జైశ్రీరామ్.
ఆర్యులారా! నిన్నను ఒక పాఠశాలలో తెలుగు బోధకుని ఎన్నిక పరీక్షలో ప్రబంధమును గూర్చి వివరించమని ప్రశ్న వేసినారు నిర్వాహకులు. ఆ పరీక్షకు హాజరయిన వారు తమకు తెలిసిన అంశములను సమాధానముగ చెప్పిరి.
ఇక్కడ ప్రబంధమును గూర్చిన సూక్ష్మ వివరణను మీ ముందుంచుచుంటిని.
ప్రబంధమంటే కావ్యమనే అర్థంలో తిక్కన తాను రచించిన 15 పర్వాలను ప్రబంధమండలి అన్నాడు.
ఎర్రనకు 'ప్రబంధ పరమేశ్వరుడు' అనే బిరుదు ఉన్నది.
అయితే ఈ ప్రబంధ శబ్దానికి ప్రక్రియపరమైన ప్రబంధ శబ్దానికి భేదం ఉన్నది.
నన్నెచోడుడు అష్టాదశ వర్ణనలను పేర్కొనడమే కాక కుమార సంభవంలో అనేక వర్ణనలు చేశాడు. కన్నడం నుంచి నన్నెచోడుడు అష్టాదశ వర్ణనలు చేయు విధానమును గ్రహించాడని అందురు
శ్రీనాథుడు, పిల్లలమర్రి పినవీరభద్రుడు అష్టాదశ వర్ణనల్లో కొన్నింటిని రసరమ్యంగా నిర్వహించారు. కొన్ని ప్రబంధ ప్రక్రియా లక్షణాలు లేకపోవడం వల్ల ఇవి ప్రబంధాలు కాలేకపోయాయి.
అల్లసాని పెద్దన మనుచరిత్ర రచనతో ప్రబంధ ప్రక్రియకు అంకురార్పణ జరిగింది.పెద్దన వ్రాసిన మనుచరిత్ర బహుళ ఆదరణ సంపాదించి, ఒక చక్కని ప్రక్రియగా నిలిచి ప్రబంధానికి రాజాదరణ సాధించిపెట్టింది.
వసుచరిత్ర మనుచరిత్రకు మించిన కవిత్వం కలిగిన కావ్యమనే పేరు సంపాదించింది.
తెనాలి రామకృష్ణుడు రాసిన పాండురంగ మహత్మ్యం,
పింగళి సూరన కళాపూర్ణోదయం,
చేమకూర వెంకటకవి రాసిన విజయవిలాసం వంటివి ప్రబంధాలుగా ప్రసిద్ధి పొందాయి.
ప్రతాపరుద్రీయమున
ప్రబంధమునందుండవలసిన
అష్టాదశ వర్ణనలను ఇలా వివరించి చూపెను.
1. నగరము, 2. సముద్రము, 3. శైలము, 4. ఋతువు, 5. చంద్రోదయము, 6. సూర్యోదయము, 7. ఉద్యానము, 8. సలిలక్రీడ, 9. మధుపానము, 10. రతోత్సనము, 11. విప్రలంభము, 12. వివాహము, 13. కుమారోదయము, 14. మంత్రము, 15. ద్యూతము, 16. ప్రయాణము, 17. యుద్ధము, 18. నాయకాభ్యుదయము.
కావ్యాలంకారచూడామణిలో నాయికానాయక ప్రకరణమున ప్రబంధమున కథానాయికా నాయకులకుండవలసిన లక్షనములను వివరించెను.
1.ధీరోదాత్తుఁడు, 2.ధీరోద్ధతుఁడు, 3. ధీరలలితుఁడు, 4. ధీరశాంతుఁడు అని చతుర్విధ నాయకులను వివరించెను
1. అనుకూలుఁడు, 2. శఠుఁడు, 3. దక్షిణుఁడు, 4. దృష్టుఁడు.అని 4 విధములగు శృంగార నాయకులను వివరించెను.
1.పీఠమర్ద, 2. విట, 3. విదూషక, 4. చేటకులు.అని 4 విధములగు శృంగారనాయక సహాయులను వివరించెను.
స్వీయ, పరకీయ, సాధారణ అని నాయికలను 3 విధములుగా వివరించెను.
అందు
ముగ్ధ, మధ్య, ప్రౌఢ. అని స్వీయాభేదములు ౩ విధములని వివరించెను.
ధీర, అధీర, ధీరాధీర, ప్రగల్భధీర, ప్రగల్భాధీర, ప్రగల్భధీరాధీర, అని 6 ధీరాదినాయికాభేదములువివరించెను
ప్రతివేశిని, చెలి, దాసి, ధాత్రి, శిల్పిని, లింగిని, కారువు, తాను.అని 8 మంది దూతికల్ను వివరించెను.
వాచికుఁడు, ఆర్థుఁడు, శిల్పకుఁడు, రౌచికుఁడు, భూషణార్థి, మార్దవానుగతుడు, వివేకి.అని సప్తవిధ కవులను,
సుకవి లక్షణములను,
సత్కావ్య లక్షణములను, కావ్యభేదములను, ప్రబంధ లక్షణములను వివరించెను.
ఇట్టి లక్షణ సమన్వితమైన కావ్యమును ప్రబంధమని చెప్పియుండిరి మన ఆర్యులు.
జైహింద్.
2 comments:
నమస్కారములు
అష్టా దశ వర్ణనలు , నాయకా నాయకుల లక్షణములు ,ప్రబంధములను , గురించి ఎన్నో తెలియని విషయములను చక్కగా వివరించి నందులకు ధన్య వాదములు
చాలా బాగుంది
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.