద్రి (రూ. మాదిరి), ఉద్ది, జత, తరంబు, పురుడు - ఈ పదమూడును సమానమునకు పేర్లు.
తే. పసిఁడి బంగరు బంగారు పైడి పొన్ను
జాళువా పుత్తడి యనంగ స్వర్ణ మమరుఁ
దప్తకాంచన మమరు గుందన మనంగ
డాని యపరంజి నా (గజదానవారి) (35)
టీ. పసిడి, బంగరు, బంగారు, పైడి, పొన్ను (రూ హొన్ను), జాళువా, పుత్తడి - ఈ ఏడును బంగారమునకు పేర్లు. కుందనము, కడాని, అపరంజి - ఈ మూడును పుటము దీరిన బంగారమునకు పేర్లు.
ఆ. చిదుర తునుక తునియ చిదురుప వ్రక్క పా
లనఁగ ఖందమునకు నాక్య లమరుఁ
బ్రోగు గుప్ప వామి ప్రోవు దిట్ట యనంగ
రాశి కాఖ్య లగు (ధరాశతాంగ) (36)
టీ. చిదుర, తునుక, తునియ, చిదురుప, వ్రక్క, పాలు - ఈ ఆరును ఖండమునకు పేర్లు. ప్రోగు, కుప్ప, వామి, ప్రోవు, తిట్ట - ఈ అయిదును రాసికి పేర్లు.
క. ఈ స్థావరవర్గుం గడు
నాస్థన్ వినఁ జదువ వ్రాయ నవనీస్థలిలో
నాస్థాణునికృప నఖిలశు
భస్థితులును జనుల కొదవు భాసురలీలన్ (37)
స్థావరువర్గు సమాప్తము
_________________________________________________________________________________
4. తిర్యగ్వర్గు
సీ. వెడఁదమోము మెకంబు జడలమెకం బేనుఁ, గులగొంగ మెకములకొలముసామి
తెల్లడాలుమొకంబు తెఱనోటిమెకము సిం, గంబు నాబొబ్బమెకం బనంగఁ
బరఁగును మృగరాజు పసిదిండి పులి మెకం, బులతిండిపోతు చాఱలమెకంబు
మువ్వన్నెమెక మన నివ్వసుంధరయందు, వ్యాఘ్రంబునకు సమాఖ్యలు చెలంగుఁ
ఆ. బుట్టకూడుదిండిపోతన వెనుకచూ
పులమెకంబు నాఁగ నెలువనంగ
నెలుఁగు నాఁగ మోరతెలుపుమెకంబు నా
భల్లూకంబు దనరు (ఫాలనేత్ర) (1)
టీ. వెడదమోముమెకము = విశాలముఖముగల మృగము, జడలమెకము = జటలుగల మృగము, ఏనుగులగొంగ = గజములకు విరోధి, మెకములకొలముసామి = మృగముల వంశమునకు రాజు, తెల్లడాలుమెకము = శ్వేతకాంతి కలది, తెఱనోటిమెకము = తెఱచియుండెడు నోఱు గలది, సింగము, బొబ్బమెకము = బొబ్బలు వేసెడు మృగము, - ఈ ఎనిమిదియు సింహమునకు పేర్లు. పసిదిండి = (పసుల + తిండి) పశువులను భక్షించునది, చాఱలమెకము = చాఱలుగల మృగము, మువ్వన్నెమెకము = మూడువన్నెలు గల మృగము, - ఈ అయిదును వ్యాఘ్రమునకు పేర్లు. పుట్టకూడుతిండిపోతు = పుట్టకూడు తినునది, వెనుకచూపులమెకము = వెనుక దృష్టి గలది, ఎలువు, ఎలుగు, మోరతెలుపుమెకము = ముఖమందు తెలుపుగల మృగము = ఈ నాలుగును భల్లూకమునకు పేర్లు.
క. పలుగొమ్ములమెక మనఁగా
నిల నెక్కుడుమెక మనంగ నేనుఁ గనంగా
బలువంజమెకము నాఁ జే
గలమెక మన గౌ రనంగఁ గరియొప్పు (శివా) (2)
టీ. పలుగొమ్ములమెకము = దంతములే కొమ్ములుగా గల మృగము, ఎక్కుడుమెకము = ఎక్కుటకు యోగ్యమైఅన మృగము, ఏనుగు, బలువంజమెకము = (బలువు + అంజ + మెకము) (రూ బలుహజ్జమెకము) = బలువైన పాదములుగల మృగములు, చేగలమెకము = కస్తము (తొండము) గల మృగము, గౌరు - ఈ ఆరు గజమునకు పేర్లు.
