జైశ్రీరామ్
ఆర్యులారా! నిన్నను శ్రీ కుర్తాళ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు తమ తండ్రిగారయిన పురుషోత్తమరాయ కవిగారి శతజయంతి సందర్భముగా తెలుగు పద్యకవులను సత్కరించినారు. వారు చేసిన సన్మానమునందుకొనినభాగ్యవంతులలో నేనొకడినగుట నా పురాకృత సుకృతముగా భావింతును. ఈ సందర్భమును పురస్కరించుకొని అమ్మవారినిద్దేశించి ఒక పద్యమును చదవమని సెలవిచ్చారు. వారి కోరిక మేరకు
నేను ఒక షడర చక్రబంధ శార్దూలములో దుర్గాంబను ప్రార్థించాను.
ముఖ్యముగా నిన్న మాతృదినోత్సవమును ప్రపంచం మొత్తం జరుపుకున్న సందర్భముగా నేను మాతృదేవోభవ అని నా మాతృభక్తిభావాన్ని చాటుకున్నాను.
ముఖ్యముగాఈ షడరర చక్ర బంధ చిత్రమును గూర్చి మీకు కొంత వివరించ వలసి యున్నది.
క్రింది పద్యమును దానికి సంబంధించిన చిత్రమును పరిశీలించినచో్
పై నుండి ౩ వ వృత్తమున (కవి పేరు) రామ కృష్ణ కవి.
౬ వ వృత్తమున (అంశము) మాతృదేవోభవ.
౯ వ వృత్తములో౧.౩.౫.గళ్ళలో కుర్తల. ౧౦వ వృత్తములో ము = కుర్తలము (కుర్తాళము) అని (మూలము) ఉండి
నామ గోపన చిత్రముతో ఈ షడరర చక్ర బంధ శార్దూలము ఒప్పి యున్నది.
ఇట్టి లక్షనములు కలిగి యుండవలెనని ఛందశ్శాస్త్రజ్ఞుల నిర్దేశము.
కవినైన నా పేరు మూడవ వృత్తమున రాగా, నిన్నను మాతృ దినోత్సవమును పురస్కరించుకొని మాతృదేవో భవ అని నేను ఆరవ వృత్తమున వచ్చునట్లు పద్యరచన చేసితిని. అంతే కాక ఈ ఘనమైన సన్మానము చేయుచున్నది కుర్తాళ పీఠాధిపతి యైనందున కేంద్రమున కుర్తాళము అనే పదమును కుర్తలము అని వచ్చునట్లు వ్రాసి యున్నాను.
ఇక పరికించండి.
శ్రీమత్ కుర్తాళ పీఠాధిపతి
శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామివారి పాదారవిందములకు ప్రణమిల్లుచు
(తే. 10. 05. 2015 ని) చింతా రామ కృష్ణా రావు చేయుచున్న దుర్గాస్తుతి.
షడర చక్రబంధ మత్తేభము.
దుర్గారాధనమాన . పోకుము. భజింతున్. వోఢ కృష్ణత్వ మా
వర్గా! మన్మది తృఞ్చు దౌష్ట్యముల. మా భాక్ భక్త లోకమ్ము నీ
భర్గాకృష్టము. దేవ వర్త ముని హృద్భావ ప్రభా వి ద్రమా
మార్గోన్మేదుర భావనా ప్రభలతో మా వెంట నీ వుండుమా !
భావము. జీవన శకట చోదకుఁడగు కృష్ణ తాదాత్మ్యముననొప్పు లక్ష్మీదేవి వర్గమున కల ఓ తల్లీ. నేను చేయుచున్న దుర్గారాధనపై ఆన. నీవు నన్ను వీడి పోకుమమ్మా! నిన్ను నేను భజింతును. నా మనసునందలి దౌష్ట్యములను తృంచివేయుము తల్లీ! లక్ష్మీ ప్రభతోనొప్పెడి భక్త లోకము నీ యొక్క శివునిచే ఆకర్షింపఁ బడినదే. (అతని అర్థాంగివి కావున నీచేతనూ ఆకర్షింపతగినదని భావము). సకల లోక సంచారి యగు దేవమునియైన నారదుని యొక్క హృదయమునందలి భావముననొప్పు హరి ప్రభ నెఱింగిన లక్ష్మీమార్గమున, మిక్కిలి చక్కనైన ఒడిదొడుకులు లేని భావనాప్రభలతో నీవెల్లప్పుడూమావెంటనే ఉండుము తల్లీ!