తే. వాజికి నాఖ్యలగుఁ దేజి వారువంబు
మావు, గుఱ్ఱంబు తట్టువ వావురంబు
కత్తలాని బాబా జక్కి తత్తడి యన
(విగతభవపాశ కాశీనివేశ యీశా) (3)
టీ. తేజి, వారువము, మావు, గుఱ్ఱము, తట్టువ, వావురము, కత్తలాని, బాబా, జక్కి, తత్తడి _ పదకొండును గుఱ్ఱమునకు పేర్లు.
క. తగ రేడిక పొట్టేలన
నగు మేషసమాఖ్య లెనిమిదడుగులమెక మే
నుఁగుగొంగసూఁ డనంగా
జగతిన్ శరభాఖ్య లొప్పుఁ (జంద్రార్ధధరా) (4)
టీ. తగరు, ఏడిక, పొట్టేలు - ఈ మూడును మేకకు పేర్లు. ఎనిమిదడుగులమెకము = ఎనిమిది కాళ్ళు గల మృగము, ఏనుగుగొంగసూడు = సింహమునకు విరోధి - ఈ రెండును శరభ మృగమునకు పేర్లు.
క. సంగతి నుష్ట్రాఖ్యలు నొ
ప్పెం గడు నొంటె లన లొట్టిపిట్ట లనన్ సా
రంగాఖ్య లలరు నిఱ్ఱు ల
నంగా జింక లన లేళ్లు నా (సర్వజ్ఞా) (5)
టీ. ఒంటె, లొట్టిపిట్ట _ ఈ రెండును ఉష్ట్రమునకు పేర్లు. ఇఱ్ఱి, జింక, లేడి - ఈ మూడును జింకలకు పేర్లు.
క. నులిగొమ్ములమెక మిఱ్ఱన
నిల మృగమున కొప్పుఁ బేళ్లు మృగలేడి యనన్
వెలయును రెంటికి దగు నా
ఖ్యలు జింకయనంగ నీశ (యంబరకేశా) (6)
టీ. నులిగొమ్ములమెకము = మెలికెలు తిరిగియుండు కొమ్ములుగల మృగము, ఇఱ్ఱి - ఈ రెండును మగజింక పేర్లు. లేడి అనునడి ఆడుజింకకు పేరు. జింక అనునది ఆడు, మగదుప్పులు రెండింటికి పేర్లు.
తే. పసులు తొడుకులు పసరముల్ పసి యనంగఁ
బశువులకును సమాఖ్యలై పరఁగు నాల
పోతు బసవఁ గిబ్బ యాబోతనంగ
వృషభమున కాఖ్యలై యొప్పు (వృషభవాహ) (7)
టీ. పసులు, తొడుకులు, పసరము (రూ. పసలము) పసి - ఈ నాలుగును పశువులకు పేర్లు. ఆలపోతు = పశువులకు పతి, బసవడు, గిబ్బ, ఆబోతు (ఆవు + పోతు) - ఈ నాలుగును వృషభమునకు పేర్లు.
సీ. త్ఱ్ఱుపట్టు లనంగ దొడ్లనఁగా నివి, గోష్ఠదేశమునకుఁ గొఱలు (నీశ)
కదుపులు మొదవులు పదువులు మందలు, నా ధేణుగణ మొప్పు (నగనివేశ)
యలరు నాఖయలు లేఁగలన దూదలనఁ గ్రేపిఉ, లన వత్సములకును (ధనదమిత్ర)
యా వనఁగా గిడ్డియనఁ దొడు కన మొద, వన ధేనునామముల్ దనరు (నభవ)
తే. యక్షమునకు సమాఖ్యలై యొప్పుచుండు
గిత్త యె ద్దనఁ గోడె నాఁ (గృతివాస)
యా లనఁగ ధేనువుల కాఖ్యయలరుచుండు
(శైలజానాథ ప్రమథసంచయసనాథ) (8)
టీ. తొఱ్ఱుపట్టులు, దొడ్లు - ఈ రెండును కొట్టమునకు పేర్లు. కదుపులు, మొదవులు, మందలు - ఈ నాలుగును ఆవులగుంపునకు పేర్లు. లేగ, దూడ, క్రేపు - ఈ మూడును దూడలకు పేర్లు. ఆవు, గిడ్డి, తొడుకు, మొదవు - ఈ నాలుగును గోవుల పేర్లు. గిత్త, ఎద్దు, కోడె - ఈ మూడును ఎద్దునకు పేర్లు. ఆలు (ఆవు + లు), అనగా ధేనువులు.