స్వస్తి.
కృతజ్ఞతాపూర్వక వందనములతో మీ దాసానుదాసుఁడు
చింతా రామ కృష్ణా రావు.
అని వ్రాసి సమర్పించినాను.
ఇట్టి రచన మీ వంటి సాహితీ ప్రియుల ప్రోత్సాహము వలన నాకు అవలీలగా చేయు శక్తి సమకూరినది. ఇందుకు మీ వంటి సద్విమర్శకులకు నేను సర్వదా కృతజ్ఞుడనై యుందునని సవినయముగా మనవి చేసుకొనుచున్నాను.
జైహింద్.
15 comments:
అత్యద్భుతంగా ఉన్న ఈ పద్యం మీ సర్వతోముఖప్రతిభకు దర్పణం. అభినందనలు.
చాలా బాగుంది.
ఇప్పుడు కూడా చిత్రకవిత్వం చెప్పగలిగేవారు ఉన్నారని ఆనందంగా వుంది!
__/|\__
Good morning Sir. I have one through. I am very happy to be your friend. The poetry written by you is extemporaneously good. It is an art of writing by the grace of God. Nothing is there except only to praise you.
you. I hope you have seen the video on Kanakadhara Sthotram by Sri VVS Sastry through You Tube. Thanks. Good night.
సరస్వతీ దేవి మీలో నివశిస్తోంది అన్నందుకు ఇంతకన్నా తార్కాణం ఏమున్నది? మీకు శతకోటి వందనాలు.
శ్రీ చింతా రామకృష్ణారావు గారికి హృదయపూర్వక అభినందనలు .
మంచి పద్యం వ్రాశారు చాల సంతోషం.
కం. చిత్రంబౌ మీ కవిత వి
చిత్రం బౌ భావ సాంద్ర చిత్తపు రీతుల్ ,
స్తోత్రంబు కాదు. మీరలు
పాత్రుల్ ప్రాజ్ఞతఁ గవీంద్ర పదవికిఁ దలపన్
సహోదరుడు .
Suryanarayana rao Ponnekanty
బంధ కవిత్వములో రస
బంధురముగ పద్యములను వ్రాసెడి విద్యన్
సంధానించినది కవిదు-
రంధర! మీవాక్కులందు బ్రహ్మసతి కృపన్.
అద్భుతముగా ఉన్నది మాస్టారు.
Narayanaswamy
నమస్కారములు
సరస్వతీ పుత్రులు ఆ దేవికటాక్షం ఎల్లప్పుడు మ్మిమ్ములను వెన్నంటి ఉండు గాక చాలా సంతోషంగాఉంది హృదయ పూర్వక శుభాభి నందనలతో దీవించి అక్క
శ్రీ రాజేశ్వరి సోదరీ మమత నాశీర్వాద సంపత్ప్రదం
బై రాజిల్లఁగ చేయుచుండ కవనం బాశ్రీశుడే మెచ్చగా,
ధీరోదాత్త మహత్ కవీశుల హృదిన్ దీపించగా చేతు నే
నారాధించెడి భారతీ జనని నన్నత్యంత ప్రీతిన్ గనన్.
శ్రీ చింతా వారి పద్యం చాలా గొప్పగా ఉన్నది. పీఠాధిపతుల ఆశీస్సులు పొందిన మీ జన్మ చరితార్థము.
నమస్కారములు
మీవంటి పండితుల పేరునుకుడా పలకడానికి అర్హతలేని నేను ఇంతగామీ అభిమానాన్ని పొందగలగడం నాపూర్వజన్మ సుకృతం + అదృష్టం . మీ ఆదరాభి మానములకు సదా కృతజ్ఞతలు .ప్రేమతో ఆశీర్వదించి అక్క
చాలా బాగున్నదండీ సంతోషం
bhaskara ramam g
నమస్సులు చింతావారూ! నేను కుశలమే! అద్భుతమైన పద్యమును అందించినందులకు ధన్యవాదములు.
Satyanarayana P
చల బగున్నదండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.