తే. అలరుఁ గుందేలు చెవులపో తనఁగ శశక
మొప్పుఁ బొడలమెకంబు నా దుప్పి యనఁగఁ
గాఱుకొమ్ములమెక మనంగను ధరిత్రి
రామనామమృగంబు (ధరాశతాంగ) (9)
టీ. కుందేలు, చెవులపోతు - ఈ రెండును కుందేటికి పేర్లు. పొడలమెకము = మచ్చలు గల మృగము, దుప్పి, కాఱుకొమ్ములమెకము = సాంద్ర శృంగములుగల మృగము - ఈ మూడును దుప్పికి పేర్లు.
తే. దుంత యెనుబోతు జమునెక్కిరింత దున్న
యనఁగ మహిషమునకు సమాహ్వయము లమరుఁ
బరఁగు నెనుపెంట్లు గేదెలు బఱ్ఱె లెనుము
లనఁగ మహిషీసమాఖ్యలు (ధనదమిత్ర) (10)
టీ. దుంత, ఎనుబోతు, జమునెక్కిరింత = యముని వాహనము, దున్న - ఈ నాలుగును మహిషంబునకు పేర్లు. ఎనుపెంట్లు (ఎనుము + పెంటి), గేదె, బఱ్ఱె, ఎనుము - ఈ నాలుగును మహిషీనామములు.
తే. పక్కి పులుఁగు పిట్ట యనంగఁ బక్షి యొప్పు
గఱులు ఱెక్కలు చట్టుపలెఱక లనఁగఁ
బక్షముల కివి పేళ్ళగుఁ బర్ణములకు
నాఖ్యలగు లావు లన నీఁక లనఁగ (నీశ) (11)
టీ. పక్కి (ప్రకృతి. పక్షి), పులుగు, పిట్ట - ఈ మూడును పక్షికి పేర్లు. గఱులు, ఱెక్కలు, చట్టుపలు, ఎఱకలు - ఈ నాలుగును ఱెక్కలకు నామములు. లావు, ఈక - ఈ రెండును ఈకలకు నామములు.
సీ. తొలకరికలుగుపుల్గులు నల్వతేజీలు, పాలు నీరును నేరుపఱుచుపులుఁగు
లంచలు తెలిపిట్టలన నొప్పు హంసలు, క్రౌంచముల్ దనరారు గొంచ లనఁగఁ
గొక్కెరా లనఁగను గొక్కు లనఁగఁ, గొక్కెర లనఁగను గొంగ లనఁగఁ
బరఁగు నభిఖ్యలు బకవిహంగములకు, నట్టువపులుఁగు నాజుట్టుపులుఁగు
తే. నాఁగ నెమ్మన నెమలి నా నమ్మి యనఁగఁ
గేకికి సమాఖ్యలగుఁ జంచరీకములకు
నాఖ్యలు జమిలిముక్కాలి యనఁగ దేఁటి
యనఁగఁ దుమ్మెద నా (నీశ! యభ్రకేశ) (12)
టీ. తొలకరికల్గుపుల్గులు = వర్షాకాలమున పారిపోవు పక్షులు, నల్వతేజీలు = బ్రహ్మకు వాహనములు, పాలు నీరును నేరుపఱుచు పులుఁగులు = క్షీరోదకములను వేరుపఱచు నట్టి పక్షులు, అంచలు (ప్ర. హంసలు), తెలిపిట్టలు = తెల్లని పక్షులు, - ఈ అయిదును హంసలకు నామములు. కొంచలు అనగా క్రౌంచపక్షులు. కొక్కరా, కొక్కు, కొక్కెర, కొంగ - ఈ నాలుగును బకమునకు పేర్లు. నట్టువపులుగు = నాట్యముచేయు పక్షి, జుట్టుపులుగు = సిగగల పక్షి, నెమ్మి, నెమిలి, నమ్మి - ఈ అయిదును కేకికి నామములు. జమిలిముక్కాలి = ఆఱుకాళ్లు కలది, తేటి, తుమ్మెద - ఈ మూడును భ్రమరమునకు పేర్లు.
తే. పరఁగు నొడ్డీలు కూకీలు పల్లటీలు
పావురాలును బకదార్లు పావురములు
నాఁగఁ గలరవ పక్షిబృందములపేళ్ళు
(పంకజాతాక్షసన్మిత్ర ఫాలనేత్ర) (13)
టీ. ఒడ్డీలు, కూకీలు, పల్లటీలి, పావురాలు, బకదార్లు, పావురములు - ఈ ఆరును పావురమునకు పేర్లు.
తే. పుడమిలోపలఁ జదువులపులుఁ గనంగఁ
జిగురువిల్కానితేజి నాఁ దొగరుముక్కు
పులుఁ గనఁగ బచ్చఱెక్కలపులుఁ గనంగఁ
జిలుక యన నొప్పుఁ గీరంబు (శ్రీమహేశ) (14)
టీ. చదువులపులుగు = మాటాడు పక్షి, చిరువిలుకానితేజి = మన్మధుని వాహనము, తొగరుముక్కుపులుగు = ఎఱ్ఱని ముక్కు గల పక్షి, పచ్చఱెక్కలపులుగు = పచ్చని ఱెక్కలుగల పక్షి, చిలుక - ఈ అయిదును చిలుకకు పేర్లు.
తే. బట్టికాఁ డన గొరవంకపిట్ట యనఁగఁ
బరఁగు శారిక యేట్రింత పసులపోలి
గాడు కూఁకటిమూఁగ నాగను జెలంగు
నిల భరద్వాజమృగంబు (నీలకంఠ) (15)
టీ. బట్టికాడు(పా. బట్టుకాడు) గొరవంకపిట్ట - ఈ రెండును గోరువంకకు పేర్లు. ఏత్రింత, పసులపోలిగాడు, కూకటిమూగ - ఈ మూడును భరద్వాజ పక్షికి పేర్లు.
తే. జాలె దేగనఁ గురుజు నా సాళ్వ మనఁగఁ
గణుజు నాఁగను జలకట్టె యనఁగ వేస
డం బనఁగ గిడ్డు నా నోరణం బనంగ
శ్యేనభేదంబు లగు (మహాసేనజనక) (16)
టీ. జాలె, డేగ, కురుజు, సాళ్వము, కణుజు, జలకట్టె, వేసడము, గిడ్డు, ఓరణము - ఈ తొమ్మిదియు శ్యేనవిశేషణములకు పేర్లు.
తే. కోటఁ డనఁగను గూబ నా ఘూక మమరుఁ
జిఱుతగూబ యనంగ బసిండికంటి
యనఁగ సకినాలపులుఁ గన నలరుచుండుఁ
బృథివిఁ గనకాక్షి యనుపక్షి (శ్రీమహేశ) (17)
టీ. కోటడు, గూబ - ఈ రెండును గుడ్లగూబకు పేర్లు. చిఱుతగూబ = చిన్నగూబ, పసిడికంటి = బంగారమువంటి నేత్రములు గలది, సకినాలపులుగు = శకునముల పక్షి - ఈ మూడును బంగారుకంటి పిట్టకు పేర్లు.
తే. పాము సప్పంబు నిడుపఁడు పడగదారి
గాలిమేఁతరి విసదారి కానరాని
కాళ్ళయది చిల్వవీనుల కంటి పుట్ట
పట్టెప ట్టనఁ జను నహి పేళ్ళు భర్గ (18)
టీ. పాము, సప్పము (ప్ర. సర్పము) నిడుపడు = దీర్గముగా నుండునది, పడగదారి = పడగను ధరించినది, గాలిమేతరి = వాయు భక్షణ సేయునది, విసదారి = విషము ధరించినది, కానరానికాళ్లయది = అగపడని పాదములు గలది, చిల్వ 9రూ. చిలువ), వీనులకంటి = చెవులే కన్నులుగా కలది, పుట్ట పెట్టె పట్టు = వాల్మీకమును బెట్టియును నివాసముగా గలది - ఈ పదియును సర్పమునకు నామములు.
క. ఇల నెంచ రుధిరమున కా
ఖ్యలు నల్ల యనంగ నెత్తు రనఁగ ధరిత్రిం
బొల యీరు వెఱచి నంజుడు
పొల సస నివి పరఁగు మాంసమునకు (మహేశా) (19)
టీ. నల్ల, నెత్తురు - ఈ రెండును రక్తమునకు పేర్లు. పొల ఈరువు, ఎఱచి, నంజుడు, పొలసు - ఈ అయిదును మాంసమునకు పేర్లు.
క. భర్గుడు కాశీనిలయుఁడు
దుర్గాపతి యొసఁగు ముదముతో నీతిర్య
గ్వర్గు లిఖించినఁ జదివిన
దౌర్గత్యము లనఁచి సంపదలు నిత్యంబున్ (20)
టీ. ఈ తిర్యగ్వర్గు వ్రాసినను, చదివినను కాశీవిశ్వేశుని దయవలన దారిద్ర్యములు తొలగి సంపదలు కలుగును.
తిర్యగ్వర్గు సమాప్తము